ప్రేమ పరిమళం-3

1
8

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి వావిలికొలను రాజ్యలక్ష్మి రచించిన ‘ప్రేమ పరిమళం‘ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]స[/dropcap]మయం రాత్రి ఎనిమిదవుతుంది.

పాండురంగం ఆఫీసు నుంచి వచ్చి స్నానం చేసి బాత్రూంలో నుంచి రాగానే సుశీల వంటింటి ముందున్న డైనింగ్ హాల్ లాంటి ఆ చిన్న రూమ్ లోనే భోజనాలకి ఏర్పాట్లు చేయసాగింది.

అప్పటికే అనిందిత కంచాలు కడిగి తెచ్చి పెట్టింది. ఓ పెద్ద స్టీల్ చెంబు నిండా నీళ్ళూ, నాల్గు గ్లాసులూ తెచ్చి పెట్టాడు దీపు.

“అక్కా! పెరుగు గిన్నె తెచ్చాక గ్లాసుల్లో నీళ్ళు నేనే పోస్తాను…” అంటూ వాడు మళ్ళీ వంటింట్లోకెళ్ళాడు.

“సరేరా, నీవే పోయ్”నవ్వుతూ అంది అనిందిత.

“వంటగిన్నెలన్నీ నేను తెస్తాను పదరా! నీవెళ్ళి కూర్చో” అని తల్లి అనడంతో వెనుదిరిగి వచ్చి గ్లాసులలో నీళ్ళు పోసి అక్క పక్కన బుద్ధిగా కూర్చున్నాడు దీపు.

మధ్యాహ్నం పూట ఒక సుశీల తప్పా… ఎవరూ యింట్లో వుండరు కాబట్టి, ప్రతిరోజూ రాత్రిపూట మాత్రమే పెందరాళే యింట్లో వున్న ఆ నలుగురు సభ్యులు అలా కలసి అదే చోట ఒకేమారు కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ తాపీగా భోజనాలు కానిస్తారు.

ఆదివారాలు, పండుగరోజు సందర్భాలలో కూడా అలాగే కలసికట్టుగా భోజనాలు చేస్తారు. మొదటి నుంచీ వాళ్ళింట్లోవున్న పద్ధతది.

ఉతికిన లుంగీ కట్టుకొని భర్త దేవుని గదిలోకెళ్ళి దండం పెట్టుకొని రాగానే సుశీల నెమ్మదిగా వడ్డన చేయడం మొదలెట్టింది.

“ఏరా, దీపూ! నీ హోమ్ వర్క్, చదువు అంతా అయిపోయిందా?” అని కొడుకుని పలుకరించుతూ కంచం ముందు కూర్చున్నాడాయన.

“ఓ, ఎప్పుడో అయిపోయినాయి నాన్నా!” హుషారుగా జవాబిచ్చాడు.

“ఏమ్మా, అనితా! నీకెలా జరిగిందీ రోజు మీ పల్లెలో?” అని కూతుర్ని అడుగుతున్న సమయంలో “నాన్నా!…” అంటూ ఏదో చెప్పబోతున్న కొడుకు మధ్యలోనే అడ్డు తగిలాడు.

“దీపూ! నాన్న అక్కతో మాట్లాడుతున్నాడుగా. కాస్త ఆగలేవా?” అంటూ సుశీల కొంచెం కోపంగా చూసింది కొడుకు వంక.

“మరే…” అంటూ నసిగాడు దీపు.

“నీవాగు సుశీలా!” భార్యని వారిస్తూ “వాడేదో చెప్ప బోతున్నాడుగా…. ముందుగా వాడు చెప్పనీ… ఇప్పుడు మనం వాడు చెప్పేది వినక నిర్లక్ష్యం చేస్తే, రేపటి దినాన మనం ముసలాళ్ళం అయ్యాక, వాడు పెద్దయ్యాక అప్పుడు మనం చెప్పే మాటలేవీ వాడస్సలు వినని ప్రమాదముంది సుశీలా!” అన్నాడాయన కొడుకు వంక నవ్వుతూ చూస్తూ.

“మీరు మరీను… ఊరుకుందురూ” అందావిడ చిరుకోపంతో.

అనిందిత కూడా తండ్రి మాటలకు చిన్నగా నవ్వింది. “అదేం కాదు నాన్నా, పెద్దయ్యాక కూడా వాడు చక్కగా మనందరి మాటలూ వింటాడు.”

