ప్రేమ పరిమళం-17

0
5

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి వావిలికొలను రాజ్యలక్ష్మి రచించిన ‘ప్రేమ పరిమళం‘ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]బా[/dropcap]స్‌తో మీటింగ్ పూర్తి అయిన తర్వాత ఏవో కొన్ని ఫైళ్ళు చేత పట్టుకొని పాండురంగం తన క్యాబిన్ లోకి వెళ్ళుతున్నాడు.

అంతలో తన జేబులోవున్న సెల్ రింగైంది. ఓ క్షణం ఆగి తీసి చూశాడు.

ఎవరిదో కొత్త నెంబర్. ఆన్ చేసి “హలో”అన్నాడు.

“హలో…”

“ఎవరండీ?”

“………”

“హలో, ఫోన్ చేసి పలుకరేమండీ?”

“మీతో మాట్లాడుదామనే ఫోన్ చేశాను. నమస్కారమండి”

“నమస్కారం. ఎవరు మీరు? నాతో ఏం మాట్లాడాలి?”

“నేను.. నేను….”

“నేను అంటే మీరెవరో నాకెలా తెలుస్తుంది? మీ పేరేటి?”

“నా పేరు ప్రేమ్ సాగర్. ఈ జిల్లా కలెక్టర్ని పాండురంగం గారూ!”

నడుస్తున్న వాడల్లా ఆ మాటలు వినగానే ఆశ్చర్యంతో ఓ క్షణం టక్కున ఆగిపోయాడు పాండురంగం. ఏం మాట్లాడాలో తెలియలేదు.

తత్తరపాటుతో కంగారుగా “సార్! నమస్కారం…” అని ఎలాగో అనగలిగినాడు.

“మీరిప్పుడు బిజీగా వున్నారా? నేను ఓ ఐదు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తానండీ” అంటూ ఫోన్ పెట్టేశాడు.

పాండురంగం తొందరగా తన క్యాబిన్ లోకి వెళ్ళి కూర్చున్నాడు.

గొంతు పొడిబారినట్లుగా అన్పిపిస్తుంది. తన బాటిల్ తీసుకొని నీళ్ళు తాగాడు. ఎందుకనో మనిషి పూర్తిగా ఆశ్చర్యంతో తల మునక్కలవుతున్నాడు. కలెక్టర్ గారు తనకెందుకు ఫోన్ చేశారు? ‘నా పేరేలా, నా సెల్ నెంబరెలా తెలిసిందతనికి?’ పదే పదే అనుకుంటూ తీవ్రంగా ఆలోచించసాగాడు.

ఓ ఐదు నిమిషాల తర్వాత ప్రేమ్ సాగర్ నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది. వెంటనే ఎత్తాడాయన. “హలో సార్! నమస్కారం”

“నమస్కారమండీ, మీతో కొంచెం మాట్లాడాలండీ”

“చెప్పండి సార్, ఏ విషయంలో…”

“మీ అమ్మాయ్ అనిందిత విషయంలో”

“అంటే!?… మీరనేదేమిటో నాకర్థం కాలేదు సార్!”

“ఇక మీతో సూటిగా మాట్లాడుతాను పాండురంగం గారూ! మీ అమ్మాయ్ అనిందతని నేను ఇష్టపడతున్నాను. వివాహాం చేసుకోవడానికి మీకేమన్న అభ్యంతరంమా?”

ఆ మాటలు వినగానే ఆయన నోటి నుంచి మాట రాలేదు కొంతసేపటి వరకు.

“హలో….”

“ఆ, సార్! మీకు నేనెలా జవాబు చెప్పాలో తోచడం లేదు. ఈ విషయంలో మా అమ్మాయ్ అభిప్రాయం ముఖ్యం కదా?”

“మీరేం భయాందోళనలు పడకండి. మీ అమ్మాయ్ విషయం గురించి నేను తెల్సుకోగలిగాను యించు మించు. ఆ విషయం నాకు వదిలేయండీ. ఇక పోతే అనిందిత తల్లిదండ్రులైన మీ నిర్ణయం గూడా అతి ముఖ్యమే కదండీ. అనిందితకి అన్నీ ఎగ్జామ్స్ పూర్తయి ఇంటర్యూలో సెలెక్ట్ కావడం ఒకటే మిగిలింది. అదీ విజయవంతంగా ముగుస్తుంది. అందులో ఏ మాత్రం సందేహపడక్కరలేదు…”

“అదికాదు సార్! అభ్యుదయ భావాలున్న మీలాంటివారు మా అమ్మాయ్‌ని మెచ్చడం, ఇష్టపడ్డం మా అనితతో పాటు తల్లిదండ్రులమైన మాకూ సమ్మతమే కానీ, మా అమ్మాయ్ గతజీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలి. మీరు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం సార్!”

