ప్రయాణం

0
13

[box type=’note’ fontsize=’16’] దేశంలోని వ్యవస్థలను ప్రశ్నించే కథ గూడూరు గోపాలకృష్ణమూర్తి వ్రాసిన “ప్రయాణం”. ప్రభుత్వ రవాణా సంస్థల పెరిగే ఛార్జీలపైనా, చదువుకు కునారిల్లుతున్న ప్రభుత్వ పాఠశాలలపైన ఆవేదన వ్యక్తం చేస్తూ అల్లిన కథ ఇది. [/box]

[dropcap]“మూ[/dropcap]ర్తీ! మన పూర్వ విద్యార్థులం అందరం ఈ సంక్రాంతికి కలుద్దామనుకుంటున్నాం. నీవు మిస్ అవద్దు” రవి పోన్‌లో చెప్పాడు.

“ఇప్పుడు ఈ గెట్‌ టుగెదర్ పెట్టారేంటిరా బాబూ! అసలే పండుగ సమయం. పెద్ద పండుగ. ఉద్యోగాలకి వెళ్ళినవాళ్ళు, కూలీ, నాలీ వెతుకుంటూ ఇల్లు వడిచి వెళ్ళినవాళ్లూ, కొత్త అల్లుళ్ళు, కూతుళ్లు వీళ్ళు వాళ్ళూ అందరూ ఈ పండగ సమయంలో స్వంత ఊళ్ళకి చేరుకుంటారు. కిందటి సంవత్సరమే రావడానికి ఎంత కష్టమయిపోయిందో తెలుసా? ఖర్చు తడిసి మోపెడయింది. నిల్చోడానికి కూడా స్థలం లేదు. ట్రైను సంగతీ అంతే. బస్సు సంగతీ అంతే” రవితో అన్నాను నేను.

“నోర్మూయరా! వేలకి వేలు తెచ్చుకుంటూ ఆ మాత్రం ఖర్చు పెట్టలేవా? వీలయితే ఫ్లైట్ టిక్కెట్టు కొనుక్కుని ఫ్లైటులో రా” క్లాసు పీకుతూ అన్నాడు రవి.

“నీకేంటిరా? నీవు అలాగే చెప్తావు. ఉన్న ఊరులో ఉద్యోగం. స్వంత ఇంట్లో ఉంటున్నావు. పై ఊర్లో వేలకి వేలు అద్దె కట్టుకుంటూ జీవితాలు నెట్టుకొస్తున్న మా బాధలు నీకు ఏం తెలుసు? పేరుకు మాత్రం వేలల్లో జీతాలన్నమాటే కానీ” అన్నాను.

“మూర్తీ! నీకు బాధ కలిగిస్తే సారీ! అయితే ఒక్క విషయం. ఇలాంటి పూర్వ విద్యార్థుల కలయిక మళ్లీ వస్తుందా? యాంత్రికమయిపోయిన మానవ జీవితాల్లో ఈ కలయిక అదృష్టమనే చెప్పాలి. ఇప్పుడే మన బాల్యం గురించి, పాత రోజుల్ని నెమరవేసుకుని ఆ మధురస్మృల్ని తలచుకుంటూ పులకరించిపోయే అవకాశం రా ఈ కలయిక.”

“మన జీవితంలో మరిచిపోదామన్నా మరిచిపోలేని దశ బాల్యం. అమ్మ గారాబం, నాన్న క్రమశిక్షణ మధ్య బడిలోకి అడుగుపెడతాము. అప్పుడు తోటి పిల్లల్తో ఆడుకున్న ఆటలూ, పాడుకున్న పాటలూ మధుర స్మృతులు అన్నీ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా తిరిగి బాల్యం రోజులు తిరిగి వస్తే ఎంత బాగుండును? అని అనిపిస్తుంది ఒక్కొక్క పర్యాయం. అదొక నిత్యస్రవంతి. ఆ బాల్యమంటే అందరికీ ఇష్టమే. వింటున్నావా మూర్తీ” రవి అన్నాడు.

