ప్రాంతీయ దర్శనం -25: భోజ్‌పురి – నేడు

0
7

[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా భోజ్‌పురి సినిమా ‘దబంగ్ సర్కార్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘మాస్ కాపీ మసాలా!’

‘దబంగ్ సర్కార్’

[dropcap]నే[/dropcap]టి భోజ్‌పురి సినిమాలు ఏనాడో నాటు మసాలా ఘాటు సినిమాలు. హిందీ సినిమాలకి నకళ్ళు. హిందీకే కాదు, 1980 – 90 నాటి తెలుగు తమిళంలకి కూడా కాపీలు. గత 30 ఏళ్లుగా మార్పులేని అవే పాత మసాలా ఫార్ములా చవకబారు సినిమాలు. ఆరు పాటలు, ఆరు ఫైట్లు, లవ్ రోమాన్సులు. అశ్లీలం, ద్వంద్వార్ధాలు ఇప్పుడు తగ్గినా ఒకప్పుడు వీటిదే రాజ్యం. సినిమా టైటిల్స్ పాతా కొత్తా హిందీ సినిమాల టైటిల్స్ యథాతథం. హసీనా మాన్ జాయేగీ, కచ్చే ధాగే, నాగిన్, లహూకే దో రంగ్, దూద్ కా కర్జ్, ప్యార్ జుక్తా నహీ, తేరీ కసమ్, తేరే నామ్, జో జీతా వొహీ సికందర్, బేతాబ్… ఇలా వందల టైటిల్స్ నిస్సిగ్గుగా హిందీ సినిమాలవే. ఇలాటిదొకటి ‘దబంగ్ సర్కార్’ అంటూ 2018 నవంబర్‌లో విడుదలైంది. ఇందులో ఎనిమిదేళ్ళలో 70 సినిమాల్లో నటించిన భోజ్‌పురి సూపర్ స్టార్ కేసరీ లాల్ యాదవ్ హీరో. ఇతడికి భోజ్‌పురి ఫిలిం అవార్డ్సులో ఉత్తమ పాపులర్ నటుడి అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే ఉత్తమ నటుడి అవార్డు, యూపీ రతన్ ఉత్తమ నటుడి అవార్డూ వరించాయి.

యోగేష్ రాజ్ మిశ్రా అనే ట్రాక్ రికార్డు లేని దర్శకుడు దీనికి దర్శకత్వం వహించాడు. రొటీన్ పోలీస్ – మెడికల్ మాఫియా కథ. హీరో వీరూ ఆవారా. తెల్లారి త్వరగా లేవకుండా కలలో కొచ్చిన అమ్మాయితో సాంగ్ వేసుకుంటూ వుంటే కర్ర తీసుకుని తండ్రి వీర బాదుడు బాదడం, తల్లి అడ్డుపడి గారం చేయడం, అన్నం తినిపించడం, సెంటిమెంటుతో వీరూ తనూ తల్లికి తినిపించడం, తయారై షికారు వెళ్ళడం.

వూళ్ళో దంగల్ జరుగుతూంటే ఆ కుస్తీ పోటీల్లో సల్మాన్ ఖాన్‌లా నెగ్గి దండ వేయించుకుంటాడు. వెంట ఇద్దరు కమెడియన్లుంటారు. వినీత్ కుమార్ అనే కిడ్నాపుల దందా చేసే మెడికల్ ఫ్యాక్టరీ యజమాని వుంటాడు. వీరూ తండ్రి ఇతడి ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూంటాడు. ఆ వినీత్ కుమార్ పార్టనర్ కూతుర్ని అల్లరి పెట్టి వీరూ సమస్య తీసుకువస్తాడు. ఇక తండ్రి ఫైనల్ వార్నింగ్ ఇచ్చేస్తాడు. సరే పోయిందేముందని చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని ప్రయోజకుడు అవుతూంటాడు వీరూ. అప్పుడు కాజల్ అనే టీచర్‌ని చూసి ఆమె వెంట పడతాడు. మాఫియా మనుషులు వచ్చేసి బడ్డీ కొట్టు దగ్గర కమెడియన్ మిత్రుల్ని నష్ట పర్చి పోయే సరికి, వీరూ వెళ్లి చితకదంతాడు. దీంతో తండ్రి ఉద్యోగానికి ఎసరొస్తుంది. ఇంతలో ఒక స్కూలు పిల్లాడికి జబ్బు చేసి మందు వేస్తే వాడు చనిపోతాడు. అప్పుడు నకిలీ మందుల మెడికల్ మాఫియా వినీత్ కుమార్ వార్తల్లో కొస్తాడు. అతను వీరూ తండ్రిని చంపేసి నకిలీ మందుల స్కామ్ అతడి మీదేస్తాడు. వీరూ కుంగిపోతాడు. రెండేళ్ళూ అదృశ్యమైపోతాడు. అప్పుడు అదే వూరుకి ఎస్సైగా వస్తాడు.

