ప్రేమించే మనసా… ద్వేషించకే!-20

0
8

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి ముమ్మిడి శ్యామలారాణి గారి కలం నుంచి జాలువారిన ‘ప్రేమించే మనసా… ద్వేషించకే!’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]ఆ[/dropcap] రోజు ఎంతకీ నిద్ర పట్టలేదు. తన వాడు అనుకున్న సుదర్శన్ ఇలా మారిపోవటానికి కారణం ఎవరు? తనను ఎందుకు తప్పించుకొని తిరుగుతాడు? ఇక తప్పదనట్లు తనతో అవసరమైన వాటికి మాట్లాడటం తప్ప మునుపుటిలా ఎందుకు ప్రేమ, అనురాగాలు చూపెట్టడు? ఇదే తనను, తన మనసును నిత్యం పీడిస్తున్న ప్రశ్నలు. వీటికి సమాధానాలు కావాలి! సుదర్శన్‌ని నిలదీసి అడగాలి… ఆలోచనలతో హాలులో అడుగు పెట్టింది సుజాత.

ఎదురుగుండా వున్న దృశ్యాన్ని చూసి నిశ్చేష్టురాలయింది. కార్డ్స్ ఆడుతున్నారు సుదర్శన్, స్వప్న.

క్రింద తనకి అక్కర్లేదు అని వేసిన కార్డు “సారీ బావా నాకు కావాలి” అని తీసుకోబోయింది.

“స్నప్నా తీయకు, వేసిన కార్డు తీయకూడదు” అని కార్డు తీసుకోబుతున్న స్వప్న చేయిని గట్టిగా పట్టుకున్నాడు.

ముందుకి అడుగు వేయలేక, మరల తన రూంలోనికి వెనక్కి అడుగులు వేయలేక అలాగే వుండిపోయింది.

సుజాతను చూసి తప్పు చేసిన వాడిలా సుదర్శన్ తల వంచుకొని ఆడటం మొదలు పెట్టాడు.

ఒక్క నిముషం ఏం చేయాలో తెలియని దానిలా నిలబడి వెనక్కి పరుగెట్టి మంచం మీద వాలిపోయింది. దుఃఖం పొంగి పొరలింది. అప్పటి వరకు తను సుదర్శన్‌ని అనుమానిస్తున్నదే నిజమనిపించింది. మరు క్షణం కరువు దీరా దిండులో ముఖం దూర్చి ఏడ్చింది. అంతకన్నా తను ఏం చేయగలదు. ఆలోచిస్తున్న సుజాత గట్టిగా ఒక నిర్ణయానికి వచ్చింది. అసలు వాళ్ళ కథ ఎంత వరకు వెళుతుందో చూసి… ప్రేమమూర్తి అనుకున్న అతన్ని  దుయ్యబెట్టి అతను కళ్లు తెరిచేలా చివాట్లు పెట్టి… కాని… కాని…. సుదర్శన్… ప్రేమ అంతా బూటకం అని తెలిసిన మరుక్షణం తను బ్రతకగలదా?

***

ప్రొద్దున్నే లేచి ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లిపోయాడు సుదర్శన్. ఇంత ప్రొద్దున్నే ఇనిస్టిట్యూట్‌కి వెళ్లవలసిన అవసరం ఏమిటో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు.

స్వప్న గబగబా తయారై బయటకు వెళ్లిపోతుంటే… “ఏమే స్వప్నా యింత ప్రొద్దున్నే ఎక్కడికి?” అంది మీనాక్షి.

 ఒక్క క్షణం తల ఎత్తి చూసింది స్వప్న. ముఖంలో ఏదో బాధ కొట్టవచ్చినట్లు కన్పించింది మీనాక్షికి…

‘ఒక వేళ చనిపోయిన మొగుడు గాని గుర్తు వచ్చాడేమో, ఖర్మ, అయినా నిన్నటి వరకు బాగానే వుందే’ అనుకొంది మీనాక్షి.

మీనాక్షి అడిగిన దానికి సమాధానం యివ్వకుండానే చకచకా అడుగులు వేసింది స్వప్న బయటకు.

