ప్రతుష్టి

19
14

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో ₹ 2500/- బహుమతి పొందిన కథ. రచన శ్రీమతి సంధ్య యల్లాప్రగడ గారు. ఈ కథకు ప్రైజ్ మనీని అందించిన వారు సంచిక వెబ్ పత్రిక.]

“అజరామరవత్ప్రాజ్ఞః విద్యామర్థం చ సాధయేత్

గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్॥”

‘ప్రాజ్ఞులు తమను తాము అజరామరులు అన్నట్లు విద్యార్జన, ధనార్జన నిరంతరం చేస్తూనే వుంటారు. అదే ధర్మాచరణ విషయానికొస్తే వెంట్రుకవాసిలో మృత్యువు వుంటే ఎలా వుంటారో అంత జాగ్రత్తగా ధర్మాచరణ చేస్తారట. పితృదేవతల విధులు కూడా ధర్మాచరణమే’ అనుకుంది భారతి.

వెనక చిన్నగా అడుగుల చప్పుడుకు ఆలోచనల నుంచి బయటపడుతూ చూసింది, ఎదురుగా నవ్వుతూ కనిపించింది మనవరాలు.

“బామ్మా! ఏ దేవుడి గురించి ఆలోచనలు?” కొంచం ఎగతాళి మిళితమైన స్వరంతో అడిగింది.

భారతి సమాధానమివ్వక “నీకు ఇంకెన్ని రోజులే సెలవలు?” అడిగింది.

“అప్పుడే బోర్ కొట్టానా..” పగలపడింది ఆ పిల్ల.

“సరేలే..” మాట దాటవేసే ప్రయత్నం చేస్తుంటే, పిల్లది అల్లరిగా “బామ్మా! నీకో క్విజ్ పెట్టనా?” అంది.

“ఏంటో?” విసుగు దాచుకుంటూ అడిగింది భారతి.

మనవరాలు తుంటరిది. అమెరికాలో పుట్టి పెరిగింది. పైగా విశ్వవిద్యాలయంలో విపరీత ధోరణిల చదువులాయే.. ఇక పెద్దలంటే, హిందువులంటే ఎక్కడ గౌరవముంటుంది? భారతీయ సనాతన పద్ధతులంటే హేళన కూడా ఉంది. పైగా సమానత్వం నా తలకాయ అంటూ వాగుడొకటి.

సెలవలకు ఇంటి కొచ్చిందంటే భారతిని ఆట పట్టిస్తున్నాననుకొని సతాయిస్తూ ఉంటుంది.

ఆ పిల్ల పేరు శివాని.

ఇప్పుడు మళ్ళీ బామ్మను ఆటపట్టిస్తోంది.

“కెన్ ఐ సీ యువర్ గాడ్..” కనుబొమ్మలెగరేస్తూ ఒక చిన్న చిలిపి నవ్వుతో అంది.

“నీవు చూడలేవే. చూడాలంటే నీ కళ్ళు పేలిపోతాయి” అంది భారతి.

చురుకుగా చూస్తూ “నీవూ చూడలేదని ఒప్పుకో బామ్మా..” అంది పిల్ల.

“చూశాను!” చెప్పింది భారతి స్థిరంగా.

“దెన్ షో మీ..”

“నే చెప్పినట్లు చేస్తే నీవూ చూడగలవు..”

“అవునా, వాట్జ్ దట్? నీళ్ళలో మునగాలా? ముక్కు మూసుకు కూర్చోవాలా” హాస్యం ముదురుతోంది.

“నీవు ఆకాశంలో సర్వ గ్రహాలున్నాయని ఎలా చెప్పగలవు?” అంది భారతి.

“మాట మార్చకు, ఇట్స్ ప్యూర్ సైన్స్..”

“ఇదీ అంతే.. నీకు కనపడకపోతే లేనట్లేనా?”

“సరే సీరియస్.. నీవు చెప్పినట్లు చేస్తాను. చెప్పు. అసలు ‘టెన్ కమాండ్మెంట్స్’లా ఏమైనా నీతి సూత్రాలు పాటించాలా?” రుసరుసలాడింది శివాని.

“నాతో ఇండియా రా. దేవుడ్ని చూపటమేంటి జీవితమూ తెలుస్తుంది..”

