[dropcap]లో[/dropcap]కంలో ఆనందాన్ని
ఆకుపచ్చ తివాచీలా
పరచి హర్షాతిరేకంతో-
మరో రోజుకు
స్వాగతం పలికేదే-
ప్రభాత శుభోదయం!!
ఆ ఉషోదయ
భాను కిరణాలతో-
జగతిని మేలుకొలిపి
శోభాయమయమై,
సర్వానందానికి కారణభూతమై
కనులముందు నిలిచేది
ప్రకృతి అనే భగవత్ ప్రసాదం!!
రోజువారీ వ్యాపకాలతో
అలసి సొలసిన
దేహానికి, మనసుకు,
సాయం నీరెండతో
సేదదీర్చి,చల్లబరచి,
చల్లని సాయంత్రానికి-
బాటలు పరచే-
స్వాగతద్వారం
ఈ ప్రకృతి!!
వెన్నెల వెలుగులలో
దేదీప్య లోకానికి-
స్వాగతంపలకి
చంద్రుని వెలుగులతో
మైమరపించి-
నిద్రాదేవి ఒడిలో-
సర్వం మరపించే
సర్వరోగ నివారిణి
ఈ ప్రకృతి!!
ఇదే ప్రకృతి ప్రకోపిస్తే-
చేసే విలయతాండవం
అన్నిటా భయకంపితం-
సర్వం వినాశనం,
కాపాడే ప్రకృతి
కన్నెర్ర చేస్తే-
మనిషి ఎదుగుదల-
సృష్టి మనుగడ-
శూన్యం!!