ప్రేరణ

0
8

[dropcap]సా[/dropcap]యంత్రం ఏడు గంటల సమయం. సూపర్ మార్కెట్ చాలా బిజీగా ఉంది. శారదకు ఇలాంటి సూపర్ మార్కెట్లలోకి రావాలంటే ఊపిరి ఆడనట్లు ఉంటుంది. ఈ మార్కెట్లలో సరుకులు సర్ది ఉంచే విధానంలోనే మార్కెట్ కుతంత్రం కనిపిస్తుంది. అవసరం ఉన్న సరుకులు చివర్లో ఉంటాయి. వాటి దగ్గరకు వెళ్ళాలంటే అనవసరమైన డ్రింక్‌లు, కాస్మటిక్స్, చాక్లెట్లు, బిస్కెట్లు దాటుకుంటూ వెళ్ళాలి. అవేంటో తెలియని వారికి కూడా వింతగా ఆకర్షణీయంగా కనిపిస్తూ రా రమ్మని అవి పిలుస్తూ ఉంటాయి. అసలు మనం ఏం కొనడానికి వచ్చామో మర్చిపోయి ఏవిటేవిటో ఏరుకుని ట్రాలీలో వేసుకుంటూ పోతూ చివరకు చాంతాడంత బిల్లు కట్టే వ్యక్తులు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు. మన మనసులపై, బలహీనతలపై కుతూహాలంపై, గొప్పగా మార్కెట్ చేసుకునే వ్యవ్యస్థ ఇది. అందుకనే ఇప్పటికీ శారద ఇంటి దగ్గర పచారి కొట్టుకే ఫోన్ చేసి సరుకులు తెప్పించుకుంటుంది. అక్కా అంటూ ఆప్యాయంగా పిలిచి అడిగినవి రాసుకుని ఇంటికి తెచ్చి ఇచ్చి వెళ్ళే ఆ షాపు అబ్బాయితో ఉన్న పర్సనల్ టచ్ ఈ సూపర్ మార్కెట్లలో ఆమెకు కనిపించదు. ఈ రోజు తనకు కావలసినవి ఇక్కడే దొరుకుతాయని చెప్పడంతో తప్పక టైం చూసుకుని ఇక్కడకు రావలసి వచ్చింది. పై రాక్‌లో తనకు కావలసిన బ్రౌన్ షుగర్ ఉందేమో అని వెతుకుతున్న శారదకు “ఏయ్ శారద” అన్న పరిచయమైన గొంతు వినిపించింది. వెనక్కు తిరిగి చూస్తే నవ్వుతూ కవిత నిలబడి ఉంది.

“కవితా నువ్వా. ఎన్నాళ్లకు కనిపించావు” ఆశ్చర్యపోతూ అంది శారద.

“ఏంటీ శారదా, నువ్వు మా ఏరియా సూపర్ మార్కెట్లో ఈ టైంలో..” కళ్ళ నిండా ఉత్సాహాన్ని నింపుకుని అడిగింది కవిత.

కవితను అలా చూడడం శారదకు చాలా సంతోషంగా ఉంది. ఆరెంజ్ కలర్ చూడిదార్లో అందంగా వేసుకున్న జడతో, చేతికి గాజులు, చెవులకు జూకాలతో నిండుగా కనిపించింది కవిత. ఆమెను అలానే చూస్తూ ఉండిపోయింది శారద.

“ఏంటి తల్లి అలాగే ఉండిపోయావ్?” గట్టిగా అడిగింది కవిత.

“ఎన్నాళ్ళయింది కవితా నిన్ను ఇలా చూసి. నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా. పిల్లలెలా ఉన్నారు? నీ ఉద్యోగం ఎలా ఉంది” గబ గబా అడిగింది శారద.

ఒక్క క్షణం కలవరం కనిపించి కవితలో. తిరిగి నవ్వేస్తూ “పిల్లలు బావున్నారు శారద. ఈ మధ్యే ఓ చిన్న ప్రమోషన్ కూడా అందుకున్నాను. అంతా హ్యాపీగానే ఉంది” అంది కవిత.

“శ్రీధర్ వచ్చేసాడా” అడిగింది శారద,

శ్రీధర్ ప్రసక్తి రాగానే నల్లబడింది కవిత ముఖం. అదీ ఒక్క క్షణమే, శారదను చూసి, “డబ్బు సంపాదించడానికి వెళ్ళిన వాడు అంత త్వరగా వస్తాడా శారదా. ఇంకో రెండు ఏళ్ళు ఎక్స్‌టెండ్ చేసుకున్నాడు” అంది కవిత.

“మీ అత్తమామలు ఒప్పుకున్నారా” ఆశ్చర్యంగా అడిగింది శారద. “వెళ్ళి తొమ్మిదేళ్ళు అయింది కదా. మళ్ళి ఎక్స్‌టెన్షనా?”

“వాళ్లు అడిగినంత డబ్బు పంపిస్తున్నాడు కదా శారద. అంత కన్నా వారికేమి కావాలి. పైగా విదేశాలకు వెళ్ళాక కొడుకుపై వాళ్ళకు, ఈయనకు తల్లి తండ్రులపైనా ప్రేమ చాలా పెరిగింది. ఇది అందరికీ బాగానే ఉంది కదా”

శారదకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆమె మౌనంగా ఊండడం చూసి కవితే “ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే కానీ, ఓ సారి ఇంటికి రాకూడదు. ఓ రోజంతా కబుర్లు చెప్పుకుందాం. చెప్పు నీకెప్పుడు కుదురుతుందో” అడిగింది కవిత.

