ప్రేమ పరిమళం-4

0
6

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి వావిలికొలను రాజ్యలక్ష్మి రచించిన ‘ప్రేమ పరిమళం‘ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]ఇం[/dropcap]టి వెనకాలా పశువుల దొడ్లో వున్న వేపచెట్టు చుట్టూతా కట్టిన గుండ్రని సిమెంట్ అరుగుపై బాసీంపట్టు వేసుక్కూర్చున్న దొరస్వామి చుట్ట కాలుస్తూ గుప్పు గుప్పున పొగ వదులుతూ, గొడ్లకి మేత వేస్తున్న జీతగాడు మల్లేష్‌తో రేపు పొలంలో చేయాల్సిన పనుల గురించి మాట్లాడుతున్నాడు.

“దొరా! ఓ దొరా!…” అంటూ లలితాంబ నేరుగా పశువుల దొడ్డి వైపు వచ్చేసింది.

“అమ్మగారొస్తున్నారయ్యా” అంటూ మల్లేష్ రహస్యంలా చెప్పి, సన్నగా కట్ చేసిన జొన్న చొప్ప పశువుల గాడిలో వేయసాగాడు.

భార్య వస్తుందని తెలియగానే దొరస్వామి కంగారుతో చుట్టనార్పి క్రింద పడేశాడు.

“ఏం చేస్తున్నారిక్కడ?” చుట్టకంపుకి ముక్కు మూసుకుంటూ, “మళ్ళీ మొదలు పెట్టారా? మీరిక మానరా? అమెరికాకు ఫోన్ చేసి అబ్బాయ్ మాధవ్‌కి చెప్పనా?” భర్తని బెదిరిస్తూ కోపంగా అంది.

“అబ్బే, ఏదో ఇప్పుడే రెండు దమ్ములు లాగానంతే లలితా! నేనస్సలు పొలం దగ్గర కూడా చుట్టలు కాల్చడమే మానేశాను. నీకు నమ్మకం కలుగాలంటే వీడ్ని మల్లేష్‌ని అడుగు.”

“పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్లుగా నేనిప్పుడు వీడి మాటల్ని వినాలి., నమ్మాలి. అంతే కదా! మీకు కావల్సింది.”

“మరే…” అంటూ నసిగాడు దొరస్వామి.

“ఇందాకనే సత్యవతి వచ్చింది. కొడుకు నిశ్చితార్థానికి మనల్ని పిలవడానికి… మీరింట్లో లేరనుకొని ‘మీ అన్నకు నేను చెప్తానులే’ అని చెప్పి పంపించాను.”

“ఎప్పుడు నిశ్చితార్థం?”

“ఎల్లుండి దశమి రోజట”

“ఆ మేడారాన్కి ఎవరెళ్ళుతారు లలితా! నాకైతే పొలం పనులు చాలా వున్నాయి. వెళ్ళడానికి వీలుకాదు. నీకేమో ఊర్లో వ్యవహారాలాయె! ఇంకెలా వెళ్ళుతాం? పెళ్ళికి వెళ్ళుదాం లే!” తాపీగా అన్నాడు.

“ఊర్కోండి మీరు మరీను. సత్యవతి వింటే బాధపడుతూంది. తన దిక్కు పెద్ద మనుషులుగా మనమే వ్యవహారించాలని అంటుంది. అలాంటప్పుడు వెళ్ళక పోతే ఏం బాగుంటుంది. వెళ్ళుదాం నిశ్చితార్థం ఇక్కడే మనూళ్ళోనే. పెళ్ళి మాత్రం అమ్మాయ్ ఊళ్ళోనట.”

“అవునా!? ఐతే ఇంకేం? సంతోషం .. పిల్ల ఊళ్ళో నిశ్చితార్థం చేస్తారేమో, అంతదూరం ఏం వెళ్ళుతాంలే అని అనుకున్నా. ఇక్కడే అంటున్నావుగా… తప్పకుండా వెళ్ళుదాంలే అంబా!”

“అంబా ఏమిటి రంభలాగా” చురచురా చూసింది భర్త వంక.

“అంబా అనేసరికి నీకెందుకింత కోపం? మీవాళ్ళు పెట్టిన లలిత + అంబ= లలితాంబ. సవర్ణ దీర్ఘ సంధి. ఏదో సరదాగా అంబా అన్నాను. అంబా అంటే అమ్మవారి పేరే కదా!” మాటి మాటికి ‘అంబా’ అన్న పేర్ని ఒత్తి పలుకుతూ భార్యకు ఉక్రోషం తెప్పిస్తున్నట్లుగా మాట్లాడసాగాడు దొరస్వామి.

రాత్రి భోజనాలు చేస్తుంటే హైదరాబాద్ నుంచి దొరస్వామికి ఫోనొచ్చింది.

