ప్రకృతి ఉత్పత్తులలో ఔషధాలు

0
8

[dropcap]ని[/dropcap]రంజనరావు బాధతో కూడిన కోపాన్ని దిగమింగుకుంటూ వచ్చి సోఫాలో కూలబడ్డాడు. భార్య పద్మావతి “ఏమైందండీ! అలా ఉన్నారేం?” అంటూ మంచినీళ్ళ గ్లాసు చేతి కందించింది.

నిరంజనరావు:  ఏముంది బయటికెళితే చాలు ‘ఎమ్‌సెట్ రిజల్ట్స్ వచ్చాయట కదా! మీ అమ్మాయికి డాక్టరు సీటొచ్చిందా’ అని అడిగే వాళ్ళే అందరూ! ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావడం లేదు.

పద్మావతి: పోనీలెండి. అది మాత్రం ఏం చేస్తుంది. నిద్రాహారాలు మాని చదివింది. కానీ దీనికన్నా చదివే వాళ్ళున్నారు. కాంపిటీషన్ అలా ఉన్నది. మీరే ఇలా బాధపడితే అదింకా బాధపడుతుంది.

నిరంజనరావు: అది కాదు! ఎంత కష్టమైనా అంతంత ఫీజులు కట్టి రాష్ట్రంలోనే పేరు మోసిన కాలేజీలో చదివించాను. ఇది నా చిన్ననాటి కలని నీకూ తెలుసు కదా.

ఇంతలో “నిరంజనరావుగారు! నిరంజనరావుగారు” అంటూ ప్రక్కింటి కాంతారావు గారు పరుగులాంటి నడకతో ఇంట్లోకి ప్రవేశించారు.

‘ఏమండీ! ఎమ్‌సెట్ రిజల్ట్స్ వచ్చాయట కదా! అమ్మాయికి ఎంత ర్యాంకు వచ్చిందేమిటి?’ అని అడిగాడు కాంతారావు నిరంజనరావుని.

నిరంజనరావు ‘చూడు ఇదీ నా పరిస్థితి’ అన్నట్లుగా భార్య వంక చూశాడు.

పద్మావతి: మంచి ర్యాంకు రాలేదు అన్నయ్యగారు. అందుకే ఈయన తెగ బాధ పడిపోయి అమ్మాయినీ బాధపెడుతున్నారు.

కాంతా: ఎందుకమ్మా అంతలా బాధపడటం. యం.బి.బి.ఎస్.లో సీటు రాకపోతే ఆయుర్వేదంలో చేర్చండి. మా చెల్లెలుగారబ్బాయి కూడా ఆయుర్వేదం చదువుతున్నాడు.

నిరం: ‘ఆ ఆయుర్వేదంలో ఏముంటుందండీ చదవడానికి’ అంటూ తేలిగ్గా కొట్టి పారేశాడు.

కాంతా: అయ్యో! అలా అనకండి! ఆయుర్వేదం మన భారతీయ వైద్యం.

నిరం: ఇది అల్లోపతి ముందు ఎందుకు పనికొస్తుందండి. ఏవో చెట్ల ఆకులు నూరుకోవడాలూ, చూర్ణాలు తయారుచెయ్యడమూనూ!

కాంతా: సరే మీకు ఎక్కువ అవగాహన లేనట్లుంది. రేపు మా చెల్లెలుగారబ్బాయి వస్తున్నాడు. మీ ఇంటికి తీసుకొచ్చి మీతో మాట్లాడిస్తాను. అప్పటి దాకా మీరు బాధపడి అమ్మాయిని బాధపెట్టకండి. ఇక నేను వెళ్ళొస్తానండి అంటూ కాంతారావు వెళ్ళిపోయాడు.

పద్మావతి: బయట తిరిగి తిరిగి ఎండనబడి వచ్చారు. కాస్త భోజనం చేసి విశ్రాంతి తీసుకుందరు రండి!

సరే పద! అమ్మ తిని పడుకుందా ఏమిటి కనపళ్ళేదు. అమ్మాయి తన రూములో ఉందా! అంటూ వంటింట్లోకి దారి తీశాడు నిరంజనరావు.

~

కాంతా: నిరంజనరావుగారు! ఏం చేస్తున్నారు? ఆఫీసు నుంచి వచ్చేశారా! ఇదుగోనండి మా మేనల్లుడు సృజన్ నిన్న చెప్పానే ఆయుర్వేదం డాక్టరు కోర్సు చదువుతున్నాడని.

