ప్రేమించే మనసా… ద్వేషించకే!-14

0
8

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి ముమ్మిడి శ్యామలారాణి గారి కలం నుంచి జాలువారిన ‘ప్రేమించే మనసా… ద్వేషించకే!’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“మ[/dropcap]మ్మీ! వాట్ హాపెండ్? టెల్ మి మమ్మీ! రియల్లీ హీ ఈజ్ గ్రేట్ లవర్! ఐ డోంట్ నో వాట్ ఈజ్ రాంగ్ ఇన్ డాడీస్ బిహెవియర్! ఐయామ్ రియల్లీ యాంక్షియస్ టు నో ది ట్రూత్, టెల్ మి మమ్మీ! వాట్ హపెండ్?” అంది సునీత.

అప్పటికే ఆ చిన్నారి కళ్లల్లో కన్నీళ్లు ఏకదాటిగా కారుతున్నాయి. ఎప్పుడు కళ్ల వెంట కన్నీళ్లు చూడని మమ్మీ కళ్లల్లో కన్నీళ్లా? ఆ కన్నీళ్ల వెనుక ఎంత విషాదముందో?

“చెబుతాను సునీ!… కాని అదంతా… ఒక  పీడకల…

…. ఆ యింట్లో నేననుభవించిన సంఘటనలు చెప్పుకుంటూ పోవాలంటే ఈ రోజు కాదు… ఎన్నో రోజులు పడుతుంది… ఆ సంఘటనలన్నీ నీ ముందు వుంచితే నీ మనసు చెల్లాచెదురైపోతుంది. అంతే కాదు ఇపుడిపుడే మానుతున్న గాయాన్ని మళ్లీ కెలికినట్లవుతుంది.

మీనాక్షి అదే మా అత్తగారు మామూలు మనిషిగాదు. అందులోకి స్త్రీకుండవలసిన కోమలత్వం, ఆర్ద్రత, అభిమానం ఆ మనిషిలో ఏ కోశానా లేవు. అందుకే నన్ను… ఒక ఇంటి కోడలు క్రింద… నన్ను  కనీసం… సాటి ఆడదానిలాగా కూడా చూడకుండా…. నా గుండెల మీద సమ్మెట పోట్లు పొడిచేది…. ఒక్కొక్కసారి నన్ను మనిషి కింది కాదు పురుగులా ఈసడించినా, మాట్లాడిన మాటలు నేను చెప్పలేను సునీ! నేను ఎంత కాని పన చేసానో… నాకు జన్మనిచ్చిన తల్లితండ్రులకు ఎంత బాధ గల్గించానో, కామం అనే పదానికి ప్రేమ అనే అందమైన ముసుగును కప్పి ప్రేమ కన్న గొప్ప వరం స్త్రీకి మరొకటి లేదని కళ్లు మూసుకొని ఎంత కాని పని చేసానో నేను, అవమానాలు పడి… నా సర్వస్వం అనుకున్న ప్రియుడి నోటి వెంట వినకూడని మాటలు విన్న తర్వాత కాని తెలిసి రాలేదు.

“సుజాతా! మావారు నా చెవుల దుద్దులు చూసి తెగ సరదాపడ్డారు. నా ముఖానికి ఎంతో బాగున్నాయట… నాలుగు రోజులుంచుకొని యిస్తాను” అంది సుందరి.