“హలో, ఎవరు?” లలితాంబే ఫోనెత్తి అడిగింది.

“నేనే అక్కా! బాల రాజుని, ఎలా వున్నారు?”

“బాగున్నావా తమ్ముడూ? మీరంతా ఎలా వున్నారు?” సంతోషంతో మాట్లాడుతుందామె తమ్ముడితో.

‘పుట్టింటి వాళ్ళతో మాట్లాడుతుంటే ఎంత పారవశ్యమో ఈ ఆడాళ్ళకి’ భార్య ముఖం సంతోషంతో వెలిగిపోవడం గమనించి అలా అనుకోకుండా వుండలేక పోయాడు దొరస్వామి.

“మా దొరబావ ఎలా వున్నాడక్కా?”

“ఎలా వుంటాడు?! దర్ఙాగా దొరలాగే వున్నాడురా!”

“నేనో ముఖ్యమైన పని మీద ఫోన్ చేశానక్కా!”

“ఏమిటిరా అది రాజూ?”

“మేమంతా దక్షిణ దేశ యాత్ర వెళ్ళడాన్కి ప్లాన్ వేస్తున్నాము. నా ఫ్రెండ్ రత్నాకర్ వున్నాడుగా! వాడూ నీకు తమ్ముడిలాంటి వాడేకదా అక్కా! వాడెప్పుడు యాత్రలకి తీసికెళ్ళుతుంటాడు.. ఈమారు వాడు తీసికెళ్ళే దక్షిణదేశ యాత్రాస్పెషల్లో వెళ్ళుదామను కుంటున్నాం. ఇంకా ఓ పది వరకూ సీట్లు వున్నాయట. మీరూ, మీతో పాటు మీ ఊళ్ళో ఇంకెవరన్నా వచ్చీనా సరే, అడుగక్కా! టికెట్స్ నేను బుక్ చేస్తానక్కా!”

“అవునా! నాకూ ఎప్పటి నుంచో వెళ్ళాలనే వుంది. కాని సరైన సమయం, సందర్భం రాలేదురా ఇంతవరకూ…ఇదిగో మీ బావ కిస్తున్నాను మాట్లాడు”

“ఏం బామ్మర్దీ! ఎలా వున్నావు? స్పీకర్ ఆన్ చేయడం వలన మీ అక్కతో మాట్లాడిన మాటలన్నీ నేనూ విన్నాను. మనమంతా ఎప్పుడు బయలుదేరేది? డబ్బు ఎంతవుతుంది? ఆ వివరాలన్నీ చెప్పవోయ్?”

“ఈ నెలాఖరు వరకూ యాత్రలకి తప్పకుండా వెళ్ళుతాం. ఒక్కోమనిషికి ఖర్చు పదిహేనువేలు వరకూ కావొచ్చు. టిఫిన్స్ భోజనం ఖర్చంతా వాళ్ళదే. గుళ్ళల్లో వ్యక్తిగతంగా ఎవరికి వారు జరుపుకునే పూజలు పునస్కారాలు వాటి ఖర్చంతా మన డబ్బే. ఇక్కడి నుంచి మెడ్రాస్ వరకూ రైలు ప్రయాణం. ఆతర్వాత అక్కడి నుంచి డీలక్స్ బస్సులోనే ప్రయాణాలు. రాత్రుళ్ళు కొన్నిసార్లు ఏ హోటల్లోనో, సత్రాలలోనే బస. మీ ఊర్నించి ఎంత మంది వస్తారో చెప్పితే మాఫ్రెండ్‌కి చెప్పి టికెట్స్ బుక్ చెస్తాను. కరెక్ట్‌గా డబ్బెంతో వెళ్ళే ఖచ్చితమైన తేదీతో సరి రెండు రోజుల్లో చెప్తాను బావా!”

“ఓకె బామ్మర్దీ! మా తరుపున నేనూ, మీ అక్క రెడీ. మా ఊళ్ళో ఇంకెవరన్నా వస్తామంటే ఆ వివరాలు కూడా అడిగి వెంటనే చెప్తాను. అవునూ, ఇంతకీ అసలు విషయమే అడగడం మర్చేపోయాను. ఈ దక్షిణ దేశయాత్ర ఎన్ని రోజులోయ్ రాజూ?” అడిగాడాయన బావమరిదిని.

“పన్నెండు రోజులు బావా! పన్నెండవరోజుకల్లా తిరిగి హైదరాబాద్కి వస్తాం బావా!”

“సరే” అంటూ ఫోన్ పెట్టేశాడు దొరస్వామి.

