ప్రేమగా బాలు

0
7

[box type=’note’ fontsize=’16’] 25 సెప్టెంబరు 2020న మృతి చెందిన ప్రముఖ గాయకుడు శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారికి ఈ రచన ద్వారా నివాళి అర్పిస్తున్నారు పరేష్. ఎన్. దోషి. [/box]

[dropcap]నా[/dropcap] చిన్నప్పుడు అప్పటికే పాత అనబడే సినిమాలు వస్తుండేవి, బాగా ఆడేవి కూడానూ. రేడియోలో కూడా అప్పటికే పాత పాటలనబడే ఘంటసాల, సుశీల పాటలు వినేవాడిని. నాకు తెగ నచ్చేవి. ఆ పాటలకోసమని కొన్ని సినిమాలు చూసి, నాలుక కరచుకుని,ఇకనించి కేవలం రేడియో పెట్టుకుని వినాలి తప్ప సినిమాలు చూడకూడదు అని కూడా అనుకునేవాడిని. అప్పట్లో హిందీ సినిమాలైతే గాయకులు రఫీ లతాలు ఫేవరిట్, తెలుగులో ఘంటసాల సుశీల లాగా. అంటే ఇతరులు నచ్చరని కాదు, వాళ్ళ కంటే వీళ్ళు కొంచెం ఎక్కువ. వీళ్ళ గాత్రం గొప్పగా వుంటుంది, సంగీతం లో డెప్త్ కూడా ఎక్కువే. అక్కడ తలత్, హేమంత్, మన్నాడే, ఆషా, గీతా ఇలా ఎందరో వున్నారు. ఇక్కడ లీల, జమునారాణి, జిక్కి, రావు బాలసరస్వతి, ఏ ఎం రాజా లు. సరే, అప్పట్లోనే అక్కడ కిషోర్ కుమార్ దూసుకు వచ్చాడు, తన ఫేన్ బేస్ ని విశాలపరచుకున్నాడు, రఫీకి కొన్నాళ్ళపాటు విశ్రాంతినిచ్చాడు. ఇక్కడేమో బాలు అని ముద్దుగా పిలవబడే ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం వచ్చాడు. కొన్నేళ్ళకే ఘంటసాలగారు లోకం వదిలి వెళ్ళి పోవడం, వేరే గాయకులు ఎవరూ బాలూ లా వర్సటైల్ కాకపోవడం తో పోటీ లేని గాయకుడయ్యాడు. అయితే ఆయన సంపాదించుకున్న పేరు, నైపుణ్యం అనాయాసంగా రాలేదు. ఒకటి దైవదత్తమైన గ్రహింపు శక్తి, సంస్కారం, వీటితో పాటు ఆయన పడ్డ శ్రమ. బాలు బాలుగా మారడం అంత తేలికగా జరగలేదు. అయితే తెలుగు ప్రజ ఘంటసాలను మరచిపోలేకున్నది, చాలా కాలం పాటు బాలు కు తగిన గుర్తింపు ఇవ్వలేదు. వారిలో ఈ రచయిత కూడా ఉన్నాడు. నా అభిమాన గాయకులుగా పేర్కొన్న పేర్లలో మార్పు లేదు గానీ, బాలు పాటలను కూడా నేను ప్రేమించాను. ముఖ్యంగా మొదట్లో పాడినవి. మనిషి కూడా జంతువేగా, మనిషితో సహా జంతువులన్నిట్లోనూ ఎదిగినప్పుడు కంటే శైశవంలో ఎక్కువ ముద్దు వస్తాయి, ఓ ప్రత్యేక ఆకర్షణ మనల్ని లాగేసుకుంటుంది. అలాంటిదే బాలు తొలినాళ్ళలో పాడిన పాటల్లో నాకు కనబడేది. ఆ తర్వాత సంగీతపరంగా పరిణతి సాధించినా ఆ పాత సమ్మోహనశక్తి మాత్రం సన్నగిల్లింది.