నాకు అప్పటికే అత్తగారు, ఆడపడుచు మంచిగా వుండి ఆ దుద్దులు తీసుకున్నారని గ్రహించినాక ఆ దుద్దులు మీద ఆశ ఎప్పుడో వదులుకున్నాను…. నిజం చెప్పాలంటే నాకు బంగారం మీద… ధనం మీద ఆశ లేనే లేదు. ఆ ఆశే వుంటే మీ డాడీని వివాహం చేసుకునే దానిని కాను. నేను ఆ దుద్దులు యిచ్చేద్దాం అనుకున్నాను, ఆవిడ అంత ఆశపడుతోందని. కాని నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఒక్కటే. దుద్దులు వాళ్ల స్వంతం అయినాక మా అత్తగారిలో, ఆడపడుచులో అనుకోని మార్పులు వచ్చాయ్! మా అత్తగారైతే మునుపటి మనిషే. ఆవిడ ఏం అన్నా… ఏం చేసినా… గుండెను రాయి చేసుకొని బ్రతకటం నేర్చుకున్నాను. కాని సుందరి నోటికి హద్దు పద్దు లేకుండా మాట్లాడేది.

“ఎక్కడ చూడలేదు మీలాంటి పుట్టింటి వాళ్ళని. హవ్వ! పంతాలకు పోయి కన్న వాళ్లను వదులుకుంటారా. మొన్న మా పనిమనిషి కూతురు… ఎవడినో వళ్లు బలిసి ప్రేమించానందట. మా పనిమనిషి కూతురుని చస్తే గుమ్మం ఎక్కనివ్వను వాడితో లేచిపోయి నా పరువు తీస్తుందా అది. నేను నిజమే అనుకున్నాను. నాలుగు రోజులులయ్యేటప్పటికి ‘అమ్మా’ అని దాని కూతురు, ‘తల్లీ’ అని పనిమనిషి ఒకటయ్యారు. ‘కన్న ప్రేమమ్మా, దానిని వేరు చేయలేకపోయాను. దానికి అత్తవారింట్లో – ఏం తీసుకురాలేదు, ఏం మంచీ చెడ్డ జరగలేదు అని పేర్లు పెట్టించుకోవటం ఎందుకమ్మా’ అని చెప్పి – అప్పు చేసి వియ్యాల వారికి జరపవలసిన లాంఛనాలు జరిపి, ఆడపడుచు కోరికలు తీర్చి, అల్లుడిని కూతురుని ఇంటికి తీసుకొచ్చి అల్లుడికి వాచీ, సైకిలు కొనిచ్చిందంట…”

“మీ పుట్టింటోళ్లకు అన్ని లక్షలు వుంటే ఎవరికీ కావాలి సుజాత? నువ్వు లేచిపోయావని బాధే అనుకో, అయితే మాత్రం ఎన్నాళ్లు పంతాలు పడతారు?  వాళ్లయినా పట్టు వదలాలి. నువ్వుయినా వదలాలి… మొన్న చూడు ఎదురింటి ప్లీడరుగారి అబ్బాయి పెళ్లయిందా?  అమ్మో లాంఛనాలు ఎంత బాగా జరిపారు. స్కూటరు, ఫ్రిజ్, ఫర్నీచరు, ఆడపడుచులకు కట్నం… చూస్తుంటే ముచ్చట వేస్తుంది.”

అంత వరకు పళ్ల బిగువచాటున ఆవేశాన్ని అణుచుకొని వింటున్న నేను ఎన్నడూ లేని కోపంతో ఊగిపోయాను… నాకు తెలియకుండానే నా నోటి వెంట మాటలు కోపంగా వచ్చేశాయి.

“క్షమించండి వదినగారు, మీరు యింత కష్టపడి హితబోధ చేసారు గాని నా కంఠంలో ఊపిరివుండగా నాకు నేనుగా నా పుట్టింటి గడప త్రొక్కను. నేను లేచిపోయి వచ్చినదానను. తిరిగి ఏ ముఖం పెట్టుకొని వాళ్ల గుమ్మం తొక్కుతాను. వాళ్లే యిక్కడకు వచ్చి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తే తప్ప నేను వాళ్ల గుమ్మం ఎక్కను. నన్ను చేసుకుని మీ తమ్ముడు గారికి ఏ ముచ్చట తీరలేదు. మీకు ఏం జరుగలేదు నా వలన… ఏదో  ఆ దుద్దులు తప్ప! కాని ఇంకోసారి… ఇంకోసారి ఇటువంటి ప్రస్తావన తెస్తే సహించేది లేదు” అన్నాను కోపంగా.