“నాకెన్నాళ్ళనుంచో వెళ్ళాలనీ వుందండి. మన ఊళ్ళో కూడా ఎవరన్నా వస్తారేమో మీరు అడగండి. నేను సత్యవతిని, అనిందిత మేడాన్ని అడుగుతాను.” హుషారుగా అంటున్న భార్య వంక చూస్తూ

“పిచ్చిమొద్దూ! కొడుకు పెళ్ళి పెట్టుకొని సత్యవతేలా వస్తుందే?” అన్నాడు దొరస్వామి.

“కొడుకు పెళ్ళి ఇప్పట్లో కాదటండీ.”

“ఏం ఎందుకట?”

“మరే, రాబోయే రెండునెలలు మూఢాలున్నాయట. పెళ్ళిండ్ల ముహుర్తాలేవీ లేవట. అందుకని కొడుకు నిశ్చితార్ధం ఇక్కడే ఘనంగా చేయాలనీ ఆవిడ సంకల్పించి పెళ్ళివార్ని ఎలాగోలగా ఒప్పించి ఇక్కడ పెట్టుకుంది.”

“అవునా, సరే సరే. అడుగు సత్యవతిని వస్తుందేమో!…” అంటూ అక్కడి నుంచి లేచి బయటకి వెళ్ళాడు దొరస్వామి.

లలితాంబ ఎంగిలి కంచాలు, ఖాళీ వంటగిన్నెలు అన్నీ తీసి వంటింట్లో సింక్‌లో పడేసి, వంటిల్లంతా గబగబా సర్దేయసాగింది.

***

అనిందిత స్కూటీ వాకిట్లో ఆగిన వెంటనే బయటే ఆడుకుంటున్న దీపు పరిగెత్తుకొచ్చాడు.

టిఫిన్ బాక్స్ వున్న బ్యాగ్‌తో పాటు, నిండుగా పండ్లున్న మరో బట్ట సంచీని కూడా బయటికి తీసింది.

“ఇవేంటక్కా?” పండ్ల సంచీ అందుకుంటూ అడిగాడు దీపు.

“జామపండ్లురా! పద యింట్లోకి…” స్కూటీ లాక్ చేసి బరువుగా వున్న పండ్ల సంచీని తాను తీసుకుంది తమ్ముడి చేతిలో నుంచి.

“అమ్మా! అక్కొచ్చింది. నాకు పండ్లు కూడా తెచ్చింది.”

“ఏం, నీకొక్కడికేనా? మీ అక్కతెచ్చిన పండ్లు మేమెవ్వరం తినగూడదా?” అంది సుశీల.

“ముందీ పండ్లన్నీ బాగా కడగమ్మా! ఆ తర్వాతనే వాడికివ్వు” అంటూ అనిందిత బాత్ రూమ్ వైపెళ్ళింది.

ఆ తర్వాత స్నానం చేసి నైటీ వేసుకొని వంటింట్లోకి వచ్చింది.

అప్పటికే కడిగి కోసిన జామపండ్లముక్కల్ని ప్లేట్లో పెట్టుకొని తింటున్నాడు దీపు.

“పండ్లు తాజాగా బాగున్నాయి కొన్నావా?” అడుగుతూ, పొయ్యి మీది నుంచి మరుగుతున్న టీగిన్నె దించి వడగట్టి వేడివేడి టీకప్పు కూతురికిచ్చింది.

“కొనలేదమ్మా. మా సర్పంచ్ వాళ్ళ తోటలోనివి. ఇవాళ కోసి మార్కెట్‍కి పంపిస్తున్నారు. ఆ టైమ్‌లో నేనక్కడే వున్నాను కాబట్టి నాకూ కొన్నిచ్చారు. డబ్బులిస్తేనేమో వాళ్ళు తీసుకోరు. ఉచితంగా తీసుకోవడమేమో నాకిష్టముండదు.” టీ తాగుతూ అంది అనిందిత.

“ఏమన్నా తింటావా అనితా? ఈరోజే అటుకులు వేయించి డబ్బాలో పోశాను. కొన్ని పెట్టనా?”

“వద్దమ్మా, ఆకలిగా లేదు. నేనూ అక్కడ పండ్లు తిన్నాను. ఏరా, దీపూ! నీ హోమ్‍ వర్క్ అంతా అయిపోయిందా? అప్పుడే బయట ఆడుతున్నావ్” తమ్ముడిని చూస్తూ అడిగింది.

“ఓ, ఎప్పుడో అయిపోయిందక్కా! ఈ రోజు ఒక తెలుగు హోమ్ వర్క్ మాత్రమే వుంది, రాసేశాను.”

ఓ కవర్లో కొన్ని జామపపండ్లు వేసి కొడుకు చేతికిస్తూ “ఇవి మన పక్కింటి వాళ్ళకిచ్చి కాసేపు ఆడుకోని వచ్చేసేయ్” అంది సుశీల కొడుకుతో.

