ప్రతి ఒక్కరూ అవసరమే

0
15

[dropcap]జం[/dropcap]తువులన్నీ చెరువు నాలుగువైపులా చేరి నిల్చున్నాయి.

“ఇప్పుడు చెప్పండి. ఏం జరిగింది?” అడిగింది సింహం గర్జిస్తూ.

ఉడుత వెక్కిళ్ళు పెడుతూ, “నేను నీళ్ళు తాగుదామని చెరువులో మూతి పెట్టానో లేదో, ఎవరో నా ముక్కుని కొరికారు” అంది.

“నా నాలుక పీకారు” అంది జింక

“నా కళ్ళలో పొడిచారు, కొంచెం ఉంటే చూపు పోయేది. దాహం అందరికీ వేస్తుంది. ఇప్పుడెలా” అంది కోతి.

ఎవరికీ ఏమీ అర్థం కావడం లేదు.

చెరువులో చేపలు దుడుకు చేష్టలు చేస్తున్నాయి. కొన్ని క్షణాల పాటు పైకొచ్చి గాలిలో ఎగిరి, మళ్ళీ నీటిలో మునిగిపోతున్నాయి.

ఒక ముసలి తాబేలు నీళ్ళల్లోంచి ముఖం బయట పెట్టింది. “ఈ చెరువులో మేము కాకుండా మొసలి, కప్పలు, చేపలు ఉంటున్నాయి. ‘ఈ చెరువు మాది’ అని చేపలంటున్నాయి” అని అన్ని జంతువులతో చెప్పింది.

గాడిద మధ్యలో కలుగజేసుకుంది – “చెరువు మన అందరిది. నేను వెళ్ళి నీళ్ళు తాగుతాను, చూస్తాను, నన్నెవరు ఆపుతారో…” అంటూ నీళ్ళ దగ్గరికి వెళ్ళింది. బుడుగు బుడుగుమంటూ నీళ్ళ చప్పడు వినిపించింది. కొన్ని గుక్కల నీళ్ళు తాగిందో లేదో, దాన్నెవరో నీళ్ళల్లోకి లాగేసినట్లయింది. ఇంతలో భారీ చేప ఒకటి బయటకొచ్చి, గాడిద ముక్కు కొరికి నీటిలో దూకి మాయమైంది. గాడిద బాధగా వెనుతిరిగింది.

“ఓహో! ఇదంతా చేపల ఆకతాయితనమన్నమాట. ఈ చెరువులో వందల చేపలున్నాయి, మనం ఇంకో చోటు ఏదైనా వెతుక్కోవాలి” అంది సింహం.

“వందలు కాదు… వేల చేపలున్నాయి. రోహు, మహాశీర్, కతలా, నైన్, స్టార్‌ఫిష్, గోల్డెన్ ఫిష్ వంటి చేపలున్నాయి. ఇంకా పలు ప్రమాదకర రకాలకి చెందినవి కూడా ఉన్నాయి. వీటిల్లో కొన్ని పెద్ద చేపల్ని కూడా తినేస్తున్నాయి” చెప్పింది తాబేలు నీట మునుగుతూ.

ఈ చిట్టి పిచ్చుక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉంది. “నేను సాయం చేయనా?” అని పిచ్చుక అడిగింది.

గుర్రం నవ్వింది. పిచ్చుక కేసి చూస్తూ, “చూడండి! ఏం మాట్లాడుతోందో… ముందు నీ సైజు చూసుకో.. నువ్వా మాకు సాయం చేసేది? నీ శరీరం మీద కొంచెం నీళ్ళు పడితేనే, నువ్వు ఎగరలేవు…” అంది హేళనగా.

“అరే, అసలు ఏం చెబుతుందో వినచ్చుగా” అంది ఉడుత.

“సరే.. కాసేపు అందరూ ఇక్కడే ఉండండి. నేనిప్పుడే వస్తాను” అని చెప్పి పిచ్చుక ఎగిరిపోయింది. కొంత సమయం గడిచింది. జంతువులన్నీ వ్యాకులపడుతున్నాయి.

“ఇక మనమేమీ చేయలేం. ఆ చిట్టి పిచ్చుక వల్ల మనకి సాయం చేయడం ఏమవుతుంది? వేరే ఏదైనా ఆలోచన చేస్తే మంచిది, లేదంటే ఈ అడవి వదిలి పోవాల్సిందే” అంది గుర్రం.

ఉన్నట్టుండి ఆకాశం చీకటిగా మారింది. ఆకాశంలో లెక్కలేనన్ని పక్షులు ఎగురుతూ వస్తున్నాయి. పక్షుల గుంపు వచ్చి చెరువు ఒడ్డున వాలింది.

“అరే, చూస్తుంటే పక్షుల సమూహమే వచ్చినట్లుందే, ఏంటి ఇవన్నీ కలిసి చెరువులో నీళ్ళు లేకుండా చేసేస్తాయా?” అంది గాడిద.

“కాదు మిత్రమా, సరిగ్గా చూడు. ఈ పక్షుల్లో చాలా వరకూ చేపలని ఆహారంగా తీసుకునేవే ఉన్నాయి. కొంగలు, డేగలు, పెల్కిన్, కింగ్‌ఫిషర్ వంటివి ఉన్నాయి…” అంది నత్త.

“అయితే?” అంది సింహం.

“నాకర్థం అయింది. ఇప్పుడు చెరువులో అలజడి రేగుతుంది…” అంది కోతి నవ్వుతూ.

అదే జరిగింది. పక్షులన్నీ ఒక్కసారిగా చెరువులోని చేపలపై దాడి చేశాయి. కొన్ని ఎలుగుబంట్లు కూడా వచ్చాయి. అవి చెరువులో దిగి కల్లోలం సృష్టించాయి.

చెరువులోని మొసలి, తాబేళ్ళు, కప్పలు తెల్లమొహాలేసుకుని ఒడ్దుకి వచ్చాయి.

కాసేపటికి ముసలి తాబేలు కూడా బయటకు వచ్చింది. నవ్వుతూ, “దాడి ఆపండి. చేపలు రాజీకొచ్చాయి, చెరువు అందరిదీ అని ఒప్పుకున్నాయి” అంది.

ఎలుగుబంట్లు ఒడ్డుకొచ్చేసాయి. పక్షులు కూడా ఏ దిశ నుండి వచ్చాయో అదే దిశలో ఎగిరిపోయాయి.

పిచ్చుక కేసి చూస్తూ, “నన్ను క్షమించు. నాకీ విషయం తెలియదు…” అని గుర్రం ఇంకా ఏదో చెప్పబోతుంటే, ఆ మాటలకి అడ్డొస్తూ… “పర్వాలేదు. జంతువులు ఒకదానికొకటి ఆహారమని మనం మరవకూడదు. కానీ మనలో ప్రతీ ఒక్కరూ ఇతరులకీ అవసరమే” అంది పిచ్చుక నవ్వుతూ.

“ఇక ఏమీ ప్రమాదం లేదు. అందరూ చెరువులో నీళ్ళు తాగచ్చు” అంది సింహం.

ఇక అడవిలో అంతా సాధారణ స్థితికి వచ్చేసింది.

***

హిందీ మూలం: మనోహర్ చమోలీ ‘మను’. అనువాదం: కొల్లూరి సోమ శంకర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here