“ఈరోజు మాస్కూల్లో సైన్స్ టీచర్ పీరియడ్‌లో మంత్లీ టెస్ట్ పేపర్స్ మాకిస్తుంటే ఓ చిన్న తమాషా జరిగింది నాన్నా!”

“ఏంటిరా అది?” అనడుగుతూ చపాతీ ముక్కతుంచి కూరతో కల్పి నోట్లో పెట్టుకున్నాడాయన.

“మరే, టీచర్ నాకు టెస్ట్ పేపరిస్తూ ‘ఏరా, దీపక్! ఏమైందీమారు నీకు? మీ నాన్నగార్కి ఫోన్ చేసి మాట్లాడాలా? ఈ టెస్ట్ రాయడమేమిటి? అన్నీ తప్పులే. ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం రాయలేదు. ఫెయిలయ్యావు ఈమారు నీవు’ అంటూ నన్ను బాగా కోప్పడినారు టీచర్ నాన్నా!…”దిగులు పడుతున్నట్లుగా అన్నాడు.

వింటున్న శ్రోతలు ముగ్గురూ ఆశ్చర్య పడ్డారు.

పప్పన్నం తింటున్న అనిందిత దిగ్గున తలెత్తి, తమ్ముడి వంక అదే పనిగా చూడసాగింది.

“సాయంత్రం నాకెందుకు చెప్ప లేదురా ఈ సంగతి?”

“అబ్బా! నీవాగక్కా. నేను కూడా మీలాగే ఆశ్చర్యంతో వెళ్ళి టీచర్ చేతిలోనుంచి పేపర్స్ తీసుకున్నాను దిగులుగా. సైన్స్ టెస్ట్ ఎంతో బాగా రాశాను. ‘టీచరేంటిలా అంటున్నారు?’ బాధగా అనుకుంటూ పేపరు ఒక్కొక్కటి చూశా. ఆ పేపర్స్ నావి కానే కావు. అన్నీ కొట్టి వేతలు, గొగ్గిరి చాలా చంఢాలంగా వుంది. ముందుకు తిప్పి పేరు చూశాను. ఆ టెస్ట్ పేపర్స్ మా వెనుక బెంచీలో కూర్చునే రమేష్‌వి.”

“మరప్పుడు నీవేం చేశావ్?” ఆతృతగా అడిగాడు తండ్రి.

సుశీల కూడా అన్నం తినడం ఆపి, కొడుకు చెప్పేది ఆసక్తిగా వింటుంది.

“నేను టీచర్ దగ్గరికెళ్ళి ‘ఈ టెస్ట్ పేపర్స్ నావి కావు, రమేష్‌వి మేడమ్’ అన్నాను వినయంగా.

“మా టీచర్ ఉలిక్కిపడి ‘అవునా?’ అంటూ నా చేతిలోని పేపర్స్ అందుకొని ఎగాదిగా చూసి ‘సారీ రా! నేను సరిగా చూడలేదు. అన్ని పేపర్స్ రోల్ నెంబర్ ప్రకారమే పెట్టుకున్నాను. నేనివ్వడంలో ఎక్కడో పొరపాటు జరిగిపోయింది. నేనిప్పుడే అనుకున్నాను. దీపక్ ఏంటీ ఈమారు టెస్ట్ ఇలా రాయడమేమిటనీ?…గుడ్ నీదేరా ఫస్ట్ మార్కు’ అని నా భుజం తట్టి నవ్వుతూ అప్పుడు నా పేపర్స్ యిచ్చారు నాన్నా మేడమ్!” వాడు ఓ చిన్న కథలా చెప్పుకొచ్చాడు.

అనిందిత నవ్వుతూ తమ్ముడి తల నిమిరింది మెచ్చుకోలుగా.

“అదేంటీ, ఆ టీచరమ్మ ఆ మాత్రం చూసుకోవద్దూ పేపర్స్ యిచ్చే ముందు… ఎవరి పేపర్ ఎవరికిస్తున్నామోననీ…” అంది సుశీల సాగదీస్తూ.

భార్య మాటలకీ మధ్యలోనే అడ్డు తగిలాడు పాండురంగం.

“మనిషన్నాక ఎప్పుడో ఏదో ఒక పొరపాటు జరగకుండా చూసుకోలేడు సుశీలా! ఐతే సైన్స్‌లో మన చిన్న హీరోకీ ఫస్ట్ మార్కలేనన్నమాట. గుడ్, వెరీగుడ్” కొడుకుని ప్రశంసించాడాయన.