“యు మీన్ లైఫ్? నో.. అక్కడ చాలా డర్టీగా వుంటది. నే రాలేను అక్కడికి..”

“చిన్నప్పుడు అన్ని కథలు వినేదానివి. ఇండియా వచ్చేదానివి. ఇప్పుడు నీకు బాగా పెద్దరికం వచ్చేసిందే. చాలెంజ్ అన్నావు. నే ఓడిపోతే నీవు చెప్పింది చేస్తాను, సరేనా..”

“సరే అయితే. బట్ నన్ను గుడులన్నీ తిప్పకూడదు..” షరతులు విధించింది మనవరాలు.

“సరే. మీ నాన్నతో మాట్లాడుతాను. ఇద్దరం బయలుదేరుదాం..”

***

“బామ్మా అసలు మీరంతా ఏదైనా డౌటు వస్తే ఎవరిని అడుగుతారు?”

శివాని, భారతి ఇండియా ప్రయాణంలో ఉన్నారు. ఇద్దరూ ఢిల్లీ వెడుతున్నారు. కొడుకుకు చెప్పి ఇండియా ప్రయాణమయ్యింది, మనవరాలిని తోడు తీసుకొని. చాలా సంవత్సరాల తరువాత మాతృభూమికి వెళ్ళటం భారతికి ఆనందంతో హృదయం నిండిపోయింది.

ఫ్లైట్‍లో ఇద్దరూ కబుర్లాడుకుంటున్నారు.

“ధర్మం అన్నింటి కన్నా గొప్పది. ఏదైనా మార్చవచ్చు, కాని ధర్మం తప్పరాదు. ధర్మాచరణలో ఏవైనా డౌట్స్ వస్తే తెలిసిన పెద్దలను అడగాలి..”

“హూ దట్ పెద్దలు? నీవు ఫోనులో కూడా దొరకకపోతే?”

“అదే చెబుతున్నా. ఎప్పుడూ ఎవరో ఒకరు తోడు ఉండరు. అందుకే రెండు బుక్స్ చదవాలి. ఎల్లప్పుడూ దగ్గరుంచుకోవాలి..”

“ఏం బుక్స్?”

“రామాయణం, భగవద్గీత. రామో విగ్రహవాన్ ధర్మః. రాముడు ధర్మాన్నే ఆచరించాడు. కాబట్టి మనకు ఏదైనా డౌట్ వస్తే రామాయణం చూడాలి. లేదా గీతలో వెతికితే సమాధానం తప్పక దొరుకుతుంది..”

“అనుకున్నా ఇలాంటి ఫిట్టింగు పెడతావని..”

“పిచ్చి మాటలు మాట్లాడకు. నీకు డౌట్ వస్తే దానికి సంబంధించిన బుక్ రిఫర్ చెయ్యవా? అలాగే ఇదీ..”

“సరే కాని దేవుడి మాటేమి చేసావు?”

“నే చేసేదేముంది? నీవే చూస్తావు. హిమాలయాలలో ఒక కష్టతరమైన, గొప్ప దారి ఉంది. ఆ దారిన పాండవులు తమ చివరి ప్రయాణం చేసి స్వర్గానికి వెళ్ళిపోయారు. ఆ దారిలో వెళ్ళి చూడగలిగితే నీకు గొప్ప అనుభవాలు, అనుభూతులు కలుగుతాయి. అది నేను నీ వయస్సప్పుడు వెళ్ళి వచ్చాను. అందుకే నీకూ దైవం గురించిన ఆ అనుభూతులు తెలియాలని తీసుకొస్తున్నా..”

“ఏ దారది?”

“స్వర్గారోహణ”

“వాట్!”

“నే రాలేను. నా బాడీ కోఆపరేట్ చెయ్యదు. కానీ నీకు నే కొందరు గైడ్స్ నిచ్చి పంపుతా. నీవు వెళ్ళిరా. నీవు ఓపెన్ మైండ్‌తో వెళ్ళు. తప్పక దివ్య అనుభూతులు కలుగుతాయి. తదనంతరం దేవుడి గురించి నీవే చెబుతావు..” నమ్మకంగా చెప్పింది భారతి.

