ప్రాంతీయ దర్శనం -32: సంస్కృతం – నాడు

0
12

[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా సంస్కృత సినిమా ‘ఆది శంకరాచార్య’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘ఆది శంకరాచార్య’

[dropcap]క[/dropcap]ర్ణాటక రాష్ట్రమంటే కమర్షియల్ సినిమాలు గుర్తొస్తాయి. కానీ కర్ణాటక రాష్ట్రమంటే సంస్కృత సినిమాలు కూడా. దేశంలో తొలి, మలి సంస్కృత సినిమాలు కర్నాటక నుంచే వచ్చాయి. తాజాగా మరోటి కర్నాటక నుంచే వచ్చింది. ఇంకోటి రాబోతోంది. వీటి మధ్య కేరళ నుంచి నాల్గు వచ్చాయి. దేశంలో తొలి సంస్కృత సినిమాగా ‘ఆది శంకరాచార్య’ ప్రసిద్ధ కన్నడ దర్శకుడు జీవీ అయ్యర్ దర్శకత్వంలో 1983లో విడుదలైంది. మలి సంస్కృతం కూడా దశాబ్డం తర్వాత జీవీ అయ్యర్ దర్శకత్వంలోనే 1993లో ‘భగవద్గీత’గా విడుదలైంది. ఆ తర్వాత 2015 -19 మధ్య కేరళ నుంచి ప్రియమానసం, ఇష్టిః, సూర్యకాంత, అనురక్తి అనే నాల్గు వచ్చాయి. కర్ణాటక నుంచి ‘పుణ్యకోటి’ అనే యానిమేషన్ గత సంవత్సరం విడుదల కాగా, ‘అగోచారార్ణవః’ త్వరలో విడుదల కాబోతోంది. ఈ విధంగా కర్నాటక నుంచి నాల్గు, కేరళ నుంచి నాల్గూ మొత్తం ఎనిమిది సంస్కృత సినిమాలు ఇప్పటి వరకు వచ్చినట్టు.

కన్నడ భీష్మ అని పిలుచుకునే రచయిత, నిర్మాత, దర్శకుడు గణపతి వెంకటరమణ అయ్యర్ (1917-2003) తొమ్మిది సినిమాలు నిర్మించి, 23 సినిమాలకు దర్శకత్వం వహించారు, 6 సినిమాలు రచించారు. ‘ఆదిశంకరాచార్య’ కి వచ్చినంత పేరు ప్రతిష్ఠలు మరి దేనికీ రాలేదు. 8వ శతాబ్దపు అద్వైత వేదాంతవేత్త ఆది శంకరాచార్యుడి బయోపిక్‌ని ఒక ఆధ్యాత్మిక యానంగా మలిచారు. అలాగనీ ఇందులో భక్తి పాటలు, భజనలు, మహాత్మ్యాలూ, అతిశయోక్తులూ ప్రవేశపెట్టి ప్రేక్షకుల్ని భక్తి పారవశ్యం వైపు మళ్ళించలేదు. సైన్సు, మహాత్మ్యాలు ఏదో ఒక్కటే చెప్పాలి. సైన్సే చెప్పారు. వ్యక్తి పూజకి శంకరాచార్యే వ్యతిరేకం: మీ జయజయ ధ్వానాలు భగవంతుడికే వుండాలంటాడు. ఆ మాట కొస్తే ఈ బయోపిక్ దేశంలో ఎక్కడా విడుదల కాలేదు, విదేశీ మార్కెట్లలో బాగా ఆడింది. ఇందులో భావోద్వేగాల కలగూరగంప భక్తిని పక్కన బెట్టి, ఆలోచనాత్మకమైన అద్వైతాన్నీ, వైదిక ధర్మాల్నీ పొందుపర్చారు. ప్రతీ దృశ్యం ఆలోచిస్తూ చూసేట్టుగా రూపొందించారు. ప్రవృత్తి నివృత్తులలో ప్రేక్షకుల్ని నివృత్తి వైపుగా లాక్కెళ్ళేలా ఆచార్యుడి జీవితాన్ని కళ్ళముందుంచారు. అయితే చరిత్రతో కాస్త తేడాగా పోయారు – హైందవానికి బౌద్ధంతో ముప్పు ఏర్పడిందని చిత్రించారు తప్ప, ఆ కాలంలో హైందవాన్ని దెబ్బతీస్తున్న అంతర్గత శక్తుల్ని ప్రస్తావించలేదు.

