ప్రేమించే మనసా… ద్వేషించకే!-6

0
10

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి ముమ్ముడి శ్యామలారాణి గారి కలం నుంచి జాలువారిన ‘ప్రేమించే మనసా… ద్వేషించకే!’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]తె[/dropcap]ల్లని కాటన్ చీర మీద చిన్న చిన్న పువ్వులున్న చీర కట్టుకొని తెల్ల జాకెట్టు వేసుకుని అల్లి బిల్లిగా ఉన్న జడ, అలసిసొలసి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు… సూటిగా చూసే కళ్లు మాటి మాటికి ముడి పెడుతున్న కనుబొమల మధ్యన ఎర్రని సిందూరం ఆడదానికి సమాజం ఎపుడు హద్దు అనే గీత విధించింది అన్నట్లు, రెండు కళ్లకి క్రింద కాటుక గీత… మునుపు సుజాతలాగా కాకుండా ఎవరో క్రొత్త వ్యక్తిలా కనబడుతున్న సుజాతను “సుజీ! ఏమిటి అదోలా వున్నవ్!  నీకు ఎన్ని సార్లు ఫోను చేసినా ఎవరూ అందుకోక నువ్వు ఎక్కడికి వెళ్లావో ఏమైపోయావో తెలియక ఎంత నరకం అనుభవించానో తెలుసా? నీకిది న్యాయంగా వుందా?  చెప్పా చేయకుండా వెళితే వెళ్లావు… ఇపుడొచ్చినా నీ కళ్లు ఎప్పటిలా నా కోసం చూడవేం? అంత దీర్ఘ ఆలోచనలతో వెళ్లి పోతున్నావేగాని నేను నీ కూడా వస్తున్న పట్టేంచుకోవేం?” అన్నాడు బాధగా.

తెల్లబోయిన దానిలా ఒక్క నిముషం సుదర్శన్ వైపు చూసి “ఏమిటి మీరన్నది. ఎవరినో పట్టుకొని చూసుకోకుండా మీరిలా మాట్లాడటం బాగుండలేదు. సరిగ్గా చూసుకొని మాట్లాడటం నేర్చుకుంటే….” అని తల దించుకొని… రెండు అడుగులు వేసిందో లేదో… “సుజీ… సుజీ… నువ్వు… నువ్వేనా!” అని స్పృహ కోల్పోయాడు.

సుదర్శన్ పడిపోవటం చూసి కెవ్వున అరచింది సుజాత. సుజాత అరుపులకి చుట్టు ప్రక్కలున్న విద్యార్థులందరూ పరుగున వచ్చారు. కొందరు నీళ్లు తేవటానికి క్యాంటిన్ వైపు పరుగెత్తారు. మరి కొందరు సుదర్శన్ ఫ్రండ్స్ ఒడిలో పెట్టుకొని సపర్యలు చేయసాగారు. కొంతమంది అమ్మయిలు విషయం ఏమిటో అర్థం కాక సుదర్శన్ వైపు చూడసాగారు. అమ్మాయిల్లో సుజాత క్లాస్‌మేట్ “అసలు ఏం జరిగింది సుజాత” అని అంది.

“అతను… అతను… అసందర్భంగా నన్ను ఎవరో అని కూడా చూడకుండా ఏవో ప్రేమ కబుర్లు వల్లించబోయాడు. నేను… ‘సరిగా చూసుకొని మాట్లాడటం నేర్చుకో! నేను ఎవరనుకున్నావే!’ అన్నాను. అంతే స్పృహ తప్పిపడిపోయాడు” అంది సుజాత.

అక్కడ వున్న వాళ్లంతా ఒక్కసారి తల ఎత్తి చూసి ఆశ్చర్యంతో గుడ్లు తెల్లపెట్టారు.

