ప్రాంతీయ దర్శనం -34: డెక్కన్ వుడ్ – నాడు

0
12

[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా హైదరాబాదీ ఉర్దూ సినిమా ‘ది అంగ్రేజ్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘ది అంగ్రేజ్’

డెక్కన్ వుడ్ – అంటే హైదరాబాద్ మూసీ అవతల హైదరాబాదీ ఉర్దూ సినిమాలు తీసే కళాకారుల అడ్డా – తనదంటూ ఒక మార్కెట్‌ని సృష్టించుకుంది. ఈ మార్కెట్ తొలి ప్రయత్నం 2005లో ‘ది అంగ్రేజ్’ అనే కామెడీతోనే వూపందుకుంది. హైదరాబాద్‌తో బాటు పొరుగున కర్ణాటక, మహారాష్ట్ర జిల్లాలకి కూడా మార్కెట్ విస్తరించింది. హైదరాబాదీ ఉర్దూని దక్కనీ ఉర్దూ అంటారు. అయితే జనం మాట్లాడుకునే భాష తెలుగుర్దూ భాషగా వుంటుంది. పలికే తీరు హైదరాబాదీ తెలుగులాగే వుంటుంది. ఇందువల్ల హైదరాబాద్‌లో తెలుగు వాళ్ళు కూడా ఈ సినిమాల్ని ఎంజాయ్ చేస్తూంటారు.

తొలి డెక్కన్ వుడ్ సినిమా ‘ది అంగ్రేజ్’ సెన్సారులో విచిత్ర పరిస్థితి నెదుర్కొంది. హైదరాబాద్ సెన్సార్ బోర్డు వారు ఇది తెలుగు సినిమా కాదు పొమ్మన్నారు. ముంబాయి సెన్సార్ బోర్డు వారు ఇది హిందీ సినిమా కాదు పొమ్మన్నారు. దేశంలో ఇంకే ప్రాంతీయ భాష సినిమాలకీ ఇలాటి పరిస్థితి ఎదురుకాలేదు. చివరికి ముంబాయ్ సెన్సార్ బోర్డువారే దక్కనీ భాషనీ గుర్తించి సర్టిఫికేట్ జారీ చేశారు.

నిఖిల్ రెడ్డి కుంటా ఒక ఎన్నారై. అమెరికాలో కొంత సినిమా అనుభవం సంపాదించుకుని, ఒక హైదరాబాదీ సినిమా నిర్మించాలని సంకల్పించుకున్నాడు. హైదాబాద్ ఓల్డ్ సిటీలో తిరిగి అక్కడి మనుషుల తీరుతెన్నుల్ని పరిశీలించాడు. వాళ్ళ భాషలో ‘ది అంగ్రేజ్’ అనే కామెడీ స్క్రిప్టు రాసుకుని దర్శకుడుగా తీయడం మొదలెట్టాడు. నిర్మాత ఎం. శ్రీధర్ రావు. బ్యానర్ శ్రీధర్ సినిమా ప్రొడక్షన్. ఓల్డ్ సిటీ జనాలకి సంబంధించినంతవరకూ తెల్లదొరలూ అంగ్రేజీలే (ఆంగ్లేయులు), ఎన్నారైలూ అంగ్రేజీలే. అలా చార్మినార్ చూడ్డానికి వచ్చిన ఇద్దరు ఎన్నారైలు – అంటే అంగ్రేజీలు – స్థానిక ముఠాలతో గొడవల్లో చిక్కుకుని ఎలా బయటపడ్డారనేదే ‘ది అంగ్రేజ్’ కథ.

ప్రణయ్ అనే ఎన్నారైగా దర్శకుడు నిఖిల్ రెడ్డి కుంటానే నటించాడు. ఇంకో ఎన్నారై రోచక్‌గా గణేష్ వెంకట్రామన్ నటించాడు. ఓల్డ్ సిటీ గ్యాంగ్ స్టర్ ఇస్మాయిల్ భాయ్‌గా ధీర్ చరణ్ శ్రీవాస్తవ్, అనుచరుడు సలీం ఫేకూగా మస్త్ అలీ, ఇంకో అనుచరుడు జహంగీర్‌గా అజీజ్ నాసర్ నటించారు. ఇంకో గ్యాంగ్ బాస్ యాదవ్ అన్నగా ఆర్కే (రామకృష్ణ), హీరోయిన్లు తాన్యా, శీతల్‌లుగా సౌమ్యా బొల్లాప్రగడ, తారా డిసౌజాలు నటించారు. సంగీతం మల్లినాథ్ మారుత్, ఛాయాగ్రహణం అంజి.

హైటెక్ సిటీలో ఒక కాల్ సెంటర్‌లో పనిచేయడానికి ఇద్దరు ఎన్నారైలు ప్రణయ్, రోచక్‌లు అమెరికా నుంచి వస్తారు. చార్మినార్ చూద్దామని వెళ్తారు. చార్మినార్ దగ్గర ఇరానీ హోటల్ అడ్డాలో కూర్చుని గప్పాలు కొడుతూంటారు ఇస్మాయిల్ భాయ్, అతడి గ్యాంగ్ సలీం ఫేకూ, జహంగీర్, గఫూర్, చావూస్‌లు. సలీం పేకూ కోతల రాయడు. తనకి బాలీవుడ్ సినిమా అవకాశా లొచ్చాయిని గొప్పలు చెప్పుకుంటాడు. జహంగీర్ తనొక కరుడు గట్టిన క్రిమినల్ నని అనుకుంటాడు. ఇద్దరూ ఇస్మాయిల్ భాయిల్‌ని బకరాని చేస్తూంటారు.

