ప్రవాహం

1
8

[box type=’note’ fontsize=’16’] ‘రంజని’ సాహితీ సంస్థ నిర్వహించిన ‘కీ.శే. రాయప్రోలు రామకృష్ణయ్య స్మారక కథల పోటీ, 2019’లో ద్వితీయ బహుమతి పొందిన కథ – ప్రవాహం. రచన అత్తలూరి విజయలక్ష్మి. [/box]

[dropcap]“గో[/dropcap]విందయ్య గారిని ఆయన కోడలు ఇంట్లోనుంచి తరిమేసిందిట రా… వృద్ధాశ్రమంలో చేర్పించారుట” కొడుకు అనిల్‌కి కాఫీ కప్పు అందిస్తూ చెప్పింది సరస్వతి.

“ఎవరు? మన గోవిందరావు గారినా ! అరే పాపం …. ఎందుకలా” అడిగాడు అనిల్ కాఫీ సిప్ చేస్తూ.

సరస్వతి నిట్టూర్చింది. “కోడలు పెద్ద ఉద్యోగస్తురాలు కదా.. ఇంటికి పెద్ద, పెద్ద వాళ్ళు వస్తూంటారు. ఆయనకీ కాలక్షేపం కాదుట.. ఆయనకి సేవలు చేసే టైం ఆవిడకి లేదుట.. ఆవిడ, ఆవిడ భర్త బిజీగా ఉంటారు కాబట్టి ఆయనకీ బోర్ కొడుతుందిట.. అందుకని అదేదో ఆశ్రమంలో మూడు లక్షలు పెట్టి ఒక గది కొనుక్కుంటే సౌకర్యంగా ఉంటుందిట.. నెలకి మూడు వేలు కడితే ఉదయం కాఫీ దగ్గరనుంచి అన్నీ టైం ప్రకారం జరుగుతూ ఉంటాయి, వారానికోసారి డాక్టర్స్ కూడా వచ్చి చూస్తుంటారు.. ఆయనకీ కాలక్షేపంగా చాలామంది ఉంటారు, అక్కడే సుఖంగా ఉంటారు అని చేర్పించారుట. పండగలకి తీసుకు వస్తాం… మీకు అక్కడే బాగుంటుంది అందిట కోడలు.. మధ్యాహ్నం గోవిందయ్య గారు వచ్చి చెప్పారు.”

“ఓ వెళ్ళేముందు వచ్చి చెప్పి వెళ్ళారా…” అన్నాడు అనిల్.

“ఇన్నేళ్ళ స్నేహం కదరా మన కుటుంబంతో… చెప్పకుండా ఎలా? పాపం కన్నీళ్లు పెట్టుకున్నారు” బాధగా అంది సరస్వతి.

గోవిందరావు, శ్రీహరి రావు డిగ్రీ దగ్గరనుంచి క్లాస్‌మేట్స్.. ప్రాణ స్నేహితులు. డిగ్రీ అవగానే ఇద్దరూ బ్యాంకు ఎగ్జామ్స్ రాయడం, ఇద్దరికీ ఒకేసారి, ఒకే బ్యాంకులో పోస్టింగ్ రావడం జరిగి వాళ్ళ స్నేహం మరింత బలపడింది. వాళ్ళ పెళ్ళిళ్ళు అయాక సరస్వతి, రమ కూడా మంచి స్నేహితులు అవడంతో ఆ బంధం శాశ్వతం అయింది. అదృష్టవశాత్తూ ఇద్దరూ కూడా పక్క, పక్కనే ఇళ్ళు కొనుక్కున్నారు. పిల్లలని కూడా ఇద్దరూ ఒకే చదువులు చదివించారు. అలా వాళ్ళ ప్రయాణం ఒకే బాటలో సుఖంగా, ప్రశాంతంగా సాగుతూ వచ్చింది. గోవిందరావుకి ఒక కూతురు, ఒక కొడుకు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే.. అమ్మాయి భర్తతో కలిసి అమెరికా వెళ్ళింది. కొడుకు హైటెక్ సిటీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరు, కోడలు నేషనల్ ఇన్‌స్టిటూట్ ఆఫ్ న్యూట్రిషన్‌లో రీసెర్చ్ స్కాలర్.

శ్రీహరి, సరస్వతి దంపతులకి ఒక్కడే కొడుకు అనిల్. డెల్ కంపనీలో పని చేస్తున్నాడు. అతని భార్య సెక్రటేరియట్‌లో క్లర్క్‌గా చేస్తోంది.

శ్రీహరి, గోవిందరావు ఒకేసారి రిటైర్ అయారు. కాకపోతే శ్రీహరి రావు రిటైర్ అయిన ఆరు నెలలకే చనిపోయాడు. ఆయన పోయిన ఏడాదికి అప్పటికే అనారోగ్యంతో ఉన్న గోవిందరావు భార్య చనిపోయింది.

