ప్రపంచీకరణ అనర్థాలపై కలాల గర్జన-3

0
14

[box type=’note’ fontsize=’16’] జీవితాన్ని ప్రతిబింబించడం కవిత్వం యొక్క ముఖ్య లక్ష్యం. వర్తమాన ప్రపంచ ధోరణిని కవిత్వీకరించాల్సిన బాధ్యత కవికి ఉంది. కనుకనే ప్రపంచీకరణ ప్రభావం సమాజం మీద, ప్రజా జీవనం మీద ఎలా వుందో ఆధునిక కవులు విశ్లేషిస్తున్నారు. అలాంటి కవిత్వాన్ని పరిశీలించి విశ్లేషిస్తున్నారు,  ప్రఖ్యాత విమర్శకులు  డా.సిహెచ్.సుశీల. [/box]

సాంస్కృతిక కాలుష్యం

“సంస్కృతి”ని విద్యలో భాగంగా నిర్ణయించాలంటూ NCERT వారు చర్చాపత్రంలో ప్రముఖంగా నిలిపారు. భారతీయ సమాజంలోని వైవిధ్యం, సాంస్కృతిక భిన్నత్వాలను బోధనా విధానాల్లో మమేకం చేయాలని నిర్ణయించారు. కాని ‘లోక్‌శాల డాక్యుమెంట్’ 1995లో ప్రవేశపెట్టడంతో ప్రపంచీకరణ ప్రభావం నిలువెత్తున కనబడింది. ‘డిపెప్’ ద్వారా ‘సర్వశిక్షా అభియాన్’ పధకాన్ని ప్రవేశపెట్టినా అనుకున్నంత అభివృద్ధి కనిపించడం లేదు. నిధుల పర్యవేక్షణ మరింత పెంచాల్సి వుంది. రానురాను ‘వలస పాలన వారసత్వం’ వేళ్ళూని, విద్యాలయాల్లో కీలక నిర్ణయాలు తీసికొనే అధికారం రాష్ట్రాల రాజధానుల నుండి ఢిల్లీకి, ఢిల్లీ నుండి ‘వాషింగ్టన్’కు బదిలీయయ్యాయని అనిల్ సద్గోపాల్ (ప్రపంచీకరణ – భారతీయవిద్య – రాజకీయాంశాలు – ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ల వారి ప్రచురణ) మన మరో వలస విధానాన్ని వెలుగులోకి తెచ్చారు.

‘సంస్కృతి’ విద్యార్ధుల్లో పంచాల్సిన, పెంచాల్సిన ఉపాధ్యాయుల పదవీవిరమణల తర్వాత కొత్త వారికి ఉద్యోగావకాశాలు లేక, పాఠశాలలు నిస్తేజమయ్యాయి. ప్రపంచీకరణ కనుసన్నలతో కొత్త ఉద్యోగాలు లేవు. తక్కువ జీతాలకు పనిచేసే ‘తాత్కాలిక’ వగైరా పేర్లతో ఉపాధ్యాయులతో కాలం గడిపేస్తున్నారు. వారికి శాశ్వత ఉద్యోగ భద్రత రాకుండా తగినంత జాగ్రత్తలతో నిబంధనల చట్రాల్లో బిగించేస్తారు. ఉపాధ్యాయులు లేని విద్యాలయాల్లో సంస్కృతీవికాసం ఎలా వుంటుందో

ప్రపంచ సంస్కృతులన్నిటినీ
కాక్ టెయిల్చేయాలనేమో
డిష్ యాంటీనా సాక్షిగా….
అన్ని దేశాల సంస్కృతులనీ హారతికర్పూరం చేసాడు
వ్యాపారి కానివాడికి జీవనం లేకుండ చేసాడు…

వీర్ల గంగాధర్డిష్ యాంటినా’ కవిత లో వెల్లడించారు.

ఒక్కోజాతిది ఒక్కో ప్రత్యేకత. అటు భాషలోనూ, ఇటు జీవనవిధానం లోనూ, జానపదులలోనూ, పట్టణప్రజలలోనూ, సంగీతంలో, నాట్యంలో అన్నీ వైవిధ్యాలే! అన్నీ ప్రత్యేకతలు గలవే! కానీ

చాపకింద నీరై
సాంస్కృతిక దాడి సాగిస్తున్న….

నేపథ్యంలో ధ్వంసం అవుతున్నాయని ‘ఆలోచించు’ కవితలో ఆలోచింపజేసారు.

