ప్రయత్నం

0
11

[dropcap]నా[/dropcap] వయసు అప్పుడు 20. బహుశా సినిమా ఛాన్సుల కోసం ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్‌ చేరుకున్న యువతుల్లో నేను ఒకదాన్ని అనుకుంటాను. నా మందపాటి నల్లరంగు కనురెప్పలు తీసుకోవడం కూడా నాకు అప్పుడు తెలియదు. నేను పల్లెటూరు నుండి ఎర్రబస్సు ఎక్కి సరాసరి సినిమాల్లోకి వచ్చినట్టు నన్ను ఆట పట్టించేవాళ్లు. నేను పత్రికలో ఒక ప్రకటన చూసాను. ప్రకటన ఇచ్చిన వ్యక్తి కళల శిబిరానికి డైరెక్టర్‌. నిపుణులకు నటన, గానం, నృత్యం నేర్పుతారని వేశారు. వుత్తీర్ణులు అయినవారికి చిత్రరంగంలో అవకాశాలు ఇప్పిస్తామని అందులో రాశారు. హైదరాబాద్‌‌లో ఉంటున్న మా బంధువుల ఇంటికి అని చెప్పి ఇంట్లో నుండి బయలుదేరి వచ్చాను. ఆ చిరునామాను పట్టుకుని వెళ్ళాను.

నేను “సార్‌” అని పిలిచాను.

అతను పెద్దవాడు. శ్రద్ధగా, ఆసక్తిగా నావైపు చూసాడు. నా స్వగతం విన్న తర్వాత

”ఇక్కడివరకు నిన్ను రప్పించినది ఏమిటి ” అతను అడిగాడు.

”నేను చిన్నప్పుడు సినిమాలను ప్రేమించాను. ఇప్పుడు అందులో నటించాలని అనుకుంటున్నాను” నేను స్పందించాను.

”నేను మిమ్మల్ని మంచి డైరెక్టర్లకు పరిచయం చేయగలను. అయితే మీరు నటనను బాగా ఔపాసన పట్టాలి” అని అతను చెప్పాడు. నాకు చాలా సంతోషం వేసింది. నేను గట్టిగా అరిచినంత పనిచేశాను.

అవకాశాల ప్రపంచం కోసం వేచి చూస్తున్న వ్యక్తిని నేను. అతని శిక్షణాలయంలో ఆరు నెలలపాటు శిక్షణ పొందాను. ఆ తర్వాత నేను అతనికి సహయకురాలిగా ఒక నెలపాటు వున్నాను. మా బంధువుల ఇంట్లో ఉంటూ నేను నటన తర్ఫీదు పొందాను. వాళ్ళకి చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నాను అని అబద్ధం చెప్పాను. నా దగ్గర వున్న బంగారు నగలను అమ్మి ఫీజు కట్టాను.

తరువాత, నా వయస్సు, నా కన్న చిన్న వయస్సులో ఉన్న బాలికలతో పాటు, చిన్న సినిమా షూటింగులకు వెళ్లే వాళ్ళం.

అక్కడ నేను ఒక వారం పాటు క్యాంప్‌ కౌన్సెలర్‌గా ఉన్నాను. ప్రతిగా, నాకు ఉచిత వసతి, భోజనం, కొంత డబ్బు వచ్చేది. ఇది నాకు చాలా సరదాగా అనిపించింది. చిన్న నటులతో పరిచయం ఏర్పడింది. కొన్ని చిన్న వేషాలు సినిమాల్లో నేను వేసాను. నన్ను చాలామంది మెచ్చుకున్నారు. నా నటన అమోఘం అన్నారు.

నా వయస్సులోనే వున్న ఒక నలుపు, గోధుమ రంగు జుట్టు గల స్త్రీ సినిమా షూటింగులో పరిచయం అయింది. ఆమె నాకు ఒక అగ్ర దర్శకుడు తెలుసని, సమయం వచ్చినప్పుడు పరిచయం చేస్తానని హామీ ఇచ్చింది.

అదే విషయం నేను మా మేనేజర్‌కు చెప్పాను. అతని కళ్ళు వద్దు అని చెప్పాయి.

అతను మాత్రం ”నీ ఇష్టం, నీకు నచ్చితే చేయి” అని వత్తి పలికాడు.