అప్పటివరకు కలిసి సాగుతున్న వాళ్ళ ప్రయాణంలో ఆటంకం ఏర్పడింది… అటు గోవిందరావు, ఇటు సరస్వతి కొడుకుల సంరక్షణలోకి వెళ్ళారు. అయితే, కొడుకులకి ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం, ఆత్మీయత తెలిసినా, కోడళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు కాబట్టి గోవిందరావు జీవితంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. కోడలు అడుగుపెడుతూనే ఆయన ఆ ఇంట్లో ఉండడం గురించి చర్చ మొదలు పెట్టింది. “మనిద్దరం ఆఫీస్‌కి వెళ్ళిపోతాం. పొద్దున్న వెళ్లి, రాత్రి వస్తాం అందాకా ఆయన ఒక్కరు ఇంట్లో ఉంటారు… ఆయనకి ఏదన్నా అవసరం అయితే ఎవరు చూస్తారు… మంచి ఓల్డ్ ఏజ్ హోం ఉంది చేర్పిద్దాం… ఆయనకి బోలెడు కాలక్షేపం… మంచి సర్వీసెస్ ఉంటాయి… ఆయన హాయిగా ఉండచ్చు” అంటూ పోరింది… సందేహించిన భర్తని బలవంతంగా ఒప్పించి ఇప్పుడు సాధించింది అని చెప్పాడు ఆయన… వెళ్తూ, వెళ్తూ తన ఆవేదన సరస్వతితో పంచుకుని వెళ్ళాడు.

ఇంతకాలంగా తన జీవితం లాగే ఆయన జీవితం కూడా కోడుకు, కోడలి దగ్గర ప్రశాంతంగా సాగిపోతోందనుకున్న సరస్వతికి ఆయన చెప్పిన విషయం విన్నాక పెద్ద పెద్ద కొండ చరియలు తల మీద పడినట్టు అనిపించింది. కళ్ళల్లో నీళ్ళతో సెలవు తీసుకున్న గోవిందరావు అలా వెళ్తోంటే మనసంతా కలచినట్టు అయింది. మధ్యాహ్నం నుంచి తను ఒక్కతీ మోస్తున్న ఆ భారం కొడుకుతో చెప్పాక కొంత భారం గుండెల మీద నుంచి దిగినట్టు అయింది.

ఆయన వెళ్ళిపోయిన వారానికే ఆ ఇల్లు అమ్మకానికి పెట్టి వేరే ఫ్లాట్‌కి వెళ్ళిపోయారు ఆయన కొడుకూ, కోడలు. వెళ్లేముందు కనీసం తనకి మాట మాత్రం కూడా చెప్పకపోడం మరింత బాధ కలిగించింది సరస్వతికి.

ఎంత స్వార్థం వీళ్ళల్లో అనుకుంది. దేవుడా నేను అదృష్టవంతురాలిని నా కొడుకు సంస్కారవంతుడు.. కోడలు మంచిది.. ఈ జీవితం ఇలాగే సాగిపోనీ అనుకుంది.

నెల రోజుల తరవాత గోవిందయ్య సరస్వతిని కలిసి వెళ్ళడానికి వచ్చాడు. “ఇల్లు అమ్మకానికి పెట్టారెంటి అన్నయ్యా” అడిగింది సరస్వతి..

“అమ్మేసి ఇంకా కొంత డబ్బు పెట్టి పెద్ద ఇల్లు కొంటారుట… ఆ అమ్మాయి పేరు మీద ఎక్కడో పెద్ద స్థలం ఉందిట” అన్నాడు.

సరస్వతి నిట్టూర్చి “జీవితం అంటే ఇంతే అన్నయ్యగారూ… అదొక ప్రవాహం…అందుకే జీవితాన్ని కవులు నదితో పోల్చారు… నదిలా ప్రవహిస్తూనే ఉంటుంది ఫలానా చోట ఆగిపోతే బాగుండు అనుకుంటాం… కానీ ఆగదు చివరిదాకా ఈ ప్రవాహంతో మనం ఎదురీదుతూనే ఉండాలి” అంది వేదాంత ధోరణిలో.

“అంతేలే… ఏవిటో ఆ హౌస్ ఫర్ సేల్ అన్న బోర్ద్ చూడగానే నేను, నా భార్య ఆ ఇంటికోసం పడిన శ్రమ, చేసిన త్యాగాలు గుర్తొచ్చాయి. పిచ్చిది ముందు అప్పు తీరనివ్వండి అంటూ పసుపు తాడుతో గడిపింది పదేళ్ళు” ఆయన స్వరం గాద్గదికం అయింది.

“ఇంతకీ అక్కడ ఎలా ఉంది?” మాట మార్చింది సరస్వతి.