ప్రపంచీకరణ మూలంగా ప్రపంచం మొత్తం ఒక ‘గ్లోబల్ విలేజ్’గా మారిపోయిందన్న విషయం ఇతర విషయాలలో కాకపోయినా సంస్కృతిపరంగా చాలవరకు ఋజువైంది. విదేశీ ఛానళ్ళు, సినిమాలు, ఇంటర్ నెట్ వంటి అత్యాధునిక మీడియాల వల్ల పట్టణం నుండి పల్లె దాకా విదేశీ సంస్కృతి విషబీజం విరుచుకుపడింది. మానవసంబంధాలు, విలువలు నశించిపోవడానికి బీజాలు పడ్డాయి. ఈ విషసంస్కృతి ప్రభావం పసిపిల్ల మీద కూడ ఏ మేరకు ప్రసరించిందో మందరపు హైమవతిమనకేం మనం బాగానే వుంటాం’ అనే కవిత లో ఆవేదన వ్యక్తం చేసారు….

పదమూడేళ్ళ నాయిక
పదో క్లాసు తూలి యవ్వనం
దేహాల సయ్యాటల ప్రేమాయణం
ఆకర్షణీయం
మన పిల్లలు – ఆడపిల్లలు
జీవితం ప్రారంభం లోనే
తప్పటడుగులు వేస్తే తప్పెవరిది?”

అన్ని వైపుల నుండి ఈ విషసంస్కృతులు అందమైన ముసుగులు వేసుకొని అమాయక ఆడపిల్లల్ని ఆకర్షిస్తుంటే తనను తను రక్షించుకోలేని బిడ్డలకు జాగ్రత్తలు చెప్తూ, ప్రముఖ రచయిత్రి శీలా సుభద్రాదేవిభద్రం తల్లీ’ అనే కవితలో హెచ్చరిస్తున్నారు.

ఒంటినిండ సీతాకోకచిలుకల్ని అద్దుకొనీ
కొత్తగా విచ్చుకుంటున్న యవ్వనాల్నీ
ఆవరణమంతా ఎగురుతున్న ఊహల తూనీగల్ని
సమన్వయించుకోలేక
మెల్లమెల్లగా క్రమశిక్షణ కుబుసాల్ని
ఒక్కటొక్కటే జారవిడుస్తూ
గూడుదాటి కొమ్మలపై గెంతే పక్షిపిల్లనై
ఎదుగుతోన్న రెక్కల్ని విదిలించి
స్వేచ్ఛను తొడుక్కుంటూ
ప్రతి కన్నెగుండె మీలాగే పరిమళించే
పూలచెట్టవుతుంది.
ఒక వైపు
సమ్మోహనపరిచే బుల్లితెర చమక్కులు
రంగుల తారాతోరణాల వెండితెర జిలుగులు
అరచేతి నెట్టింట్లో ఆవాహన చేసే
రహస్య స్నేహితులు…..

ఈ విచ్చలవిడి దాడులలో, సాంస్కృతిక విష కాలుష్యాలలో యువత బలైపోకుండా కాపాడుకోవడం తల్లిదండ్రుల. అధ్యాపకుల, సమాజ బాధ్యత.

నేటి విజయవంతమైన సినిమాల్లో కథ అయితే ‘ప్రేమ’ కథ, కాకపోతే ‘సీమ’ కక్ష కథ. అధికారంకోసం, ఆధిపత్యం కోసం, ‘పరువుహత్యల’ నేపధ్యంలో తలలు నరుక్కునే కథలు ఎన్నేళ్ళ నుండో వెండితెర మీద వెలుగుతున్నాయి. ఇక యువతరాన్ని ఆకర్షించడానికి కాలేజీ, రాగింగ్, ప్రేమ కథలు చూసి అదే జీవితం అనుకుని భ్రమలో బతుకుతున్నారు నేటి యవతీయువకులు. తనను ప్రేమించమంటూ వేధిస్తూ, చివరికి క్లాస్ రూం లోనే ఒక అమ్మాయి తలను నరికిన ప్రేమ (?) పిచ్చివాడి సంఘటన గుంటూరు, విజయవాడలలో జరిగినప్పుడు డా.సిహెచ్.సుశీల తన తీవ్ర ఆవేదనను యిలా వెలిబుచ్చారు….

నీ మరణం
ఒక సత్యాన్ని చాటి చెప్తోంది
యుద్ధం అనివార్యమని.
నీ ఆడతనం
ఒక నిజాన్ని వెల్లడిస్తోంది
నైతిక విలువలు ఇంతగా దిగజారిపోయాయాని
నీ నిస్సహాయత
ఒక ముల్లుగా గుచ్చుతోంది
ప్రేమ అనే పదం ఎంతగా భ్రష్టు పట్టిందో అని
నీ పసిగారే చిట్టిమోము
ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తోంది
ఇంకా ఎంత కాలం ఈ శారీరక మానసిక వేధింపులని
నీ ఖండిత దేహం
ఒక ప్రశ్నను సంధిస్తోంది
నీ మరణానికి కారణం ఒక్కరేనా అని!!

