ప్రకృతి పులకింత

0
7

[dropcap]‘ఇ[/dropcap]వ్వాళ ఈ కారు వాడికేమయింది?  రెండు సార్లు ఫోన్ చేసి చెప్పినా ఇంత వరకూ పత్తా లేడు. అప్పుడే 11 గంటలయ్యింది. ఫంక్షనంతా అయిపోతుంది. మరీ భోజనాల టైమ్‌కు వెడితే కేవలం తినడానికే వెళ్లినట్లువుతుంద’నుకుంటూ “కిందికి పోదాం పదండి. ఇంకేదన్నా దొరుకుతుందేమో చూద్దాం” అంటూ లిఫ్ట్ వైపుకు నడిచింది సుమిత్ర.

భర్త కుమారస్వామి ఆమెననుసరించాడు. ఇద్దరూ రోడ్డు మీదికొచ్చారు. ఒక ఖాళీ ఆటో వస్తూ కనిపించింది. ఆపారు.

“అబ్బాయ్! ఇక్కడ నుండి తెనాలి వరకూ వస్తావా? అక్కడ కల్యాణ మండపానికి తీసుకెళ్లాలి.”

“ఈ గోరంట్ల నుండి తెనాలి వరకూ ఆటోలో వస్తారా? మీ ఇష్టం. రండి తీసుకుపోతాను. నారాకోడూరు మీద నుంచి పోదామా సార్?”

“అలాగే” అన్నది సుమిత్ర.

ఆటో గుంటూరు, బుడంపాడు, నారాకోడూరు, వేజెండ్ల అడ్డరోడు, విజ్ఞాన్ కాలేజి, సంగం డెయిరీ దాటుకుంటూ జాగర్లమూడిలో కొచ్చింది.

“ఈ ఊరు, రోడ్డు అన్నీ తెలిసినట్లుగా వున్నాయి” అన్నాడు కుమారస్వామి.

“కొన్నాళ్లు మీరీ వూళ్లో ఉద్యోగం చేస్తిరిగా. అయినా రోడ్డు పక్కనున్న ఇళ్లన్నీ కొత్తగా కట్టినట్లున్నారు. నాగ్గూడా అంతా కొత్త కొత్తగా కనపడుతున్నది” అన్నది సుమిత్ర.

వీళ్ల మాటల్లోనే ఆటో అంగలకుదురు దాటి జె.ఎమ్.జి కాలేజ్ కూడా దాటింది.

“సార్. సుల్తానాబాద్ వచ్చాం. ఇక్కడ నవోదయా కల్యాణ మంటపం బోర్డు కనపడుతున్నది. మీరెక్కడికి వెళ్లాలి?” అనడిగాడు ఆటో డ్రైవరు.

“కల్యాణ మంటపం ఏదో గుర్తు రావటంలేదే, అయ్యో! మీకేమైనా గుర్తున్నాదా అండీ!” అనడిగింది సుమిత్ర.

“ఏమో? నాకేం తెలుసు?” అని బదులిచ్చాడు భర్త.

ఆటోను నెమ్మదిగా నడుపుతూ “చావాస్ గ్రాండ్ కొచ్చామండీ. లోపలికెళ్లి చూద్దాం” అంటూ ఆటోను అటు తిప్పాడు. అక్కడా రోజు ఏ ఫంక్షను లేదు.

“ఎలాంటి ఫంక్షనుకెళ్లాలి? ఫంక్షను జరిపే వాళ్ల పేర్లు కాని, ఇతర వివరాలు కాని ఏమన్నా గుర్తున్నాయ్యా అమ్మా?”

“రిసెప్షను, అబ్బాయి! పెళ్లికూతురు  పెళ్లికొడుకు పేర్లు గూడా గుర్తు లేవు. ఇవాళనుకుని బయల్దేరాం.”

ఆటోను ఇంకాస్త ముందుకు పోనిచ్చి కలప అడితీల పక్కనుంచి పద్మావతీ కల్యాణ మంటపానికి తీసుకెళ్లాడు. అక్కడ ఏదో ఫంక్షనుంది కాని రిసెప్షను కాదు.

“అమ్మా ఈ దగ్గర్లో ‘గౌతమ్ గ్రాండ్’ హోటల్ వున్నది. నాజరుపేటలో ‘యమ్.వీ.ఆర్’ వున్నది. మారీసుపేటలో ‘మానవేంద్ర’ వున్నది. చూద్దాం పదండి. మీకు తెలిసిన వాళ్లు కనపడతారేమో చూడండి.” అంటూ ఆటోను మానవేంద్ర కల్యాణ మండపం దాకా తీసుకెళ్లి ఆమెని లోపలికి పంపించాడు.

