ప్రేమ పరిమళం-8

0
7

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి వావిలికొలను రాజ్యలక్ష్మి రచించిన ‘ప్రేమ పరిమళం‘ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]”సా[/dropcap]ర్! గుడ్ మార్నింగ్”

తన కార్యాలయంలో కూర్చొని దీక్షగా ఫైళ్ళు చూస్తున్న కలెక్టర్ ప్రేమ్ సాగర్ ఆ పిలుపుతో చటుక్కున తలెత్తి ఎదురుగా నిల్చునతన్ని చూసి “గుడ్ మార్నింగ్! కూర్చొండలా” అన్నాడు.

“సార్! ఎందుకనో నన్ను రమ్మన్నారట.”

“అవును… మన జిల్లాలోని మండలాల్లో ‘పల్లె ప్రగతి’ భాగంగా ఊళ్ళల్లో జరిగే అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా ఓమారు చూడాలని వుంది.”

“తప్పకుండా సార్!”

“ముందుగా మీ మండలం నుంచే మొదలు పెడ్తామనుకుంటున్నాను.”

“సరే సర్! నాకు చాలా సంతోషంగా వుంది ఈ విషయం విన్నాక. ఎప్పటి నుంచి మొదలు పెడ్దామనుకుంటున్నారో చెప్పండి? “

“నేను చెప్తాను మీకు.  రెండు వారాల్లో మొదలు పెడ్దాం. అన్ని పేపర్స్ రోజూ చదువుతున్నాను. మీ మండలంలోని పుష్పాలగూడం గురించి ముఖ్యంగా అక్కడ పని చేసే గ్రామ కార్యదర్శి పనితీరుపై చాలా కథనాలు వస్తున్నాయి. నిజంగా ఆమె నిజాయితీనీ, పనిపాటవాలను వినూత్న రీతిలో సంస్కరణలు, ఊరి అభివృద్ధికై జరుగుతున్న పనులను గురించి చదువుతుంటే ఓమారు ముందుగా ఆ ఊర్ని చూడాలని వుంది ఎమ్.పి.ఓ. గారూ!”

“మీరన్నది అక్షరాల నిజం సార్! ఆ ఊరి అభివృద్ధికి అహర్నిశలు తాను పని చేస్తూ ఇతరులతో పని చేయిస్తూ ఊరి రూపురేఖల్నే పూర్తిగా మార్చివేసి, ఇక్కడి నుంచి బదిలీ ఐయి వెళ్ళిపోయిన కలెక్టర్ గారి అభినందనలు అందుకొని వారి చేతుల మీదుగా సన్మానం అందుకొంది. తాను శ్రమకోర్చీ చేసిన పనులకు సాదరంగా అభిమానంతో అవార్డ్‌ని కూడా అందుకోవడమేకాక, ఆ ఊరి గౌరవాన్ని ఎక్కడికో తీసికెళ్ళి… జిల్లా స్ధాయిలో మొదటి స్ధానంలో నిలబెట్టింది. ఆ పల్లెటూర్లలో ఎదురైయ్యే ఎన్నెన్నో ప్రతికూల సమస్యలన్నింటిని ధైర్యంగా ఎదుర్కొని ఊరందర్నీ సమన్వయపర్చి శాంతియుతంగా పరిష్కరించి విజేతగా నిల్చింది. ఇప్పుడా వూళ్ళో ప్రతి ఒక్కరూ ఆమెని చల్లని తల్లియనీ, అనితమ్మ మాపాలిటి ఆనంద దేవతనీ అనునిత్యం అభినందనలతో, పొగడ్తలతో ముంచెత్తుతారు. కానీ ఆమె మాత్రం ‘మీ అందరి ఐక్యతతో సమిష్టి కృషితోనే ఇదంతా సాధించగలిగాం… అంతేగానీ నేనొక్కతినే ఏం చేయలేదు’ అంటూ పొగడ్తలను లెక్క చేయదు.”