ఈ సినిమా ప్రారంభమే కాన్సెప్ట్‌ని ప్రతిపాదించే ఒక అద్భుతమైన ఓపెనింగ్ ఇమేజి. మన సినిమాల్లో తాటాకు చప్పుళ్ళలాగా ఓపెనింగ్ బ్యాంగులు వుంటాయి తప్ప, కథకి ముఖచిత్రంలాంటి ఓపెనింగ్ ఇమేజులు వుండవు. అయ్యర్ ఒక్క ప్రారంభ షాట్ లోనే ఈ బయోపిక్ దేని గురించో చెప్పేస్తారు. బ్యాక్‌గ్రౌండ్‌లో బ్రాహ్మణులు వేద మంత్రాలతో సూర్య నమస్కారం చేస్తూంటారు. ఫోర్‌గ్రౌండ్‌లో ప్రేములోకి బౌద్ధ సన్యాసులు వచ్చి ‘బుద్ధం శరణం గచ్ఛామి’ రావాలతో పోతూంటారు. ఇలా బ్యాక్‌గ్రౌండ్ – ఫోర్‌గ్రౌండ్‌లలో షాటు పెట్టడంలోని అర్థం, హైందవం వెనుక బడిపోతోందనీ, దాని ముందొచ్చి బౌద్ధం అడ్డు పడుతోందనీనూ. ఇలా ఇది హైందవం వర్సెస్ బౌద్ధం కథ అని ఈ ఒక్క షాట్‌లో చెప్పకనే చెప్పేశారు. ఇంతకంటే ఉత్కృష్ట సృజనాత్మకతే ముంటుంది? ఇలాటి అనేక సింబాలిజాలు మనకిందులో కన్పిస్తాయి. అంటే శంకరుడు బౌద్ధులతో ఘర్షణ పడే కథ నుకునేరు. ఘర్షణతో కాకుండా వాదనతో, మీమాంసతో గెలుస్తాడు. అయితే ఇదాయన జీవితంలో ఒక భాగం మాత్రమే, దీనికోసమే జీవించలేదు.

బాల్యం నుంచి నిర్యాణం దాకా…

కేరళ రాష్ట్రం కాలడిలో ప్రారంభమవుతుంది. చిన్నప్పుడు శంకర్ అని పిలిచే ఆది శంకరాచార్యకి తండ్రి శివ గురు, తల్లి ఆర్యాంబ వుంటారు. శివగురు తనకి మృత్యువు సమీపించిందని తెలిసి శంకర్‌తో చెప్తాడు: ఆకాశం నుంచి కురిసే వర్షం ఆఖరికి సముద్రంలోనే కలుస్తుందని, అందరు దేవుళ్ళకి, దేవతలకీ చేసే ప్రార్థనలు ఆ బ్రహ్మకే చేరుతాయనీ చెబుతూ, అందువల్ల మృత్యువుని మిత్రుడిగా చేసుకొమ్మంటాడు.

తన ఈడు బాలుడు మృత్యువుగా ప్రత్యక్షమయ్యేసరికి వాడితో స్నేహం చేస్తాడు శంకర్. తండ్రి మరణం తర్వాత జ్ఞానమనే బాలుడైన జ్ఞానశర్మతోనూ స్నేహం చేస్తాడు. ముగ్గురూ చెట్టపట్టా లేసుకుని తిరుగుతూంటారు. మృత్యువు నువ్వు కోరుకోకుండానే నీ వెన్నంటి వుంటుందనీ, కానీ జ్ఞానాన్ని నువ్వు కోరుకుని వెంట వుంచుకోవాలనే అర్ధంలో ఈ మిత్రత్రయం చిత్రణ వుంటుంది.