“వింటున్నానురా బాబూ. బాల్యమంటే ఎవరికి ఇష్టం ఉండదు. నీవు పైకి ఎమోషన్సు చెప్పావు. నేను మనస్సులోనే నా భావాల్ని దాచుకున్నాను. మనిషి జీవితంలో బాగా గుర్తుంచుకునేది స్వచ్చమైన అనుభూతుల్లో లీనమయ్యేది బాల్యంలోని భావాలు మాత్రమే. అయితే ఒక్క విషయం అందరి బాల్యాలూ సంతోషకరంగా ఉండవురా. మనలోనే ఎందరి బాల్యాలు ఆనందంగా గడిచాయో చెప్పు. బాధల్లో మగ్గినవారు. వెట్టికూలి చేసేవారు, చెత్త కాగితాలు ఏరేవారు, బిచ్చమెత్తేవారు. తల్లుల చేత ముళ్ళపొదల్లో వదిలివేయబడినవారు, ఎంతమందీ దురదృష్టవంతులు. అందుకే నేను అనుకుంటాను అందరి బాల్యాలూ వడ్డించిన విస్తరి కాదు అని. కొందరి బాల్యం బాగున్నా మరి కొందరి బాల్యం కప్పి వేసిన మట్టిదిబ్బ అని” భావోద్వేగంతో అన్నాను నేను.

“కూల్.. కూల్.. ప్రతీ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోకు. నేను కూడా నీ భావాలతో ఏకీభవిస్తాను. బాగా విస్తరించి అందంగా అగుపిస్తున్న వృక్షం కూడా తనకి ఆధారమైన వేళ్ళను మరిచిపోదుట. అలాగే మనిషి ఎంత ఎదిగినా తన బాల్యాన్ని మరిచిపోడు. దాన్ని జ్ఞాపకం తెచ్చుకోవడం మంటే చిన్ననాటి మధురాను భూతుల్ని నెమరవేసుకోడమే.

మానవత్వాన్ని అమాయకత్వాన్ని, లాలిత్యాన్ని, సున్నితత్వాన్ని నిష్కళంక స్నేహ మాధుర్యాన్ని ఈ బాల్యం గుర్తు చేస్తుంది. ఆహ్లాదకరమైన, అనుభూతుల జ్ఞాపకాల మాసిపోని బాల్యం అందరికీ ఉండకపోయినా కొంతమందికి మనసు అడుకు పొరల్లో కదలాడుతూనే ఉంటుంది. మానవ జీవితంలో ఈ బాల్యం ఎడారిలో ప్రయాణిస్తున్న మనిషికి ఒయాసిస్ లాంటిది.”

“రవీ! బాల్యం గురించి ఎంత మాట్లాడుకున్నాం. ఇదంతా మన పూర్వ విద్యార్దుల కలయక సందర్భంలో. బాల్యం గురించి మరో విషయం. భవనాల్లో నివసించే ధనవంతుడి సంతానమయినా, పూరి గుడిసెలో నివసించే పేదవాడి సంతానమయినా అందరూ బాల్యం రోజులు గడుపుతారు. కార్పోరేటు స్కూల్లో చదివిన ధనవంతుడు సంతానమైనా; సందు, గొందులో ఉన్నప్రభుత్వ పాఠశాలలో చదివిన పేదవాడి పిల్లలయినా అందరికీ బాల్యం ఒక్కటే చదువూ ఒక్కటే, అందరి అనుభూతులూ ఒక్కటే” అన్నాను నేను నాదైన శైలిలో.

“కాదనను. అందరూ బాల్యం రోజులు అనుభవిస్తారు కాని, నేడు బాల్యం ఎలాంటిదో గమనించావా? మోయలేని పుస్తకాల బరువుతో, చేయలేని హోమ్‌ వర్కు, బట్టీ పెట్టడం వీటితోనే నేటి బాల్యం నలిగిపోతోంది. ఆ… ! నీతో మాట్లాడ్డంలోనే సెల్లో డబ్బులు అయిపోయాయి. నీకూ అంతే మనం ఒక టాపిక్ మొదలు పెట్టి మరో టాపిక్లోకి వెళ్ళాం.”

“నిజమే! అయితే ఒకరి భావాలూ, భావోద్యేగాలు మరొకరు తెలసుకోవాలంటే పొడిపొడి మాటలతో అవదు. మనకి ఒకటి కావాలంటే మరోకటి తప్పదు. అయితే ఒక్క విషయం క్రిందటి సంవత్సరం అంత శ్రమ పడి వచ్చానా ముఖ్యంగా మనం చదువుకున్న మనకి విద్యాదానం చేసిన పాఠశాలని, ఉపాధ్యాయుల్ని చూడాలని అయతే నాకు పాఠశాల స్థితి బాధకలిగించింది. మనస్తాపానికి గురిచేసింది.”

