ప్రాంతీయ దర్శనం -27: నాగపురీ – నేడు

0
14

[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా నాగపురీ సినిమా ‘కర్మ’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘కర్మ’

[dropcap]నే[/dropcap]టి నాగపురీ సినిమాలు పాత హిందీ ఫార్ములా సినిమాలకి నకళ్ళు. అవి కూడా ఏడాదికి రెండు మూడు కంటే తీసే పరిస్థితుల్లేవు. హిందీ సినిమాల మార్కెట్ అయిన ఝార్ఖండ్‌లో స్థానిక నాగపురి సినిమాల స్థానం అట్టడుగున వుంది. అట్టడుగున ఇవి పాత హిందీ సినిమాలని పోలివుంటున్నాయి. రెండు మూడు దశాబ్దాల నాటి హిందీ సినిమాల మూస ఫార్ములా కథనాలతో నేటితరం ప్రేక్షకులని ఆకట్టుకునే విచిత్ర పంథా ననుసరిస్తున్నారు మేకర్లు. తీసే రెండు మూడు కూడా రోమాంటిక్ సినిమాలే. ఇవి పాటలతో నింపేసి మ్యూజిక్ వీడియోల్లాగా వుంటున్నాయి. మ్యూజిక్ వీడియోలు ఇక్కడ ప్రత్యేక పరిశ్రమగా వర్ధిల్లుతున్న నేపథ్యంలో, సినిమాల్లోకీ ఇవి జొరబడి పోతున్నాయి. ఈ పాటలన్నీ గ్రూపు డాన్సులతో ఔట్‌డోర్‌లో డ్యూయెట్లే. బ్యాక్‌గ్రౌండ్‌లో దిమ్మదిరిగే ఝార్ఖండ్ ప్రకృతి అందాలుంటాయి. సినిమాల్లో ఎక్కడో ఒక చోట పాత్ర చేత జై ఝార్ఖండ్ అన్పించకుండా వుండరు. ఇలా ఒక పాత్ర చేత జై ఝార్ఖండ్ అన్పించే పాటల రోమాన్స్‌కి, ప్రతీకారాన్నిజోడించి తీసిందే ‘కర్మ’ అనే 2013 నాటి రివెంజి సినిమా.

ఒక హీరోని చూపిస్తూ కాపీ చేసినా కమర్షియల్ సినిమా అన్నాక అందులో సాంతం హీరో కన్పించడం రివాజు. అలాటిది ప్రారంభంలో ఇరవై నిమిషాలు, ముగింపులో ఇంకో ఇరవై నిమిషాలు మాత్రమే హీరోని చూపించి, మిగిలినదంతా వేరే పాత్రలతో నడపడమనే విచిత్ర కళాప్రక్రియ కూడా ఈ నాగపురీ సినిమాలో కన్పిస్తుంది. టైటిల్ వచ్చేసి హీరో మీద ‘కర్మ’ – సినిమా వచ్చేసి హీరో కన్పించని ప్రేమ. ఏమో, ఇది కూడా ఒక ప్రయోగమేనేమో. తెలుగులో కూడా ఇలా తీయవచ్చేమో.

కర్మ (రాజీవ్ సిన్హా) కి ఘోరమైన హత్యలు చేసినందుకు ఉరి శిక్ష పడుతుంది. జైల్లో కూర్చుని ఒక ఫోటో చూసుకుంటూ బాధ పడుతూంటాడు. ఇంకో ఖైదీ వచ్చి ఆ ఫోటో లాక్కోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణలో అది చిరిగిపోతుంది. ఆ ముక్కల్ని ఏరుకుంటూ కేక పెడతాడు. ఫ్లాష్‌బ్యాక్ మొదలవుతుంది. పల్లెటూళ్ళో చిన్నప్పుడు తండ్రి చనిపోతూ మాట తీసుకుంటాడు, చెల్లెల్ని బాగా చూసుకోవాలని. ఆ చెల్లెలు చాందో (వర్షా రీటా)ని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తాడు కర్మ. పెళ్లి ఆలోచన చేస్తూంటే చదువుకుంటానని మొండికేస్తుంది. చదువు కోసం దూరంగా పంపాలంటే మనస్కరించదు. ఏడుస్తూ కూర్చుంటుంది. ఆమె కళ్ళల్లో నీళ్ళు చూడకూదన్న తండ్రి కిచ్చిన మాట గుర్తు చేసుకుని, రాంచీ తీసికెళ్ళి ఇంటర్మీడియెట్‌లో చేర్పిస్తాడు. ఆ కాలేజీలో ర్యాగింగ్ గ్యాంగ్ ఆమెని ర్యాగింగ్ చేసి ఏడ్పిస్తూంటే, సూరజ్ (అజయ్ సోనీ) వచ్చి రక్షిస్తాడు. ఆ రోనీ అనే వాడి గ్యాంగ్ ని చిత్తుగా తంతాడు. రోనీ పగబడతాడు. తనని కాపాడిన సూరజ్‌ని తల్చుకుని ప్రేమలో పడుతుంది చాందో. తను బాగానే చదువుకుంటున్నానని అన్నకి ఉత్తరం రాస్తుంది.

కాలేజీలో చాందోని ఎవరూ దగ్గరికి రానివ్వరు ఆమె పల్లెటూరి వేషం చూసి. దీంతో బ్యూటీ పార్లర్ తీసికెళ్ళి ఆమెని ఆధునికంగా మార్చేస్తాడు సూరజ్. జీన్స్, టీస్‌లో స్వాంకీగా కన్పిస్తూ కాలేజీ కొచ్చిన చాందో హాట్ టాపిక్ అయిపోతుంది. సూరజ్‌తో ప్రేమాయణం సాగిస్తుంది. రాఖీ పండగ కొస్తానని అన్నకింకో ఉత్తరం రాస్తుంది.