సృజన్: నమస్మే అంకుల్.

నిరం: నమస్తే బాబు. ఎలా చదువుతున్నావు? నీ కోర్సు ఎలా ఉంది. దాని గురించి కొంచెం వివరాలు చెప్పు..

సృజన్: ఆయుర్వేదం గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉన్నది. ఆయుర్వేదం భారతదేశంలో వేదాల కన్నా ముందే పుట్టింది. మనం ఎంతో గొప్పగా ప్రాచీనమైనవిగా భావించే వేదాలలో వీటి ప్రస్తావన ఉన్నది. క్రీ.పూ. 5000 సంవత్సరాల నాటి ఋగ్వేదము, అధర్వణవేదములలో ఆరోగ్యము, జబ్బుల గురించి వివరాలు వ్రాసి ఉన్నాయి. వేద కాలంలో శుశృతుడు, చరకుడు ఈ వైద్యం గురించి ఎన్నో పరిశోధనలు చేసి ‘చరకసంహిత’, ‘శుసృత సంహిత’ అనే పుస్తకాలను వెలువరించారు. వందల కొద్దీ మందుల మొక్కల్ని గుర్తించి అవి ఏ విధంగా పని చేస్తాయో గ్రంథస్తం చేశారు.

నిరం: ఏంటి ఇంత పురాతనమైనదా ఆయుర్వేదం?

సృజన్: అవునంకుల్! ఈ సంప్రదాయ ఆయుర్వేద వైద్యం అభివృద్ధి చెంది అనేక రకాల జబ్బులకు మందులతో సహా శాస్త్రచికిత్సలు కూడా చేసే స్థాయికి ఎదిగింది.

నిరం: చెట్ల ఆకుల్ని మాత్రమే మందుల్లో వాడతారా బాబూ!

సృజన్: కాదంకుల్! ఆకులు, కాండం, పువ్వులు, కాయలు, విత్తనాలు, పూ మొగ్గలు, బెరడు, వేరు వంటి మొక్కలలోని అనేక భాగాలు మందులలో వాడతారు.

పద్మావతి: మందుల్ని ఏఏ రూపాలలో తయారు చేస్తారు?

సృజన్: కొన్ని పొడుల రూపంలోనూ, కొన్ని లేహ్యం రూపంలోనూ, కొన్ని కషాయాలు గానూ, మరికొన్ని ద్రావణాలు గానూ, స్రావాలుగానూ తయారు చేస్తారు.

అప్పుడే స్కూలు నుండి వచ్చిన నిరంజనరావు కొడుకు విక్కీ ఈ సంభాషణలను ఆసక్తిగా వింటున్నాడు. బామ్మ కూడా వంటింట్లోంచి వచ్చి అక్కడే కూర్చున్నది.

విక్కీ: అన్నయ్యా! ఇంకా ఏమేమి తయారు చేస్తారు.

సృజన్: మొక్క భాగాల నుండి ఆల్కహాలిక్ సొల్యూషన్స్, టింక్చర్స్, ద్రావకాలు వంటి వాటిని తయారుచేసి ఆయుర్వేద వైద్యంలో చాలా ఎక్కువగా వాడతారు. మనం రోజూ వంటింట్లో వాడుకునే ఎన్నో చెట్ల ఉత్పత్తులు మందులుగా ఉపయోగపడతాయి. అవేంటో చెప్పగలరా ఎవరైనా?

బామ్మ: బయటి నుంచి క్రిములు లోపలికి రాకుండా గడపలకు పసుపు రాస్తారు. కూరల్లో పసుపు వేసేది కూడా అందుకే. ఏమైనా సూక్ష్మక్రిములు ఉంటే చనిపోతాయని, ఇంకా ఆడవాళ్ళు మొహంపై వచ్చే మొటిమలు తగ్గడానికి పసుపునే రాసుకుంటారు.

సృజన్: చాలా చక్కగా చెప్పారు బామ్మగారు. అందుకే పసుపును యాంటీసెప్టిక్‌గా ఉపయోగిస్తారు. ఆలోచించండి. ఇంకా ఇలా ఏమైనా చెపుతారా?

పద్మావతి: తులసి చెట్టు కూడా అలాంటిదే కదా బాబు! ‘తులసి ఉన్న ఇల్లు ఆరోగ్యానికి పొదరిల్లు’ అని చెప్తారు మన పెద్దలు. ఈ చెట్టు బ్యాక్టీరియా, క్రిమి కీటకాలు దరికి రాకుండా చేస్తుందట. అంటువ్యాధుల్ని అడ్డుకుంటుందని కూడా అంటారు.