తల్లీ కూతుళ్లు యిద్దరు అవాక్కయిపోయారు నా మాటలకి. కొంచెం సేపటికి మా అత్తగారు తేరుకొని కోపంగా నావైపు చూసి “బాధపడకమ్మా సుందరీ, అలా తెల్లబోయి చూస్తున్న వేమిటి? ఇది తెలివి తక్కువదద్దమ్మ అనుకున్నావేంటి? తెలివి తేటలుండబట్టే మన సుదర్శన్‌ని పైసా లేకుండా వల్లో పడేసుకుంది. దాంతో నీకు మాటలేమిటి?” అని నన్ను హీనంగా మాట్లాడుతుంటే ఎంత ఆపుకుందామన్నా నాకు దుఃఖం ఆగలేదు. అక్కడ వుండలేక పని వున్నా నా గదిలోకి పరుగెత్తాను.

“ఏమండీ, మిమ్మలనే” అన్న సర్వేశ్వరరావు గొంతు విని తల ఎత్తాను.

“నేను… నేను… వెళుతున్నానండి. పొలం పనులు వున్నాయి. ఆ పనులు కాగానే వస్తాను… సుదర్శన్ అన్నట్లు మీరు ఖాళీగా వున్నారని మీకు కథలు యిచ్చాను… మీకు ఈ యింట్లో ఎంత పనో ఇంట్లో వున్న నాకు తెలిసింది…” ఎపుడు పళ్లు యికిలించే సర్వేశ్వరరావు ముఖంలో బాధ కొట్టొచ్చినట్లు కనబడింది.

ఒక్క నిముషం ఆశ్చర్యపోయాను… ఎవరో అతను… అంతే కాదు… అతనికి తన మీద జాలిపడవలసిన అవసరం లేదు…. కనీసం, అతనికి నాకు మధ్య స్నేహితుల కుండవలసిన స్నేహంగాని, అభిమానం గాని లేవు. ఒక్కసారి మాట్లాడినదానికి తన మీద అంత జాలి పడుతున్నాడెందుకో !

“మరి నేను వెడతానండి… అన్నట్లు మీ దుద్దులు పెట్టుకొని సుందరి నాకు చూపెట్టింది. సుందరికి నగల మీద వున్న పిచ్చి ఎంత పైననా చేయిస్తుంది. ఏమీ అనుకోకండి యింత అసమర్థుడనని… నేను మీరు… నాకు చెల్లెల్లాంటివారని చెబుతున్నాను… మాది పల్లె… గొరంతది యింట్లో జరిగినా రెండో యింటికి వెంటనే తెలిసిపోతుంది. రెండు చేతులు కలిస్తే శబ్దం వస్తుంది కదండి, అందుకని నేనే సుందరి విషయంలో వెనక్కి తగ్గిపోతాను… అన్నట్లు ఈ సోదంగా ఎందుకు చెబుతున్నానంటే… మీరడిగితేనే ఆ దుద్దులు ఇస్తుంది. తీసుకోండి… ఆ కథలు…”

అంత వరకు అమాయకుడు పాపం అనుకున్న నేను సర్వేశ్వరరావు మాటలకు ఆశ్చర్యపోయాను. అతను మాట్లాడిన మాటల్లో ఎంత నిజం దాగివుంది. అనుకున్న మరుక్షణం “తప్పకుండా అన్నయ్యగారు… నాకు చేతనయినంత వరకు దిద్దుతాను. నన్ను అండి అని పిలవకండి, నాకన్నా పెద్దవారు. పేరు పెట్టయినా పిలవండి లేకపోతే చెల్లెమ్మా అనైనా పిలవండి” అన్నాను. ఎందుకు అలా అన్నానో నాకే తెలియదు… ఎందుకో ఆ రోజు సర్వేశ్వరరావును చూస్తున్న నాకు అన్నదమ్ములులేని నాకు అన్నయ్యలా అనిపించాడు. నా మాటలకి అతని ముఖం సంతోషంతో నిండిపోయింది. “తప్పకుండా చెల్లెమ్మా… తల్లి తండ్రుల బంధం తప్ప తోబుట్టువుల బంధం తెలియని వాడిని… మరి నేను వస్తాను” అని నా గది దాటి హాలులోకి వెళ్లాడు.