***

సెప్టెంబరు నెల. భారతీయ టూరిస్టులు అప్పుడు హిమాలయాల వైపు చూడరు. చాలా క్షేత్రాలు చాలా ప్రశాంతంగా ఉంటాయా సమయంలో.

భారతీ, శివాని ఢిల్లీలో దిగి డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అక్కడ వాళ్ళు డెహ్రాడూన్ వెళ్ళే విమానం ఎక్కారు. విమానం దిగి బయటకొచ్చి వారి కోసం ముందుగానే బుక్ చేసుకున్న ట్యాక్సీ ఎక్కి బదరీనాథ్ వైపు ప్రయాణం మొదలుపెట్టారు.

***

రుషీకేష్ దాటాక హిమాలయాలు ఎక్కటం మొదలైయింది. హిమాలయాలలో రాత్రుళ్ళు బళ్ళు నడవవు. అందుకని ట్యాక్సీ అతను చమేలి వరకూ వచ్చాక ఆగిపోయాడు. చమేలి, గర్హ్వాల్ హిమాలయాలలో ఉన్న ఒక పెద్దపట్టణం. అక్కడ ఎక్కడ చూసినా మనకు మిలట్రీ జవానులు కనపడతారు. మెడికల్ కాలేజీ కూడా ఉన్న జిల్లాకేంద్రం చమేలి. ఆ రాత్రి అక్కడ ఒక హోటల్లో పడుకున్నారు బామ్మా, మనవరాలు.

మనవరాలు, బామ్మ ప్రక్కన చేరి అడిగింది, “అంటే నన్ను ట్రెక్కింగుకు పంపుతున్నావా?”

“అవును. నే చెప్పినట్లు వింటానన్నావుగా..”

“నే ఇప్పటి వరకూ చిన్న చిన్న ట్రెక్స్ చేసాను, మరీ తాతగారిలా ఎక్సపర్టు కాను..” అంది.

భారతి భర్త బ్రహ్మమూర్తి. గొప్ప మౌంటైనీయర్. అతను ఉత్తరకాశిలోని మౌంటైనీరింగ్ కళాశాలలో పనిచేసేవాడు. చాలా శిఖరాలనధిరోహించి పేరు తెచ్చుకున్నాడు. భారతి తన పాతిక సంవత్సరాల వయస్సులో ఒక అడ్వెంచరని గంగోత్రి నుంచి గోముఖ్ వెడుతుండగా పరిచయమయ్యాడు. చలాకీగా ఉన్న భారతి, మూర్తికి నచ్చింది. భారతికీ అభ్యంతరం లేకపోవటంతో, ఢిల్లీలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్న భారతి తండ్రి ఆమెకు మూర్తితో వివాహం జరిపించాడు. భారతికి ఒక్క కొడుకు. హృద్రోగనివుణుడై అమెరికాలో సెటిల్ అయ్యాక, కే2 పర్వతాధిరోహణలో మూర్తి మాయమయ్యాడు.

“ఇదీ మరీ పెద్దది కాదులే. నీవు కొలరాడో వెళ్ళావుగా. అంతలా ఉంటుందో, ఇంకా తక్కువే కూడా..” సర్ది చెబుతూ.

“సరే బామ్మా. మరి నీవెక్కడుంటావు అంత వరకూ. నే ఎన్ని రోజులు వెళ్ళాలో..”

“నే బదిరిలో ఉంటానే. నీవు వారంలో వస్తావు. కంగారుపడకు. మంచి అనుభవాలు కూడగట్టుకుంటావు. ఆ తరువాత నీకు సందేహాలు ఉండవు సరేనా..” నమ్మకంగా పలికింది భారతి.

మాట్లాడలేదు శివాని.

మరుసటి రోజు ఉదయం తయారై హోటలు వారిచ్చిన పుల్కా, కూర తిన్నారిద్దరూ. మళ్ళీ ట్యాక్సీ ఎక్కి బదరి వైపు ప్రయాణించారు. ఆ హిమాలయాల అందం పెరుగుతోంది అంతకంతకూ.

శివానీ తన హృదయంలో ఏదో శాంతి కలగటం గమనించింది. భారతికి ఏదో లోకంలో ఉన్నట్లుగా ఉంది.

బదరిలో వీళ్ళు చూసుకున్న చిన్న బస వద్దకు చేర్చాడు ట్యాక్సీ అతను.

