ప్రాంతీయ దర్శనం -10: ఛత్తీస్‌ఘరీ సినిమా – నేడు

0
9

[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా ఛత్తీస్‌ఘరీ సినిమా ‘రంగ్ రసియా’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘రంగ్ రసియా’

ఛత్తీస్‌ఘరీ సినిమాలు కూడా నేడు మాస్ కమర్షియల్స్‌గా విజృంబిస్తున్నాయి. చాలీవుడ్ పేరుతో రాజధాని రాయ్‌పూర్‌లో  నెలకొల్పిన సినిమా పరిశ్రమ యావత్తూ కాపీ కుటీర పరిశ్రమగా వర్ధిల్లుతోంది. హిందీ, తెలుగు, తమిళ సినిమాలనే అటు ఇటు మార్చి తీసేస్తున్నారు. ఇవే హిట్టవుతున్నాయి. ఈ సినిమాల్ని చూస్తే  హిందీ, తెలుగు, తమిళ సినిమాలతో కనీసం పదిహేనేళ్ళు వెనకబడినట్టు తెలిసిపోతుంది. ఇలాటి సినిమాలు హిందీ, తెలుగు, తమిళంలలో కాలం చెల్లిపోయి చాలా కాలమైంది. కమర్షియల్ సినిమాల్లో ప్రాంతీయ కమర్షియల్ సినిమాలు కూడా వుంటాయనీ, అవి ఇలాగే వుంటాయనీ తీసి మరీ చూపిస్తున్నారు. హిందీ లోకి డబ్ అయి ఛానెళ్ళలో ప్రసారమవుతున్న తెలుగు, తమిళ సినిమాలకి హిందీ రాష్ట్రాల్లో ప్రేక్షకులు బాగా అలవాటు పడ్డారు. ఎన్టీఆర్ నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’ని  ‘సుల్తాన్ – 2’గా టీవీలో ఎంజాయ్ చేస్తారు, రవితేజ నటించిన ‘బలుపు’ని ‘జానీ దుష్మన్’గా ఎంజాయ్ చేస్తారు. ఇలా వాళ్లకి మాస్ ఎంటర్‌టైనర్లకి కొదవే లేదు. ఈ డబ్బింగ్ సినిమాలతో కూడా పోటీపడాలన్నట్టు ఛత్తీస్‌ఘరీ సినిమాలు మూస ఫార్ములాలతో మురిపిస్తునాయి.

ఇలా మోజుపడి  కాపీ కొట్టిందే  ‘రంగ్ రసియా – ది జంటిల్మన్’. 1992లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మోహన్ బాబు, మీనా, రమ్యకృష్ణలు నటించిన సూపర్ హిట్ ‘అల్లరి మొగుడు’ని కొన్ని మార్పులు చేసి దించేశారు. 2017 జులైలో ‘రంగ్ రసియా’గా విడుదల చేసి హిట్ చేసుకున్నారు. విడుదల రోజు థియేటర్‌కి వచ్చిన ఈ సినిమా బృందంలో కథా  రచయిత అశోక్ తివారీ, తాను ఎంతో కష్టపడి ఈ హిట్ కథ రాశానని, రెండు పాటలు కూడా రాశానని టీవీ మైకులకి చెప్పాడు. ఎంతో కష్టపడి కాపీ చేశాడని ఛత్తీస్‌ఘర్ వాసులకి తెలీదు పాపం. దీన్నిబట్టి  ఇప్పటి ఛత్తీస్‌ఘరీ సినిమాలు  పదిహేనేళ్ళు వెనుకబడి ఎందుకు వుంటున్నాయో అర్థం జేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో వస్తున్న తెలుగు, తమిళ సినిమాలు హిందీలోకి డబ్బింగ్ అయిపోతున్నాయి. కాబట్టి కాపీ చేసుకోవడానికి ఇంకా ముందుకాలం పాత సినిమాల మీద తమ ప్రాంతీయ కన్నేస్తున్నారు.

‘రంగ్ రసియా – ది జంటిల్మన్’ని దర్శకుడు పుష్పేంద్ర సిన్హా తీశాడు. చాలీవుడ్ పాపులర్ యంగ్ స్టార్ అనూజ్ శర్మ హీరోగా నటిస్తే, లేజ్లీ, మీరా త్రిపాఠీలు హీరోయిన్లుగా నటించారు. సునీల్ సోనీ సంగీత మిస్తే, దినేష్  ఠక్కర్ ఛాయాగ్రహణం సమకూర్చాడు.

చుట్టుపక్కల గ్రామాల్లో మ్యూజికల్  ప్రోగ్రాములిచ్చే భోలా రసియా (అనూజ్ శర్మ) తల్లితో కలిసి ఓ గ్రామంలో వుంటాడు. అతనిచ్చే ప్రోగ్రాములు పాశ్చాత్య సంగీతం. ఒకరోజు ఏజెంట్ ఇలా కాదని ఒక మాటంటాడు – ఇలాటి పనికిరాని పాటలు పాడేకంటే, మన ఛత్తీస్‌ఘర్ సంస్కృతిని చాటే సంగీతం నేర్చుకుని దేశ విదేశాల్లో ప్రదర్శనలిస్తే ఎక్కడికో… వెళ్లిపోతావని. దీంతో తీవ్ర సంఘర్షణకి లోనైన భోలా తల్లికి చెప్పుకుంటాడు. ఆమె ప్రోత్సహించి, వూళ్లోనే హరిలాల్ శాస్త్రి దగ్గర సంగీతం నేర్చుకొమ్మని పంపిస్తుంది. అక్కడి కెళ్ళిన భోలా, హరిలాల్ అందమైన కూతురు పార్వతి (లేజ్లీ) ని చూడగానే ప్రేమలో పడిపోతాడు.

