ప్రకృతి ఒడిలో ఒక యాత్రా గీతిక!

0
14

[dropcap]యా[/dropcap]త్ర! ఎంత బావుందీ పదం! మనం ఉన్న పరిసరాలను దాటి కొద్దిపాటి దూరంలోనో, ఇంకాస్త దూరంలోనో ఉన్న ఒక కొత్త ప్రదేశాన్ని చూసేందుకు ఉద్యుక్తులమైనప్ప్పుడు మనసు కుదురుగా ఉంటుందా? ఉండదు. నిలవనీయదు. నిద్రపోనీయదు. అక్కడేదో మనకోసమే ఎదురుచూస్తూ ఉందన్న ఆలోచన! ఓహ్…

యాత్ర మనలో ఒక కొత్త తెలివిడిని, ఒక సంతోషాన్ని, ఒక అస్థిమితం చేసే చురుకునీ, ఒక అంతు తెలియని ఉద్వేగాన్ని, సాయంకాలం సూర్యుడు పశ్చిమానికి ఒరుగుతున్నప్పుడు తోచే ఒక దిగులుని… ఇంకా ఎన్నోఎన్నో పుట్టిస్తుంది. యాత్ర చేసే ప్రతి వ్యక్తీ దీనిని అనుభవంలోకి తెచ్చుకునే ఉంటారు. ప్రకృతి ఒడిలోకి వెళ్లినప్పుడు ఈ అనుభూతులు మనల్ని మరింత వివశుల్ని చెయ్యటం మామూలే. ఈ మామూలు అన్న మాట మనం తప్పించుకోలేని అనుభూతుల గురించే సుమా చెబుతున్నది.

ఇప్పటికి దేశంలోనూ, ఆవల కూడా ఎన్నో యాత్రలు చేసేను. వాటిని అక్షరాల్లోకి అనువదించే ప్రయత్నమూ చేసాను. ఐతే ఈ యాత్ర విలక్షణమైనది.

ఒక ఆహ్వానం మీద అమితంగా ప్రేమించే పిల్లల ప్రపంచంలోకి వెళ్లాను. రమ్మంటూ పిలిచి, అలాటి అనుభవాన్నొకటి ఇచ్చి నన్ను మరింత సంపన్నురాల్ని చేసినందుకు ఆహ్వానించిన వారికి నేను ఎప్పటికీ రుణగ్రస్థురాలిని. నిజమే కదా, మన అనుభవాలు, మన యాత్రలు ఏమిస్తాయి మనకి? యాత్ర అంటేనే అద్భుతమైన, విలువైన అనుభవాల గని!

మనుషుల్లోకి వెళ్లినప్పుడు ఏదో తెలియని హాయి, వాత్సల్యం, ఆరాటం మొదలవుతాయి. రేపటి ప్రపంచాన్ని తమ గుప్పెళ్లలో బంధించిన పిల్లల మధ్యకి వెళ్లినప్పుడైతే… మనలో ఏమేం కలుగుతాయో, ఎన్నని, ఏమని, చెబుతాం?! అదిగో అలాటి అనుభవమే మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

నేనున్న ప్రదేశం నుంచి సుమారు డెభ్భై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ యాత్రాస్థలికి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో చేరాను. అదొక విశాలమైన ప్రాంగణంలో ఉన్న బడి. ఐదువందలమంది ఆడపిల్లలతో ఉందన్నది నమ్మలేనట్టు నిశ్శబ్దంగా ఉంది. తరగతి గదుల్లోని టీచర్ల గొంతుల్లోంచి శ్రావ్యంగా పాఠాలు వినవస్తున్నాయి.

ఎనిమిదవ తరగతి లోకి అడుగుపెట్టాను. రెండు సెక్షన్ల పిల్లలు దాదాపు ఎనభైమందికి పైగా కలిసి కూర్చున్నారు. ఎవరో కొత్త వ్యక్తి వస్తారు, ఏదో చెబుతారన్న ఉత్సుకత ఆ ముఖాల్లో ఉంది. ఆ పిల్లలు ఎప్పటి ఆత్మబంధువునో అకస్మాత్తుగా చూసినట్టు పలకరించారు. హడావుడి, ఆర్భాటంలేని వాతావరణం, మిగిలిన ప్రపంచానికి దూరంగా ప్రకృతిలో ఒదిగిపోయి ఉన్న విశాలమైన ఆ ప్రాంగణం ఎవరికైనా శాంతిని, ప్రేమని కాక మరింకేం పంచుతాయి.

