[శ్రీ మెట్టు మురళీధర్ రచించిన ‘ప్రజాస్వామ్యం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]“ప్ర[/dropcap]జాస్వామ్యం అంటే ఏమిటి సార్?” అని బిక్షపతి హఠాత్తుగా అడిగేసరికి ఏం చెప్పాలో? ఎలా చెప్పాలో? అర్థంకాక ఆలోచనలో పడ్డాడు పాండురంగారావు.
“ప్రజల కొరకు, ప్రజల యొక్క, ప్రజల చేత.. అని అంటారు గదా? నిజమేనంటారా?” పాండురంగారావు ఆలోచిస్తుండగానే మరో ప్రశ్న వేశాడు బిక్షపతి.
‘అతనికి ఏదో చెప్పాలి’ అని పాండురంగారావు అనుకుంటూ ఉండగానే బిక్షపతి ఇంకో ప్రశ్న వేశాడు.
“భావ స్వాతంత్ర్యమంటారు, భావాన్ని చెప్పనివ్వరు. మాట స్వాతంత్ర్యమంటారు. మాట్లాడనివ్వరు. ప్రజాస్వామ్యమంటే ఇదేనా సార్?”
బిక్షపతి మనసులో ప్రజాస్వామ్యం పట్ల ఆవేదన ఉన్నట్టు గమనించాడు పాండురంగారావు. అందుకే ఇలా అడిగాడు,
“నీవేం చదువుకున్నావు బిక్షపతీ?” అని
“ఇంటరు వరకు సార్”
“ఆపైన చదువలేక పోయావా?”
“ఇంటర్ సెకండియర్లో మానాన్న చనిపోయాడు. అమ్మ, తమ్ముడు, చెల్లి.. వీళ్ళకు నేనే ఆధారం. ఎలా చదివేది సార్? ఐనా.. ఈ మాయదారి సమాజంలో చదువబుద్ది కావడం లేదు సార్?”
“సమాజం మాయదారిది కాదు బిక్షపతీ! కొందరు మనుషులే..” మాట పూర్తి కాకముందే దగ్గుతెర అడ్డం వచ్చింది పాండురంగారావుకు. విపరీతంగా దగ్గుతూ బ్యాగులోంచి ‘ఇన్‌హేలర్’ తీసి రెండుసార్లు పీల్చుకున్నాడు.
“అంతగా దగ్గుతున్నారేమిటి సార్?” అడిగాడు బిక్షపతి.
“నాకు ఆస్తమా బిక్షపతీ”
“డ్యూటీ క్యాన్సల్ చేయించుకుంటే బాగుండేది”
“దానికి పైరవీ చేయాలి బిక్షపతీ”
“ఔను సార్”
“అదే బిక్షపతీ.. నేను చేయంది, చేయలేనిది..”
“కొంచెం పడుకోండి సార్! నేను చాయ్ తెస్తాను” అంటూ బయటికి పోయాడు బిక్షపతి.
నిజానికి తనకు అనారోగ్యమని, డ్యూటీ క్యాన్సల్ చేయమని అప్లికేషన్ పెట్టుకున్నాడు పాండురంగారావు. అతని డ్యూటీ క్యాన్సల్ కాలేదు. కాని పైరవీ చేస్తే తనకు తెలిసిన ఒకతని డ్యూటీ క్యాన్సల్ అయింది. ఇలాంటి దగుల్బాజీ వ్యవస్థలో సమాధానపడుతూ బతుకుతున్న పాండురంగారావు, బిక్షపతికి ప్రజాస్వామ్యం గురించి ఏం చెప్పగలడు?
బిక్షపతి చాయ్ తెచ్ఛాడు. వేడివేడి చాయ్ తాగగానే గొంతు కాస్త ఫ్రీ అయింది పాండురంగారావుకు.
