ప్రేమించే మనసా… ద్వేషించకే!-10

0
5

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి ముమ్ముడి శ్యామలారాణి గారి కలం నుంచి జాలువారిన ‘ప్రేమించే మనసా… ద్వేషించకే!’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]వ[/dropcap]ర్తమానం లోకి వచ్చిన సుజాత కళ్ల వెంట నీళ్లు జలజల రాలుతున్నాయి.

“మమ్మీ నీ గురించి వింటూంటే నువ్వు…. నువ్వు…. డాడీని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నావేమో! అనిపిస్తుంది…. నీ కోసం అంత ప్రాకులాడే డాడీ….”

“ప్చ్!…” అని నవ్వింది సుజాత… ఆ నవ్వులో జీవం లేదు. కళ్లు ఎటో చూస్తున్నాయి. అలా ఎంత సేపు చూసిందో సుజాతకు తెలియదు.

తల్లి వంక బాధగా, అభిమానంగా చూసింది సునీత… ఆ చూపులో తల్లి అంటే ఆప్యాయత, అమితమైన అనురాగాలు నిండి ఉన్నాయి.

“మమ్మీ! ఆ తరువాత ఏమి జరిగింది… డాడీలో ఏమైనా మార్పు వచ్చిందా? డాడీ గురించి చెబుతుంటే అంత ఎఫెక్షన్ గల మనిషిలో మార్పు అంత తొందరగా వస్తుందా అని ఆశ్చర్యంగా ఉంది. మమ్మీ ఐ వాంటూ నో ఎబౌట్ డాడీ” అంది.

“సునీ నువ్వే కాదమ్మా! అసలు ఎవరైనా అలానే అనుకుంటారు. అసలు నిజానికి ఆయన అంతరంగం అటు వంటిదని నేను కలలో అనుకోలేదు. మనిషిని చూసి అతను ఎటువంటి వాడో అని తెలుసుకోవచ్చు అనుకుంటాం. కాని అది చాలా పొరపాటు అని సుదర్శన్‌ని చూసినాకే తెలిసింది. ఆడదాని మనసు చాలా లోతు అని ఎవరన్నారో కాని అసలు మనిషి… ప్రతి మనిషి అంతరంగం ఎటువంటిదో, ఎంత లోతో చెప్పడం కష్టం అని నేను అంటాను. మనషుల్లో కొద్ది మంది మనుష్యుల మనసులకే నిలకడ ఉంటుదమ్మా. ఆ నిలకడ గల మనసున్న మనుష్యులు సామాన్యులు గారు. చరిత్రలో వాళ్లని శిలాక్షరాలతో చెక్కించాలి. మనసులు ఎపుడు ఎలా మారుతాయో చెప్పలేం అనడానికి సుదర్శన్ మనసే నిదర్శనం. నా జీవితం కాదు… నా జీవిత కథ చెప్పాలంటే ఒక్క రోజు సరిపోదమ్మా. నేను ఆ ఇంట్లో పడ్డ కష్టాలు, అనుక్షణం నేను అనుభవించిన నరకం చెప్పి ఎవరి సానుభూతి పొందాలని కాదమ్మా. నిజం చెప్పాలంటే సానుభూతి నా మనసు భరించలేదు. కష్టాలు శరీరానికైతే నేను లెక్క చేయకపోదును. నా మనస్సును సుదర్శన్ తల్లి ముక్కలు ముక్కలు చేసింది. ముక్కలయిన మనస్సుని నా భర్త సాంగత్యంలో దగ్గర చేసుకోవాలని ప్రయత్నించే దానిని…. ఎవరు నన్ను నిర్లక్ష్యం చేసినా, ఎవరు నన్ను బాధలకు గురిచేసినా నాకు లెఖ్ఖ కాదు. నవమాసాలు మోసి కని పెంచిన అమాయకురాలు తల్లిని నిరంతరం కూతుళ్లను పెద్ద స్థానంలో వున్న యోగ్యలయిన వాళ్ల చేతుల్లో పెట్టి, పై అంతస్తులో బ్రతకాలి అని ఆరాటపడే తండ్రిని… వదలి ఒక సామాన్యుడి సన్నిధి ఎందుకు చేరాననుకున్నావ్? ఆ మనిషిలో కన్పించింది నాపట్ల ఆరాధన… నేను ఒక్క నిముషం కన్పించకపోతే కళ్లల్లో కదలాడే నిస్పృహలు…. సదర్శన్ మామూలూ మనిషి కాదు. అతనిది అందరి లాంటి మనసు కాదు. ఆ మనసులో నేనంటే శతకోటి ప్రేమ తరంగాలు… అతను ఒక ప్రేమమూర్తి. నా కోసం ఎదురు చూసే ఒక ప్రేమ పిపాసి. లక్షలకు వారసురాలిని… కాలు ఎండలో పెడితే కందిపోతుందని భయపడే సుకుమారిని. కష్టం అంటే కూడా ఏమిటో తెలియని ముద్దు బిడ్డని… నేను మెట్టినింట గడప తొక్కితే ఆ మనుష్యులతో నాకు సరిపోతుందా అని ఆలోచన కూడా లేకుండా పుట్టింటి గడప దాటానంటే నేనా మనిషినినెంత ఆరాధించానో ఆలోచించు.”

