[box type=’note’ fontsize=’16’] జీవితాన్ని ప్రతిబింబించడం కవిత్వం యొక్క ముఖ్య లక్ష్యం. వర్తమాన ప్రపంచ ధోరణిని కవిత్వీకరించాల్సిన బాధ్యత కవికి ఉంది. కనుకనే ప్రపంచీకరణ ప్రభావం సమాజం మీద, ప్రజా జీవనం మీద ఎలా వుందో ఆధునిక కవులు విశ్లేషిస్తున్నారు. అలాంటి కవిత్వాన్ని పరిశీలించి విశ్లేషిస్తున్నారు, ప్రఖ్యాత విమర్శకులు డా.సిహెచ్.సుశీల. [/box]
విద్యారంగం
(సెప్టెంబర్ 5, టీచర్స్ డే సందర్భంగా)
దేశంలోని విద్యావ్యవస్ధ పటిష్టంగా ఉన్నప్పుడే రేపటి పౌరులు అభివృద్ధి పథంలో పయనించి, దేశాన్ని పురోగమింపజేయగలరు. కానీ ప్రపంచీకరణ ఫలితంగా, ప్రపంచబ్యాంకు సూచనల మేరకు ప్రైవేటు విద్యా సంస్ధలు, కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక సంఖ్యలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కె.జి. నుండి పి.జి. వరకు ప్రైవేటుపరం కావడంతో విద్య అనేది సంపన్నుల హక్కు గాను, సామాన్యుల అందని ఫలంగాను మారిపోయింది. తల్లిదండ్రులు ఫీజుల్ని, విద్యార్థులు పుస్తకాల సంచుల్ని మోయలేక తల్లడిల్లిపోతున్నారు. జీవిత వికాసానికి ఉపకరించే పద్ధతిలో పాఠ్యాంశాలు లేవు. బట్టీపట్టి ర్యాంకుల పంట పండించే యంత్రాల్లా విద్యార్థుల్ని తయారుచేస్తున్నది నేటి వ్యవస్థ. ఈ పోటీ యజ్ఞంలో ప్రాణాల్ని చేతులారా తీసుకుంటున్న విద్యార్థుల మానసిక సంఘర్షణ వర్ణనాతీతం.
“కెరటం” అనే కవి (అతి) చదువు పట్ల ఒక విద్యార్థిని ఆవేదనను ఇలా వ్యక్తం చేసారు.
“అమ్మా! మేం బతికే ఉన్నాం!
యుద్ధరంగంలో శత్రువు పర్యవేక్షణలో….
తమ్ముడూ! ఇక్కడ వీళ్ళూ
చదవడం కోసమే తినమంటున్నారు
చదవడం కోసమే బ్రతకమంటున్నారు
చదవకపోతే చావమంటున్నారు –
నాకు భయమేస్తుందిరా –
ఇక్కడ అంతా నిశ్శబ్దం
స్మశాన నిశ్శబ్దం!
శవాలు పుస్తకాలు పట్టుకొని తిరుగుతున్నట్లు
శవాలు మాట్లాడుకుంటున్నట్లు
శవాలు పాఠాలు చెపుతున్నట్లు….” (ప్రజాసాహితి, జూన్ 2001)
జాతి భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన ఈనాటి విద్యాలయాలపై ప్రపంచీకరణ ప్రభావం ఎలా వుందో, మేధావి వర్గం యితర దేశాలకు ఎలా వలసపోతోందో ‘గ్లోబల్ ఖడ్గం’ అనే కవితాసంపుటిలో అన్వర్ అనే కవి ‘వలస యవ్వనం’ అనే ఖండికలో చెప్పారు –
బాల్యాన్ని పోగొట్టుకొని వాడు
యవ్వనాన్న కంప్యూటర్ ముందు కూచోబెడతాడు
ఫాస్టు ఫుడ్, కూల్డ్రింకు
స్కిన్ టైట్ జీన్స్, సిగరెట్ శ్వాస
పొడవాటి జుత్తు, మీసం లేని మూతి
వాడో కంప్యూటర్ గీసిన చిత్రం
1990 లోని ‘అందరికీ విద్య’ అనే భారత ప్రభుత్వ రాజ్యాంగ విధ్యుక్త ధర్మాన్ని – త్రోసిరాజని – ప్రపంచ బ్యాంకు చొరబాటుతో 1990 మార్చిలో ‘థాయ్‌లాండ్’ దేశం లోని ‘జొమెయిన్’ పట్టణంలో జరిగిన సమావేశం గండి కొట్టింది. అంతకు ముందే 1986లో విద్యావిధానంలో అన్ని అంశాలని సవరించి సమానత్వ లక్షణాలని సూచించే ఆచార్య రామ్మూర్తి కమిటీ సిఫారసులు బయటకు పొక్కకుండా కాలహరణం చేయబడి, విద్యావ్యవస్థను ప్రపంచీకరణ శక్తుల ఆధిపత్యానికి తలవొగ్గింది. అందుకే పాపినేని శివశంకర్ –
“అంతులేని ఆందోళనతో అడిగాను
‘చదువంటే’ ఏమిటని
అది సలసల కాగే సల్ఫ్యూరిక్ సముద్రంలో
చూడ చక్కని ఈతపోటీ అని చెప్పారు”
అని యాసిడ్ కంటే ఘాటుగా విమర్శించారు. దీని మరో పార్శ్వాన్ని ‘చలం’ వ్యంగ్యంలోచూడవచ్చు.
