ప్రేమించే మనసా… ద్వేషించకే!-18

0
8

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి ముమ్మిడి శ్యామలారాణి గారి కలం నుంచి జాలువారిన ‘ప్రేమించే మనసా… ద్వేషించకే!’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]సు[/dropcap]జాత కంగారుగా సుదర్శన్ వైపు చూసింది. సుదర్శన్ అంటున్నదేమిటి? తనని… ఈ నరకంలో శాశ్వతంగా ఉంచుతాడా? మావగారికి పరిస్థితి ప్రమాదకరంగా వున్న మాట నిజమే. అయితే ఉద్యోగంలో చేరటానికి టైం కావాలని కోరాలి గాని… సుదర్శన్ అంటున్న దేమిటో అర్థం కాలేదు సుజాతకు. అందుకే అంది “సుదర్శన్ నువ్వు అంటున్నది అర్థం కాలేదు. నువ్వు ఈ ఉద్యోగం…” మాట పూర్తి కానే లేదు… విసుగు ధ్వనించిన స్వరంతో అన్నాడు సదర్శన్ “నిన్ను… జీవితాంతం ఇక్కడ వుంచుతాను అనటం లేదు. సుజీ… నీకు నా బాధ అర్థం కావటం లేదు… ఆయన నా తండ్రి… నన్ను ఎన్నో ఆశలతో పెంచుకున్నారు… తలకొరివి పెట్టవలసిన నేను… ఒక్కగానొక్క కొడుకుని ఆయన ఖర్మానికి ఆయనను వదిలేసి నువ్వు చెప్పినట్లు వెంటనే వెళ్లిపోదాం అంటానా?” అన్నాడు.

నిర్ఘాంతపోయింది సుజాత… నెమ్మదిగా… అనవలసిన మాటలు ఎలా అనేశాడు తను… తను… తన కన్నతండ్రిని ఆయన ఖర్మానికి ఆయన్ని వదిలేసి వచ్చేయమంటున్నాను అనేగా అర్ధం. మాటల్లో ఎంత అర్థం వుంది. ఆ తండ్రి ఆశలు తుడిచివేస్తానంటున్నానా నేను? సుదర్శన్ తనను ఇంతేనా అర్థం చేసుకున్నాడు… సుదర్శన్ దృష్టిలో తను ఎంత తేలికయిపోయింది అనుకున్న మరు క్షణం పిచ్చిదానిలా అరచింది సుజాత.

“సుదర్శన్… నువ్వు… నన్ను యింతేనా అర్థం చేసుకున్నది. నేను బాధను అర్థం చేసుకోలేని మూర్ఖురాలినా? ఎంత లేసి మాటలన్నావు? నేను… నేను… నువ్వు అనుకున్నంత దుర్మార్గురాలినైతే మీ అమ్మ, మీ అక్క నన్ను పెట్టే పాట్లుకు ఒక్కనిముషం ఈ యింట్లో వుండేదాన్నే కాదు. నిన్ను పోరు పెట్టి బయటకు తీసుకెళ్లేదానిని. అంతే కాదు నీకు ఇరవై నాలుగు గంటలు మనశ్శాంతి లేకుండా చేసేదాన్ని. నేను అనుభవించిన నరకం నీతో చెప్పానా? ఏం చూసి నన్ను అపార్థం చేసుకున్నావ్. ఇన్నాళ్లకు నేను సుఖపడే రోజులొచ్చాయన్న ఆనందంలో… ఉద్యోగంలో జాయిన్ అవటానికి టైం అడుగుదాం అనుకున్నాగాని నువ్వు వూహించినట్లు మీ నాన్నగార్ని వదిలేసి వచ్చేయమనలేదు… పిచ్చి సుదర్శన్… మీ నాన్నగారు నీ మీద ఆశలు పెట్టుకున్నారని తెలుసు… ప్చ్… అందరి తల్లి తండ్రులు పిల్లల మీద ఆశలు పెట్టుకుంటారు సుదర్శన్, కాని….” అని సుజాత అంటుండగానే….

చివ్వున తలెత్తి సుజాత వైపు చూసాడు సుదర్శన్.

“అంటే నువ్వు… చెప్పేది మీ నాన్న ఆశలు మధ్యలో త్రుంచి నాలాంటి పనికి మాలిన వెధవ వెనకాల వచ్చానని బాధపడుతున్నావా?” తీక్షణంగా చూసి అన్నాడు సుదర్శన్.

ఒక్క క్షణం సుదర్శన్ నోటి వెంట క్రొత్తగా వస్తున్న మాటల వేడికి ఆశ్చర్యంగా చూసింది సుజాత….