“అంటే…!? ఏంటో అది చెప్పండి…కాని నాకు మాత్రం అనిందితకు సంబంధించిన గతమేమీ నాకు అక్కరలేదండి. మీరు చెప్తానన్న విషమేమిటో చెప్పండి. వింటాను.”

“ఇలా ఫోన్‍లో చెప్పే విషయం కాదండది… మిమ్ముల్ని ప్రత్యేకంగా కలిసే చెప్పాలీ సంగతి.”

“ఓ, ఐతే సరే… మరి మనం ఎక్కడ కలుద్దామంటారు?”

“మీరే చెప్పండి సార్!”

తామిద్దరూ ఎక్కడ, ఏ రోజు, ఏ టైమ్‌కు కలవాలో ప్రేమ్ సాగరే చెప్పాడు.

“సరే సార్! నమస్తే”

“ఓకె సరే… నమస్తే, నమస్తే!”

ఫోన్ పెట్టేశాక చాలా సేపటివరకు పాండురంగం అలాగే వుండిపోయాడు. ఇది కలా? నిజమా? అన్నట్లుగా వుందాయన పరిస్ధితి

***

సుశీల పూజా మందిరంలో సంధ్యా దీపారాధన చేసి హాల్లోకి వచ్చింది.

దీపు చదువుకుంటున్నాడు. అనిందితనేమో త్వరలో జరగబోయే ఇంటర్యూకి ప్రిపేరవుతుంది. అప్పుడే పాండురంగం ఇంటికొచ్చాడు. భార్యతో కలెక్టర్ గారి విషయం ఎప్పుడెప్పుడు చెప్పుదామా అని ఎంతో తహపహతో ఆత్రంగా వున్నాడు. యింట్లోకి వచ్చాక నేరుగా బాత్ రూమ్ లోకెళ్ళాడు.

భర్త వచ్చాడని సుశీల టీ పెట్టడానికి వంటింట్లోకి వెళ్ళింది.

ఇంతలో దీపు వంటింటి గుమ్మంలో నిల్చుని “అమ్మా,నేను కాసేపు బయట ఆడుకొని వస్తానమ్మా” అడిగాడు.

“సరే వెళ్ళు. మళ్ళీ తొందరగా వచ్చేసేయ్… నాన్న కూడా వచ్చారుగా”

“అలాగేనమ్మా” అంటూనే వాడు బయటికి తుర్రు మన్నాడు.

బాత్ రూమ్ లోనుంచి టవల్‌తో తల తుడుచుకుంటూ పాండురంగం బయటికొచ్చాడు. టీ కప్పు తెస్తున్న భార్యని వుద్దేశించి “సుశీలా! నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. గదిలోకి రావోయ్” అంటూ పిల్చాడు.

భర్త వంక ఆశ్చర్యంగా చూస్తూ అతని వెనకాలే వెళ్ళింది సుశీల.

“ఏంటండీ, మీరీ రోజు చాలా సంతోషంగా వున్నారే! ఆఫీస్‌లో యింక్రిమెంట్ యిచ్చారా ఏమిటి?”నవ్వుతూ అడిగింది.

“అంతకన్నా ఎక్కువ సంతోషాన్నిచ్చే మహా గొప్ప విషయం నేను చెప్పబోయే సంగతి. ఆ టీ కప్పు అలా పెట్టి ఇలా వచ్చి కూర్చో”

ఆమె అయోమయంగా చూస్తూ కూర్చుంది. కలెక్టర్ ప్రేమ్ సాగర్ నుంచి తనకు ఫోన్ రావడం నుంచి అన్నీ విషయాలు భార్యకు పూసగుచ్చినట్లుగా చెప్పుకొచ్చాడు.

“నిజంగా మన అమ్మాయ్ అదృష్టంవంతురాలు సుశీలా! ఈ ఇంటర్యూలో కూడా అనిత విజయం సాధిస్తే వాళ్ళిద్దరి యువ కలెక్టర్ల జంట చూడ ముచ్చటగా వుంటుంది కదా!”పాండురంగం సంతోషం పట్టలేనట్లుగా వుంది.