“పరలోకంలోకి నరకానికి
మనవాళ్ళు ఈలోకంలోనే
బ్రాంచీలు తెరిచారు
అవే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ….
….. జాతి భవిష్యత్తు తీర్చిదిద్దవలసిన
ఈనాటి విద్యాలయాలు చిన్నసైజు కబేళాలుగా
మారిపోవడం ప్రపంచీకరణ దుష్ఫలితాలకు ఒక నిదర్శనం”
కార్పొరేట్ కళాశాలల్లో మానసిక ఒత్తిడిన పెంచే చదువు, అనారోగ్య పోటీతత్వాన్ని పెంచే చదువు, పరుగులు పెట్టించే చదువుపట్ల విద్యార్థులు మానసిక ఆందోళన పెంచుకొని, దాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలను చేసుకోవడం పరిపాటి అయింది. భావిభారత పౌరులు నిస్సహాయంగా అర్థాంతర చావును ఆహ్వానించడం పట్ల డా. సిహెచ్. సుశీల ఈవిధంగా స్పందించారు….
“నిస్సహాయంగా పంజరంలో
రెక్కలు కట్టేసిన పావురాలు
కాంపిటీషన్ సాలెగూటిలో
చిక్కుకున్న అల్పప్రాణులు
మార్కుల వలలో
చిక్కుకున్న జీవచ్ఛవాలు
గొంతులో గాలం గుచ్చుకుని
ఉక్కిరిబిక్కిరౌతున్న చిరుచేపలు
బెత్తం పుచ్చుకున్న స్టడీ అవర్లు
ర్యాంకుల పంట పండించాలని సంస్ధలు
డాలర్ల పంట పండించాలని పేరెంట్స్
ఐ.టి. మాయాజాలంలో
రోబోట్లుగా మారిన యువరక్తం
ఎత్తైన గోడలు కటకటాల గేట్లు!
గేట్ల కావల ఏమౌతుందో!
గదిలే కాదు మనసులూ ఇరుకే!
నిద్రలోని రాత్రుల్లలో
నిద్రచాలని రాత్రిళ్ళలో
ఎన్నెన్నో కలలు
కల్లలై పోతుంటే
దిక్కుతోచని చిన్నారి చేతిలో
‘నైలాన్ తాడు’
(పడమటి వీథి . పే. 10)
విద్య ప్రభుత్వ బాధ్యత. కానీ కొంతమంది వ్యక్తుల గుత్తాధికారం క్రింద – ప్రైవేటీకరణ అనే పేరు మీదుగా – ప్రపంచీకరణ పేరుతో బాధ్యత నుండి తప్పుకుంది ప్రభుత్వం. గుంట కాడ నక్క లాగా కాచుకున్న ప్రైవేటు యజమానులు ‘విద్య’ను వ్యాపారంగా మార్చేశారు. దార్ల రామచంద్ర వ్రాసిన ‘స్వాహాతంత్రం’లో రెసిడెన్సియల్ చదువుల వ్యాపారాన్ని, ఆ నరకాన్ని, ఆ ఒత్తిడిని, ఆ కట్టడిని తట్టుకోలేక తల్లడిల్లి రాలిపోయిన అభాగ్య విద్యార్థి విద్యార్థినీ పూలను హారంగా చేసి, ‘గ్లోబలైజేషన్’కు మన రాష్ట్రంలో ఉన్న దళారీ మెడలో ఘనంగా అలంకరించింది.
