ప్రేమకు అందమైన నిర్వచనం శేషేంద్ర శర్మ గారి ఈ ‘ప్రేమ లేఖలు’

1
11

[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]

ప్రేమ లేఖలు చదవడంలో ఆనందమే వేరు. ఇతరుల జీవితాలలో తొంగి చూడడం తప్పు అనిపించినా ఆ ప్రేమ అనే భావనలోని రసాస్వాదన ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అందులో అది శేషేంద్ర గారి కవిత అయితే ఆ అనుభవమే వేరు. ఈ చిన్ని పుస్తకం ఖచ్చితంగా ఇప్పుడు దొరకదు బజారులో. 1980లో మొదట ముద్రణకు నోచుకున్న ఈ పుస్తకం నిజంగా అపురూపమైనది. కారణం ఒకే పుస్తకంలో తెలుగు మరియు హిందీ అనువాదాలుండడం. ఈ లేఖలు శేషేంద్ర రాజకుమారి ఇందిరా దేవికి రాసినవి. వీరు ఒరిజినల్‌గా ఇంగ్లీషులో రాసినవి తెలుగు, హిందీ భాషలలోకి అనువాదం చేసినట్లు కనపడుతుంది.

పుస్తకం మొదట్లో ఇందిరా దీవి గారు ఈ లేఖలు శేషేంద్ర తనకు ఇంగ్లీషులో రాసారని చెప్పుకున్నారు. అందులో కొన్ని అంశాలను మాత్రమే ప్రచురణకు తీసుకున్నారని అర్థం అవుతుంది. కవి పదాలతో చెడుగుడు ఆడతాడు. ప్రేమ అనే భావాన్ని వ్యక్తీకరించడానికి అందమైన భాష తోడయితే ఆ అనుభూతి అద్బుతం. ఎన్ని అందమైన expressions ఉన్నాయో ఈ వాక్యాలలో ఉదాహరణకు….

“ఉత్తరాలు విప్పాను. పేజీల్లోనుంచి వెన్నెల రాలింది. వాక్యాలు సారికలై చకోరికలై ఎగిరిపోయాయి. నేను ధవళమూ మిగిలేము పేజీల మీద”…

“బ్రతుకులో బాగా జలకమాడాను. అనేక లోతుల్లోకి దూకాను. అనేక ఎత్తులకు ఎగబ్రాకాను. ఒక చోట నిలవలేదు. ఒక చోటు చేరలేదు. సముద్రాలు యాత్రించిన సాహసికుడ్ని…ఎన్నో కలల్నీ పద్యాల పడవల్లోతెచ్చి మీ తీరాలకు చేర్చాను. పర్వతాల్ని పెకిలించాయి యీ చేతులు, ఈ లోహదందాలు-ఖండ ఖండాంతరాల్ని బంధించి లాక్కొచ్చాయి; ద్వీపాలను ద్వీపకల్పాలను కుక్కాల్లా తిప్పాయి మీ ముందు”..

“వినండి నా మాటలు, విని విని ఆలోచనా దంతాల్తో నమిలి నమిలి నా మాటల లోతుల్లో మునిగిపోండి.. ఎవరు చచ్చి మన జీవితాల్లో పూలు పూయిస్తాడో వాడి భాష చిరంజీవి….”

అందరి భాషా కంఠంలోనుంచి వస్తే నీ భాష కన్నుల్లోనుంచి వస్తుంది. నీవు హృదయాన్ని అక్షరాల్లో పెట్టీన పక్షివి.

శేషన్ క్యాలెండర్ తీదీలకంటే నీ జీవితంలో అనుభూతుల తేదీలెక్కువ. కోర్కెల నక్షత్రాలన్నీ చితికిపోయి ప్రభాత రక్తిమ నీ దీపం మీద పడినప్పుడు తెలిసింది నిన్ను బంధించేదీ లేదు నీ చేత బంధింపబడేదీ లేదు. మమతల వలలో పోగులొకటొకటే ఊడిపోగా మిగిలాయి నీవు వీ నీడా…

ప్రేమే నీ మంత్రం హృదయం నీ పీఠం, ఓ శేషన్ నీవే ఒక ప్రేమలోక దేవతవు. నీ కోసం ఒక కోవెల నిర్మించాలనుకుంటే చెట్టు నాటి శాఖల్లో కోకిల పెడితే చాలు. ఓ శేషన్ ఇంగ్లండులో నీ పేరు ఎడ్వర్డ్, ఇటలీలో నీ పేరు రోమియో, అరేబీయాలో నీ పేరు మజ్నూ, అరే ఇండియాలో దేవదాస్.. నిజంగా నీకో ఊరూ లేదు నిన్నెరగని వారూ లేరు.