ఆ శుభవార్త వినగానే సుశీలకు కూడా మహానందంగానే వుంది. కానీ, ఒక్క విషయంలోనే ఆమెకు సందేహాత్మకంగా వుంది. “అది కాదండీ, అనిత గతానికి సంబంధించిన విషయం అతనికి తెలిస్తే, పరిస్థితి ఎలా వుంటుందోనని నా అనుమానమండీ!”

“నీవన్నది నిజమే సుశీలా! నాకూ అదే సందేహముంది కానీ, అతనేమో తనకు గతం అక్కరలేదు అని అంటున్నాడు… అభ్యుదయ భావాలున్నతను కాబట్టి, అది పెద్ద విషమ సమస్య కాదని నా అభిప్రాయం. ఎందుకంటే నేనా విషయం చెప్పినప్పుడు అతని కంఠస్వరంలో ఎలాంటి కించత్తు కూడా తొట్రుపాటు గానీ, నిరాశ గానీ నాకనిపించలేదు సుశీలా! మన అమ్మాయ్ గతం పూర్తిగా తెలిస్తే అప్పుడతని స్పందన ఎలా వుంటుందో చూడాలి. తనకి తల్లీదండ్రీ కుటుంబ పరంగా ఎలాంటి సమస్య లేదు… స్వతంత్రుడు. నిర్భయంగా తన అంగీకారాన్ని తెలియచేసే అవకాశానికి ఆస్కారముంది కదా!”

“అవును… మీరన్నది నిజమే కానీ, ముందుగా మన అనిత అంగీకారం కూడా తెలుసుకోవాలి కదా!”

“ఆ విషయంలో మనమేమీ సందేహ పడక్కరలేదన్నట్లుగా కలెక్టర్ గారే మాటల మధ్యలోనే తెల్పారు. అయినా తల్లిదండ్రులగా మనం ఒక్కసారి అనితని అడిగిన తర్వాతే ఏవిషయంలోనైనా ముందుకు పోవడం మన బాధ్యత సుశీలా!”

“అవును గానీ, మరి ఎల్లుండి ఆదివారం రోజు మీరతన్ని కలువాలి కదా! అతనికి చెప్పేటప్పుడు మాత్రం దీపుగాడి సంగతి మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా బయటికి రావడానికి ఎంత మాత్రం వీల్లేదండీ! ఇది బాగా గుర్తుంచుంకోండి… ఈ రహస్య విషయం మనిద్దరి మధ్యనే వుండాలి” భర్తకు గుసగుసగా హెచ్చరింపుగా చెప్పింది.

“అవును… నీవన్నది నిజమే. ఇన్నేళ్ళనుంచి అనిందితకే తెలియని ఈ విషయం అతనికి మనమిప్పుడు తెలపాల్సిన అవసరం ఎంత మాత్రం లేదులే! వాడెప్పుడూ మన దగ్గరే వుంటాడు. మన కొడుకే!” దృఢంగా అన్నాడు పాండురంగం.

“అమ్మా! ఎక్కడున్నావ్? నాకు కాస్తా టీ కావాలి…” కూతురి అన్న మాటలకు “ఆ, వస్తున్నామ్మా. మీ నాన్న ఏవో ఆఫీస్ సంగతులు చెప్తూంటే వింటున్నాను…” అంటూ గబగబా తలుపు తెరుచుకొని ఇవతలికొచ్చింది సుశీల.

***

ఆ రోజు మధ్యాహ్నం భోజనాల సమయంలో అనిందిత “అమ్మా! నాన్న ఇంట్లో కనిపించడం లేదు. ఎక్కడికెళ్ళాడు?”అని అడిగింది.

కూతురికి ఎలాంటి సమాధానం చెప్పకుండా సుశీల “ఒరేయ్, దీపూ నిన్న నేను పక్కింటి వాళ్ళ పిండి జల్లెడ తెచ్చాను. మనది పాడవుతే. అది వాళ్ళకి ఇచ్చేసి నీవు కాసేపక్కడే ఆడుకుని రా! నీ భోజనం కూడా అయిపోయిందిగా” అంటూ కొడుకుని బయటికి పంపింది.

“నేనడుగుతుంటే ఏం జవాబు చెప్పవేం అమ్మా?”

“నీకు సమాధానం చెప్దామనే వాడినలా బయటికి పంపానే అనితా!”