“నాన్నా! మా ఊరి ఉపసర్పంచ్‌కి ఈమారు పెళ్ళి ఖాయమైంది” మిగిలిన అన్నంలోకి మజ్జిగ పోసుకుంటూ చెప్పింది అనిందిత.

“ఏదీ, ఆ నల్ల రాయికా అక్కా?” దీపు టక్కున అనేసి అనిందిత వంక చూసి టక్కున నాలుక కర్చుకున్నాడు.

“దీపూ! తప్పురా, అలా అనగూడదు” కళ్ళతోనే మందలించాడు తండ్రి.

“అతని నేరమా నల్లగా పుట్టడం? భగవంతుడు అతనికా కలర్ యిచ్చాడు మరి. శ్రీకృష్ణుడు కూడా నీలి మేఘశ్యాముడే తెలుసా?”

“సారీ అక్కా! ఇంకెప్పుడూ ఎవర్ని అలా అనను”

“మీ ఉప సర్పంచ్‌ను వీడెప్పుడు చూశాడే!”సుశీల విస్తుబోతున్నట్లుగా అడిగింది కూతుర్ని.

“పోయిన నెల్లో ఓమారు ఎందుకో స్కూల్‌కి సెలవు యిస్తే నావెంట స్కూటీ మీద పల్లెకు వచ్చాడుగా. అప్పుడు చూశాడు వీడు అతన్ని. అతని పేరు ‘నల్లరాయి’ కదురా, రాయప్ప తెలుసా?”

సుశీలకీమారు ఎందుకనో అప్రయత్నంగా నవ్వొచ్చింది. “అయినా, అదేం పేరే అనితా రాయప్ప అనీ” అనకుండా వుండలేకపోయిందామె.

“వాళ్ళది కర్ణాటక బార్డర్ అమ్మా! వాళ్ళ నాన్న చనిపోయాక ఏదో బ్రతుకుదెరువు కోసం ఇటు వైపు వచ్చారు. కర్ణాటక వైపు అలాగే వాళ్ళ పేర్లు ఆఅప్ప,ఈఅప్ప అని వుంటాయిగా. అందుకని అతని పేరు అలాగే ‘రాయప్ప’ అని పెట్టారనుకుంటా”

“మరీ చోద్యం కాకపోతే చిత్రంగా వుందేమిటే ఈ పేరు వ్యవహారం? వెంకటప్ప, రంగప్ప, సంగప్ప అని విన్నాను గానీ, మరీ ఈ రాయప్ప ఏమిటే? మీ నాయనమ్మ కాలంలో పప్పు వండి పోసుకునే నల్లరాచ్చిప్పలా…” అంది సుశీల హాస్యంగా.

తల్లి మాటలకు అక్క చూడకుండా కిసుక్కున నవ్వాడు దీపు.

“అతని పేరెలా వుంటే ఏమైందే సుశీలా? అతని మనస్సు మాత్రం బంగారులాంటిదని మన అమ్మాయ్ ఎప్పుడూ చెప్తూనే వుంటుందిగా. చాలా సంబంధాలు కుదరలేదన్నావుగా తల్లీ! ఇదెలా కుదిరింది?”

“బ్రహ్మలిఖితమండీ, ఏ పిల్లా అతని నుదిటిన రాసి పెట్టి వుంటే తప్పించుకోలేడుగా” అంటూ సుశీల అన్నం తినడం ముగించి నీళ్ళు తాగసాగింది.

“తనని ఏ అమ్మాయ్ మెచ్చడం లేదనీ, ఈమారు అస్సలు పెళ్ళిచూపులకే వెళ్ళనని మొండికేశాడు. వాళ్ళమ్మ వచ్చి మా సర్పంచ్ గారితో మొరపెట్టుకొని… ఎలాగైన తన కొడుక్కి నచ్చజెప్పి పెళ్ళిచూపులకు వెళ్ళేలా ఒప్పించుమని వేడుకుందట. అందుకని ఓరోజు భార్యాభర్తలిద్దరూ వెళ్ళి చాలా సేపు మాట్లాడితే, చివరికి ఎలాగో ఒప్పుకొని తల్లి వెంట పెళ్ళిచూపులకెళ్ళాడు. ఇంకేముందీ ఆ అమ్మాయ్ ఒప్పుకొందట. సంబంధం కుదిరి ఖాయమైంది.”