ఆయన పాటలు వేరు వేరు కాలాల్లో వేరు వేరు దశల్లో వున్నాయి. ఒకటి మారుతున్న ప్రజాభిరుచికి అనుగుణంగా పాటలూ, చిత్రాలూ మారడం ఒక కారణం. తొలిదినాల్లో గొప్పగా వున్న పాటల వెనుకా, అసలు బాలూ అనే ఒక ఉనికి వెనుక, అప్పట్లో ఉన్న గొప్ప గొప్ప సంగీత దర్శకుల శిక్షణ వున్నది. వారు లేకపోతే బాలు లేడు. లతా మంగేష్కర్ కూడా తన గురించి ఇదే అంటుంది. కోదండపాణి నించీ, కీరవాణి దాకా పాడాడు బాలు. మరి ఇప్పుడు ఆ స్థాయి గాయకుడు రాగల పరిస్థితులు ఉన్నాయా? అలాంటప్పుడు మనం ఘంటసాల లాంటి గాయకుడిని కూడా ఆశించలేము కదా. చూడాలి ముందు ముంది సినిమా పాటలు ఎలా ఉండబోతున్నాయో. బాలు పాటలు తగ్గించి కూడా దశాబ్దం పైనే అయినా, ఆయన టీవీ కార్యక్రమాలు చేస్తూ ఇంకా మనకు అందుబాటులోనే వున్నాడు. పాటలు కాకపోయినా, ఆయన మాత్రమే ఇవ్వగల సమాచారం చాలా పంచుకున్నాడు. ఆయన ఓ నడిచే విజ్ఞానఖని. గొప్ప జ్ఞాపక శక్తి. ఎన్నెన్నో విషయాలు అలవోకగా చెప్పడానికి కారణం ఆయా సందర్భాల్లో ఆయన కూడా భాగస్వామి కాబట్టి.

ఒక కాలంలో ఆయన పాడిన పాటలు గొప్ప సాహిత్యంతో కూడుకుని వుండడం అదనపు అందం

మేడంటే మేడా కాదూ గూడంటే గూడూ కాదూ
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా ఈ కోవెల నీ ఇల్లు
ప్రతీ రాత్రీ వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి
ఈ రేయి తీయని ఈ చిరుగాలి మనసైనది
యే దివిలో విరిసిన పారిజాతమో
చింతచిగురు పులుపని చీకటంటే నలుపనీ

ఇలాంటివి ఎన్నో.

ఆ తర్వాత కృష్ణ తెర మీదకు వచ్చినప్పుడు ఆయన చిత్రాలకు తగ్గట్టు ప్రత్యేకమైన పాటలు పాడాడు. హుషారుగా, చిలిపిగా, దూడుకుగా, కుర్రతనంగా. వాటి అందం వేరు. సాహిత్యంలో ఎంత పస వున్నదో పక్కన పెడితే ఆయన మాత్రం నూరు శాతం దృష్టి పెట్టి పాడి రంజింపచేశాడు. ఇదొక తరహా.

రామారావు, నాగేశ్వరరావులకు ఇదివరకు కుడిభుజం ఘంటసాల అయితే, తర్వాత వచ్చిన బాలు వాళ్ళ ప్రత్యేక తీరులను గమనించి వారికి నప్పేలా పాడాడు. వాళ్ళకిక చింత లేకుండా పోయింది.

ఘంటసాల ఒక పక్కన సినిమా పాటలు పాడుతూ మరో పక్క శాస్త్రీయ సంగీత కచేరీలు చేయగల వ్యక్తి. శంకరాభరణం చిత్రం వచ్చినప్పుడు బాలు సంశయించినా ఒప్పించి పాడించారు. ఆ పాటల మీద వున్న విమర్శలో నిజం అయితే వుంది. సాహిత్యం, సంగీతం, గాత్రం ఏది తీసుకున్నా వేటూరి, మామ, బాలు లు దాని ముందూ, దాని తర్వాతా మెరుగైన పాటలిచ్చారు. ఎదో కారణం చేత ఆ చిత్రం, ఆ పాటలూ ఒక కల్ట్ స్థానాన్ని తీసుకున్నాయి అంతే.