“నాకు సమాధానం చెప్పడానికి, వాడ్నలా బయటికి పంపడానికి సంబంధమేమిటమ్మా?” విస్తుబోతున్నట్లుగా అడిగిందామె.

“ఉంది… సంబంధముంది అనితా! అందుకనే దీపుని వాళ్ళింటికి పంపానని చెప్పానుగా. మీ నాన్నగారు కలెక్టర్ గార్ని కలువడానికి వెళ్ళారమ్మా?”

“అవునా, ఎందుకమ్మా?” ఏం ఎరగనట్లే ఎదురు ప్రశ్న వేసింది.

సుశీల చిన్నగా నవ్వింది. “ఎందుకంటే ఏం చెప్పను. ‘మీ అమ్మాయ్‍ని నేను వివాహం చేసుకుందామని అనుకుంటున్నాను. మీకేమన్న అభ్యంతరమా?’ అంటూ రెండు మూడు రోజుల క్రితం అతను ఫోన్ చేసి మీ నాన్నని అడిగాడట. దాని ఫలితంగానే మీ నాన్న అతన్ని కలవడానికి వెళ్ళారు. మన ధర్మంగా నీ గతజీవితానికి సంబంధించిన విషయాలు కూడా అతనికి తెలియపర్చాలి కదా! ‘అనిందితకు సంబంధించిన గతం తనకక్కర లేద’న్నాడట. కానీ, చెప్పాల్సిన ధర్మం మనకుంది కదమ్మా!”

ఈమారు ఏం మాట్లాడ లేదు అనిందిత. మౌనంగా వుండి పోయింది

“ఏం మాట్లాడవేం అనితా!? అతనంటే నీకిష్టమేకదా?”దగ్గరగా వెళ్ళి ప్రేమగా కూతురి తలనిమురుతూ అడిగింది సుశీల.

“ఊ” అంటూ సన్నగా మూలిగిందామె.

“నీవీ ఇంటర్యూలో విజేతగా నిలిచి కలెక్టర్‌వి ఐతే, మీయిద్దరి జంట చూడ ముచ్చటగా వుంటుంది అనితా!” కూతురి జీవితం ఈనాటికి పచ్చగా కళకళ లాడాల్సిన సమయం ఆసన్నమవుతున్నందుకు ఆ మాతృ హృదయమంతా ఆనందంతో నిండిపోయింది.

భర్త ఇంటికి వచ్చి చెప్పబోయే శుభవార్త కోసం ఆత్రంగా నిరీక్షిస్తుంది.

***

సాయంకాలం చల్లని గాలు వీస్తున్నాయి. ఆ హోటల్ ఆవరణంలో నీడనిచ్చే ఆ చెట్ల క్రింద కుర్చీలో కూర్చున్నాడు ప్రేమ్ కుమార్, చాలా సేపటి నుంచి ఎవరి కోసమో ఎదురుచూస్తున్నాడు. వెయిటర్‌తో ఓమారు టీ తెప్పించు కొని తాగాడు. అలా మౌనంగా కూర్చోవడం కొంచెం విసుగ్గానే అనిపిస్తుంది కానీ, పాండురంగం గారు వచ్చీ తాను ఎంతగానో మనస్ఫూర్తిగా యిష్టపడుతున్న అనిందిత జీవితానికి సంబంధించిన గతం గురించి ఏం చెప్తారోనని ఒకింత ఆందోళనగానే వుంది. కానీ, ఆయనేం చెప్పినా భయపడవల్సిన అవసరం లేదు. ఆందోళన పడవల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే తాను ముందుగానే ‘ఆమె గతం నాకక్కరలేద’న్నాడు, కానీ ఆయన కలవాలి, మీతో విషయం చెప్పాలి అన్నారు. ఏదీ ఇంత సేపయినా రాకపోవడానికి కారణం ఏమై వుంటుందనుకుంటూ ఫోన్ చేయడానికి జేబులోనుంచి సెల్ బయటికి తీసాడు.

“గుడీవినింగ్ సార్! నేను వచ్చేందుకు కొంచెం లేటయింది. సారీ సార్, నాకోసం చాలా సేపు వెయిట్ చేశారా?”

“గుడీవినింగండీ! ఓ అరగంటైంది నేనొచ్చి”

“అయ్యో! మిమ్ముల్ని వేయిట్ చేయించాను” బాధతో నొచ్చుకుంటున్నట్లుగా అన్నాడు పాండురంగం.