“నిజమే! అయితే మన పూర్వ విద్యార్ధులు అందరూ కలుస్తున్నాము కదా. స్కూలు అభివృద్దికి ఏం చేయాలో ఆలోచించవచ్చు. మరి దీని గురించి తీవ్రంగా ఆలోచించకు తప్పకుండా రా! బై…!” అంటూ రవి ఫోను పెట్టేసాడు.

క్రిందటి సంవత్సరం సంక్రాంతి పండక్కి తను ఇంటికి రావడానికి ఎన్ని పాట్లుపడ్డాడో భావోద్వేగంతో ఆలోచిస్తోంది నా మనస్సు.

ముందరే రైల్వే రిజర్వేషన్లు అయిపోవడంతో ఏ ట్రైనుకీ ఖాళీలు లేవు. పండగ ముందు కొత్త ట్రైనులు నడుపుతారు అన్నారు. వాటికైనా లేక తత్కాల్ బుకింగ్‍కైనా ప్రయత్నించవచ్చు అని రైల్వేస్టేషనుకి వెళ్ళాను. బుకింగ్ ఇంకా తెరవలేదు. ఇంకా ప్లాటుఫారం టిక్కెట్టు తీసుకుని వచ్చిపోయే రైళ్ళను గమనిస్తున్నాను నేను.

రైల్వే స్టేషను చాలా రద్దీగా ఉంది. ‘అసలే పండుగ సీజను. స్కూళ్ళకి సెలవలు. అందుకే అందరూ తాము పుట్టి పెరిగిన స్థలాలకి వెళ్ళాలనుకుంటారు. అంతే కాదు, కూలి నాలి కోసం పొట్ట చేత పట్టుకుని వచ్చేసినవాళ్ళు, ఉద్యోగాల నెపంతో స్వంత ఊరును విడిచి పెట్టినవారు ఈ పండుగ సంయంలో స్వంత ఊర్లకి చేరుకోడానికి చూస్తారు’ అనుకున్నాను.

ఇలాంటి సమయంలో ట్రైన్లకి, బస్సులకి ఎక్కువ డబ్బు వసూలు చేసినా, ఎక్కువ రద్దీగా ఉన్నా ప్రయాణం తప్పదు. మొదట పండక్కి వెళ్ళకూడదనుకున్న వాడిని, అక్కకి పెళ్ళై అయిన అక్కా బావ ఇంటికి వస్తున్న సమయంలో వాళ్ళకి స్వాగతం ఇస్తున్న మొదటి పండుగ అవడం వలన ఇంటికి ప్రయాణమవక తప్పలేదు.

ఏదో ట్రైను వచ్చింది జనాలు ఎగబడ్తున్నారు. రిజర్వేషను కంపార్టుమెంట్లను కూడా విడచి పెట్టటం లేదు రిజర్వేషను లేని జనాలు. అలాంటప్పుడు రిజర్వేషను చేయించికున్న వాళ్ళకి, ఆ సదుపాయం లేని వారి మధ్య వాదన, తోపులాట. కసురుకోడాలు, తిట్టుకోడాలు. ఈ సమయంలోనే జేబుదొంగలకి మంచి అవకాశం. బోగీల్లో నిలబడ్డానికి కూడా స్థలం లేని సందర్భాల్లో బాతురూమ్ దగ్గర కొంత మంది నిలబడ్డారు కూడా. ఇదంతా చూసిన నేను ట్రైనులో ప్రయాణం చేయాలన్న ఆలోచన విరమించుకుని, బస్సులోనే నా ప్రయాణం చేయాలనుకున్నాను.

ఇది వరకు ప్రైవేటు బస్సుల రవాణా ఉన్నాప్పుడు సీటింగ్ సామర్ధ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే ప్రభుత్వ సూపర్‌వైజర్లు చర్యలు తీసుకునేవారు. కాని ఇప్పుడో? ప్రభుత్వ రంగంలో డీలక్సు, లగ్జరీ బస్సుల్లో కూడా నిలబడ్తున్నారు జనాలు. ఇలాంటి బస్సుల్లో చార్జీలు కూడా ఎక్కువే. అంత చార్జీలు తీసుకుంటున్నప్పుడు ప్రయాణకులకు సదుపాయాలు కూడా బాగా చేయాలి. కాని అలా జరగటం లేదే? కూర్చోడానికి చోటు లేకపోయినా ఆర్డినరీ బస్సుల్లాగే నిలబడవల్సి వస్తోంది.