పాఠం మొదలు పెడుతూ ఆ పిల్లలను చిన్నచిన్న ప్రశ్నలతో ముందు పలకరించాను. వాళ్లు పాఠ్యాంశం వరకే కాదు చాలా విషయాలు చెప్పారు. పాఠం మరీ స్ట్రిక్ట్‌గా చెప్పుకుంటూ పోకుండా వాళ్లని వినే ప్రయత్నం చేసాను. వాళ్ల కలలు, ఆకాంక్షలు, దిగుళ్లు, భయాలు ఒక్కటొక్కటిగా అలా ప్రవాహవేగంతో వెల్లువెత్తాయి. గంటన్నర సమయం ఏం సరిపోతుంది, ఆ చిన్నారుల మనసుల్లో ఉన్న అన్ని కబుర్లూ వినేందుకు?!

ఒకరు పాటలంటే ఇష్టమని సింగర్ అవుతారట, మరొకరు పోలీస్ శాఖలోకి వెళ్లి సమాజంలో అన్యాయాల్ని ఏరిపారేస్తారట. ఒకరు డాక్టరట, ఒకరు ఇంజనీరట, ఒకరు టీచరట! ఎన్ని కలలు! మాటలతో పనిలేకుండానే ఆ కళ్లే చెప్పేస్తున్నాయి. రోజూ తాము చేసే యోగా, మెడిటేషన్ తమలో కాన్సన్‌ట్రేషన్‌ని పెంచుతాయట. మైండ్ ఫుల్‌నెస్‌ని నేర్పుతాయట. అంటే ఏమిటని అమాయకంగా అడిగాను. తమలో తాము కొంత చర్చించేసుకుని, అంటే ఫోకస్ అనీ, కాన్సన్‌ట్రేషన్ అనీ, ఇంకా పదాలు దొరకనట్టు చూస్తూ ఉన్నారు. నవ్వేసేను. అప్పుడే నేర్చుకున్న టెన్సెస్ పాఠంలో సమయం అన్నది జ్ఞాపకమొచ్చినట్టుంది. మరికొంత ప్రయత్నం…

ఆఖరికి వాళ్లనుంచే రాబట్టాను, ‘ఆ క్షణంలో ఉండటం’ అంటూ. అందరి ముఖాలూ వెలిగాయి. అలాగే ఉంటాం, ఉంటున్నాం అని చెప్పారు.

ఈ పిల్లలంతా ఇలాగే ఉన్నారా? ఒకరిద్దరు మాత్రం తమ ఆశల్ని నిజం చేసుకోగలమో లేదో అంటూ కాస్త కన్నీళ్లు పెట్టేసుకున్నారు. అదిగో ఆ డౌట్ వచ్చిందో అది మిమ్మల్ని ముందుకు నడవనివ్వదు అని చెప్పాను. సరే అన్నారు కళ్లు తుడిచేసుకుని.

మధ్యాహ్నం భోజనాలప్పుడు చూసాను, ఆ క్రమశిక్షణ! ఐదువందల మంది పిల్లలు! తెలిసీ తెలియని వయసు. చదువుకోవాలన్న ఆశతో, అమ్మానాన్నల ప్రేరణతో ఇలాటి బడిలో చేరి, ఒక్క ఇంటి సభ్యుల్లాగా మసులుతూన్న ఆ చిన్నారుల్ని చూస్తుంటే దేశ భవిష్యత్తు గురించి బెంగలేం ఉంటాయి? పొద్దున్న స్నానం చేసి ఆరవేసుకున్న బట్టలు దండేల మీదనుంచి తీసి మడతలు పెట్టుకుని, తమ గదుల్లో భద్రపరుచుకున్నారు. భోజనాల దగ్గర మాటలు, అనవసరపు అల్లరి ఏమీ లేదు. ఆ పూట డ్యూటీలో ఉన్న పిల్లలు వడ్డనలు చేస్తుంటే మౌనంగా భోజనాలు ముగించారు. డ్యూటీలో ఉన్న టీచర్ ఎవరి ప్లేటులోనూ ఏ పదార్థమూ వృథా కాకుండా చూస్తున్నారు. పిల్లలు అప్పటికే నేర్చుకున్న ఆ నియమాన్ని అమలులో పెడుతున్నారు. సుశిక్షుతులైన సైన్యం! అనే మాట గుర్తురాక మానదు.

భోజనానంతరం ఐదవ తరగతి తీసుకున్నాను. రెండు సెక్షన్లూ కలిపి ఎనభైకి పైగా ఉన్నారు అమ్మాయిలు. పసితనం పూర్తిగా వదలని ముఖాలు. అయితే ఆ ముఖాల్లో సహజమైన అల్లరి కొంచమైనా తొంగిచూస్తోందనే అనుకున్నాను. దగ్గరకొచ్చి స్నేహం చేద్దామన్న తొందర చూసాను. తమ ఇష్టాలు, తమ స్నేహాలు, ఆటలు ఏమిటో చెప్పారు. ‘టోటోచాన్’ కథ చెబితే ఆసక్తిగా విన్నారు. అలా రైలుపెట్టెలో పాఠాలు, బడి ఉంటాయా అని అడిగారు. ఆ ఊహకే వాళ్లకి చెప్పలేనంత నవ్వు, ఆనందం కలిగాయి. ఈ పిల్లలకి మనం ఇవ్వగలగాలే కానీ కొత్త అనుభవాల్నిస్తే చాలదా? ఆపైన పాఠాలు అవసరం ఉందా? అనిపించింది.