జ్ఞాన, మృత్యువులు వెంట వుండగా శంకర్‌లో ప్రశ్నించే తత్త్వం అలవడుతుంది. ఆకలేసి ఒక స్త్రీని భిక్ష్మ మడిగితే, తన భర్త ఏమీ దాచుకోలేదనీ ఆమె తన దగ్గరున్న ఒకే ఒక్క ఉసిరికాయ ఇచ్చేస్తుంది. పక్కనే ఒక ధనవంతుడు ఆర్భాటంగా పిల్లలకి అన్నదానం చేస్తూంటే, తన వంతు వచ్చిన శంకర్ తీసుకోడు. సంపదని దాచుకునే నీ దగ్గర పుచ్చుకోనని వెళ్లి పోతాడు. ఆ ధనికుడు సిగ్గుపడి సంపదనంతా పంచేస్తాడు. శంకర్ గురువుని దగ్గరికెళ్ళి – అందర్నీ సమభావంతో చూడడం ఎలా సంభవమవుతుందని అడుగుతాడు. సన్యాసం వల్ల అవుతుందని గురువు అనడంతో, శంకర్‌లో సన్యాసం గురించిన ఆలోచనలు మొదలవుతాయి.

సత్యాన్వేషణ కోసం అప్పుడే సన్యాసమేమిటని బాధ పడుతుంది తల్లి. ఆమెని ఒప్పించి, జ్ఞాన శర్మ, మృత్యువుల్ని వెంటబెట్టుకుని, గురువు చేసిన సూచన మేరకు గోవింద పాద గురువుని కలుసుకునేందుకు ప్రయాణం కడతాడు. కర్నాటకలోని గోకర్ణ చేరుకుంటాడు. అక్కడ విష్ణు అనే ఇంకో బాలుడు జత కలుస్తాడు. మధ్యప్రదేశ్ చేరుకుంటారు. అక్కడ నర్మదా నదిలో విష్ణు కొట్టుకు పోతాడు. ఆ బాధలోంచి తేరుకుని, ఒక గుహలో గోవింద పాదని కలుసుకుంటాడు శంకర్.

ఆయన సమక్షంలో సన్యాసిగా తన యోగ్యతని నిరూపించుకుంటాడు. నువ్వు పరమహంసవి అవుతావని ఆశీర్వదించి, శిష్యుడిగా చేర్చుకుంటాడు గోవింద పాద. అక్కడ శిథిలమై పోతున్న బాదరాయణ – వ్యాస -వేదాంత గ్రంధాలని పరిరక్షించి, వాటికి భాష్యాలు రాస్తాడు శంకర్.

ఇక కాశీకి చేరుకునే ఘట్టంతో పెద్దవాడై, పాత్రధారిగా సర్వదమన బెనర్జీ ప్రవేశిస్తాడు. అక్కడ విష్ణు కన్పించి ఆశ్చర్యపరుస్తాడు. అక్కడే వ్యాకరణాన్ని బోధిస్తున్న గురువుకి భజగోవిందం విన్పిస్తాడు శంకరాచార్య. కాశీవాసుల గౌరవం పొందుతాడు. ఒక చండాలుడు ఎదురైతే పక్కకెళ్ళి పొమ్మంటాడు. దీంతో జ్ఞానశర్మే శంకరుడి ఆజ్ఞతో విభేదిస్తూ వెళ్లి చండాలుడి పక్కన నిల్చుంటాడు. అప్పుడు చండాలుడు శంకరుణ్ణి ప్రశ్నిస్తాడు- ‘ఎవర్ని అడ్డు తొలగమంటున్నావ్? నా దేహాన్నా, నాలో వున్న సర్వవ్యాపితమైన ఆత్మనా?’ అని. శంకరుడికి వెంటనే జ్ఞానోదయమవుతుంది. వెళ్లి ఆ చండాలుడి పాదాలు తాకుతాడు.