“ఆహా, అలాగా!” నవ్వుతూ కలెక్టర్ గారన్న ఆ మాటలకు

“అవును సార్! నేను చెప్తున్నది అక్షరాల నిజమే. నేను అతిశయంగా అంటున్నానని మీరనుకోవద్దు. ఆ ఊరిలో ప్రతి యింటింటికి వందకు వంద శాతం మరుగు దొడ్లు నిర్మాణంలోను, ప్లాస్టిక్ నిషేధంలోను, పచ్చదనం పరిశుభ్రత విషయంలోను, అవగాహన సదస్సులు నిర్వహించడంలోను, మహిళా సాధికారత కోసం గ్రామ సభలు నిర్వహించి వారికి సహాయ సహకారాలు అందించడంలోను, ఉపాధి పథకంలో భాగంగా కూలీలకు సక్రమంగా న్యాయం జరగడంలోను, నిరక్షరాస్యత నిర్మూలించడంలోను, ఇది అది అనికాక ప్రతి విషయం లోను ఆమె ప్రథమమే సార్! “

“మీరింతగా పొగుడుతుంటే నాకూ ఆ ఊర్ని ఆ ఊరి కార్యదర్శిని ఆమె పనితీరును ప్రత్యక్షంగా చూసి మనసారా అభినందల్ని తెల్పాలని వుందండి. ఆమెలాంటి వారే నేటి సమాజానికి కావాలి. ఇతరులకి ఆదర్శంగా నిలవాలి.”  నవ్వుతూ హుషారుగా అంటూ చూస్తున్న చేతిలోని ఫైళ్ళు మూశాడు.

“సార్! ఆ ఊరికి ఒకటి మాత్రం కొరతగా వుంది. దాని కోసం ఆమె ప్రయత్నం చేస్తూనే వుంది. కాని ఫలించలేదు”

“ఏంటది చెప్పండి. మనం చేద్దాం”

“ఆ ఊరికి ఓ ట్రాక్టర్ కావాలని తన ఆరాటం. ఓ చక్కటి నర్సరీ ఏర్పాటు చేయాలని కూడా ఆమె ఆశయం”

“అదేంటండీ? జిల్లా అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రతి గ్రామానికి ఓ ట్రాక్టర్ కొనుగోలు చేయాలని ప్రభుత్వం వారే చెప్పారు కదా?”

“సబ్సిడీ మీద ఓ లక్ష వరకే యివ్వాలి. మిగతా డబ్బు పూర్తిగా రాలేదు. అంతలోనే ఆ కలెక్టర్ గారెళ్ళి పోయారు. ఆ పని అలాగే పెండింగ్‌లో వుండిపోయింది.”

“సరే, మరి. ఆ పెండింగ్ పనేదో మనమిప్పుడు నా చేతుల మీదిగా పూర్తి చేద్దాం లెండి.”

“చాలా చాలా సంతోషం సార్! రెండు వారాల తర్వాత మీరెప్పుడు డేట్ ఫిక్స్ చేస్తే నేనప్పుడు మీ దగ్గరికి హాజరవుతాను సార్!” అని కలెక్టర్ గారి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు.

***

“హలో, నాన్నా! బాగున్నారా?”

“నేను మీ అమ్మ మాతో పాటు వచ్చిన వాళ్ళమంతా బాగున్నాం తల్లీ!”

“నేనే నీకీ రోజు ఫోన్ చేద్దామనుకున్నాను. ఇంతలో నీవే చేశావు!”

“ఎందుకు నాన్నా! ఏమైన అర్జంట్ పని వుండి ఫోన్ చేద్దామనుకున్నారా?”

“అదేం లేదు గానీ మా ఆఫీస్ లోనుంచి ఒకతను నాకు ఇవ్వాల్సిన డబ్బు తిరిగిద్దామని మనింటికి వద్దామనుకున్నాడట. ఆ టైమ్‌లో నీవు యింట్లో వుంటావో లేదోనని ఫోన్ చేద్దామనుకున్నాను.”

“ఇంతకీ ఆ డబ్బెక్కడిది నాన్నా?”