ఇద్దరూ దిగి బదరీనాథ్‌లో సెటిల్ అయ్యారు. ఆ వాతావరణానికి అలవాటు పడటానికి రెండు రోజులు చాలనుకుంది భారతి. కాని జెట్‌లాగ్ వలన నాలుగు రోజులైయింది. బదరి సౌందర్యానికి చాలా ఆనందించింది శివాని.

“కోవెలకెళదాము రా..” అంది భారతి.

“నే గుడికి రాను..” మొండికెత్తింది శివాని.

“మాటిచ్చావు నే చెప్పింది చేస్తానని. ఓపెన్ మైండ్‌తో ఉంటానని..” గుర్తు చేసింది భారతి.

మారు మాట్లాడక గుడికొచ్చింది. ఆ చిన్న దేవాలయం చాలా పరిశుభ్రంగా ఉంది. ముఖ్యంగా జనాలు లేరు. తోసుకోవటమూ లేదు. ఇద్దరూ దర్శనం చేసుకొని ఆ ప్రాంగణంలో కూర్చున్నారు. చుట్టూ కనపడతున్న లోయ అందాలు, గుడి గంటలు ఒక అలౌకిక ఆనందాన్నిచ్చాయి. ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. గంట తరువాత లేచి ఆ హిమాలయ పట్టణపు వీధులలో తిరిగారు.

నాలుగు రోజులు చప్పున గడిచిపోయాయి.

ప్రశాంతమైన, అందమైన ఆ వాతావరణంలో ఆ దివ్య ఆధ్యాత్మిక కేంద్రంలో ఎవరి మనసైనా నిశ్చలం కాకమానదు. శివానికి కూడా చాలా కుదురు కలగటం గమనించింది భారతి. నాలుగో రోజు మౌంటైనీరింగ్ వాళ్ళతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వాళ్ళు శివానిని తీసుకువెళ్ళాలి. ఆ ట్రెక్‌కు సాధారణంగా ముగ్గురు నుంచి పది మంది వరకూ వెడతారు. కాని వీళ్ళు కావాలన్నారని ఒక్కరైనా శివానిని తీసుకు బయలుదేరినా చివరి నిముషంలో ఆస్ట్రేలియా నుంచి ఒక యాత్రికుడు చేరాడని చెప్పారు వారు. భారతికి నచ్చలేదు. కాని చెయ్యగలిగేదేమీలేదు. శివానికి మళ్ళీ గుర్తు చేసింది “ఓపెన్ మైండ్‌తో పరిసరాలు చూడు. మర్చిపోకు..” అంటూ

***

శివానికి మునుపు చేసిన పర్వతాధిరోహణ అనుభవం చాలానే ఉంది. ఆ బృందం ‘మనా’ గ్రామం దాటి, సరస్వతీ నది జన్మస్థలి వైపు సాగారు. అక్కడ భీమశిలను చూపించాడు గైడ్. శివానికి అంతా కొత్త. పైగా వాళ్ళ భాష అర్థం చేసుకోవటానికి తంటాలు పడుతోంది.

తోటి ప్రయాణికుడు రామ్ అనువదిస్తున్నాడు. అతనికి హిమాలయాలలో తిరగటం చాలా అలవాటని చెప్పాడు. వాళ్ళు ముందు వసుధార వరకూ వెళ్ళే సరికే చీకట్లు పడ్డాయి. ఆ రాత్రి వాళ్ళకి చంపోలిలో క్యాంపు. గుడారాలు వేశారు. వెచ్చటి టీ, మ్యాగీ ఇచ్చారు. ఇద్దరు ప్రయాణికులు కాక నలుగురు మౌంటైనీరింగ్ గ్రూపు, ఒక గైడ్ కలిసి ఐదుగురు వచ్చారు.

మరునాడు ఉదయం మూడు గంటలకు మెలుకువ వచ్చింది శివానికి.

బయటకు తొంగి చూస్తే మబ్బులేని ఆకాశం, మెరుస్తున్న మంచు పర్వతాలు, పున్నమి చంద్రుడు పోటీ పడుతూ, వెండిలా భూమి మెరుస్తూ అలౌకికమైన అందంతో ఉంది.

