ప్రకృతి సౌందర్యాల పుట్టిల్లు న్యూజీలాండ్-2

0
14

[ఈ మధ్యనే ముగించిన న్యూజీలాండ్ విహార యాత్రలోంచి కొన్ని విశేషాలు అందిస్తున్నారు శ్రీమతి శారద (బ్రిస్బేన్). ఇది రెండవ భాగం.]

వేడి నీళ్ళ జలాశయాలు

న్యూజీలాండ్ అంతటా భూగర్భంలోంచి ఉబుకుతూ వచ్చే వేడి నీటి జలాశయాలున్నాయి (గీసర్లు). మాయొరీ తెగలు ఈ వేడినీటి జలాశయాలచుట్టూ నివాసాలు ఏర్పరుచుకున్నారు. ఈ జలాశయాలల్లో ఉబికే వేడినీటిని స్నానానికీ, వంటకీ ఉపయోగిస్తారు. అందువల్ల మాయోరీ తెగల ఊళ్ళల్లో సామూహిక వంటశాలలూ, స్నానశాలలూ వుంటాయి.

ఉబికి వస్తున్న వేడి నీటిని చిన్న చిన్న తటాకాల్లోకి మళ్ళించి, స్నానాలకి వాడతారు.

వండదలచిన పదార్థాలను ఒక చిన్న మస్లిన్ లాటి బట్టతో చేసిన సంచిలో వుంచి తాళ్ళతో వేడి నీళ్ళలోకి జారవిడుస్తారు. అయిదూ-పది నిమిషాల్లో ఆ సంచి పైకి లాగి చూస్తే, వండిన పదార్థాలు సిద్ధం!

ఆవిర్లు కక్కుతున్న భూమినీ, సల సలా మరుగుతూ పారుతూ వున్న నీటిని చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా వుంటుంది.

2024 డిసెంబరు 25న ఇండియన్ ఓషన్‌లో సునామీ వచ్చిన సమయంలో న్యూజీలాండ్‌లోని వేడి నీటి గీజర్ల చైతన్యం చాలా ఎక్కువైందట. ఈ రెండు సంఘటనలకి పరస్పరం సంబంధం వుందా లేదా చెప్పలేం గానీ, విచిత్రమైన యాదృచ్ఛికమే కదా!

టేపౌ సరస్సు

రోటొరువా నుంచి దక్షిణంగా దాదాపు తొంభై కిలోమీటర్ల దూరంలో లేక్ టేపౌ వుంది. దాదాపు పాతిక వేల యేళ్ళ క్రితం ఇక్కడ బద్దలైన అగ్ని పర్వతం వల్ల ఒక బిలం (క్రేటర్) ఏర్పడింది. ఆ క్రేటర్‌లో ఏర్పడ్డ అతి విశాలమైన మంచి నీటి సరస్సు లేక్ టేపౌ.

దాదాపు నలభై ఐదు కిలోమీటర్ల పొడవూ, ముప్ఫై ఐదు కిలోమీటర్ల వెడల్పూ వున్న ఈ సరస్సులోకి ప్రవహించే నీటితో వైకాటో, వైటాహునై అనే రెండు పెద్ద నదులు ఏర్పడ్డాయి. వైకాటో న్యూజీలాండ్‌లో కెల్లా పెద్ద నది.

లేక్ టేపౌకి వాయవ్య దిశన కొన్ని కొండ చరియలున్నయి. 1970ల్లో ఈ కొండ చరియలపైన బొమ్మలు చెక్కారు. ఈ చెక్కడంలో వున్న మొహం మాయోరీ నావికులకి దాదాపు వేయేండ్ల క్రితం దారి చూపిన దేవత అంటారు. దాదపు పది మీటర్ల ఎత్తున్న కొండ చరియ ముఖం పైన ఈ చిత్రం చెక్కారు.