“హమ్మయ్య! మరింకేం, శుభం! మొత్తం మీద మీ ఉపసర్పంచ్ గారికి వివాహం అవ్వబోతుందన్నమాట” అంటూ భోజనం ముగించి చేతులు కడుకోవడాన్కి లేచాడాయన.

“కొడుకుకు సంబంధం కుదిరిందని వాళ్ళమ్మ సత్యవతిగారి ఆనందం ఇంతా అంతా కాదు నాన్నా!”

“అవును మరి. పిల్లల పెళ్ళి పేరాంటాళ్ళే కన్నతల్లిదండ్రులకు ఆనందోత్సాహాలతో కూడుకున్న వేడుకది. ఎవరో ఆ అదృష్టవంతురాలు” అంటూ ఏదో అనబోయిన సుశీల కూతురేమంటుందోనని భయంతో గబుక్కున ఆగిపోయింది

“మా క్లాస్‌లో రవి వాళ్ళన్నయ్యది కూడా ఈ నెలలోనే పెళ్ళట. మరి మన అక్క పెళ్ళెప్పుడు నాన్నా? అక్కకీ పెళ్ళి చేయరా?” వున్నట్లుండి సడన్‌గా అడిగిన దీపు ప్రశ్నకు శ్రోతలు ముగ్గురూ ఆశ్చర్యంతో బిత్తరపోయి బిగుసుకపోయారు.

“ఏంటో మీ ముగ్గురు నాకేసి అలా చూస్తున్నారు. అక్క పెళ్ళి చేయరా అమ్మా?” మళ్ళీ వాడే అన్నాడు.

” చేస్తాం… ఎందుకు చేయం? తాను ఎప్పుడు చేసుకుంటుందో అప్పుడు” ముందుగా తేరుకున్న పాండురంగం అన్నాడు కొడుకుతో.

“అక్కకు పెళ్ళై బావొస్తే ఎంత బాగుంటుంది. నేనెంచక్క బావతో బోలడన్ని కబుర్లు చెప్పుకోవచ్చు.” అనుకుంటూ దీపు గదిలోకెళ్ళి పోయాడు.

తమ్ముడెళ్ళిన వైపే అనిందిత అదోలా చూడసాగింది

***

వంటకట్టంతా శుభ్రం చేసి గ్యాస్ తుడిచి పాలు తోడుపెట్టి ఓ చెంబు నిండా నీళ్ళు తీసుకొని పైన ఓ చిన్న గ్లాస్ బోర్లించుకొని లైట్ ఆర్పి ఇవతలికొచ్చింది సుశీల.

అంతట్లోనే గదిలోనుంచి పాండురంగం “దీపు పండుకుంటే అనితనోమారు రమ్మను సుశీలా!” నెమ్మదిగా చెప్పాడు. ఆమెకు విషయం అర్థమైంది వెంటనే. నీళ్ళ చెంబు టేబుల్ మీద పెట్టి కూతురి గది వైపు వెళ్ళింది.

అప్పటికే దీపు పండుకున్నాడులా వుంది. మడత విప్పి దుప్పటి కప్పుకుంది వాడికి.

“అనితా, నాన్న నిన్నెందుకో రమ్మంటున్నాడు” అంది సుశీల.

“నన్నా? ” తల్లి వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది

“అవునే… నిన్నే. ఏదో మాట్లాడేందుకు”

“పద. వస్తున్నాను” తల్లి వెంటనే గదిలోకి వచ్చింది.

పాండురంగం టేబుల్ ముందు కుర్చీలో కూర్చుని ఏదో బుక్ చూస్తున్నాడు

“ఏంటి నాన్నా, పిలిచారట.”

“అవును. రా, తల్లీ ఇలా కూర్చో” తన ముందున్న మరో కుర్చీ చూపాడు కూతురికి. విషయమేమిటో అర్థం కాక తండ్రి వంక అదే పనిగా చూస్తూ కూర్చుంది.

“మనల్ని వెతుక్కుంటూ ఓ మంచి పెళ్ళి సంబంధం వచ్చింది తల్లీ! అబ్బాయ్ సాప్ట్‌వేర్ ఉద్యోగి. అతని తల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ప్రిన్స్‌పాలట. తండ్రి లేడు. ఒక్కత్తె చెల్లెలట. ఢిగ్రీ ఫస్టియర్ చదువుతుందట. నీవిష్టపడితే వాళ్ళను పెళ్ళిచూపులకి రమ్మంటాను…”

“ఒద్దు నాన్నా! నాకు మీరిప్పుడు ఏ సంబంధాలు చూడక్కరలేదు. నేనిప్పట్లో పెళ్ళి చేసుకోను.”

