ప్రాంతీయ దర్శనం -18: మణిపురి – నేడు

0
10

[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా మణిపురి సినిమా ‘లోక్టాక్ లైరెంబీ’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘లోక్టాక్ లైరెంబీ’

2016 లో మణిపురీ సినిమాకి సంబంధించి ఒక అద్భుతం జరిగింది. పదికి పైగా జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పాల్గొని నాల్గు ప్రతిష్టాత్మక పురస్కారాలు సాధించుకున్న ‘లోక్టాక్ లైరెంబీ’ పర్యావరణ పరిరక్షణా కథా చిత్రం విడుదలైంది. హోబం పబన్ కుమార్ దీన్ని నిర్మిస్తూ దర్హకత్వం వహించి ప్రాంతీయ సినిమా ఈ వ్యాపారీకరణ జరిగిన రోజుల్లో కూడా ఎంత శక్తివంతంగా సంభాషించగలదో నిరూపించాడు. మత్స్యకారుల జీవనోపాధి పర్యావరణాన్ని దెబ్బతీస్తుందా? అధికార దాహం కాలుష్య కారకం కాదా? ఈ ప్రశ్నల్ని మానవ హక్కుల పరిధిలోకి ఎక్కుబెట్టి సవాలు చేసే ఈ డాక్యూడ్రామా ఏమిటో తెలుసుకుందాం…

మణిపూర్‌లో మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తున్న బలగాల దుందుడుకు చర్యల గురించి ఈ కథ. లోక్టాక్ అనేది పెద్ద సరస్సు. ఇందులో చాలా లంకలుంటాయి. వీటిని ఫుమిడీలని పిలుస్తారు. మత్స్యకారుల వల్ల సరస్సు కాలుష్యమయమై పర్యావరణం దెబ్బ తింటోందని ప్రభుత్వ ఆరోపణ. మత్స్యకారుల కుటుంబాల్ని ఇక్కడ్నించి ఖాళీ చేయించేందుకు బలగాల్ని పంపిస్తుంది. తమ కేర్పడిన ముప్పుని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై సమావేశం పెట్టుకుంటారు మత్స్యకారులు. తమ దీన గాథల్ని వెళ్ళ బోసుకుంటారు.

వీళ్ళల్లో తోంబా అనే వాడొకడు. గతంలో ఇతడి గుడిసెకి నిప్పుపెట్టాయి బలగాలు. దీంతో తీవ్ర భయాందోళనలకి లోనై బయటికెళ్ళడం మానేస్తాడు. మళ్ళీ నిప్పు పెట్టేస్తారని ఒకటే భయపడుతూంటాడు. భార్య థరోషంగ్ అతణ్ణి పోషించడానికి తనే కష్టపడడం ప్రారంభిస్తుంది. తోంబాకి వున్న భయాలకి తోడూ కళ్ళ ముందు ఒక దృశ్యం కన్పిస్తూ మరింత పిచ్చివాణ్ణి చేస్తూంటుంది. ఆ దృశ్యంలో గుడిసె ముందు ఒక స్త్రీ వచ్చి కూర్చుని వుంటుంది. ఆమె సరస్సు దేవత. తమని కాపాడే దైవమని మత్స్యకారుల నమ్మకం.

ఒకనొక రోజు తోంబా ఎలాగో గుడిసె విడిచి బయటి కెళ్ళినప్పుడు ఒక పిస్తోలు దొరుకుతుంది. అది బలగాలది అయి వుండొచ్చు. దాన్ని చూసి థరోషంగ్ బెదిరిపోతుంది. దాంతో తాము బలగాలకి దొరికిపోతే పరిస్థితి ఏమిటని మొత్తుకుంటుంది. దాన్ని ఎక్కడైనా పారేసి రమ్మంటుంది. తోంబాకి నిదానంగా పిస్తోలుతో భయం తగ్గి, దాన్ని దాచుకుంటాడు. దీంతో థరోషంగ్‌తో గొడవలు మరీ ఎక్కువై పోతాయి. ఈ గొడవలు అతడి సంపాదన మీదికి మళ్ళుతాయి. సంపాదించకుండా ఇంట్లో కూర్చుంటే పట్టణంలో చదువుకుంటున్న కూతురికి డబ్బులెవరు పంపుతారని కీచులాడుతుంది థరోషంగ్. ఒకవైపు బలగాల వల్ల తాము నిర్వాసితులయ్యే పరిస్థితి, మరో వైపు భర్త మొండితనం. ఇక వదిలేసి వెళ్ళిపోతానని హెచ్చరిస్తుంది.

