ప్రేమించు

3
9

[box type=’note’ fontsize=’16’] లేఖిని సంస్థ నిర్వహించిన 2021 దీపావళి కథల పోటీలలో ఎంపికైన కథ ‘ప్రేమించు’. రచన కోటమర్తి రాధా హిమబిందు. [/box]

[dropcap]”అ[/dropcap]క్కా.. నువ్వు అన్నట్టుగానే సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ తీసుకున్నాం.. వంట మనిషిని, పని మనిషిని మాట్లాడాం.. తమ్ముడు, నేను అమ్మానాన్నని మా ఆఫీస్ టైమింగ్స్ అనుకూలంగా చూసుకుంటాం, టైం టేబుల్ వేసుకుంటాం. ఎల్లుండి మంచి రోజు, పాలు పొంగించడానికి వస్తావా అక్కా” అక్క గంగకు ఫోన్ చేసి అడిగాడు దయాకర్.

“వస్తాను.. ఏమంటున్నారు పెద్ద మరదలు, చిన్న మరదలు”

“మేము ఇద్దరం కలిసి అమ్మా నాన్నకు ఫ్లాట్ కొనడం వాళ్లకు అస్సలు నచ్చలేదు.. మేం వాళ్లను కేర్ చేయటం లేదక్కా.. చిన్నతనం నుండి విద్యాబుద్ధులు నేర్పించి ఎలా బ్రతకాలో తీర్చిదిద్దుతూ ముందుకు నడిపిన కన్నవాళ్లకు మనం ఇచ్చే ప్రతిఫలం ఇదా అనిపిస్తుంది.. వాళ్ళ అమ్మానాన్నలు వాళ్లకు అత్యంత ఇష్టమైనప్పుడు మన అమ్మానాన్న మనకు అంతే కదా.. అమ్మానాన్నను వదిలేసినట్లు మాట్లాడారు.. మేము పెళ్లి బంధం తెంచుకోలేము కాబట్టి మరదళ్ళతో చెప్పాల్సింది చెప్పి ఇలా ప్రవర్తిస్తున్నాం.. మాకు ఇంకో మార్గం లేదు”

“అవునురా”

“ఇదిగో తమ్ముడుతో మాట్లాడు” అంటూ కృపాకర్‌కు మొబైల్ ఇచ్చాడు దయాకర్. మరి కాసేపు మాట్లాడుకున్నారు ముగ్గురూ.

***

కాలగమనంలో మూడు సంవత్సరాలు గడిచిపోయాయి..

రామచంద్రరావుకు వున్న మోకాళ్ళ నొప్పులు, థైరాయిడ్ సీతాదేవికి ఉన్న షుగర్ బిపి ఇంకా ఎక్కువ అయ్యాయి. కొడుకుల సంరక్షణలో గడిచే రోజునిమాత్రం చాలా ఆనందంగానే వెళ్లదీస్తున్నారు వాళ్ళు.

“ఏంటి ఈ గొడ్డు చాకిరీ మీకు.. పిల్లలకు ఎంత దూరం అవుతున్నారో తెలుసా” ఓరోజు దయాకర్‌ని నిలదీసింది పారిజాతం.

“మనందరం కలిసి ఉండటం నీకు ఇష్టం లేదు కదా, నాకు ఇంకో దారి లేదు.. పిల్లలు దూరం అవుతున్నారు అని తల్లిగా నువ్వు అనుకుంటే.. మా అమ్మ కూడా మమ్మల్ని దూరం అయ్యారు అని అనుకుంటుంది కదా అందుకే ఇలా” చాలా సౌమ్యంగా అన్నాడు దయాకర్.

పారిజాతం ఏం మాట్లాడలేకపోయింది.

“ఒక్క మాట పారిజాతం.. రేపు మన పరిస్థితి మా అమ్మానాన్న గడిపే జీవితం కంటే హీనంగా ఉంటుంది, డబ్బు అంతో ఇంతో ఉండొచ్చేమో.. కానీ ఈ ప్రేమ బంధాలు ఉండవు.. నేను తమ్ముడు ఎంతో కొంత ఇలా చూసుకోగలుగుతున్నాం. రేపటి రోజున మా అంత విజ్ఞత మన పిల్లల్లో తమ్ముడు పిల్లల్లో ఖచ్చితంగా ఉండదు.. అమ్మానాన్న గడిపిన రోజుల్ని చూశాము.. వాళ్లు ఆ రోజుల్లో చాలా బాధ్యతలు మోస్తూ ఎంతో కష్టపడ్డారు.. ఇదిగో ఈ రోజుల్ని చూస్తున్నాను.. ముందుతరం రోజులు ఎలా ఉంటాయో ఊహించగలను.. ఎందుకులే ఏది మాట్లాడినా మన మధ్య గొడవలు కొట్లాటలు.. పట్టించుకోకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతే ఇదిగో ఈ మాత్రంగానైనా ప్రశాంతత ఉంటుంది”

“మీ అక్క మీ ఇద్దరికీ బాగానే పాఠాలు నేర్పింది.. పెళ్లయింది, ఒక ఇంటికి వెళ్ళిపోయింది.. అలాంటప్పుడు మన విషయాలు ఆమెకేం సంబంధం?” అరిచినట్లుగా అంది.