అక్కడ వున్న వాళ్లందరికి సుజాత, సుదర్శన్‌ల ప్రేమ వ్యవహారం తెలుసు. అంతే కాదు ఒకరిని చూడకుండా ఒకరు వుండలేరని తెలుసు. కొంతమంది వీళ్ల ప్రేమ కథ కూడా అందరి ప్రేమ కథల్లాగే అవుతుందని, శ్రీమంతుల బిడ్డ అయిన సుజాతను తండ్రి మెడలు వంచి అతను అనుకున్న మనిషితోనే వివాహం చేస్తాడని…. ఒకరితో ఒకరు ఎన్నో సార్లు అనుకున్నారు. కాని కొంతమంది సహృదయులు ఇద్దరి ప్రేమ అనురాగాలు చూసి వారి ప్రేమ ఫలించాలని… ఇద్దరు ఒకటి కావాలని కూడా కోరుకున్నారు. కాని జరిగిందేమిటి? కథ అడ్డం తిరిగిందేమిటి? సడన్‌గా సుజాత కేం బుద్ధి? నువ్వెవరో అని ఏమి తెలియనట్లు అడుగుతుందా? హవ్వ… ఎంత ఘోరం?… అని ఎవరికి వారే మనసులో అనుకుంటున్నారు. గాని సుజాత బెస్ట్ ఫ్రెండ్సు మాత్రం “నీకిదేం బుద్దే? ఛీ!… ఛీ!… నువ్వు శ్రీమంతురాలివైన అందరిలా అహంతో విర్రవీగవని… నీ మనసు వెన్నలాంటిదని… నువ్వు కోరుకున్న వ్యక్తి ఉత్తముడు… అలాంటి మనిషిని కోరుకున్న నీ మనసుకు మేము మా హృదయాల్లోనే జోహార్లపించుకున్నాము! కాని… నువ్వు నీ తండ్రి మాటకు ఎదురు చెప్పలేకపోతే నీవు మరో విధంగా అతనితో చెప్పాలి అంతే కాని మానవత్వం మరచి…  ప్రేమించిన హృదయం మీద…  అంతలేసి మాట్లాడి… అతని మనసు గాయం చేస్తావా? నీ ప్రేమలో పిరికి… కల్మషం లేవని అతను నమ్మి నిన్ను పిచ్చిగా ఆరాధించి… తన ప్రాణాలయిన ఇవ్వటానికి సిద్ధమైన సమయంలో… అతన్ని నీ మాటలతో చిత్రవధ చేస్తావా?  నీ ప్రేమ ఇటువంటిది అని పాపం అతనేం అనుకుంటాడు? మేము కనీసం కలలోనైనా అనుకోలేదు… అతన్ని క్షమించమని…” అని అంటుండగా…

“నోరు ముయ్యండి!  ఏమిటే మీ వెధవ కబుర్లు?” గట్టు తెంచుకొని ప్రవహించాలనుకుంటున్న నదిలా కన్నులు నిండా నీరు నిండుకుని ఏ నిముషంలోనో కాటుక గీత దాటాలని చూస్తుంది కన్నీరు. అందరిలా జాలిగా సుదర్శన్ వైపు చూస్తున్న సుజాత ముక్కు శిరాలు కోపంతో అదరసాగాయి. అలివేలు, రేణుక అన్న మాటలు లెక్కలేనట్లు తల కొంచెం ఎగరేసి… “అతనికి పిచ్చి పడితే పట్టింది… మీక్కూడా పిచ్చి పట్టిందేమిటి? మీరు ఏమనుకున్నా అది మీ ఖర్మ… నాకు మాత్రం అతను తెలియదు. మీరు అతనిలాగే పొరపడుతున్నారు. కాని నా ఆత్మకు తెలుసు నిజం! ఇంక మీరు నన్ను అపార్థం చేసుకుంటే అది మీ ఖర్మ!” అని చకా చకా అక్కడ నుండి అడుగులు వేయసాగింది.

అందరూ తెల్లమొఖలు వేసారు.

అపుడే కొంచెం స్పృహ వస్తున్న సుదర్శన్ సుజాత మాటలు వినలేనట్లు గట్టిగా కళ్లు మూసుకున్నాడు. ఛీ!… ఛీ!… సుజాత ఇటు వంటిదా? ఆత్మను చంపుకొని బ్రతికే వారుంటారని విన్నాం కాని ప్రత్యక్షంగానే సుజాతను చూస్తున్నాం. ఇంత విచిత్రం ఎక్కడా చూల్లేదు. ప్రేమ వివాహాలకు పెద్దవాళ్లు అడ్డు తగలటం చూసాం కాని ఇలా ప్రేమించిన యువతి నోటి మీదే యింత విచిత్రమైన మాట వినలేదు.

“పాపం చాలా దెబ్బ తీసింది సుదర్శన్ ప్రేమ మీద! వీడు వట్టి ప్రేమ పిచ్చోడు. ఆడదే దెబ్బ తీసినపుడు మగాడి కేంటి? అని మనసును సరిపెట్టుకోలేని అమాయకుడు. ఏది ఏమైనా చాలా అన్యాయం  చేసింది సుజాత. ఆవిడకు మనసు ఎలా అంగీకరించిందో?”

అందరూ అక్కడ ఉన్న వాళ్లు తలో విధంగా అనుకుంటున్నారు.