స్నానం చేసి బాత్‌రూంలోంచి బయటకు వచ్చిన సుజాత అక్కడే అచేతనంగా సుందరి మాటలు వింటూ నిలబడిపోయింది.

బాత్‌రూంని ఆనుకొని చిన్న వరండా వరండాలోంచి వంటగదిలోకి దారి ఉంది… సుజాతను చూడకుండానే వంటింటి గుమ్మం దగ్గర నిలబడి వంటింటిలో వంట చేస్తున్న తల్లితో చెబుతుంది సుందరి.

“అమ్మా! స్వప్న నీకేం సమాధానం చెబుతుంది… పాపం దాని మనసు బాగుండ లేదు. నేను చెబితే వాడికి పెళ్లాం అంటే తగని యిష్టమే అన్నావే! ఇష్టం లేదు, పాడు లేదు. తెల్లగా వుంది కదూ దాని వల్లో పడ్డాడు. అసలు స్వప్న అంటే భలే ఇష్టం వాడికి. అర్ధరాత్రి బెదిరిపోయి వచ్చి నా ప్రక్కలో పడుకుంది… గుచ్చి గుచ్చి అడిగితే బావ యింత పని చేస్తాడనుకోలేదు… నేను సుజాతక్క వస్తుంది అంటే గాని నన్ను వదలి పెట్టాడు. లేకపోతే ఘోరం జరిగిపోయేది.” అని  గొల్లున ఏడ్చింది.

“పాపం దాని భయం ఆవిడగారు ఎక్కడ వస్తుందో అని… దానికి పాపం వీడి మీద వుంది కాని… ఆవిడగారు తనను బావ పెళ్లి చేసుకోంటానికి ఒప్పుకుంటుందో? లేదో? అని….” అని గొప్ప నిజాన్ని తెలుసుకునట్లు విప్పారిన నేత్రాలతో చెబుతుంది సుందరి.

 “నిజం…. నేను అంత దాక వస్తాడనుకోలేదు. అయితే వాడు రాని అడిగేస్తాను… మనసు వుంటే చెప్పు బాబూ! స్వప్నతో పెళ్లి దగ్గర వుండి జరిపిస్తాను… ఇది గొప్పింటి బిడ్డయితే ఎవరికి కావాలి? ఏం చేసినా దాని అమ్మా, బాబూ రారు. ఇది నోరు చించుకుని అరచినా పలికే నాథుడు లేడు” అంది మీనాక్షి.

వాళ్లిద్దరి మాటలు వింటున్న సుజాత ఎలా వచ్చిందో గదిలోకి వచ్చి మంచం మీద వాలిపోయింది.

తను ఇంకా బ్రతికే వుందా? ఎవరి కోసం తను యింకా బ్రతికి వుంది? ఇంత భయంకరమైన నిజం తెలిసి కూడా! వెధవ ప్రాణం పోదేం! ఆ సమయంలో చెల్లెలు సమత గుర్తు వచ్చింది.

‘చెల్లీ! పొరపడ్డావు చెల్లీ! ఈ కాలంలో ప్రేమకు పవిత్రత లేదు…  ప్రేమకు విలువ లేదు… ప్రేమించిన రెండు హృదయాలు దగ్గర కావటం అంత సుకృతం మరొకటి లేదన్నావా? సృష్టిలో తీయనిది ప్రేమన్నావే! అవన్నీ  మారుతున్న కాలంలో మారే మనుషులకు కాదు… ఆనాడు… లైలా మజ్ను… షాజహాన్ ముంతాజ్… ప్రేమలు చరిత్రలో వ్రాయటానికే నిదర్శనంగా నిలిచాయి. ఈనాడు నిన్ను ప్రేమించిన వాడు పారిపోయాడని, నన్ను ప్రేమించినవాడు మోసం చేసాడని… చెప్పుకోటానికే ఈ ప్రేమ మిగిలింది సమతా!’  అని పిచ్చిదానిలా తల కొట్టుకోసాగింది.