“చదువులకు కొత్త నిర్వచనం సృష్టించి
కార్పొరేట్ చదువులు వృక్షాన్ని నాటి
రెసిడెన్షియల్ వ్యాపారపు కాయ ని కాయించడం
ఆత్మహత్యల పూలు పూయించడం
గ్లోబల్ స్టేట్ దళారిని గట్టెక్కించడం”.
అలాగే ననుమాస స్వామి తాను రాసిన ‘హతాబ్దం’లో – “సర్కార్ స్కూల్లన్నీ ‘కానీ’ బడులుగా అనుబంధ కళాశాలలన్నీ స్వయంప్రతిపత్తిలో కూరుకుపోయాయి..” అని నిరసించారు. సరికొత్త హంగులతో రంగులతో వెలిగిపోతున్నాయి. అదుపులేని ఫీజులు, అర్ధంకాని డొనేషన్లు, తల్లిదండ్రులను గుల్ల చేసే ‘రేషనలైజేషన్’… అన్నీ సవాలక్ష దోపిడీవిధానాలు. వీటిని తట్టుకునే శక్తి ఎంతమందికి వుంది!
ఎం – సెట్
తల్లిదండ్రులు
నూతిలోని కప్పలు.
బిడ్డలు
రాతి కింద విత్తులు. (ప్రజాసాహితి, మార్చి 2006)
ఇక్కడ వి రాగి తన స్వైకూలలో బిడ్డలను చదివించాలనుకునే తల్లిదండ్రుల అమాయకత్వం, వారికి పిల్లలపై ఉన్న అనురాగాన్ని ఆసరాగా తీసికొని బలిపశువుల్ని చేస్తున్న కార్పొరేట్ విద్యావిధానాన్ని దుయ్యబట్టాడు. ఇక, బిడ్డలా! మొలకలెత్తలేని, మొలవటానికి సత్తాలేని జీవం లేని విత్తనాలతో పోల్చి, ఆశ మాత్రం ఉండి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉత్సాహపడే వారే గానీ, లోపల చేవ వుండి కాదని విమర్శించాడు. కానీ భారతదేశంలో ఉద్యోగావకాశాలు ఎంతవరకు వున్నాయి. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చనౌతుంది అన్నట్లుగా అందరికి స్వయం ఉపాధి కల్పన కష్టమైపోయింది. అందుకే కష్టపడి చదివి, సొంత ఊరును, సొంత గడ్డను విడిచి ఇతర దేశాలను వెళ్ళడం జరుగుతోందన్న విషయాన్నీ కాదనలేం. రోటీ కపడా ఔర్ మకాన్ అనేవి ఇక్కడ భారతదేశంలో కన్నా ‘మెరక’ దేశాల్లో పుష్కలంగా దొరుకుతాయని బండెడు ఆశతో బతుకు వెళ్ళమారుస్తున్నారు.
ఇప్పటి విద్య ముఖ్యంగా సాంకేతిక విద్య ప్రైవేటీకరణలో అందుకుందామన్నా అందనంత దూరంగా జరిగిపోయింది. సామాన్యుడికి డబ్బున్న ఆసామికి మరింత వ్యత్యాసాన్ని పెంచింది. విద్యలో కూడ ఈ వ్యత్యాసం కళ్ళకు కట్టినట్టే కన్పిస్తోంది. సాంకేతిక విద్య సమస్తం ‘ఆంగ్ల’ భాష లోనే ఉండడం వలన అంతర్జాతీయ భాష అనుకొని దాన్ని అభ్యసించక తప్పడంలేదు. సాంకేతిక విద్య ఔన్నత్యాన్ని గుర్తించే క్రమంలో సాహిత్యం వంటి కళలు, కళల్లోని సాంస్కృతిక మహత్తును గుర్తించలేక పోవడం విషాదం.
ఇదంతా ఒక కోణం అయితే ఆడపిల్లలకు చదువు – భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళయినా ‘ స్త్రీకి విద్య అవసరమా’ అన్న పూర్వకాలపు డిబేట్స్ జరుగుతున్నాయి అంటే ఆశ్చర్యమే. మరీ ముఖ్యంగా దిగువ తరగతి , దారిద్ర్యరేఖ అంచున ఉన్న కుటుంబాలలో ఆడపిల్లల చదువు అంతంతమాత్రమే. తల్లిదండ్రులు పనికి వెళ్ళడంతో పదేళ్ళయినా నిండని ఆడపిల్ల తన చెళ్ళెళ్ళకీ తమ్ముళ్ళకి ‘అమ్మ’ అయిపోతోంది. మగబిడ్డతో పాటు ఆడపిల్లకీ కార్పొరేట్ ఫీజులు కట్టలేని పరిస్ధితి. ఈ పరిణామానాన్ని శీలా సుభద్రాదేవి ఆవేదనతో మన ముందుంచారు….
