ప్రేమించే మనసా… ద్వేషించకే!-8

0
9

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి ముమ్ముడి శ్యామలారాణి గారి కలం నుంచి జాలువారిన ‘ప్రేమించే మనసా… ద్వేషించకే!’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“సు[/dropcap]జీ! గెటప్! లే. ఏమిటీ పిచ్చి పని! అసలు నిన్ను ఎవరు రమ్మన్నారు. ఒక్క నిముషం కూడా నిలబడటానికి ఉండలేని స్థలంలో జీవితాంతం ఉండాలనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. గెటప్! కమాన్ సుజీ!” గుమ్మందాటి రెండడుగులు వేసి ఇక ముందుకు రావటమే పాపమన్నట్లు నిలబడి వున్న పరమేశ్వరరావుగారి వైపు తల చివ్వున తిప్పి తీక్షణంగా చూసింది.

“ఎక్కడికి డాడీ? మళ్ళీ కాశీ తీసుకెళ్ళి హిప్నాటైజ్ చేయిస్తావా? ప్చ్! ఎంత అమాయకుడివి డాడీ! మీరు యిలా మళ్లీ ఇంకో సారి చేయిస్తే సరిపోదు డాడీ! జీవితాంతం నేను ఆఖరి శ్వాస తీసే వరకు మీరు యిలా చేయుస్తూనే ఉండాలి. దాని వలన మీకు లాభం వుంటే తీసుకెళ్లండి. అంతగా మీకు శ్రమ అనుకుంటే గుక్కెడు విషం యిచ్చి చంపండి… నన్ను… నన్ను…. ఇలా మాటి మాటికి చిత్ర హింసలు చేయకండి” అంది.

“సుజాత! పిచ్చి పిచ్చిగా మాట్లడకుండా లే! త్వరగా బయలుదేరు. హు…” అని గంభీరంగా అన్నారు.

సుజాత పెదవులపై నిర్లిప్తమైన నవ్వు చోటు చేసుకుంది. “మీరంత కష్టపడి నన్ను నా మనసుని మార్చారే! మరి పిచ్చి దానిని కాకపోతే మంచి దానిని ఎలా అవుతాను” అంది.

“నోర్ముయ్. అనవసర ప్రసంగం. త్వరగా లేచి వస్తావా లేదా? నాతో యిపుడు నువ్వు బయలుదేరకపోయినట్లయితే చస్తే యిక నా గుమ్మం తొక్కనివ్వను. అంతే కాదు, నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా యివ్వను” ఆవేశంతో ఊగిపోసాగారు.

“పరమేశ్వరరావుగారు, మీరు చెప్పవలసినది చెప్పేశారు, మరి నన్ను చెప్పనిస్తారా? మీకు లక్షల కొద్ది ఆస్తి వుండవచ్చు, అది చూసి మాత్రం నేను మీ అమ్మాయిని ప్రేమించలేదు. అలా అని చెప్పినా మీరు నమ్మరు అని తెలుసు. కాని నా కర్తవ్యం అని చెబుతున్నాను. మీరు పెద్ద మనసుతో ఆశీర్వదిస్తే సంతోషిస్తాం, అలా చేయని పక్షంలో దయుంచి మీరిక వెళ్లండి… మమ్ములను వేరు చేయకండి… మీరు చేయాలని చూసినా, ఈ జన్మకు మీరిక ఆ పని చేయలేరు. ఎందుకంటే సుజాత యిపుడు నా దగ్గరుంది. మీరెంత ప్రయత్నించినా వేరు చేయాలని, అది మీ నిస్పృహ పెరగడానికి దోహదం అవుతుంది” అని ఆవేశంగా అన్నాడు సుదర్శన్!

“చాల్లే, నీ వెధవ ప్రసంగం! ఇప్పుడు అలాగే లేనిపోని వెధవ కబుర్లు చెబుతావు. తర్వాత ఎవరి కోసం వస్తుందిలే ఆస్తి అని అమ్మాయిని వెళ్ళి తెమ్మంటావు. నీ లాంటి అలగా వాళ్ళకి ఇలాంటివి మామూలే” అన్నారు.

“పరమేశ్వరరావు గారూ” అరిచాడు సుదర్శన్.

“డాడీ… మీరు… మీరు… మాట మీద నిలబడి ఈ వివాహానికి అంగీకరించి మీ చేతుల మీద చేస్తాను అంటే చెప్పండి… వస్తాను… మీ ఆస్తి చిల్లిగవ్వ ఇవ్వద్దు. అలా చేయని పక్షంలో దయుంచి ఇక మీ సుజాత లేదనుకుని మీరు ఇక…..” అంది సుజాత.