“చాలా బాగుంది సరస్వతమ్మా… మనం వృద్ధాశ్రమం అంటే అనవసరంగా భయపడతాం… అసలు ఇంట్లో కన్నా అక్కడే బాగుంది. అన్నీ ఒక పధ్ధతి ప్రకారం జరుగుతాయి. మన ఆలోచనలు, భావాలూ పంచుకోడానికి, మాటా మంతి చెప్పుకోడానికి మనుషులు తోడూ ఉంటారు… ఉదయం ఐదింటికే లేచి అందరం వాకింగ్ చేస్తాం… ఊరికి దూరంగా ఉంది కాబట్టి చుట్టూ పచ్చటి చేలు, కాలుష్యం లేదు… ఉదయం నడక ఎంతో ఉత్సాహం ఇస్తుంది. గంట సేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నడిచి వచ్చి, స్నానం చేసి కాసేపు మెడిటేషన్ చేసుకుంటాం… ఆరున్నరకి కప్పు టీ ఇస్తారు. ఎనిమిదిన్నరకి బ్రేక్‌ఫాస్ట్… పళ్ళరసం… మధ్యాహ్నం వంటి గంటకి భోజనం.. సాయంత్రం టీ, స్నాక్స్, రాత్రి ఎనిమిదికి రెండు పుల్కాలు, కొన్ని దోస ముక్కలు, గ్లాస్ మజ్జిగ, ఆ తరవాత ఎవరి ఓపికను బట్టి వాళ్ళు కబుర్లు చెప్పుకుని పడుకుంటారు. వారానికి ఒకసారి డాక్టర్ వచ్చి చెకప్ చేస్తాడు… మా కోడలు చేసిన పని మంచిదే అనిపిస్తోంది… కాకపోతే పిల్లల దగ్గర లేనన్న దుఃఖం మాత్రం ఉంటుంది… వారానికోసారి కొడుకూ, కోడలు ఇద్దరూ వచ్చి పలకరిస్తారు… వస్తూ, వస్తూ పండ్లు అవీ పట్టుకోస్తారు.. ఎవన్నా కావాలా అని అడుగుతారు… డాక్టర్ వచ్చారా… చూసారా. ఏమన్నారు… మందులేమన్నా కావాలా అని అడుగుతారు. దసరాకి తీసుకు వెళ్తా అన్నారు.”

అవునా అన్నట్టు చూసింది సరస్వతి. “మొత్తానికి ఇంటికన్నా గుడి పదిలం అంటారు” అని నవ్వింది.

“ అంతేగా… గుడిలాగే ప్రశాంతంగా ఉంది” అన్నాడు నవ్వి గోవిందరావు.

“మీరు ఇంతగా చెప్తుంటే నాక్కూడా రావాలనిపిస్తోంది” అంది.

“అయ్యో ఎందుకు తల్లి… నీ కొడుకు బంగారు తండ్రి… కోడలు సాత్వికురాలు… నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు… ఆశ్రమం ఎంత సుఖంగా ఉన్నా పిల్లల చల్లని నీడలో ఉండడం అదృష్టం… ఆ అదృష్టం దూరం చేసుకోకు” అన్నాడు ఆయన.

సరస్వతి నవ్వేసి “అన్నంత మాత్రాన అవుతుందా” అంది. తిరిగి “మీరు చెప్పినట్టు వాళ్ళిద్దరూ నిజంగా బంగారాలే” అంది. ఆవిడ కళ్ళల్లో, మొహంలో వెలుగు చూసిన గోవిందరావుకి ఎక్కడో ఒక మూల కొద్దిగా ఈర్శ్యగా అనిపించింది.

ఇన్నేళ్ళుగా అనుకూలవతి అయిన భార్య సాంగత్యంలో, శ్రీహరి లాంటి మంచి స్నేహితుడి సాన్నిహిత్యం, బంధువులు, మిత్రులు, పిల్లలు అనే చల్లని తరుచ్ఛాయలో జీవించిన ఆయనకి ఇప్పుడు వృద్ధాశ్రమం ఎంత సౌకర్యవంతంగా ఉన్నా జీవితంలో ఏదో కోల్పోయిన బాధ గుండెల్లో సుడులు తిరుగుతోంది. ఒక్కో సారి వంటరిగా కూర్చున్నప్పుడు కొడుకు కోడలి దగ్గరకు వెళ్ళిపోతే బాగుండు, వాళ్ళకి పుట్టబోయే పిల్లలతో ఆడుకుంటూ శేష జీవితం గడిపేయడమే కదా కావాల్సింది అనిపిస్తుంటుంది. నిజంగా సరస్వతి అదృష్టవంతురాలు.. ఒక్కడే కొడుకు… అయినా రాముడు లాంటి వాడు… అతనికి తగినట్టే కోడలు సీతమ్మ లాంటిదే వచ్చింది. అత్తగారి మాటే వేదం… ఆవిడ ఏది చెప్పబోయినా, ఏది అడగబోయినా “నాకేం తెలుస్తుంది అత్తయ్యా.. మీరు పెద్దవాళ్ళు మీరెలా చెబితే అలాగే చేద్దాం” అంటూ అన్నిటికి ఆవిడ మీద ఆధారపడి ఇంటి పెత్తనంలో కలగచేసుకోదు. సరస్వతి కూడా కోడలిని కూతురులాగే చూసుకుంటుంది.

అనిల్ కూడా బుద్ధిమంతుడు.. భార్యని ఎంత ప్రేమిస్తాడో, తల్లిని అంతగా గౌరవిస్తాడు.

“ఏంటి ఆలోచిస్తున్నారు” అడిగింది సరస్వతి.

“ఏం లేదమ్మా” నవ్వేసాడు.

మరో అరగంట కూర్చుని సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు గోవిందరావు.