కవిత మాట తీరు, ఆ ఉత్సాహం చూస్తుంటే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఆమెలో ఎంత మార్పు? గత ఐదు సంవత్సరాలుగా తనకై తాను ఫోన్ చేస్తే కూడా సరిగ్గా మాట్లడని కవిత, ఎంతో బ్రతిమాలితే తప్ప ఇల్లు దాటి బైటికి రాని కవిత, తాను ఆమె ఇంటికి వెళ్ళినా ఇబ్బంది పడే కవిత, ఈ రోజు తనని తనుగా ఇంటికి రమ్మని అడగడం శారదకు ఆశ్చర్యంగానూ ఆనందంగానూ అనిపించింది. ఆమెలో కాలేజీ రోజులలోని ఉత్సాహం తిరిగి వచ్చి చేరినట్లు అనిపించింది. “నువ్వు రమ్మనాలే కాని రేపు ఆఫీసుకు సెలవు పెట్టనా చెప్పు. రేపు కలుద్దామా” అదే ఉత్సాహంతో అడిగింది శారద.

కవిత నవ్వుతూ “సెలవు ఎందుకు కాని. ఎల్లుండి ఆదివారం కదా. పదిగంటలకల్లా వచ్చేయి. నీకు నచ్చిన బిసిబేలిబాత్ చేస్తాను. కలిసి తిందాం. బోల్డన్ని కబుర్లు చెప్పుకుందాం” అంటూ ముందుకు సాగిపోతూ “మర్చిపోకు ఆదివారం మొత్తం నాతోనే” అంటూ నవ్వుతూ చేయి ఊపుతూ వెళ్ళిపోతున్న కవితను ఓ రకమైన ట్రాన్స్‌లో ఉన్నట్లుగా చూస్తూ నిలబడిపోయింది శారద.

***

శారద, కవిత ఇద్దరూ డిగ్రీ దాకా కలిసే చదివారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా కలిసి తిరిగారు. డిగ్రీ చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకుని రైల్వేలో క్లర్క్‌గా జాయిన్ అయింది శారద. కవిత కాలేజీలో చదువుతున్నప్పుడే శ్రీధర్‌ని ప్రేమించింది. వారిద్దరివీ వేరు వేరు కులాలవడంతో ఆమె కుటుంబం శ్రీధర్ కుటుంబం కూడా ఈ పెళ్ళికి అంగీకరించలేదు. అయినా ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళయిన ఏడాదికే కొడుకు పుట్టాడు. తరువాత శ్రీధర్ తల్లి తండ్రులు వచ్చి పోవడం చేసేవారు. మరో రెండు సంవత్సరాలకు పాప పుట్టడంతో ఆ బాధ్యతలు, ఇంటి సమస్యలతో స్నేహితురాళ్ళ మధ్య దూరం ఏర్పడింది. శారద భర్త అభిరామ్ బ్యాంక్ ఉద్యోగి. తల్లి తండ్రులు కుదిర్చిన వివాహం వారిది. ఇద్దరు పిల్లలతో పెద్దగా సమస్యలు లేని జీవితంలో సెటిల్ అయింది శారద. కవితతో స్నేహం కొనసాగించాలని ఎంతో ప్రయత్నించింది. కాని ఆమె జీవితంలో సమస్యలు ఇద్దరు కలిసి మాట్లాడుకునే సమయాన్ని కూడా మిగలనీయకపోవడంతో ఇద్దరి మధ్య మునుపటి సాన్నిహిత్యం లేకుండా పోయింది. కాని నెలరోజులకు ఒకసారి అయినా కవితకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటూనే ఉంది శారద. కొన్నిసార్లు తెచ్చి పెట్టుకున్న ఉత్సాహంతో, కొన్ని సార్లు విసుగుతో కవిత మాట్లాడేది. అయినా శారద వారిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉండేలా జాగ్రత్తపడుతూనే ఉంది. కవిత సమస్యలను ఆమె అర్థం చేసుకోవడం వలన కొన్ని సార్లు కవిత ధోరణి బాధ అనిపించినా ఆమె మాత్రం ఫోన్ చేయడం మానలేదు.

ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత శ్రీధర్ మరో అమ్మాయికి దగ్గరయ్యాడు. దీని వలన కవిత శ్రీధర్ల మధ్య ఎన్నో గొడవలు జరిగేవి. ప్రతిసారి శ్రీధర్ తల్లి తండ్రులు కొడుకునే సమర్థించేవారు. కూతురికి నాలుగు సంవత్సరాలు వచ్చేసరికి శ్రీధర్ ఉద్యోగం పోయింది. దాంతో కవిత బాధలు ఇంకా పెరిగాయి. ఈలోగా కవిత తండ్రి మరణించాడు. ఆమె తల్లి కూతురు సంసారానికి ఏ మాత్రం సహాయం చేసే స్థితిలో లేదు. కాని తండ్రి మరణంతో తల్లి కూతురుతో మాట్లాడడం మొదలెట్టింది. దుబాయ్‌లో ఏదో ఉద్యోగం వచ్చిందని చెప్పి శ్రీధర్ తొమ్మిదేళ్ళ క్రితం దుబాయ్ వెళ్ళిపోయాడు. కనీసం ఇలా అయినా కొంత ఆర్థికపరమైన కష్టాలు తగ్గుతాయని సంతోషించింది కవిత. శ్రీధర్ తల్లి తండ్రులు ఈమెతో కలిసి ఉండలేమని అంటూనే వీరి ఇంటి పక్క ప్లాట్‌కే మారడం వలన కవితపై ఇంకా ఒత్తిడి పెరిగింది. శ్రీధర్ తల్లి తండ్రులకే డబ్బు పంపేవాడు. వారిని అడిగి డబ్బు తీసుకోవలసిన స్థితిలో ఉండేది కవిత. పైగా పెద్దవారని వారి అవసరాలు చూడడం కూడా ఈమె తన బాధ్యతగానే భావించేది. ఈలోగా శ్రీధర్ సంబంధం పెట్టుకున్న అమ్మాయి కూడా అతనితో పాటే దుబాయ్ వెళ్ళిందని కవితకు తెలిసింది. ఈ పరిస్థితులలో పట్టుబట్టి ఓ చిన్న కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుంది. కాని ఒత్తిడి తట్టుకోలేక ఆమె పూర్తిగా నీరసించిపోయింది.

