ప్రతీదీ వ్యాపారమే

0
10

[dropcap]ఎం[/dropcap]డాకాలం ఏమో సూర్యుడు తనకు ఉన్న శక్తిని అంతా చూపించేస్తున్నాడు. గాలికి కూడా ఆయన అంటే భయం వేసి బయటకు రావటంలేదు. సాయంత్రమయితే కాస్త చల్లబడుతుందేమో అని ఎదురు తెన్నులు చూచేవారే అందరూ. ఎవరి పనులు వారు తలుపులు మూసుకుని ఇంట్లో కూర్చుని చేసుకోవటానికి అలవాటు పడ్డారు. అంతటి ఎర్రటి ఎండలో అల్లకల్లోలం సృష్టించాడు ఒక మూర్ఛవాడు. ఆ కలకలానికి ఎవరికి వాళ్ళు విషయం తెలుసుకుందామని బయటకు వచ్చారు.

“అయ్యో మూర్ఛవాడిలాగా ఉన్నాడు. బిందెతో నీళ్ళు పోయ్యాలి” అంటూ హడావిడి పడుతున్నారు ఇద్దరు సహృదయులైన ఆడవాళ్ళు. రోడ్డున పోయే ఒకటి అరా జనం కూడా అక్కడ చేరసాగారు, తమ తోటి మానవుని దురవస్థను పంచుకోలేకపోయినా చూసి జాలిపడదామని అనుకుంటూ.

బిచ్చగాని అవతారం చూస్తే నాలో బాధ బయలుదేరింది. చిరిగి పీలికలుగా మిగిలిపోయిన చిన్న గుడ్డ మొలకు, తైలసంస్కారం లేని జుట్టు, లోతుకుపోయిన కళ్ళతో గిలగిలా కొట్టుకుంటున్నాడు.

బిందెలు మీద బిందెలు పోస్తున్నారు వారు శ్రమ అనుకోకుండా.

“నీళ్ళు లేని ప్రదేశంలో పడ్డా కానీ, నీళ్ళు ఇలా ఎవరయినా పొయాలి అని తెలియని ప్రదేశంలో పడ్డా అతను చనిపోతాడు కదా” అంటున్న బామ్మగారి మాటలు కలవరపెట్టాయి ఒక్కక్షణం.

‘అమ్మబాబోయ్’ అనుకోకుండా ఉండలేకపోయాను.

ఈ లోపు మరొకరు తాళాలగుత్తి తీసుకు వచ్చి అతని గుప్పిటలో పెట్టారు. అతను కాసేపటి తరువాత కళ్ళు తెరిచాడు. అయోమయంగా చుట్టూ పరికించాడు. విషయం అర్థం కావటానికి కాస్త సమయం పట్టినా ఇది తనకు మాములే అన్నట్లు నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. అతని నల్లటి వంటి మీద మూర్ఛబిళ్ళ మెరుపు తప్ప మరే కాంతి లేదు.

అప్పటి దాకా తెరవనా వద్దా అని సంశయిస్తున్న కళ్ళు తెరుచుకోవటం ప్రారంభించాయి, చల్లని నీటితో వచ్చిన హాయికి అవి కొద్దికొద్దిగా విచ్చుకున్నాయి, పరిస్థితులను అర్థంచేసుకున్నట్లు అందరికీ నమస్కారం పెట్టాడు నలువైపులా తిరుగుతూ. అప్పటి అతని అవతారం ఎంతటి కఠినాత్ముడినయినా కరిగిస్తుంది.

అక్కడున్న వాళ్ళతో ఒకావిడ అప్పుడే ఇంట్లోకి వెళ్ళివచ్చి ఒక అయిదు రూపాయల బిళ్ళ చేతిలో పెట్టింది ఏదైనా కొనుక్కొని తినమని. తలా ఒకరు అంతో ఇంతో అలా ముట్టచెప్పారు. బిచ్చగాళ్ళ నందరినీ ఉద్ధరించలేకపోయినా కనిపిస్తున్న ఇతని కన్నా సహాయం చేద్దామనిపించింది. జేబులో ఉన్న రూపాయిని తీసి ఇచ్చాను. అప్పటికే వాడికి ఒక పది రూపాయల దాకా ముట్టింది. అలా తను సందు చివరిదాకా వెళ్ళేంతవరకూ ఉండి, ఎవరిదారిన వాళ్లు వెళ్ళిపోయారు.

***

ఆరోజు ఆదివారం కావటంతో సాయంత్రం సినిమాకు ఇప్పటి నుంచే పనులన్నీ చేసేసుకుంటున్నారు త్వరత్వరగా ఇంట్లో వాళ్ళు. మా పెద్దమ్మాయి చక చకా పూలు కట్టేస్తోంది. మా ఆవిడ సరే సరి ఊపిరి సలపని పనితో సతమతమవుతోంది. మా చిన్నవాడు “ఏం సాయం చెయ్యను” అంటూ వాళ్ళ వెనకాలే తిరుగుతున్నాడు. సినిమా అంటే అందరికీ సరదానే. ఆనందించటానికి, డబ్బు తగలెయ్యడానికి మొదటగా చెప్పుకునేది అదే కదా. అందరూ తెముల్చుకున్నాక సిటీ బస్సులో ఎక్కి అప్సరా టాకీస్ దగ్గర దిగేటప్పటికి అరగంట పట్టింది. అప్పటికే తుర్రుమన్న నా చిన్న కొడుకు గేటు దగ్గరే మాకు ఎదురు వచ్చాడు ‘టిక్కెట్లు అయిపోయాయి’ అంటూ. నిరుత్సాహం వాడి ముఖంలో తాండవిస్తోంది. ఇక చేసేది ఏమీ లేక వేరే సినిమాకు వెళదామని అనుకున్నాం. ఏ థియేటర్‌కి వెళ్ళాలో తర్జన భర్జన లాడుతున్నారు.