మీ గురించి ఏదైనా చెప్పండి అన్నాను. మేము చెబుతాం అంటూ తరగతిలో చాలామంది చేతులెత్తారు. సరేనంటూ ఒకమ్మాయిని పిలిచాను.

“నాకు ఈ బడిలో సీట్ రావటం నా అదృష్టం. ఇక్కడ టీచర్లు బాగా పాఠాలు చెబుతున్నారు. చక్కగా మంచి భోజనం పెడుతున్నారు. నేను అమ్మా, నాన్నలకోసం ఏడవకూడదు. అలా ఏడిస్తే ఊళ్లో అమ్మా, నాన్న కూడా బాధ పడతారు.” అంది.

మరొక అమ్మాయి వచ్చింది, అదే ధోరణిలో చెప్పింది. మరొక అమ్మాయి దాదాపు అదే చెప్పింది. అందరూ ఒకర్ని చూసి మరొకరు ఒక్క విషయమే చెబుతున్నారు. ఇంకా మీకు ఏదైనా తోచినది కొత్తగా చెప్పమన్నాను.

నేను చెబుతానంటూ ఒక చిన్నారి వచ్చింది.

“నేను ఇక్కడ అస్సలు ఏడవను. చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని అమ్మని, నాన్నని చూసుకోవాలి. ఇక్కడ నాకు బావుంది. నాతోటి స్నేహితులు, అక్కలు అందరూ నన్ను బాగా చూసుకుంటున్నారు…”

ఒక్కక్షణం ఆగింది, ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ, మరోసారి స్థిరంగా చెప్పింది,

“నేను ఇక్కడ ఏడవకూడదు. అమ్మా, నాన్న బాధపడతారు.” అని కళ్ళు తుడుచుకుంటూ వెళ్లి కూర్చుంది. గుండెలో బాధని అందరితోనూ పంచుకుని కాస్తైనా తేలికపడిందా ఆ చిన్నారి మనసు?

నిండా పదేళ్లు లేని చంటివాళ్లు. చదువుకుంటే మంచి భవిష్యత్తుంటుందని చెబితే అర్థం చేసుకుని, ఇంటి నుంచి ఇంతంత దూరాలొచ్చారు. ఒక్కక్క చిన్నారిని దగ్గరకు తీసుకోవాలన్న కోర్కెను బలవంతంగా ఆపుకున్నాను. ‘కరోనా’ దూరం దూరం అంటూ హద్దులు చెబుతున్న కాలం కదా. తరగతి గదంతా ఒక నిశ్శబ్దం కమ్ముకుంది.

ఆ సాయంకాలం బడిలోని ‘బుక్ క్లబ్’ను మరింతగా శక్తివంతంగా చెయ్యాలన్న ఉద్దేశంతో మరిన్ని కొత్త పుస్తకాలు తెచ్చి, మరింత కొత్త స్ఫూర్తిని ఇచ్చేందుకు ఒక సమావేశం ఏర్పాటు చేసారు బడి నిర్వాహకులు, వారితోపాటు ఆ బడి పూర్వ విద్యార్థినులు డా. విజయలక్ష్మి, సాధన మొదలైనవారంతా. తరగతుల్లోంచి బయటకొచ్చిన పిల్లలంతా ఎంతో క్రమశిక్షణతో వరుసల్లో ఆరుబయట ప్రదేశంలో సమావేశ స్థలానికి వచ్చి కూర్చున్నారు. అదొక అందమైన దృశ్యం! ఎవరి అదిలింపులూ లేవు, ఎవరి అజమాయిషీలు లేవు. పిల్లలకి అప్పటికే ఆ పాఠశాల కొన్ని నియమాలను జీర్ణింపచేసిందన్నది వాస్తవం.

ఇంటి దగ్గర తమ కుటుంబాలలోని పిల్లలకి మంచీచెడూ నేర్పుతూ, వాళ్లని తీర్చిదిద్దుకునే ఉపాధ్యాయినులు అంతే సహనంతో బడి ప్రాంగణంలోని పసివాళ్లని అక్కున చేర్చుకుని చదువుల్లోనూ, ప్రవర్తనలోనూ తీర్చిదిద్దుతున్న వైనం అద్భుతం! వీరంతా ఎలాటి అభినందనలతోనూ, కృతజ్ఞతలతోనూ పనిలేదన్నట్టు తమ బాధ్యతలను ప్రేమపూర్వకంగా నిర్వహించటం చూస్తుంటే మనసు తడికాక మానదు.