“ఏం ఫర్వాలేదండీ. టీయో, కాఫీయో తీసుకుంటారా మీరు?”

“అబ్బే, వద్దండి”

ఆ తర్వాత మాటలేం మాట్లాడాలో వాళ్ళిద్దరికీ తోచడంలేదు. కాసేపటి వరకూ మౌనమే రాజ్యమేలింది వాళ్ళిద్దరి మధ్య.

“అనిందిత గతానికి సంబంధించిన విషయం చెప్పేటప్పుడు ముఖ్యంగా నా గురించి కూడా మీకు కొంచెం చెప్పాలి సార్!”

“సార్ అంటూ మీరు నన్నేం అలా పిలకండి. మామూలుగా ప్రేమ్ అని పిలిస్తే చాలండీ. అనిందితకు సంబంధించిన ఎలాంటి గతాన్ని అయినా నేను స్వీకరించడానికీ సిద్ధంగా వున్నానండి. మీరెలాంటి సందేహాలు, భయాందోళనలు ఏ మాత్రం పెట్టుకోకుండా నిర్భయంగా చెప్పండి…” వినడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లుగా కూర్చున్నాడతను

“అనిందితకు ఇంతకు మునుపే వివాహం అయింది.”

ఈమాట అంటూ ప్రేమ్ సాగర్ వైపు చూశాడు. అతని ముఖకవళికలల్లో ఎలాంటి మార్పులేదు. ఆమెకు గతముందిని అనేసరికి ఇలాంటిదేదో వుంటుందేమోనని ముందుగానే ఊహించుకున్నాడు కాబోలు, ‘అనిందితకు పెళ్ళైంద’ని చెప్పినా కూడా అదో షాకింగ్ న్యూస్‌లా అనుకోకుండా, ఏమాత్రం చలించకుండా అదే చిరునవ్వు ముఖంతో తనవైపే తదేకంగా చూస్తుండ్డం గమనించాడు పాండురంగం.

“నాకు ఓ అక్క వుండేది. నేను ఆమె ఎంతో అన్యోన్యంగా వుండేవాళ్ళం చిన్నప్పటి నుంచి కూడా. ఒకరి పట్ల ఒకరికి అమితమైన మమతాభిమానాలు, ప్రేమానురాగాలు మెండుగా వుండేవి. మేమంతా అప్పట్లో బొంబాయిలో ఒకే యింట్లో వుండేవాళ్ళం. మొదట్లో మేము వేరే యింట్లోనే వుండేవాళ్ళం. మా బావ చనిపోయాక అందరం ఒకే యింట్లోకి మారాం. అప్పటికే మా అక్క కొడుకు యింజనీర్ చదివేవాడు. మా అమ్మాయ్ అనిందిత ఢిగ్రీ చదువుకొచ్చింది. మొదటి నుంచైనా మా అక్కకు మేనకోడల్నే తన కోడలుగా చేసుకోవాలని ఎంతో ఇష్ట పడేది. వద్దని చెప్పడానికి మాకు కూడా పెద్దగా అభ్యంతరం లేకుండె. బావామరదళ్ళు అయినా వాళ్ళుకు కూడా ఒకరి పట్ల ఒకరికి చాలా ఇష్టముండేది. బావ చనిపోయాక మా అక్క ఆరోగ్యం అంతంత మాత్రంగానే వుండేది. కొడుక్కి వుద్యోగం రాగానే వెంటనే వాళ్ళిద్దరికి పెళ్ళి చేయాలని పట్టు పట్టి కూర్చుంది. అనిందితకేమో తనకి సివిల్స్‌కి ప్రిపేరు కావాలని తెగ కోరికుండేది. పెళ్ళాయ్యాక కూడా నీవు నీ చదువు కొనసాగించుకోవడానికి తన కెలాంటి అభ్యంతరం లేదని చెప్పి ఒప్పించి ఢిగ్రీ అయిపోగానే యిద్దరికి పెళ్ళి జరిపించాం. మా అక్క కూడ కొడుకు పెళ్ళి చూసి సంతోషపడింది…