సృజన్: అవునాంటీ! తులసి ఆకుల్లోని ‘యుజెనాల్’ వల్లనే ఇవన్నీ జరుగుతాయి. ప్రతి ఇంట్లో ఈ మొక్కను పెట్టుకొని పూజించమని చెప్పారు మన పెద్దవాళ్ళు. వృక్షశాస్త్ర పరిభాషలో దీనిని ‘ఆసిమయ్ శాంక్టమ్’ అంటారు. ఊ.. ఇంకా చెప్పండి చూద్దాం!

విక్కీ:   అన్నయ్యా! నేను చెపుతాను. యాలకులు, లవంగాలు, మిరియాలు, అల్లం, వెల్లుల్లి వంటివి కూడా శరీరానికి ఉపయోగపడతాయి కదా.

సృజన్: అవును. శరీరం ప్రతిరోజూ తన పని తాను చేయాలంటే విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కావాలి. ఇవన్నీ శరీరానికి ఆహారపదార్థాల ద్వారానే సమకూరుతాయి.

సృజన్ చెబుతూ ఉండగానే పద్మావతి మధ్యలో అందుకొని “బాబు, మనం రోజూ తినే అన్నం, పప్పులు, కూరగాయలు, పండ్లు అన్నీ చెట్ల నుంచే లభిస్తున్నాయి. కదా! చెట్లు లేకపోతే మనం ఏమైపోయే వాళ్ళమో” అన్నది.

విక్కీ: అన్నయ్యా! పసుపును సౌందర్య సాధనంగా వాడతారని మా టీచర్ చెప్పారు. ఇంకా ఎందులో వాడతారు అన్నయ్య.

సృజన్: శరీరంలో ఎక్కడైనా వాపులున్నా వాడతారు. ఇంకా కాలిన ప్రదేశాల్లో కూడా రాస్తారు. భారతదేశంలో పసుపుకున్న ప్రాముఖ్యం ఇంక దేనికీ లేదు. మన పండుగలన్నీ కూడా పసుపు ముద్దల తోనే ప్రారంభమవుతాయి.

బామ్మ: మధ్యలో అడ్డం వస్తున్నానని ఏమనుకోకు నాయనా! మా రోజుల్లో ఏ జబ్బుకైనా ఇంట్లోనే వైద్యం చేసుకునేవారు. కడుపులో అజీర్ణంగా ఉంటే శొంఠి కషాయం, వాంతులు అయేలా అనిపిస్తే చింతపండు, జీలకర్ర కలిపి ముద్ద చేసి తినటం, పొట్ట ఉబ్బరంగా ఉంటే ఏదో ఆకుల్ని కాల్చి పట్టు వెయ్యటం, తలనొప్పి వస్తే జామాయిల్ ఆకుల్ని తలకు రుద్దుకోవటం వంటివి ఎన్నో చేసేవారు. అప్పుడు ఈ ఇంగ్లీషు డాక్టర్లు ఎక్కడ ఉన్నారు. ఎవరికి ఏ జబ్బు చేసినా ప్రకృతి మీద ఆధారపడటమే.

పద్మావతి: అత్తయ్యా! ఇంగువను కడుపులో అజీర్ణానికి, గడబిడలకు వాడేవారు. కదూ! కూరల్లో తప్పకుండా ఇంగువను వేసేవారు. పుదీనా ఆకు కూడా ఔషధగుణాలున్నదేనట కదా!

సృజన్: అవునండీ! ఇంకా తేనెను కూడా రకరకాల వ్యాధుల్లో వాడతారు. పంచదారకు బదులుగా తేనెను వాడితే ఫ్యాట్‌ను తగ్గించవచ్చు. చేదుగా ఉండే మందుల్ని మింగలేనపుడు దానికి తేనెను కలుపుకొని తాగుతారు. ఒక విధంగా మీడియేటర్‌గా పని చేస్తుంది. ప్రకృతి నుంచి స్వచ్ఛంగా లభించే చాలా పదార్థాలు మనిషికి ఎంతగానో ఉపయోగపడతాయి.

విక్కీ: అన్నయ్యా! ఇన్ని ఉపయోగాలున్నాయి కానీ ఈ వైద్యం ఎవరైనా చేయించుకుంటారంటావా!

