ప్రేమ పరిమళం-13

1
6

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి వావిలికొలను రాజ్యలక్ష్మి రచించిన ‘ప్రేమ పరిమళం‘ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]”దొ[/dropcap]రా ఓ దొరా!… దొరస్వామీ!” చేతిలో సెల్ పట్టుకొనే లలితాంబ ఇంటి వెనకాల వున్న పశువుల దొడ్లోకి సరాసరి పరిగెత్తుకొచ్చినట్లుగా హుషారుగా వెళ్ళుతుంది.

నోటిలో వేపపుల్ల పెట్టుకొని దంతధావనం చేస్తున్న దొరస్వామి “ఏంటి, లలితా! అంతలా పరిగెత్తుకొచ్చినట్లుగా వస్తున్నావ్? ఏమిటి విషయం? చాలా హుషారుగా వున్నావ్? నీకొడుకేమైన ఫోన్ చేశాడా?” నోటిలోని పుల్ల తీస్తూ అన్నాడు.

“మీరన్నది నిజమేనండీ. ఇందాకనే అబ్బాయ్ ఫోన్ చేశాడు. వచ్చే వారమే ఇండియా వస్తున్నాడండీ”

“అవునా! మరి ఆ మధ్య వచ్చే నెలలోనో, ఆపై నెలలోనో వస్తానన్నాడు కదా!…”

“అవును. అది అప్పటి మాట. ఇది ఇప్పటి మాట.”

“ఓహో, గుడ్, వెరీగుడ్”

“వాడిప్పుడు ఇంత త్వరగా రావడానికి కారణం పెళ్ళి చేసుకోవడానికేనండీ!…”

“ఇంకేం మన ఎరుకలో సంబంధాలేమన్న వున్నాయేమో ఆ పెళ్ళిండ్ల పేరయ్యకి ఫోన్ చేసి వెంటనే కనుక్కో లలితా!”

“మీరిలా రండి !”

“ఏంటే, విషయమేమిటి ?…” గొంతు తగ్గించి అడుగుతూ భార్య దగ్గరగా వచ్చాడు.

“మన అబ్బాయ్‌కి అనిందిత బాగా నచ్చిందటండీ. ఆమెనే మాట్లాడమంటున్నాడు. చూడ్డానికి ఇద్దరికీ ఈడు జోడు కూడా బాగుంటుంది.”

భార్య అన్న మాటలకు దొరస్వామి ఓక్షణం విస్తుబోయాడు.

“అనిందిత వాడికి నచ్చమేమిటి నీమొహం? మతిలో వుండే మాట్లాడుతున్నావా? ఆమె నచ్చడానికి వాడెప్పుడు చూశాడు?” కోపంగా అడిగాడు.

“ఏవేవో కార్యక్రమాలు మన ఊళ్ళో జరిగినప్పటివి నేను అనిందిత కల్సి దిగిన ఫోటోలు… ఆ ఫోటోలు ఆమధ్యలో వాడికి వాట్సాప్‌లో పంపానుకదా! వాడికి అనిందితే బాగా నచ్చిందట. తన ఫోటో చూపించి వాళ్ళ అభిప్రాయం అడగమంటున్నాడండీ. మొన్నీ మధ్య మనూరికి కలెక్టర్ గారు వచ్చినప్పటి ఫోటోలు కూడా పంపాను. అవి చూసి మన మాధవ్ ఆ అమ్మాయ్ మీద మనసు పడ్డాడు.”

“అదెలా సాధ్యమవుతుందే?” బయటికెళ్ళినోటి లోపలి వేప పుల్ల తీసేసి నోట్లో నీళ్ళు పోసుకొని పుక్కిలించి మళ్ళీ భార్య దగ్గరికి వచ్చాడు దొరస్వామి.

“ఏం, ఎందుకు సాధ్యం కాదు? వాళ్ళమ్మ నాన్న యాత్రలప్పుడు మనకెలాగో పరిచయం అయ్యారుగా! అడిగి చూడండి… ఏమంటారో!”