ఎప్పుడూ అందంగా తయారయి, ట్రిమ్‌గా కాలేజీకి వచ్చే కవిత వేష భాషలలో ఆ తరువాత ఓ విరక్తి కనిపించేది శారదకు. ఇంట్లో కూడా ఇస్త్రీ చేసుకున్న బట్టలే ధరించే కవిత మాసిపోయి మసి గుడ్డలుగా ఉన్న బట్టలతో కనిపించినప్పుడు శారద తట్టుకోలేకపోయింది. తన శరీరంపై, తన బట్టలపై ఆఖరికి ఇంటిపై కూడా శ్రద్ధ లేనట్లుగా ఉండేది ఆమె. ఒకప్పుడు ఇల్లు సర్ధుకోవడంలో ఎంతో శ్రద్ధ కనపరిచిన కవిత ఇంట్లో బూజులు వేలాడుతున్నా పట్టించుకోని స్థితికి వచ్చింది. ఒక సారి తనను చూద్దామని ఇంటికి వెళ్ళిన శారద ఆ ఇంట్లో బాత్రూం వాడలేకపోయింది. కవిత ఎంత అందంగా ఇల్లు సర్ధుకునేదో తెలిసిన శారద ఆమెను అటువంటి పరిస్థితులలో చూసి సహించలేకపోయింది.

దాని తరువాత కవితతో ఫోన్‌లో మాట్లాడడం తప్ప ఆమెని శారద కలవలేదు. ఈ మధ్య పని ఒత్తిడిలో రెండు నెలలు పైనే అయింది కవితతో మాట్లాడి. ఇప్పుడు ఇలా ఆమెను చూస్తుంటే ఎంత మార్పు. మళ్లీ పాత కవితను చూస్తున్న ఆనందం కలిగింది శారదలో. కాలేజీ రోజుల్లో ఆమె చలాకీతనం, ఉత్సాహం, తనకు ఎన్నో కొత్త విషయాలను పరిచయం చేసాయి. ప్రతి పనిని ఎంతో శ్రద్ధతో చేసేది కవిత. ఏ పని చేసినా నా మార్క్ ఉండాలి అని గర్వంగా చెప్పుకునేది. అలాంటి కవితను వేసుకున్న బట్టలను పట్టించుకోకుండా, చెత్త చెదారంతో నిండిన ఇంట్లో చూసినప్పుడు శారద తట్టుకోలేకపోయింది. తానెంతగా చెప్పినా అప్పుడు ఏదీ వినడానికి సిద్ధంగా లేదు కవిత. ఈ రెండు నెలలలో ఇంత మార్పుకి కారణం ఏమీటో మరి. ఏది ఏమయినా కవితను ఇలా చూడడం మాత్రం శారదకు చాలా ఆనందానిచ్చింది.

***

కవితను కలిసినప్పటినుంచి ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఉంది శారద. ఆదివారం రోజు అభిరాం ఏదో మీటింగ్‍కు వెళ్లాలని చెబితే నాలుగింటికే లేచి అతనికి కావల్సినవి చేసిపెట్టి, పిల్లలను అమ్మవాళ్లింట్లో దించేసి వచ్చింది. వారికి అమ్మమ్మ ఇంటికి వెళ్ళడం అంటే పండగే. తన పెళ్లికి కవిత పెట్టిన గార్డెన్ చీరను తమ స్నేహానికి గుర్తుగా దాచుకుంది శారద. ఈ రోజు అది కట్టుకుని కాచీగుడలో ఉండే కవిత ఇంటికి బైలుదేరింది.

కవిత ప్లాట్ మూడో అంతస్తులో ఉంటుంది. ఇంటి తలుపు తెరిచే ఉంది. ఇంటి గుమ్మంలోకి వచ్చిన శారద అక్కడి నుండి కనిపిస్తున్న ఆ ఇంటి అలంకరణ చూసి ఆశ్చర్యపోయింది. సంవత్సరం క్రితం కంపరంగా ఆ ఇంట్లోనుంచి బైటపడిన రోజు గుర్తుకు వచ్చింది శారదకు. ఇంటికి సున్నం వేయించినట్లుంది. లావెండర్ కలర్ రంగులో గోడలు మెరుస్తున్నాయి. కవితకు ఆ కలర్ అంటే చాలా ఇష్టం అన్నది గుర్తుకు వఛింది శారదకు. ఇంట్లో ఆర్భాటం కలిగించే వస్తువులు ఏవీ లేవు. గోడలకు ఆమెకి ఎంతో ఇష్టమైన రవివర్మ ‘వెన్నెల్లో రాధ’ చిత్రం ఉంది. అది చూసి శారద పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. గుమ్మం దగ్గరే ఆగిపోయిన శారదను లోపల నుండి వస్తున్న కవిత చూసి “రా తల్లి. అక్కడే ఆగిపోయావేమిటీ? నా రాధ కట్టిపడేసిందా” అడిగింది కవిత. “ఈ పెయింటింగ్ గురించి మనం కాలేజీ రోజుల్లో చర్చించుకున్నవి గుర్తుకొచ్చాయి కవిత. దీన్ని ఇలా ఇంత పెద్దగా గోడకి అలంకరించుకోవాలన్న నీ కోరిక మొత్తానికి సాధించుకున్నావ్” పెయింటింగ్‌నే చూస్తూ అంది శారద.