సృజన్: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాలలో 80 శాతం ప్రజలు ప్రాధమిక ఆరోగ్య రక్షణ కొరకు సంప్రదాయ వైద్యాన్నే ఆశ్రయిస్తారు. ప్రకృతి నుంచి తయారైన 2000 మందులను ఇండియన్ మెటీరియా మెడికా గుర్తించింది. ఇందులో 400 మందులు మినరల్స్ మరియు జంతు సంబంధమైనది. మిగతావి అన్నీ చెట్ల నుంచి తీసినవి.

విక్కీ: అన్నయ్యా! మన దేశంలో ఈ ఆయుర్వేద కాలేజీలు ఎన్ని ఉన్నాయి.

సృజన్: విక్కీ! మన దేశంలో ఆయుర్వేద వైద్య కళాశాలలు సుమారు వంద దాకా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. వీటిలో ఎంతో మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

బామ్మ: పిల్లలకు చిన్నప్పుడు మాటలు బాగా రావాలని ‘వస’ పోస్తారు. అది కూడా చెట్టు యొక్క వేరు భాగమే. అలాగే మిరియాలు గొంతులోని గరగర తగ్గడానికి పాలలో వేసుకొని తాగుతారు. పూజా కార్యక్రమాల్లో వాడే తమలపాకు, వక్క, కర్పూరం అన్నీ ఏదో ఒక ఉపయోగం కలిగించేటటువంటివే కదా బాబు!

పద్మావతి: అత్తయ్యా! పిల్లలకు పెద్దలకు అమ్మవారు పోసినపుడు వేపాకులతో వళ్ళంతా రుద్దుతాము కదా! ఇంకా వేపాకును చిన్నచిన్నముద్దలుగా నూరి తినిపించేవారని కూడా చెప్పారు కదూ!

బామ్మ: అవునమ్మా! పూర్వం ఇంటికో వేపచెట్టు ఉండేది. వేపచెట్టులోని ఆకులు, కాయలు, పూలు, కొమ్మలు అన్నీ క్రిమింహారకాలుగా పనిచేస్తాయి. వేపాకుల్ని కాలిస్తే ఆ పొగకు దోమలు రావు. వేపపుల్లలతో పళ్ళు తోముకుంటే నోటిలో ఉండే క్రిములు చనిపోతాయని వాటితోనే తోముకునేవాళ్ళు.

పద్మావతి: బియ్యం బస్తాల్లో వేపాకులు వేస్తే పురుగులు పట్టవు. ఇంకా మనం ఉగాదికి చేసుకునే పచ్చడిలో వేపపువ్వుల్ని వేసుకునేది కూడా అందుకే. కడుపులో ఉండే సూక్ష్మక్రిములు చనిపోవడానికేనట కదా!

సృజన్: వెరీగుడ్! వెరీగుడ్ చూశారా మనం ఆలోచించాలే గానీ ఎన్ని విషయాలు గుర్తొస్తున్నాయో! ప్రకృతిలో దొరికే ఎన్నోమొక్కల్ని మనం మందులుగా వాడుకుంటున్నాం. వేప అంటే ‘అజాడిరాక్టా ఇండికా’ను శతాబ్దాల తరబడి క్రిమిసంహారక మందుగా వాడుతున్నారు.

పద్మావతి: బాబూ! ఉదయాన్నే మనం తాగే కాఫీ కూడా కాఫీగింజల నుండి తీస్తారట. ఇవి కూడా చెట్టులోని భాగాలే కదా!

నిరం: బావుందే! కాఫీ కూడా మందేనా! అదేమైనా జబ్బుకు పనికొస్తుందా. ఏమిటి?

బామ్మ: అది కూడా ఒక విధంగా మందే అనుకోరా అబ్బాయ్! అది ఉదయాన్నే తాగకపోతే చాలా మందికి తలనొప్పి వస్తుంది. నిద్రలేవగానే ఓ కప్పు కాఫీ తాగిన వాళ్ళు ఎంత చురుకుగా పని చేసుకుంటున్నారు.. కాబట్టి అది కూడా మందే అనుకోవాలి.

విక్కీ: మరి ‘నికోటియానా సిల్వెస్టిస్’ అంటే పొగాకు మొక్కలు నుంచి తయారయ్యే చుట్టలు, సిగరెట్లు కూడా ఉత్తేజం కలిగిస్తాయని మా పుస్తకాల్లో ఉన్నది.