“అవును, నాకు తెలుసు సుజీ! నువ్వు ఎప్పటికైనా బాధపడతావని నాలాంటి వాడిని కట్టుకున్నందుకు… నేను చావు బ్రతుకుల మధ్య వున్న తండ్రిని వదిలేసి…”

“స్టాప్ సుదర్శన్” అని పిచ్చిదానిలా రెండు చేతులతో చెవులు మూసుకొని గట్టిగా అరిచింది. మరు క్షణం నిలబడిన చోటు నుండి కుప్పకూలిపోయి “నువ్వు… నువ్వు… ఇలాంటి వాడివని కలలో కూడా అనుకోలేదు. నన్ను… నన్ను… బాగా అర్ధం చేసుకున్నావ్” అని మోకాళ్ల మధ్యన తల పెట్టుకుని ఏడ్వసాగింది.

“ఛ… ఛ… ఎంత సేపు ఏడుపులు… మనసుకు శాంతి లేకుండా పోయింది” అని విసురుగా అక్కడ నుండి వెళ్లిపోయాడు సుదర్శన్.

చేష్టలుడిగిన దానిలా మోకాళ్ల మధ్య నుంచి తల ఎత్తి చూసి అలా వుండిపోయింది సుజాత.

***

ఇనిస్టిట్యూట్ నుండి వచ్చాడు సుదర్శన్.

సుందరి తండ్రిని చూడటానికి హాస్పటల్‌కి వెళ్ళి తిరిగిరానే లేదు. మీనాక్షి హాస్పటల్లోనే వుంది.

ఆ రోజు తలకి స్నానం చేసి లేత రంగు ఆర్గండి చీర, అదే రంగు జాకెటు వేసుకొని… కిటికీలో నుండి అందిన సన్నజాజుల గుత్తి కోసి తలలో పెట్టుకొని సర్వేశరరావు యిచ్చిన కథల పుస్తకం పట్టుకొని పడుకుంది సుజాత.

సుదర్శన్ గదిలోకి వచ్చి బట్టలు మార్చుకొని లుంగీ కట్టుకొని మంచం వైపు తిరిగి చూసాడు. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు సుజాత చిక్కినా అయిదో నెల రావటంతో కొంచెం పొట్ట ఎత్తు వచ్చి… ఛాయ మరింత పెరిగి…. అందంతో మెరిసిపోతుంది సుజాత.

ఒక్కసారి శరీరంలో నరాలన్ని బిగుసుకుపోయి, వళ్లు వేడెక్కిపోయి ఏదో భరించలేని కోరిక బయలుదేరింది. రెండు అడుగులు ముందుకు వేశాడు… సుజాతను కౌగిట్లో బిగించి, మద్దులతో ముఖం అంతా నింపి తన శరీరం కోరుతున్న సుఖాన్ని పొందాలన్నట్లు దగ్గరగా వెళ్లాడు. అంతే ఎవరో కొరడాతో చెళ్లుమని కొట్టినట్లు ముందుకు వేసిన అడుగులు వెనక్కి వేసాడు.

కథ చదవటంలో లీనమైపోయిన సుజాత సుదర్శన్‌ని పరిశీలించనే లేదు. సర్వేశ్వరరావుని ప్రోత్సహించే వాళ్లు వుంటే వెలుగులోకి తప్పక వస్తాడు అనిపించింది. మొదట రెండు చిన్న కథలు వ్రాసాడు… వాటిలో క్రొత్తదనం… లేకపోయినా కథ మలుపులు… భావాలు స్పష్టంగా సూటిగా వ్రాసాడు. తరువాత వ్రాసింది చిన్న నవల. అందులో పాత్రలు ఎక్కువగా ఉన్నా ప్రతి పాత్రకు సరిపడ మాటలు వ్రాయటమే కాకుండా, కొన్ని పాత్రలను ఎంతో చక్కగా మలిచాడు. ఉమ్మడి కుటుంబం మీద కథా వస్తువు తీసుకున్నాడు…

“స్వప్నా భోజనం వడ్డించవూ! అని హాల్లో స్వప్నని సుదర్శన్ అనడం వినిపించి, కథ చదవడంలో లీనమైన సుజాత గభాలున మంచం మీద నుంచి లేచి కూర్చుంది.