ఆమె ఒకరోజు ఫోన్‌ చేసి ”ఈ రోజు సార్‌ని కలుద్దాం ” అని చెప్పింది.

నేను బాగా రెడీ అయ్యాను. నన్ను చూడంగాల్నే పల్లెటూరి నుండి వచ్చానని ఎవ్వరూ అనుకోలేరు.

నేను, ఆమె కారులో వెళ్ళాము.

”రాజ్‌ మీ కెరీర్‌ను మలుపు తిప్పుతాడు. అతనికి నచ్చితే పెద్ద హీరోయిన్‌ని చేస్తాడు. అంతా నీ చేతుల్లోనే వుంది” ఆమె చెప్తూ కారులోని ఏసీని పెంచింది. సన్నగా సంగీతాన్ని ఆన్‌ చేసింది.

”వావ్‌. నిజంగా? ” నా మాటలు విచిత్రంగా ఉన్నట్లు ఆమె నన్ను చూసింది.

‘మీ వయస్సు ఎంత?” నేను చిన్న చర్చ చేయడానికి ప్రయత్నించాను.

”ఇరవై ఒకటి. నేను మీలాగే చిన్న వేషాలు వేశాను. తర్వాత మేనేజర్‌గా పనిచేశాను. నేను కొన్ని నెలలుగా రాజ్‌తో కలిసి నివసిస్తున్నాను. మీరు మంచివారైతే అతను మంచివాడు” ఆమె స్వరం లోతుల్లో నుండి వచ్చింది.

ఒకసారి హైవే మీద, ఆమె నా వైపు చూసింది, ఆమె కాఫీ రంగు కళ్ళు ఉద్రిక్తంగా ఉన్నాయి.

”నాకు ఈ జీవితం నచ్చింది. మనకు ఇష్టం లేనప్పుడు వెళ్లిపోవచ్చు. ఎవ్వరూ బలవంతం చేయరు. నువ్వు ఎంచుకున్న జీవితాన్ని ఎవ్వరూ ప్రశ్నించరు. అయితే మీరు సమూహంలో వున్నా ఒంటరిగా వున్నట్టు భావిస్తారు” ఆమె చెప్పుకు పోతోంది.

పగిలిన అద్దంలో నా ముఖం, గచ్చు నేలపై పడ్డ నా దువ్వెన వెంట్రుకలు, ఎంగిలి మెతుకులు శుభ్రం చేసిన నా చేతులు, కసువు ఊడ్చిన చేతులు, శరీర కోరికలపై నా నియంత్రణ, ఫండమెంటలిస్ట్‌ అయిన నా ఒంటరి తల్లి నియమాలు నాకు గుర్తుకు వచ్చాయు. దూరంలో, నగరం కృత్రిమ లైట్లతో వెలిగిపోతోంది. నేను చిన్నతనంలో నా కుటుంబంతో సహా నిరాశ్రయురాలి నయ్యాను. కాలిబాటలపై నడవటం, ఆహారం లేక పస్తులు వుండటం, గట్టిగా కళ్ళు మూసుకుని నిద్రించడం, చిన్న ఉద్యోగాలతో పోషణ. ఇదంతా విజయవంతమైన నటీమణిగా మారడం కోసమే నేను గడిపానని ఆమెకు చెప్పడానికి ధైర్యం చాలలేదు.

తండ్రి స్వంత జీవితం గురించి ఫిర్యాదు చేసిన నా తల్లితో సుదీర్ఘ అసంతప్తి జీవితాన్ని గడపడానికి నేను ఇష్టపడలేదు. నా బాల్యంలో నేను ఆమెకు సహాయం చేయాలనుకున్నాను. కానీ నేను నాకే సహాయం చేయాల్సి వచ్చింది.

మేము రాజ్‌ ఫాంహౌస్‌కి వచ్చాము. రాజ్‌ తలుపు తెరిచాడు. అతను 50వ దశకం మధ్యలో వున్నాడు. ముదురు నల్లటి కళ్ళు, పూర్తి రంగు వేసుకున్న జుట్టుతో కనిపించాడు. అతను నాకన్నా ఒక అడుగు ఎత్తు కూడా ఉన్నాడు. రాజ్‌ కళ్ళు నా శరీరాన్ని పైనుంచి క్రిందికి స్కాన్‌ చేశాయి. ఆపై అతను నాకు సగం వంకర నవ్వు ఇచ్చాడు.