“ఏమిటండీ దాంతో మీకు పని… పెద్ద యిదే చదివేసిందని రెండు కళ్లూ నెత్తి మీద వున్నాయి… అయినా వయ్యారి వగలభామ, దాంతో మీకు సంబంధం ఏమిటి? ఎంతలేసి మాట్లాడింది అనుకున్నారు నన్ను? ఎంత తెలివైంది కాకపోతే మా తమ్ముణ్ణి వల్లో వేసుకుంది. తగుదునమ్మా అని తాళి కట్టించుకోకుండానే అత్తింటికి వచ్చేసింది… అట్లాంటిదాంతో….”

“నోరు ముయ్యువే! ఏమిటా నోరుకెలా వస్తే అలా మాట్లాడటమేనా?… చదువుకున్నదయినా… వగలమారిదయినా నీలా నోరు పారేసుకులేదు” అని సర్వేశ్వరరావు అంటుండగానే…

“అయ్యయ్యో! వట్టిమనిషి కాదు… పదేళ్లకొచ్చింది… ముచ్చటగా చూసుకోవాలి…. బరితెగించిన దాని గురించి నా కుతురిని నోటికొచ్చినట్లు అంటారేమిటండి, అల్లుడుగారు?” అని మా అత్త ఒకటే బాధపడిసాగింది.

“తప్పయిందండి అత్తయ్యగారు” అని బుగ్గలు రెండు గట్టిగా వాయించుకొని “ఆ కూతురుకి తగ్గ తల్లి మీరు” అని గబగబా వెళ్లిపోయాడు సర్వేశ్వరరావు.

ఆ గుమ్మం ఎక్కిన నాకు ఎప్పుడూ నాలో అంత కోపం కసి రాలేదు… వాళ్లు…. వాళ్లు… అంతంత మాటలంటుంటే ఎందుకు పడాలి? నేను ఊరుకున్న కొలది మరీ రెచ్చిపోతున్నారు. ఈ రోజు సుదర్శన్‌తో చెప్పాలి అనే నిర్ణయానికి వచ్చాను.

సదుర్శన్ ముఖంలో కోపం, కసి, ద్వేషం కొట్టవచ్చినట్టు కనబడుతున్నాయి. ఆయనకు ఎప్పుడు కోపం వచ్చినా తనను తను కంట్రోలు చేసుకోలేక అనుకుంటాను… కోపంతో గదిలో పచార్లు చేస్తుంటారు. ఇప్పుడు అలాగనే… పిడికిలి బిగించి కోపంగా అటు ఇటూ పచార్లు చేయటం మొదలు పట్టారు.

‘ఏమైంది? ఎందుకలా వున్నారు? తను ఈ ఇంట్లో అడుగుపెట్టిన క్రొత్తలో అత్తగారు క్రూరంగా ప్రర్తించినపుడు ఆవేశంతో ఇలాగే వున్నారు. కాని యిపుడేం జరిగింది… ఏమైనా విన్నారా సుందరి, తల్లి మాటలు. మొన్న వెళ్లిన ఉద్యోగం విషయం తెలుసుకుంటాను అని వెళ్లారు… ఒక వేళ ఉద్యోగం రాలేదా? అయితే మాత్రం… ఆయన యిలా వుండటానికి కారణం తెలుసుకోవాలి’ అని “ఏమండీ? ఎందుకలా వున్నారు చెప్పరూ?” అన్నాను.