పద్మావతి: ఒరేయ్ విక్కీ, పొగాకు వల్ల అనారోగ్యమే గానీ ఆరోగ్యం రాదురా! నువ్వు కాసేపు నోర్మూసుకో! బాబూ ‘కలబంద’ను సౌందర్య సాధనంగా వాడుతున్నారు కదా ఇప్పుడు. అలాగే ఉసిరిక పొడి, మందార ఆకులు జుట్టు బాగా పెరగటానికి నల్లగా నిగనిగలాడటానికి వాడతారు.

నిరం: ‘సృజన్! ‘శతావరి’ అని చెప్తుంటారు కదా! అవేంటి బాబూ!

సృజన్: అంకుల్ ‘శతావరి’ అంటే వృక్ష భాషలో ‘ఆ స్పరాగస్ రెసిమోసస్’. ఈ మొక్క యొక్క వేర్ల నుండి మందును తయారుచేస్తారు. పాలు తక్కువగా ఉన్న బాలింతలకు దీన్ని వాడితే పాలు పడతాయి. దీన్ని చాలా మంది అల్లోపతి వైద్యులు కూడా పేషెంట్లకు సిఫారసు చేస్తున్నారు. మొత్తం మీద స్త్రీలకు సంబంధించిన చాలా వ్యాధులకు ఇది పేరుగాంచిన మందు

విక్కీ: అన్నయ్యా! ‘రావుల్ఫియా సర్సెంటైనా అనే మొక్క ఔషధి మొక్క అని మా సైన్స్ టెక్స్ట్ బుక్స్‌లో ఉన్నది. అది దేనికి పనికొస్తుంది.

సృజన్: చాలా చక్కగా గుర్తుచేశావు విక్కీ. దీనిని ‘సర్పగంధి’ అంటారు. ఈ మొక్క వేళ్ళను ఎండబెట్టి వాటి నుంచి తీసే ‘రిసర్సిన్’ అనే మందును భారతదేశంలో శతాబ్దాల తరబడి బిపికి, జ్వరం, పాముకాటు, మానసిక జబ్బులకు ఔషధంగా ఉపయోగిస్తున్నారు.

నిరం: ‘అశ్వగంధ’ అన్న పేరు కూడా వినిపిస్తుంది తరచుగా! అదేంటి?

సృజన్: ‘అశ్వగంధ’కు ‘విథానియా సోమ్నిఫెరా’ అని బొటానికల్ నేమ్. దీనిని ఆయుర్వేదంలో ‘రసాయన’ అంటారు. అజీర్తి మరియు అనేక రకాలు వ్యాధులకు దీనితో చికిత్స చేస్తారు.

బామ్మ: పూర్వం మాటలు రాని పసి పిల్లలకు సరస్వతి ఆకు అని తినిపించేవారు. దాంతో మాటలు వస్తాయని అనుకునేవారు.

సృజన్: బహుశ ఇది ‘బ్రహ్మి’ అయి ఉంటుంది. దీని పేరు “బాకోపా మొన్నీరీ”. భారతదేశంలో ఏళ్ళ తరబడి దీనిని బ్రెయిన్ టానిక్‌గా వాడుతున్నారు. జ్ఞాపకశక్తికి, ఏకాగ్రతక, చదువుకు మంచి పేరు ఈ మందు.

పద్మావతి: ఎండా కాలంలో దాహర్తిని తీర్చేందుకు ఖర్జూరం, సబ్జా విత్తులు నీళ్ళలో నానబెట్టి తాగుతారు. ఇంకా మెంతులు, శీకాకాయ, పుదీనా, మంచిపత్రి ఎన్నింటినో ఔషధాలుగా వాడుతున్నారు.

బామ్మ: నేనొక విషయం చెప్తానుండండి. రావి చెట్టు స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు మహత్తర ఔషధం. అందుకే ఇంటింటా రావి, వేప చెట్లు ఉండేవి. అలాగే మద్ది చెట్టు ఆకులు గుండె వ్యాధులకు ఉపయోగిస్తారు.

విక్కీ: అన్నయ్యా! ఈ చెట్ల ఆకుల్ని ఇలాగే తినేస్తారా? లేదా ఏదైనా మందుల్లాగా తయారు చేస్తారా?

సృజన్: ఇవి రెండు రకాలుగా తయారుచేస్తారు. ఒకటి ‘బయొలాజికల్లీ డ్రివెన్, రెండు కెమికల్లీ డ్రివెన్.

నిరం: ఆ! ఇప్పుడు గుర్తొచ్చింది. మలేరియాకు ఇంతకు ముందు ఏదో చెట్టు మందు ఇచ్చేవాళ్ళే. నువ్వు చెప్పలేదేమిటి?