ఇంటర్లో బిక్షపతి హిస్టరీ, ఎకనామిక్స్‌తో పాటు పౌరశాస్త్రాన్ని ఐచ్ఛికంగా తీసుకున్నాడట.
పౌరశాస్త్రాన్ని చదువుతూ ప్రజాస్వామ్యం పట్ల అభిమానాన్ని పెంచుకున్నాడు బిక్షపతి.
***
అదో పల్లెటూరు పేరు మాదాపురం. ఆ ఊళ్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లయిన సంవత్సరానికే సర్పంచిగా ఎన్నికైన రాజారావు మరణించాడు. అందుకే అక్కడ సర్పంచ్ పదవి కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ప్రక్రియలో భాగంగానే ఆ ఊళ్లో నామినేషన్లు స్వీకరించే ఎలక్షన్ ఆఫీసరుగా పాండురంగారావు నియమించబడ్డాడు.
అతనికి అసిస్టెంటుగా ఆ ఊళ్లోనే ఉంటూ, టీచరుగా పక్క ఊళ్లో పనిచేస్తున్న శ్రీరాములు నియమించబడ్డాడు. శ్రీరాములు పక్కా రాజకీయ లక్షణాలున్న వ్యక్తి. డ్యూటీ పట్ల నిబద్దత లేదు. సమయసందర్భాలు పట్టించుకోడు. తెలిసీ తెలియని విషయాలు చెప్పి అందరినీ అయోమయానికి గురి చేస్తుంటాడు. అందుకే పాండురంగారావుకు తన ఆస్తమా కన్నా శ్రీరాములు ప్రవర్తనే ఇబ్బంది కలిగిస్తోంది.
రూములో కూర్చొని మ్యాన్యువల్స్ పరిశీలిస్తున్నాడు పాండురంగారావు. అంతలోనే అతని పనికి అంతరాయం కలిగిస్తూ..
“మంచి నికార్సైన కల్లుంది, తాగుతారా సార్!” అంటూ గదిలోకి అడుగుపెట్టాడు శ్రీరాములు. ఆ మాటతో షాకయ్యాడు పాండురంగారావు.
“నాకలవాటు లేదు శ్రీరాములూ! ఐనా మనం ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాము. అది తప్పుగదా?” అన్నాడు.
“ఇందులో తప్పేముంది సార్? మనము తాగుబోతులమా ఏమన్నానా? సరదాగా అప్పుడప్పుడు..”
“వద్దు శ్రీరాములూ! అలాంటి ఆలోచనే వద్దు.”
“ఈ ఆలోచన నాది కాదు సార్! సర్పంచ్ క్యాండిడేట్ గోవిందరావు దొరదే. ఒక్క అరగంట అలా పోయి..”
“చాలు శ్రీరాములూ! ఇక ఆ విషయం మాట్లాడకు”
“సరే సార్! మీ ఇష్టం. నేను మాత్రం పోయివస్తాను” అంటూ ఒక్కక్షణం ఆగకుండా అక్కన్నుంచి వెళ్ళిపోయాడు. ఇది పాండురంగారావుకు కొత్తగా ఉంది. కాని శ్రీరాములు సంగతి తెలిసిన బిక్షపతికి మాత్రం ఏమాత్రం కొత్తగా లేదు. అతడన్నాడు
“ఎలక్షన్ డ్యూటీలో ఉండి ఇలాంటి పని చేయవచ్చాసార్?” అని
పాండురంగారావు ఏమీ మాట్లాడలేదు. అతడు బిక్షపతి ముందు తలెత్తుకోలేక పోతున్నాడు. బిక్షపతి చెపుతున్నాడు..
“ఈ ఊళ్లో గోవిందరావు పెద్ద భూస్వామి సార్! బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి. అతని తండ్రి రాజారావు సర్పంచిగా ఉండి మరణించాడు. తండ్రి పోయాక సర్పంచి పదవి తన వారసత్వ హక్కుగా భావిస్తున్నాడు గోవిందరావు. అతడు దుర్మార్గుడు సార్. అన్నీ అవలక్షణాలున్నాయి. రేపు దశమి రోజున నామినేషన్ వేస్తాడట.”