“కాలం శైశవ కుబుసాన్ని తొలగిస్తుంటే
అక్షరజ్ఞానం కోసం కొందరు
అన్నం ముద్ద కోసం మరికొందరు
తల్లిదండ్రుల కలల్ని తమ కళ్ళల్లో అతికించుకుని
బడిబాట పట్టి
ఇష్టంగానో కష్టంగానో
విద్యా వ్యవసాయం సాగుతో
లేత మెదళ్ళలో పాఠాల నాట్లు వేసుకుంటుంటే –
కుటుంబపోషణ భారమో
తోబుట్టువులని సాకే పనో ఉప్పెనై మీద పడేసరికి
భుజానున్న పుస్తకాల సంచితో పాటు
బాల్యాన్నీ మూటకట్టి మూలకి విసిరేసి
వయసుకి మించిన భారాన్ని చంకనేసుకొని
పసితనంలోనే ఆరిందలై పండిపోతున్నారు ఇంకొందరు…..
……అనాథ శరణాలయాల్లో
దయాధర్మంగా విదిలించిన ఉపాహారాన్ని
రుచి ఎరగని నోట్లో కుక్కుకొని
పుస్తకాలైనా తమ బతుకుల్లో తెరుచుకొని
చీకట్లు తరిమి కొడ్తాయని కోటి ఆశల్ని
గుండె నిండా వెలిగించుకొనే అనాథ పాపల సంగతి తెలిసిందే కదా!”
బాలల అందరికీ నిర్బంధ విద్య అందించని ఈ ఆర్భాటపు చదువులు ఎందుకు? ఎవరి కోసం? ఉపాధ్యాయవృత్తికి అంకితమైపోయిన సుభద్రాదేవి పేద విద్యార్థుల అరకొర సౌకర్యాలు చూసి ఎంత వ్యథ చెందుతారో, ఆమాత్రం చదువుకోగలిగే అవకాశం కూడా లేని అభాగ్యుల గురించీ అంతే మథన పడతారు ….
“తాము కోల్పోయిన హక్కేమిటో కూడా తెలియక
అక్షరాల్ని దిద్దాల్సిన చిన్నిచేతుల్తో
చెత్తకుప్పలో చిక్కుపడిన చెత్త కాగితాల్ని
ఏరుకుంటూ ఏరుకుంటూనే
బాల్యాన్ని పారేసుకునే వీథి బాలికలు కోకొల్లలు కాదా!”
ప్రైవేటీకరణ ప్రభావంతో “విద్య” తన సహజమైన ‘తేజస్సు’ను పోగొట్టుకుంది. అంత చదువు చదివీ ప్రైవేటు (అరకొర చదువుకొన్న) యజమాని దయాదాక్షిణ్యాల మీద బతుకు ఈడ్వడం ఎంత కష్టమో అనుభవించే వాడికే తెలుస్తుంది. భరించలేక ఉపాధ్యాయుడు మరో చోటుకి మారిపోతాడు. ఎప్పుడైతే నిలకడ లేని ఉపాధ్యాయుడు నిలకడగా పాఠం చెప్పలేడో, విద్యార్థికి అందవలసిన విద్య అందే అవకాశం లేదు. ఇదంతా ప్రపంచీకరణం లోని పైశాచికత్వానికి ఉదాహరణే. ఉద్యోగుల ఉద్యోగాలు తగ్గింపుల కారణంగా జరిగేది విద్యా ద్రోహమే. విద్యారంగంలో ప్రైవేటైజేషన్ విషఫలాల్లో ‘నిరుద్యోగం’ కూడ ఒకటి.
స్వార్ధపూరితమైన, బ్రిటీష్ వారు బీజాలు వేసిన విద్యావిధానాలను త్రోసిరాజని, విద్య ‘ఉద్యోగం’ కోసమే కాదు – విజ్ఞానం కోసం అన్న భారతీయ పునాదుల మీద నిర్మించబడితేనే నేటి విద్యారంగం సత్ఫలాలను అందించగలదు.
(మరో రంగంపై ఎటువంటి దుష్పరిణామాన్ని చూపిందో వెల్లడించిన కవితల్ని మరోవారం చూద్దాం).