“నీ మొహం నోరు మూసుకో! వాళ్ళసలే బ్రాహ్మణులు. మన సంబంధాన్ని ఎలా అంగీకరిస్తావనుకున్నావ్?”

“ఏం, ఎందుకు అంగీకరించరు? అందగాడైన నాకొడుకేం తక్కువ? కోరి కోరి చేసుకుంటానంటే ఎందుకొప్పుకోరు? మీరైతే మరీ మాట్లాడుతారు? అందున మనది అమెరికా సంబంధమాయె! కులాంతర, మతాంతర, ఖండాంతర వివాహాలే బోల్డు జరుగుతున్నాయి ఈరోజుల్లో. అయినా వాడిక్కడికీ రానీ… రెండునెలలు వుంటాడుగా. ఒక్కసారి చూస్తే కళ్ళు తిప్పుకోలేనంత అందం వాడిది. మనవాడి అందం ముందు అనిందిత అందం ఏమంత చెప్పుకో తగ్గది కాదులెండి.” ఒకింత గర్వంతో అంటున్న భార్య మాటలకు ఏం మాట్లాడాలో తెలియక చేత్తో నుదురు కొట్టుకోసాగాడు దొరస్వామి.

***

పంచాయితీ ఆఫీసులో కూర్చుని అనిందిత ఏవో కాగితాలు చూస్తుంది. పెన్ను చేత పట్టుకొని మధ్య మధ్యన ఆ కాగితాలపై ఏదో రాస్తుంది. అప్పుడే గబగబా లోపలికొచ్చింది చుక్కమ్మ.

ఎవరో వచ్చిన అలికిడికి తలెత్తి చూసిందామె.

“బాగున్నావా చుక్కమ్మ! ఏంటీ, విషయం? ఇలా వచ్చావేమిటి?”

“మరే, మేడమ్ గారూ! మీతో కొంచెం పనుండి వచ్చాను”

“పనా? ఏం పని చుక్కమ్మ? రాత్రి యాదగిరి తాగొచ్చి ఏమైన గొడవ చేశాడా?”

“ఉహు,అదేం కాదు మేడమ్…”

“మరింకేటి?”

“నాక్కొంచెం డబ్బు కావాలి మేడమ్!”

“డబ్బా!? ఎంత… ఎందుకు?”

“నాకీమారు నెల నిలిచింది మేడమ్, టౌన్ కెళ్ళి డాక్టరమ్మతో ఓమారు పరీక్ష చేయించుకోవాలి. మళ్ళీ మీకు ఫస్ట్‌కి తిరిగి యిస్తానమ్మా” కొంచెం సిగ్గు పడుతూ చెప్పింది చుక్కమ్మ

“ఓ, అందుకా డబ్బు! నీవు డబ్బు తిరిగి యిచ్చినా, యివ్వక పోయినా ఫర్వాలేదు. కంగ్రాట్యులేషన్ చుక్కమ్మా!” అని మళ్ళీ ఏమనుకుందో ఏమో గానీ, “తల్లివి కాబోతున్నందుకు ముందుగా నీకు శుభాకాంక్షలు !…” నవ్వుతూ విష్ చేసి హేండ్ బ్యాగ్ తెరిచి రెండు ఐదొందల నోట్లు తీసి ఆమె చేతిలో పెట్టి “చాలా?” అడిగింది.

“ఇవి మస్తు మేడమ్” అనిందితకు దండాలు పెడ్తూ చుక్కమ్మ వెళ్ళిపోయింది.

ఆరేడు సంవత్సరాల క్రితం జరిగిన విషయమేదో ఆమె స్మృతి పథంలో లీలగా తళ్ళుక్కున మెరిసి సన్నని దరహాస రేఖలు విల్లి విరిసాయి. ఆ మరుక్షణంలోనే ముఖం మ్లానమైంది.

గత జ్ఞాపకాలేవేవో మనస్సులో కదిలినట్లైంది. వెంటనే మనస్సును స్వాధీనపర్చుకొని ఏకాగ్రతతో మళ్ళీ పనిలో పడింది. ఏవో ఫైళు తిరగేస్తూ అక్కడక్కడ సంతకాలు చేస్తుంది. అంతలో తన ముందున్న సెల్ మోగింది. నెంబర్ చూడకుండానే ఆన్ చేసి “హలో” అంది.