ఆమె తండ్రి దగ్గర సంగీతం నేర్చుకుంటూ ఇటు ప్రేమాయణం మొదలెట్టి ఆమెని ప్రేమించేలా చేసుకుంటాడు. పెద్దలు పెళ్లి చేస్తారు. నెల తప్పుతుంది. భోలా ఒక ప్రోగ్రాం ఇవ్వడానికి వూరెళ్తాడు. ఈ అవకాశం చూసుకుని వీరూ అనే వాడొస్తాడు. ఇతను హరీలాల్ బృందంలో వాద్యకారుడే. హరిలాల్ కూతుర్ని తను ప్రేమిస్తూంటే, భోలా అడ్డొచ్చి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆమెని ఇప్పుడు ఎత్తుకెళ్ళి పోతాడు. అత్యాచారం చేయబోతూంటే, నదిలోకి దూకేస్తుంది. ఆమె భర్త భోలా వేధింపులు తట్టుకోలేకే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రికి చెప్తాడు. ఆ తండ్రి గుండాగి చనిపోతాడు. తండ్రీ కూతుళ్ళు కొట్లాడుకుని ప్రాణాలు తీసుకున్నారని వీరూ వెళ్లి భోలా తల్లికి చెప్తాడు. ప్రోగ్రాం నుంచి తిరిగి వచ్చిన భోలా ఇది నమ్మి, ఇక ప్రోగ్రాములు చెయ్యనంటాడు. సంగీతం మీద మక్కువే ఇంత విషాదానికి దారి తీయిస్తే, ఇక ఈ  సంగీతమే వద్దంటాడు. తల్లి నచ్చజెప్తే రాయ్‌పూర్ బయల్దేరతాడు.

రాయపూర్‌లో లోలా సింగ్ అనే ఇంకో హరిలాల్ శిష్యుడితో రోడ్డుమీద ప్రదర్శన ఇస్తూంటే, నీనా (మీరా త్రిపాఠీ) అనే రిచ్ అమ్మాయి అతడి టాలెంట్ ని పసిగట్టి తండ్రి దగ్గరికి తీసికెళ్తుంది.  సీడీ కింగ్ అయిన ఆమె తండ్రి మోహన్ లాల్ సింఘ్రానీ, భోలాకి తన కంపెనీలో పాడే  అవకాశమిస్తాడు. ఇక్కడ్నుంచీ నైనాతో భోలాకి ఇంకో ప్రేమాయణం మొదలవుతుంది…

భార్య చనిపోయిన విషాదంతో రాయ్‌పూర్ వచ్చిన భోలా,  వెంటనే రోడ్డు మీద ‘బియ్యే పాస్ బీబీ హామార్ హో – మై గావార్ హోరే భయ్యా’ అని పాటందుకుని డాన్సు వేయడం విచిత్రమన్పిస్తుంది. యంగ్ స్టార్ అనూజ్ శర్మ అల్లరి పాత్రగా మాస్‌కి కావాల్సిన అన్ని మసాలాలూ మేళవించి కామెడీ – రోమాన్స్ – ఫైట్స్ – డాన్సులతో అలరిస్తాడు. ఇద్దరు హీరోయిన్లూ డిటో. తమ భాషలో తమ నటీనటులు ఒక బాలీవుడ్ మూవీ చూపిస్తూంటే ఇంతకంటే ఏం కావాలి. ఇది తెలుగుకి పక్కా కాపీ అని తెలిసినా ఫర్వాలేదు.

అయితే కాపీ చేసినా దర్శకత్వం,  నటనలూ నీటుగా వున్నాయి. లొకేషన్స్ బావున్నాయి. ఇంత తక్కువ బడ్జెట్లో నిర్మాణ విలువలు కూడా బావున్నాయి. టెక్నాలజీలో మార్పు వచ్చింది, విషయం మాత్రం పదిహేనేళ్ళు దాటి ముందుకు రావడం లేదు. అవే మూస ప్రేమ, కామెడీ, యాక్షన్ సినిమాలు తిప్పితిప్పి తీస్తున్నారు. వాస్తవిక సినిమాలున్న రోజుల్లో వివిధ కథావస్తువులు తెరకెక్కేవి. కమర్షియల్ సినిమాలుగా మారిపోయాక అవే కథలు. మళ్ళీ వీటిలో తమ సంస్కృతి గురించిన ఆదుర్దా. తమ సంస్కృతిని చూపించడానికి వేరే సంస్కృతులతో వచ్చే పరభాషా సినిమాలని కొట్టి, అందులో తమ సంస్కృతిని ఎలా చాటుకుంటారో అర్థంగాదు. అయితే ఈ మాస్ కమర్షియల్స్ హోరులో ఒకటీ అరా వాస్తవిక సినిమాలు కూడా వస్తున్నాయి గానీ వాటికి ఆదరణ లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here