***

“ఏం బాబు ఎన్నాళ్లు ఈ నరకం అనుభవిస్తావు? మనసులో బాధపడుతున్నా కడుపులో దిగమింగుకున్నాను. ఆడదానిని అయివుండి అనుకూడదు కాని… ఇక ఆవిడ కన్నాక ఎన్నాళ్లు దాంపత్య జీవితానికి పనికి రాదని డాక్టరమ్మ చెబుతుందో? ఎన్నాళ్లని ఉండగలవు సుదర్మన్. అయినా పిచ్చి పిల్ల స్వప్న చిన్నతనం నుంచి మనసు పెట్టుకుంది… నువ్వు… తెలివితక్కువగా ఆవిడగార్ని తీసుకొచ్చావ్!… పాపం… స్వప్న… మనసులో ఏం పెట్టుకొనే లేదు…నోరు తెరచి చెప్పింది…. రాత్రి ఈ విషయం. పిచ్చి పిల్ల భయపడుతుంది… ఆ మూడు ముళ్లు యింట్లోనే దేవుడి దగ్గర వేస్తే సరిపోతుంది. సుజాతకు ఏం అడ్డు రాదు. ఎవరి మటకు వాళ్లు ఉంటారు. ఏం సుదర్శన్, ఏం చెప్పను బాబు స్వప్నతో” అని లాలనగా అడిగింది మీనాక్షి.

స్వప్న చెప్పిందా?  కొంపదీసి సుజాతకు గాని తెలిసిపోలేదు గదా? తెలిస్తే యింకేమైనా ఉందా? ఎంత కోరికను అణుచుకుందామనుకున్నా అణుచుకోలేకపోయాడు… సుజాత తనతో ముభావంగా వుండటమేగాదు.. తనతో ఎవరో పరాయివాడితో మాట్లాడుతున్నట్లు మాట్లాడుతుంది. రాత్రి… కోరికను అణుచుకోలేక తనకు తెలియకుండానే స్వప్న దగ్గరకెళ్లాడు. స్వప్న ఏడ్చి బ్రతిమిలాడి చివరకు ‘అక్క వస్తుందంటే’గాని తనకు తను చేస్తున్నతప్పు ఏమిటో తెలిసి రాలేదు.

తను… తను… తప్పు పని చేసాడా?  ప్రేమించిన సుజాతకు అన్యాయం చేసాడా? తను… అనుభవిస్తున్న నరకం ముందు ఇదొక పెద్ద తప్పా! శరీరం సుఖం కోరుకున్నపుడు…

“సుదర్శన్…. నువ్వేం ఆవిడకు భయపడకు బాబు, నేను చెప్పి ఒప్పిస్తాను… నీ మాట స్వప్నతో చెబుతాను… చెప్పు సుదర్శన్” అంది.

ఒక్క క్షణం ఏం చెయాలో తెలియని వాడిలా తటపటాయించి “ఆలోచించుకొని చెబుతానమ్మా” అన్న సుదర్శన్ నోటి వెంట మాట రానే లేదు, సుజాత కాళికలా వచ్చి సుదర్శన్ చొక్కా కాలరు పట్టుకొని పిచ్చి దానిలా గుంజుతూ “దుర్మార్గుడా! నీ ప్రేమలో ఇంత మోసం ఉందా? ఏమిట్రా ఆలోచించి చెబుతావ్? సిగ్గు లేదు, ఆ మాట అనటానికి? నీది… నీది… తప్పు లేదు, గోముఖవ్యాఘ్రాన్ని చూసి మోసపోయాను… నేను… నేను… ఎటువంటి కుటుంబంలో పుట్టాను రా? ఎంగిలి కూటికి కక్కుర్తి పడటానికి నీలాంటి కుటుంబంలో పుట్టలేదు.. ఆలోచించి చెబుతావా? నీచుడా? నీ ప్రేమలో పవిత్రత ఉందనుకుని మోసపోయాను… నీ ప్రేమలో కామం, మోసం  వున్నాయని అవివేకంతో తెలుసుకోలేకపోయాను” అని ఆవేశంతో ఊగిపోసాగింది.

“సుజీ సుజీ” అని ఏదో చెప్పాలన్నట్లు తెరిచాడు నోరు.