“ఛీ! అప్రాచ్యురాలా! నా కడుపున చెడ పుట్టావే! ఛీ!… ఛీ!… నీలాంటి దాంతో ఇంత సేపు మాట్లడటం అనవసరం. వీళ్లు నిన్ను చూసి కాదే, నీ డబ్బు చూసి ప్రేమిస్తున్నారు…. ప్రేమ… గీమ ఆ తర్వాత కనబడవే. అహర్నిశలు శ్రమపడుతున్న నీ తండ్రి కన్నా, మధ్యలో వచ్చినవాడు ఎక్కువైపోయినందుకు నా కన్న హృదయం భలే సంతోషిస్తుంది. చాలా సంతోషం! నన్నడిగితే నీలాంటి కూతురు వల్ల కన్న తండ్రులకు ఒక్క నిజం మాత్రం తెలుస్తుంది. కన్న ప్రేమ…. నీలాంటి కూతుళ్లుకు తల్లి తండ్రుల మీద వాత్సల్యం అన్నీ ఏమి లేవు అన్నీ బూటకం అని! ప్చ్! అవన్నీ అనవసరం! నేడు కాకపోయినా ఏనాడైనా తెలుసుకుంటావ్ ఈ తండ్రి మాటలు… నాకు ఒక్కటే బాధ. ఎంతో నియమం నిష్ఠ గల కుటంబం నేను కన్న కూతుళ్లు మూలంగా అప్రదిష్టపాలయింది అని. అసలు ఆ సమతతో పాటు నువ్వు పోతే నా మనసు ఎంతో సంతోషించేదే కాని యిలా వీడితో….”

“డాడీ” అని బావురుమంది సుజాత.

అప్పటికే పరమేశ్వరరావు గారు వీధి గేటు వరకు వెళ్లిపోయారు.

***

“బాబూ సామానులు నిండుకున్నాయిరా. మీ నాన్నగారు చూస్తే రిటైరై కూర్చున్నారు. నీవా ఉద్యోగం సద్యోగం లేకుండా వున్నావు. ఏదో మీ నాన్నగారు సంపాదిస్తున్నారులే, అయినా యింత మంది ఒక్కడి సంపాదన మీద ఎలా బ్రతుకగలం? నువ్వే చెప్పు” అంది మీనాక్షి.

సున్నితంగా చెబుతున్న ఆ మాటలల్లో అర్థం సుజాతా, తను కూర్చుని తినడమే కదూ! తల్లి అంతర్యం గ్రహించి సుదర్శన్ మనసు అదోలా అయింది.

తల్లిది వింతైన మనసు! నిన్నటి వరకు దర్జాగా దేనికి లోటు లేకున్న ఇల్లు ఇపుడు సుజాత ఒక్కతి ఎక్కువైనాక ఇబ్బంది అవుతుందా? ఇంటి అద్దె పదిహేను వేలు పైనే వస్తుంది. నాన్నగారు రిటైరు అయినా టైపు ఇనిస్టిట్యూట్ పెట్టడం వలన నెలకు మూడు వేలు పైనే సంపాదిస్తున్నారు. డబ్బుతోటిదే లోకం క్రింద బ్రతికే మనిషి, ఇంట్లో అద్దెకు దిగిన ఎవరిని సంవత్సరం కన్నా ఎక్కువ కాలం ఉండనీయదు. సంవత్సరం ఏ ఖర్మ! పట్టుమని ఆరు నెలలు కూడా వుండనీయదు. ఇంట్లో అద్దెకు వచ్చే వాళ్ల దగ్గర రెండు మూడు నెలల అడ్వాన్స్ తక్కువ తీసుకోదు. తీరా వాళ్లు ఇంట్లో దిగిన తర్వాత అదుపు లేని నిబంధనలు పెడుతుంది. వాళ్ళు గోడలు ముట్టుకోకూడదు. మంచాలు గట్టిగా జరుపకూడదు. చీకటి అయిందంటే లైట్లు వేయకుడదు. సెకండ్ షో సినిమాకెళ్ళకూడదు. ఒకటేమిటి నించున్నా, కూర్చున్నా తప్పంటుంది. వాళ్లు పాపం కొన్నాళ్లు ఓర్చుకొని… ఇక ఓర్చుకోలేక… అడ్వాన్సు అడక్కుడానే పరుగెడతారు. తండ్రి, తను ఎంతో ప్రయత్నించారు బుద్ధి మార్చాలని, కాని ప్రయోజనం శూన్యం.

కాఫీ తెచ్చి సుదర్శన్‌కి ఇస్తూ “తీసుకో బాబూ కాఫీ! ఏదో చదువుకున్న వాడివి… పరిస్థితులు అర్థమవుతాయిని చెప్పాను. అక్క పురిటికి ఇక్కడికే వస్తుందా? హాస్పటల్ డాక్టరికయ్యే ఖర్చులు, మందుల ఖర్చులు ఇలాంటివి ఎన్నో వుంటాయి. తొందరగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే కొంచం చేదోడుగా వుంటావని… నీ ఇష్టాలకి వాటికి ఎపుడు కాదనను. లక్ష రూపాయలిస్తాం అన్న మేనరికం కాదన్న నువ్వు….”