”నాన్నా, దగ్గరకు రండి” అన్నాడు సాగదీసిన తన చేతులను నాకు చూపించి.

నేను నెమ్మదిగా అతని వైపు నడిచి ఆలింగనం చేసుకున్నాను. ఇది మర్యాదపూర్వక పని అని నేను భావించాను. అతని ముఖం నా ముఖం పక్కనే నా భుజం మీద కొంచెం సేపు ఉంచబడింది. అతని చేతులు నా వీపు నుండి జారిపడి కొంచెం ముందుకు సాగాయి. నేను అతనితో పాటు ఇంటి లోపలికి నడిచాను. తలుపు మా వెనుక మూసుకుంది. ఆమె తలుపును మూసి లాక్‌ చేసింది.

”మీ దగ్గర సెల్‌ ఫోన్‌ వుందా?” అతను అడిగాడు.

”వుంది”

”దానిని అప్పగించండి”

నేను ఇచ్చాను. నేను ఒక దీర్ఘ శ్వాస తీసుకున్నాను. నా అసౌకర్యాన్ని తెలియనీకుండా వుండటానికి ప్రయత్నించా. నేను నటిస్తే అతను చూడాలని కోరుకున్నాడు. నేను విభిన్న నటనలను అతనికి చేసి చూపించాను. అతను తీసిన సినిమా విజయోత్సవ సభల, అతనితో పాటు వున్న ప్రసిద్ధ నటుల ఫోటోలను దాటి మేము కొంత దూరం నడిచాము. సినిమా ప్రపంచాన్ని ప్రభావం చేసే వ్యక్తితో నేను నడుస్తున్నా అనే ఆలోచన నన్ను కుదురుగా వుండనీయడం లేదు.

వెనుక వున్న బెడ్‌రూములో ఒక కిటికీ, మూడు బెడ్లు ఉన్నాయి. గది చిందరవందరగా ఉంది. ఆయన నన్ను రాజ్‌ అనే పిలవమన్నాడు. అతను 18 ఏళ్ళ వయసున్న అమ్మాయికి, సన్నగా, పొడువుగా వున్న 15 ఏళ్ల మరో అమ్మాయికు పరిచయం చేశాడు, వాళ్లు చాలా ఉత్సాహంగా, ఆనందంగా వున్నారు.

”మీరు కొత్త అమ్మాయా” ఇద్దరిలో ఒకమ్మాయి అంది. నా కళ్ళు ఇద్దరి వైపు మళ్ళాయి.

”నేను గత మూడు నెలలుగా రాజ్‌ వాళ్లింట్లోనే వుంటునాను. ఇప్పటికే నేను రెండు సినిమాల్లో హీరోయిన్‌ స్నేహితురాలిగా నటిస్తున్నాను ”అని ఆమె చెప్పింది.

”మీరు మీ తల్లిదండ్రులతో ఎందుకు వుండటం లేదు” నేను వాళ్లని అడిగాను.

”ఆమె తల్లి బాంబేలో వుంటుంది. ఆమె ఇక్కడ సురక్షితంగా ఉంది, ” రాజ్‌ కొంచెం గట్టిగా చెప్పాడు.

”నువ్వు ఈ గదిలోనే వుంటావు. నేను తరువాత కలుస్తాను” అతను సిగరేట్‌ వెలిగించి గది నుండి బయటకు నడిచాడు. ఒక అమ్మాయి నాకు ముందస్తుగా నా మొదటి పనిని అప్పగించింది.

”వీటిని మడవండి, మనం మన పనిని సమానంగా పంచుకుందాం” అంటూ ఆమె నాకు కొన్ని బట్టలు నా ముందు వుంచింది.

 నా చుట్టూ వున్న వాతావరణం నాకు నచ్చలేదు. నాకు కొంచెం భయం వేసింది. నేను గూట్లో చిక్కుకున్నానా. నా మీద నాకే అనుమానం వచ్చింది. నాకు తెలియకుండానే నేను నోరు మూసుకుని పని చేస్తున్నాను.