“హలో అనిందితగారూ! గుడ్ మార్నింగ్, బాగున్నారా? ప్రస్తుతం మీరెక్కడ వున్నారు?” సమ్మోహనంగా సొంపుగా వినిపించిన ఆ కంఠస్వరానికి ఓక్షణం విచలిత అయి… వెంటనే మనిషి నిటారైంది.

“గుడ్ మార్నింగ్ సార్! నేనిక్కడనే పంచాయితీ ఆఫీస్ లోనే వున్నాను.”

“ఓ డ్యూటీ మైండ్ కదా మీది… సివిల్స్‌కి ప్రిపేరయ్యే మెటీరియల్ అంతా ఓ చిన్న సూట్ కేస్‌లో పెట్టి మా డ్రైవర్‌తో మీ ఇంటికి పంపాను. నేనడిగితే మీరారోజు మీ ఇంటి అడ్రస్ మెసెజ్ పెట్టారు కదా! మరి అది తీసుకోవడానికి ఈ టైమ్‌లో యింట్లో ఎవరన్నా వుంటారా?”

“మా అమ్మ గారు వుంటారు సర్! నేను కూడా ఇప్పుడే అమ్మకు ఫోన్ చేసి చెప్తానీ విషయం”

“ఓకె, అనిందితగారూ! మీ పనికి అడ్డు తగిలాను. ఇక క్యారీ ఆన్” అంటూ నవ్వి ఫోన్ పెట్టేశాడు ప్రేమ్ సాగర్.

ఓ క్షణం అలాగే వుండి పోయిందామె. అతను ఫోన్ చేసినప్పుడల్లా, అతని మాటలు వింటుంటే మనస్సు వశం తప్పుతున్నట్లుగా, ఏదో తెలియని వింత పారవశ్వానికి గురి అవుతున్నట్లుగా తనకు తెలియకుండానే జరుగుతుందనిపిస్తుంది.

తమాయించుకొని వెంటనే యింటికి ఫోన్ కల్పింది.

సుశీలనే ఎత్తి “హలో” అంది.

“అమ్మా! నేనిప్పుడు నీకు ఫోనెందుకు చేశానంటే రంగ అనే అతను చిన్న సూట్ కేస్ తీసుకొని మనింటికి వస్తాడు. అది నీవు తీసుకొని నా గదిలో వుంచమ్మా. నేనొచ్చాక చూస్తాను. అది కలెక్టర్ గారినుంచి వచ్చింది.”

“సరేనే అనితా! నేనేం దాన్ని తెరచి చూడనులేవే…”

“అబ్బే, అందులో రహస్యాలేమీ లేవులే. సివిల్స్‌కు ప్రిపేర్ కోసం పంపిన మెటీరియల్. ఇంకో విషయం. ఆ వచ్చినతనికి కాస్త టీ చేసివ్వమ్మా.”

“అబ్బ! నాకు తెలుసులేవే ఆ మర్యాదలు. నేను చూసుకుంటానులే ఆ విషయం.. ముందు నీవు ఫోన్ పెట్టేసేయ్. బయట ఎవరో తలుపు కొడుతున్నట్లుగా అనిపిస్తుంది” అంటూ సుశీల ఫోన్ పెట్టేసింది.

***

ఆఫీస్ వర్క్‌లో కొంచెం బిజీగా వున్నాడు పాండురంగం. అప్పుడే ఎవరో ఫోన్ చేశారు. ‘ఎవరిదో కొత్త నెంబరులాగుంది…’ అనుకుంటూ ఎత్తి “హల్లో” అన్నాడు.

“హలో, సార్ ! నమస్కారం… నేనండీ, దొరస్వామిని గుర్తు పట్టారా?”

“భలేవారే మీరు… గుర్తు పట్టక పోవడమేమిటి? చాలా కాలమైంది మనం మాట్లాడుకొని. యాత్రల నుంచి తిరిగొచ్చాక ఒక్కసారైన ఫోను చేసుకోలేదు. ఎలా వున్నారు?”