ఆమె మరణానికి కారణం ఒక వ్యక్తి మాత్రమే కాదు. విషసంస్కృతితో నిండిన సమాజం, సినిమాలు, పరిసరాలు, వ్యక్తుల వికృత మనస్తత్వాలు, తల్లిదండ్రుల నిర్లక్ష్యం… కారణాలు.

మసిబొగ్గయిన బ్రతుకుల్లో
ఓ నిప్పుకణిక మోగించి ఊపిర్లేద్దాం
నిరసన జెండాలై ప్రతిధ్వనిద్దాం….
బహుళ జాతి కంపెనీల కనుసన్నలల్లో
పంచభూతాలన్నీ శిక్షణపొందుతున్నాయి
వినోదం, విజ్ఞానం పంచాల్సిన ఛానళ్ళన్నీ
మార్కెట్ వస్తువుల విలాసప్రచారం చేస్తున్నాయి

అంటూ ‘రాధేయ’ టి.వి.ల స్వాతంత్ర్యాన్ని, డబ్బుకోసం దాని పతనమైన పారతంత్ర్యాన్ని విమర్శ చేసాడు తన ‘ఎడారి వసంతం’ లో.

ఊళ్ళు బీళ్ళవుతున్నాయి
పల్లెలు తల్లడిల్లిపోతున్నాయి
పట్టణంలోని సంస్కృతి, సభ్యతలు
అశ్లీలం అంచులు దాటి దూసుకుపోతున్నాయి

దాక్షిణాత్యంలోని కర్ణాటక సంగీతపు అమృతగంగ ‘ఫ్లోరిన్’ కలిసిన నీరులా పనికిరాకుండా పోయింది. ఔత్తరాహికమైన హిందూస్తానీ బాణీ వయోవృద్ధులకే పరిమితమై పరిహాసం పాలైంది. ఇక దేశవాళీ సంగీతం – జాతిపరంగా, వృత్తిపరంగా, ఉత్తేజాన్ని కల్గించేవి – ఉత్తుత్తి వినోదపు తిత్తులయ్యాయి. తెలుగులో ఏలపాటలు, ఈలపాటలు, జోలపాటలు, తలుపుదగ్గర పాటలు, సమర్తపాటలు, ఏరువాకపాటలు – ప్రపంచీకరణపు ఆధునికతాగృహంలో కసవుగా మారాయి. బుర్రకథలు, హరికథలు, జక్కులకథలు, శారద కథలు నామావశేషాలయ్యాయి. భరతనాట్యం, కథాకళి, మణిపురి, కూచిపూడి, భోజ్‌పురి, ఒడిస్సీ లాంటి అద్భుత నృత్యరీతులు “ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రవేశించిన వ్యాపార సంస్కృతి” ముందు బలాదూరయ్యాయి. బలహీనమయ్యాయి. మన ‘Unity in Diversity’ సంస్కృతిని వస్తువినిమయ సంస్కృతి వెక్కిరిస్తోంది.

నా చిరతల రామాయణం
లల్లాభి, కోలాటలు
అంకెలు, అశ్శరభ శరభలు
తాళో, ఏలో, ఎంకమ్మ పాటలు
పాప్ మ్యూజిక్
టేక్ ఇట్ ఈజీ పాలసీపాటల్తో తన్నుకెళ్ళారు కదరా

అని ‘జూలూరు గౌరీశంకర్’ వర్ణించిన తీరు వర్ణనాతీతం. ఈ అంశాన్నే ‘ప్రపంచీకరణ – పరిణామాలు: ప్రతిఫలనాలు: స్త్రీల కథలు’ అనే ‘వాజ్మయి’ వ్యాసంలో ప్రొ. కాత్యాయనీ విద్మహే

సామాజిక పునాదిలో వచ్చే మార్పులు ఉపరితల
సాహిత్య సాంస్కృతి కార్యాలను ప్రభావితం
చేస్తాయన్నది ఒక ఆమోదిత విలువ

అని ఆమోదించారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలు, జానపదాంతర్గత జీవనశైలి వృత్తాంతాలు, గ్రామీణ వాతావరణంలో పుట్టిన కోకొల్లలు సంగీతబాణీలు, నృత్య పదవిన్యాసాలు, ప్రదేశాలను బట్టి, భాషలను బట్టి, పనిపాటలను బట్టి, వ్యక్తి సంబంధాలను బట్టి, పౌరాణికపు అంతరువులను బట్టి, ఆధ్యాత్మిక చింతనను బట్టి, సాంఘిక ఔన్నత్యమును బట్టి “సంస్కృతి” మూడు పువ్వులు ఆరు కాయలు లాగా వృద్ధి చెందాలి. కానీ…..