“మెట్టు ఎక్కి పై దాకా వెళ్లి చూసొచ్చా నబ్బాయ్. ఎవరిదో పుట్టిన రోజునుకుంటా జరుపుతున్నారు.” అంటూ నిరాశగా వచ్చి ఆటోలో కూలబడింది.

అప్పటికే ఒంటిగంట కావచ్చింది. వయసులో పెద్దవాళ్లు. ఇద్దరి ముఖాలు వాడిపోయినవి. ఆటో అతనికి ఊసూరుమనిపించింది. ఆమెకు అయోమయం. ఆయనకు పూర్తిగా మతిమరుపులాగుంది అనిపించింది.

“సార్! ముందు మీరు ఎక్కడైనా భోజనం చెయ్యిండి. లేకపోతే ఇబ్బంది పడతారు” అంటూ గౌతమ్ హోటల్ మందు ఆటోను ఆపి వాళ్లను లోపలికి తీసుకెళ్లాడు. భోజనాలు అయిన తర్వాత అక్కడున్న హల్లో వాళ్లను కూర్చోబెట్టి ఈ హోటల్ నైనా ఏదైనా రిసెప్షను ఫంక్ష నుందేమోనని వాకబు చేయిసాగాడు.

అదే హాల్లో టిఫిన్ సెక్షనలో ఇద్దరు యువకులు కూర్చుని కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు.

“అభాలాష్ గారూ! ఆస్ట్రేలియాలో జాబ్ మానేసి మీ ఊరు వచ్చేశారన్నమాట.”

“అవును విశాల్! ఆ సాఫ్ట్‌వేర్ జాబ్‌తో నాకు తృప్తి అన్పించలేదు. సమాజానికి ఏదైనా చెయ్యాలనిపించింది. నా మనసు సేంద్రియ వ్యవసాయం మీదకే లాగుతుంది. దాంతో మా ఊరు వచ్చేశాను. మా పొలాల్లో సేంద్రియ వ్యవసాయం మొదలు పెట్టాను. ఈ పద్ధతి ద్వారా ఆరోగ్యకరమైన పంటల్ని పండించి చూపాలన్నదే నా ఉద్దేశం. రసాయనిక మందులు కొట్టి పండించిన పంటలు తిని జనం ఎన్ని రోగాల పాలవుతున్నారో చూస్తుంటే ప్రాణం తరుక్కుని పోతుంది. పర్యావరణం దెబ్బతింటుంటే చూసి నా మనసు విలవిలలాడుతున్నది. నా ప్రయోగాలకు మా ఇంట్లో వాళ్లు మొదట వ్యతిరేకించారు. వ్యవసాయంలో నష్టాలే తప్ప లాభాలుండవని తెగ బాధపడ్డారు. నన్ను చూసి మరింత మంది నా దారిలోకే వస్తారని మా వాళ్లకు నచ్చ చెప్పాను. ఈ రోజిక్కడ మార్కెట్ యార్డులో వ్యవసాయ శాస్త్రవేత్తలతో సేంద్రియ వ్యవసాయం మీదే సదస్సు వుంటే వచ్చాను. తిరిగి వెళ్లేటప్పుడు మీరు కలిస్తే ఇలా వచ్చాను.”

“వ్యవసాయ పరిశోధనా స్థానాలకు కానీ, కృషి విజ్ఞాన కేంద్రాలకు కాని వెళ్ళి తెలుసుకోలేపోయారా?”

“వెళ్ళాను. ఇంకా గుజరాత్ పని మీద వెళ్ళినప్పుడు ‘ఆనంద్’ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కూడా వెళ్ళి మాట్లాడాను. వాళ్ళంతా ప్రోత్సాహకరంగానే చెప్పారు. వాటికి తోడు మన స్వానుభవం కూడా జోడించుకోవాలి. ఎరువుల్నించి పోషకాలను, పోషకాల నుంచి ఎరువుల్ని లెక్కగట్టడం తెలుసుకున్నాను. జీవన ఎరువులతో పాటు, వర్మీ కంపోస్టును, వేప కషాయాన్నీ, జీవామృతాన్ని కూడా మేమే తయారు చేసుకుని అటు పోషకాలతో పాటు ఇటు చీడపీడల బారి నుండి పంటల్ని కూడా కాపాడుకుంటున్నాం. రసాయనిక ఎరువుల బారిన పడ్డ నేల నిస్సత్తువ కావటం చాలా బాధగా వున్నది.”