పాండురంగారావు ఇంకా శ్రీరాములిచ్చిన కల్లు షాకు నుండి తేరుకోలేదు. అంతలోనే బిక్షపతి మళ్ళీ అన్నాడు,
“తండ్రి పోతే కొడుకు, భర్త పోతే భార్య.. ఇదేం ప్రజాస్వామ్యం సార్? నా దృష్టిలో ప్రజాస్వామ్యం అనేది వట్టి బూటకం సార్!”
“అలా నిరాశపడకు బిక్షపతీ! ప్రజాస్వామ్యం పవిత్రమైనది. రాబోయేవి అసలైన ప్రజాస్వామ్యపు రోజులే”
“ఏమో సార్! నాకైతే నమ్మకం లేదు. ఈ ఊళ్ళో ‘సదానందం’ అని మంచి యువకుడున్నాడు సార్! డిగ్రీ చదువుకున్నాడు. ఫైనాన్సులో లోన్ తీసుకొని ఆటో కొనుక్కొని నడుపుతున్నాడు. ఊళ్ళో అందరూ అతన్ని ‘సదన్న’ అంటారు. అందరికి తలలో నాలుకలా ఉంటాడు. అన్యాయాన్ని, అవినీతిని ఒప్పుకోడు. అలాంటివాడు సర్పంచైతే ఊరు బాగుపడుతుంది సార్. ఇప్పుడు గోవిందరావుకు ఆయనే పోటీ. రేపు సదన్న కూడా నామినేషన్ వేస్తాడట.”
పాండురంగారావు వింటున్నాడు. మళ్ళీ బిక్షపతే అన్నాడు.
“సదన్న మంచి రచయిత సార్. గాయకుడు కూడా. రాస్తాడు, పాడుతాడు.”
“ఔనా!”
“ఔను సార్! సదన్నకు ప్రజాస్వామ్యంటే ప్రాణం. తన పాటల్లో ప్రజాస్వామ్యం బతకాలని రాస్తాడు. ప్రజాస్వామ్యానికి భంగం కలిగితే ఎండగడతాడు.”
“అది మంచిదే కదా?”
“అని మీరంటున్నారు. కాని, కొందరికి నచ్చడంలేదు. అతని మీద కంప్లెయింట్ చేశారు. రెండు, మూడు సార్లు పోలీసులు పట్టుకపోయారు కూడా. కాని ఎవరు ఏం చేసినా ప్రజాస్వామ్య పరిధిలోనే చేయాలంటాడు సదన్న.”
“మన రాజ్యాంగం చెప్పింది కూడా అదే కదా బిక్షపతీ!”
“రాజ్యాంగం చెప్పినట్టే నడుస్తుందా సార్ అంతా?”
బిక్షపతి అలా అడిగేసరికి పాండురంగారావు మాట్లాడలేదు. మళ్ళీ బిక్షపతే అన్నాడు,
“ఈ ఊళ్ళో అందరూ సదన్న మంచివాడంటారు. కాని ఓటు వేయరు. పోయినసారి రాజారావు మీద పోటీ చేసి ఓడిపోయాడు. వ్యక్తి నచ్చినప్పుడు ఓటు వేయాలి గదా సార్! ఎవరికో ఎందుకు భయపడాలి? ప్రజాస్వామ్యంలో ఓటు పవిత్రమైంది కదా?”
బిక్షపతిలో నిజమైన ప్రజాస్వామ్యవాది కనిపిస్తున్నాడు పాండురంగారావుకు.