ఆయన వెళ్ళాక ఇంటి పనుల్లో పడిపోయింది సరస్వతి.

సాయంత్రం అనిల్, స్వాతి వచ్చేసరికి రోజూ లాగే ఇల్లంతా అద్దంలా సర్ది, వంట పూర్తి చేసి, స్నానం చేసి పరిశుభ్రమైన చీర కట్టుకుని టి.వి. చూస్తూ కూర్చుంది.

సరిగ్గా ఆరింటికి గేటులోకి వచ్చింది మోటార్ సైకిల్.. కొడుకూ, కోడలు దిగి చిరునవ్వుతో లోపలికి వచ్చారు.

“వచ్చారా?” అంటూ లేచి మంచి నీళ్ళు తెచ్చింది సరస్వతి.

అత్తగారి చేతిలో గ్లాసు అందుకుంటూ ఆవిడని పరీక్షగా చూసిన స్వాతి పెదాల మీద చిన్న నవ్వు విరిసింది.

“ఎందుకమ్మా నవ్వుతున్నావు” అడిగింది సరస్వతి.

 “ఏం లేదత్తయ్యా.. అరవై ఏళ్ల వయసులో కూడా మీరు చలాకీగా ఇంటెడు పని చేయడం కాక ఎప్పుడూ నలగని చీర, చెదరని జుట్టుతో చక్కగా ఉంటారు… మీ వయసు వచ్చేసరికి నేను కూర్చున్న చోటు నుంచి కదల్లెనేమో అనిపిస్తోంది” అంది.

“అవును ఎలా కదులుతావు… రెండు రోజులు, అన్నం పప్పు తినగానే మూడోరోజు మనకి పిజ్జా, నూడుల్స్ తినాలి అనిపిస్తుంది… అమ్మావాళ్ళ కాలంలో అవన్నీ లేవుగా. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు…” అన్నాడు అనిల్.

సరస్వతి నవ్వుతూ తేలిగ్గా అంది “మీకూ ఉన్నాయిగా యోగాలు, జిమ్‌లు… మీరూ ఆరోగ్యంగానే ఉంటారు… ఇంతకీ స్నాక్స్ ఏం తింటారు… పకోడీ చేయనా?”

స్వాతి అనిల్ వైపు చూసింది. అనిల్ “ఏం వద్దమ్మా… కాసేపు అలా కూర్చో… స్వాతి నీతో ఏదో మాట్లాడాలిట… నేను అలా సెంటర్ వరకూ వెళ్లి మిరపకాయ బజ్జీలు తెస్తాను” అంటూ లేచాడు.

“ఏంటమ్మా చెప్పు” సరస్వతి స్వాతి పక్కనే కూర్చుంది.

“అదీ… ఏం లేదత్తయ్యా ఒక విషయంలో మీ సలహా కావాలి… పెద్దవారు మిమ్మల్ని అడక్కుండా ఏ నిర్ణయం తీసుకోలేక అడుగుతున్నాను…”

“చెప్పమ్మా… అంత మొహమాట పడతావేం? చెప్పు” ఆప్యాయంగా అంది సరస్వతి.

“మా ఆఫీస్‌లో ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారు… అది కూడా మంచి ప్రైమ్ ఏరియాలో… రెండు వందల యాభై గజాలు ఇస్తారట. ముందు ఐదు లక్షలు కట్టి బుక్ చేసుకోవాలి. తరవాత మా శాలరిలో నెలకింత అని తీసుకుంటారు. అందరూ సరే అంటే ఇల్లు కూడా కట్టిస్తారుట… నేను కూడా తీసుకోనా వద్దా అని ఆలోచిస్తున్నా… ధైర్యం సరిపోడం లేదు. మీరేమంటారు” ఎంతో మొహమాటంగా, వినయంగా చెప్తున్న కోడలి వైపు ఆపేక్షగా చూసింది సరస్వతి.

“దీనికోసం ఎందుకమ్మా అంత ఆలోచన… స్థలం తప్పకుండా కొనుక్కో… ఎప్పటికైనా ఉండాలి. ఇక పోతే మనకి ఎలాగా ఈ ఇల్లు ఉంది కాబట్టి ఇంక ఇల్లు అవసరం లేదు అనుకుంటాను. మీ మావగారు కట్టించిన ఇల్లు. మనకి బాగా కలిసి వచ్చింది. స్థలం మాత్రం తీసి పెట్టుకో… డబ్బు ఐదు లక్షలు కట్టాలా..”

“అవునత్తయ్యా .. లోన్ ఇస్తారు.”

“ఎందుకమ్మా లోను? నా టర్మ్ డిపాజిట్ నాలుగు రోజుల్లో మేచ్యుర్ అవుతుందని బాంక్ వాళ్ళు మెసేజ్ పంపారు కదా. అది రెన్యువల్ చేసే బదులు విత్ డ్రా చేసి కట్టేద్దాం ..”

“అయ్యో మీ డబ్బు ఎందుకత్తయ్యా..” కంగారుగా అంది స్వాతి.

