ప్రేమించే మనసా… ద్వేషించకే!-25

0
9

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి ముమ్మిడి శ్యామలారాణి గారి కలం నుంచి జాలువారిన ‘ప్రేమించే మనసా… ద్వేషించకే!’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“లే[/dropcap]దు… సుధీర్ నువ్వు… నువ్వు… ఉత్తముడివి… నేను పెట్టిన పరీక్షలలో గెలిచావ్! కాని… నేను… ఓడిపోయాను.” అని పిచ్చిదానిలా ఏడ్వసాగింది.

“ఏమైంది సునీతా! నాకు చెప్పవూ! నువ్విలా బాధపడితే నేను చూడలేను…. అయినా నువ్వు ఓడిపోవడమేమిటి?” ఆశ్చర్యంగా అన్నాడు.

“ఏం చెప్పను సుధీర్! నేను చెప్పేది వింటే నన్ను పురుగుని చూసినట్లు చూస్తావు. నేను… నేను… నువ్వు నా పరీక్షలలో ఓడిపోతావు అనుకున్నానుగాని… నేను ఇక్కడికి వచ్చినాక… ఇక్కడ… ఈ యింట్లో నేను అనుభవిస్తున్న నరకం చూసినాక… నేను ఎంత తొందరపడి వెధవ నిర్ణయం తీసుకున్నానో తెలిసింది. నా కళ్లకు ఉన్న ప్రేమపొరలు తొలగిపోయాయి. నువ్వు ఆఫీసుకెళ్లినాక నేను రోజు ఈ సమస్యను ఎంత తేల్చుకుందామన్నా తేల్చుకోలేక ఎంత సతమతం అవుతున్నానో ఆ భగవంతుడికే తెలియాలి. ఎంత మనసు సమాధాన పరచుకుందామన్నా సమాధానపటం లేదు… ఇది ఇల్లు కాదు… డంజన్.. ‘ఎ.సి. రూంలో డన్‍లప్ పరుపు మీద పడుకునే నేను… ఈ పట్టి మంచం మీద పడుకునే గతి పట్టిందా?’ అని నాలో నేనే యిన్నాళ్లు ఎంత కుమిలిపోతున్నానో ఆ భగవంతుడికే తెలియాలి! ఒక ప్రక్కన నిన్ను వదలుకోవాలంటే మనసు ఒప్పుకోవటం లేదు… మరో ప్రక్క ఈ నరకం అనుభవించాలంటే చాలా భయంగా ఉంది. వెధవ మనసు ఎంత సమాధాన పరచుకుందామన్నా!… అవుట్‌హోస్ పాటి కూడా లేని ఈ ఇంట్లో బ్రతుకు పంచుకోలేననిపిస్తుంది. అంతే కాదు సుధీర్, ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు నన్ను నిలవనీయటం లేదు. చాలీ చాలని జీతంతో ఏ కోరికలు తీరకుండానే పిల్లలను కని, ప్రతి దానికి చూసుకొని ఖర్చు పెడుతూ కోరికలను సమాధి చేసుకుంటూ నరకంలాంటి ఈ యింట్లో సంసారం చేయటం తలచుకుంటేనే నా తల తిరిగిపోతోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మా మమ్మీ అన్న మాటలు నిజాలే అనిపిస్తుంది… అందుకే… నిన్ను… ఇంకా బాధపెట్టడం యిష్టం లేక ఇంకొద్ది రోజులు మనం అనుకున్న ప్రకారము గడువుకి టైము వున్నా ఇపుడే చెప్పేస్తున్నాను…. నన్ను… నన్ను… మరచిపో సుధీర్! నేను మా మమ్మీ దగ్గరకు వెళ్లి, ఆవిడ చెప్పినట్లే వినాలని నిశ్చయించుకున్నాను. మనసులు కలిశాయని ఈ నరకం అనుభవించే కన్నా… మనసులు కలవకపోయినా… ఆ సౌఖ్యాల మధ్య ఎలాగైనా బ్రతకవచ్చు” అని చెబుతున్న సునీత చెంపలు రెండు కందిపోయి వాచిపోయేలా వాయగొట్టి ఆవేశంతో గట్టిగా అరిచాడు.