కొన్ని గంటల తరువాత, రాజ్‌ వైన్‌ బాటిల్‌తో తిరిగి వచ్చాడు. ఈ లోపల భోజనాలు కూడా వడ్డించబడ్డాయి. నాకు మందు అలవాటు లేదని చెప్పాను. ఎవ్వరూ బలవంతం చేయలేదు. ముగ్గురు అమ్మాయిల్లో కూడా ఒకమ్మాయే కొంచెం మందు తాగింది.

మేము తిన్న తరువాత, రాజ్‌ నా వైపు గారంగా చూస్తూ

”నీ నటనకు సమయం ఆసన్నమైంది” అన్నాడు.

అతను నేను పియానో, చెక్క డెస్క్‌, కుర్చీ ఉన్న మరొక గదిలోకి నడిచాము. అక్కడ వెలుతురు తక్కువుగా వుంది. నేను గదిలోపలికి వెళ్లిన తర్వాత అతను తలుపు మూసాడు. నేను బలంగా ఊపిరి పీల్చుకున్నాను. నేను అసౌకర్యంగా వున్నాను. రాజ్‌ నా వెనుకకు వచ్చి, తన శరీరాన్ని నాపై నొక్కి, నా పొత్తికడుపుపై చేయి పెట్టి, కిందకు తోసాడు.

”బేబీ, భయపడద్దు. నువ్వు చాలా అందంగా వున్నావు. నేను నిన్ను పెద్ద హీరోయిన్‌ని చేస్తాను” అతను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నాడు.

నేను గట్టిగా కేకలు వేయాలనుకున్నాను. కానీ అలా చేయలేక పోయాను. ఏదో శక్తి నన్ను అడ్డుకుంటోంది. అలా చేస్తే నా నట జీవితానికి స్వస్తి పలకాల్సి వస్తుందనే భయం నన్ను వెంటాడుతోంది. తలుపుకు అవతలి వైపు ఎవరో వున్నట్టు నాకు తెలుస్తోంది. ఇక్కడ వున్న వాళ్ళు మానసికంగా సిద్ధపడే ఇక్కడికి వచ్చారని నాకు అర్ధమైంది.

”ప్లీజ్‌ సార్‌, నన్ను తాకొద్దు” నేను చెప్పాను.

రాజ్‌ చక్కిలిగింతలు పెట్టాడు.

”శాంతించు,” అని అతను దూరంగా జరిగాడు. వెనక్కి వెళుతూ హఠాత్తుగా నా పెదాలపై గట్టిగా బలవంతపు ముద్దు పెట్టాడు.

”నువ్వు చాలా నేర్చుకోవాలి. ఎదగాలంటే ఏం చేయాలో నీకు ఇంకా తెలిసినట్టు లేదు” అతను గాలిలో చేతులు ఊపుతూ నవ్వుతూ డాన్సు చేస్తున్నాడు.

”నన్ను నమ్ము. నువ్వు మంచి నటివి అవుతావు” అతను గట్టిగా నవ్వాడు. ఇంతలో తలుపులు తెరుచుకున్నాయి.

అతను నన్ను తీసుకొచ్చిన అమ్మాయి వైపు చాలా కోపంగా చూస్తూ వేగంగా వెళ్లిపోయాడు. ఆ అమ్మాయి తలవంచుకుంది.

చిన్నగా నా వైపుకు ఆమె వచ్చింది. ఇవి సహజం కదా అన్నట్టుగా వున్నాయి ఆమె చూపులు.

”నేను పిలవంగానే వచ్చావు. దానర్థం అన్నిటికీ సిద్ధమనే కదా” ఆమె అడిగింది.

నా భుజాలు జారిపోయాయి. నా తల్లి గుర్తుకువచ్చి నేను భోరున ఏడ్చాను.

నేను మళ్లీ స్నానం చేయడానికి సిద్ధపడ్డాను. రాజ్‌ కిటికీలోంచి చూస్తాడనే భయంతో నేను అన్ని లైట్లను ఆపేసాను. నేను ఎప్పుడూ పూర్తి చీకటిలో స్నానం చేయలేదు.

షవర్‌లో నుండి వేడి నీళ్లు నా తలను తడుపుతున్నాయి. నేను నోరు తెరిస్తే, నేను చీకటిలో మునిగిపోవచ్చు అని భయం వేసింది.