అంత వరకు విసుగ్గా వింటున్న తల్లి మాటలు… మేనరికం అనే పదం వినపడే సరికి ఒక్కసారి కోపంతో కండరాలు బిగుసుకుపోయాయి సుదర్శన్‌కి.

“అమ్మా” అన్నాడు కోపంగా.

“ఏమిటిరా బాబూ, మాములు మాటలకే కోపం తెచ్చుకుంటావ్” అని మెల్లగా అక్కడ నుండి జారుకుంది.

బకెటు నిండా ఉతికిన బట్టలు పెట్టుకొని ఆరవేయటానికి వెళుతున్న సుజాత – సుదర్శన్ దీర్ఘాలోచనలల్లో ఉండి, టేబుల్ మీద కాఫీ త్రాగక పోవటం చూసి “ఏమిటండీ కాఫీ త్రాగకుండా ఆలోచనల్లో పడ్డారు” అంది. ఆలోచనల నుండి తేరుకొని ఒక్కసారి సుజాత వైపు చూసాడు. అపుడే విచ్చుకొని అందంగా సున్నితంగా గులాబి వువ్వులా వుండే సుజాత ఎండకు ఒడిలిపోయి, రేకులు నలిగిపోయి వాడిపోయిన గులాబి పువ్వులా కనబడుతున్న సుజాతను చూసేటప్పటికి సుదర్శన్ మనసు బాధతో నిండపోయింది.

ఎలా వుండే సుజాత ఎలా అయిపోయింది?

కారు డ్రైవరు డోరు పట్టుకుంటే కారు దిగి నడిచే సుజాత బట్టలు ఉతకడమా? ఆ ముఖం నిండా చెమట… మనిషి కూడ ఆయాసపడుతుంది. తను… తను… తప్పు చేసాడేమో? లేకపోతే జరిగిందేమిటి? హంసతూలికా తల్పం మీద పెరిగిన రాజకుమార్తె లాంటి సుజాతను ఇలా కష్టపెట్టాడానికి తను వివాహం చేసుకున్నాడు? తన తల్లి మనసు ఎంత పాషాణం. లేకపోతే రాని పనులు సుజాత చేత చేయిస్తుందా? తన తల్లి మనసు తన తండ్రికే యిప్పటి వరకు అర్థం కాలేదు. అసలు సుజాత ఎలా చేస్తుందో? ఏం పెడుతుందో? నిరుద్యోగి అయిన తను ఏ అధికారంతో సుజాతను తనతో భోజనానికి కూర్చోమనగలడు? అసలు మొదటి నుండి యింట్లో మగ వాళ్ల ముందు భోజనం చేయుట అలవాటు….

“ఏమండి? ఏమిటండీ అదోలా వున్నారు” అంది కంగారుగా సుజాత.

“సుజీ! నువ్వెందుకు బట్టలుతికావ్? పని మనిషి ఏమైంది” అన్నాడు.

“మానేసిందండి, అది సరేగాని మీరేంటి అదోలా వున్నారు? వంట్లోగాని బాగుండ లేదా? కాఫీ చల్లారిపోయి వుంటుంది” అంది.

ఏం మాట్లాడాలో తెలియనివాడిలా “నువ్వు త్రాగావా” అన్నాడు.

ఒక్క నిముషం మౌనం వహించి “లేదండి…. త్రాగాను… ప్రొద్దున, యిపుడు కాఫీ ఏమిటండి ముందు మీరు త్రాగండి” అంది.

కాఫీ త్రాగలేదని సుజాత అనడంతో, ఇంట్లో తన చేతకాని తనంకి, కాఫీ కూడా ఇప్పించలేని అసమర్థతకి సిగ్గుతో తల ఎత్తలేకపోయాడు…. సుజీకి కాఫీ త్రాగాలని లేదా?

ఇంటర్‌వెల్లో బోర్నవిటా తీసుకువచ్చే వాడు డ్రైవరు. ఆ బోర్నవిటా కోసం చుట్టు ముట్టేవారు స్నేహితులు. ఇది బోర్నవిటా కాదే అమృతం అనేవారు.

ఇక్కడ కాఫీ తాగటానికి కూడా నోచుకోలేదా? తను… తన వల్లనే, సంపాదన లేకనే కదూ! సుజాత పరిస్థితి ఇంత అధ్వాన్నంగా తయారయింది. తన తల్లికి సుజాత ఎలాంటి యింటి నుండి వచ్చిందో తెలిసి కూడా యింత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తుంది?

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here