సాయంకాలపు నీరెండకు తోడుగా చుట్టూ పరుచుకున్న పెద్దపెద్ద చెట్లు, అవి అందిస్తున్న చల్లనిగాలి పిల్లలని చూసి మురిసిపోతున్నాయా అన్నట్టు ఒక చక్కని వాతావరణం ఆవిష్కృతమైంది ఆనాటి ఆ సమావేశంలో. ఇక్కడ మొదలైంది మరొక కొత్త అధ్యయనం. నిజమే అధ్యయనమే! చూసేవారికి, వినేవారికి కూడా ఎన్నో నేర్పిన సెషన్ అది.

పదోక్లాసు అమ్మాయిలతో మొదలుపెట్టి ఒక్కక్కరూ తమతమ ఆశలు, ఆశయాలు చెప్పుకొచ్చారు. వాటి సాధనకి అప్పటికే వాళ్లు ఎలా అవసరమైన వివరాలతో సమాయత్తమవుతున్నారో కూడా చెప్పారు. అది వింటుంటే నోటమాట రాలేదు. ఈ పిల్లలకి నేర్పవలసినది ఏం ఉంది? వాళ్లకంటే అనుభవాల్లోనూ, వయసులోనూ దశాబ్దాల సీనియారిటీ మాత్రమే ఉంది అక్కడున్న టీచర్లకి, నాలాటి అతిథులకి.

మా చిన్నప్పటి ఊహలకి, ఆలోచనలకి, ఇప్పటి పిల్లల ఆలోచనలకి ఎలాంటి సామీప్యం లేనేలేదుగా. తరం తర్వాత తరం ఆలోచనల్లో ఇంత విశాలత్వం! ఇంత స్వేచ్ఛ! ఇంత మార్పు! విషయం అంతుబట్టలేదు. ఎవరు కలిగించారు ఇలాటి తెలివిడి ఈ పిల్లల్లో. కాలం తీసుకొచ్చిన, తీసుకొస్తున్న మార్పులు, అవి వాళ్ల మీద వేస్తున్న ముద్ర ఎంత గాఢమైనది!

ఎవరు నేర్పేరు ఇవన్నీ వాళ్లకి? వాళ్ల అవసరాలు కొత్తవి. వాళ్లకున్న అవకాశాలూ కొత్తవి. కావలసినదేమిటో నిశ్చయించుకుని, నిర్ణయించుకునే అవగాహన, స్వతంత్రం, ఆత్మవిశ్వాసం అభినందించదగ్గవి. క్రితం తరంలో ఆలోచన రూపంలోనైనా మొదలవని విషయాల పట్ల వీరికున్న పట్టు… ఎంత బలం, ఎంత విశ్వాసం, ఎంత ఫోకస్! అవును ఈ తరం పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు నిజంగా ఇప్పటి క్షణాల్లోనే జీవించటం నేర్చేసుకుంటూ పరిణితిని పొందుతున్నవారు.

చదువు అవసరం, ప్రాధాన్యం ఇప్పుడిప్పుడు అన్ని తరగతుల, స్థాయుల కుటుంబాలలోనూ అర్థమవుతోంది. చదువుకుందుకు ప్రభుత్వాలు ఇస్తున్న సహకారం అందిపుచ్చుకుంటూ జీవితాల్ని వెలుగులవైపు నడిపించుకుంటున్న ఆ పిల్లల్ని చూస్తే మనసు నిండిపోతుంది. రాబోయే భవిష్యత్తు ఈ చిన్నారుల చేతుల్లో భద్రంగా, ఆరోగ్యంగా ఉంటుందని నమ్మకంగా అనిపిస్తుంటే బెంగబెంగగానే ఆ వాతావరణం నుంచి వీడ్కోలు తీసుకున్నాను.

ఇప్పుడు చెప్పండి ఈ యాత్ర నాకు ఎన్ని నేర్పి ఉంటుందో! అవును. మీరు ఊహించినది నిజం!

ఇక్కడొక దార్శనికుడైన కవి, వారి కవితాపంక్తులు జ్ఞాపకం తెచ్చుకోవటం ఎంతైనా సమంజసంగా ఉంటుంది,

‘పెద్దగా నేర్పిందేమీ లేదు
పలక మీద దయ అనే రెండు అక్షరాలు రాసి దిద్దించాను
అమ్మ ఆకాంక్షలాగానో, నాన్న నమ్మకం లాగానో కాకుండా
మీరు మీకు మల్లేనే జీవించమని కోరాను.’ – పాపినేని శివశంకర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here