 నా ఎముకలలో లోతుగా ఏదో అలజడి బయలుదేరింది. నేను ముందుగానే అర్థం చేసుకుని వుండాల్సింది అని అనుకున్నాను. స్నానపు గది నుండి బయటకు వచ్చాను.

”నేను వెళతాను” స్ధిరంగా ఆమెతో అన్నాను. విషయం తెలిసిన రాజ్‌ నా దగ్గరకి వచ్చాడు.

 నా మంచం మీద కూర్చుని, తన వేళ్లతో నా జుట్టును చిన్నగా నిమిరాడు. నాతో మెల్లగా అన్నాడు.

”నేను నీకు అవకాశాలు ఇప్పించాలనుకున్నాను. ఇండస్ట్రీలో నా అంత మంచివారు లేరు. మిగిలిన వారు నీతో ఇంత హుందాగా ప్రవర్తించరు” అతను అన్నాడు.

దిక్కుతోచని స్థితిలో నేను మళ్లీ గట్టిగా ఏడ్చాను. రాజ్‌ పక్కనున్న అమ్మాయివైపు చూస్తూ కళ్లతో ఏదో సైగలు చేశాడు. నేను వెళ్లడానికి కారు సిద్ధం చేయబడింది. మిగిలిన అమ్మాయిలు నా వైపు జాలిగా చూశారు. అటు తర్వాత నాకు సినిమా అవకాశాలు రాలేదు. ఎక్కడకి వెళ్లినా రాజ్‌ గారితో ఒకసారి ఫోన్‌ చేయించండి అనేవారు.

చాలా సంవత్సరాల పాటు నేను మానసిక క్షోభ అనుభవించాను. రాత్రిపూట తీవ్రమైన చెమటలు పట్టేవి. పీడకలలు వచ్చేవి. నిద్రలేమి రాత్రులతో సావాసం చేయాల్సి వచ్చింది. కొత్త వ్యక్తులను కలుసుకోవాలంటేనే తీవ్రమైన ఆందోళన కలిగేది. ముఖ్యంగా ఉద్యోగ ఇంటర్వ్యూలలో నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించి విఫలమయ్యాను.

25 ఏళ్ళ వయసులో, నేను సీరియల్‌ నటిగా స్ధిరపడ్డాను.

రాజ్‌ జాతీయ దర్శకుడయ్యాడు. అనేక అవార్డులను తీసుకున్నాడు. నిజానికి ఆ రోజు అతని దగ్గర వున్న ఆమె ఒక మోస్తరు హీరోయిన్‌గా రాణించింది. అతని ఇంట్లో నటనను అధ్యయనం చేయడానికి ఎంతోమంది యువతులు కుప్పలుగా వెళ్లేవారని తెలిసి నేను ఆశ్చర్యపోయాను.

రాజ్‌ ఇప్పుడు ప్రసిద్ధ నటీమణుల ఫోటోలను ఫేస్‌బుక్‌లలో పెడుతున్నాడు. వాళ్లు కూడా రాజ్‌ ఎలా తమను పెద్ద హీరోయన్లుగా చేసింది చెపుతున్నారు. సమస్యలతో సతమయ్యే అమ్మాయిలు, సినిమా మీద వ్యామోహంతో వుండే అమ్మాయిలను ఆకర్షించడానికి అతను ఇలా చెత్త పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నాడని నాకు అర్థమయింది. అతని వల్ల్ల ఇబ్బందిపడ్డ నలుగురు యువతుల యూట్యూబ్‌ క్లిప్‌ను నేను చూశాను. వాళ్లు రాజ్‌ తమను ఎలా వాడుకున్నాడో చెప్పారు. దాన్ని రాజ్‌ పూర్తిగా ఖండించాడు.

14 ఏళ్ళ వయసున్న రాజ్‌ తనను ఎలా వేధింపులకు గురిచేశాడో ఒక యువతి సోషల్‌ మీడియాలో పేర్కొంది. మరొక 16 ఏళ్ల యువతి గత వేసవిలో సినిమా ఛాన్సు ఇప్పిస్తానని చెప్పి తనపై రాజ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పేర్కొంది. నాలాగే ఎంతోమంది అమ్మాయిల కెరీర్లు రాజ్‌ నాశనం చేశాడని తెలుసుకున్నాను. నాకు చాలా బాధ అనిపించింది.