“యెస్. పది రోజులయింది దీన్ని గోడకు తగిలించి. అప్పటినుండి నువ్వే గుర్తుకు వస్తున్నావు. అందుకే నిన్ను ఇవాళ రమ్మన్నాను. ఇదంటే నాకెంత ఇష్టమో నీకు తప్ప ఎవరికి తెలుస్తుంది” కవితలో ఆ ఆనందం చూస్తుంటే పాత రోజులలోకి వెళ్లిపోతున్న ఫీలింగ్ శారదకు. ఎర్ర పూలున్న తెల్లటి చీరలో, తలస్నానం చేసి వదులుగా వేసుకున్న జడతో చాలా అందంగా కనిపించింది శారద కళ్ళకు కవిత. “ఇదో ఒరిజనల్ అనుకునేవు. ఇంటర్నెట్ పుణ్యమా అని నాకు కావల్సిన సైజులో ప్రింట్ చేయించి ఇలా ప్రేం కట్టించాను” పెయింటింగ్‍నే చూపిస్తూ అంది కవిత.

ఆ చిన్న ప్లాట్‌ని కవిత పెట్టుకున్న తీరు చూసి ముచ్చటేసింది శారదకు. చిన్న చిన్న కుండీలలో ఎండ పడే చోట ఇండోర్ ప్లాంట్స్, ఓ పక్కన చిన్న స్పీకర్, లేసు కర్టేన్లు ఆమె టేస్ట్‌ను సూచిస్తున్నాయి. బెడ్రూంలో ఓ చిన్న బుక్ షెల్ప్ చూసి ఇంకా ఆశ్చర్యపోయింది శారద. పుస్తకాల పురుగు అని పేరు పడిన కవిత పాప పుట్టిన తరువాత పుస్తకం చదవడమే మర్చిపోయిందని శారదకు తెలుసు. అలాంటిది ఆ చిన్న రాక్‌లో పది పుస్తకాలు చూసినప్పుడు శారకదకు సంతోషం వేసింది. “ఇవేనా అనకు. ఒక్క సంవత్సరం ఆగు ఆ ర్యాక్ నిండిపోతుంది. అప్పుడు నువ్వు కుళ్ళుకుని చస్తావు” చిలిపిగా శారదనే చూస్తూ అంది కవిత.

శారద కళ్లల్లో తడి. కవితను ఇలా చుస్తానని ఆమె అనుకోలేదు. మళ్లీ కవితలో ఈ ఉత్సాహం తిరిగి వస్తుందనే ఆశ శారదలో ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు కవితలో చూస్తున్న ఈ మార్పు శారదలో కూడా కొత్త జీవాన్ని నింపింది.

“పిల్లలు ఎక్కడ” అడిగింది శారద. “మనం చాలా మాట్లాడుకోవాలని వాళ్ళను అమ్మ దగ్గరకు పంపాను” చెప్పింది కవిత.

హాలు పక్కన ఉన్న టూ సీటర్ బుల్లి డైనింగ్ టేబిల్ ముందు కూర్చున్నారు ఇద్దరు. “సరే ముందు టీ తాగుదాం. రాగానే అడుగుతావని ప్లాస్క్‌లో పోసి ఉంచాను” అంటూ వంటగదిలోకి వెళ్ళి ఓ రెండు కప్పుల్లో టీ తీసుకుని వచ్చింది కవిత.

“కవితా నిన్నిలా చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. పోగొట్టుకున్న స్నేహితురాలు దొరికనట్లుగా ఉంది. శ్రీధర్‌తో నువ్వు పడుతున్న సమస్యలు ఒక కొలిక్కి వచ్చాయా” అడిగింది శారద.

ఫక్కున నవ్వింది కవిత. “నాకు తెలుసు నువ్విదే అడుగుతావని. కాని శారద మనం ఇప్పుడు కాలేజీ పిల్లల వయసు దాటి ఎంతో దూరం వచ్చేశాం. శ్రీధర్ లాంటి వారు సినిమాలలో మారతారేమో కాని నిజజీవితంలో మారరు అని ఇంకా తెలియదా” అంది.

“మరి నీలో ఈ మార్పుకి ఈ ఉత్సాహానికి..” ప్రశ్న పూర్తి చేయలేకపోయింది శారద.

కవిత కొన్ని క్షణాలు మౌనంగా ఉండి ఫోన్‌లో వాట్స్‌అప్ ఓపెన్ చేసింది. అందులో ఉజ్వల్ అనే ఓ పేరు దగ్గర ఆగి ఓ వ్యక్తి ఫోటో చూపించింది. “ఇతన్ని గుర్తుపట్టావా” అడిగింది.

శారదకు అతనెవరో గుర్తుకు రాలేదు. మళ్లీ కవితే “ఇతను శ్రీధర్ కజిన్ ఉజ్వల్. కాంట్రాక్టులు చేస్తూ ఉంటాడు. మాకున్న అతి తక్కువ చుట్టాలలో ఒకడు” అంటూ శారద ముఖం వైపు చూసింది కవిత.

శారదకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. కాని కవిత ముఖాన్ని చూస్తుంటే ఓ చిన్న అనుమానం మొలకెత్తింది. ఇతనితో కవితకు.. ఒక్క క్షణం ఏదో భయం కలిగింది. ఏం వినాల్సి వస్తుందో అని..

ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది. చివాలున లేని తలుపు దగ్గరకు వెళ్లింది కవిత. అంతలోనే ముఖం గంభీరంగా మార్చుకుని తలుపు తీసింది. బైట ఓ తెల్లచొక్కా నిల్చుని ఉంది. కవిత తలుపు పూర్తిగా తెరిసిన తరువాత అతను సందేహంగా “బావున్నావా కవితా” అని అడిగాడు.

“ఆ బావున్నాను. ఏంటీ ఇలా వచ్చారు” అడిగింది కవిత. ఆమె ముఖంలో కొంత విసుగు, కొంత చిరాకు కలిసిపోయి ఉన్నాయి.

“కాగితాలపై నీ సంతకం కోసం వస్తానన్నాను కదా” మెల్లగా అన్నాడు అతను.

తలుపు బార్లా తెరిచి “రండి” అంటూ లోపలికి జరిగింది కవిత.