అక్కడ్నుంచి ఆత్మాహుతి చేసుకోబోతున్న కుమరిల అనే మాజీ బౌద్ధ సన్యాసిని నిలవరిస్తాడు. కుమరిల ఇచ్చిన అనుమతితో మండనమిశ్ర అనే వేదాంతితో చర్చలో పాల్గొని ఓడిస్తాడు. మండనమిశ్ర సురేశ్వరగా శంకరుడి శిష్యుడవుతాడు. శంకరుడు శిష్య బృందంతో శృంగేరి చేరుకుంటాడు. అక్కడ సురేశ్వర వైదిక కర్మల ప్రయోజనం గురించి ప్రశ్నించడంతో, అతడి మేధని గౌరవిస్తూ, తను రాసిన బ్రహ్మ సూత్రాలకి తర్కం రాయాల్సిందిగా కోరతాడు. శృంగేరితో బాటు ద్వారక, బద్రి, పూరీ లలో మఠాలను స్థాపించమని శిష్యుల్ని ఆదేశిస్తాడు. ఇంతలో తల్లి అనారోగ్యంతో వుందని గ్రహించి తిరుగుప్రయాణం కడతాడు. తల్లి ఆర్యాంబ అతణ్ణి కడ చూపులు చూసి కన్ను మూస్తుంది. కానీ అతను సన్యాసి అయినందున దహన సంస్కారాలకి బ్రాహ్మణులు అనుమతించరు. దీంతో వైరాగ్యంతో వెళ్ళిపోతాడు శంకరాచార్య.

అక్కడ్నుంచి కన్యాకుమారి, కాంచీ పురంల మీదుగా హిమాలయాలకి చేరుకుంటాడు. అప్పటికి ఆరోగ్యం క్షీణిస్తుంది. పర్వత శిఖరం చేరుకుంటాడు జ్ఞానశర్మ, మృత్యువులతో. ఇతర శిష్యబృందం కూడా వుంటుంది. ‘నీ శరీరం పైన నీకు మొహం లేకపోయినా, ఇతరుల కోసం కాపాడి వుంచు’ అని జ్ఞానశర్మ ఉద్బోధిస్తాడు.

‘నేను పాపం కాను, పుణ్యం కాను; దుఖం కాను, సుఖం కాను; మంత్రం కాను, తీర్ధం కాను; వేదం కాను, యజ్ఞం కాను; భోజనం కాను, భోజ్యం కాను, భోక్తనూ కాను; నేను కేవలం సత్ చిత్తానందుడ్ని, శంకరుణ్ణి!’ అని ప్రకటించుకుని మృత్యువుని ఆహ్వానిస్తూ దిగంతాలకి సాగిపోతాడు శంకరాచార్య…

అయ్యర్ సృజనాత్మకత

ఇందులో సుమారు గంట పాటు బాల్య, కౌమార దశల జీవితమే వుంటుంది. ఈ దశల్లో అతను సన్యాసం వైపు మళ్ళిన పరిణామాల పైనే దృష్టి పెట్టి కథనం చేశాడు దర్శకుడు. ఈ పరిణామాలు ఎవరో చెప్పిన మాటలాధారంగా గాక, సంఘటనలతో అనుభవపూర్వకంగా వుంటాయి. సంఘటనలు చాలా నాటకీయంగా వుంటాయి. సన్యాసం తీసుకుంటానని తల్లితో అంటున్నప్పుడు, చీకటిగా వుంటుంది. ఒక దీపం మాత్రమే వెలుగుతూ ఇద్దరి మాటలు విన్పిస్తూంటాయి. ఈ వాతావరణం సందర్భానుసారం ఒక సింబాలిజం కాగా, మాటలు దర్శకుడి ఆలోచనా శక్తికి ప్రతీకలుగా వుంటాయి – అమ్మా సన్యాసం తీసుకుంటా – అంటే, వెళ్లి మూతికి అంటిన పాలు తుడుచుకోమంటుంది. అమ్మా సన్యాసం తీసుకుంటా – అని మళ్ళీ అంటే, వెళ్లి జ్ఞాన శర్మతో ఆ ఆడుకోమంటుంది. అమ్మా సన్యాసం తీసుకుంటా – అని మళ్ళీ అంటే, వెళ్లి విద్యాభ్యాసం చేయమంటుంది…ఇలా గొప్ప అంతరార్ధాలూ నాటకీయతా ఈ దృశ్యంలో పెల్లుబుకుతాయి.