హూకా జలపాతం

టేపౌ సరస్సు కి దగ్గరగా, వైకాటో నదీ ప్రవాహంలో భాగంగా హూకా జలపాతం వుంది. ఈ జలపాతంలో నీళ్ళు పెద్ద ఎత్తునుంచేం పడవు, కానీ, నీటి హోరూ, ప్రవాహ వేగమూ అబ్బురమనిపిస్తాయి. ఈ జలపాతం మొదట్లో ఎనిమిది మీటర్ల ఎత్తునుంచి నీళ్ళు పడితే, చివరికొచ్చేసరికి ఆరు మీటర్ల ఎత్తునుంచి నీళ్ళు కిందకి పడతాయి. (మన దేశంలోని కుట్రాలం జలపాతం దాదాపు నూట మీటర్ల ఎత్తునుంచి నీళ్ళు పడతాయి.)

వైటొమో గ్లో వోర్మ్ గుహలు

సముద్రాలకి దగ్గరగా వుండే ప్రదేశాల్లోని (ద్వీపాలు) భూమి పొరల్లో సున్నపు రాయి (లైం స్టోన్) వున్నట్టయితే ఆ ప్రదేశాల్లో ‘సున్నపు రాయి గుహలు’ (లైం స్టోన్ కేవ్స్) తయారయితాయి.

స్థూలంగా చెప్పాలంటే, వర్షపు నీరు గుహలోని రంధ్రాల్లో నిలిచిపోతుంది. సముద్రాలకి దగ్గర వుండే ప్రదేశాల్లో నేలలో జలచరాల బొమికల ఆనవాళ్ళుంటాయి. వీటితో కలిసిన వర్షపు నీరు కేల్సియం కార్బోనేట్ అనె రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఈ రసాయనం గుహ గోడల్లోని రంధ్రాల్లో నిలిచి వాటిని తొలిచేస్తుంది. మిలియన్ల కొద్దీ యేళ్ళల్లో ఏర్పడ్డ ఈ రసాయనం ఘనీభవించి గుహ పై కప్పు నుంచీ, కింద నేలలోంచీ పెద్ద పెద్ద ఛాండిలియర్ల లా తయారవుతాయి. ఈ సున్నపురాయి గుహలు ఆస్ట్రేలియాలోనూ వున్నాయి.

న్యూజీలాండ్‌లోనూ, లేక్ టేపౌకి దాదాపు నూట డెబ్భై కిలోమీటర్ల దూరంలో వైటొమో అనే గ్రామంలో వైటొమో గుహలు వున్నాయి. వీటి సౌందర్యం కళ్ళతో చూడవలిసిందే కానీ, మాటల్లో వర్ణించలేం. ఈ గుహల్లో ఫోటోగ్రఫీ నిషిద్ధం. బయట ఫోటోలు తీసుకోవచ్చు.

ఈ గుహలో వుండే ఇంకో అద్భుతం ‘గ్లో వార్మ్’ (Glow Worm). చిమ్మ చీకటి వున్న గుహలో, వున్నట్టుండి నక్షత్రాలతో కిక్కిరిసి వున్న ఆకాశం దాదాపు చేయెత్తులో చూడడం ఎలా వుంటుంది? ఆశ్చర్యంతో నోట మాట రాదు. ఆ అందాన్ని చూస్తూ అక్కడ ఫోటో తీయడం కూడా మర్చిపోయానంటే, అతిశయోక్తి కాదు.

నిజానికి ‘గ్లో వార్మ్’ పురుగు కాదు. స్వతః సిద్ధంగా వెల్తురు చిమ్మే ఒకానొక పురుగు యొక్క లార్వా దశ. ఈ దశలో అది వెల్తురు చిమ్ముతూ గుహ పై కప్పునంటుకొని వుంటుంది. ఇలా ఒకటీ, రెండూ కాదూ లక్షలు, కోట్ల వెల్తురు బిందువులు కప్పుని పట్టుకొని వేళ్ళాడుతూ వుంటాయి.

ఆ చీకటినీ, ఆ నిశ్శబ్ద సౌందర్యాన్నీ భగ్నం చేయడానికి మనసు రాదు మనకి.

(ఈ చిత్రం వైటోమో విజిటర్స్ సెంటర్ వారిచ్చిన కాంప్లిమెంటరీ కార్డులోనిది).

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here