ప్రమీలోపాఖ్యానం!!

0
15

[శ్రీ సముద్రాల హరికృష్ణ రాసిన ‘ప్రమీలోపాఖ్యానం!!’ అనే గల్పికని పాఠకులకు అందిస్తున్నాము.]

“ఏమైనా రిప్లై వచ్చిందా వాళ్ళ దగ్గర నుంచి?” – ఆత్రం, నిర్లిప్తతా రెండూ కలిసిన స్వరంతో అడిగింది రమ, ఆఫీసు నుంచి వచ్చిన భర్త రామారావుని.

ఆత్రం-నాలుగైదేళ్ళ నుంచీ చూస్తున్నా కుదరని కొడుకు వంశీ పెళ్ళి యత్నం, ఇప్పుడైనా ఒక మంచి మలుపు తీసుకుంటుందేమోననీ; నిర్లిప్తత- ఎన్ని చూశాం ఇట్లాంటివి, ఇదీ ఆ బాపతేలే అన్న దాని నుంచీ!

రామారావు విసుగ్గా, “ఆఁ ఇచ్చారు! దానితో పాటు నీకూ నాకూ ఓ నోటీసు కూడా ఇచ్చారు. అందులోని షరతులు మనం పూర్తి చేయగలిగితే నోరెత్తమన్నారు. లేదో- ఇదే ఆఖరి మెసేజట ఈ విషయంలో”, అన్నాడు అక్కసుగా!

“నోటీసు ఏంటండీ, వివరంగా చెప్పండి నాకర్థమయ్యేట్టు” అన్నది రమ, అటు నుంచి జవాబు రావటంతో, కాస్త ఆశ చిగురించి!

“ఇదిగో నువ్వే చదువుకో తీరిగ్గా”, అని తన మొబైల్ ఆమె చేతికిచ్చి స్నానానికి వెళ్ళిపోయాడు, రావు!

***

“అదేంటండీ అంత నిక్కచ్చిగా, ఏదో వ్యాపారంలో అగ్రిమెంట్లు రాసుకున్నట్టు – ఇంతకైతే ఇస్తాం, రూపాయి కూడా తగ్గేది లేదన్న ధోరణిలో! కలుపుకుంటోంది, మనుషులతో సంబంధమా, లేక కొత్త ఆస్తుల జమా?! విచిత్రంగా తయారవుతోందే పోకడ రానురానూ!”–

భోజనాలైన తరువాత వాళ్ళు పంపిన తాఖీదు అంతా చదివిన రమ, టీవిలో న్యూస్ చూస్తున్న భర్తతో పంచుకోవటం మొదలెట్టింది, తన వ్యథ!

కిమ్మనకుండా వింటున్నాడు, రామారావు!

రమ మళ్ళీ అందుకుంది తన చదివింపులు, అవుతారో కాదో తెలియని వియ్యాలవారికి!

“ఏదో ఒక మెట్రో నగరంలో విలువ కోటిన్నరకి తగ్గకుండా ఫ్లాటైనా ఉండాలా?! సొంతిల్లైతే ఇంకా బెటరా?! నయం, మైసూరు ప్యాలెస్ కావాలీ అనలేదు! పెళ్ళిలో కనీస పక్షం 10 తులాల బంగారం అమ్మాయి ఒంటి మీదకి కొనాలా?! ఆ బరువు ఆమె, ఆ అరువు తళతళ మేమూ తట్టుకోగలమో లేదో చూసుకోవద్దూ! సెడాన్ తప్పనిసరిగా ఉండాలా?! ఎక్కడికి ఊరేగాలనో ఈ ట్రాఫిక్ జామ్‌ల పద్మవ్యూహపు ఊళ్ళలో! ఆ ప్రదేశంలో అకాల వర్షాల వల్ల విరమించుకున్నాం కానీ, లేకపోతే డెస్టినేషన్ మ్యారేజే కొండపైన గుళ్ళో! -ఈ మేరకు మీరదృష్టవంతులు- అని తోక మాటొకటా!? డెస్టినేషన్ మ్యారేజీ,.. హుఁ! కృష్ణా బ్యారేజీ మీద నుంచి దూకి..” ఎందుకులే పూర్తి చేయటం అశుభం అని తమాయించుకుంది!

“ఎవరైనా, తమ పిల్ల కలకాలం సుఖంగా ఉంటుందా ఈ కుటుంబంతో అని చూస్తారు కానీ ఈ సంతేంటండీ, ప్రతీది డబ్బుతో,ఆర్భాటంతో ముడిపెడ్తూ?!”

“తట్టుకోలేక, నేనిన్ని అంటూంటే మీరేం అనరేఁ?!”, అని భర్తను కదిపింది, ‘మీకు చీమ కుట్టినట్టైనా లేదా’ అన్న వైనంలో, కుదిపింది!

“నేను చదివేగా నీకిచ్చాను, చివరి వరకూ చదువూ!”, అన్నాడు రావు కూల్‌గా!

“పెళ్ళికి సుమారు వెయ్యి మంది వస్తారు మా బంధుమిత్రులు, ప్రతి ఒక్కరినీ మమ్మల్ని చూసినంత మర్యాదగా చూసి, నవకాయ పిండివంటలతో బ్రహ్మాండమైన భోజనాలు ఏర్పాటు చేయాలి.

షరా: క్యాటరింగు ఏర్పాటు చేయరాదు.

మేం సంప్రదాయం పాటించేవాళ్ళం, అరిటాకుల్లో శుచిగా వడ్డించాలి.”