ఇదీ విషయం. ఇక షరా మామూలే. ఎస్సైగా మెడికల్ మాఫియాని అంతమొందించి పగదీర్చుకోవడం. పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారులూ కుమ్మక్కై వున్న మెడికల్ మాఫియా ఒక్కొక్కర్నీ అంతమొందిస్తూనే, నకిలీ ఎన్‌కౌంటర్లు చేస్తూనే, మధ్యమధ్యలో హీరోయిన్‌తో డ్యూయెట్స్, చెల్లెలితో సెంటిమెంట్స్. గారం చేసిన తల్లి ఫస్టాఫ్ లోనే చనిపోయింది. తండ్రిని మాఫియాలు చంపేశారు. చెల్లెల్ని వదిలేసి రెండేళ్ళు ఐపులేకుండా పోయిన హీరో ఇప్పుడు వచ్చి పరామర్శిస్తాడు. ఇలా లాజిక్కులు, కామన్‌సెన్సు వుండని ఇవే రొటీన్ రివెంజి సినిమాల్ని భోజ్‌పురి ప్రేక్షకులు ఫుల్ భోజనంలా ఆరగిస్తున్నారు.

     

ఆరుపాటలు, చీటికీ మాటికీ ఆరు ఫైట్లు లెక్క మర్చిపోలేదు. ఇక పెద్ద స్టార్‌గా వెలుగొందుతున్న కేసరీ లాల్ యాదవ్ కాస్త మన శ్రీకాంత్ ఫేస్ కట్‌తో వున్నా నటనలో సున్నా. నటించకుండా నటన సరిపెట్టేశాడు. ఇక హీరోయిన్ ఆకాంక్షా అవస్థి బరువు పెరిగి అవస్థ పడింది. అదేమిటో గానీ భోజ్‌పురి హీరోయిన్లు బరువు పెరిగి పహిల్వాన్స్‌లా వుంటున్నారు.

ఈ మసాలా యాక్షన్లో ఒక పంచ్ డైలాగు వుంది: ‘తండ్రికి నాలాయక్, ఫ్రెండ్స్‌కి లాయక్, శత్రువులకి ఖల్‌నాయక్’ అని. ఇంకా నయం పంచ్ డైలాగులు కూడా హిందీ సినిమాల్లోంచి కాపీ కొట్టడం లేదు. మొత్తానికి ఇతర భాషల్లో 1980 – 90ల నాటి అరిగిపోయిన పురాతన ఫార్ములా సినిమాలనే తిరిగి తీసి భోజ్‌పురి సినిమా అనిపిస్తున్నారు. సూపర్ స్టార్ కేసరీ లాల్ యాదవ్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా వున్నాడు. ఈ మూడిట్లో రెండిటి టైటిల్సు జాకీష్రాఫ్ నటించిన ‘తేరీ మెహర్బానియా’ ఒకటి, గోవిందా నటించిన ‘కూలీ నంబర్ వన్’ ఒకటీ కాగా, మూడో టైటిల్ రెండుసార్లు హిందీలో వచ్చిన ‘హీరాఫేరీ’. ఇలా ఎనిమిదేళ్ళలో 70 సినిమాలు నటించేసిన యాదవ్, ఇంకో నాలుగేళ్ళలో మొత్తం హిందీ సినిమాల టైటిల్స్ అన్నీ తనవిగా సొంతం చేసుకున్నా ఆశ్చర్యం లేదు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here