“నా డబ్బు, మీ డబ్బు అంటూ వేరే ఉంటుందా… ఏది అయినా మనది అనుకో… ఇంక ఈ విషయంలో ఏమి ఆలోచించకు. కాఫీ కలుపుతాను నువ్వు కాస్త ఫ్రెష్ అయి రా” అంటూ కిచెన్ వైపు వెళ్తున్న అత్తగారి వైపు చూస్తూ ఉండిపోయింది స్వాతి.

అన్నట్టుగానే సరస్వతి టర్మ్ డిపాజిట్ ఎనిమిది లక్షలు విత్ డ్రా కి కాగితాల మీద సంతకాలు చేసి కొడుకుకి ఇచ్చింది సరస్వతి. మరునాడు ఐదు లక్షలు చెక్కు కోడలికి ఇచ్చి “నేను సంతకం చేసాను. నువ్వు అమౌంట్ రాసుకుని, ఎవరి పేరు మీద ఇవ్వాలో రాసుకో” అంది.

“థాంక్స్ అత్తయ్యా..” మెరిసే కళ్ళతో కృతఙ్ఞతలు తెలిపింది స్వాతి.

మరో వారానికి డబ్బు కట్టేసానని రిసీట్ తీసుకొచ్చి చూపించింది.

“అబ్బో ల్యాండ్‌లార్డ్ అయావనమాట” అంటూ హాస్యమాడాడు అనిల్.

“నేను అయితే మీరు కారా” అంది స్వాతి.

సరస్వతి కొడుకు, కోడలు అన్యోన్యత సరదాగా చూస్తూ నవ్వుకుంది.

ఒకరోజు అనిల్ ఒక ఆర్కిటెక్ట్‌ని తీసుకొచ్చి ఇల్లంతా చూపించాడు. అతను మొత్తం అన్ని గదులు, ముందు వెనక పెరడు చూసి ఏదో చెప్పాడు. అతను, అనిల్ ఇంగ్లీష్‌లో మాట్లాడుకుంటుంటే అర్థం కాని సరస్వతి విషయం తరవాత అనిల్ చెప్తాడులే అని ఊరుకుంది.

అతను వెళ్ళిపోయాక చెప్పాడు అనిల్. “అమ్మా ఇల్లు చాలా పాతది కదా. రీ మోడల్ చేయిస్తున్నా… అసలు నాన్న వాస్తు చూడకుండా ఎలా కట్టించాడు ఈ ఇల్లు… చూడు కిచెన్ ఉండాల్సిన చోట బెడ్ రూమ్ ఉంది… ఈశాన్యంలో వంటగది.. అప్పుడే అంది స్వాతి ఇంట్లో వాస్తు లోపం ఉంది, అందుకే మన పెళ్లి అయి రెండేళ్ళు అయినా పిల్లలు పుట్టలేదు అని.”

ఆవిడ ఆశ్చర్యంగా చూసింది. “మనకి ఏం తక్కువైందిరా! ఈ ఇల్లు కట్టి పాతికేళ్ళు అయింది… బాగానే ఉన్నాంగా… పిల్లలకేం పుడతారు… తొందరెందుకు… కొంత కాలం సుఖపడండి.”

స్వాతి వస్తూ అంది “ఇప్పుడు వాస్తు లేకుండా కట్టిన ఇల్లుకి రీ సేల్ వాల్యూ కూడా ఉండడం లేదత్తయ్యా. మూడు లక్షల్లో ఇల్లు కొత్తగా అందంగా అవుతుంది…”

“మూడు లక్షలా! ఇప్పుడంత డబ్బు ఎక్కడినుంచి వస్తుంది…” తెల్లబోయి చూసింది సరస్వతి.

“నీ డిపాజిట్ ఎనిమిది లక్షలు కదమ్మా… ఐదు స్వాతికి ఇచ్చావుగా, మిగతా డబ్బులో ఇల్లు అందంగా చేయిద్దాం… నీ బెడ్ రూమ్‌కి ఏ కలర్ వేయించాలో చెప్పు… నీ కిచెన్ మార్చేస్తా… మాడ్యులర్ కిచెన్ చేయిస్తా… టాయిలెట్‌లో వెస్టర్న్ పెట్టిస్తా…” ఇంకా ఏదో చెబుతున్న అనిల్ మాటలు వినలేదు సరస్వతి… ఎందుకో కొంచెం బాధ అనిపించింది. కానీ కాసేపట్లో అనిల్ కళ్ళ ముందు చూపిస్తున్న కలర్‌ఫుల్ ప్రపంచంలోకి వెళ్ళిపోయింది.

అన్నట్టే రెండు నెలల్లో ఇల్లంతా కొత్తగా ఆధునికంగా మారిపోయింది. ఓపెన్ కిచెన్.. హాలు పెద్దగా అయింది.. ఇదివరకు సరస్వతి దంపతుల బెడ్ రూమ్ ఆకారం మార్చుకుని అత్యంత ఆధునికంగా అనిల్, స్వాతిల బెడ్ రూమ్ అయింది. సరస్వతి బెడ్ రూమ్ చిన్నగా అయింది. ఫర్నిచర్ మొత్తం మారిపోయింది. సరస్వతికి డబల్ కాట్ ఇప్పుడు సింగల్ కాట్ అయింది. మంచి మంచం, మెత్తటి పరుపు అయినా ఆవిడకి వీపంతా ఏదో గుచ్చుకుంటున్న బాధ..