లోపల కొత్త మనిషిని చూసి కొంత కలవర పడ్డాడు అతను. కవిత మాత్రం ముఖంలో గాంభీర్యం ఏ మాత్రం చెడకుండా, “శారదా, ఇతను ఉజ్వల్, శ్రీధర్ కజిన్” అంటూ శారదకు ఉజ్వల్‌ను పరిచయం చేసింది. “ఈమె నా ప్రెండ్ శారద. పర్లేదు ఇలా కూర్చోండి” అంటూ తను ఖాళి చేసిన కుర్చీ చూపించింది.

ఇల్లంతా కళ్ళతో ఓ సారి పరికించి చూస్తూ మెచ్చుకోలుగా ఆమెవైపు చూసాడు ఉజ్వల్. అదేమీ గమనించనట్లుగానే కవిత “కాగితాలు ఇవ్వండి సంతకాలు పెడతాను” అంది. ఆమె చేతికి ఏవో డాక్యుమెంట్లు ఇచ్చాడు ఉజ్వల్. మౌనంగా అతను చెప్పిన చోట సంతకాలు పెట్టింది. అవి సరి చూసుకుని, “అరే ఓ డాక్యుమెంట్ ఇంట్లోనే ఉండిపోయింది. దాని మీద కూడా సంతకం పెట్టాలి. ఇప్పుడెలా” అంటూ ప్రశ్నార్ధకంగా కవిత వైపు చూసాడు ఉజ్వల్. “మళ్లీ ఆదివారమే నేను ఇంట్లో ఉండేది. మధ్యలో కుదరదు” గట్టిగా చెప్పింది కవిత. సరే ఏదో మేనేజ్ చేస్తాను అన్నాడు అతను.

“పిన్ని నిద్రపోతున్నట్లుంది. తలుపు తీయలేదు. పోయిన వారం వచ్చినప్పుడు ఈ మందులు తెమ్మని చెప్పింది. తీసుకువచ్చాను. నువ్వు కాసేపయ్యాక వెళ్లి ఇస్తావు కదా” అంటూ కవిత చేతికి ఓ పాకెట్ అందించాడు. దాన్ని మౌనంగా అందుకుంది కవిత.

అంతే మౌనంగా లోపలికి వెళ్ళి టీ పట్టుకుని వచ్చింది. ఆనందంగా కప్పు అందుకున్నాడు ఉజ్వల్. అతను టీ తాగుతున్నంత సేపు చుట్టూ పరికించి చూస్తూనే ఉన్నాడు. అతని కళ్లల్లో ఎన్నో భావాలు. కవిత పట్ల ఏదో ఆరాధన, గౌరవం అతని చూపులో కనిపిస్తుంది. శారద ఓ పుస్తకం పట్టుకుని ఇద్దరినీ మౌనంగా గమనించసాగింది. కవిత ముఖంలోని గాంభీర్యం ఎవరినయినా అంత దూరం నిలబెట్టేసేదిగా ఉంది. ఇక అంత కన్నా సంభాషణ పొడిగించను అన్నట్లుగా ఉంది ఆమె నించున్న తీరు. పిల్లల గురించి అడిగి, ఏం పుస్తకాలు చదివావంటూ ఇంకాసేపు ఏదో మాట్లాడే ప్రయత్నం చేసి సంభాషణ సాగకపోవడంతో ‘వస్తాను’ అంటూ పైకి లేచాడు ఉజ్వల్. వెళుతూ వెనక్కు తిరిగి “ఫామిలీ గ్రూప్ లో నువ్వు పెట్టిన పోస్ట్ చాలా బావుంది. నువ్వు రాసిన కవితే కదూ అది” అడిగాడు. మౌనంగా తల ఊపింది కవిత. “ఓహ్ అప్పుడే అనుకున్నాను. యూ ఆర్ సింప్లీ గ్రేట్. ఆ కవితలో నీ శైలి అద్భుతం. ప్రకృతిని స్త్రీతో పోలుస్తూ నువ్వు రాసిన తీరు చాలా గొప్పగా ఉంది కవితా. కంగ్రాట్శ్. ఏదైనా పత్రికకు పంపరాదు” అడిగాడు ఉజ్వల్.

“ఏదో తోచనప్పుడు రాస్తూ ఉంటాను. చూద్దాం.” అంటూ గుమ్మం వైపు చూసింది కవిత. ఆమెనే ఆరాధనగా చూస్తూ “వస్తాను కవితా. వస్తానండి” అని శారదతో చెప్పి వెళ్ళిపోయాడు ఉజ్వల్.

అతను వెళ్లిపోయాక తలుపు గడియ వేసి మౌనంగా వచ్చి శారద పక్కన కూర్చుంది కవిత. ఆమెనే చూస్తున్న శారదతో “నన్ను ప్రేమిస్తున్నానని, నాతో ఓ చిన్న అఫెయిర్ కోరుకుంటున్నానని ప్రపోజ్ చేసాడు ఉజ్వల్” అంది కవిత. శారదకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. అతను ఉన్నంత సేపు అంత గంభీరంగా, గుంభనంగా ఉన్న కవితకు ఇప్పుడు తనతో మాట్లాడుతున్న కవితకు మధ్య ఎంతో తేడా ఉన్నట్లు అనిపించింది.

“అసలేం జరుగుతుంది కవిత. నేను తెలుసుకోవచ్చా” అడిగింది శారద.