“తల్లి తండ్రి తమ్ముళ్ల సంబంధం.. పెళ్లి కాగానే అందరూ నీలా ఉండరు.. మా అక్క లాగా కూడా వుంటారు.. పుట్టింటిపై.. రక్త సంబంధంపై మమకారం పెంచుకుంటారు కొందరు.. ఆ కొందరిలో మా అక్క ఒకతి” అంటూ పారిజాతాన్ని అసహ్యంగా చూసి బయటకు వెళ్ళిపోయాడు దయాకర్.

***

కాలం గడుస్తోంది.. ఓ తెల్లవారుజామున సీతాదేవి నిద్రలోనే హార్ట్ ఎటాక్‌తో చనిపోయింది.. గంగ భర్తతో వచ్చింది. ముగ్గురు గొల్లుమన్నారు. రామచంద్రరావును ఓదార్చడం ఎవరి తరం కాలేదు. పారిజాతం రోజా వచ్చారు, ముభావంగా ఉన్నారు.. ఏదో కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు.

“మేం ఏం చేయాలి?” కర్మకాండలు చేయించడానికి వచ్చిన బ్రాహ్మడ్ని అడిగారు ఇద్దరూ.

“అన్నయ్యా.. వాళ్లతో మాట్లాడు” సీరియస్‌గా అన్నాడు కృపాకర్.

“మీ ఇద్దరూ అలా దూరంగా ఉండండి. మీకు అమ్మని తాకే అర్హత లేదు. ఇవి పవిత్రంగా చేస్తున్న కార్యక్రమాలు. మా అమ్మ చనిపోయింది, స్వర్గానికి వెళ్ళాలని మా తపన.. అందుకే మీరు అడ్డు పడకండి. వచ్చారు, చూశారు, ఇక వెళ్లిపోండి. అయ్యా.. నారాయణగారూ.. ఏదైనా మేము ఇద్దరం చేస్తాం. ఏమైనా కావాలంటే మా అక్కని బావగార్ని అడగండి, అంతే” సీరియస్‌గా అన్నాడు దయాకర్.

కార్యక్రమం ప్రారంభం అయింది. ఇద్దరు కోడళ్ళు భర్తల నిర్ణయంతో అంత దూరంలో ఓ పక్కగా పరాయిగా నిలబడిపోయారు. కానీ ఎంతో సేపు అలా నిలబడలేక పోయారు.. నిలువునా దహించివేస్తున్న అవమానం సెగకి తట్టుకోలేక పోయారు.

“వదినగారూ.. మీ తమ్ముళ్లకు మీరైనా చెప్పండి.. వచ్చిన వాళ్ళు చూస్తున్నారు వాళ్లేం అనుకుంటారు? కోడళ్ళు చేయాల్సిన పనులు కూడా వాళ్లే చేస్తున్నారు.. ఇలా బాగుండదు”

“ఇలా బాగుండదు అని నేను కూడా మీకు చాలా సార్లు చెప్పాలనుకున్నాను.. కానీ చెప్పలేకపోయాను.. అమ్మ వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన రెండు సంవత్సరాలు నరకం చూపించారు.. అమ్మని నాన్నని నేను తీసుకెళ్తాను అని ఎన్నోసార్లు తమ్ముళ్ళను బ్రతిమాలాను.. నాకు పక్షవాతం వచ్చిన మామగారు, అనారోగ్యంతో ఉన్న అత్తగారు ఉన్నారని, వద్దంటే వద్దు అన్నారు. ఏంటమ్మా మీరు కష్టపడేది? అమ్మని నాన్నని ప్రేమగా చూసుకోలేదు ఎందుకు? ఇన్ని సంవత్సరాలుగా తమ్ముళ్లు ఎంత అవస్థ పడుతున్నారు.. మీ సుఖం మీదేనా? మీ పిల్లలు మీకు ఉంటే చాలా? పెన్షన్‌లో నాన్న కొద్దిగా ఉంచుకొని మీకు ఎంత ఉన్నా తన పాలుగా తను ఇవ్వాలని మీ దగ్గర ఉన్నప్పుడు ఇచ్చారు. మీరు తీసుకున్నారు. కానీ అదో విషయం కాదు మీకు.. స్పందన అంటే ఏంటో తెలియని మీకు ఇలాంటివాటిలో నిగూడమై ఉన్న భావం తెలియదు.. కోడలు అంటే చాలా చేయాలి, ఈ కార్యక్రమాల వరకే చేయటం కాదు.. నాకు చాలా అడగాలని ఉంది కానీ అడగను. అందుకే నాకు ఏవో ఏమీ చెప్పకండి. నాకు వినాలని లేదు” అంటూ ఏడుస్తూ తమ్ముళ్ల దగ్గరికి వెళ్ళింది గంగ. అచేతనంగా నిలబడిపోయారు పారిజాతం, రోజా.