“మొత్తానికి చాలా ప్రయోగాలు చేస్తున్నారు. ఎ.సి రూమూల్లో కూర్చుని కంప్యూటర్‌తో కుస్తీ పట్టేవారు. ఇప్పుడీ ఎండలకు తట్టుకుని పొలాల్లో తిరగ్గలుగుతున్నారా?”

“ఇష్టంతో చేస్తున్నాను కాబట్టి నాకే కష్టంగా లేదు. మా ఊరు రండి. నా పొలాన్ని, నా ప్రయోగాలనూ చూడండి. క్రమేణా దిగుబడి ఇంకా బాగా పెరుగుతుందన్న నమ్మకం నాకున్నది. ఆహారం పంటలతో పాటు ఉద్యాన పంటలూ, వాణిజ్య పంటలూ ఆకుకూరల సాగు కూడా చేస్తున్నాను. అంతా సేంద్రియ పద్ధతి ద్వారానే. మన ప్రజలక్కూడా ఇప్పుడిప్పుడు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు ఎక్కవనే వున్నాయి.

ఉద్యాన పంటలూ, అకుకూరలకయితే మాకు కావాలంటూ మా ఇంటి దగ్గర క్యూ కడుతున్నారంటే నమ్మండి. వాణిజ్య ఆహార పంటల్ని గోడౌన్‌లో భద్రపరిచాం. పేపర్లో యాడ్ ఇచ్చాను. చాలా మాంది వచ్చి అడుగుతున్నారు. కొన్ని షాపుల వాళ్లు కూడా సంప్రదిస్తున్నారు. నాకైతే మంచి ప్రోత్సాహమే అన్పిస్తున్నది.”

“మంచిదే గదండీ. మీ మాటలన్నీ వింటుంటే నాక్కూడా మీదారిలోనే నడవాలన్న కోరిక, పుడుతున్నది. దీన్ని గురించి ఆలోచిస్తాను. ఈ మధ్య ప్రపంచ వ్యప్తంగా  ‘కీన్వా’ ఆహార పంటను గురించి చర్చవినపడుతున్నదిగా. దాని మీద మీకేం అయిడియా లేదా?”

“ఆధునిక యువ రైతును గదా? నా దృష్టి పడకుండా వుంటుందా? కొద్ది భూమిలో సాగు చేసి చూశాను. ఒక మోస్తరుగా పండింది. ప్రస్తుతం నా దగ్గర ఆ పంట వున్నది.”

“నిజంగా చాలా ఇంటరెస్టింగ్‌గా వున్నది. ఇంతకీ ఆ గింజలూ, మొక్కలూ ఎలా వుంటాయి చూట్టానికి!”

“అవా? మన తోటకూర మొక్కల సైజులో అంతే ఎత్తు పెరుగుతాయి. అలాగే కంకులు వేస్తాయి. గింజల్లో రంగులు కూడా వుంటాయి. ఎకరానికి ఐదారు క్వింటాల్స్ కన్నా పండవు.”

“అదే బోలెడు రేటు పలుకుతాయిగా. విదేశాల్లో 10,12 డాలర్లు పెడితే కాని ఒక కిలో రావంటారు. మన దగ్గరేమో కిలో 1600కు పైగానే అమ్ముతాయిని చెప్పుకుంటారు.”

“అవునవును. కొని ఇవి పండించటానికి చాలా జాగ్రత్తలు కావాలి. ముప్పై, ముప్పై రెండు సెంటీగ్రేడ్ డిగ్రీలలో వున్న ఉష్ణోగ్రతలలోనే వీటిని సాగు చేయాల్సి వుంటుంది. ఈ గింజల్లో వున్న పోషకవిలువలు ప్రస్తుతం మరో దాంట్లో కనపట్టం లేదు. అందుకే వీటికింత డిమాండ్. అచ్చం సేంద్రియం గానే వీటినీ పండిచాలని నా తపన..”

“నాకొన్ని కీన్వా కావాలి. ఇవ్వగలరా?”

“తప్పకుండా. వెళ్దాం రండి.”

“ఏదైనా చెయ్యాలనే ఆలోచనకు మీ మాటలు నాకో రూపాన్నిచ్చాయి. త్వరలోనే తప్పకుండా మీ ఊరొస్తాను. పదండి” అంటూ నడుచుకుంటూ బయటికొచ్చారు.