రెండు నెలలు ఇల్లంతా ఇసుక, సిమెంట్, పనివాళ్ళు అటూ, ఇటూ తిరగడం, వాళ్లకి, నీళ్ళు, టీలు అందించడం విపరీతమైన పని అయిపొయింది.

ఒక మంచి రోజు చూసుకుని “కొత్త ఇల్లు కదా గృహప్రవేశం చేసుకుని మా ఫ్రెండ్స్ ని పిలుస్తాం” అంటూ గృహప్రవేశం ముహూర్తం పెట్టించాడు. భార్యాభర్తలు పీటల మీద కూర్చుని గృహప్రవేశం చేసుకున్నారు. దాదాపు రెండు వందల మంది వచ్చారు… అందరూ వాళ్ళ ఫ్రెండ్స్… సరస్వతి బంధువులను, కానీ స్నేహితులను కానీ పిలవలేదు, పిలవాలా అని కూడా అడగలేదు. కాటరింగ్ ఇచ్చి ఘనంగా భోజనాలు పెట్టాడు.

“మనం స్థలం కొన్న వేళా విశేషం చాలా మంచిది అత్తయ్యా… స్థలం పూర్తీ వాస్తు ప్రకారం ఉంది… అందుకే ఇంతకాలం లేనిది ఇప్పుడు ఈయనకి ఇల్లు ఇలా చేయాలని అనిపించడం ఏంటి? ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇంత త్వరగా ఇల్లు పూర్తీ అవడం ఏంటి? అంతా వాస్తు మహిమ” అంది స్వాతి.

అవునేమో అనుకుంది సరస్వతి.

ఆ ఇంట్లో తిరుగుతుంటే పూర్వంలా ఈ ఇల్లు నాది అన్న భావన కలగడం లేదు… అంతా కొత్తగా, అలవాటు లేని చోటులా ఉంది. ఫర్నిచర్ రోజూ తుడవడానికి, మార్బల్ ఫ్లోర్ రోజూ తడిగుడ్డ పెట్టి తుడవడానికి పనిమనిషిని పెట్టాడు. ఇదివరకులా సరస్వతికి ఎక్కడంటే అక్కడ కూర్చునే అవకాశం లేదు. సోఫాలోనే కూర్చోవాలి. ఎక్కడ నీళ్ళ చుక్క పడకూడదు… ఎక్కడా చేతులు పెట్టకూడదు… పరాయి చోట ఉన్నట్టు ఇబ్బందిగా ఉంది.

“అయ్యో గోడ మీద ఈ మరక ఎలా వచ్చింది. కాస్త చూసుకోవాలత్తయ్యా… అలా ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోకండి” అంది స్వాతి ఒకరోజు. మరో రోజు పక్కింటి రాజమ్మతో సోఫాలో కూర్చుని మాట్లాడుతుంటే మొహం ముటముట లాడిస్తూ “సోఫాలు చాలా కాస్ట్లీ అత్తయ్యా.. మీరలా ఎవరిని పడితే వాళ్ళని కూర్చోబెట్టకండి” అంది.

సరస్వతికి అవమానంగా అనిపించింది. రాజమ్మ అంటరాని మనిషా.. అదే కాలనీలో ఎప్పటినుంచో ఉంటోంది. కష్టానికి, సుఖానికి నేనున్నాను అంటూ వస్తుంది. తప్పు కదా అలా అనడం… ఈ విద్యావేత్తలు తమని తాము అభ్యుదయవాదులం అనుకుంటారు కానీ ఆర్థిక వ్యత్యాసాల ద్వారా అంటరానితనం ప్రోత్సహిస్తున్నది వీళ్ళే అనుకుంది. ఆ రోజుల్లో అజ్ఞానం వల్లనో, చాదస్తం వల్లనో పనివాళ్ళను, పాలెగాళ్ళను అంటుకోకుండా, దూరంగా ఉన్నా మనసుల్లో వాళ్లకి ఎంతో గొప్ప స్థానం ఇచ్చేవాళ్ళు… ఎంతో ఆత్మీయంగా ఇంటి విషయాలు చర్చించే వాళ్ళు.. కానీ ఇప్పుడు పని వాళ్ళు అంటే వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి.. చెప్పులు బయట విడవాలి.. ఇంట్లోకి తెస్తారా… అంటారు. ఇదేనా విద్య నేర్పిన సంస్కారం.. ఇదేనా ఆదునికత.. నాగరికత..!