“ఏం, ఎందుకు తల్లీ!? ఎన్నాళ్ళిలా వుంటావ్? నీవీమారు బాగా ప్రిపేర్ అయి సివిల్ ఎగ్జామ్ రాసేందుకు కూడా వాళ్ళు అంగీకరించారు. నీ గురించి కూడా ఏ విషయం దాచకుండా అన్నీ వివరంగా చెప్పారట. చాలా మంచి సంబంధమట ఒప్పుకోవే అనితా!” అంది సుశీల ఆప్యాయంగా కూతురివంక చూస్తూ.

“అమ్మా, నాన్నా! మీ ఇద్దరికీ చెప్తున్నాను. ఉహు, నాకిప్పట్లో పెళ్ళి చేసుకోవాలనే లేదు. పోయిన సారి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాను. కాని లాభం లేక పోయింది. ఈమారు నా శాయశక్తులా కృషి చేసి పోయినసారిది నా దగ్గరున్న మెటీరియల్ తోనే బాగా చదివి సివిల్స్‌కి ప్రిపేరై ఎగ్జామ్ రాస్తాను. ఇదే యిక నా లాస్ట్ ప్రయత్నం నాన్నా! ప్రస్తుతం ఖాళీగా వుండకుండా ఏదో ఒక ఉద్యోగం చేస్తూనే మీ కోరికా, నా దృఢసంకల్పం నెరవేర్చుకోవాలనీ వుంది. నా జీవితంలో జరిగిపోయిన సంఘటనలెన్నెన్నో ఇంకా ఇప్పటికీ నాలో బాధాగ్నిని రగిలిస్తూనే వున్నాయి. పెళ్ళి గురించి ఆలోచించడానికీ ఇది సమయమే కాదు నాన్నా! మ్రోడైన నాలో ఏనాడైనా అలాంటి భావన, ఆశలు, కోరికలు చిగిరించితే, పెళ్ళిపై మోజు కల్గితే నేనే ముందుగా మీతో చెప్తాను. అప్పుడు చూడండి నాకు పెళ్ళి సంబంధాలు. అంతేగానీ, ఇప్పుడు కాదు సారీ, నాన్నా! మీకు బాధ కల్గిస్తే క్షమించండి. నాకు నిద్ర వస్తుంది. వెళ్తాను. గుడ్ నైట్!” మరో మాటకైనా తల్లి దండ్రులకి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి లేచి తన గదిలోకెళ్ళి పోయింది అనిందిత.

పాండురంగం ఆశ్చర్యంతో ఓ క్షణకాలం పాటు బిగుసుక పోయాడు.

“మీరు నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడే, ఆ రోజే నేనే మీకు చెప్పాను. అనిత పెళ్ళికి ఒప్పుకోదని అంటే మీరు నామాట విన్నారా?” దూకుడుగా అంటున్న భార్య మాటలకు మధ్యలోనే అడ్డు తగిలాడాయన.

“అవును సుశీలా! నీవన్నది నిజమే. నేనే తొందర పడ్డాను. దాని మనస్సుకి అయిన గాయం సామాన్యమైనదా? తాను అనుభవించిన కష్టాలు బాధలు అన్నీ తనలోనే ఓబడబాగ్నిలా దాచుకొని లోలోన దహించుకొని పోయింది. అనిందిత నుదిటిన ఇంకా ఏమేమి రాశాడో ఆ బ్రహ్మ దేవుడు…” రెండు చేతులతో తల పట్టుకొని ఆవేదనాభరితమైన స్వరంతో అన్నాడాయన.

“ఊర్కోండి. మీరిక బాధ పడకండి. ఆ పెళ్ళి వారికి ఏదో ఒకటి రేపే సర్ది చెప్పేసేయండి ఏం చేస్తాం. మన చేతిలో ఏమీ లేదు. ఏది ఎలా జరగాలో రాసి పెట్టి వుంటే అలాగే జరుగుతుంది. దాన్ని బాధ పెట్టి.. మనమిలా ప్రతి సారి బాధపడ్డం కూడా సబబు కాదండీ” భర్తకు ఓదార్పుతో అనునయంగా సర్ది చెప్పసాగిందామె.

భార్యాభర్తలిద్దరూ ఒకరి ముఖాలొకరు భావ గర్భితంగా చూసుకోసాగారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here