“బాగున్నాం సార్! మీరెలా వున్నారు?”

“బాగున్నాను దొరస్వామిగారూ!”

“మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడుదామని ఇలా ఫోన్ చేశాను సార్!”

“చెప్పండి దొరస్వామమి గారూ! ఏంటి విషయం?”

“మా అబ్బాయ్ ఇండియా వస్తున్నాడు. వాడికి నచ్చిన అమ్మాయ్ దొరికింది. పిల్ల తరుపున వాళ్ళు ఒప్పుకుంటే వెంటనే పెళ్ళి చేద్దామనే నిర్ణయంలో వున్నామండి…”

“అవునవును. యాత్రలలో తిరిగినప్పుడు మన సంభాషణంలో మీ అబ్బాయ్ మాధవ్ గురించి కూడా ఓమారు చెప్పారుగా… గుడ్, మరి అమ్మాయ్ ఎవరు? ఎవరి సంబంధం?”

“మీ అమ్మాయ్ అనిందితనే మావాడికి నచ్చిన పిల్ల!”

ఆ మాట వినగానే ఓక్షణం కంగారు పడి పోయాడు పాండురంగం.

“ఏమిటీ, మా అమ్మాయ్ నచ్చిందా? ఎలా!? వాళ్ళిద్దరూ ఒకర్ని ఒకరు ఎప్పుడూ ఎలా చూసుకున్నారు? కనీసం ఫోటో అయినా చూడలేదే! ఇదెలా సంభవం దొరస్వామి?” ఆశ్చర్యంతో ప్రశ్నించాడు.

“కొన్ని కొన్ని పరిస్ధితులలో అసంభవాలు కూడా సంభవాలుగా అవుతాయి సార్! మా ఆవిడ ఊళ్ళో జరిగే కార్యక్రమాలలోని ఫోటో లేవో పెడుతూ వుంటుంది కొడుక్కి వాట్సాప్‌లో… అవి అలా చూసి మీ అమ్మాయ్‌ని వాడు మెచ్చి యిష్టపడ్డాడు; ప్రేమలో పడ్డాడు.”

“సరే, దొరస్వామి! నేను కొంచెం ఆఫీస్ వర్క్‌లో బిజీగా వున్నాను. నేను సాయంత్రం ఇంటికి వచ్చాక మాట్లాడుతానీ విషయం.. ఏమంటారు? ఫోన్ పెట్టేయనా?”

“సరే సార్!అలాగే” అంటూ అవతలివైపు దొరస్వామి ఫోన్ కట్ చేయగానే, ఆయన పక్కన్నే నిల్చుని ఆ సంభాషణ వింటున్న లలితాంబ “ఇంతకీ ఆయన ఏమన్నాడండీ?”అంటూ అడిగింది.

“స్పీకర్ ఆన్ చేశానుగా? ఆ సంభాషణంతా నీవూ విన్నావుగా! మళ్ళీ నన్ను అడుగుతావేం? నీ పోరు పడలేకనే అడిగాను. నాకస్సలిష్టం లేదు. ఆ అమ్మాయ్ ఎక్కడ? నీ కొడుకెక్కడ? ఆమెకున్న సుగుణాలలో పోల్చుకుంటే వీడు దేనికి పనికి రాడు. నీ కొడుకున్న ఓ మంచి లక్షణం చెప్పు లలితా, వింటాను.”

“నాకొడుకేం?!… వాడిలో వున్నవన్నీ మంచి లక్షణాలే. మీరేం కన్నతండ్రండీ? వాడికన్నీ వ్యతిరేకంగానే మాట్లాడుతారేమిటండీ?”

“వున్నదున్నట్లు మాట్లాడితే ఎవరికైన కోపం వస్తుంది. నేనన్నదాంట్లో తప్పేముంది? కాకి పిల్ల కాకికి ముద్దు అని పెద్దలు ఊర్కే అన్నారా? అదే ఆయన అంటే… పాండురంగం గారు ఏ విషయం చెప్పేవరకూ నీవు ఆగు. పుసుక్కున నోరు జారి ఈ విషయం అనిందితతో మాట్లాడకు తెలిసిందా?” ఆగ్రహంతో వున్న దొరస్వామి భార్యనోమారు హెచ్చరించి బయటికి నడిచాడు.