ఎవరివో మాటలు వినిపించి అభిలాష్ తలెత్తి చూశాడు. ఏదో, వాదించుకుంటున్న వృద్ధ దంపతులు కనపడ్డారు. తనకు బాగా తెలిసినవాళ్లే అన్పించింది. తమ ఊళ్లో పోస్టు మాస్టారుగా పని చేసిన కుమరస్వామి మామయ్య, సుమిత్ర అత్తయ్య. “ఒక్క నిముషం విశాల్” అంటూ, అభిలాష్ వాళ్ల దగ్గరకెళ్లాడు.

“నమస్తే మామయ్యా. నమస్తే అత్తయ్య. బావున్నారా?” అంటూ ఆప్యాయంగా పలకరించాడు. కుమారస్వామి ముఖంలో ఎక్కడా అభిలాష్‌ను గుర్తు పట్టిన ఆనవాళ్లు కన్పడలేదు.

“ఎవరు బాబూ నువ్వు?” అని సుమిత్ర మాత్రం అడిగింది.

“నేనత్తయ్యా. అభిలాష్‌ను. మాది సంగం జాగర్లమూడి. మీరు మా ఇంట్లో అద్దెకుండే వాళ్లు. మామయ్య మా ఊళ్లో పోస్టు మాస్టరుగా పని చేశారుగా.”

“ఆ.. అవును. నువ్వా అభిలాష్. మేమున్నప్పుడు నువ్వు ఎనిమిదో, తొమ్మిదో చదివేవాడవు.”

“అవును. మీరేంటి ఇలా హోటల్లో?” అని అడుగుతూ వుండగానే ఆటో డ్రైవరు దగ్గరకొచ్చాడు..

“వీళ్లు మీకు తెలుసా సార్?  తెనాల్లో ఏదో రిసెప్షను వుందని పొద్దున గోరంట్లలో ఒక అపార్ట్‌మెంట్ దగ్గర నా ఆటో ఎక్కారు. రిసెప్షన్ ఎవరిదో, ఏ ఫంక్షన్ హాలో చెప్పలేకపోతున్నారు. భోజనాల టైమయ్యిందని నేనే ఇక్కడికి భోజనికి తీసుకొచ్చాను.”

“అయ్యో! అలా జరిగిందా? నేనిప్పుడు వీళ్లను మా ఇంటికి తీసుకుని వెళ్లి ఆ తర్వాత వాళ్ల ఊరు పంపే ఏర్పాటు చేస్తాను. నువ్వెళ్లు” అంటూ ఒక వెయ్యి రూపాయలు తీసి ఇచ్చాడు. సుమిత్ర వద్దని వారించబోయింది.

‘ఈయన నిజంగా వాళ్లకు తెలిసినాయనేనా! ఆమెగారి ఒంటి మీద చాలా నగలు కూడా వున్నాయి’ అని ఆలోచిస్తూ ఆటో డ్రైవరు వెళ్లిపోయాడు.

అభిలాష్ వాళ్లిద్దర్నీ తమింటికి తీసుకొచ్చాడు. వాళ్లు ఆ ఇంటి పరిసరాలన్ని తిరిగి చూశారు. అప్పుడు పెంకుటిల్లు. ఇప్పుడు దాని ముందు డాబా. దాని పక్కన పెద్ద గోడవున్ కట్టారు. అభిలాష్ తల్లీదండ్రీ కూడా ఎంతో అబిమానంగా మాట్లాడారు. కుమారస్వామిగారు ఆయన లోకంలో ఆయన నుంటే సుమిత్ర మాత్రం కొన్నింటికి సమాధానాలు చెప్పంది. కడుపున పుట్టిన పుల్లలు లేరు. పెద్దగా ఆప్యాయంగా వుండే బంధువులూ తక్కువే. వృద్ధాప్యమూ, మందులూ, ఒంటరితనం అన్నీ కలసి వాళ్లను మరింత దుర్బలులుగా తయారు చేశాయి. వీళ్లకు మంచి వాతావరణం ఆప్యాయంగా వుండే మనుషులు మధ్య తోడు దొరికితే మరింత తేరుకుంటారు అనే అభిప్రాయం అభిలాష్‌కు బాగా కలిగింది.

“అత్తయ్యా రండి. నేనే తీసుకెళ్లి మిమ్మల్ని దింపివస్తాను” అన్నాడు అభిలాష్.

“అవును. ఇది మా ఇల్లేగా? ఇక్కడ నుంచి ఇప్పుడెక్కడికి వెళ్లాలి?” అన్నాడు కుమారస్వామి.