నడుస్తున్న సుజాత చెవుల్లో వాళ్లు అనుకుంటున్న మాటలు పడుతునే వున్నాయి. వీళ్లందరికి పిచ్చి పట్టిందా ఏమిటి? బుద్ధీ జ్ఞానం వున్న వాళ్లలా మాట్లాడరేం? అయినా ఏవరేమనుకుంటే నాకేం? నా అంతరాత్మకు తెలుసు నిజం అనుకొంది సుజాత.

***

పరీక్షలు మొదలయ్యాయి.

సుజాత తీరు చూస్తున్న ఫ్రెండ్సుకి, చివరకు లెక్చరర్స్‌కి కూడా వింతగా వుంది.

అన్నింటి కన్నా ఆశ్చర్యకరమైన విషయం సుదర్శన్ పరీక్షలు రాయకపోయినా సుజాతలో ఏ మాత్రం బాధ గాని నిరాశ… నిస్పృహలు గాని లేకపోగా… తనకు ఎవరితోను సంబంధం లేనట్లు దర్జాగా, ఠీవిగా వచ్చి పరీక్షలు రాయటం!

విద్యార్థుల దగ్గర నుండి లెక్చరర్స్ దాకా సుజాత జవాబు దొరకని ప్రశ్న అయింది.

ఆ రోజు పరీక్ష రాయటానికి టైం కాకపోవటంతో అందరు విద్యార్థులు చెట్లు క్రింది గడ్డిలోను కూర్చుని పుస్తకాలు చదువుతున్నారు.

“నాన్‌సెన్స్! అంతా ఏక్షన్! మన అందర్ని ఫూల్స్‌ని చేయాలని… ఎవరో కొత్త మనిషిలా ప్రవర్తిస్తోంది. ఇలా నటించటం ఏం బ్రహ్మ విద్య కాదు. ప్రాణాలు సైతం తన కోసం ఇవ్వగలడని తెలిసిన సుదర్శన్ ప్రేమనే తనకు తెలియదు పొమ్మంది. మనమో లెక్కా!” హేళనగా అంది సుజాత ప్రియ మిత్రురాలు అలివేలు!

పుస్తకం చదువుతున్న సుజాత అలివేలు మాటలు విని ఉగ్రరూపం దాల్చింది.

“ఏమిటి నువ్వు మాట్లాడేది? అసలు మీ అందరికి బుద్ధి వుందా అని!.. అసలు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? నేను మాత్రం మీరు ఊహించిన వ్యక్తి లాంటిదానిని కాను. ప్రేమ మనసు ఒకరితో వివాహం వేరొకరితో చేసుకోటానికి. నేను పుట్టింది భరత గడ్డ మీద. నేను సంస్కార హీనురాలిని కాదు. నిజం చెప్పాలంటే మీలా లేనిపోని మాటలు మాట్లాడే మూర్ఖురాలిని కాదు. మీరు నోరు నొప్పిపుట్టే దాక అనుకుంటే అనుకోండి అది మీ ఖర్మ!” అని నుదురు మీదకు దోబూచులాడుతున్న శిరోజాలను చెవి వెనక్కి పెట్టి క్లిప్ పెట్టి వెను తిరగబోయింది.

అచేతనంగా ఉండిపోయారు అక్కడివారు. అలివేలుకి మాత్రం ఎక్కడ లేని కోపం వచ్చింది. “ఏమిటే నీ దబాయింపు? అసలు ఈ రోజు అది వదలగొట్టి తీరుతాను. ఏమిటి పెద్ద పెద్ద కబుర్లు మనసున్న మనిషిలా చెబుతున్నావ్!  ఛీ!… ఛీ!…  మీ డబ్బు వున్న వాళ్ల తత్వమే యింత! నువ్వు ఎంత ఫూల్‌వి కాకపోతే నువ్వు చేసిన మోసం తట్టుకోలేక ఫైనల్ యియర్ పరీక్షలని లేకుండా సుదర్శన్ రాకపోతే కనీసం నీ మనసు కొంచెం అయినా బాధ పడిందా? దర్జాగా తల ఎత్తుకొని సిగ్గు, అభిమానం విడిచి పెట్టి తిరుగుతున్నావు” ఇంకా అలివేలు మాట పూర్తి కానే లేదు, గాలిలోకి లేచింది సుజాత చెయ్యి!