సృజన్: ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ‘సింకోనా’ చెట్టు బెరడు నుంచి తీసిన ‘క్వినైన్’ అనే మందునే మొన్న మొన్నటి దాకా మలేరియా వ్యాధి గ్రస్తులకు ఇచ్చేవారు. ఈ మధ్యనే వాటికి వేరే మందుల్ని కూడా కనుగొన్నారు.

పద్మావతి: ఆపరేషన్లకుపయోగించే మత్తు మందులు కూడా చెట్ల నుంచే తయారు చేస్తారట నిజమేనా?

విక్కీ: మత్తు మందులంటే గంజాయి లాంటి మాదకద్రవ్యాలేనా? వాటిని వాడితే పోలీసులు పట్టుకుంటారు కదా?

సృజన్: ‘కన్నాబినస్ సెటైవా’ అనే గంజాయి మొక్కను ఔషధ మొక్కగా గుర్తించారు. వీటి నుంచి టింక్చర్లు, ఆయింట్మెంట్లు తయారు చేసినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. కాని కొన్ని అనైతిక శక్తుల వల్ల ఇవి మాదక ద్రవ్యాలైనాయి.

బామ్మ: పాత కాలంలో నల్లమందని ఏదో చెప్పేవారు. అది తింటే మందకొడిగా అవుతారని చెప్పేవారు.

అంతలో బామ్మ మాటలకు అడ్డోస్తూ విక్కీ “అదేంటే బామ్మా! నల్లమందేంటి? అంటే అది నల్లగా ఉంటుందా” అని అడిగాడు.

పద్మావతి: ‘ఉండరా నువ్వు! అన్నింటికీ అడ్డం రాకు. అన్నయ్యను చెప్పనీయి!’ అని సృజన్ వైపు తిరిగి ‘నువ్వు చెప్పు బాబూ!’ అన్నది.

సృజన్: అవునండీ! నల్లమందు చెట్టు అని ఒకటి ఉంటుంది. ఇది మత్తు పదార్థం. 1804వ సంవత్సరంలో మొదటిసారిగా నల్లమందు అనే ‘ఓపియమ్ పాపీ’ మొక్క నుంచి ‘మార్ఫిన్’ అనే యాక్టివ్ ఆల్కలాయడ్‌ను వెలికి తీశారు. ఈ ‘మార్ఫిన్’ను వైద్యులు శస్త్ర చికిత్సల్లో రోగులకు మత్తును కలిగించటానికి ఉపయోగిస్తారు. ఓపియమ్ చెట్టు యొక్క గింజలతో మార్ఫిన్, కోడీన్ వంటి ఎన్నో మందుల్ని తయారు చేస్తారు.

విక్కీ: బావుంది బావుంది! ఇంకా ఏమేమి చెట్లు ఔషధాలుగా పనికొస్తాయో చెప్పు అన్నయ్యా!

సృజన్: ‘పసిఫిక్ వ్యూ’ అనే చెట్టు యొక్క బెరడు నుంచి ‘టాక్సాల్’ను తయారు చేస్తారు. మొదట్లో చెట్ల భాగాలను వ్యాధులకు ప్రత్యక్షంగా వాడేవారు. కానీ సైన్స్ మరియు టెక్నాలజీ పెరిగిన తర్వాత మందుగా పని చేస్తున్న ఆయా భాగాల్లోని ఏ పదార్థము అలా పని చేస్తుందో కనుక్కోసాగారు. అది శరీరంలో ఏ రసాయన క్రియలు జరుపుతుందో తెలుసుకోగలిగారు.

విక్కీ: అన్నయ్యా! నేను చెట్ల గురించి చెప్పమంటే నువ్వు అవెలా తయారు చేస్తారో చెబుతున్నావేంటి? త్వరగా చెప్పు. నాకు బాగా ఆకలి వేస్తోంది.

నిరం: ఏంట్రా విక్కీ! అలాగేనా మాట్లాడేది. నీకెప్పుడూ ఆకలే. ఆ అబ్బాయి మన గురించి అన్ని విషయాలు వివరంగా చెబుతుంటే చక్కగా వినక మధ్యలో పిచ్చి ప్రశ్నలేంటి?