రాజ్‌ చేత వేధించబడ్డ ముగ్గురు అమ్మాయిల ఫోన్‌ నంబర్లు సంపాయించి వాళ్లతో మాట్లాడాను.

మేము ఒక ఫేస్‌బుక్‌ పేజీని ఏర్పాటు చేశాం. అందులో రాజ్‌తో ఇబ్బందిపడ్డ వాళ్లు తమ అనుభవాలను ఎటువంటి సాక్ష్యాలు లేకపోయినా పంచుకోవచ్చని తెలిపాము. మూడు నెలల్లోనే ఇరవై మంది యువతులు తాము రాజ్‌ వల్ల ఎలా వేధించబడ్డారో తమ అనుభవాలను రాశారు. కొంతమంది తమ పేర్లను బయటపెట్టడానికి ఇష్టపడలేదు. అందరి కథలు ఒకటే. సినిమా ఛాన్సులు ఇప్పిస్తానని వాళ్లను ప్రలోభాలకు గురి చేయడం. మాట వినని వారి సినిమా కెరీర్‌ను నాశనం చేయడం. మాట విన్నవారికి కూడా మహా అంటే మూడు సినిమాల్లో ఎదో ఒక పాత్ర అవకాశం ఇప్పించేవాడు. రాజ్‌కి భయపడి ఎలా జీవించామో కొంతమంది రాశారు. వారి జీవితంలోని ప్రతి అంశాన్ని అతను ఎలా నియంత్రించాడో కొంతమంది రాశారు. ఒక యువతి ఏకంగా రాజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాని అది నిలబడలేదు.

తనపై పోస్టులు పెట్టేవారిపై రాజ్‌ బెదిరింపులకు దిగాడు. అందువల్ల ఇద్దరు మా ఫేస్‌బుక్‌ గ్రూప్‌ నుండి వెళ్లిపోయారు.

సినీ ఇండస్ట్రీలో రాజ్‌ తరహా పలుకబడి గలిగిన వ్యక్తులు తమను ఎలా వేధించేవారో చెప్పడానికి చాలా ముంది మా సోషల్‌ మీడియా గ్రూపును వాడుకున్నారు. అలా వేధింపులకు గురిచేసే వారు ఇండస్ట్రీలో ఆరుమందికి పైగా వున్నారని తేలింది. కాని ఈ సంఖ్య చాలా తక్కువ. ఎందుకంటే చాలామంది ఇప్పటికీ బయటకు రావడం లేదు.

నేను ప్రాణాలకు తెగించి ఈ మీడియా గ్రూపును నడుపుతున్నాను. నేను దీన్ని వీడను. అతన్ని బహిర్గతం చేయడం ద్వారా నేను నా ప్రతిష్ఠను ప్రమాదంలో పడేస్తున్నానని నాకు తెలుసు. నా ఉద్దేశాలు ప్రశ్నించబడతాయని నాకు తెలుసు. రాజ్‌ బెదిరించడం ద్వారా నన్ను నియంత్రణలో తెచ్చుకోవాలనుకున్నాడు. నేను దాన్ని అసాధ్యం చేశాను. కాని చాలామంది తమ పేర్లను గోప్యంగానే వుంచుకున్నారు. నేను మాత్రం నా నిజమైన పేరునే వినియోగించాను. నేను పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కాని అతని గురించి సమాజానికి తెలియజేశాను. అతను ఇతరులను బాధపెట్టడం మానేయాలని నేను కోరుకుంటున్నాను. నిద్రలేని రాత్రుల నుంచి మాత్రం నేను దూరం అయ్యాను. సీరియల్‌లో వేషాలు తగ్గాయి. నేనే కొంతమంది ఔత్సాహికులతో కలిశాను. సీరియల్‌ దర్శకురాలిగా మారాను. నన్ను సినిమా తీయమని కొంతమంది ప్రొడ్యూసర్లు అడుగుతున్నారు. నా ఉద్దేశంలో జీవించడం అంటే నిజాలను నిర్భయంగా చెప్పటమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here