చిన్నగా నిట్టూర్చి చెప్పడం మొదలెట్టింది కవిత. “శారదా శ్రీధర్ మరో స్త్రీతో కలిసి జీవిస్తున్నాడు. అది సాగినంత కాలం అతను ఇండియా రాడు. అతను పెట్టిన హింసకు నా మనసు చచ్చిపోయింది. జీవితం మీద కోరిక చచ్చి ఓ రెండేళ్లుగా ఏదో బ్రతుకుతున్నాను. ఏం తినేదాన్నో, ఏం కట్టుకునేదాన్నో కూడా నాకు గుర్తులేనంతగా దుఖంలోకి కూరుకుపోయాను. వారం పది రోజుల దాకా ఇల్లు కూడా చిమ్మేదాన్ని కాదు. శ్రీధర్ అక్కడ నుండి పంపే డబ్బు అతని తల్లి తండ్రుల ద్వారా ఉజ్వల్ బిజినెస్‌లో పెట్టుబడిగా పెడుతున్నాడు. నామినీగా నన్ను ఉంచాడు. ఈ పనుల కోసం ఉజ్వల్ మా అత్త మామల దగ్గరకు వస్తూ ఉండేవాడు. పక్క ప్లాట్ లోనే కదా వాళ్లు ఉంటుంది. అప్పుడే ఓ సారి నాకు ప్రపోజ్ చేసాడు. అతనికి కావలసింది నాతో ఓ చిన్న అఫెయిర్. దానికి ప్రేమ అన్న పేరుతో చాలా అందంగా కథ అల్లి నా కోసం ఎంత తపించిపోతున్నాడో చెప్పుకున్నాడు. ఆ రోజు రెండేళ్ళలో మొదటిసారి పరీక్షగా నన్ను నేను అద్దంలో చూసుకున్నాను. ఎలాంటి స్థితి నుండి ఎలా మారానో నాకు మొదటి సారి అద్దంలో కనిపించింది. ఈ స్థితిలో కూడా నన్ను ఓ మగాడు కోరుకొవ్వడం వెనుక నా అసహాయత కారణం అని నాకు తెలుసు. కాని ఎందుకో అది నాలో ఓ కొత్త ఉత్సాహాన్ని నింపింది. అతనితో చాలా గట్టిగా పిచ్చి వేషాలు వేయవద్దని చెపుతునే మరో వైపు నా గురించి, నా ఇంటి గురించి శ్రద్ధ తీసుకోవడం మొదలెట్టాను. తరుచుగా ఇంటికి వచ్చే ఉజ్వల్ నా ప్రతి మార్పుని మెచ్చుకునేవాడు. చివరకు నాకే తెలియకుండా అతని కళ్లల్లో మెచ్చుకోలు కోసం నేను శుభ్రంగా ఉండడం, తయారవడం, ఇంటిని కొత్తగా అలంకరించుకోవడం మొదలెట్టాను. బ్రతకడానికి నాకు కూడా ఓ పర్పస్ ఉన్నట్లు అనిపించడం మొదలెట్టింది”

“అదేంటీ కవిత నువ్వు మొదటి నుండి ఇలాగే ఉండేదానివిగా” అడిగింది శారద.

“అవును శారద. ఇలా ఉండడం నా కిష్టం. కాని శ్రీధర్‌తో నేను గడిపిన జీవితం నాపై నాకే శ్రద్ధ లేకుండా చేసింది. ఎవరి కోసం నేను అలంకరించుకోవాలి, ఎవరి కోసం నేను ఇల్లు శుభ్రపరచుకోవాలి అనిపించేది. ఎంతో నిరుత్సాహం నన్ను కమ్ముకుంది. ఇప్పుడు ఉజ్వల్ కి నాపై ఉన్న కోరిక తెలిసిన తరువాత నాకే తెలియకుండా అతని కోసం ఎదురు చూడడం మొదలయింది. మనిషి ఎలాంటి వాడయినా, అతనికో టేస్ట్ ఉంది. అతని ప్రతి చర్యలో అది కనిపిస్తుంది. నన్ను చూసినప్పుడు అతని కళ్లల్లో ఆ మెచ్చుకోలు, నా పై కనిపించే అతని కోరిక కోసం నేను మళ్ళీ ఆ పాత కవితలా మారడం మొదలెట్టాను.”

“అంటే నువ్వూ ఉజ్వల్ ని ప్రేమిస్తున్నావా” అడిగింది శరద.

“ప్రేమా. లేదు శారద. ఉజ్వల్ బలహీనత నాకు తెలుసు. ఎందరో స్త్రీలు అతని జీవితంలోకి వచ్చి వెళ్లారు. ఒక్కసారి అతనికి లొంగానంటే అతని దృష్టిలో నేను వాడిపడేసిన వస్తువుగానే మిగిలిపోతాను. పైగా అతనితో నాకు భవిష్యత్తు ఉండదు అని నాకు తెలుసు. ఇక ఆ శారీరిక సుఖం పై నాకు కోరిక చచ్చిపోవడానికి శ్రీధర్ దగ్గర పొందిన ఎన్నో అనుభవాలు, అవమానాలు ఇంకా పచ్చి పుండులా సలుపుతూనే ఉన్నాయి. ఏ మగాడిని నేను దగ్గరకు రానియ్యలేను”

“మరి ఇదేమిటి కవితా” ఆశ్చర్యంతో అడిగింది శారద.

“నేను నాలా బ్రతకడానికి ఓ ఆధారం” టక్కున సమాధానమిచ్చింది కవిత. అయోమయంగా చూస్తున్న శారదతో “నాకు బ్రతకడానికి, రోజూ నిద్రలేవడానికి, నా పట్ల శ్రద్ధ వహించడానికి, ముఖ్యంగా నా ఇష్టాలతో మళ్ళీ సహవాసం చేయడానికి ఓ కారణం కావాలి శారదా. తల్లిగా నేను నిర్వర్తిస్తున్నది కేవలం బాధ్యతనే. నా బిడ్డలను నేను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. చేయను కూడా. కాని నాకున్న చిన్న చిన్న కోరికలు తీర్చుకోగల శక్తి, జీవితేచ్ఛ నాకు కావాలి. ఉజ్వల్ నాపై చూపే ఆసక్తే ఇప్పుడు నా జీవితానికి ప్రేరణ. అతని కళ్ళల్లో ఆ మెప్పు కోసం నేను మళ్ళీ ఉత్సాహం తెచ్చుకోవడం మొదలు పెట్టాను. ఇప్పుడు నాలో ఆ పూర్వపు నిరాసక్తత లేదు. ఆనందంగా ఉండగలుగుతున్నాను. ఉజ్వల్ పట్ల నాకున్న ఆసక్తి నాకు మాత్రమే తెలిసిన ఓ రహస్యం.”