“ఛీ… ఛీ… ఇంకా నువ్వు ఆ పేరు పెట్టుకుని ఎందుకు పిలుస్తున్నావ్? మోసగాడివి. దుర్మార్గుడివి. నీ ముఖం చూడటమే పాపం” అని రయ్‌మని గదిలోకి పరుగెత్తింది సుజాత.

గదిలోకి వచ్చి పిచ్చిదానిలా గది నలుమూలలు చూసింది. తను… తను… ఎందుకు వచ్చింది తను ఇక్కడకు… తన తాలుకా ఇక్కడ ఏమైనా ఉన్నయా? ప్ఛ్!… ఇన్నాళ్లు తనకీ ఇంట్లో తన స్వంతం అనుకున్నది ఉన్నది ఒకటే అనుకుంది. అది సుదర్శన్!

ఇప్పుడు లేదు అన్న ఆ తలపు రాగానే దుఃఖం ఆగలేదు.

ఏడుస్తున్న సుజాత, చటుక్కున తల ఎత్తి చూసింది. కళ్లల్లో నీళ్లు తుడుచుకొని – ఛీ… ఛీ…  తను యింకా ఇక్కడే నిలబడి వుందేమిటి? ఒక్క క్షణం తను యిక్కడ ఉండకూడదనుకొని గబగబా అడుగులు వేస్తున్నదల్లా… మంచం మీద సర్వేశ్వరరావు ఇచ్చిన కథల పుస్తకం పెన్ను కనబడ్డాయి. తను నవల చదవటం పూర్తి చేసి అలానే మంచం మీద పెట్టింది రాత్రి… కథలన్నిటి కన్నా నవల బాగా వ్రాయగలిగాడు… కాని… ఆ నవలకు తగ్గ పేరు అనిపించలేదు. ‘మనుషులు… మనస్తత్వాలు’ అని పేరు పెట్టాడు. పేరంటే బాగోలేదనిపిచింది గాని తీరా ఆ నవలకు తగ్గ పేరు తను వ్రాయాలనుకునేటప్పటికి ఏ పేరు పెట్టాలో తెలియలేదు… కాని ఇపుడు చివరి క్షణంలో యింటి నుండి అడుగు బయట పెట్టేలోగా ఆ నవలకు ఏ పేరు పెట్టాలో తెలిసింది. పెన్ను తీసుకొని పుస్తకం తెరచి ‘అంతరంగాలు’ అని వ్రాసి చకచకా అడుగులు వేసింది.

ఎదురుగుండా తలుపుకి అడ్డం నిలబడి వున్న సుదర్శన్‌ని చూసి “లే… నేను… ఒక్క నిముషం ఇక్కడ ఉండలేను… నన్ను వెళ్లిపోనియ్! జీవితంలో నీ ముఖం నాకు చూపించకు” అని అడుగులు వేసింది. తలుపు దగ్గర నిలబడి వెళ్లడానికి వీల్లేదు అన్నట్లు చెయ్యి అడ్డంగా వుంచి…  “సుజీ…. ప్లీజ్…” అని నోరు తెరచి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్న సుదర్శన్ వైపు కోరగా చూసి… “నువ్వేం నాకు చెప్పొద్దు!… నా దారికి అడ్డంగా నిలిచావో… నిన్ను” అని టేబులు మీద పళ్లు కోయటానికి వుంచిన చాకు తీసి… “దీనితో పొడిచి చంపేస్తాను…. నిన్ను ప్రేమించినందుకు నేను పొడుచుకు చస్తాను…. ఆ అవసరం లేకుండా నాకు త్రోవ ఇవ్వు!” అని కోపంగా పిచ్చిదానిలా చూస్తున్న సుజాతను చూసి గుండెలు బాదుకోసాగింది మీనాక్షి.

“అమ్మో! అమ్మో!” అని “అమ్మో! రాక్షసి, నా కొడుకుని చంపేస్తుంది… వెళ్లనీయరా… యింకా దాన్ని పట్టుకొని వేలాడ్డానికి చూస్తావేమిటి” అంది.

ఎత్తిన కత్తిని రయ్‌మని క్రిందకు విసరి “నీ కొడుకుని ముట్టుకుంటే పాపం” అని గబగబా అడుగులు హాలులోకి వేసింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here