***

అనిందిత ఇంకా ఇంటికి రాలేదు. దీపు బయట ఆడుకుంటున్నాడు.

సుశీల వంటింట్లో అంతకు మునుపే ఇంటికి వచ్చిన భర్త కోసం టీ చేస్తుంది. రెండు మూడు బిస్కెట్స్ కూడా ట్రేలో పెట్టుకొని టీ తెచ్చింది. భర్తకు టీ కప్పు అందిస్తూ “ఈరోజు అమ్మాయ్ యింకా రాలేదండీ” అందామె.

“ఫర్వాలేదు వస్తుంది. నీతో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇలాకూర్చో” భార్యకు తన ఎదురుగుండా వున్న ఖాళీ కుర్చీ చూపాడు పాండురంగం.

“నాకీ రోజు దొరస్వామి ఫోన్ చేశాడు సుశీలా!”

“ఎవరూ?మన అమ్మాయ్ పని చేసే ఊరి సర్పంచ్ లలితాంబ భర్తేగా?”

“అవును…ఆయననే. ఎందుకు చేశాడని అడగవేం?”

“నేనడగడం ఎందుకు? మీరే చెప్తారుగా. ఏమిటంటా విషయం?”

“పెద్ద విషయమే. వాళ్ళబ్బాయ్ మాధవ్ అమెరికా నుంచి వస్తున్నాడట. మన అనిత నచ్చిందట అతనికి. పెళ్ళి విషయం మాట్లాడానికి చేశాడు. నేను ఆఫీసు పనిలో వుండడం వలనే నేనప్పుడేం ఎక్కువ మాట్లాడలేక పోయాను. ఇప్పుడు మాట్లాడుతానన్నాను. నీవేమంటావ్?” నింపాదిగా టీతాగుతూ తాపీగా అంటున్న భర్త మాటలకు ఓ క్షణం నివ్వెర పోయింది సుశీల.

“ఏం మాట్లాడవేం సుశీలా? కులమతాల పట్టింపులు కూడా మనకేం లేవుగా…” మళ్ళీ అడిగాడాయన.

“ఏం మాట్లాడాలో తోచడం లేదండీ. అయినా వాళ్ళబ్బాయ్ మన అనిందతని ఎలా చూశాడట?” ఆశ్చర్యంగా అడిగింది.

“దానికీ సమాధానంగా నేనూ నీలా ఇదే ప్రశ్న వేశాను ఆయాన్ని” అంటూ దొరస్వామి దానికి చెప్పిన సమాధానమే సతీమణికి చెప్పాడు పాండురంగం ఖాళీ కప్పుకింద పెట్టి.

“నాకేం తోచడం లేదండీ, ఆ అబ్బాయ్ ఫోటోని లలితాంబ యాత్రలలో చూపించిందెందుకనో?! బహుశా ఈ విషయం మనస్సులో పెట్టుకొనే కాబోలు! ఎర్రతోలే గాని ఆ ముఖంలో కళలేదండీ అచ్చం తండ్రిలా వున్నాడనిపించింది. కళ్ళు మాత్రం అదోలా క్రూరంగా వున్నట్లుగా అన్పించింది. నాకస్సలు నచ్చలేదు. అయినా, అనిందితని అమెరికాలో వుండే అతనికిచ్చి పెళ్ళేలా చేస్తాం? అదీకాక తానిప్పుడు సివిల్స్‌కి చదువుతుందిగా. తానిప్పుడు పెళ్ళి చేసుకునే వుద్దేశంలో లేదని చెప్పండి. మొన్నామధ్య మీరు చూసినా సంబంధానికి కూడా అలా చెప్పే వద్దన్నదని చెప్పండి. తాను వివాహం చేసుకోవాలను కున్నప్పుడు తానే మాతో పెళ్ళి సంబంధాలు చూడమని చెప్తానని అందని కూడా మీరు చెప్పడి. అస్సలు నేనీ వుద్యోగానికి రిజైన్ చేసి ఇంటి పట్టునుండి బాగా ప్రిపేరు కావే అనితా… అని చెప్తున్నాను. కానీ తాను వినడం లేదు. అటు వుద్యోగం, ఇటు చదువు రెండూ ఎలా సాగుతాయండీ… మీరే చెప్పండి?”