“ఛీ! నువ్వు ఆడదానివేనా? నీ గొప్పింటి బుద్ది భలేగా వుంది! నన్ను ప్రేమించావ్! నా ఇల్లుని… నాది అనుకున్న ప్రతిదీ నీకు ప్రియమే అవుతుంది అనుకున్నాను. నా అంచనాలు తారుమారు చేసావ్! ఈ యింట్లో వుండలేవా? ఈ నరకం అనుభవించలేవా? పిల్లలను కంటూ ఈ బందిఖానాలో బ్రతకలేవా?… శభాష్, ప్రేమకు క్రొత్త నిర్వచనం పలికావ్! ప్రేమ పరీక్షలంటూ నిశ్చలమైన మనసు లేని నువ్వు బోడి షరతులు పెట్టావా? అసలు నీది ప్రేమ అనుకొని నేను పొరపాటు పడడం నేను చేసిన పెద్ద తప్పు! నీలాంటి నేచర్ గల ఆడవాళ్లకి ఇదో రకమైన సరదా! కొన్నాళ్లు ఎవరో ఒక పురుషుడి వెంటపడి ప్రేమించాననటం, ప్రేమంటూ వెధవ కబుర్లు చెప్పడం!”

“మన ప్రేమ పవిత్రమైనదని, మనలాంటి ప్రేమికులకు నిదర్శంగా నిలబడదాం అని వెధవ కబుర్లు నోటికి ఎలా వస్తే అలా వాగావు! ఏమని చెప్పమంటావ్? ఆడ జాతికే నీలాంటి ఆడది ఉండటం అవమానం. ఎవడినో… గొప్పింటి వాడిని, ఎ.సి బంగ్లా వున్న వాడిని… చూసి ప్రేమించలేకపోయావా? నన్ను, నా లాంటి పేదవాడిలో లేనిపోని ఆశలు రేపి, నా మనసును ముక్కలు ముక్కలు చేసే హక్కు నీకెవరిచ్చారు?” అని పిచ్చివాడిలా గట్టిగా అరిచాడు సుధీర్.

ఏడుస్తున్న సునీత కళ్లు తుడుచుకొని “నువ్వు ఏమన్నా సరే ఫర్వాలేదు… నీతో ప్రేమ అంటూ నీ దరి చేరినందుకు బాధపడుతున్నాను. ముందుచూపు లేక ఈ నరకంలో అడుగుపెట్టాను. ఆలోచించిన కొలది నేను ఎంత పొరపాటు చేసానో అర్థం అయింది. క్షమించు సుధీర్!…. నన్ను వెళ్లనీయ్!” అంది.

గంభీరంగా పిచ్చివాడిలా పగలబడి నవ్వాడు “ఎంత సులువుగా క్షమించమని అంటున్నావ్ సునీత! నేనే యీ మాట అన్నాననుకో నీ మనసు ఎంత బాధపడి వుండేది? ఆలోచించు!… ఓహ్ నీకు మనసే లేదు కదూ! నీకేం అర్థం అవుతుంది? నీ మనసు స్థానంలో లక్షలు… ఎ.సి. రూములు… లక్షాధికారి పెళ్లి కొడుకు… నిండివున్నాయి కదూ! కాని… నీ వలన ఒకటే తెలిసింది! అనాది నుండి పురుషుని వలనే స్త్రీ మోసపోయింది అంటున్నారు. కాని నీ లాంటి స్త్రీ ఎంత మంది మగవాళ్లనయినా మోసం చేయగలదని తెలిసింది” అని అవేశంతో ఊగిపోతున్న సుధీర్ వైపు ఒక్క క్షణం చూసి వెళ్లాలన్నట్లు లేచి నిలబడింది.

“సునీతా! నువ్వు వెళ్లిపోతున్నావ్! కదూ? ఎంత తేలికగా ప్రేమ బంధాన్ని త్రెంచుకోగలిగావ్! యిన్నాళ్లు నీ బాహ్య రూపం చూసి దేవతవు అనుకున్నాను. కాని నీ అంతరంగం యిన్నాళ్లకు బయటపడింది. అసలు మీలాంటి గొప్పవాళ్లకి మనషులతో ఆడుకోవటం అలవాటు. కాని నువ్వు ప్రేమంటే ఏమిటో తెలియని నీలాంటి మనసున్న మనిషితో ఆడుకుంటే సరిపోయేది. నా గుండె ప్రేమ తప్ప అష్టఐశ్వర్యాలకు… నీలా ఎవరో ఒకరు అని భాగస్వామిని వివాహం చేసుకోడానికి అంగీకరించదు. నీ ప్రేమతో పులకరించి, స్పందిస్తున్న నా మనసుకి ఏం సమాధానం చెప్పను? నీలా చపలతత్తుడిని కాను. సూర్యడు నిప్పులు చెలరేగుతున్నట్లు నాకు మనసు మండిపోతుంది. నేను మనసారా ప్రేమించిన ఆడదాని నోటి వెంట నా ప్రేమ అక్కర్లేదు అన్నా నేనింకా ఎలా నిలద్రొక్కగలిగాను? నా మనసు మాత్రం ఈ భయంకరమైన నిజాన్ని భరించలేదనట్లుంది” అని ఆవేశంతో శరీరం ఊగిపోతుంటే రెండు చేతుల మధ్య ముఖం దాచుకొని రోదించసాగాడు.