ఆమె ఆ మంచు పర్వతాలు చూస్తూ గడిపింది. మరునాడు వాళ్ళు పదమూడు కిలోమీటర్లు నడవాలి. ఆక్సిజన్ మరింత తక్కువవుతుంది.

కొలరాడో పర్వతాలలో, అమెరికాలోని మంచు పర్వతాలలో సౌందర్యం ఆమెకు తెలుసు. చలి, పర్వతాలు, పర్వతాల మీద మంచు కొత్త కాకపోయినా ఇక్కడ ఆమెకు ఏదో తేడాగా అనిపిస్తోంది. అదేమిటో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. శివానికి ఆ హిమాలయాల ప్రశాంతత అనుభవంలోకి వస్తోంది.

మరునాడు ఉదయం వారి నడక తిరిగి మొదలైయింది. లక్ష్మి వనం మీదుగా సహస్రధారను చూస్తూ చిన్నగా పెరిగిన పసుపు రంగు పూల మొక్కల మధ్య నడిచారు. ఆ దారంతా అదో సుగంధం మత్తునిస్తోంది. ఆ వాసన ఆ పూలదని గైడ్ చెప్పాడు. పాండవులు నడిచిన ఈ దారి వారిని స్వర్గానికి తీసుకుపోయిందని, ఈ దారిలో నడిచే వారికి గొప్ప ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతాయని చెప్పాడు గైడ్.

ఆ దారిలో పాండవులు నడిచారు కాబట్టి, అక్కడ కాలు పెట్టిన వారికి గొప్ప అనుభూతులనిస్తారు పితృదేవతులు అన్నాడు గైడ్.

శివానికి నమ్మకం లేదు ఇలాంటి లోకల్ స్టోరీస్ అంటే.

“పితృదేవతలంటే ఇక్కడ లోకల్ గాడ్సా?” అడిగింది తోటి ప్రయాణికుడైన రామ్‍ని.

అతను చిన్ననవ్వుతో, “కాదు శివాని. పితృ దేవతలంటే వారి వారి వంశ పెద్దలు. మన వంశంలో, కుటుంబంలో మరణించిన వారు పితృదేవతలలో కలుస్తారు. పైనించి మనిని చూస్తూ ఆశ్వీర్వదిస్తారు. మనకు ఇబ్బంది కలిగితే వారు దారి చూపుతారు. మన ప్రార్థన విని వెంటనే పలికేది వారే..” అన్నాడు.

“నీవు ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగావు. ఇవన్నీ నమ్మతావా?” అడిగింది శివాని తన చిరాకు దాచుకొని.

“ఎక్కడ పుట్టినా నేను నా రూట్స్, నా కల్చర్ మర్చిపోను కదా. అంతగా నమ్మనంటున్నావు. నీవు అమెరికన్స్‌ని నమ్ముతావు కదా. మరి వారు చేసే హలోవిన్, వారి పెద్దలను తలుచుకోవటమేగా. ప్రతి కల్చర్ లోనూ ఏదో రకంగా పెద్దలను తలుచుకోవటం ఉంటుంది. నీకో విషయం తెలుసా?” అన్నాడు ఆమెను చూస్తూ

“దేని గురించి?”

“ఈ దారి పాండవులు తమ చివరి ప్రయాణం చేశారని కదా మన పెద్దల నమ్మకం. ఈ దారిలో వచ్చిన నిజమైన భక్తులకు, అవసరమైన వారికీ పెద్దల దర్శనం కలుగుతుందని చెబుతారు..” చెప్పాడతను.

ఆమెకు ఇవ్వన్ని హిచ్‌కాక్ కథలనిపించాయి. అతనితో తర్కమనవసరం అని, అవి విని ఉరుకుంది.

రామ్ ఆమె ముఖం చూసి మౌనంగా గైడ్ ప్రక్కన చేరి నడుస్తూ అతను చెప్పే అనుభవాలు అడిగి అడిగి వింటున్నాడు.

ఆ రోజు రాత్రికి మళ్ళీ క్యాంపు వేసుకున్నారు. మర్నాడు అద్భుతమైన సతోపంత్ చూస్తారని, ఆ త్రిభుజాకార సరస్సు అక్కడికి దగ్గర్లోనే అని చెప్పాడు గైడ్. రాత్రి ఇచ్చిన ఆహారం తీసుకొని ఎవరి టెంటులో వారు విశ్రమించారు.