ఆ తర్వాత కొంత గోల సంగీతం మొదలైంది. గొప్ప పాటలు తక్కువా, మాస్ పాటలు ఎక్కువా వ్రాసిన వేటూరి గారు వచ్చాక ఒకరకమైన పాటలొచ్చాయి. వంగమాకు, గుడిసె, మంచం ఇలాంటి ఏవేవో పదాలతో. అదొక ఫేస్. ఇక చక్రవర్తి వచ్చాక, శారద లాంటి గొప్ప చిత్రాలు చేసినా, ఎక్కువ శాతం బీట్ ప్రధానమైన పాటలు చేసారు. అవి తత్కాలంగా ఆకర్షిస్తాయి, షెల్ఫ్ లైఫ్ తక్కువ. ఇంకా దాసరి గారు పాటలు వ్రాయడం కూడా మొదలు పెట్టినప్పుడు ఉత్తరాల తోటలూ, ఉంగరాలు పడిపోవడాలూ ఇలాంటివెన్నో వచ్చాయి. ఉన్నదొక్కడే బాలు, అవీ పాడాడు.

అలా ఆయన ప్రయాణం సాగుతూనే వుంది. ఒక వయసొచ్చాక, కొత్త దర్శకులు యువతకు అవకాశాలివ్వడం, బాలు వెనక్కి తగ్గడం జరిగింది. అయితే ఈ కొత్త గాయకులు కూడా పొడవైన రేసు గుర్రాల్లా అనిపించడం లేదు. కాలమే చెప్పాలి. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు లలో చూస్తే వాళ్ళు సంగీతం నేర్చుకోవడానికి చాలా విలువ ఇస్తారు. మన దగ్గర పాడుతా తీయగా వచ్చిన కొత్తలో ఒక ఊపు వచ్చింది, కానీ ఎక్కువగా చదువు మీదే దృష్టి ఎక్కువ. బహుశా ఈ కారణంతోనే నేమో గొప్ప గాయకులు ఇక్కడ తక్కువే.
బాలు గురించి ఒక పునశ్చరణ లాంటిది చేసుకున్నాం. ఆయన గొప్ప గాయకుడా? కాదు. కాని ఆయన స్థాయి గాయకుడు కూడా లేడే. ఆయన తన పాటలతో జనాల మనస్సులను రంజింపజేసాడా? తప్పకుండా చేసాడు. సాలూరి వారికి, కోదండపాణి-ఎమెస్వీ-చలపతి-రమేష్ నాయుడు-మామ వీళ్ళందరికీ పాడిన పాటలు గొప్పవి. అప్పటి సాహిత్యం కూడా గొప్పది. ఆ తర్వాత వచ్చిన ఇళయరాజా ఒక ప్రత్యేక చాప్టర్. ఆయన పాటల్లో సాహిత్యం గొప్పగా వున్నా లేకున్నా ఆ పాటలన్నీ మంత్రముగ్ధం చేసేవే. ఆ తర్వాత ఏ ఆర్ రహమాన్. ఇన్ని దశాబ్దాలుగా ఎంటర్టైన్ చేయగలగడం కూడా చిన్న విషయం కాదుగా.

ఇక ఆయన అన్నమయ్య పదాలు, త్యాగరాజు కీర్తనలూ అవీ పాడలేకపోవచ్చు. ఎలాగూ ఆయన నేర్చుకుని పాడిన మనిషి కాదు. సంగీతం ఆయనకు బహుశా పూర్వ జన్మ సంస్కారం వల్ల వచ్చింది. ఆయన చేయలేనిది పక్కన పెడితే ఆయన చేయగలిగీ, చేసినది గమనం లో తీసుకుంటే “బాలూ ఐ లవ్ యూ” అని కాక మరొక మాట అనలేము.

ఇప్పటి దాకా నేను ఆయన పాటల గురించే వ్రాశాను కదా. ఆయన సంగీత దర్శకుడు, నటుడు, డబ్బింగ్ చెప్పిన మనిషి, వ్యాఖ్యాత, ఏంకర్ ఇంకా చాలా. అంత వర్సటాలిటీ గురించి ఎవరన్నా వివరంగా వ్రాస్తే చదవాలని నా కోరిక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here