“అందోళనపడకు బిక్షపతీ! ఈసారి నీ కలలు నిజమవుతాయి”
“ఏమో సార్! రెండు రోజుల నుండి ఊళ్ళోని ముఖ్యులంతా గోవిందరావు వెంటే ఉంటున్నారు. తింటున్నారు, తాగుతున్నారు. సదన్న వెంట తిరగడానికే జనం భయపడుతున్నారు. అలాంటి వాళ్ళు ఓట్లెలా వేస్తారు? డబ్బు, అధికారం ముందు మంచితనం ఓడిపోతుంటే ఇంకా ప్రజాస్వామ్యం మాటెక్కడ సార్?”
“అది మనిషి తప్పుగాని, ప్రజాస్వామ్యానిది కాదు గదా బిక్షపతీ! ఈసారి జనం సదానందానికే ఓట్లేస్తారు చూడు”
చిన్నతనంలోనే చేదు అనుభవాలను చూచిన బిక్షపతికి ఏం చెప్పాలో తోచక ఆ విధంగా చెప్పాడు పాండురంగారావు. పుస్తకాల్లో కనిపిస్తున్న ప్రజాస్వామ్యం, నిజజీవితంలో కనిపించక పోయేసరికి బిక్షపతి లేత మనసు తల్లడిల్లిపోతోంది.
గంటలోనే శ్రీరాములు వచ్చాడు. ఆయనకన్నా ముందే కల్లు వాసన వచ్చింది. గోవిదరావు పోసిన కల్లు కాస్త ఎక్కువ లాగించాడేమో, మాటలు తడబడుతున్నాయి. సరిగ్గా నిలబడలేకపోతున్నాడు.
“ఏం కల్లనుకున్నారు సార్? మీరు రావలసింది”
పాండురంగారావు మాట్లాడలేదు. మళ్ళీ శ్రీరాములే అన్నాడు,
“సార్! నేనీ బెంచి మీద పడుకుంటాను” అని.
“వద్దు శ్రీరాములూ! బయటకుపోయి ఎక్కడన్నా పడుకో”
“మరి నా డ్యూటీ?”
“చేసింది చాలు”
“అంతేనంటారా? ఐతే పోతాను. బిక్షపతీ! నావెంట రారా” అంటూ బిక్షపతి మీద వాలిపోయాడు. శ్రీరాములు మత్తులోనే,
“అరేయ్ బిక్షపతీ! ప్రజాస్వామ్యం అంటే ఏమిటని నువ్వు అడుగుతావు కదా? చెబుతాను విను. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ఉండడమే ప్రజాస్వామ్యం. ఫరెగ్జాంపుల్.. మన సారుకు కల్లు తాగడం ఇష్టం లేదు. తాగలేదు. నాకు ఇష్టం ఉంది. తాగాను. ఇదే ప్రజాస్వామ్యం.. వెరీ సింపుల్”
బిక్షపతి, శ్రీరాములును బయటకు తీసుకపోయాడు. ‘ఎవరికి తోచినట్టు వారు ప్రజాస్వామ్యాన్ని నిర్వచిస్తుంటే అప్పడే వికసిస్తున్న బిక్షపతి లాంటి వారికి సందేహాలు రాకుండా ఎలా ఉంటాయి?’ అని శ్రీరాములు మాటలకు చాలా బాధపడ్డాడు పాండురంగారావు.
ఒంటరిగా ఉన్న పాండురంగారావు ఆలోచనలో పడ్డాడు.
‘ఈ దేశంలో ఎలక్షన్లు ఒక ఫార్స్‌గా మారిపోయాయి. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఎన్నికల వ్యవస్థ బాగుపడలేదు. పైగా మరింత చెడిపోయింది. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఎన్నికలే భ్రష్టు పట్టిపోతుంటే ఇంక ప్రజాస్వామ్య మనుగడ ఎలా? బిక్షపతి లాంటివారు పడే ఆందోళనకు పరిష్కారమేమిటి? ‘
పాండురంగారావుకు సమాధానాలు దొరుకలేదు. ఐనా అతనిలో మిణుకు మిణుకుమంటూ చిన్న ఆశ ఉంది, బిక్షపతి, సదానందం లాంటివారు ఒకరిద్దరైనా ఉన్నారు కదా అని.