“ఎప్పుడో నేనే ఓసారి మా కొలీగ్‌కి డబ్బు అవసరమైతే యిచ్చాను, ఐదువేలు. అవిప్పుడు తిరిగిద్దామని ఫోన్ చేశాడు.”

ఆ మాట వినగానే అనిందిత పకపకా నవ్వింది. “ఇంకా మీరు ఏ కాలంలో వున్నారు నాన్నా? మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అతనికిచ్చి ట్రాన్స్‌ఫర్ చేయమని చెప్పండి నాన్నా! ఇంత దూరం వచ్చి యివ్వడమెందుకు?”

“అవును. నీవన్నది నిజమే తల్లీ! నీవీ మాట ఇప్పుడు చెప్పే వరకూ నాకసలు గుర్తే రాలేదు. నా అకౌంట్ నెంబర్ని పంపిస్తానతనికి. దీపు ఎలా వున్నాడు?”

“బాగున్నాడు నాన్నా! అమ్మేం చేస్తుంది?”

“బాగా అలసి పోయిందీరోజు, మీ అమ్మ. పండుకొంది.”

“ఈ రోజు ఎక్కడెక్కడ తిరిగారేమిటి?”

“తమిళనాడు సరిహద్దు దాటుకొని కేరళలోకి అడుగుపెట్టి అనంత పద్మనాభస్వామి గుడి చూసుకొని, అక్కడికి దగ్గరలోనే వున్న భగవతీదేవి గుడికెళ్ళాం. అక్కడ మాకు అమ్మవారి దర్శనం కూడా చక్కగా జరిగింది. ఆ అనంతపద్మనాభస్వామిని మూడు ద్వారాల గుండా సందర్శించుకోవాలి. చాలా పెద్ద విగ్రహం. స్వామి వారు పొడుగ్గా పండుకొని ఉంటారు. మొదటి ద్వారంలో స్వామివారి ముఖం, చేతులు, భుజాలు మాత్రమే కనిపిస్తాయి. రెండవ ద్వారంలో స్వామి వారి ఉదరం, నడుం భాగం దర్శించుకోవాలి. ముచ్చటగా మూడవ ద్వారంలో స్వామివారి కాళ్ళు పాదాలు దర్శనమిస్తాయి, మొత్తం మీద మేము సుప్రభాత సేవను కన్నుల పండుగ్గా సందర్శించుకున్నాం…”

“అక్కడి నుంచి ఎక్కడికెళ్ళారు నాన్నా?”

“ఆ తర్వాత అక్కడినుంచి నాగర్ కోయిల్ వెళ్ళాం.”

“అక్కడెవ్వరు దేవుళ్ళు?”

“అక్కడ వినాయక, ఆంజనేయస్వామి దర్శన భాగ్యం కల్గింది. రామ రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోతే సంజీవని పర్వతాన్ని తీసుక వస్తుంటే కొంచెం ముక్క ఇక్కడ పడిందట. అదీకాక ఆంజనేయ స్వామి తన మండుతున్న వాలాన్ని కూడా ఇక్కడే అర్పుకున్నాడనీ అంటారట. అందుకని ఇక్కడున్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి మండకుండా చల్లగా వుండడానికీ నిండుగా వెన్న రుద్దుతారు. ఇక్కడినుంచి మధురై కొడకైనాల్ వెళ్ళుతాము. “

“సరే నాన్నా గుడ్ నైట్!” అని ఫోన్ స్విఛాప్ చేసి హాల్లో నుంచి గదిలోకెళ్ళింది. మంచంపై ఓ ప్రక్కగా తలక్రింద అరచేతిని పెట్టుకొని ప్రశాంతంగా నిద్ర పోతున్నాడు దీపు. నీలిరంగు బెడ్ లైట్ కాంతి వాడి ముఖం మీద పడి వింతకాంతితో మెరుస్తున్నట్లుగా వుంది. ‘నిజంగా దీపు పెద్దయ్యాక మాంచి అందగాడవుతాడు’ అని అనుకొని చిన్నగా నవ్వుకుంటూ… వాడి నుదురుపై సుతారంగా ముద్దు పెట్టుకొని వాడు కప్పుకున్న దుప్పటి సరిచేసింది.

