ప్రతీ సమస్యకీ ఓ పరిష్కారం

0
8

[box type=’note’ fontsize=’16’] “పరిష్కారం లేని సమస్య ఉండదు. ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుంది. వివేకంతో మనం పరిష్కారం కనుక్కోవాలి” అని అంటున్నారు కొక్కెరగడ్డ వెంకట లక్ష్మణరావు ఈ బాలల కథలో. [/box]

[dropcap]రా[/dropcap]జు 5వ తరగతి చదువుతున్నాడు. తరగతిలో అందరి కంటే బాగా చదువుతాడు. చురుకుగా ఉంటాడు. ఆటల్లోనూ, అన్నింట్లోనూ అందరి కంటే ముందుంటాడు. అటువంటి రాజు గడిచిన పది రోజులుగా బడికి రావడం లేదు. ఎందుకు రావడం లేదని తోటి విద్యార్థుల నడిగారు సుందరం మాస్టారు.

అప్పుడు రమేష్ లేచి, “సార్… రాజుకు తల్లీ తండ్రి చిన్నప్పుడే చనిపోతే, మావయ్య ఇంట్లో ఉంటున్నాడు. పాపం పది రోజుల క్రితం ఆ మామయ్య జబ్బు చేసి చనిపోయాడు. నాకింక ఎవరు దిక్కునీ నన్వెవరు చూస్తారనీ రాజూ ఏడుస్తున్నాడు. ఎక్కడికీ రావడం లేదు… ఎవరితోనూ కలవడం లేదు. చచ్చిపోవాలని వుందంటున్నాడు సార్..” అంటూ చెప్పాడు.

“అయ్యో! రాజు కష్టాల్లో ఉన్నాడని నాకింత వరకూ తెలీదు… మీరైనా చెప్పవచ్చు కదరా! ఇప్పటికైనా తెలిసింది… వాడికి మనం.. నీకు మేమున్నామని భరోసా ఇవ్వాలి..” ధైర్యం చెప్పాలి. అని సుందరం మాస్టారు తక్షణం రాజు వద్దకెళ్ళాడు.

రాజు… ఒంటరిగా బాధపడటం గమనించిన సుందరం మాస్టారు… “రాజూ..” అని పిలిచారు.

రాజు ఆ పిలుపు విని… “మాస్టారూ! నేనింక చదువుకోనండీ.. నేను అనాథని” అంటూ ఆయన ఒడిలో పడి ఏడ్చేశాడు.

సుందరం మాస్టారు వాడిని అనునయంగా దగ్గరకు తీసుకుని.. “రాజూ నేనుండగా నువ్వు అనాథవు కావురా… సమస్యకు దూరంగా వెళ్ళడం అవివేకం… వివేకవంతుడు సమస్యను దూరం చేసుకుంటాడు. ఇలాంటి సమయంలోనే ధైర్యం, పట్టుదల తెచ్చుకోవాలి. ప్రతీ సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది. నీకు ఒక కథ చెబుతాను విను” అంటూ రాజులో ధైర్యం పెంచేందుకు పరిష్కర మార్గం సూచించేందుకు కథ చెప్పడం మొదలుపెట్టారు సుందరం మాస్టారు.

***

ఒక అడవిలో కొన్ని కుందేళ్ళు కలసిమెలసి హాయిగా నివసించేవి. సంపాదించిన ఆహారాన్ని తోటి కుందేళ్ళకు పెడుతూ, సుఖంగా జీవించేవి. ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు కానీ ఎలుగుబంటి కుందేళ్ళను చంపి తింటోంది. కుందేళ్ళ సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రాణాలు అరచేత పెట్టుకుని… బిక్కు బిక్కుమంటున్న కుందేళ్ళు సమావేశమై మరోక అడవిలోకి అందరమూ వెళ్ళిపోదాము అని నిర్ణయించుకున్నాయి. అప్పుడు వాటిలో ఉన్న ఒక పెద్ద కుందేలు ఇలా అంది. “చూడండి! సమస్యకు తలవంచి దూరంగా పోరిపోవడం అవివేకం అనిపించుకుంటుంది. సమస్యను దూరం చేసుకోవడంలోనే వివేకం ఉంటుంది. మన తాత కుందేలు తన బుద్ధి బలం ఉపయోగించి మృగరాజైన సింహాన్నే అంతం చేసింది. ఆ పాటి బుద్ధికి పదును పెడితే ఎలుగుబంటిని దూరం చేసుకోలేమా?” అని అంది. “అయితే ఉపాయం, సమస్యకు సరైన పరిష్కారం ఉంటే చెప్పవచ్చు కదా!” అన్నాయి కుందేళ్ళు. పెద్ద కుందేలు ఆలోచించింది. పరిష్కారం చెప్పింది. ఎలుకల సాయంతో పెద్ద గొయ్యి తీయించింది. దాని నిండా గడ్డి కప్పించింది. దానిపై కుందేళ్ళు బొమ్మలు ఆ గడ్డిపై పెట్టించింది. ఎప్పుడూ వచ్చే ఎలుగుబంటి అవి నిజమైన కుందేళ్ళని భావించి అక్కడకు వచ్చింది. ఇంకేముంది ఎంతో లోతైన గొయ్యిలో పడిపోయింది. తిరిగి లేవలేక ఎలుగుబంటి గొయ్యిలో పడి చనిపోయింది. కుందేళ్ళు హాయిగా జీవించసాగాయి. అవి వివేకంతో సమస్యకు సరైన పరిష్కారం ఆలోచించి సమస్యను దూరం చేసుకున్నాయే కానీ సమస్యకు దూరం కాలేదు.

***

“కాబట్టి రాజూ! ప్రతీ సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది. నిన్ను నేను చదివిస్తాను. బడిలో ఉచితంగా పుస్తకాలు, దుస్తులు ఇస్తారు. ధైర్యం పట్టుదల ఆత్మవిశ్వాసాలనే ఆయిధాలుగా చేసుకొని చదువుకో! ఉజ్వల భవిష్యత్‌కు బాటలు నిర్మించుకో!

ఒక దీపం మరెన్నో దీపాలను వెలిగించినట్లుగా నువ్వు చదివి పైకెదిగితే మరెంతో మందిని చదివించగలవు” సుందరం మాస్టారు చెప్పడం పూర్తి చేసి రాజు వంక చూశారు.

రాజులో సుందరం మాస్టారి మాటలు నూతన ఉత్తేజాన్ని కలిగించాయి.

“మాస్టారూ మీ మాటలు నా బాధను తగ్గించి కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించాయి. మీ మాటలు నాకు శిరోధార్యం” అంటూ బడిబాట పట్టాడు. సుందరం మాస్టారిని అనుసరించాడు.

నీతి: బాలలూ..! పరిష్కారం లేని సమస్య ఉండదు. ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుంది. వివేకంతో మనం పరిష్కారం కనుక్కోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here