ప్రాంతీయ దర్శనం -23: డోగ్రీ సినిమా

0
10

[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా డోగ్రీ సినిమా ‘గీటియాఁ’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘లేకలేక ఒక హిట్ యాక్షన్!’

‘గీటియాఁ (గులకరాళ్ళు)’

[dropcap]జ[/dropcap]మ్మూ కాశ్మీర్‌లో మొదటి డోగ్రీ భాషా చలన చిత్రాన్ని 1966లోనే నిర్మించి ఘనత చాటుకున్నారు. ‘గలన్ హువే బిటియా’ అనే తెలుపు నలుపుని నిర్మించిన తర్వాత మళ్ళీ 45 ఏళ్ల వరకూ ఎవరూ సినిమాల జోలికి పోలేదు. డోగ్రీ భాష జమ్మూలో, జమ్మూని అనుకుని వున్న కొన్ని పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ జిల్లాల్లో మాట్లాడతారు. మార్కెట్ చిన్నది కావడం వలన డోగ్రీ భాషలో సినిమాలు తీసే సాహసం ఎవరూ చేయలేదు. 2010లోనే పరిస్థితుల్లో మార్పు వచ్చి రెండో డోగ్రీ సినిమా ‘మా ని మిల్దీ’ రంగుల్లో నిర్మించారు. అప్పటినుంచి ఏడాది కొకటి చొప్పున 2014 వరకూ మరో అయిదు నిర్మించారు. ఆ తర్వాత ఈ ఐదేళ్లుగా డోగ్రీ సినిమాల్లేవు. ఇప్పుడు ఒకేసారి జోరుగా ఆరు సినిమాలు నిర్మిస్తున్నారు.

అయితే చూద్దామంటే మొదటి డోగ్రీ ‘గలన్ హువే బిటియా’ అందుబాటులో లేదు. కనుక నాటి డోగ్రీ సినిమా ముచ్చట్లు కాకుండా నేటి డోగ్రీ సినిమా గురించి మాత్రమే చెప్పుకోవాల్సి వస్తోంది. 2014లో నిర్మించిన ‘గీటియాఁ’ (గులకరాళ్ళు) అతిపెద్ద హిట్టయ్యింది. మళ్ళీ మళ్ళీ విడుదలవుతూ చూడని కొత్త ప్రేక్షకులకోసం అనేక ప్రదర్శనలకి నోచుకుంటోంది. ప్రాంతీయ సినిమా అనగానే ఆర్టు సినిమాలు తీయకుండా డోగ్రీలో తీస్తున్నవి యువ ప్రేమ సినిమాలే. వినోదాత్మకాలే. ‘గీటియాఁ’తో ఇంకో అడుగు ముందుకేసి కరుడుగట్టిన నేరగాళ్ళ యాక్షన్ సినిమా తీసేశారు. దీనికి ఒకనాటి జమ్మూ సామజిక నేపధ్యాన్ని వస్తువుగా తీసుకున్నారు.

 

1980ల నాటికీ కాశ్మీర్‌లో ఇంకా ఉగ్రవాదం బలపడలేదు. కానీ జమ్మూలో గూండా రాజ్యం వర్ధిల్లింది. నేరస్థముఠాల గ్యాంగ్ వార్స్, వీటిని పోషించే పోలీసులు, రాజకీయ నాయకుల స్వార్థాలు, అన్నీ కలిసి జమ్మూని ముంబాయి మాఫియా ప్రపంచానికి నకలుగా తయారు చేసి పెట్టాయి. హత్యలతో కుటుంబాలు అతలాకుతలమయ్యాయి. బాధితుల అక్రందనలు, దిక్కులేని జీవుల ఆక్రోశాలు శాంతి భద్రతల్ని పట్టి పల్లార్చాయి.

పట్టపగలు నడి వీధుల్లో కాల్పులు జరుపుకుంటూ భయానక వాతావరణాన్ని సృష్టించే వాళ్ళు. పాకిస్తాన్ నుంచి మాదకద్రవ్యాల దొంగ రవాణా, దీని చుట్టూ కోట్లాది రూపాయల వ్యాపారం అంతా కలిసి జమ్మూని మాఫియా లాండ్‌గా మార్చేశాయి. లాండ్ మాఫియాలు కూడా బయల్దేరారు. ఇక నిరసనల వేడి బాగా తగలడంతో పోలీసు ఉన్నతాధికారులు కొరడా ఝుళిపించక తప్పలేదు. 1989లో కాశ్మీర్ ఉగ్రవాదులు కూడా బయల్దేరడంతో పోలీసులకి ఈ రెండు భిన్న వర్గాలని అదుపు చేయడం సాధ్యం కాలేదు. కొత్తగా కోరలు చాస్తున్న ఉగ్రవాదాన్ని అర్థం జేసుకుంటూనే మాఫియాలని ఎక్కడికక్కడ ఏరి పారేశారు. చాలామంది నేరగాళ్ళు ఆర్జించిన డబ్బుతో రాజకీయ పార్టీల్లోకి చేరిపోయారు. సికందర్ అలియాస్ బిల్లూ, సంజయ్ గుప్తా అలియాస్ బకరా, మహేందర్ పాల్ సింగ్ అలియాస్ పప్పీ సింబాలియా…ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది క్రిమినల్స్ రాజకీయ నాయకులై పోయారు. 1990 నాటికల్లా పోలీసులు జమ్మూని మాఫియాలు లేకుండా ప్రక్షాళన చేసేశారు.

ఈ సంక్షిప్త జమ్మూ చరిత్రని తీసుకుని ‘గీటియాఁ’ గా తెరకెక్కించారు. దర్శకుడు రాహుల్ శర్మ ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో బాలీవుడ్ కేమాత్రం తీసిపోని విధంగా పకడ్బందీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించాడు. ఇందుకు నిర్మాతలుగా అరుణ్ శర్మ, తజీమ్ దార్, మేఘా శర్మలు సహకరించారు. తన్వీర్ దార్, రేణు, బాలీవుడ్ నటుడు యశ్పాల్ శర్మ, గణేష్ యాదవ్, ముస్తాక్ కాక్, తేజస్వినీ శర్మ, మహేష్ పురి, మాస్టర్ అక్రమ్ నటీనటులు. భరత్ అరోరా ఛాయాగ్రహణం, సంగీతం అరవింద్ కుమార్.

ఇది విడుదలైన ప్రతీసారీ ఏకైక డోగ్రీ యాక్షన్ మూవీగా యువతని ఆకర్షిస్తూ సొమ్ములు చేసుకుంటోంది. 1980ల నాటి జమ్మూ నేరప్రపంచాన్ని కళ్ళారా వీక్షించే అవకాశం కల్పిస్తోంది ఈ సెమీ రియలిస్టిక్ కమర్షియల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here