***
తెల్లవారింది. ఆ రోజు నామినేషన్ వేయడానికి చివరిరోజు. నామినేషన్ సమయం ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు. టిఫిన్, చాయ్ లకోసం పోయిన బిక్షపతి వాటితో పాటు ఓ వార్తను కూడా మోసుకొచ్చాడు. వస్తూనే చెప్పాడు బిక్షపతి,
“సదన్న ఆటోను కాలబెట్టారట సార్!” అని
“ఆటోను కాలబెట్టారా?” ఆశ్చర్యపోయాడు పాండురంగారావు
“ఔనట సార్”
“అదేమిటి?”
“ప్రజాస్వామ్యం సార్”
చెంప ఛెల్లుమన్నట్టనిపించింది పాండురంగారావుకు. ‘ప్రజాస్వామ్య మనుగడుకు బిక్షపతి, సదానందం లాంటివారు ఒకరిద్దరున్నారు అని రాత్రి అనుకున్నాడో లేదో, తెల్లవారేసరికి ఒకరి ఆస్తిని కాలబెట్టారు. అసలు కాలబెట్టింది సదానందం ఆటోనా? లేక ప్రజాస్వామ్యాన్నా?’ అర్థం కాలేదతనికి. అతడు టిఫిన్ కూడా సరిగ్గా తినలేకపోయాడు.
అంతలోనే నీట్‌గా తయారై వచ్చాడు శ్రీరాములు. అతడు రాగానే అడిగాడు పాండురంగారావు,
“సదానందం ఆటోను కాలబెట్టారట కదా?” అని
“కాలబెట్టరా మరి? లేకుంటే గోవిందరావు దొరకు పోటీగా నిలబడుతాడా? నేను కూడా చెప్పాను సార్! వద్దురా సదానందం, పోటీకి దిగకురా అని. విన్నాడా? అనుభవించాడు వెధవ” అంటూ సమాధానమిచ్చాడు శ్రీరాములు.
“అదేమిటి శ్రీరాములూ! ప్రజాస్వామ్యంలో పోటీ ఆరోగ్యమే కదా?”
“ఏమారోగ్యం సార్! ఏనుగుకు, ఎర్రచీమకు పోటీ ఏమిటి?”
“ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే కదా?”
“సమానమెలా అవుతారు సార్! తిండికి లేని సదానందం గాడు గోవిందరావు దొరకు సమానమా?”
శ్రీరాములు మాటలు వింటుంటే అతనితో మాట్లాడడమే అనవసరమనిపించింది పాండురంగారావుకు. కాసేపటికి మళ్ళీ అన్నాడు శ్రీరాములు,
“ఈ రోజు గోవిందరావు దొర ఇంట్లో పెద్ద పార్టీ ఉంది సార్! నామినేషన్ వేసే రోజు కదా? మీలాంటివారి కోసం వేరే చోట ఏర్పాటుచేశాడు గోవిందరావు దొర. ఈ రోజైనా రండి”
పాండురంగారావు మాట్లాడలేదు.
“ఈ రోజు గోవిందరావు దొర నామినేషన్ పడుతుంది సార్.. సరిగ్గా మూడుగంటల ఒక్క నిమిషానికి. అదే మంచి టైమట. ఈ మధ్య ఒక్క అరగంట.. ఇలా పోయి, అలా వద్దాం. ప్లీజ్ సార్!”
శ్రీరాములు వైపు కోపంగా చూశాడు పాండురంగారావు. అతనితో మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంది. పాండురంగారావు మాట్లాడక పోయేసరికి,
“మీ ఇష్టం సార్! ప్రజాస్వామ్యం గదా? నేనైతే పోతున్నాను” అంటూ వెళ్ళిపోయాడు శ్రీరాములు.