శివానికి మెలుకువ వచ్చే సరికే అర్ధరాత్రి రెండు. ఆమె పడుకునే ప్రయత్నం చేసినా సాగటం లేదు నిద్ర.

లేచి టెంటు నుంచి బయటకొచ్చింది. ఆకాశం నిశ్చలంగా ఉంది. వెన్నెల తెల్లని పుప్పొడి అద్దినట్లు నేలంతా మెరుస్తోంది. చంద్రుడు చాలా పెద్దగా అనిపించాడు. ఆ రోజు పౌర్ణమా? అనుకుంది ఆమె. నెమ్మదిగా జాకెట్ జిప్ వేసుకొని, మెడకు మఫ్లర్ చుట్టుకొని, తలకు ఉన్న క్యాప్ సరిచేసుకుంటూ నడిచింది. ఆమెకు కనుచూపు మేరలో మెరుస్తూ ఒక వింత ఆకారం కనిపించింది. అదో వైబ్రెంటు ఆకుపచ్చు రంగులో ఉంది. ఆ ఆకారం నడుస్తుంటే శివాని ఆమెకు తెలియకుండానే దానిని అనుసరించింది.

సడన్‍గా ఆ ఆకారం కనపడలేదు. కాని కళ్ళముందు గొప్ప ఆకుపచ్చ సరస్సు ప్రత్యక్షమైయింది. ఆ ఆకుపచ్చలో నీలం కూడా కలిసి మెరుస్తోంది. ఆ సరస్సు త్రిభుజాకారంగా ఉంది.

ఆ సరస్సు ప్రక్కన ఉన్న రాళ్ళలో ఒక రాయి మీద కూర్చొని ఆ లేక్‍ని చూస్తూ ఉండి పోయిందామె. దాని మీద నుంచి దృష్టి మరలటంలేదెందుకో. ఏదో బలంగా లాగుతోంది. శ్వాస నెమ్మదించింది. కన్ను మూతపడటంలేదు. నిశ్చలంగా ఆమె అలా కూర్చొని చూస్తుండగా, ఆ లేక్ నడుమన ఏదో కదలిక. అందులోంచి ఎవరో నీటి మీదకొచ్చారు. శివాని కూర్చున్న చోట కాక మరో వైపుగా సాగి ఆ లేక్‌లో మునిగి ఈత కొట్టడం మొదలెట్టారు. వారు అలా కాసేపు సరిగంగ స్నానాలాడి లేచి ఆ సరస్సు బయటకొచ్చి ఆకాశం వైపు ఎగురుతూ మాయమయ్యారు. శివానికసలు అర్థం కాలేదు. తను చూసినదేమిటో, జరిగినదేమిటో.. ఆమె చాలా సేపు అలా కూర్చుండిపోయింది. తరువాత ఎప్పటికో లేచి తన టెంటులోకి వచ్చి చూస్తే ఉదయం ఐదు దాటుతోంది. అంటే మూడు గంటలు ఆమె ఏదో లోకంలో విహరించింది. ‘అది కలా? నిజమా?’ అని తనను తాను ప్రశ్నించుకుంది. ‘ఈ విషయం చెబితే ఎవరన్నా నమ్ముతారా అసలు?’ అని ప్రశ్నించుకుంది.

ఏడింటికి గైడ్ బయలుదేరతీశాడు. గంట నడిచాక, “ఇది సతోపంత్ లేక్. శివుడు, విష్ణువూ, బ్రహ్మా దీనిలో స్నానం చేస్తారు ప్రతి పౌర్ణమికీ. నిన్న పౌర్ణమి. వారు వచ్చి ఉంటారు..” అన్నాడు.

ఆ దారి చాలా కష్టంగా ఉంది. రాళ్ళు.. సన్నని దారి. అడుగు తీసి అడుగు వెయ్యటం కష్టమవుతోంది. ప్రక్కన లోయలు. పడితే బ్రతకరు. అవి దాటుకొని నెమ్మదిగా వారు పైకి పైకి సాగారు. విష్ణుకుండు అన్న మరో సరస్సు చేరారు.