ఇంతలో అనిందిత హేండ్ బ్యాగ్‌లో వున్న సెల్ మోగింది. వెళ్ళి బ్యాగ్ లోనుంచి తీసి చూసింది. సర్పంచ్ గారి నెంబర్. వెంటనే ఆన్ చేసి “చెప్పండి సర్పంచ్ గారూ! ఎందుకు నేనింటికి రాగానే ఫోన్ చేశారు.. ఏమన్న అర్జంటా?”ఆత్రంగా అడిగింది.

“అదికాదు అనిందితా! ఈ రోజు పని హడావుడిలో పడి మీతో ఓముఖ్యమైన విషయం చెప్పడం మర్చేపోయాను. ఇప్పుడు గుర్తొచ్చి ఫోన్ చేశాను.”

“అవునా! ఏంటా విషయమండీ?”

“హైదరాబాద్‌లో వుండే మా తమ్ముడి ఫ్రెండొకతను సంవత్సరంలో మూడు నాల్గు మార్లు యాత్రలకి తీసికెళ్ళుతుంటాడు, మా తమ్ముడు నిన్న రాత్రి ఫోన్ చేసి ‘దక్షణదేశ యాత్రకు వెళ్ళుతున్నాడీమారు. మేము కూడా వెళ్ళుతున్నాం, నీవు బావా వస్తారా అక్కా?’ అని అడిగాడు. మేము తప్పకుండా వస్తామని చెప్పాం. మీ అమ్మగార్ని నాన్నగార్ని కూడా మాతోపాటు యాత్రలకి పంపిస్తారేమోనని అడుగుతున్నాను.”

“సరే, మంచి వార్తే చెప్పారు. మా అమ్మకి కూడా దక్షణదేశ యాత్రలకి వెళ్ళాలని ఎప్పటి నుంచో కోరిక వుందిగానీ, ఇప్పటి వరకూ ఆ అవకాశమే రాలేదు. ఒంటరిగా కాకుండా ఇప్పుడొస్తే తోడుగా మీరూ వుంటారుగా. నాన్నగారు ఇంటికి రాగానే అడిగి మీకు వెంటనే మళ్ళీ ఫోన్ చేస్తాను. అవునూ,ఈ యాత్రలకి డబ్బెంత అవుతుంది?”

“ఒక్కో మనిషికి పదిహేను వేలవుతుందట.”

“ఓకె, ఫర్వాలేదు” అంటూ ఫోన్ పెట్టేసి “అమ్మా! నీకో శుభవార్త…” అంటూ విషయం చెప్పింది.

“నాకిష్టమేగానీ, మీ నాన్న ఒప్పుకోవాలిగా” కొంచెం దిగులుగా అందావిడ.

“నాన్నను నేనొప్పిస్తానుగా!  నీవేం సందేహం పడకమ్మా. దీపుని నేను చూసుకుంటాను. మాసార్ పర్మిషన్ తీసుకొని దీపు స్కూల్ నుంచి వచ్చేవరకూ నేనింటికి తిరిగి వస్తాను. డబ్బు విషయంలో నీవేం దిగులు పడకు. నా దగ్గరుంది. ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. సర్పంచ్ లలితాంబ ఆవిడ భర్త దొరస్వామిగారు కూడా మీతో వుంటే మరో ఆలోచననే చేయక్కరలేదు. ప్రయాణాలల్లో ఎవరికెలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటారమ్మా!నాకెంతో సంతోషంగా వుందమ్మా. యిన్నాళ్ళకు నీదీ చిన్న కోరిక తీరబోతున్నందుకు” అంది ఉత్సాహాంగా అనిందిత.

“అవునే. నాకూ అలాగే వుంది అనితా! కాని మీ నాన్నకు వాళ్ళ ఆఫీసులో సెలవ్ దొరుకుతుందో లేదో” అంటూ తన సందేహాన్ని వెలిబుచ్చింది.

“నాన్న అసలెప్పుడూ సెలవే పెట్టరు. ఎందుకివ్వరూ? ఇస్తారు లే అమ్మా! అన్నట్లు రేపు మా ఉపసర్పంచ్ నిశ్చితార్థం. నాకు లంచ్ బాక్స్ పెట్టకమ్మా. అందరం రేపక్కడే భోజనం చేస్తాం.”

“వాళ్ళక్కడ మటన్ చికెన్స్ వండుతారేమోనే…”

“అవి వండినా, మాలాంటి శాకాహారుల కోసం వేరుగా వంట చేయిస్తానని ఉపసర్పంచ్ వాళ్ళమ్మే వచ్చి నాతో అని, రావాలని మరీమరీ చెప్పివెళ్ళిందావిడ.”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here