బిక్షపతి వైపు చూశాడు పాండురంగారావు. శబ్దం రాకుండా పండ్లు కొరుకుతున్నాడు బిక్షపతి.
***
అందరూ తిని తాగిన తర్వాత ఒకటిన్నర ప్రాంతంలో నామినేషన్ వేయడం కోసం గోవిందరావు ఊరేగింపుగా బయలు దేరాడట, శ్రీరాములు వచ్చి చెప్పాడు.
“ఏం జనమనుకున్నారు సార్! ఊరు ఊరంతా అక్కడే. ఊరేగింపులో గోవిందరావు దొర ఇంద్రునిలా ఉన్నాడు”
అడక్కపోయినా చెబుతున్నాడు శ్రీరాములు.
“గోవిందరావు దొర దేవుడు సార్! విస్కీ ముఖం చూడనోనికి విస్కీ పోశాడు. కారు ముఖం చూడనోన్ని కారు ఎక్కించాడు. ఆడ, మగ తేడా లేదు.. ఎవరికి ఏది ఇష్టమైతే అది.. కాదు, లేదనేది లేదు. నిజమైన ప్రజాస్వామ్యమనేది అక్కడే ఉంది సార్”
శ్రీరాములు చేసే గోవిందరావు భజన కంపును వినలేక పోతున్నాడు పాండురంగారావు. కాని శ్రీరాములు చెబుతూనే ఉన్నాడు .
“అరేయ్ బిక్షపతీ! ఒక్కసారి నువ్వక్కడికి పోయి చూచి రారా! ప్రజాస్వామ్యమంటే నీకే అర్థమవుతుంది. ఇంకెవ్వరినీ అడగాల్సిన పని లేదు”
ప్రజాస్వామ్యమంటే ఏమిటని అయోమయంలో ఉన్న బిక్షపతి శ్రీరాములు మాటలకు ఆశ్చర్యపోయాడు. ప్రజాస్వామ్యం గురించి కొద్దిగా అవగాహన ఉన్న పాండురంగారావు విస్తుపోయాడు. శ్రీరాములు అక్కన్నుంచి వెళ్ళిపోతే బాగుండు అనుకున్నారిద్దరు. వారు అనుకున్నట్టే శ్రీరాములు వెళ్ళిపోయాడు. ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు.
“ఇలాంటివాళ్ళను చూస్తుంటే సదన్నలాంటి వారు గెలవాలని అనిపిస్తుంది సార్! నామినేషన్ వేయడానికి సదన్నఇంకా రాలేదు”
బిక్షపతి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అతని గుండెలో గూడు కట్టుకున్న ఆవేదన కన్నీళ్ళ రూపంలో బయటికి వస్తోంది. బిక్షపతిని చూస్తుంటే పాండురంగారావుకు సదానందాన్ని చూడకున్నా చూచినట్టే అనిపిస్తోంది.
మూడుగంటలకు ఐదు నిమిషాలు తక్కువుంది.
“గోవిందరావు దొర వస్తున్నాడు.. వస్తున్నాడు” అంటూ రూములోకి పరిగెత్తుకొచ్చాడు శ్రీరాములు. అతని వెనుకే గోవిందరావు కూడా రూములోకి అడుగుపెట్టాడు. అతడు రాగానే, తనే స్వయంగా కుర్చీ తెచ్చి వేశాడు శ్రీరాములు.
“రండి దొరా! రండి” అంటూ శ్రీరాములు తన జేబులోంచి కర్చీఫ్ తీసి కుర్చీని తుడిచాడు. అతనికి పెన్ను అందించాడు. గోవిందరావు టైం చూచుకొని మూడుగంటల ఒక్క నిమిషానికి నామినేషన్ పత్రాలమీద సంతకాలు చేశాడు. శ్రీరాములిచ్చిన పెన్నును జేబులో వేసుకున్నాడు. తర్వాత గోవిందరావు బయటికి పోయాడు. శ్రీరాములు కూడా అతన్ని అనుసరించాడు. గోవిందరావు ఉన్నంతసేపు శ్రీరాములు తనే ఎలక్షన్ ఆఫీసర్ అన్నట్టుగా వ్యవహరించాడు. పాండురంగారావు అక్కడ ఉన్నట్టు ధ్యాస కూడా లేదతనికి.