అటు నుంచి కనపడుతున్న పర్వతాలను చూపిస్తూ “ఇవి దాటితే చైనా. మనకు ఈ పర్వతాలను ఎక్కే అనుమతి లేదు. వచ్చిన దారినే వెనకకు మరలాలి..” చెప్పాడు గైడ్.

మళ్ళీ వారు మునుపు రోజు హాల్టు వేసిన చోటనే టెంట్లు వేశారు.

ఆ రాత్రి శివానికి తిరిగి మెలుకువ వచ్చింది. ఆమె తన కెమరాను తీసుకు బయటకొచ్చింది. మళ్ళీ ఆమెకు లీలగా ఒక రూపం దూరంగా కనపడింది. కాని ఆ ఆకారం ఆమెను చూడటంలేదు. పైగా ఆమె రహస్యంగా

ఫోటోలు తీసే ప్రయత్నం చేస్తే పోకస్ లోకి రావటం లేదు. ఆమె ఆ ఆకారాన్ని సమీపించే యత్నం చేసింది. అలికిడి వచ్చి ఆ ఆకారం మాయమయ్యింది.

ఏమీ తోచలేదు శివానికి. మౌనంగా ఆలోచనలతో తన టెంట్‌కు వచ్చింది. ఆమెకు ఎవరన్నా ఈ విషయాలు చెబితే ఎంతలా చులకన చేసేదో తలుచుకుంటే చాలా సిగ్గుగా అనిపించింది.

మరుసటి ఉదయం తనకు ముందు రోజు రాత్రి, అంతకు మునుపు రోజు రాత్రి కలిగిన అనుభవం గురించి గైడ్‌కి చెబుతుంటే రామ్ కూడా విన్నాడు. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. గైడ్ చెప్పాడు, “మేడమ్! కేవలం మన పితృదేవతల కృప ఉంటేనే మనం దేవతలను దర్శించగలం. మీకు వారి కృప ఉంది. అందుకే మీకా దర్శనం కలిగింది..” అన్నాడు.

శివానికి సమాధానం దొరకలేదు.

రామ్ చెప్పాడు “నేను మునుపు వచ్చినప్పుడు ఇలాంటి మాటలు విన్నాను. 1800లలో వచ్చిన బ్రిటిష్ మౌంటనీర్‍కు ఇలాంటి అనుభవం సతోపంతు వద్ద కలిగింది. అతను దేవతలు ఆ సరస్సులో స్నానమాడటం చూశాడు. ఆ విషయం ఫోటోలు తీయ్యటానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. వారినే అడగటానికి వారిని సమీపించే సరికే వారంతా మాయమయ్యారట. అతను హిందు మతంపైన అభిమానిగా మారాడు తరువాత. అప్పట్నించీ ఎవరికో ఒకరికి ఇటు వంటి అనుభవాలు హిమాలయాలు ఇస్తూనే ఉన్నాయి. అయినా మీరు అదే చేశారుగా. మీకు పితృదేవతల అనుగ్రహం దొరికింది. అందుకే మీకు వారి దర్శనం కలిగింది..”

శివాని మౌనంగా విని ఉండిపోయింది. హృదయంలో ఏదో అలౌకికమైన అనుభూతి. ఇదీ అని చెప్పలేకపోతోంది. లోలోపల అలజడి. తనకు తెలిసినది తక్కువని, తెలియనిది ఉందని అనిపించింది.

ఆమెకు దేవుడ్ని చూపమని తన బామ్మను అల్లరి చెయ్యటం గుర్తుకు వచ్చి తన మీద తనకే సిగ్గేసింది.

హిమాలయాల గొప్పదనం ఏదో ఉంది. ఇదో పెద్ద శక్తి కేంద్రం. ఇక్కడ మనకు తెలియనివెన్నో ఉన్నాయి. ‘ఈ శక్తే దేవుడేమో’ అనుకుంది. ఆమెకు పితృదేవతల గురించి తన బామ్మను అడిగి మరింత తెలుసుకోవాలని ఆలోచన కలిగింది. ఆ సతోపంత్ వద్ద కలిగిన అనుభవంతో ఆమెకు ఏది చూసినా వాటిలో లోతులున్నాయని అని మానవ మేధకు అర్థం కావని అనిపించింది.

బదిరి చేరిన తరువాత బామ్మతో చెప్పాలి అనుకుంది అలౌకిక ఆనందంతో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here