“ఇంట్లో అత్తగారి సూటి మాటలు… నన్ను నిర్లక్ష్యం చేసి మాట్లాడటం… నా చేత రాని పనులు చేయించటం బాధ అనిపించినా… నా భర్త అనురాగాల ముందు నేను పడిన బాధ ఊష్ కాకి అన్నట్లు మాయమయ్యేది.”

“సునీ! నా జీవితంలో జరిగిన అతి ముఖ్యమైన సంఘటనలు చెబుతాను. నేను ప్రేమ అన్నది బూటకం, నేను – ప్రేమించిన మనిషిని మర్చిపో అన్నది ఎందుకో నా కథ చివరి దాకా వింటే అర్థం అవుతుంది” అంది.

“చెప్పు మమ్మీ! నువ్వంటే అంత ప్రేమ, అనురాగాలు వున్న మనిషి మారిపోయాడంటే ఇటీ ఈజ్ రియల్లీ సర్‌ప్రైజింగ్” అంది.

***

ఆరోజు…

“సుజాత యిలా రా అమ్మా… అబ్బ వెధవ తలనొప్పి భరించలేకుండా వున్నాను. తల కదప లేకపోతున్నాను” అని ఒక చేత్తో తల పట్టుకొని పెద్ద చేప కత్తిపీట ముందు పెట్టుకొని మూలుగుతుంది మీనాక్షి.

వంటింట్లో నుంచి వచ్చిన సుజాత చేపను చూసి కెవ్వున అరిచింది. క్రొత్తలో రంగారావు గారు చేపలు, మాంసం బజారు నుంచి తీసుకురాకుండా గుడ్లు తేవటం చూసి మీనాక్షి విసుక్కుంది.

“బాగుందండి వరస. నోరు చచ్చిపోయింది. మహారాణి లక్షలు తెచ్చిందా? వేలు తెచ్చిందాని ఆవిడ కోసం అన్నీ మానుకోవడం” అని మీనాక్షి విసుక్కునేది.

రంగారావుగారు మౌనం వహించడంతో ఆవిడకు అరికాలి మంట నెత్తికెక్కింది.

“నీసు లేకపోతే కంచం దగ్గర కూర్చునేవాడా? నానా అల్లరి చేసి ఇరుగుపొరుగు వాళ్ల కోళ్లను కోస్తాను, వండమని ఆల్లరి చేసేవాడు. అటువంటిది నోరు మూసుకుని ఎంచక్కా తింటున్నాడు. వాడికి పెళ్లమే అన్నీను. కాని కన్న ప్రేమ నాకుండదా ! ఈ రోజు చేపలు పట్రండి. అంటే గుడ్డు తెస్తారా” అని కేకలు వేసింది.

“మధ్యన నీకెందుకే బాధ! వాడు తింటున్నాడు గదా! అయినా కందకు లేని దురద కత్తి పీట కెందుకు?”

“చాల్లెండి పెద్ద చెప్పొచ్చారు. అసలు ఏమిటి మీ ఉద్దేశం? ముద్దుల కోడలి కోసం నేనన్నది తీసుకురారా! చెప్పండి” అని గద్దించి అడిగింది మీనాక్షి.

ఏం చెప్పాలో తెలియనట్లు తల గోక్కోసాగారు.

“మామయ్యా ఇన్నాళ్లు మీరు తేకపోతే తినరేమో అనుకున్నాను. నా ఒక్క దాని కోసం మీరందరూ మానివేయటం ఏమిటి? నాకు వాటిని శుభ్రం చేయటం అంటే చేత కాదు కాని అత్తయ్య దగ్గర వండటం నేర్చుకోవాలని వుంది” అంది సుజాత.