మరి పండుగల సమయంలో స్పెషల్ బస్సులు వేస్తున్నారు. ‘అర్.టీ.సి కష్టాల్లో ఉంది. నష్టాల్లో నడుస్తోంది’ అని అంటూ ఇలాంటి సమయంలోనే ఆ నష్టాల్ని పూడ్చుకోడానికి ఉన్న చార్జీలకన్నా మూడు, రెండు రెట్ల చార్జీలు వసూలు చేస్తున్నారు ఆర్.టి.సి యజమాన్యం.

ఎక్కువ చార్జీలు ప్రత్యేక సమయాల్లో వసూలు చేసుకోవచ్చు అన్న జీ.ఓ జారీ చేసింది ప్రభుత్వం. అలాంటప్పుడు ప్రభుత్వ పరంగా నడుస్తున్న ఆర్.టి.సి యాజమాన్యం ఊరుకుంటాందా? అది ప్రభుత్వరంగ సంస్థ కాబట్టి ఇదేం న్యాయం అని ప్రజలు కూడా ప్రశ్నించరు.

రైల్వేకూడా ఈ ఆర్.టి.సిని చూసి ఈమధ్య ఎక్కువ చార్జీలు వసూలు చేయడం ఆరంభించింది. సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే రైళ్ళ చార్జీలు కూడా బాగా పెరిగిపోయాయి. అదంతా ఎందుకు? ప్లాటుఫారం టికెట్టు మొదట రూపాయి, రెండు మూడు రూపాయలుండేది. ఆ తరువాత దాన్ని అయిదు రూపాయలకి పెంచారు. ఇప్పుడు దాన్ని ఏకంగా పది రూపాయలకి పెంచేశారు. ఇది సామాన్య ప్రజలకి కష్టం. పాసింజరు టికెట్టు ఏబై కిలోమీటర్లకి పదిహేను రూపాయలు. ప్లాటుఫారం టిక్కెట్టు ధరతో ప్రయాణికుడు రైలులో కనీసం ముప్పయి కిలోమీటర్లు అయినా ప్రయాణిచవచ్చు.

ప్లాటుఫారం టిక్కట్టు ఎందుకు పెంచారు? ఇది సామాన్య జనాలకి భారం అని ఎవరైనా ప్రశ్నస్తే ప్లాటుఫారం మీద జనాలు రద్దీ తగ్గించడానికే అని జవాబు వస్తుంది మనకి రైల్వే శాఖ నుండి. అది జనాలకి సంతృప్తి ఈయలేని జవాబు.

అంతే కాదు ఈ మధ్య తత్కాల్ రిజర్వేషన్ పద్దతి ప్రారంభించారు. ఒకే తరగతిలో ఒకే సదుపాయాలతో ఒకే దూరం ప్రయాణించే వారికి అదనపు తత్కాల్ చార్జీ కట్టగలిగితే అప్పటికప్పుడు రిజర్వేషన్ ఇస్తారు. ఇది ముందుగా రిజర్వేషను చేయిచుకున్న వాళ్ళకి, ఈ తక్కాల్ విదానం భారత రాజ్యాంగం ప్రజలకి కల్పించిన సమాన న్యాయం, సమానత్వం సూత్రాలకి ఈ పద్దతి విరుద్దం కాదా అని నేను అనుకుంటాను. ఈ తత్కాల్ చార్జీలను కూడా ఈ మధ్యనే పెంచేశారు. అంతే కాకుండా ఈ మధ్యనే ప్రీమియమ్ రిజర్వేషను పెట్టారు. దీని ప్రకారం సాధారణ చార్జీలకంటే కొన్ని రెట్లు అదనంగా ప్రీమియం చార్జీ చేల్లిస్తే తత్కాల్ వారి కంటే కూడా ముందుగా ఇస్తారు. ఇది కూడా రాజ్యంగ విరుద్దమే అని విన్నాను నేను.

‘ఈ రైల్వే, ఆర్.టి.సి రెండూ ఈ విధంగా చార్జీల మసూలు చేయడం గుత్తాదిపత్యామే! ష్….! ఈ విషయాలు ప్రజలకి తెలిసినా వాళ్ళు కూడా మౌనంగా ఈ అదనపు భారాన్ని మోస్తూ ఉండిపోతున్నారు. అంతే కాని ఎవ్వరూ ప్రశ్నించటం లేదు. తమ హక్కుల్ని కాపాడుకోవటం లేదు. ఇదే నా బాధ’ భావోద్వేగంతో అనుకున్నాను.