గోడ గడియారం వంక ఓమారు చూసి ‘కనీసం రెండు గంటలైన చదవాలీ రోజు’ అని స్థిరంగా నిశ్చయించుకొని తానక్కడే ఆ గదిలోనే టేబుల్ లైట్ ఆన్ చేసుకొని చదువుకోవడం మొదలు పెట్టింది అనిందిత.

***

ఉదయం పూట స్నానాలు గట్రా చేసి తయారయి అందరూ టిఫిన్ తినడానికి దగ్గర్లో వున్న హోటల్‌కి బయలు దేరారు యాత్రాబృందం.

అంతలో లలితాంబ చేతిలోని ఫోన్ రింగైంది. నెంబర్ చూసి కొడుకు దగ్గర్నించని గ్రహించిన ఆవిడ ముఖం సంతోషంతో వెలిగి పోయింది.

“హలో, మాధవ్! ఎలా వున్నావురా? చాలా రోజులైంది నీవు ఫోన్ చేసి.”

“అవునమ్మా! కొంచెం వర్క్‌లో బిజీగా వున్నాను. నాన్న ఎలా వున్నాడు?”

“బాగున్నాడురా మాధవ్!”

“మీరంతా రాజు మామయ్య వెంట ఏదో దక్షిణ దేశయాత్రకు వెళ్ళుతామని ఆ మధ్య అన్నావుగా, అదేమైంది? వెళ్ళారా?”

“అవునురా… మేమిప్పుడు ఆ పుణ్యక్షేత్రాలలోనే వున్నాం.”

“అవునా?! ఊరూ… ఊరు పనులంటూ ఎప్పుడూ గోల పెడ్తావుగా… సర్పంచమ్మవి అయినప్పటినుంచీ… మరి ఇప్పుడెలా ఊర్ని వదలి పెట్టి వచ్చావమ్మా. “

కొడుకన్న మాటలకు నవ్వింది లలితాంబ “ఏం చేయనురా ఎప్పటినుంచో అనుకుంటున్నాను… దక్షిణ దేశ యాత్ర చేయాలని… ఆ కోరిక ఇన్నాళ్ళకి నెరవేరిందిరా అబ్బాయ్.”

“మరక్కడ ఊరి పనులు ఎవరు చూసుకుంటారమ్మా?”

“ఎందుకని అలా అడుగుతున్నావ్? నేను లేకపోతేనేం? నాకంటే బహు సమర్థవంతగా పని చేసే మా మేడమ్ అనిందిత, ఉప సర్పంచ్ రాయప్ప వున్నారుగా! అన్ని విషయాలు వాళ్ళే చూసుకుంటారు.”

“ఓ, అవునవును కదా! ఆమెని గురించి నీవెప్పుడూ చాలా గొప్పగా చెప్తావుగా. నేనీమారు అక్కడికి వచ్చినప్పుడు నాకు తప్పకుండా ఆమెను పరిచయం చేయాలి అమ్మా!”

“తప్పకుండా చేస్తానురా మాధవ్! మరి నీవెప్పుడొస్తున్నావురా మాధవ్?” ఆనందోత్సహాలతో అడిగిందావిడ.

“ఇంకా ఓ రెండు నెలల్లో తప్పకుండా వస్తానమ్మా”

“ప్రతిసారీ అలాగే అంటావ్. కాని తీరా సమయానికి రాలేకపోయానంటూ ఫోన్ చేస్తావ్?” నిష్ఠురంగా అంది.

“నో, నో! ఈ మారు అలా కాదమ్మా. నేను రావడం షూర్. నేను నీకు ముందుగానే చెప్తానుగా. టికెట్ బుక్ చేసుకొని ఎప్పుడు బయలుదేరేది.”