***

“అప్పుడే వెళ్తావా అక్కా?” బాధగా అన్నాడు దయాకర్.

“వెళ్తానురా.. మీ బావగారు ఒక్కరు వాళ్ళ అమ్మానాన్నను చూసుకోలేకపోతున్నారు.. మళ్లీ వస్తుంటానుగా.. ఏంట్రా ఉదయం మామయ్య ఏదో మాట్లాడుతున్నాడు”

“వాళ్లకూ ఇదే సలపరం.. కోడళ్ల స్ట్రోక్”

“అవునా?”

“వాళ్లని నాన్న దగ్గర ఉండమని అంటున్నాను. అమ్మలేని ఈ పదిహేను రోజుల్లోనే నాన్న సగం అయ్యారు. ఇప్పుడు ఒంటరిగా ఉండటం కష్టం. నాన్నకు తోడుగా వాళ్ళు ఉంటారు. మా దినచర్య మాత్రం ఎప్పటిలాగే ఉంటుంది”

“బాగుందిరా ఇలా.. ఏమంటున్నారు పారిజాతం రోజా.. ఏమైనా మార్పు కనిపించిందా?”

“వాళ్ల గురించి అనుకోవద్దులే.. బండరాయిలో చలనం ఉంటుందా అక్కా.. పైగా ఇంకా భీష్మించుకుని ఏదో మెయింటైన్ చేస్తున్నారు.. నాన్న వాళ్లకు డబ్బులు ఇచ్చారు… నిజానికి నిన్ను చూసుకున్న దాని కంటే ఎక్కువ ప్రేమగా వాళ్లను చూసుకున్నారు. అమ్మ అయితే తన అలవాటు ప్రకారం ఇంటి చాకిరీకి అంకితం అయ్యింది. అయినా అమ్మ నాన్న నచ్చలేదు… వదిలించుకోవాలి అనుకున్నారు.. సరే.. వదిలించుకున్నారు… ఒక్కసారైనా వచ్చి అమ్మనాన్నని చూసారా? నేను అన్నయ్య ఎన్నోసార్లు రమ్మన్నాము.. వాళ్లు ఒక్కసారి కూడా రానే లేదు. అమ్మ నాన్న వాళ్లకి ఎన్నిసార్లు ఫోన్ చేశారో? మొండి ఘటాలు, రాలేదు. అమ్మకు ఇదే దిగులు.. ఆ దిగులే ఈ రోజు మనకు అమ్మను లేకుండా చేసింది కారణం వాళ్ళు గాదా?” ఆవేశంగా అన్నాడు కృపాకర్.

“ఇప్పుడు ఇలా మాట్లాడుకోవద్దు లేరా చూద్దాం… మార్పు రాకుండా ఉంటుందా?”

“ఆశ పెట్టుకోవద్దులే అక్కా. అయినా ఎప్పుడో వచ్చే మార్పు మనకెందుకు” అన్నాడు దయాకర్.

“మరీ ఇంత మూర్ఖంగా ఎలా ఉన్నారో అర్థం కాకుండా ఉంది.”

“వాళ్ల గురించి ఆలోచించడం మనకు టైం వేస్ట్.. అత్తయ్య మామయ్యని పిలిచి నాన్నతో మాట్లాడదాం.. లోపలికి వెళ్లాం పదండి.”

“వాళ్ల కొడుకులు ఏమంటారో” అనుమానంగా అడిగింది గంగ.

“ఏమీ అనరు పైగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళింట్లో కోడళ్లతో పాటు కొడుకులు కూడా వదిలించుకోవటానికి సిద్ధంగా ఉన్నారు.”

“అవునా” అని ఆశ్చర్యపోతున్న అక్క భుజాల చుట్టూ చేయి వేసాడు కృపాకర్.. అక్క చెయ్యి పట్టుకుని లోపలికి నడిచాడు దయాకర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here