“అవును అదీ నిజమే కానీ, మనం తనని ఒత్తిడి పెట్టి ఉద్యోగం మాన్పించడం కన్నా, చదువుకు ఆటంకం అనుకున్నడు తనంతట తానే మానేస్తుందిలే సుశీలా!”

“మొన్నీ మధ్య వచ్చిన కొత్త కలెక్టర్ గారినుంచి కూడా ప్రశంసలందుకొని సన్మానం జరిగింది. ఇంకేం మానుతుంది లెండి వుద్యోగం! అన్నట్లు కలెక్టర్ అంటే గుర్తుకొచ్చిందండీ. ఈరోజు కలెక్టర్ గారి డ్రైవరట… ఏదో చిన్న సూట్ కేస్ లాంటి లెదర్ బ్యాగ్ యిచ్చివెళ్ళాడండీరోజు అనిత కోసమని.”

“ఓ అదా! ‘కలెక్టర్ గారు తాను సివిల్స్ చదివినప్పటి మెటీరియల్, వీడియోలు ఇస్తామన్నారు నాన్నా, తీసుకోనా’ అని నన్ను అడిగిందిలే. నేనే తీసుకో నీకు ఉపయోగ పడొచ్చని చెప్పాను. మరి దొరస్వామికి ఫోన్ చేయనా సుశీలా?”

“చేయండీ… అమ్మాయి ఇంటికి రాకముందే. అదీకాక ఈ విషయాన్ని అనిందితతో అస్సలు మాట్లాడొద్దని, తనని ఒత్తిడి పెట్టొద్దని కూడా మరీ మరీ చెప్పండి” భర్తతో ఖచ్చితంగా చెప్పింది సుశీల.

“సరే” అంటూ పాండురంగం గదిలో కెళ్ళాడు ఫోన్ చేయడానికి.

ఓ పది నిమిషాలు దొరస్వామితో మాట్లాడి ఫోన్ పెట్టేసి హల్లో కొస్తుంటే, అనిందిత అప్పుడే యింట్లోకి వస్తుంది. ఎదురుగుండా తండ్రిని చూడగానే “హరే, నాన్నా! మీరీరోజు నాకంటే ముందుగా వచ్చేశారే”అని నవ్వింది.

“అవునమ్మా. నీవీ రోజు లేట్!”

“ఊళ్ళో కాస్త పని ఎక్కువగా వుండే నాన్నా” అంటూ హ్యాండ్ బ్యాగ్‌లో నుంచి ఓ శుభలేఖ తీసి తండ్రికందించింది.

“మా ఉపసర్పంచ్ పెళ్ళి కార్డ్ నాన్న ఇది. వాళ్ళమ్మగారు పదే పదే చెప్పారు; నాతో పాటు మీరిద్దరు కూడా పెళ్ళికి రావాలని. మీరంతా యాత్రా ఫ్రెండ్స్ కదా!”

“సత్యవతి నన్ను బాగా ప్రేమతో ‘అక్క…అక్కా’ అంటూ పిల్చేది. తప్పకుండా వెళ్ళుదామండీ. ఎప్పుడు పెళ్ళి?”

“వచ్చేవారంలో 16వ తేదీన…”

“మనం ఎలా వెళ్ళాలి పెళ్ళికి అనితా?” సుశీల సందేహంగా అడిగింది.

“వాళ్ళింటి నుంచి ఓ పెద్ద బస్సు మాట్లాడరట. అందులో వెళ్ళాలి” అంటూ లోపలికెళ్ళి పోయిందామె.