ఇంతలో రోనీ గ్యాంగ్‌తో వచ్చిపడతాడు. ఇప్పుడు దమ్ముంటే వచ్చి చాందోని కాపాడుకోమని ఛాలేంజి విసురుతాడు. చాందోని హింసిస్తూంటాడు. సూరజ్ వచ్చేసి కలబడతాడు. ఆ ఘర్షణలో సూరజ్‌ని కత్తితో పొడిచేస్తాడు రోనీ. అదే కత్తితో తనని పొడుచుకుని చచ్చిపోతుంది చాందో. రాఖీ పండక్కి తనే కొత్త చీర తీసుకుని వచ్చిన కర్మ, ఈ ఘోరం చూసి కుప్పకూలి పోతాడు.

కర్మ పోలీస్ స్టేషన్ కెళ్ళి చెప్తాడు. ఎస్సై కర్మ చెల్లెలి గురించి చెడుగా మాట్లాడతాడు. కర్మ అతణ్ణి చంపేసి పారిపోతాడు. ఇక రోనీ గ్యాంగ్ ఒకొక్కర్నీ వెతికి చంపేసి లొంగిపోతాడు… ఈ ఫ్లాష్‌బ్యాక్ జైల్లో తల్చుకుంటున్న కర్మకి, జైలర్ నుంచి పిలుపు వస్తుంది. వెళ్లి చూస్తే ప్రేమిస్తున్న సాన్వీ వుంటుంది. కర్మ సత్ప్రవర్తనకి విడుదల చేస్తున్నట్టు ప్రకటన వెలువడుతూంటే శుభం పడుతుంది.

     

ఏనాటి కథ! ఎక్కడి వ్యథ! నాగపురీ సినిమాల్ని కథ కోసం తీయరనీ, కేవలం గ్రూప్ సాంగ్స్ కోసమే తీస్తారనీ దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. లేకపోతే ఉరి శిక్ష పడ్డ ఖైదీని సత్ప్రవర్తన పేరుతో విడుదల చేయడమేమిటి? పాత హిందీ సినిమాల కథలే కాదు, టైటిల్స్ కూడా వాళ్ళ భాషలో హిందీ సినిమా టైటిల్సే… తోర్ బినా, మోర్ గావ్ మోర్ దేశ్, సప్నే సాజన్ కే, మహువా, సన్ సజనా, దాదాగిరీ, కర్మ…

కర్మ కూడా స్థానిక నాగపురీ భాష తప్ప మిగిలిన సంస్కృతి అంతా హిందీ సినిమాల సంస్కృతే. నేటి హిందీ సినిమాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో బాటు, ’80 ల, ’90 ల నాటి గ్రూప్ సాంగులు. పాత్రలు కూడా నాటి హిందీ సినిమాల పాత్రలే. సొంత ఝార్ఖండ్ సంస్కృతి అంటూ ఏమీ కన్పించదు నాగపురీ భాష తప్ప. అయినా జై ఝార్ఖండ్ అన్పిస్తారు పాత్ర చేత. ముందుగా చెప్పుకున్నట్టు, హీరో కర్మ ప్రారంభంలో కాసేపు, ముగింపులో కాసేపు కన్పిస్తాడు. మధ్యలో అంతా చెల్లెలి ప్రేమాయణమే, పాటలే. ఆ కాసేపే వున్నా, ఆదివాసీ రూపు రేఖలున్న రాజీవ్ సిన్హా పగబట్టిన అన్నగా బాగా నటించాడు. ఇతన్ని పెట్టి ఝార్ఖండ్ రియలిస్టిక్ ఆదివాసీ సినిమా తీస్తే న్యాయం చేస్తాడు.

చెల్లెలుగా నటించిన వర్షా రీటా ప్రారంభంలో అన్నతో పాత కాలపు సెంటిమెంట్లే నటించినా, నటిగా ఆమె ముఖంలో భావాలు వేగంగా పలుకుతాయి. సన్నివేశానికి తగ్గట్టు, ఆ సన్నివేశంలో తన పాత్ర స్థితికి తగ్గట్టు, మంచి టైమింగ్‌తో వేగంగా హావభావాల్ని ప్రదర్శిస్తుంది. భావోద్వేగాలతో ఆకర్షిస్తుంది. ఇదే చాతుర్యం తర్వాత కాలేజీ సీన్లలో కన్పించక, రొటీన్ కృత్రిమ హీరోయిన్ పాత్రలా వుండిపోతుంది.

ఈ ఇద్దరు నటులు తప్ప మిగిలిన వాళ్ళ గురించి చెప్పుకోవడానికేమీ లేదు. వర్షా రీటాతో ప్రేమికుడిగా నటించిన అజయ్ సోనీ పాత ఫిరోజ్ ఖాన్ లాంటి మొహంతో, జుట్టుతో రకరకాల పోజులు పెడతాడు. డ్యూయెట్స్‌లో రాజేష్ ఖన్నా పోకడలు పోతాడు. ఎలాటి పాత టైపు పాటలకి అలాటి అనుకరణలే వస్తాయేమో.

ఈ సినిమాలో చివరికి ఉరి శిక్షని లైట్‌గా తీసుకున్నట్టు, ప్రతీదీ లైట్‌గా తీసుకుని నాగపురీ సినిమాలు చూడాలి. విలన్ ప్రేమికుణ్ణి పొడిచి చంపినప్పుడు, తెల్లటి షర్టు గులాబీ రంగులో వున్న రక్తంతో తడిసినా, అది ప్రేమకి గుర్తుగా తీసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here