స్కూలు బయట ఆడుతూ, పాడుతూ మహా ఉత్సాహంగా ఉన్నారు గోవిందరావు మధ్దతుదారులు. నామినేషన్ సమయం అయిపోయేదాకా అక్కడే ఉంటారట వారు.
బిక్షపతి మాటిమాటికి టైం చూస్తున్నాడు. నాలుగు గంటలకు ఇంకా పది నిమిషాలే ఉంది.
“సదన్న ఇంకా రాలేదు సార్!”
బిక్షపతి కంఠంలో దుఃఖం ధ్వనిస్తోంది. పాండురంగారావుకు కూడా ‘సదానందం వస్తేనే బాగుండు’ అని ఉంది.
మరో ఐదు నిమిషాలు గడిచిపోయాయి. ఐనా సదానందం రాలేదు. పాండురంగారావు బయటికి వచ్చి చూశాడు, ఎవరైనా వస్తున్నారేమోనని. అతని చూపులను గమనించి గుంపులోంచి ఒకడు గట్టిగా అన్నాడు,
“ఏం చూస్తవ్? ఎవ్వలురారు. ఉన్న ఒక్క సదానందంగాన్ని పోలీసులు పట్టుకపోయిండ్లు గదా?” అని.
“పోలీసులా?” అన్నాడు బిక్షపతి ఆశ్చర్యపోతూ.
“పోలీసులా?” అన్నాడు పాండురంగారావు మరింత ఆశ్చర్యపోతూ.
“ఔను, పోలీసులే. పిచ్చిరాతలు రాస్తే, పిచ్చి పాటలు పాడితే పట్టుకపోరామరి?” అన్నాడతను నవ్వుతూ.
గుంపు మధ్యలో ఉన్న గోవిందరావు మీసాల మీద చేయి వేసి నవ్వుతున్నాడు. వికృతంగా ఉందా నవ్వు. ‘మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం’ అన్నట్టుగా ఉందా నవ్వు. ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తున్నట్టుగా ఉందా నవ్వు.
“ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని రాస్తే కూడా నేరమేనా సార్?” అని బిక్షపతి ప్రశ్నించాడు. కాని పాండురంగారావు సమాధానం చెప్పే పరిస్థితిలో లేడు.
మిగిలిన ఐదు నిమిషాలూ అయిపోయాయి.
“నామినేషన్ టైం అయిపోయింది” అని ప్రకటించాడు పాండురంగారావు.
ఆ మాట కోసం ఎదురుచూస్తున్న గోవిందరావు మద్దతుదారులు రెచ్చిపోయి నినాదాలిచ్చారు. శ్రీరాములు కూడా వాళ్ళతో గొంతు కలిపాడు.
“గోవిందరావు దొర.. జిందాబాద్”
“సర్పంచ్ గోవిందరావు దొర.. జిందాబాద్”
“మాదాపుర సింహం.. జిందాబాద్”
గోవిందరావు నవ్వుతూనే ఉన్నాడు. మీసాలపై నుండి చేయి తీయడం లేదు. బిక్షపతి, పాండురంగారావు వైపు చూచి కళ్ళతోనే ప్రశ్నించాడు,
“ప్రజాస్వామ్యం అంటే ఏమిటి సార్” అని.
అంతవరకు ప్రజాస్వామ్యం గురించి కొద్దిగా తెలుసనుకున్న పాండురంగారావులోనూ ఇప్పుడదే ప్రశ్న..
“ప్రజాస్వామ్యం అంటే ఏమిటి?” అని.