‘అంతేకాదు, ఇలాంటి సమయంలోనే ప్రైవేటు వాహనాలు కూడా మూడింతల చార్జీలు పెంచేస్తాయి. రవి చెప్పినట్టు ఇంత చార్జీలు చెల్లించి ఆ వాహనాలలో వచ్చేకంటే ప్లైటులో వస్తే మంచిదేమో. సుఖకరమైన త్వరితగతి ప్రయాణం అవుతుంది’ నేను అనుకున్నాను.

ఎలాగో అలాగ సంక్రాంతి సమయానికి మా ఊరు చేరుకున్నాను. అక్కడ నుండి నేరుగా ఇంటికి వెళ్ళకుండా మొట్టమొదట నేను విద్యను అభ్యసించిన విద్యాలయానికి వెళ్ళాను. అది నాకు పవిత్రమైన గుడిలాంటిది. అయితే అక్కడికి వెళ్ళిన నేను షాక్‌కి గురయ్యాను, మనస్తాపానికి కూడా. పాడుబడిన బూత్ బంగళాలా ఉంది ఆ ప్రాంతం. ఓనాడు ఆ ప్రాంగణం శాంతినికేతనాన్ని తలపించేది. చెట్ల నడుమ ఉపాధ్యాయులు పిల్లలకి పాఠాలు బోధిస్తూ ఉంటే, రెండో శాంతినికేతన్ అని అనుకునేవాడిని. అలాంటిది పచ్చని చెట్లు లేకుండా బోసిపోయి ఉంది.

అందమైన పూలతోట అది నాశననయినా ఆ నాశనాన్ని మనం చూడనంత వరకూ అది మన కళ్ళెదుట అందంగానే అగుపడుతుంది. ఆ పూలతోట నాశనం కళ్ళారా చుసిన తరువాత మన గుండెల్లో చెప్పలనవి కానంత బాధ.

మా పాఠశాల విషయంలోనూ అదే అయింది. ఇన్నాళ్ళ వరకూ మా ఫాఠశాల నా దృష్టిలో ఓ శాంతినికేతన్. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్న నాకు అది ఓ పాడుబడిన భవనంలా అనిపంచింది. చాలా బాధనిపించింది. ఆ బాధను తట్టుకోలేకపోతున్నాను.

రవి మా ఇంటికి వెళ్ళాడుట. నేను ఇంటికి రాకపోయేసరికి వాడికి తెలుసు నేను మా పాఠశాలకి వెళ్తానని. నన్ను వెతుక్కుంటూ పాఠశాలకి నేరుగా వచ్చాడు రవి. రవి ఆ ఊర్లోనే ఉంటున్నాడు. మా ఊరుకి దగ్గరగా ఉన్న హైస్కూలుల్లో సైన్సు టీచరుగా వాడికి ఉద్యోగం వచ్చింది. అందుకే రవికి అక్కడున్న విషయాలన్నీ తెలుసు.

“ఏంటిరా రవి మన పాఠశాల రూపం ఇలా తయారయింది?” బాధగా అన్నాను. నా మాటలకి రవి గాడంగా నిట్టూర్పు విడిచాడు.

“మూర్తీ! మనం చదువుకున్నప్పటి వాతావరణం లేదు కదూ ఇప్పుడు పాఠశాలలో, దానికి కారణాలు అనేకం. ఈ మధ్య వచ్చిన హుదూద్ తుఫాను వల్ల చెట్లన్నీ పడిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వం వైఖరి మారింది. పిల్లల తల్లిదండ్రుల వైఖరి మారింది. ప్రభుత్వ పాఠశాలలు, తెలుగు మీడియమ్ పాఠశాలలూ పతనావస్థకు చేరుకుంటున్నాయి. ఇప్పడంతా కార్పోరేటు స్కూళ్ళు, ప్రైవేటు స్కూళ్ళ హవా నడుస్తోంది. ఇంగ్లీషు మీడియం మోజు పెరిగింది. కూలీ, నాలీ చేసుకంటున్నవాడు కూడా తమ పిల్లల్ని ఇంగ్లీషు మీడియం పాఠశాలలో చేర్పించడానికే చూస్తున్నారు. అందుకే తెలుగు మీడియం పాఠశాలలు దుస్థితి ఇలా అయిపోయింది. కొన్నాళ్ళకి తెలుగు మృత భాషగా మారిపోయినా ఆశ్ఛర్యపోవలసిన పని లేదు. ప్రభుత్వాలు కూడా మాతృ భాష ఉన్నతికి బదులు ఆంగ్ల బాషకే ప్రాధాన్యత ఇస్తున్నాయి” రవి చెప్తున్న విషయం వింటున్నాను నేను.