“సుధీర్… సారీ! నన్ను నీవు ఏమనుకున్నా నీ యిష్టం! నువ్వు నమ్మలేవు!… నేను మంచి చెడు ఆలోచించకుండా చేసిన పనికి కుమిలిపోతున్నా… అందుకే సారీ కూడా చెబుతున్నాను. వెళుతున్నాను సుధీర్” అని రెండడుగులు వేయబోయింది.

“సునీతా! ఒక్క నిముషం ఆగు! నువ్వన్నట్లు మనం ఫ్రెండ్స్! కాబట్టి నా కోసం ఒక చిన్న సహాయం చేయిగలవా? ఓన్లీ ఫ్రెండ్స్, నువ్వన్నట్లే” అని బేలగా… జాలిగా అడుగుతున్న సుధీర్ వైపు చూసి… తప్పు చేసిన దానిలా తలదించుకొని “చెప్పు సుధీర్” అంది.

“నా కోసం ఈ ఒక్క రోజు ఆగిపో… ప్లీజ్… ఆ తరువాత నిన్నేం కోరను… అంతే కాదు… నీ బంగారు భవిష్యత్తుకి అడ్డు రాను. ఇన్నాళ్లు మన ప్రేమకు అఫ్‌కోర్సు నీకు కాదనుకో, నా ప్రేమకు… చివరి సారిగా వీడ్కోలు ఇస్తూ ఈ ఒక్క రోజు నీతో గడపాలని నా మనసు కోరుతుంది” అన్నాడు.

సుధీర్ అంటున్నది అర్థంకాక ఆశ్చర్యంగా చూసింది సునీత. “అలా భయపడిపోతున్నవేం సునీతా! యించుమించు మూడు నెలలు నాతో కలసి వున్నావు. నువ్వు హాయిగా నిశ్చింతగా పడుకున్నా నేను నిద్ర లేని రాత్రుళ్లు ఎన్ని అనుభవించానో నీకేం తెలుసు? అలాంటి ఈ ఒక్క రోజుకి భయపడిపోతున్నవా? ప్లీజ్ సునీతా! ఎలాగు వెళ్లిపోతున్నావ్! చివరిసారిగా నా కోసం వుండవూ?” అని ప్రాధేయ పూర్వకంగా అడిగి సమాధానం కోసం చూడకుండానే గబగబా అడుగులు వేసినాడు.

విసురుగా వెళ్లిపోతున్న సుదీర్ వైపు ఎందుకు వెళుతున్నాడో, ఏమిటో, అర్థం కాక చూడసాగింది. మరుక్షణంలోనే సునీత పెదవులపై చిన్న నవ్వు మెరిసింది.

‘పిచ్చి సుధీర్… ఇక నిన్ను బాధకు గురిచేయను. నేను పెట్టిన ప్రేమ పరీక్షలో నెగ్గావ్! ఇంకా నిన్ను బాధపెట్టటం యిష్టం లేక చివరిసారిగా నేను… నీ ప్రేమను కాదని వెళ్లిపోతే నీ మనసు ఎలా ఉంటుందో దాని పర్యవసానం ఏమిటో తెలుసుకోవాలని అన్నాను… ఈ రోజున నీ మనసులో నా స్థానం ఏమిటో తెలుసుకున్నాను. నీ అంతరంగం యింత పవిత్రమైనదని… దానిలో ప్రేమకు అనురాగాలకు తప్ప మరి దేనికి చోటు లేదని తెలిసి గర్వపడుతున్నాను’ అనుకొని… ‘మమ్మీ… సుధీర్ గెలిచాడు, డాడీలా ఓడిపోలేదు. నువ్వు దీవిస్తే మేం ఒకటి అవుతాం మమ్మీ!’ అని మనసులోనే అనుకుంది.

క్షణాలు… నిమిషాలు… అర్ధగంట… గంట…సమయం దొర్లుతూనే ఉంది.

ఒక్కసారి సునీతలో కంగారు, భయం చోటు చేసుకున్నాయ్! అసలే దుడుకు స్వభావం సుధీర్‌ది. ఎక్కడికి వెళ్లాడు? ఏం చేస్తున్నాడు? భయంతో సునీత శరీరం కంపించసాగింది.

ఏ రోజుకా రోజు యిక్కడ జరుగుతున్న సంగతులు – సుధీర్ తన పట్ల చూపుతున్న ప్రేమ… అనురాగాలు… అన్నీ సుజాతకు ఎప్పటికప్పుడు టెలిఫోను బూతు నుండి ఫోను చేసి చెబుతుంది. నిన్ననే చెప్పింది ఫోను చేసి… ‘మమ్మీ రేపు నేను మా ప్రేమకు చివరి పరీక్ష పెడుతున్నాను. దీనికి సుధీర్ నుండి సమాధానం ఏం వస్తుందో చూడాలి. సుధీర్ సమాధానం బట్టి నా వివాహం అతనితో జరిగేది లేనిది తెలుస్తుంది మమ్మీ’ అంది.