“ఈ మారు వచ్చినప్పుడు తప్పక పెళ్ళి చేసుకొనే వెళ్ళాలిరా మాధవ్!”

“మరి అమ్మాయ్‌ని చూసి వుంచావా?”

“చూడకేం? నీవు ‘ఊ..’ అనాలేగాని అమ్మాయ్‌లు రెడీగానే వున్నారు.”

“ఈమారు నేను ‘ఊ’ అనడానికి రెడీగానే వున్నానమ్మా”

“మంచిదిరా! నాకు చాలా సంతోషంగా వుంది మాధవ్…”

“ఓమారు నాన్న కివ్వమ్మా… మాట్లాడుతాను.”

“యివ్వలేనురా! నాన్న ఎక్కడో దూరంగా ముందున్నాడు. అందరం టిఫిన్ చేయడానికి హోటల్ కెళ్ళుతున్నాం. తర్యాత మళ్ళీ మాట్లాడుతాడులేరా. విషయాలు నేను చెప్తానులేరా మీ నాన్నకు”

“సరే అమ్మా! పండుకుంటాను. ఇప్పటి వరకూ వర్క్ చేస్తూ కూర్చున్నాను. మరిక వుంటాను బై అమ్మా!”

“బై రా, మాధవ్! ఆరోగ్యం జాగ్రత్త!” సంతృప్తిగా చెప్పి ఫోన్ పెట్టేసింది. కొంచెం దూరంలో నడుస్తున్న సుశీల “మీ అబ్బాయా?” అంటూ అడిగింది.

“అవునండీ, అమెరికాలో వుంటాడని మొన్నామధ్య ఓమారు మాటల సందర్భంలో చెప్పానుగా. ఈమారు వచ్చినప్పుడు పెళ్ళి చేసుకోవడానికి అమ్మాయ్‌లని చూడడానికి రెడీ అన్నాడండీ. మాకు ఎప్పటి నుంచో త్వరగా వాడికి పెళ్ళి చేయాలని మాకోరిక. ఇన్నాళ్ళకు ఓకె చెప్పాడు.” ఆనందంగా చెప్పుతుంది.

“మరి అమ్మాయ్‌లను చూసి వుంచారా?”

“మా బంధువర్గంలో కొంతమంది చదువుకున్న అమ్మాయ్‌లున్నారు. కానీ, నాకీ కాబోయే కోడలు మాత్రం మీ అమ్మాయ్ అనిందిత అంత అందంగా నాజూకుగా మృదు స్వభావురాలై వుండాలని నా కోరికండీ! తను ఎవరింటి ఇల్లాలవుతుందోగాని వాళ్ళెంతో అదృష్టవంతులవుతారండీ!”

ఈమారు సుశీలకి ఏం మాట్లాడాలో తోచలేదు. మౌనంగా నవ్వి ఊర్కుంది. ఇంతలో వాళ్ళు వెళ్ళాల్సిన హోటల్ రానే వచ్చింది.

***

రాత్రి టైమ్ తొమ్మిదైంది.

ఎనిమిదింటికే తాను దీపు భోజనాలు చేసేశారు. కాసేపు చదువుకొని దీపు నిద్రపోయాడు.

అనిందిత వంటిల్లంతా సర్దుకొని రేపు ఉదయానికి వంటకు కావల్సిన కూరలు తరిగి ఫ్రిజ్‌లో పెట్టుకొని తీరుబాటుగా చదువుకోవడానికి కూర్చుంది.

ఇంతలో సెల్ మోగింది.

చూసింది తండ్రి నెంబర్ ఆన్ చేసి “హల్లో నాన్నా!” అంది.

“ఏం, తల్లీ! బాగున్నావా?”

“బాగున్నాను నాన్నా! మీ గొంతేమిటి వేరేలా వినిపిస్తుంది… జలుబు చేసిందా?”

“అవునమ్మా. ఈ రోజు ఉదయం నుంచి కాస్త జలుబు చేసినట్లు అనిపిస్తుంది.”