“అతనికి నీలో ఈ మార్పు వెనుక కారణం గురించి తెలిస్తే. నీలో వచ్చిన మార్పు అతను గమనిస్తున్నాడుగా” అడిగింది శారద.

“కాని అది తనవలనే అన్నది అతనికి తెలియకుండా ఎప్పటికీ జాగ్రత్తపడతాను. ఒకవేళ అతని కోసమే నేను మారానని అతనికి తెలిస్తే, అతని అహం తృప్తిపడుతుంది. అప్పుడు అతనికి నేను లొంగినా లొంగకపోయినా నా పట్ల అతనిలో ఆసక్తి చచ్చిపోతుంది. ఉజ్వల్ తాను ప్రతి స్త్రీని ఆకర్షించగలనని నమ్ముతాడు. నా పట్ల అతనికి ఉన్న ఆసక్తే నా ఈ మార్పుకు కారణం అని తెలిసిన తరువాత అతను నన్ను చులకనగా చూడడం మొదలెడతాడు. అది నాకిష్టం లేదు. అందుకే అతని పట్ల నాకున్న ఆసక్తిని నేను వ్యక్తపరచను.” దృఢంగా చెప్పింది కవిత.

“శారదా ఏ రకమైన ఉత్సాహం లేని నా జీవితంలో ఉజ్వల్ బ్రతకడానికి ఓ కారణం అయ్యాడు. అతనికి నా పరిస్థితి తెలుసు. అసహాయంగా జీవిస్తున్న నన్ను కొంత కాలం ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు అంతే. అతనికి నో చెబుతూనే నాపై అతనికున్న ఆసక్తిని నేను జీవితంలో మళ్ళీ కొత్త ఉత్సాహం తెచ్చుకోవడానికి ఓ కారణంగా మార్చుకున్నాను. తప్పంటావా” జాలిగా అడిగింది కవిత.

“కాని ఇది నిజం కాదు కదా కవితా. ఈ అబద్దంతో ఎంత దూరం ప్రయాణించగలవు?” అడిగింది శారద.

“శ్రీధర్‌తో జీవితం కూడా అంతకన్నా పెద్ద అబద్ధమే కదా శారద. అతనికి నాపై ఉన్నది ప్రేమ అనుకున్నాను. కాని అది కేవలం నా భ్రమ అని తెలిసిపోయింది. నా భవిష్యత్తు అంతా పెద్ద శూన్యం. ఈ ప్రేమ మత్తులో నా కుటుంబంతో సంబంధం లేకుండా పోయింది. సరైన ఉద్యోగం తెచ్చుకోలేకపోయాను. కెరీర్ లేకుండా పోయింది. ఒకోసారి ప్రొద్దున నిద్రలేవాలని కూడా అనిపించేది కాదు తెలుసా. పిల్లలు అనాథలవుతారని ఎంతో కష్టంతో నన్ను నేను సంబాళించుకునేదాన్ని. ఉజ్వల్ నా స్థితిని తన స్వార్థానికి ఉపయోగించుకుందామనుకున్నాడు. ఇది నేను మర్చిపోను. నేను ఇప్పుడు ప్రేమ అనే భ్రమలో రెండో సారి పడడానికి సిద్దంగా లేను. అతన్ని దూరంగా పెడుతూనే నాపై అతనికున్న ఆకర్షణను నా జీవితంలో ఉత్సాహం నింపుకోవడానికి ఉపయోగించుకుంటున్నాను.” చెప్పుకుపోతుంది కవిత.

“నువ్వు కవితలు రాయడం మళ్ళీ మొదలెట్టావా”

“ఆ ఈ వాట్స్‌అప్‍౬లో మా బంధువులందరిదీ ఓ గ్రూప్ ఏడిచింది. ఒక్క అక్షరం ముక్క రాని వాడు కూడా పెద్ద పెద్ద మెసేజ్‌లు ఫార్వడ్ చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు సెభాష్ అంటూ ఉంటారు. వారందరికీ నేను పనికి రాని దాన్ని ఒకప్పుడు. ఈ మధ్యే మళ్లీ కాస్త చిన్న చిన్న కవితలు రాయడం మొదలెట్టాను. అసలు నిజం చెప్పాలంటే ఆ గ్రూప్‌లో ఉజ్వల్ ఉన్నాడన్న ఒక్క కారణమే నా చేత రాయిస్తుంది. అతను ఓ కవితకు కామెంట్ పెట్టగానే ఇక మిగతా అందరూ దాన్ని చదివి ఆహా ఓహో అంటూ ఉంటారు.

అదేంటో కాని శారద. ఓ కవిత రాసి ఉజ్వల్ చూసాడా అని గ్రూప్౬‍లో చెక్ చేయడం. ఓ స్టేటస్ పెట్టి అతను చూసాడా అని తిరిగి చూడడంలో నాకు ఓ ఆనందం ఉంది. అన్నట్టు శ్రీధర్ కూడా ఆ గ్రూప్ లోనే ఉన్నాడు. నేను రాసిన కవితను చదివి పొగుడుతూ అతనితో మీ ఆవిడలో ఇంత టాలెంట్ ఉన్నదని నువ్వు చెప్పలేదే, అని అడిగేవారికి సమాధానం చెప్పలేక శ్రీధర్ ఇబ్బంది పడుతూ ఉంటే చూడడం మరీ బావుంటుంది తెలుసా” చెప్పింది కవిత.

శారదకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు.

“నేను ఉజ్వల్‌తో సంబంధం పెట్టుకుంటే తప్పు కాని ఈ చిన్న చిన్న అనందాలు తప్పు కావు కదా శారదా”.