సుశీల కూడా శుభలేఖ విప్పదీసి చూస్తుంది. “వెళ్ళుదామండీ మనం పెళ్ళికి” అంటున్న భార్య మాటలకు “ఇంకా చాలా రోజులుంది పెళ్ళి అప్పటి వరకూ ఏదో ఒకటి ఆలోచన చేద్దాం సుశీలా! వీలైతే అందరం వెళ్ళుదాం, లేకపోతే అనిందితతో పాటు నీవు వెళ్ళుదువు గానీ. దీపుని చూసుకోవడానికి నేనింట్లో వుంటాను” అంటూ పాండురంగం దీపుని పిలువడానికి బయటికెళ్ళాడు.

***

చదువుకోవడం ముగించి పండుకోవడానికన్నట్లుగా మంచమెక్కుతున్న అనిందితకు అప్పుడు సడన్‌గా గుర్తు కొచ్చింది. కలెక్టర్ గారు పంపించిన మెటీరియల్ గురించి కళ్ళు తిప్పుతూ రూమ్ నాలుగు దిక్కులా చురుగ్గా పరికించింది. కిటికీ ప్రక్కగా ఎత్తైన స్టూల్ మీద కన్పించిందో చిన్న సూట్ కేస్ లాంటి లెదర్ బాగ్. దాన్ని తెచ్చి మంచంపై పెట్టి తెరిచింది. అన్ని ఫైళ్ళు ఎంతో పొందికగా అమర్చివున్నాయి దొంతర్లుగా. సైడ్‌కి కొన్ని అడియో సిడీలున్నాయి. అన్నింటికన్నా పైన మడత పెట్టివున్న తెల్లకాగితం కన్పించింది. చేతిలోకి తీసుకొని విప్పింది. ముత్యాల్లాంటి అక్షరాలతో తెలుగు లోనే రాసుంది.

“కాబోయే కలెక్టర్ అనిందితగారూ,

ముందుగా మీకు సివిల్స్ ఎగ్జామ్స్‌కు ప్రిపేరవ్వబోతున్నమీకు ఆల్ ద బెస్ట్! నేను పంపిస్తున్న ఈ మెటీరియల్ మీకు బహువిధాలుగా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. నేను వరస క్రమంలో పెట్టిన ఫైళ్ళలోని విషయాలన్నీ మీరు అదే వరస క్రమంలో చదవండి. అంటే సూట్ కేస్ అడుగు ఫైళ్ళలోనుంచి పైవరకన్నమాట.

-మరిక వుంటాను ప్రేమ్ సాగర్.

ఆ వుత్తరాన్ని అనిందిత ఎందుకనో పదే పదే చదువుకుంది. మనస్సంతా నూతనోత్సాహంతో నిండిపోయి… పురి విప్పిన నెమిలిలా నాట్యం చేయసాగింది. కలెక్టరన్న అహం, అతిశయం ఎక్కడా అంటే మాటలలో, చేతలలో కన్పించనే కన్పించదు. నిలువెల్లా వినయ విధేతలే! ఆ రాత్రి చాలా సేపటి వరకూ అతన్ని గురించే ఏదో ఆలోచిస్తున్నామె ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రశాంతంగా నిద్రపోయింది.

మర్రోజు తెల్లారినాక కూడా లేవలేక పోయింది. అప్పటికే నిద్ర లేచిన దీపు పక్కన అక్క ఇంకా పండుకునే వుండడం గ్రహించి “అక్కా! లే తెల్లారింది…” ఆశ్చర్యంతో అంటూ నిద్ర లేపసాగాడు.

ఉలిక్కిపాటుతో అనిందిత గబుక్కున నిద్ర లేచింది. కళ్ళు నులుపుకుంటూ తమ్ముడి వంక తేరిపారగా చూడసాగింది.

“ఏమైందక్కా! ఈరోజు ఇంత సేపు పండుకున్నావ్? అని అడుగుతున్న తమ్ముడికి “ఏదో లేరా ! అలా గాఢనిద్ర పట్టేసింది” అంటూ గబగబా మంచం దిగి బాత్ రూమ్ లోకెళ్ళింది. ఆ తర్వాత అన్ని పనులూ త్వర త్వరగా తెమల్చుకొని రోజుకన్నా ఓపావు గంటముందే ఊరికి బయలుదేరింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here