సృజన్: పర్వాలేదంకుల్. విక్కీ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉన్నాడు. నేను కూడా కాలేజీలో చేరిన కొత్తలో క్లాసులో ప్రొఫెసర్స్ చెప్తుంటే ఇంకా తెలుసుకోవాలన్పించేది. కానీ ప్రతిదీ వాళ్ళనడగలేం కదా! అందుకే హాస్టల్లో సీనియర్ల నడిగి చాలా విషయ పరిజ్ఞానం పెంచుకున్నాను.

పద్మావతి:  వాడి గొడవలేంటిలే బాబూ! నువ్వు చెప్పు ఇంకా ఏమేం చెట్టున్నాయో!

సృజన్: ‘పసిఫిక్ వ్యూ’ అనే చెట్టు బెరడు నుంచి ‘టాక్సల్’ ను వేరు చేసి మందులో ఉపయోగిస్తారని చెప్పాను కదా!

విక్కీ: ‘పసిఫిక్ వ్యూ’ కు బొటానికల్ నేమ్ చెప్పన్నయ్యా?

సృజన్: దీని బొటానికల్ నేమ్ ‘టాక్సస్ బ్రెవిఫోలియా’. దీనిని బ్రెస్ట్ క్యాన్సర్ మరియు లంగ్, ఒవేరియన్ డిసీజ్ లకు ఉపయోగిస్తారు. ఇంకా చైనా సంప్రదాయ మొక్క అయిన ‘ఆర్టిమీసియా యాన్యుయా’ మొక్క ఆకులు నుండి ‘ఆర్టిమిసినిన్’ అనే మందును తయారు చేస్తారు.

విక్కీ: ఈ మందు ఏఏ జబ్బులకు ఉపయోగపడుతుంది?

సృజన్: ఇది మలేరియాను తగ్గిస్తుంది. ఇంకా ‘కోలియస్ ఫోర్స్లో కోహ్లి’ అనే మొక్క చాలా పురాతన ఆయుర్వేద మొక్క. దీని వేళ్ళ నుంచి ‘ఫోర్స్ కోలిన్’ అనే మందును తయారు చేస్తారు. దీనిని ఎలర్జీ, శ్వాస సంబంధ వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, గ్లకోమా, సోరియాసిస్, హైపోథైరాయిడిజమ్ లతో పాటు బరువు తగ్గడానికి కూడా ఉపయోగిస్తారు.

విక్కీ:  అమ్మో! ఈ మందు ఇన్ని జబ్బుల్ని తగ్గిస్తుందా! చాలా బావుందే! ఇంకా చెప్పు! ఇంకా చెప్పు! సృజన్:        ‘సిలిబమ్ మేరియానమ్” అనే మొక్క విత్తనాలు ఔషధంగా ఉపయోగ పడతాయి. దీనిని కాలేయ సంబంధ వ్యాధులకు మందుగా వాడతారు.

విక్కీ:   దీంట్లో మందు పేరు చెప్పలేదు. విత్తనాల నుంచి తీసే మందును ఏమంటారో చెప్పు?

సృజన్: ఈ మందును ‘సిలిమారిన్’ అంటారు. ‘పికోరైజా కురావా’ అనే మొక్క వేళ్ళు, దుంపలు నుండి వెలికితీసే ‘పికోలివ్’ హెపటో ప్రొటెక్టివ్ ఏజెంట్‌గా పని చేస్తుంది.

నిరం: ప్రకృతిలో దొరికే ఔషధాలు అంటే కేవలం చెట్లు మొక్కలేనా లేక ఇంకా వేటినైనా ఉపయోగిస్తారా?

సృజన్: ప్రకృతిలో నేల మీద పెరిగే చెట్లే కాకుండా ఇంకా ఇతర జీవరాసులయిన ఆల్గే, ఫంగి, స్పాంజెస్, మలస్క్‌ల వంటి మైక్రో ఆర్గానిజమ్స్‌ని కూడా మందులుగా వాడతారు.

విక్కీ: కేవలం చిన్న చిన్న అనారోగ్యాలకేనా లేక యాంటీబయాటిక్స్ కూడా తయారు చేస్తారా ప్రకృతి ఉత్పత్తులతో?

సృజన్: విక్కీ మొదటగా పెన్సిలిన్ గురించి ఏమేం తెలుసు చెప్పు!

నిరం: పెన్సిలిన్ గురించి తెలియకపోవటమేంటి బాబూ! మా చిన్నతనం నుంచి ప్రమాదకరమైన ఇన్‌ఫెక్షన్లన్నింటికీ ఈ ఇంజక్షనే వాడేవాళ్ళు. పెన్సిలిన్ లేక పూర్వం ఎంతో మంది జబ్బులతో చనిపోయేవారట. ఇది కూడా అందరికీ పడదు. అందుకే ముందుగా టెస్ట్ డోస్ ఇచ్చి ఆ తరువాత ఇంజక్షన్ ఇచ్చేవాళ్ళు.