పసిపిల్లాడు మాట్లాడినట్లు అమాయకంగా వున్న ఆయన మాటలకు అభిలాష్‌ మనసు ద్రవించిపోయింది. తమింట్లో వున్నప్పుడు తననెంతో ప్రేమగా చూసేవాళ్లు. ఇలాంటి కొడుకు నాకూ వుంటే ఎంతో బాగుండునని సుమిత్ర అత్తయ్య పదే పదే అనుకునేది. ఇద్దరూ ఎంతో మంచివాళ్లు. పాపం ఇప్పుడిలా అయిపోయారు అనుకున్నాడు.

“అత్తయ్యా! మీ కిష్టమయితే మీరిప్పుడైనా మా ఇంటి కొచ్చి ఒక పోర్షన్‌లో వుండొచ్చు. ఈ వాతావరణంలో మీ ఆరోగ్యాలు బాగుపడుతాయి. ఇక్కడ నోరారా పలకరించి, నలుగురూ మిమ్మల్ని ఆదరిస్తారు. ఆలోచంచండి.”

“నిజమే అభిలాష్! నాకూ ఒకసారి వున్న మతి మరో సారి వుండడం లేదు. మనుషుల తోడు కావాలనిపిస్తున్నది. మాకు మేమే ఒంటరిగా వుంటుంటే ఏదో భయం భయంగా వుంటున్నది.” అన్నది.

ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే సర్దుకుని వాళ్లు అభిలాష్ వాళ్ల ఇంటికి వచ్చేశారు. సేంద్రియ పద్ధతిలో పండిచిన బియ్యమూ, కూరగాయలూ, ఇంట్లో పాడీ, ఇక్కడి మనుషుల పలకరింపూ, అభిలాష్ కుటుంబం చూపే ఆత్మీయతా ఇలా వీటన్నింటిని వలనా వాళ్లిద్దరూ పూర్తిగా మామూలు మనుషులయ్యారు. రసాయనిక మందులుపయోగించని ఆహార పదార్థాల వలన ఈ వయసులో కూడా ఉత్సాహంగా ఆరోగ్యంగా వుండసాగారు.

సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేసి ఆరోగ్యకరమైన పంటలు పండించే ఆదర్శ రైతుగా, గుర్తింపు తెచ్చుకున్నాడు అభిలాష్. ఎక్కడెక్కడి నుంచో రైతులు వచ్చి మాట్లాడటమే కాక పత్రికల్లోనూ, టీ.వీలోనూ కూడా అభిలాష్‍తో ఇంటర్వూలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వము వారిచ్చే ‘ఉత్తమ కృషీవలుని’ అవార్డుకూ ఎంపికయ్యాడు. అభిలాష్ పండించే ‘కీన్వా’ పంట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. తలగుడ్డ చుట్టి ట్రాక్టరు కూడా తానే నడుపుకుంటూ ‘ఆదర్శ యువరైతు’ అన్న దానిని సార్ధకం చేస్తున్నాడు అభిలాష్. నత్రజని లోపమో, జింక్ లోపమో లేకుడా అభిలాష్ పొలం బలంగా, సారవంతంగా తయారయింది. ఇప్పుడు తన పొలం రసాయిన ఎరువుల వెగటు వాసన, పంటల అనారోగ్యం లేకుండా సారవంతంగా కమ్మని మట్టి వాసన వేస్తూ, ఆరోగ్యంగా మిసమిసలాడు తుందనిపించింది అభిలాష్‌కు.

అటు పోస్టు మాస్టరుగారి దుంపతులతో బాటు మరెంతో మందిలో, వ్యాధినిరోధక శక్తి పెరిగింది. వారంతా వయసులు కూడా మర్చిపోయి ఉల్లాసంగా తిరుగుతున్నారు. ఇదంతా అభిలాష్ వల్లనే సాధ్యపడిందని అందరికీ అన్పించింది. పంటల ఆరోగ్యంతో పాటు మనుషులు ఆరోగ్యం కూడా అభిలాష్ సరిచేశాడన్న నమ్మకం జనంలో కలిగింది.

ఇప్పుడు  విశాల్ కూడా అభిలాష్ చూపిన బాటలోనే నడుస్తున్నాడు. సేంద్రియ పద్ధతుల్లో అభిలాష్ తనకు గురువంటున్నాడు. అబిలాష్ విశాల్ మనస్సులకిప్పుడు ఎంతో తృప్తిగా వుండి, మావంతు మేం కృషి మేం చేస్తున్నామని అనుకోసాగారు. మరెంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here