చెంప ఛెళ్లు మంది అలివేలుకి. అందరు సుజాత అలివేలు మీద చేయి చేసుకోవటం చూసి, ఆశ్చర్యపోయారు. అందరి ముందు అవమానంతో అలివేలు ముఖం ఎర్ర బడిపోయింది. కళ్లు నిప్పుకణాల్లా అయ్యాయి.

“పడ్డవాళ్లు ఎప్పుడు చెడ్డవాళ్లు కారే! అధికారం అహంకారం వుంది కదా అని నువ్వు ఏం చేసినా ఏం చెప్పినా చెల్లుతుంది అనుకుంటున్నావా? కాని అది నీ భ్రమ. నీ వెనకాల ఎంతమంది నీ చపల బుద్ధి చూసి నవ్వుకుంటున్నారో, నీచంగా మాట్లాడుకుంటాన్నారో నీకు తెలియటం లేదు. ఒక వేళ తెలిసినా బహుశ నీలాంటి ఆత్మవిశ్వాసం లేని వాళ్లు యిలాంటివి పట్టించుకోరు” అని అలివేలు ఆవేశంగా అంటూ వుండగానే మరోసారి సుజాత చెయ్యి ఎత్తింది.

రేణుక లేచి చేయిని గట్టిగా పట్టుకుంది. కళ్ల వెంట కన్నీళ్లు బిందువులు ముత్యాల్లా జారుతున్నాయి.

“సుజీ! ప్లీజ్! నువ్వు ఎందుకు మారిపోయావో యిలా కనిసం అదైనా చెప్పవే!  నీ కళ్ల ఎదుట చిన్న అల్పజీవికి సహితం అన్యాయం జరిగితే చూసి సహించలేని నువ్వు ఇలా ఎందుకు అధర్మం వైపు నడుస్తున్నావే?”

“ఆగర్భ శ్రీమంతురాలివైన నవ్వు సామాన్యుడిని అందులోను వేరే కులం వాడిని ప్రేమించావు గాని ఇది వివాహం వరకు వెళ్లదు అని నేను మామూలుగా అన్న మాటకి ఆవేశంతో ఊగిపోయి, ‘చూడండి మా పెళ్లికి మీరే పెద్దలు… నేనంత పిరికిదానను కానే! డాడీ పెద్దరికాన్ని నిలుపుకొని వివాహం చేస్తే సరే సరి, లేకపోతే మేం యిద్దరం గుడిలో మ్యారేజీ చేసుకుంటాం’ అన్న నువ్వేనా ఇలా మారిపోయావు? ఇది నీ తప్పా? లేక డాడీ ప్రోద్బలమా?”

“పసివాడు ఒక్క మాతృమూర్తిని చూసి సంతోషంతో కేరింతలు కొడుతూ తల్లి ఒడిని చేరాలని ప్రయత్నించినట్లు నీ ఒక్క సహచర్యంలో తప్ప మరెవ్వరితో మాట మాత్రమైన మాట్లాడటానికి చూడని సుదర్శన్‌; నీ సన్నిధిలో పరిసరాలనే మర్చిపోయి అందంగా మనోహరంగా నవ్వుతూ తన కళ్లలోనే నీ మీద ప్రేమనంతా నింపుకుని మాట్లాడే సుదర్శన్ ప్రేమని ఒక్కసారి తెంచేసి, నువ్వెవరన్నావెందుకు?”

“ప్రేమతో నాటిన చిన్న మొక్క చిగురులు తొడిగి కొమ్మలు, రెమ్మలు వేసి ఏపుగా పెరిగి మొగ్గలు తొడిగి పుష్పించడానికి సిద్ధమవుతున్న సమయంలో ప్రేమతో నాటి, పెంచిన మనిషే ఆ మొక్కను పెకిలించి, మొగ్గలు త్రుంచి కాళ్ల క్రింద నలపాలని చూడటం ప్రకృతిలో దీనిని మించిన అన్యాయం, అక్రమం ఇంకేమైనా వుందా చెప్పు.”

“నో… నో…” అని రెండు చేతులతో చెవులు మూసుకొని “మీరేం మాట్లాడ వద్దు. నేను… నేను… ఇంత అన్యాయమైన మాటలు వినలేను. మీరందరూ అంటున్న దేమిటి?  అతను సుదర్శన్… అతనికి నాకు మధ్య ప్రేమా! నో!… నో!… భరించలేను. మీరందరు కలసి నన్ను ఎందుకు ఇలా అన్యాయంగా పిచ్చి ఎక్కిస్తున్నారు. మీకు నేనేం అన్యాయం చేసాను.” పిచ్చి దానిలా ఆవేశంగా అరిచింది సుజాత.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here