క్రమంగా ఆ ఇల్లు పరాయి ఇల్లుగా, కొడుకు, కోడలు పరాయి వాళ్ళుగా అనిపించసాగారు. ఇదివరకు ఇంటికి రాగానే కనీసం ఓ అరగంట ముగ్గురూ హల్లో కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఎంతో విశాలంగా, ఆధునికంగా చేసుకున్న బెడ్ రూమ్‌లో ఇద్దరే కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఈ మధ్య తరచూ ఫ్రెండ్స్‌ని పిలవడం ఏవో పార్టీలు చేసుకోడం ఎక్కువైంది. అలాంటప్పుడు ఆ ఇంట్లో సరస్వతి అనే ఒక మనిషి ఉందని, ఆవిడ ఆ ఇంటి యజమానురాలు అని గుర్తు లేనట్టు ప్రవర్తిస్తారు ఇద్దరూ. కోడలు అసలు ఏ పనీ చేయకుండా ఇంట్లో ఉన్నంత సేపూ పడక గదిలో ఉంటుంటే సరస్వతికి కొంచెం ఎబ్బెట్టుగా అనిపించసాగింది.

ఖరీదైన మంచం, ఖరీదైన పరుపు… అయినా భర్తతో కలిసి పడుకున్న పాత మంచం మీద ఉన్న సుఖం, సంతోషం తృప్తి దీనిమీద లేదు అనిపిస్తోంది. ప్రతి రాత్రి భర్తను తల్చుకుని మనసులోనే ఆయనకీ నమస్కరించుకుని పడుకుంటే హాయిగా నిద్రపట్టేది.. కానీ ఇప్పుడు ఏదో అశాంతి, అసహనం…

రాత్రి పదకొండు దాటింది.. తొమ్మిదిన్నర కల్లా నిద్రలోకి జారే సరస్వతికి అసలు నిద్ర పట్టడం లేదు.. వేడి పాలు తాగి పడుకుందాం అనుకుని లేచి వంటగది వైపు వెళ్ళింది.

ఆ నిశ్శబ్దంలో… అలలు, అలలుగాతేలి వస్తోంది స్వాతి స్వరం…

“మీ అమ్మ దగ్గర ఇంక వేరే అమౌంట్ ఏమి లేదా…”

“ఏమో… లేకపోవచ్చు… నాన్న ఉన్నప్పుడే రిటైర్‌మెంట్ ఫంక్షన్‌కి అమ్మకి చంద్రహారం, గాజులు చేయించారు నాన్న. మిగతా అమౌంట్ ఫిక్స్ చేసారు… కొంత డబ్బు ఆయన హాస్పిటలైజ్ అయినప్పుడు ఖర్చు అయిపొయింది” అనిల్ స్వరం.

“ఆవిడకి ఇప్పుడా ఆభరణాలు ఎందుకు? పగడాల దండ ఒకటి కొనిద్దాం… ఆవిడ దగ్గర ఉన్న గోల్డ్ అడిగి తీసుకోండి. మనం చూసిన ఫ్లాట్ కొందాం.. చవకలో వస్తోంది… కొని పెడితే మంచిది… రేపు పిల్లలు పుట్టాక మనం సేవ్ చేసుకోడం కష్టం ఖర్చులు పెరుగుతాయి.”

“కరెక్టే… కానీ నేను అడిగితే ఏం బాగుంటుంది… నువ్వే అడుగు…”

“నేను ఆల్రెడీ ఐదు లక్షలు తీసుకున్నా కదా… వాటికోసం ఎంత నటించాల్సి వచ్చిందో తెలుసా…”

“ మళ్ళీ నటిద్దూ… ఇది ఆఖరు… ఇంక ఆవిడ దగ్గర తీసుకోడానికి ఏం ఉండదు కూడా…”

“సరేలెండి… మీరొక వేస్ట్ కాండిడేట్… ఏమి చేతకాదు.. నేనే అడుగుతా… కాకపోతే ఇప్పుడు ఏ నాటకం ఆడాలా అని ఆలోచిస్తున్నా…”

“ఏదో ఒకటి ఆడు… కానీ జాగ్రత్త… మళ్ళీ ఆవిడకి మన ప్రేమ నటన అని ఏ మాత్రం తెలియనీకు… ఆవిడ కూడా ఆ గోవిందయ్య గారిలా ఆశ్రమానికి వెళ్ళిపోతే మనకి పుట్టబోయే పిల్లలకి వేరే ఆయాలు దొరకరు… మనకి ఆవిడ అవసరం ముందు, ముందు చాలా ఉంది… అది కాక మనకి చెడ్డపేరు వస్తుంది.”

“నాకా మాత్రం తెలియదా… నేను చూసుకుంటా లెండి… అవునూ మీ అమ్మకి ఆ గోవిందయ్యా అంటే అంత ప్రేమేంటి ఈ వయసులో…”

“ఛ … ఎంటా మాటలు.. మా ఫామిలీస్ రెండూ ఎప్పటి నుంచో క్లోజ్ …”

కిల కిల నవ్వు… “ఊరికే అన్నాలెండి… అయినా మీ అమ్మ రోజూ సాయంత్రాలు స్నానం చేసి, చక్కగా తయారై కూర్చుంటే నాకు నవ్వొస్తుంది… ఎవరన్నా చేసుకుంటా అని ముందుకొస్తే ఆవిడ సెకండ్ మారేజ్‌కి రెడీ అన్నట్టు ఉంటుంది…”

“ఏయ్… పిచ్చి, పిచ్చిగా వాగకు.. రా ఇలా దగ్గరకి.. ఎంతసేపు కబుర్లు? అసలు పని కాకుండా…”

సరస్వతి వణికే కాళ్ళతో పడిపోతున్నట్టే వచ్చి మంచం మీద కూలబడింది.