శంకర్ సన్యాసానికి తల్లి ఒప్పుకునే దృశ్యం కూడా గొప్పగా వుంటుంది. నదిలో స్నానం చేస్తూంటే వస్త్రం కొట్టుకు పోతుంది. దానికోసం ముందుకు ఈత కొడతాడు. వద్దని మృత్యువు వారిస్తాడు. విన్పించుకోకుండా వెళ్లి మునిగిపోతాడు. జ్ఞానశర్మ భయంతో పరుగెత్తి తల్లికి చెప్పేస్తాడు. కుమారుడు అలా మరణించడం కన్నా సన్యాసం తీసుకోవడమే మేలని ఆమె పరుగెత్తుకొస్తుంది. శంకర్ కాషయ వస్త్రంతో వొడ్డుకు చేరుకుంటాడు. ఆ వస్త్రం అటు పక్కన కూర్చున్నసన్యాసిది. శంకర్ తల్లి తన నోటి నుంచి వచ్చిన మాటని కాదన లేకపోతుంది…

ఇక మహాత్మ్యాల విషయానికొస్తే, ఆకలేసి ఓ స్త్రీని అన్నమడిగితే ఆమె ఇచ్చిన ఉసిరికాయ చూసి, శంకరుడు కనకధారా స్తోత్రమాలపించి, ఆమెకి లక్ష్మీ కటాక్షాన్ని కల్గించే ఘట్టాన్ని తొలగించాడు దర్శకుడు. ఉసిరికాయ తీసుకున్నట్టు మాత్రమే చూపించి కట్ చేశాడు. అలాగే తల్లి నీళ్ళ బిందె మోయలేక పడిపోయినప్పుడు, శంకరుడు ఆ నర్మదా నదినే ఇంటికి రప్పించే ఘట్టాన్ని చూపించలేదు దర్శకుడు. మొదటే చెప్పుకున్నట్టు మహాత్మ్యాల్ని దూరం పెట్టాడు.

బౌద్ధమత సన్యాసుల్ని తన వాదనతో ఓడించినప్పుడు, చివరికి అన్ని మతాలనూ అంగీకరిస్తానన్నప్పుడూ, శంకరుడి లౌకికతత్వాన్ని బలంగా ఎస్టాబ్లిష్ చేస్తాడు దర్శకుడు. అలాగే మండనమిశ్రతో మీమాంసలో, పంజరంలో చిలకని చూపిస్తూ, దాంతో జ్ఞాన శర్మ సంభాషణలతో ఇంకో సింబాలిక్ ఘట్టాన్ని నాటకీయంగా సృష్టిస్తాడు.

ఇక ఎక్కడా శబ్ద కాలుష్యానికి తావివ్వకుండా, శబ్ద స్వచ్ఛతతో వీలైనన్ని తక్కువ వాద్య పరికరాలతో నేపధ్య సంగీతాన్ని కూర్చాడు బివి కారంత్. ఇక సంగీతాన్ని డాక్టర్ బాలమురళీ కృష్ణ నిర్వహించడంతో బాటు కొన్ని ఆలాపనలు చేశారు. నేపధ్యంలో ఇంకా ప్రవాహంలా వచ్చే వేదాల – ఉపనిషత్తుల పఠనాలు ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని తీర్చేవిగా వుంటాయి. లొకేషన్లు, వివిధ కట్టడాలూ ఆనాటి కాలంలోకి మనల్ని లాక్కెళతాయి. ఛాయగ్రహణం మధు అంబట్. సంస్కృత సంభాషణలు కర్ణాటకకు చెందిన డాక్టర్ బి. గోవిందాచార్య రాశారు.

    

శంకరాచార్యగా సర్వదమన బెనర్జీ పాత్రలో ఇంకిన మూర్తిమత్వాన్ని, నిరాడంబర నటనని మర్చిపోలేం. ఇలాటి పాత్రలకి ఆయన గొప్ప నటుడు. 1986లో తెలుగులో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో ‘సిరివెన్నెల’లో సర్వదమన బెనర్జీ నటించిన విషయం తెలిసిందే. ఇక శంకరుడి తండ్రిగా భరత్ భూష, తల్లిగా శారదా రావు నటించారు.

1983లో ఈ బయోపిక్‌కి నాల్గు జాతీయ అవార్డులు లభించాయి. ఉత్తమ కథా చిత్రం, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఛాయాగ్రహణం, ఉత్తమ శబ్దగ్రహణం అవార్డులు. దర్శకుడు జీవీ అయ్యర్ తనే నిర్మాతగా వున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here