ప్రాంతీయ దర్శనం -12: కొంకణి సినిమా – నేడు

0
9

[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా కొంకణి సినిమా ‘జూజే’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘జూజే’

[dropcap]గో[/dropcap]వా అంటే విదేశీ టూరిస్టుల స్వర్గమే కానీ స్వదేశీ బానిసల నరకం కూడా. ఇది నాణేన్ని రెండో వైపు తిప్పి చూస్తే కనిపించే వాస్తవం. పేదరికంతో అల్లాడే పల్లెలు, పీడించే దొరలూ. అలాటి పేదరికం లోంచే వచ్చిన దర్శకుడు మిరాంషా నాయక్, ఆ పీడనల్ని ప్రపంచం ముందుంచే ప్రయత్నంతో అంతర్జాతీయ ఖ్యాతినార్జించాడు. భారతీయ వాస్తవిక సినిమాలంటే దేశాన్ని దయనీయంగా చూపించి, ఇక్కడ దరిద్రమే వుంటుందని ఒక నెగెటివ్ ఇమేజిని సృష్టిస్తున్నాయని ఎప్పట్నించో ఆరోపణ వుంది. దీన్ని పరాకాష్టకి తీసికెళ్ళిన  డానీ బాయల్ అనే బ్రిటిష్ దర్శకుడు ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ తీసి ఏకంగా ఆస్కార్ అవార్డులే సొంతం చేసుకున్నాడు. ఇలా అంతర్జాతీయ అవార్డులివ్వడంలో కుట్రేమైనా వుందేమో తెలీదుగానీ, ఇలా అవార్డులిస్తున్నారు కదాని ఇండియాని ఇలా చూపిస్తూ సినిమాలు తీసేవాళ్ళు ఇప్పటి తరంలోనూ ఫ్యాషనబుల్‌గా, ట్రెండీగా ముందుంటున్నారు. ఇదొక ఖర్మ. విచిత్రమేమిటంటే, 1980లలో ఆర్ట్ సినిమాల టాప్ నటుడు నసీరుద్దీన్ షా, గోవాని డ్రగ్ స్మగ్లర్ల స్వర్గధామంగా చూపిస్తూ, కలర్‌ఫుల్ కమర్షియల్ బాలీవుడ్ హిట్ ‘జల్వా’ లో జల్సా రాయుడిగా నటించేశాడు!

‘జూజే’ నిర్మాతల్లో, సాంకేతికుల్లో ఇండియాతో పాటు ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌కి చెందిన వాళ్ళూ వున్నారు. ఇది వలస కూలీలూ, వాళ్ళని పీడించే ఫ్యూడల్ యజమానీ కథ. కథాకాలం 1990 లలో. అయితే అసాధారణంగా దీని టైటిల్ హీరో మీద కాకుండా, విలన్ మీద వుంది. కమర్షియల్ సినిమాలు తీసేవాళ్ళకి ఇదొక ఇన్‌స్పిరేషన్ – విలన్ మీద టైటిల్ పెట్టి సినిమా తీయడం.

 

బొరిమోల్ అనే గ్రామంలో సంతోష్ (రిషికేశ్ నాయక్) అనే బడి కెళ్ళే తెలివైన టీనేజి కుర్రాడు ఇల్లు గడవడానికి బడి మానేసి కూలి పనులకి వెళ్ళాల్సి వస్తుంది. వలస కూలీలతో కలిసి ఇరుకు షెడ్ లలో వుండాల్సి వస్తుంది. ఇతడికో నానమ్మ (ప్రశాంతీ తల్పంకర్) వుంటుంది. ఏమాత్రం ప్రేమానురాగాలు లేని ఈమె వాడి లేత మనసులో నైరాశ్యాన్ని నూరిపోస్తూంటుంది. ఈ షెడ్ లున్న మురికి వాడ జూజే (సుధేష్ భీసే) అనే భూస్వామి ఆధీనంలో వుంటుంది. వలస కూలీలకి కూలి పనులిప్పిస్తూ అద్దెలు భారీగా వసూలు చేస్తూంటాడు. ఇతనంటే కూలీలకి పీకలదాకా కోపముంటుంది. కానీ ఏమీ చేయలేకపోతారు. పొట్ట కూటికోసం వాళ్ళ నిస్సహాయత మరింత మరింతగా వాళ్ళని చీకటి కూపంలోకి నెట్టేస్తూ వుంటుంది.