నేను పరిసరాలను గమనించటంలో మునిగిపోయాను. కొత్త సినిమా కావటంతో కొట్టుకు చస్తున్నారు జనాలు. నేల, బెంచీల లైను మెలికలు తిరుగుతూ రోడ్డుమీదకు వచ్చేసింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ తోసేసుకుంటున్నారు. ఎవరి తాపత్రయం వాడిదే. టిక్కెట్టు దొరకదేమో అనే సంశయమే. వచ్చి సినిమా చూడకుండా వెళ్ళలేరు. అందుకే అంత త్రొక్కిసలాట. ఇంతలో ఇద్దరు బిచ్చగాళ్ళు తమ జోలి కర్రతో సహా వచ్చి నిలబడ్డారు.

ముందు ఆశ్చర్యపోయినా వాళ్ళు మాత్రం మనుషులు కాదా? వాళ్ళకు కోరికలు ఉండవా? అని నన్ను నేనే సమాధానపరచుకున్నాను.

కానీ ఈనాడు బిచ్చగాళ్లకే బ్యాంకు బెలెన్స్ ఎక్కువని ఇతనికి తెలియదు. అందుకే అంత ఆశ్చర్యపోతున్నాడు,

జీవితంలో ఒక్కో రోజు అంతే. వింతలన్నీ ఒకే రోజు కనబడతాయి. ఇంతలో వాళ్ళలో “ఒకడు అరేయ్ ఆ మూర్ఛబిళ్ళ జాగర్తరా. అది పోతే మన పని గోవిందా. గోపి గాడి ఆధారం పోతుంది” అంటున్నాడు.

“వాడి అద్దె డబ్బులు వాడికివ్వగా పదిరూపాయలు మిగిలాయి, అవి సరిపోతాయిగా” మళ్ళీ అతనే అన్నాడు.

“రేపు ఏ వీధికి?”

“ఆలోచించాలి. ఒక సారి పడిన చోటికి మళ్ళీ పడితే పైసలు రావు.”

“అరేయ్ అసలు నీకు మూర్ఛ రోగం లేదని తెలిస్తే జనాలు తన్ని తగలెయ్యరు?”

“ఆఁ! పోరా! ఈ కాలంలో ఒక బిచ్చగాడి గురించి అంత అలోచించేదెవరు. జేబులో డబ్బులు ఉండి వెయ్యాలనిపిస్తేనే పోతారు. లేకపోతే ఒక జాలి చూపు మన మీద పడేస్తారు అంతే!” మామూలుగా చెప్పేసాడు.

ఎంత టూకీగా చెప్పేసాడు రెండు ముక్కలలో. ఈ సారి కూడా ఆశ్చర్యపోవటం నా వంతు అయింది. ప్రొద్దున నీరసంగా కనిపించిన అబ్బాయి ఇతనే అంటే ఎవరూ నమ్మరేమో. తేలికగా మోసపోయామా అనే అనుమానం కూడా వేసింది. మధ్యాహ్నం బామ్మగారి వాఖ్య గుర్తుకొచ్చింది.

“బిచ్చగాళ్ళలో వేషాలు ఎక్కువయిపోయాలు. వీడసలు నిజమయినవాడో కాదో.”

‘ఛ ఛ ఆవిడలా అంటుందేమిటి’ అనుకున్నాడు తను ఇప్పుడేమయింది.

ప్రతీ వాడికీ ఇలాంటి కేసు ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి రాకపోదు. వేషమేమో అని నీళ్ళు పొయ్యకుండా ఉంటే ఎవడికి కష్టం? అదే నిజమయిన మూర్ఛవాడు అయితే ఆ పాపం ఎవరిది? అలా అద్దెలకు తెచ్చుకునే వాళ్ళవా? తిండి కోసం అద్దెకు తమ ప్రాణాన్ని ఒడ్డుకునే వాళ్ళవా? ఎవరిది? ఎవరిది? ఇందులో ఎవరు ఎవరిని అన్యాయం చేసుకుంటున్నారు అనుకుంటే మనల్ని మనమే అంతే.

మూర్ఛబిళ్ళను అద్దెకు ఇచ్చినప్పుడు అతనికి మూర్ఛ వస్తే ప్రమాదం కదా? డబ్బు కోసం ఎంతకయినా తెగిస్తారు. డబ్బు లేనిదే ఏదీ జరగదు కదా. ఈ సమాజంలో ప్రతీదీ వ్యాపారం అయిపోయింది.

“నాన్నా శైలజాకి వెళ్దాం” అని నా చెయ్యి పుచ్చుకుని లాగాడు మా చంటి. వికల మనస్కుడినై నేను అన్యమనస్కంగానే అటు కదిలాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here