“ఏమైన టాబ్లెట్స్ వేసుకోండి. అస్తమానం పుణ్యం పురుషార్థం అంటూ నదీస్నానాలు, సముద్ర స్నానాలు అదే పనిగా చేయకండి. ప్రస్తుతం మీరెక్కడున్నారు? కొడైకనాల్ వచ్చారా?”

“వచ్చాం. కొడకైనాల్లో చాలా ఆహ్లాదభరితమైన మంచి వాతావరణముంది. రంగు రంగుల పూలు, రకరకాలైన పండ్లు దొరుకుతాయి. చక్కటి జలపాతాలతో, చల్లటి గాలులతో, ప్రకృతి రమణీయంగా మనోహరంగా వుంటుంది. టీ పొడి, సుగంధ ద్రవ్యాల షాపులు, స్వెట్టర్ల షాపులు చాలా వున్నాయి. దీపుకి నేనో స్వెట్టర్ కొన్నాను. మీ అమ్మేమో లవంగాలు, యాలకులు, దాల్చెన చెక్క లాంటి వంటలకి కావల్సిన ఔషధ గుణాలున్న వస్తువులేవో కొంది కొన్ని. అక్కడి నుంచి ‘పళని’ వచ్చాం. లాడ్జింగ్‌లో రాత్రి వుండి… ఈరోజు ఉదయాన్నే రోప్ వే ట్రైన్ లాంటి దాంట్లో కొండమీదికొచ్చాం. వెళ్ళుతుంటే దారి మధ్య అటుఇటు ఫలపుష్పాదులతో, పచ్చటి చెట్లతో కడు రమణీయంగా వుంది ప్రకృతి. చూడదగ్గ ప్రదేశం. ఇంకా కాలినడకన కొండ మీదికెళ్ళే వాళ్ళకైతే మరిన్ని సుందర మనోహర ప్రకృతి దృశ్యాలని ఆనందంగా ఆస్వాదించగలరు.”

“ఇంతకీ ఆ కొండమీదన్న దేవుడొవరు నాన్నా?”

“సుబ్రమణ్యేశ్వర స్వామి! రెండుగంటలు క్యూలో నిల్చుని ఆ స్వామి దర్శనం చేసుకున్నాము. చాలా రష్‍గా వుండె గుడిలో. అక్కడినుంచి తిరుచునావల్లి వెళ్ళి… జంబుకేశ్వరస్వామిని, అఖిలాండేశ్వరిని దర్శించుకున్నాము తల్లీ!”

“అక్కడుండేది కావేరి నదే కదా నాన్నా!?”

“అవునమ్మా. కావేరీ నదే! జంబుకేశ్వరస్వామి ఆలయం గర్భగుడి కావేరి కంటే కిందికే ఉన్నందున గర్భ గుడిలోకి నీరు వస్తుందట, అర్చకులు చెప్పారు. గుడంతా కాస్త తడి తడిగా వుంటుంది. గుడి చాలా పెద్దదే… పూర్వకాలం లోనిది. ఇటువైపు చాలా దేవాలయాలలో శుచీ, శుభ్రత లోపించిందమ్మా. దేవాదాయశాఖవారు సరిగా మెయిన్‌టెయిన్ చేయడం లేదేమోనని అనిపిస్తుంది.”

“పెద్ద పెద్ద దేవాలయాలపై వచ్చే ఆదాయమే ప్రభుత్వానికి అవసరం. వాటి బాగోగులను గురించి అస్సలు పట్టించుకోరు. మన రాష్ట్రం కూడా ఈ మధ్య ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాక చాలా దేవాలయాలు మెరుగు పడ్డాయి. ముఖ్యంగా ఆషాఢ మాసంలో అమ్మవార్ల దేవాలయాలలో పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తున్నారు. రంగు రంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరిస్తూ తమ ప్రత్యేకతను చాటుతుంది దేవాదాయశాఖ. మరిక వుంటాను నాన్నా! అరుణాచలంలో తప్పకుండా రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళిరండి.”

“వెళ్ళుతాం అనితా! బై…”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here