తిరిగి తిరిగి ఇక్కడే వచ్చి కూర్చుంటారు ప్రణయ్, రోచక్‌లు. లొట్టలేసుకుంటూ ఇరానీ చాయ్ తాగుతారు. పక్క టేబుల్ దగ్గర ఇస్మాయిల్ గ్యాంగ్ ఇంటరెస్టింగ్‌గా తోచి వాళ్ళని ఫోటో తీస్తాడు రోచక్. ఇది చూసి సలీం ఫేకూ మండిపడతాడు. ఫోటో ఎందుకు తీశావని గొడవ కొస్తాడు. వాళ్ళు సారీ చెప్పినా విన్పించుకోడు. ఇస్మాయిల్ సహా గ్యాంగ్ చుట్టూ ముట్టేస్తారు. ప్రణయ్, రోచక్‌లు వాళ్ళని సూటి పోటి మాటలంటారు. ఇస్మాయిల్ ఇజ్జత్ కూడా తీసే మాటలంటారు. ఇక కొట్టబోతే తప్పించుకుని పారిపోతారు. గ్యాంగ్ వెంటబడతారు. వీధి వీధి గాలించి అలసిపోతారు.

ప్రణయ్, రోచక్ లు కాల్ సెంటర్ కెళ్ళిపోయి తాన్యా, శీతల్ లతో ప్రేమలు వెలగబెడుతూంటారు. పగ రగిలిన ఇస్మాయిల్ భాయ్ గ్యాంగ్ పట్టువదలకుండా వెతుకుతూంటారు. ఇంతలో రమేష్ అనే ప్రణయ్ కజిన్ ఒకడు గ్యాంగ్‌స్టర్ యాదవన్నని కలుస్తాడు. ప్రణయ్‌ని కిడ్నాప్ చేయాలంటాడు. యాదవన్న ఈ డీల్ ఒప్పుకుని కిడ్నాప్ చేయిస్తాడు. ప్రణయ్ కోసం వెళ్ళిన అతడి ముఠా రోచక్‌ని ఎత్తుకొస్తారు. ఎత్తుకొస్తున్నప్పుడు అక్కడికి చేరుకున్న ఇస్మాయిల్ గ్యాంగ్‌ని తప్పించుకుని వచ్చేస్తారు. కిడ్నాపైన రోచక్ కిడ్నాపర్స్ చేసిన పొరపాటు తెలుసుకుని, కజిన్ దుర్మార్గం గురించి ప్రణయ్‌ని హెచ్చరిస్తాడు. ఇక ప్రణయ్, రోచక్‌ల కోసం రెండు గ్యాంగుల పోటాపోటీ మొదలవుతుంది. ప్రణయ్, రోచక్‌లు పరస్పరం రెచ్చగొట్టి రెండు గ్యాంగులు కొట్టుకునేట్టు చేస్తారు. పోలీసులు వచ్చేసి గ్యాంగ్‌స్టర్ యాదవన్నని, అతడి ముఠానీ పట్టుకుపోతారు. యాదవన్న గ్యాంగ్ చేతిలో చిత్తుగా తన్నులు తిన్న ఇస్మాయిల్ భాయ్ గ్యాంగ్, యధావిధిగా చార్మినార్ అడ్డా హోటల్‌కి వచ్చేసి పరస్పరం ఓదార్చుకుంటారు. అంగ్రేజీలు బ్రతుకు జీవుడా అని ఉద్యోగాలు చేసుకుంటారు.

పూర్తిగా కామెడీ, యాక్షన్ కథ ఇది. హైదరాబాదీ భాషతో తొలిసారిగా తెరమీద ప్రేక్షకులకి కొత్త అనుభూతిని కల్గించింది. తమ భాషే మాట్లాడుతున్న పాత్రలకి ఫిదా అయిపోయారు. హైదరాబాద్ ఆబిడ్స్ రామకృష్ణ థియేటర్లో రోజూ నాల్గు ఆటలు 25 వారాలు మళ్ళీ మళ్ళీ చూశారు. వీడియోలు కూడా విపరీతంగా కొని చూశారు. అమెరికా, బ్రిటన్, అరబ్ దేశాల్లో ఒక సంచలనం సృష్టించింది వీడియోల రూపంలో. యాభై లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. ఈ ఒక్క డెక్కన్ వుడ్ సినిమాతో సలీం ఫేకూగా నటించిన మస్త్ అలీ, ఇస్మాయిల్ భాయ్‌గా నటించిన ధీర్ చరణ్ శ్రీవాస్తవ్, యాదవన్నగా నటించిన ఆర్కే లోకల్ స్టార్స్ అయిపోయారు. ఈ ముగ్గురూ ఈ వొరవడిలో మరికొన్ని హైదరాబాదీ సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయారు. ‘ది అంగ్రేజ్’ తర్వాతి కాలంలో కల్ట్ మూవీ స్టేటస్‌ని సాధించింది దీనికి సీక్వెల్‌గా ‘ది అంగ్రేజ్ -2’ కూడా తీశారు.

       

ఈ సినిమాలో క్వాలిటీ చూడకూడదు. చేసిన ప్రయత్నం చూడాలి. ఇరవై లక్షలు కూడా దాటని బడ్జెట్‌కి క్వాలిటీ కాదు, కంటెంట్ ముఖ్యమని నమ్మి నిర్మించారు. ఓల్డ్ సిటీలో 36 లొకేషన్స్‌లో మూడు రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు బడ్జెట్ పరిమితుల దృష్ట్యా. దీని తర్వాత దర్శకుడు నిఖిల్ రెడ్డి కుంటా 2015 లో ‘ది అంగ్రేజ్ -2’ తీశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here