“అమ్మో! అంత కష్టం నీక్కర్లేదమ్మా! పర్మిషన్ యిచ్చావుగా, ఇక ఆయన దయ. వెధవ కాయకూరలు తినలేక చస్తున్నాం” అంది. అప్పటి నుండి రంగారావుగారు చిన్న చిన్న చేపలు, మాంసం తీసుకొచ్చి “అమ్మాయిని పాపం వీటి దగ్గరకు రానివ్వకు… ఎంతైనా వాటిని చూసి చిరాకు పడతుంది” అన్నారు.

“అబ్బో కట్టుకున్న పెళ్లాం మీద లేదు కాని ఎక్కడి నుంచో వచ్చి ఇంటి మీద పడ్డ కోడలు మీద అభిమానం. కోడలు వస్తుంది. సుఖ పెడుతుంది అనుకున్నాను. ఛ! ఛ! చాకిరీ తప్ప నాకేం మిగిలింది ఈ కొంపలో” గొణుక్కోవటం మొదలు పెట్టింది మీనాక్షి.

“అయ్యో రామ! నీకు ఒక్కనాడు అర్థం కాదే మాట్లాడింది. మన యింటి అమ్మాయి అయితే చేయించవచ్చు అని చెప్పేదేముంది… ఎక్కడు నుంచో… ఇటువంటి వంటలు తెలియని చోటు నుండి ఆత్మీయులను వదులుకొని మనమే తన వాళ్లు అనుకొని వచ్చింది… కాబట్టి చెప్పడం” అన్నారు.

“ఆత్మీయులను వదులుకొని ఎవరు రమ్మన్నారు. లక్ష రూపాయలు విలువ చేసే నా కొడుకుని….”

“ఛ!…ఛ!… నోరు ముయ్యవే. నే చెబుతున్నదేమిటి? నువ్వంటున్నది ఏమిటి? ఇన్నాళ్లయింది, నీతో మాట్లాడటం నాదే బుద్ది తక్కువ.”

“చెమిటి వాడి ముందు శంఖం ఊదినట్లు” అని గబగబ అడుగులు వేసుకుంటూ టైపు ఇన్‌స్టిట్యూట్ వైపు వెళ్లిపోయారు.

“ఏం తల్లీ అంత పెద్ద అరుపు అరచి కొయ్యబారిపోయావే! ఎంత సేపు ముద్దపప్పు, వేపుడు ముక్కలు తినలేం. మేం బ్రాహ్మలం కాదు. ఆ సంగతి మర్చిపోకు… వాడికి చచ్చేంత యిష్టం. పెద్ద చేప అయితే భలే రుచమ్మా అనేవాడు. ఇంటర్య్వూకి వెళ్లిన వాడు సాయంకాలం బండికి గుంటూరు నుండి వస్తాడని నేను త్రిమూర్తులు చేత తెప్పించాను. తీరా చేప కోద్దాం అని కూర్చునే సరికి తల పగిలిపోతుంది. కోడలే వుంటే నాకీ అవస్థ ఉండేదా?” అంది.

చివరి మాటకు చివుక్కు మంది సుజాతకు. తను కోడలు కాదా? చేప కోయటం చేతకాదు కాని ఇంట్లో ఏ పని చేయటం లేదా? ఇపుడే కాదు ఆవిడ రోజు రోజుకి మాటలతో బాధించాలని చూస్తుంది. ఎదురింటావిడ కోడలుకి ఫ్రిజ్ యిచ్చారని, ప్రక్కంటి అబ్బయికి స్కూటరు అత్తవారు ఇచ్చారని… ఒకటేమిటి ఎన్నో… అసలు తన తండ్రి, తను పంతాలుకే పోకపోతే తన పుట్టింటి వాళ్లు ఇచ్చే సారికి వీళ్ల యిల్లు సరిపోయేదా? తండ్రి గుర్తుకు వచ్చేసరికి సుజాత ముఖంలో బాధ చోటు చేసుంది. ఆ రోజు యింట్లో అడుగు పెట్టినపుడు తండ్రిని చివరి సారిగా చూడటమే. ఆ తర్వాత తన తండ్రి యింటి విషయాలే తెలియదు. గీసిన గీటు దాటలేని భయస్థురాలు, అమయాకురాలు తల్లి. ఒక కూతురు పోయి ఇంకో కూతురు దూరమై ఎంత నరకయాతన అనుభవిస్తుందో? ‘భగవాన్ ఏ తల్లికి తన తల్లి లాంటి స్థితి వద్దు.’ తను…. తను…. మంచి చెడు విచక్షణాజ్ఞానం మరచి తప్పు పని చేసిందా?