పోలీసులు దిగుతారు భారీ యెత్తున. సరస్సుని శుద్ధి చేసే క్రేన్ సరస్సులో మహా భూతంలా బెదర గొడుతూ వస్తూంటుంది. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం – 1958 ప్రకారం చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తారు పోలీసులు. గుడిసెలు కూల్చేసి, కాల్చేసి తరిమి తరిమి కొడతారు. లంకలో ధైర్యవంతులైన స్త్రీలంతా ఒకటై ఎదురు తిరుగుతూంటే, మగవాళ్ళు దూరంగా నిలబడి చూస్తూంటారు. ఈ ఘర్షణల నేపధ్యంలో పిస్తోలు దగ్గరుంచుకున్న తోంబా ఏం చేశాడు, సరస్సు దేవత మత్స్యకారుల్ని ఎలా కాపాడిందీ అన్నది మిగతా కథ.

2011 నుంచీ మణిపూర్ ప్రభుత్వం లోక్టాక్ సరస్సు మత్స్యకారుల కారణంగా కాలుష్యమయమై పోతోందని సాగిస్తున్న దమనకాండకి అద్దం పట్టే ఈ వాస్తవిక కథా చిత్రం, అనేక మానవహక్కుల ప్రశ్నల్ని లేవనెత్తుతుంది. నిరంతరం మత్స్యకారుల్ని భయం నీడకి నెట్టేసి వాళ్ళ ఉపాధినీ, కుటుంబ జీవితాల్నీ కకావికలం చేస్తున్న ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తుంది.

కొన్ని తరాలుగా ఈ సరస్సు మీద ఆధారపడి బతుకుతున్న మత్స్యకారుల వల్ల నిజంగా సరస్సు కలుషితమై పర్యావరణం దెబ్బ తింటోందా? పర్యావరణాన్ని చూసే దృష్టి కోణాన్ని ఇది సవాలు చేస్తుంది. కాలుష్యం పర్యావరణ సంబంధిత పదమే. కాలుష్యమని పర్యావరణానికి సంబంధించే వాడతారు. కానీ అధికార దాహం కూడా కాలుష్యమేనని ఈ కథ వాదిస్తుంది. తోంబాకి పిస్తోలు దొరకడం అతడికి అధికార బలాన్నిచ్చింది. ఇదే అధికార బలం కుటుంబాన్ని దూరం చేసింది. తమని సరస్సు దేవతే కాపాడుతుందని భార్య వాదించింది. వినని భర్తని వదిలేసింది. కుటుంబంలో కాలుష్యాన్ని నింపిన అధికారబలంతో వచ్చిన పిస్తోలు తోంబాకి నిరర్ధకంగా కన్పిస్తుంది. దాన్ని సరస్సు లోకే విసిరేస్తాడు. ఇప్పుడు మనస్సెంతో ప్రశాంతమవుతుంది. ఇంకెంత మాత్రం అధికార బలమనే పిస్తోలు మానసికంగా కుటుంబాన్ని కలుషితం చేయదు. భౌతికంగా సరస్సునే కలుషితం చేస్తుంది…

      

బలమైన డాక్యూ డ్రామాగా తీసిన ఈ కథ చిత్రీకరణ సాంకేతికంగా అంతే బలంగా వుంటుంది. సుధీర్ నారోయిబమ్ రాసిన కథానిక ఆధారంగా దీన్ని నిర్మించారు. తోంబాగా శనతోంబా నటిస్తే, థరోషంగ్‌గా తంబల్ సంగ్ నటించింది. షెహనాద్ జలాల్ ఛాయాగ్రహణం. సంగీతం లేదు. శబ్దగ్రహణం సుకాంతా మజుందార్.

ఈ 70 నిమిషాల లఘు బడ్జెట్ డాక్యూ డ్రామాని కమర్షియల్ ప్రయోజనాలతో తీయలేదు నిర్మాత, దర్శకుడు హోబం పబన్ కుమార్. చలన చిత్రోత్సవాలకే ఉద్దేశించాడు. మణిపురి సినిమా బలహీనంగా వున్న సమయంలో దీంతో బలంగా అంతర్జాతీయ దృష్టి నాకర్షించాడు దర్శకుడు. జాతీయ, అంతర్జాతీయ నామినేషన్‌లు, అవార్డులు, రివార్డులతో మణిపూర్‌కి గర్వకారణంగా నిలిచాడు. ‘లోక్టాక్ లైరెంబీ’కి ఆంగ్ల టైటిల్ ‘లేడీ ఆఫ్ ది లేక్’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here