“కాని మనసు బలహీనమైనది కదా కవితా. అది నిన్ను ఏ దారిలోకి నడిపిస్తుందో, ఈ అబద్ధమే నిజమని నమ్మి నువ్వు నీ జీవితాన్ని ఇంకా సమస్యలమయం చేసుకుంటావేమో ఆలోచించు” అడిగింది శారద.

అటువైపు కూర్చుని ఉన్న కవిత శారద వైపుకు తిరిగింది. ఆమె కళ్ళల్లో నీళ్లు. “అప్పుడు నువ్వు నన్ను దారి మళ్లకుండా కాపాడలేవా శారదా. నా వల్ల ఏ చిన్న తప్పు జరిగినా నా బిడ్డల జీవితం పాడవుతుంది. శ్రీధర్ నన్ను వదిలించుకుని పిల్లలను తన దగ్గర ఉంచేసుకుంటాడు. నేను ఉజ్వల్‌తో ఇంతకన్నా కొంచెం ముందుకు వెళ్ళినా అతను తన అవసరం తీరగానే నన్ను వదిలి వెళ్లిపోతాడు. ఇలాంటి సంబంధాలు అతనికి మామూలే. కాని ఈ చిన్న ఆనందం కూడా లేకుండా పోతే నా జీవితంలో ఈ ఉత్సాహం కూడా పోతుంది. అబద్ధమే కావచ్చు కాని ఈ చిన్న ఆకర్షణ నాకు ఇప్పుడు జీవించడానికి ఆధారం అయింది. దీని నుండి బైటపడాలని నాకు లేదు శారదా. ఇది తప్ప నా జీవితంలో మరో ఆనందం లేదు, ఇక ఉండదు కూడా” శారదను అల్లుకుపోయి ఏడుస్తుంది కవిత.

శారదకు ఏం చెప్పాలో అర్థం అవట్లేదు. కవిత ఇప్పుడున్నట్లే ఉండాలని ఆమె మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కాని ఆమె ఎన్నుకున్న మార్గం మాత్రం శారదను భయపెడుతుంది. రెండు సంవత్సరాల క్రితం కవితను, ఆమె జీవించిన పరిస్థితులను గుర్తుకు తెచ్చుకుని ఒక్క సారిగా తల విదిల్చింది శారద. కాని ఇప్పుడు కవిత ఏర్పరుచుకున్న త్రిశంకు స్వర్గం మాత్రం ప్రమాదకరమైనది. దాని నుండి కవితను మళ్ళించుకోవాలి. ఆమెలో జీవితం పట్ల ఇదే ఉత్సాహం ఉండేలా జాగ్రత్తపడుతూ ఉజ్వల్ ఆకర్షణ నుండి ఆమెను తప్పించాలి.

ఒక వేళ కవిత ఉజ్వల్‌ని ప్రేమిస్తుంటే, అతనితో సంబంధం పెట్టుకుని ఆనందిస్తూ ఉంటే అది ఆమె ఎన్నుకున్న మార్గం అని తాను పట్టించుకునేది కాదు. కాని కవిత ఉజ్వల్‌ని ప్రేమించట్లేదు. అతనితో బంధాన్ని కోరుకోవట్లేదు. కేవలం తనపై అతను చూపుతున్న శ్రద్ధను ఎంజాయ్ చెస్తుంది. ఇది ఇలాగే ఉంటే పర్లేదు. కాని ఇది సన్నటి తాడు మీద బాలెన్స్ చేయడం లాంటిది. ఏ నిముషంలో ఏమయినా జరగవచ్చు. అందులోనూ కవిత వయసు, ఒంటరితనం ముఖ్యంగా తనను ప్రేమించే ఓ వ్యక్తి జీవితంలో ఉండాలనే బలమైన ఆమె కోరిక ఇవన్నీ ఆమెలో విచక్షణను హరిస్తే అప్పుడు కవిత ఇంకా నష్టపోతుంది. ఆమెకు జీవనాధారమే లేకుండా పోతుంది. ఇలాంటి సమయంలో తాను కవిత పక్కనే ఉండాలి. ఆమెను మెల్లిగా దారి మళ్ళించాలి. అది స్నేహితురాలిగా తన బాధ్యత అనుకుంది శారద.

అబద్ధమయినా ఒకరు తమను ఇష్టపడుతున్నారని, కోరుకుంటున్నారనే భావన మనిషిని, ముఖ్యంగా స్త్రీని ఎంతగా ప్రభావితం చేస్తుందో కవితలో ప్రత్యక్షంగా చూసిన శారద మనసులో విషాదం కమ్ముకుంది. ఈ అనుభూతి కోసం ఎంత మంది ఎన్ని ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారో అనుకున్నప్పుడు ఆమెకు భయం వేసింది. నా కోసం ఒకరున్నారు అన్న ఫీలింగ్ మనిషిలో ఎంతో శక్తిని నింపుతుంది. అ శక్తే మనిషి చేత ఊహించని మహోన్నత కార్యాలు చేయిస్తుంది. ఆ అనుభూతిని అందుకోవాలన్న కోరికతో కొందరు ప్రమాదకరమైన మార్గాలను ఎంచుకుంటారు. మన అనుకున్న వ్యక్తులు ఈ అనుభూతిని కలిగించే విధంగా మసులుకుంటే మానవ సంబంధాలు ఎంత ఆరోగ్యకరంగా ఉంటాయో కదా. కాని ఎందుకో నిజ జీవితంలో అలా జరగదు. ఏమైనా ఈ విషయంలో కవితకు తోడుగా తానుండి ఆమెను రక్షించుకోవాలనుకుంది శారద.

“కోయీ హోతా జిస్కో హమ్ అప్నా కెహలెతె హై యారో

పాస్ నహీతో దూర్ హీ హోతా లేకిన్ కోయీ తొ హై అప్నా”

దూరంగా రేడియో నుండి పాట వినిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here