వాళ్ళ మాటలు చెవుల్లో సముద్రపు హోరులా వినిపిస్తున్నాయి..

ఇదంతా… ఇదంతా నిజంగా జరిగిందా… జరుగుతోందా… అది తన కోడలు స్వాతి స్వరమేనా… కొడుకు అనిల్ గొంతేనా… టివి లో వచ్చే తెలుగు సీరియల్ అయితే ఎంత బాగుండు!…

ఆవిడ కళ్ళు వర్షిస్తున్నాయి…

ఎవరు బంగారం? సమవయస్కుల తోడూ, వాళ్లతో కాలక్షేపం, సమయానికి ఆహారం, డాక్టర్స్ పర్యవేక్షణ ఉంటుందని ఆయనని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునే సమయం, తీరిక తనకి లేవని మంచి ఖరీదైన వృద్ధాశ్రమంలో చేర్పించి పండక్కి, పబ్బానికి ఇంటికి తీసుకు వచ్చి ఆదరిస్తూ, గౌరవిస్తున్న గోవిందయ్య కొడుకు కోడలా!

ప్రేమ, గౌరవం అనే లేపనాలు పూసి తన దగ్గర ఉన్న డబ్బు, బంగారం కొట్టేసి, తనని పుట్టబోయే పిల్లలకి ఆయాగా వాడుకోవాలని ప్లాన్ చేసుకుంటున్న తన కోడలా… ఎవరు?

అవును తను ఆడది… తనని వృద్ధాశ్రమంలో చేర్పించరు… ఎందుకంటే చాకిరీ చేస్తుంది… వాళ్ళ పుట్టబోయే పిల్లలకి జీతం, బత్తెం లేని ఆయాగా ఉంటుంది… గుప్పెడు మెతుకులు పడేస్తే ఓ మూల పడి ఉంటుంది… అందుకే తను వాళ్లకి కావాలి… తనని వృద్ధాశ్రమంలో చేర్పిస్తే వాళ్లకి అన్నివిధాలా నష్టం… పైగా నలుగురిలో చెడ్డపేరు..

ఎంత స్వార్థం!… ఇలాంటి స్వార్థపరులకి చెడ్డపేరు ఎందుకు రాకూడదు! రావాలి… వాళ్ళ నీడలో శేష జీవితం ప్రశాంతంగా గడిస్తే చాలు అనుకుని ఇక్కడే ఉండాలా! తన సమస్తం దోచుకుని తనని ఒక పనిమనిషిలా వాడుకోవాలనుకుంటున్న క్రూరమైన వాళ్ళ ఆలోచనని సమర్థించాలా! తెల్లవారి లేచి, ఏమి తెలియనట్టు, ఏమి విన్నట్టు రోజులాగే వాళ్లకి కాఫీ ఇవ్వాలా!

ఎప్పటిలా ప్రేమగా, ఆప్యాయంగా ఇవ్వగలదా…

ఎంత అసహ్యంగా మాట్లాడింది స్వాతి.. రెండో పెళ్ళికి తను సిద్ధంగా ఉందా…

ఆవిడకి ఆ క్షణం తన గుండె ఆగిపోతే బాగుండు అనిపించింది…

లేదు.. ఇంత మాట విన్నాక కూడా ఇక్కడ ఉండడం తన వల్ల కాదు..

కళ్ళు తుడుచుకుని లేచింది సరస్వతి. బీరువా తెరిచింది. భర్త రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో చేయించిన చంద్రహారం, ఆరు గాజులు, పుస్తెల తాడు, నెక్లెస్, తన చేతులకి ఉన్న నాలుగు గాజులు, మేడలో ఉన్న రెండు వరసల పలకసరులు అన్నీ ఒక పర్స్‌లో పెట్టుకుంది. మిగిలిన నల్లపూసలు, చెవుల దుద్దులు నాలుగు జతలు, ఒక ముత్యాల దండ అలాగే బీరువాలో ఉంచేసింది… పట్టు చీరలు వదిలేసి, తన చీరలన్నీ సూట్‌కేసులో సర్దుకుంది. బీరువాతాళం చేయి బీరువా మీద పెట్టేసింది.

పర్స్‌లో ఉన్న డబ్బులు లెక్క పెట్టుకుంది. రెండు వేలున్నాయి..

తల పంకించి తలగడ మీద తలవాల్చి తెల్లవారడం కోసం ఎదురుచూస్తూ సీలింగ్ కేసి చూడసాగింది.. ఫ్యాన్ గిర, గిరా తిరుగుతోంది..

జీవితం ప్రవాహం లాంటిది…. ఒక వ్యక్తికోసమో, ఒక వ్యవస్థ కోసమో, ఒక కాలం కోసమో ఈ ప్రవాహం ఆగదు.

అవును ప్రవాహం లాంటిది, ప్రవహిస్తూనే ఉండాలి..

ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది సరస్వతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here