మనమొకటి తలిస్తే దైవమొకటి తలచినదన్నట్లుగా అనిందిత జీవితం తలకిందులైయే ఘోర సంఘటన జరిగింది. మా అల్లుడు రైలు ప్రమాదంలో మరణించాడు. అప్పటికే మా అమ్మాయ్ తల్లి కాబోతుంది. కొడుకి చావుకి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న మా అక్క ఎన్నాళ్ళో జీవించలేదు. పెళ్ళై ఓ ఏడాది కూడా నిండకుండానే తన సౌభాగ్యాన్ని కోల్పోయి, కన్నీటి సుడిగుండంలో కొట్టుకపోతున్న అనిందితని ఆ విషమ పరిస్ధితిలో రక్షించుకోవడం తల్లిదండ్రులమైన మాకు తక్షణ కర్తవ్యం అనిపించింది. వేళకు తిండి తిప్పలు నిద్రాహారాలు లేకపోవడంతో లోలోన కృంగి కృశించిపోసాగింది. ఏం చేయాలో మాకు తోచడం లేదు. రోజులు మహా దుర్లభంగా గడవసాగాయి. అలాంటి పరిస్ధితిలో అనిందితకు డెలివరీ అయింది. తాను చాలా వీక్ గా వుండ్డం వలన పుట్టిన బిడ్డ ఎదుగుదల లేక పురిటిలోనే పోయింది. ఒకదానివెంట ఒకటి అన్నీ ఎదురుదెబ్బలే తగిలాయి మా అమ్మాయ్‌కి. ఇక బొంబాయిలో వుండలేక పోయాం. స్ధలం మార్పుకోసం ఇక్కడి కొచ్చి స్ధిరపడ్డాం. తనని మనిషిని చేయడం కోసం మేము చేయని ప్రయత్నమంటూ లేదు. ఈ జన్మలోనే మళ్ళీ పునర్జన్మ ఎత్తినట్లయింది మా అనిందిత. బలవంతంగా సివిల్స్‌కి లాంగ్ టర్మ్ కోచింగ్ చేర్పించాను. రాలేదు. ఏదో ఉద్యోగం సంపాదించడం కోసం ఏవేవో ఎగ్జామ్స్ రాస్తూనే వుండేది. వాటి ఫలితమే ప్రస్తుతం తాను చేసి, ఈ మధ్యనే రిజైన్ చేసిన జాబ్” అంటూ చెప్పడం ముగించాడు పాండురంగం.

“వెరీ బ్యాండ్ అనిందిత గారి జీవితం. అన్నీ కష్టాలు, బాధలే!” విచారస్వరంతో నిట్టురుస్తూ అన్నాడు ప్రేమ్ సాగర్.

“అవును బాబూ! ప్రస్తుతం తానిప్పుడు రెండవ జన్మలో జీవిస్తూంది. నేనీ విషయమంతా మీకు అర్థమైతే చాలనుకొని ‘కట్టె, కొట్టె, తెచ్చె’ అన్న రీతిలో మీకు క్లుప్తంగా చెప్పానంతే.”

“మీరు చెప్పిన ఈ విషయమంతా విన్నాక కూడా నా అభిప్రాయంలో ఏం మార్పు లేదండీ! ఇకపోతే మీకిక ఎలాంటి అభ్యంతరం లేదనుకుంటా. ఇంటర్వ్యూ అయిపోయాక నేను అనిందితతో మాట్లాడుతాను. మా ఆశ్రమ అమ్మ శారదాదేవి నా తరపున అనిందితను చూడడాన్కి లాంఛనంగా మీయింటికి వస్తారు ఓమారు. మీకేం అభ్యంతరం లేదుకదా!”

“మాకేం అభ్యంతరం బాబూ! మీలాంటి యోగ్యుడు, సంస్కారవంతుడు మా అమ్మాయ్‌కి భర్తగా రావడం తన అదృష్టం.”

వెయిటర్ని పిలిచి రెండు కాఫీలు తెమ్మని చెప్పాడు ప్రేమ్ సాగర్. ఇద్దరు వేడివేడిగా కాఫీ తాగారు. అతనే బిల్ చెల్లించాడు.

“నేనిక ఇంటికి వెళ్ళుతాను బాబూ!”

“ఆగండి, మా డ్రైవర్ రంగకు మీ యిల్లు తెలుసు. కార్లో ముందుగా మిమ్ముల్ని ఇంటి దగ్గర దించి వస్తాడు”

“వద్దు బాబూ! మీకెందుకు శ్రమ! నేను వెళ్ళుతాను. నేను బండి మీదే వచ్చాను” అంటూ పాండురంగం అతని దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here