మనసారా దీవించింది మమ్మీ!

‘పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి అబ్బాయి మనసు పాడు చేయకు’ అని కూడా మందలించింది. ‘అల్లుడు కాకుండానే సుధీర్ మీద అభిమానం చూపెడుతుంది మమ్మీ! మమ్మీ అన్నట్లు తను టూమచ్‌గా ప్రవర్తించిందా? పొరపాటు చేసిందా? ఏమో!’ అనుకొని కీడు శంకింస్తున్న మనసుతో చేతి నున్న వాచి వైపు చూసింది.

సుధీర్ వెళ్లి రెండు గంటలు కావస్తోంది!

మైగాడ్ అని తల పట్టుకొని… గబగబా పరుగెత్తి ఎదురింటికి వెళ్లి అక్కడ నుండి సుజాతకు ఫోను చేసి అర్టెంటుగా రమ్మని చెప్పి గాభరాగా యింట్లోకి వచ్చింది సునీత!

మంచం మీద అడ్డంగా పడుకుని వున్నాడు సుధీర్.

“సునీతా! ఈ ఒక్క రోజే, కాదు!… ఈ ఒక్క సారే కొన్ని క్షణాలు నీ ఒడిలో పడుకోనియ్యవు. ప్రేమికుడిగా కొద్ది క్షణాలు నీ ఒడిలో పడుకొనిచ్చి నా మనసుని ఆనందపరచవూ? నిన్ను… నిన్ను… నేనేం చెయను… నాది ఒకే ఒక్క కోరిక… నీ ఒడిలో నా ప్రాణాలు” మాట్లాడుతూనే కళ్లు మూసాడు సుదీర్.

“సుధీర్… సుధీర్… సుధీర్…” అంటూ పిచ్చిదానిలా గట్టిగా అరిచి.. రెండు చేతుల మధ్య ముఖం దాచుకుని ఏడుస్తూ “ఎంత పని చేసావ్ సుధీర్… నీ ప్రేమ నిజమో! కాదో! తెలుసుకోవాలని పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి నీ మనసు కష్ట పెట్టాను…. ఇపుడేం చేయను… నువ్వు లేకుండా నేను బ్రతకలేను సుధీర్” అంది సునీత.

అంతలో వీధిలో కారు ఆగడం, కారులోంచి సుజాత దిగటం ఒకేసారి జరిగాయి.

గదిలోకి వచ్చింది సుజాత.

“మమ్మీ జరగకూడనిదే జరిగింది. సుధీర్‌ని నేను వివాహం చేసుకోను అన్నది నిజం అనుకొని స్లీపింగ్ టాబ్లెట్స్ మింగినట్టున్నాడు. ‘చివరి క్షణాల్లో నీ ఒడిలో పడుకోనియ్’ అని కళ్లు మూసుకున్నాడు. ఎంత పిలిచినా పలకటం లేదు.” అంటూ చిన్న పిల్లలు గొల్లున ఏడ్వసాగింది సునీత….

సునీత మాటలు విని సుజాత నిశ్చేష్టురాలయింది.

“కంగారు పడకమ్మా ముందు అబ్బాయిని హస్పటల్‌కి తీసుకెళ్లాలి” గాభరాగా అంది సుజాత.

కారులో సుధీర్‌ని డ్రైవరు సహాయంతో పడుకోబెట్టారు. కారు వెళ్లి హాస్పటల్ ముందు ఆగింది.

***

“సుధీర్ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయనని మాట ఇవ్వు” అని చేయి ముందుకు చాచింది సునీత.

చిన్నగా నవ్వాడు సుధీర్.

“ముందు నువ్వే నాకు మాట యివ్వు! ఇంకెప్పుడు యిలాంటి పిచ్చి పరీక్షలు పెట్టి నన్ను హడలగొట్టను అని” అన్నాడు.

“చూడు మమ్మీ” అని సుధీర్ మీద ఫిర్యాదు చేసింది సుజాతకు.

“బాబు చెప్పింది కరెక్టు! నువ్వే ముందు మాట యివ్వు!” అంది సుజాత నవ్వుతూ.

సునీతను ఏడిపించాలన్నట్లు రెండు భుజాలు ఎగురవేసి చిన్నగా నవ్వుతూ “థాంక్యూ ఆంటీ… థాంక్యూ వెరీమచ్” అన్నాడు సుధీర్.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here