‘గొప్ప భోజన సంప్రదాయవాదులే, సంతోషించాం!’

“పెళ్ళిలో మ్యూజిక్ కార్యక్రమం పెట్టమని మేం అంత పట్టు పట్టము. అది మీ ఇష్టానికి, మీ కళాప్రీతికే వదిలేస్తాము!”

‘ఆహాహా, ఏమి ఔదార్యం మహాతల్లీ!’

డబ్బు విషయాలన్నీ అణా పైసలతో సహా ,మేమేదో అప్పున్నట్టు వివరంగా చెప్పి,ఇక్కడేదో మాఫీ ప్రకటిస్తున్నారు మాఫీ!

“‘కళాప్రీతి’ట, ఈ మనుషులకు అదొక్కటే తక్కువ!”

“పెళ్ళి తరువాత మా అమ్మాయి తెచ్చే జీతం మొత్తం మాకే ఇస్తుంది. అమ్మాయి ప్రేమగా మా కోసం చేసే ఈ పనిని, మీరు గానీ మీ అబ్బాయి గానీ ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోరాదు!

అట్లా చేస్తే, అది మా హక్కులకు భంగం కలిగించినట్లే మేము భావించాల్సి వస్తుందీ, పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుంది!

అమ్మాయి ఖర్చులు సమస్తం అబ్బాయే భరించాలి.

చివరిదీ అతి ముఖ్యమైనదీ:-

అమ్మాయీ, అబ్బాయి ఉండే ఆ ఇంట్లో, పాత సామానేమీ ఉండటానికి వీల్లేదు. ఈ విషయం మా ఆవిడ, మా అమ్మాయీ మరీ ప్రత్యేకంగా చెప్పమన్నారు!”

అన్నీ చదివి రమ మళ్ళీ అడిగింది భర్తను –

“పైవన్నీ సరే, ఈ చివరిదేంటండీ, ఆయన రాశాడూ!? కాస్త వివరించి చెప్పండి..”

రామారావు ఓపిగ్గా చెప్పాడు:

“అంటే పెళ్ళి అయిపోగానే, అబ్బాయిని వాళ్ళకు అప్పగించేసి, వాళ్ళిద్దరూ ఇక్కడే ఉంటే మనం బయటకు విడిగా కాపురం వెళ్ళిపోవాలి. వాళ్ళు వేరే ఇంటికి వెళ్తే, మనం వాళ్ళతో కలిసి వెళ్ళకూడదు, ఉండకూడదు. ఆ అమ్మాయి అంటూన్న, ఆయన వత్తాసు పలుకుతూన్న ‘పాత సామాను’ మనమేనని ఆ పలుకులకు అర్థమూ, పరమార్థమూ! బోధపడ్డదిగా!”

“ఆఁ చక్కగా–అక్షరం, అక్షరమూ బోధపడ్డది. వాళ్ళ డిమాండ్ల సారాంశం! మనం పాత అయితే, అమ్మాయి తల్లిదండ్రు లేమౌతారో, నవదంపతులా?! ఇప్పుడే చెప్పేయండి, మా కిష్టం లేదు అని, ఖండితంగా!

ఆ మాత్రం చేయలేకా, తూగలేకా కాదు, వాళ్ళ పద్ధతి ససేమిరా నచ్చక, కాదంటున్నాను. మరీ చేటు కాలం కాకపోతే, ఆ అమ్మాయి తల్లిదండ్రులకి ఉండనక్కర్లేదండీ, ఇట్లా రాయడానికీ?!”

***

రమ కోపంగా లేచి వెళ్ళబోతుంటే, అబ్ఫాయి వంశీ తన రూమ్ లోంచి అటుగా వచ్చాడు, “ఏంటమ్మా కబుర్లు”, అంటూ!

“ఏమీ లేదు నాయనా, మీరందరూ ఎట్లాగో గడ్డాలు పెంచుతూనే ఉన్నారు. ఏ మఠమో చూసుకోండిక సరిపోతుంది! అంతా ప్రమీలా రాజ్యమై పోతోంది మరీనూ” అని విసవిసా వెళ్ళిపోయింది, తాళి కట్టే భాగ్యం ఉందో లేదో తెలియని పెళ్ళి కాని పిల్లవాడి తల్లి, రమాదేవి!

***

ఇంకో ఆడపెళ్ళివారు నో అన్నారనో, అతి క్లిష్టమైన కండిషన్లు పెట్టారనో అర్థమైపోయింది, ఆ 32 ఏళ్ళ కుర్రాడికి, గత నాలుగైదేళ్ళ వధువుల అన్వేషణానుభవం వల్ల!

తండ్రి చేతి లోంచి రిమోట్ తీసుకుని ఛానెల్ మార్చాడతను.

అక్కడ వివాహ వేదిక వారి స్పాన్సర్డ్ కార్యక్రమం వస్తోంది, తరి తీపి మాటలతో!

ప్రయత్నం వదలకుండా పట్టుబట్టిన వరులు, ఎట్లా ఈ పెళ్ళి కూతుళ్ళ అన్వేషణా పరీక్షలో పాసయ్యారో, మోటివేషనల్ లెక్చరిస్తున్నా డొకాయన బట్టతలతో!

టీవీ కట్టేసి వెళ్ళిపోయాడు వంశీ laptop వైపు మళ్ళీ!

తండ్రి రామారావు ఆలోచనలో పడిపోయాడు, ‘మా అబ్బాయికి పెళ్ళి ఎప్పటికి కుదురుతుందో?!’ అని కించిత్ బెంగతో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here