ప్రేమా..! నువ్వే గెలువు

0
5

[dropcap]“స్వ[/dropcap]ప్నా…” గట్టిగా పిలుస్తూ లోపలకి వచ్చాడు అఖిల్. ఏమైందని కంగారుగా ఎదురొచ్చిన స్వప్న చేయిపట్టుకుని చెప్పాడు.

“చూసావా… మీ నాన్నగారు ఏంచేసారో… రెండేళ్ళుగా నేను చేసే ఉద్యోగం ఆయన ఇప్పించినదేట, నా జీతం ఆయన చలవేట” బర్రున కుర్చీ లాక్కుని డైనింగ్ టేబుల్ ముందు కూచుంటూ అన్నాడు.

స్వప్న నిర్ఘాంతపోయింది, మెల్లిగా పక్క కుర్చీ లాక్కుని కూచుంది, తల వంచుకుని తనలోని భావవెల్లువని అణచుకుంటూ..

అఖిల్ నోట పరుషమైన మాటలు వస్తున్నాయి, మామగారిని ఉద్దేశించి, తనని అవమానం చేసారని భావిస్తున్నట్టున్నాడతను.

“ఆఫీసులో మీటింగ్‌కి ఇండియా నుంచొచ్చి, పొరబాటున నోరు జారిన మా బెంగుళూరు బాసు నేను రెట్టించి అడిగితే నిజం చెప్పేసాడు, ఇక్కడ దుబాయ్‌లో నను చెడ్డ చేసుకోలేడుగా, ఈ ప్రాజెక్టులో నా అవసరం ఎంతో ఉంది, అందుకే, అయినా మీ నాన్న కెంత అహంకారం, పొగరు, పోనీ మన ఇంటికే వచ్చి, మనలను ఆదరించి కలుపుకుని సాయం చేస్తే వద్దంటామా” అరిచాడు అఖిల్.

అఖిల్, స్వప్న ప్రేమించుకు పెళ్ళాడిన జంట. ఇద్దరి ఇంటిలో పెద్దవాళ్ళూ వప్పుకోలేదు.. ముఖ్యంగా స్వప్న తండ్రి రామశర్మగారికి వీరి ప్రేమ విషయం అనంగీకారమే కాదు అశనిపాతం కూడా. స్వప్న ఒక్కతే కూతురు అయినా, మతాంతర వివాహానికి ఆయన సమ్మతించనే లేతపోయారు. ఎందుకంటే అఖిల్ క్రిస్టియన్. కాని తండ్రి పోలికే స్వప్నకి వచ్చినట్టుంది పంతంలో. ఇంటోంచి బయటకు వచ్చేసింది తెగతెంపులు చేసేసుకుని. మెల్ల మెల్లగా అఖిల్ ఇంటో వారు మాత్రం సద్దుకు అంగీకరించి వీరిద్దరనీ కలుపుకున్నారు.

కాని, అదృష్టం పగ పట్టినట్టు అఖిల్ చేస్తున్న మంచి ఉద్యోగం పోయి, ఆర్థిక కష్టాలలో పడ్డారు ఇద్దరూ స్వప్నా అఖిల్‌లు. ఇద్దరి ఇళ్ళల్లోనూ ఎవరి సహాయం అడగడానికీ అభిమానం అడ్డొచ్చింది. అలాగే తిప్పలు పడుతున్నవేళ, మళ్ళీ అదృష్టం కలసివచ్చినట్టుగా మంచి ఉద్యోగం దొరకడమే కాదు, విదేశం ఛాన్సు కూడా వచ్చి, దుబాయ్‌లో హాయిగా రోజులు గడుపుతున్నారు.. ఇంతలో ఈ విపరీతమా..

తేరుకున్న స్వప్న,వినలేక మెల్లగా అతని చేయిమీద నొక్కుతూ..

“అఖిల్… కొంచం ఆగు, నేను అసలు అటువంటి సాయాన్ని అంగీకరించనని మా నాన్న అనుకుని ఉంటారు, నేను బాగున్నప్పుడు చూడవస్తే పరవాలేదు కాని, నీకు ఉద్యోగం లేక మనం దీన పరిస్థితిలో ఉన్నప్పుడు వచ్చి సాయం చేస్తానంటే, ఆయనని అందరనీ కాదని నిను పెళ్ళి చేసుకుని దూరం వచ్చిన నేను రెచ్చిపోతానని, అవమానంగా భావించి తట్టుకోలేనని ఆయనకు బాగా తెలుసు, అందుకే వచ్చుండరు..” అంది.

అఖిల్ ఆమెనే తరచి చూస్తూ ఉండిపోయాడు. నిజానికి అతను నెమ్మదస్తుడే, స్వప్న అంటే వెర్రి ప్రేమ. తన తండ్రి ఇప్పించిన ఉద్యోగమంటే స్వప్న ఏమి విరుచుకు పడుతుందో అని అనుకుంటూ తనే ముందు కేకలు వేసేసాడు. ఇప్పుడు స్వప్న ఇంత శాంతంగా మాటాడుతుంటే మనసులో ఆశ్చర్యపోతున్నాడు.

స్వప్న నెమ్మదిగా జరిగి అతని భుజంపై తల వాల్చి “నీ దగ్గర నేనేమీ దాచలేదు ఎప్పుడూ.. కాని, ఆయన సాయాన్ని నువు అంగీకరించగలనంటే ఒక విషయం చెపుతాను, ఆవేశపడవు కదా..” అడిగింది.