సుదర్శన్‌తో ఆ రోజు నుంచి తను మూభావంగా ఉంటున్న మాట నిజమే. తనను అపార్థం చేసుకుని అన్ని మాటలంటే ఎప్పటిలా సుదర్శన్‌తో తను ఎలా మసలగలుగుతుంది? సుదర్శన్ తన తప్పు తను తెలుసుకోవాలని సగం సుదర్శన్‌తో మాటలు తగ్గించింది. కాని ఈ రోజు యింట్లో సుందరి కూడా లేకపోవటంతో తన చేతులతో భర్తకు స్వయంగా వడ్డించి తను సుదర్శన్‌తో కలసి భోంచేయాలనుకుంది… కాని…. తనని… పలకరించకుండా… కనీసం తనతో ఒక్క మాటైనా మాట్లాడకుండా, స్వప్నని వడ్డించమనకుండా ఆవేశంతో మంచం మీద నుంచి లేచి హాల్లోకి వచ్చింది.

హాలులోంచి డైనింగ్ రూం కనబడుతుంది. స్వప్న సుదర్శన్ ఎదురుగా కూర్చుని వడ్డిస్తూ “ఏమిటి బావా ఆ ఆలోచనలు, చెబితే విని సంతోషిస్తాను” అంది నవ్వుతూ.

సుదర్శన్ ఆలోచనలు మరో విధంగా వున్నాయి. ఊహు లాభం లేదు… సుజాతను అలా చూస్తున్న కొలది… తన మనసులో ఆ కోరిక బలపడి…. తను సుజాత పొందుకోరి ఇద్దరు ఒకటైపోతారేమో అనిపిస్తుంది. భగవంతుడు ఎంత అగ్నిపరీక్ష పెట్టాడు? ఇంకా ఎన్నాళ్ళు ఇలా?… ఆలోచిస్తున్న కొలదీ ఛీ… ఛీ తను ఎంత అవివేకంగా ఆలోచిస్తున్నాడు… కొద్ది రోజులు తన భార్య ఆరోగ్యం కుదుట పడటం కోసం… తమ కలలపంటను చూసుకోవటం కోసం ఆ మాత్రం నిగ్రహ శక్తి తనకి ఉండొద్దు?

పక పకా నవ్వేసింది స్వప్న… “ఏమిటి బావా నీ ఆలోచనలు… కంచంలో చేయి వుంచి… నాకు చెప్పకూడనివా?” అంది.

స్వప్న అలా అడగటంతో గతుక్కుమన్నాడు సుదర్శన్. ఏమని చెబుతాడు తన ఆలోచనలు… అనుకోకుండానే నోటి వెంట అబద్దం వచ్చేసింది.

“నీ గురించే. నీ భవిష్యత్ గురించే… ఏమిటా అని ఆలోచిస్తున్నాను.”

“ప్చ్! భలే జోకు వేశావు బావా? నా భవిష్యత్తా? అధి భగవంతుడు ఎప్పుడో తీసుకెళ్లిపోతే…” అని అంతలోనే ఏదో ఆలోచించిన దానిలా “నా భవిష్యత్ గురించి ఆలోచనలు ఏమిటో చెప్పమంటావా? బి.ఏ పూర్తి చేసి అది నీ సహకారంతో టైపు నేర్చుకొని ముందు ఉద్యోగం సంపాదించి నా కాళ్ల మీద నేను నిలబడాలి” అని కల్లాకపటం లేకుండా స్వచ్ఛమైన మనసుతో చెప్పుకుపోతున్న స్వప్న వైపు అభినందనగా చూసి “గుడ్ అలాగుండాలి తర్వాత… అదే ఉద్యోగం వచ్చినాక ఏం చేయాలనుకుంటున్నావ్?” అన్నాడు.

స్వప్న తన ముందు జీవితం ఎలా దిద్దుకుంటుందో తెలుసుకోవాలన్నట్లు కుతూహలంగా అడిగాడు.

“ఏముంది బావా? తెలుగు సినిమాలు చూడటం లేదు? ఆఫీసులో బాస్ కుర్రాడు. ఆ అమ్మాయి అందం చూసి ముచ్చటపడి ఇన్నాళ్లు నీ లాంటి అమ్మయి కోసమే ఎదురు చూస్తున్నాను. నా జీవితంలోకి సంతోషంగా ఆహ్వనిస్తున్నాను అంటాడు. ఆ అమ్మాయి సిగ్గుతో O.K అంటుంది. అది సినిమా కథ…. కాని ఇది నిజ జీవితం… నిరాశా… నిస్పృహలతో…. తోడు… నీడా లేకుండా బ్రతుకంటే భయం కలిగినా నా లాంటి విడోని కనికరించి జీవితం పంచుకోవడానికి ఎంత మంది సహృదయులు ముందుకొస్తారు బావా?” ఆ చివరి మాటలు అంటున్న స్వప్న గొంతు బొంగురు పోయింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here