“మరో విషయం మన పాఠశాల ఎయిడెడ్ పాఠశాల. ప్రభుత్వం గ్రాంటు మంజూరు చేస్తేనే నడుస్తుంది. ప్రభుత్వం కూడా ఇలాంటి పాఠశాలల మీద శీతకన్ను వేసింది. గ్రాంటు సమంగా ఇవ్వటం లేదు. అంతేకాక రిటైర్డ్ అయిన ఉపాధ్యాయుల స్థానంలో కొత్త వాళ్ళని వేసుకోవటం లేదు. ఈ మేనేజ్మెంట్ స్కూళ్ళలో మేనేజ్మెంటు వాళ్ళే డిగ్రీ చదివిన వాళ్ళకి మూడు వేలు, నాలుగు వేలు జీతం ఇచ్చి ఏదో విధంగా పని నడిపించేస్తున్నారు. నాణ్యత, అనుభవం లేని వాళ్ళ చేత విధ్యాబోధన. దీని వలన విద్యాప్రమాణాలు దిగజారిపోతున్నాయి. అందుకే విద్యార్ధుల తల్లిదండ్రులు నాణ్యమైన విద్య కోసం పాఠశాల విడిచిపోతున్నారు. అందుకే మన పాఠశాలలో విద్యా ప్రమాణాలు తగ్గిపోయాయి. విద్యార్ధుల సంఖ్య తగ్గిపోయింది” చెప్పాడు రవి. గాఢంగా నిట్టూర్పు విడిచాను నేను. ఒకప్పుడు పెద్ద వాళ్ళ సిఫారసు ఉంటేనే పాఠశాలలో సీటు దొరికేది. అలాంటి పాఠశాల ఈనాడు దుంపల బడిలా అయిపోయిందా? బాధగా అనుకున్నాను.

ఒకే ఒక్క చెట్టు తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ అలా స్థిరంగా నిలబడి ఉంది. ఆ చెట్టు క్రింద ఉన్న అరుగు మీద కూర్చుని నేను నడయాడిన పరిసరాలను కలయజూస్తూ ‘ఈ తెలుగు మీడియం పాఠశాలలో చదివినవాళ్ళు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. స్టేట్స్‌లో ఉన్నారు. పెద్ద పదవులు పొందాలంటే ఆంగ్లబోదన, కార్పోరేటు స్కూళ్ళే అక్కర్లేదు’ అని అనుకుంటూ గాఢంగా నిట్టూర్పు విడిచాను.

మరి అక్కడ ఉండబుద్ది కాలేదు. భారంగా నేను ఇంటి వేపు అడుగులేస్తుంటే రవి నా వెనకాలే వస్తున్నాడు. ఆ పండుగ నాలుగురోజులూ ఉదాసీనంగా బాధగానే ఉంది నా మనస్సు. ఎలాగో గడిపేసి తిరిగి నేను ఉద్యోగం చేస్తున్న చోటుకి బయలుదేరాను.

***

తిరిగి మా ఊరుకి వెళ్ళబుద్ది కాలేదు. ఇన్నాళ్ళకి పూర్వ విద్యార్థుల కలయిక సంధర్భంలో తిరిగి మా ఊరుకి బయలుదేరే అవకాశం వచ్చింది. రవి మరీ మరీ చెప్పాడు. ఆలోచనా ప్రపంచం నుండి బయటపడ్డాను.

ఈ బస్సుల్లో, రైళ్ళలో ఎక్కువ ధరలు చెల్లించి ప్రయాణం చేసే కన్నా ఫ్లైటులో ఎందుకు వెళ్ళకూడదు? రేపొద్దున్న కుటుంబం ఏర్పడితే ఎలాగూ అవదు. రవి చెప్పినట్టు ఈసారి నా ప్రయాణం ఫ్లైటులోనే అనుకుంటూ లేచాను నేను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here