“ప్లీజ్! సుజీ. నన్ను కొంచెం సేపు ఏం మాట్లాడించకు” అన్నారు కొంచెం విసుగ్గా.

ఆయన సమాధానం విని నీరు కారిపోయాను. ఎపుడు నన్ను కొంచెం కూడా విసుక్కుని మాట్లాడి ఎరుగరు… నాతో ఎపుడు ప్రేమ అనురాగాలు కళ్లల్లో నింపుకొని మాట్లాడే సుదర్శన్ ఎందుకు విసుక్కున్నాడు… సుదర్శన్ మనసు ఎంత బాధ పడకపోతే అలా అంటాడు… తను… తను… వాళ్ల గురించి చెబుదాం అనుకుంది. కాని జరిగిందేమిటి?  తర్వాత సుదర్శన్ జరిగినదంతా నాతో చెప్పాడు. సుదర్శన్ రిటెన్‌లో పాసయ్యాడు. ఇంటర్వ్యూకి వెళితే వాళ్లు అడిగిన వాటన్నిటికి కరెక్టుగా సమాధానం చెప్పాడట. కాని ఉద్యోగం రాలేదు… ఇలా జరగటానికి కారణం ఏమిటని తెలుసుకోటానికి వెళితే తెలిసిన సమాధానం… ఇంటర్వ్యూ కండక్టు చేసే మెంబర్సు తాలూకా వాళ్లకి, సెలక్షన్ బోర్డు తాలుకా వాళ్లకి ఉద్యోగాలు కొన్ని పోగా, బోర్డు చైర్మన్ ఉద్యోగానికి ముప్ఫై వేలు చొప్పున లంచం తీసుకొని మరి కొన్ని ఉద్యోగాలు ఇచ్చారుట..

సుదర్శన్ ఫ్రెండ్ ఫాదర్‌కి చైర్మన్ తెలుసట…. ‘వట్టినే ఉద్యోగాలు రమ్మంటే రావురా, డబ్బు తీసుకురా. ఎలాగోలాగ నీ పేరు ఉద్యోగం వచ్చిన లిస్టులోకి మా ఫాదరు తీసుకొచ్చే పూచి నాది. మా ఫాదరు ఈ ఇన్ఫర్మేషను చెప్పి అంతగా మీ ఫ్రెండుకి ఉద్యోగం అవసరమైతే, ఈ రోజే డబ్బు తీసుకరమ్మను’ అని చెప్పారు – అన్నాడు.

“సుజీ!… వళ్లు అమ్ముకుని జీవించే వేశ్యకు, డబ్బుకు అమ్ముడు పోయే మనుష్యులకు తేడా ఏమైనా ఉందంటావా? ఏమో నా దృష్టిలో ఏ మనిషైనా సరే డబ్బుకు దిగజారే పనులు చేసే వాళ్లు వేశ్యలకంటే హీనం అంటాను… బ్రతకడానికి దారిలేక… పెట్టుబడికి డబ్బు లేక… వాళ్ల స్వంతం అయిన శరీరం అమ్ముకుని బ్రతికే వేశ్యలకంటే డబ్బుకి ఆత్మను చంపుకొని… ఎందరో నిరుద్యోగుల మరణాలకి, నిరాశకి, నిస్పృహలకి… బాధలకు కారణం అవుతున్న లంచగొండులు హీనం అంటాను…. అంతేగాదు… బ్రతకడానికి త్రోవ దొరక్కపోతే చావనైనా చావాలిగాని లంచగొండులకు లంచాలిస్తే వాళ్లు వాళ్లతో సమానులే అంటాను. నిజం చెప్పాలంటే ఈ లంచగొండులు ఎలా బయలుదేరారు? లంచం ఇచ్చే వాడిని, లంచం తీసుకునే వాడిని పట్టుకొని కటకటాల వెనక్కి పంపిస్తే తప్ప ఈ దురాచారం తప్పదు” అన్నాడు ఆవేశంగా.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here