నాకు తెలుసు నీకు మృత్యువంటే ఒక పీపాడు మధువు తాగి హాయిగా కళ్ళు మూసుకోవడం మరునాడు కలలనే రంగుల గొడవల్లేని శాశ్వత శూన్యమైన ఒక ఉదయంలోకి మేల్కొనడం అనీ – ఓ శేషన్…. ఒక కోమల హస్తం మీద వాలి రాత్రి ముదురు ఘడియల్లోకి ప్రవేశించడమే నీకు ప్రేమేంద్రజాలం అని తెలుసు…”

ప్రేమను నీతి పేరుతో వదులుకునే వ్యక్తులను చూసి శేషన్ అంటారు…

నీవు కోర్కెలు అణచుకొని అది నీతి అనుకోవచ్చుగాని, కోర్కెలణచే నీతులన్నీ నీకు సిద్ధాంతాలు గావు….

స్వర్గనరక పేజీలను బాగా తిరగేసిన రుషివో శేషన్, గడ్డంతో నీ నగ్నరుషిత్వం కొలుచుట ఎంతటి మూడత్వం….

జీవితమంటే ఏమిటిరా అని గడ్డాన్నడగడ మెందుకురా మధుమాసంలో మామిడి కొమ్మను గురించి బ్రాహ్మడ్నడక్కురా…”

మనిషి జీవితంలో సుఖాలకంటే దుఖాలే దొరుకుతాయి. కంటి కొసన అశ్రువు నిలిస్తేనే జీవితం నీతో హృదయం విప్పి మాట్లాడుతుంది ఒక నిజమైన మాట నీ ఆధరం ఎక్కుతుంది-చూడు ఆకాశంలో శిధిలాల్లా పడి ఉన్న మేఘాల్లోనుంచి సూర్యమండలం లేస్తుంది… లే దుఖాలు నిన్ను వెతుక్కుంటూ నీ యింటికి వచ్చిన రుషులు.

దేవతలొక స్వర్గంలో ఉంటారనుకోబోకు, స్వర్గమే దేవతల్లో శరణార్ధయై ఉంటుంది…. ప్రేమ కన్నా ద్వేషం వైపే నడుస్తారు మనుష్యులంతా, సూర్యమండలాని కంటే సూర్యగ్రహణమే వింత”

ఓ శేషన్.. వీళ్ళది మిడిమిడి జ్ఞానం, మిడతలబొట్ల సమానం ఎదగని ఈ వెధవలతో నీకెందుకు అవమానం… ఇది నీ వాక్యాలను తింటూ నిన్నే దూషించే లోకం..

శతాబ్దాల పర్యంత జనం అన్నపానాలను హతం చేయు బలమున్నవి ఇతిహాసాలనే రచనలిరవై రాయిటకంటే చిన్న చిన్న ప్రేమ కథలు చెప్పుకోవడమే మేలు….

వారి ప్రేమ లేఖలలో ఇంకొన్ని వాక్యాలు…

“ఇవాళ జీవన ప్రస్థానంలో కోర్కెల బరువుల్ని మోయలేక ఒకటొకటే జారవిడిచాను…. కోకిల మామిడికొమ్మకే అతికినట్లు నీవు నా బాహువులకే అతుకుతావనుకున్నాను….. వెన్నెలతో తాగిన మధువు ఎక్కుతుంది దిగిపోతుంది, నీ కన్నులతో తాగిన మధువు ఎక్కుతుంది కానీ దిగదు… ఎందుకలా చూస్తావు….

నీవు అబద్ధం ఆడినా సరే, ఏదో ఒక కొత్తసత్యం చెప్పినట్లే ఉంటుంది. శిశువుగా చూచాను నాలోకం ఉయాలలో ఊగడం. ఇప్పుడు చూస్తున్నా నా లోకం నీ బాహువుల్లో ఊగడం….“నీవు ఉన్నప్పుడు వాలేదానివి నా గుండెమీడ ఒక దండలా నీవు ఇప్పుడు లేవు కాని వాలుతున్నావు ఒక కొండలా….

ప్రిజంలో ఉన్న రంగుల్నీ నీలో ఉన్నలోతుల్నీ ఊహించుకోవలసిందే… కనకనే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం ఒక శబ్దాల్లేని భాషలో… నీకు తెలుసు ఒక్కరాత్రిలో ప్రేమ పుట్టదని ఒక్క రాత్రిలో నక్షత్రం పుట్టదని… నాకు తెలుసు స్త్రీలు తాము ధరించిన వలువలు దాటి చూడగలిగిన కన్నుల్నే అభిమానిస్తారు కాని నీవు నీ శరీరాన్ని దాటి నీ స్వప్నలోకాల్ని దర్శించగల కన్నుల్నే అభిమానిస్తావు…..”

ఇలాంటి అందమైన కొన్ని వాక్యాలు ఈ చిన్ని పుస్తకం పై ప్రేమను కలిగించాయి. మన భారతదేశం నుండి నోబెల్ కు ఎంపికైన రెండవ రచయిత శేషేంద్ర. కాని ఎంత మంది తెలుగువారికి ఇది తెలుసు…. అందమైన ప్రేమ వాక్యాలున్న ఈ బుజ్జి పుస్తకం చదవడం చాలా చాలా గొప్ప అనుభవం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here