విక్కీ: ఉండు నాన్నా! అన్నయ్య నన్నడిగితే నువ్వు సమాధానం చెబుతావేంటి. పెన్సిలిన్‌ను ‘అలెగ్జాండర్ ఫ్లెమింగ్’ 1928వ సంవత్సరంలో కనిపెట్టాడు. ‘పెనిసిలియమ్’ అనే శిలీంధ్రాల నుంచి ఈ పెన్సిలిన్‌ను కనుగొన్నారు. ‘స్టెఫలో కోకస్’ సూక్ష్మజీవులు కలిగించే జబ్బుల్ని నివారించడానికి దీనిని ఉపయోగిస్తారు. ఇంకా.. ఇంక నాకు తెలిసింది ఇంతే. మిగతాది నువ్వు చెప్పు అన్నయ్యా.

సృజన్: చాలా కరెక్ట్‌గా చెప్పావు విక్కీ! నీకు చాలా విషయాలు తెలుసు. ‘స్టెఫలోకోకస్’తో పాటు ‘స్ట్రెప్టో కోకై’ సూక్ష్యజీవులు కలిగించే వ్యాధులతో పాటు సిఫిలిస్ వంటి ప్రమాదకర వ్యాధులకు కూడా దీనిని వాడతారు. పెన్సిలిన్లు అన్ని బీటాలాక్టమ్ యాంటీ బయాటిక్స్, గ్రామ్ పాజిటివ్ ఆర్గానిజమ్స్ కలిగించే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అన్నింటినీ ఇవి తగ్గిస్తాయి.

నిరం: బాబూ! పెన్సిలిన్‌తో పాటు ‘టెట్రాసైక్లిన్’ అని వాడే వాళ్ళు ఇంతకు పూర్వం, అది కూడా పెన్సిలిన్ లాంటిదేనా లేక మొక్కల నుంచి తీస్తారా?

సృజన్: మొక్కల నుంచి కాదంకుల్! బాక్టీరియా నుంచే తయారుచేస్తారు. ‘స్ట్రెప్టోమైసిన్ గ్రీసియస్’ నుంచి ‘స్ట్రెప్టోమైసిన్’, ‘స్ట్రెప్టోమైసిస్ ఫ్రాండిమే’ నుంచి నియోమైసిన్, ఇంకా స్ట్రెప్టోమైసిస్ లోని ఇతర జాతుల నుంచి ‘టెట్రాసైక్లిన్’ అనే మందుల్ని ఉత్పత్తి చేస్తారు.

పద్మావతి: అప్పుడు కనిపెట్టిన మందులేనా? మళ్ళీ మళ్ళీ కొత్తవి కనిపెడుతుంటారా?

సృజన్: ఎప్పుడూ మొక్కల మీద పరిశోధన జరుగుతూనే ఉంటుందంటి. కొత్త కొత్త మందులు ఎప్పటి కప్పుడు కనిపెడుతూనే ఉంటారు.

నిరం: చాలా విలువైన విషయాలు చెప్పావు బాబూ! ప్రకృతిలో ఇన్ని ఔషధమొక్కలున్నాయని ఈరోజే తెలుసుకున్నాను. నేను మా అమ్మాయిని కూడా ఈ ఆయుర్వేద వైద్యంలోనే చేరుస్తాను.

సృజన్: చాలా సంతోషం అంకుల్! ప్రకృతి ఉత్పత్తులతో తయారైన మందులు మంచి ఫలితాలతో పాటు సైడ్ ఎఫెక్ట్‌లు లేకుండా కాపాడతాయి. ఇవి ఇతర వైద్య విధానాలకు గట్టి పోటీనే ఇస్తోంది.

పద్మావతి: మొక్కల ఔషధాలు ప్రమాద రహితమైనవని కూడా అంటారు. చాలా థాంక్స్ బాబూ! ఎన్నో మంచి విషయాలు చెప్పి మాకు మంచి అవగాహన కల్పించావు.

సృజన్: నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పాను. వెళ్ళొస్తానండీ. ఇంకేమైనా డౌట్సు ఉంటే ఫోన్ చేయండి. బై విక్కీ. అందరికీ నమస్కారమండీ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here