సంతోష్ మీద అదనపు బాధ్యత కూడా వేస్తాడు జూజే. తెలివైన విద్యార్థి అయిన సంతోష్, జూజే కొడుక్కి చదువు కూడా నేర్పాలి ఉచితంగా. ఇంకా ఇంటి పనులు చేయాలి. జూజేకి తెలియని ఇంకో వ్యవహారముంటుంది. కోరికలు తీర్చుకోవడానికి అతడి భార్య (గౌరీ కామత్) రహస్యంగా సంతోష్‌ని వాడుకుంటుంది. మరోవైపు సంతోష్‌కి క్లాస్ మేట్ మాయా (బర్ఖా నాయక్) తో వొత్తిళ్లుంటాయి – అతను ప్రేమించడం లేదని.

పరిస్థితులకి తను మాత్రం మిగతా కూలీల్లా మండిపడక నానమ్మ పుణ్యమాని నిరాశానిస్పృహలతో, నిస్తేజంగా వుంటాడు. మనవణ్ణి ఇంత కంట్రోల్లో వుంచుకున్న నానమ్మ, ఆ మనవణ్ణి జూజే చితకబాదుతూంటే,  నిస్సహాయంగా చూస్తూ వుండి పోతుంది. జూజే ఒక మానసిక రోగిలా ప్రవర్తిస్తూంటాడు. అందరి జీవితాల్లోకి తొంగి చూస్తూ, తన ప్రకారం వుండకపోతే  హింసిస్తూంటాడు. సంతోష్ కివన్నీ సమస్యలు కావు. జూజే లేనప్పుడు జూజే పెళ్ళాం తనతో కోర్కెలు తీర్చుకోవడమే సమస్యలు తెచ్చిపెడుతుంది. తన సమస్యలకి మాయా ఒక్కతే పరిష్కారమనుకుంటే, చూసి చూసి ఆమె కూడా అతడి పట్ల ఆసక్తిని కోల్పోతుంది. ఇక పరిస్థితిని తన చేతుల్లోకే తీసుకోవాలని నిర్ణయాని కొచ్చేస్తాడు సంతోష్.

ఆ నిర్ణయం ఎలాంటిదనేది కాదు- జూజే పీడా వదలాలంతే. వాడి పీడా వదిల్తే వాడి పెళ్ళాం పీడా కూడా వదుల్తుంది. మిగతా కూలీలకీ వాళ్ళ ముక్తి మార్గాలు వాళ్ళకున్నాయి. అందరి ఉమ్మడి కార్యక్రమం ఒక్కటే – జూజే ముక్త్ జీవితాలని చవిచూడ్డమే. అయితే చివరాఖరికి కథకి అసంపూర్ణ ముగింపు డోలాయమానంగా వుంటుంది – ఈ అసంపూర్ణ ముగింపు సంతోష్ సహా అందరి జీవితాలకీ కొత్త ప్రారంభమే కావచ్చు, లేదా మరింత కారు చీకట్లే కావొచ్చు . ప్రేక్షకులెలా వూహించుకుంటే అలా.

దర్శకుడు మిరాంషా నాయక్ మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ కథనాన్నే చేస్తాడు. కెమెరాతోనే కథ చెప్తాడు, పాత్రల భావోద్వేగాల్ని పట్టుకుంటాడు. దీంతో ఆర్టిస్టులు కన్పించరు – వాళ్ళు పోషిస్తున్న పాత్రలే కళ్ళకి కడతాయి. ముత్యాలముగ్గు, శంకరాభరణం, మేఘ సందేశం, సితారలలో ఏం డైలాగులుంటాయి. డైలాగులుంటే ఆర్టిస్టులే కన్పిస్తారు, పాత్రలు కనపడవు. పాత్రలు నిశ్శబ్దంలో, సబ్ టెక్స్ట్ లో సజీవమై మనమీద ప్రభావం చూపిస్తాయి. ఇలాగే ఇక్కడ కూడా బాల నటులు రిషికేశ్ నాయక్, బర్ఖా నాయక్‌ల కాడ్నించీ నటీనటులందరూ పాత్రలుగానే, విజువల్ లాంగ్వేజితో బలమైన ముద్ర వేస్తారు. కెమెరాని కథకెలా ఉపయోగించుకోవాలనే దాని విషయంలో కమర్షియల్ మేకర్లు ఇక్కడ తెలుసుకోవాల్సింది చాలా వుంది. గోవా టాలెంట్ మామూలుగా లేదు.

అభిరాజ్ రావాలే ఛాయాగ్రహణం ఒక విజువల్ మ్యాజిక్. వాస్తవిక సినిమాకొక కెమెరా భాష వుంటుంది. దాన్ని పలికించగల నేర్పు తనకుంది. పియర్ అవైట్ సమకూర్చిన సంగీతం కూడా ఈ భాషే పలుకుతుంది. నటీనటులూ సాంకేతికులూ అందరూ ఏకస్వరంగా వరసలు సవరించుకుని పాడిన పాటే ఈ పీడనల చిరిగిన పుటలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here