ఏటి ఒడ్డున ప్రయాణం’లో భగ్వాన్ ప్రపంచమంతా ఎలా డబ్బు వస్తుంది, ఎలా సంపాదించాలి – అన్న ధ్యాస తప్ప మరోది లేదని, ప్రపంచమంతా రూపాయి చుట్టే తిరుగుతోందని చెప్పారు….

టేబుల్ మీద
రూపాయి బిళ్ళను తిప్పి
భూగోళం తిరుగుతోందన్నాడు”.

ప్రపంచీకరణ ప్రతిస్పందన’ లో కాలువ మల్లయ్య ఇలా ధ్వజమెత్తారు….

ప్రపంచమెంతో అందమైంది
ఎన్నెన్నో నాగరికతలు, జాతులు, సంస్కృతులు
ప్రకృతులు, చరిత్రలు, కళలు, సాహిత్యం,
పోరాటాలు, గెలుపు ఓటములు, జీవితాలను
గెలుచుకోవడం – ఇవన్నీ లేనిఒక మూసలో
పోసినట్టుండే సమాజాన్ని, సంస్కృతిని
తయారుచేస్తాననడం, ప్రపంచమంతా
ఒకే గ్రామం అని నీతి వాక్యాలు పలకడంలో
ఎంత దుర్మార్గముంది !….
ఇలానే ఉండాలి, ఈపాట పాడాలి
ఇలానే నడవాలి……
అని శాసించడం సరైనదేనా!!

అని ప్రశ్నిస్తారు. అలాగే ఈ అంశానికి సంబంధించిన ఇలాంటి కవితలు, వ్యాసాలను “ప్రపంచీకరణ – ప్రతిధ్వని “ పేరుతో మంచి, ఉపయోగకరమైన సంకలనాన్ని తన సంపాదకీయంతో తీసుకొని వచ్చారు ప్రొ. యస్వీ సత్యనారాయణ.

మన సంస్కృతిలో ఒక భాగమైన హస్తకళలు నిలదొక్కుకోడానికి నానా అగచాట్లు పడే పరిస్తితి వచ్చింది. కళంకారీ పని, కొండవీటి బొమ్మలు, నిర్మల్ పెయింటింగ్స్, లేపాక్షి బొటిక్ పనులకు విలువ లేకుండా పోయాయి. ఎల్లోరా గుహాలయాల నిర్మాణాలు, దాక్షిణాత్య దేవాలయాల అద్భుత శిలా శిల్ప చాతుర్యాలు ఎవరకీ అవసరం లేకుండ పోయాయి. పాశ్చాత్య సంగీత ఆల్బమ్, వెర్రెక్కిస్తున్న కొత్తకొత్త డాన్స్ లుకావాలిట. సైగల్, మహమ్మద్ రఫీ, పెండ్యాల, ఘంటసాల, రాజే‘స్వర’రావు, లతా మంగేష్కర్, సుబ్బలక్షీ, సుశీలమ్మ, జానకమ్మ గాత్రాల సుస్వర మధురసాలు మరుగునపడుతున్నాయి. బిస్మిల్లాఖాన్, ఉదయశంకర్, యామినీకృష్ణ, ద్వారం వెంకటస్వామి తెరచాటు కెళ్ళిపోయారు.

ఇలాంటి విదేశీ సాంస్కృతిక దాడులలో మనం నిలదొక్కుకుని, ముందు తరాల కోసం మన మహోత్కృష్టమైన ‘సంస్కృతి’ని కాపాడుకుంటేనే మన ప్రత్యేక వ్యక్తిత్వం, అస్తిత్వం చిరకాలం తన ఉనికిని నిలబెట్టుకుంటుంది. ‘ప్రపంచీకరణ’తో క్షణాల్లో మారుతున్న జనజీవనం సమాజానికి కొత్త రూపాన్ని, కొత్త శకాన్ని ఆవిష్కరిస్తాయి. దానికి అనుగుణంగా సమాజాన్ని, సాహిత్యాన్ని, సంస్కృతీ ధర్మాల్ని నాలుగు పాదాల్లో నడిచే విధంగా ప్రజలను జాగృతం చెయ్యవలసిన బాధ్యత కవి మీదే వుంది.

(మరో రంగంపై ఎటువంటి దుష్పరిణామాన్ని చూపిందో వెల్లడించిన కవితల్ని మరోవారం చూద్దాం).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here