“నీ శాంతం చూసి నేను ఆశ్చర్యపోతున్నాను, నువు మీ నాన్నగారు ఇలా చేసారంటే మండిపడతావనుకున్నాను, నువు అంగీకరిస్తే నాకేమీ అభ్యంతరం, ఆయనా నా తండ్రి వంటి వారే కదా, ఆయన నాకు సహాయం చేయడమంటే నన్ను అల్లుడిగా అంగీకరించారనే, ఇకపోతే ఉద్యోగం ఇప్పించడం అదీ కూడా నాకు తప్పుగా తీసుకోను, నా తండ్రి నాకు చేసినట్టే..” అన్నాడు అఖిల్.

తృప్తిగా తలాడిస్తూ చెప్పింది ఆమె,

“వనజ నా స్నేహితురాలు, నాన్నని బెంగుళూరు స్టేషనులో కలసినట్టు నాకు చెప్పకుండా ఉంటుందా, పైగా నేను నా whereabouts వాళ్ళకు తెలియచేయకపోయినా, ఒక్కత్తే కూతురును వాళ్ళనొదిలేస్తానా.. ఏం చేస్తున్నారో.. ఎలా ఉన్నారో తెలుసుకుంటునే ఉన్నాను. హఠాత్తుగా నాన్న ఇల్లు అమ్మడం, నీకు ఉద్యోగం దొరకడం, అదీ నాన్న కు తెలిసిన సంస్ధ లోనే, నాకు అనుమానం కలిగింది, అడిగాను, ఆ సంస్ధ హెడ్‌ని కలిసి అభ్యర్ధించి, దాచలేకపోయారు, నీకు తెలియచేయకూడదంటూ నాకు వివరం చెప్పేసారు. నాన్న చేసిన సహాయం, ఆ ఇల్లు అమ్మి ఇచ్చిన డబ్బు గురించీ. నేను అది విని అవమానపడలేదు, నాన్న ప్రేమకి మనసు తడిసింది, నాన్నని తలచుకుని గర్వపడ్డాను,

కాని, ఎట్ట ఎదురుగుండా వచ్చి మాటాడి సహాయం చేయని ఆయన అహంకారంకి, మరి నా వంట్లో రక్తం మాత్రం తిరగబడింది. అందుకే ఆయన మీది ప్రేమ, అభిమానం, గౌరవంతో సహాయం స్వీకరించినా, తెలియనట్టు ఉండిపోయా, వెళ్ళి కలిసి కృతజ్ఞతలు చెప్పి ఆయన అహంకారాన్ని గెలవనివ్వలేదు, నేను ఆయన కూతురిని కదా, ఈ విషయం నీకూ తెలియనివ్వలేదు, నువు నొచ్చుకుంటావని” అంది.

ఈ సారి నిర్ఘాంతపోవడం అఖిల్ వంతయ్యింది,

“ఇలాటి ప్రేమలు పెట్టుకు, ఏమిటి ఈ పంతాలు పట్టింపులు.. నువ్వూ గెలువు, మీ నాన్ననీ గెలిపించు కాని అహంకారానికి గెలుపు ఇవ్వకండి మీరిద్దరూ.. అర్ధం లేని విషయాలతో జీవితం లోని అపురూపమైన క్షణాలు కొల్పోతున్నారు నువ్వూ మీ తల్లితండ్రులు, బయటినుంచొచ్చిన అల్లుడిని, నేనే ఆయనని ఆయన చేసిన ఉదాత్తమైన సహాయానికి కదిలిపోయాను, అర్ధం చేసుకుని. అంతా తెలిసి కూడా నువ్వంత నిబ్బరంగా ఎలా ఉన్నావు, ఆయనత్యాగం గుర్తించు” అన్నాడు.

ఒప్పుకోలేదు స్వప్న, ఒక్కటే మాట చెప్పింది

“నన్ను కాదని వెళ్ళి పొమ్మన్నది ఆయన, నేనూ కష్టాలు అనుభవించి నిగ్రహంతో ఉన్నాను, తిరిగి రమ్మనవలసినదీ ఆయనే, అహంకారాన్ని త్యాగం చేయడమెలాగో ఆయన ఆచరించి చూపి, నాకు నేర్పవలసినదీ మా నాన్నే, పిల్లలు నేర్చుకునేది తల్లి తండ్రుల వద్ద నుంచే, నేను చేసుకున్న పెళ్ళికి కోపం తెచ్చుకోవడం సహజమే, కాని నేనే అక్కరలేదనుకున్నారు ఆయన, మళ్ళీ కావలసి రావలసినది మాత్రం ఆయనే” అంది.

హతాశుడయ్యాడు అఖిల్, ఈ గోలకి పక్క గదిలో లేచి ఏడుస్తున్న మూణ్ణెల్ల పసివాడిని ఎత్తుకుని పాలు పడుతూ, వాడి తల నిమురుతూ,

“వీడికో మంచి పేరు ఆలోచించా చెప్పనా” అఢిగింది.

ఇంకా ఈ విషయాల ఆశ్చర్యం లోంచి కోలుకోని అఖిల్ చెప్పమన్నాడు, కళ్ళల్లో నీళ్ళు కవిపించకుండా తలొంచుకొని, డగ్గుత్తిక పడిన గొంతుతో చెప్పింది

“మా నాన్న పేరు పెట్టుకోనా?” అడిగింది స్వప్న.

అఖిల్ జాలిగా ఆమెని చూసి “తప్పకుండా.. ఇక వీడే మీ తండ్రీ కూతుళ్ళని కలపేవాడు” అంటూ లేచాడు, మనవడు పుట్టాడని, నామకరణం చేసుకోవడానికి, ఇండియా వస్తున్నామని మామగారికి తెలియచేస్తూ ఇమెయిల్ ఇవ్వడానికి.

మరి, వాళ్ళు కలుస్తారంటారా.. తప్పకుండా, అలాగే జరుగుతుంది, ప్రేమదే రేపటి గెలుపు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here