ఆలోచనలు ఆ విధంగా మళ్లినందుకు సుజాత ఒక్కనిముషం గాభరా పడింది. ఇంతలోకే తన మనసు ఇలా ఆలోచిస్తుందే.. తనకు సుదర్శన్ తప్ప వేరే లోకం అక్కర్లేదు అనుకున్న తను… తనేనా యిలా ఆలోచిస్తుందీ? అంటే తనలో చోటు చేసుకున్న ప్రేమ పొదలు ఒక్కొక్కటి ఎగిరిపోతున్నాయి? లేకపోతే మానసికంగా, శారీరికంగా అత్తగారి ప్రవర్తన వలన… నలిగిపోతున్న మనసు ఇలా ఆలోచిస్తుందా?

“ఏం తల్లి చేప కోసి పెడతావేమో అని పిలిస్తే నిలబడి ఆలోచిస్తున్నావే? అవున్లే మొగుణ్ణి కొంగున ముడి వేసుకున్నావే! మావగార్కి నెత్తి మీద దేవతవు. ఇక నా మాట ఏం ఖాతరు చేస్తావే!” అని ఊరకనే ముక్కు చీది రాగలాపన చేస్తూ చేపని కోయటానికి నానా తంటాలు పడుతున్నట్లు నటించసాగింది మీనాక్షి.

ఆలోచనలతో పరిసరాలనే మరచిన సుజాత అత్తగారి మాటలకి తేరుకొని “ఆ… అది కాదత్తయ్యా! నాకు చేపను చూస్తుంటే భయం వేస్తుంది. అందులోకి అంత పెద్ద చేప గట్టిగా పట్టుకొని కొస్తుంటే కరవదా? అత్తయ్య… మీరు పట్టుకోండత్తయ్యా” అంది బ్రతిమాలుతున్న ధోరణిలో.

“బాగుంది లే వరస…. వెనకటికి ఒకడు పిచ్చి కుదిరితే తలకు రోకలి చుట్టమన్నాడట. అలా వుంది నీ మాట. నేను పట్టుకుంటే నువ్వు కోసేదేమిటి? అది ఏనాడో చచ్చింది. అది నీకోసం బ్రతికి కూర్చోలేదు” అని కొర కొర సుజాత వంక చూసింది.

“అయితే లేవండత్తయ్యా నే కోస్తాను” అని కత్తి పీట దగ్గర కూర్చుంది. పొడవుగా పెద్ద తలకాయతో వున్న ఆ చేపను చూస్తుంటే ఒక ప్రక్క భయం, ఒక ప్రక్క అసహ్యంతో పాటు కాళ్లు చేతులు వణికిపోవటం ప్రారంభించాయ్! చేపని చేతిలోకి తీసికుందే కాని ఆ స్పర్శతో శరీరం చచ్చు బడిపోయినట్లయి కెవ్వున అరచి ‘టపీ’మని క్రింద పడేసింది.

“అయ్యో! నీ గొప్పతనం నాశనం కాను. నీ పుట్టింటోరు జమీందార్లయితే ఎవడిక్కావలే? రొండొందల యాభై అయిదు రూపాయలు పోసి బుచ్చు చేప కొన్నాను. టపీమని క్రింద పడేస్తావా? అది ఎందుకైనా పనికి వస్తుందా?” అని కారాలు మిరియాలు నూరసాగింది,

“అది కాదత్తయా, చేత్తో పట్టుకొని కొయ్యబోతుంటే అది కదులుతుంది… భయం వేసి…”

“చాల్లే, ఎవరైనా వింటే నవ్వుతారు. చచ్చిన చేప కదలుతుందంట. చేప కోస్తుంటే రాపిడికి కదలదు? ఏం చేస్తావో చెయ్యి, నా తలకాయ పగిలిపోతుంది. నేపోయి పడుకుంటాను” అని విసురుగా అక్కడ నుండి వెళ్లిపోయింది.

అసలు మీనాక్షి కోపానికి, సుజాతను సాధించడానికి కారణం – పుట్టింటి వాళ్లు అంత గొప్ప వాళ్లు. ఏ అచ్చట ముచ్చట తీర్చకుండా పంతాలకుపోయి ఊరుకుంటే ఈవిడగారు బెట్టు చేసి ఊరుకుంది. అన్ని లక్షలుంటే ఎవడికి కావాలి. యిలా ఎన్నాళ్లు పంతాలకుపోయి ఊరుకుంటారో? – అని.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here