ప్రైమ్ మినిస్టర్ కోడలు

0
11

[పాతూరి శ్రీ ప్రవణ్ గారు రచించిన ‘ప్రైమ్ మినిస్టర్ కోడలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“మీ[/dropcap]నా! మీనా! ఎక్కడమ్మా ఆ కాఫీ కొంచెం తొందరగా పట్టుకురావమ్మా”

“వస్తున్నాను అత్తగారు, ఆ పనిలోనే ఉన్నాను” అని అరుస్తూ, “ఈ సంధ్య ఎక్కడుందో ఏమో ఈవిడ ఏమో నాకే అన్నీ పనులు చెబుతూ ఉంటుంది” అని గొణిగింది.

‘పనికి మాత్రం పనికి వస్తాను కానీ పెత్తనం మాత్రం ఆవిడదే, ఇంకా ఆ రమ్యా దేవి గారేమో నెత్తి మీద దేవత! సంపాదిస్తోందిగా! మేము సంపాదించలేకనా? ఏదో పిల్లల్ని చూసుకోవాల్సింది నేనే కదా అని మానేసినంత మాత్రాన! ఆ రమ్య కడుపునా ఇంకో ఏడాది అయితే ఎవరో ఒకరు వస్తారు. అప్పుడు తెలుస్తుంది’ అని చిన్నగా నసుగుతూ ఉండింది.

“కాఫీనే కదమ్మా అడిగాను, దానికి ఎందుకు అంత గొణగడం? నాకూ అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి లే. మా కుమార్ గాడు నిన్ను సరిగా చూసుకోవట్లేదనేగా. వాడికి ప్రేమ ఎక్కువేనమ్మా, కానీ..”

“అత్తయ్య గారూ.. ఈ కాఫీ తీసుకోండి. అసలు నేను మా ఆయన మాట ఎత్తన్నే లేదు. నేను ఏదో ఆ పనావిడ ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఉన్నాను అంతే!”.

‘మాట్లాడితే మా ఆయనని తక్కువ చేసి మాట్లాడుతారు ఎందుకు? అసలు ఈవిడ వల్లే మా ఆయన అన్నా, నేను అన్నా కూడా అందరికి తక్కువ అయిపోతోంది’ అని మనసులో అనుకుంటూ ఉంది.

ఇంతలోనే అక్కడికి చేరుకున్న సంధ్య, “నేనే ఇచ్చే దాన్ని కాఫీ, కానీ పెద్ద కోడలు అంటే ఒక్క పనా? నెలాఖరికల్లా ప్రతీ సారి లాగే ఈ సారి కూడా బొటా బొటీగా సరిపోకుండా, కాస్త అయినా సేవింగ్స్ లోకి వెళ్ళాలి అంటే ఎక్కడ ఆదా చెయ్యచ్చు అని ఆలోచిస్తూ ఉన్నా”

“అవును! చాలా పని ఉంటుంది. అందుకే అన్నాను అక్కయ్య మొన్న కూడా, అంత పని నువ్వు ఒక్క దానివే ఏం చేస్తావ్. నేను ఒక్క చెయ్యి వేస్తానని..”

***

ఈ లోగా రాత్రి అయిపోయింది. మీనా వాళ్ళ ఆయనతో, పడుకునే ముందర కాళ్ళకి నూనె రాసుకుంటూ, “ఏమండీ మీరేమో మాట్లాడరూ, మీ వొదినేమో ఎంత సేపు పెద్ద కోడలు, పెద్ద కోడలు అంటూ పని తప్పించుకుంటోంది, ఇంకా ఆ రమ్యా దేవి గారూ సరే సరీ, ఆవిడకి ఇందాక కూడా నేను చాకిరి చెయ్యడమే తప్ప ఆవిడేమీ చెయ్యదు.”

“అలా కాదు లేవే,..”. ఇంకా ఆయన మాట్లాడే లోపే, “అసలు ఎందుకు ఇళ్లల్లో కూడా ఎలక్షన్స్ ఉండ కూడదు? ఎంత సేపు ఆ పెద్ద కోడలిదే పెత్తనం ఎందుకు? దేశంలో మాత్రం ప్రజాస్వామ్యం, ఇళ్లల్లో మాత్రం రాచరికమా?”

“ఏంటే ఆ వెర్రి మాటలు, ..”

***

“రమ్య తన పని దృష్ట్యా, ఎలక్షన్స్‌లో నామినేషన్‌కి అర్హతని కోల్పోయింది! మిగిలిన ఇద్దరు ప్రత్యర్ధులు మీనా అండ్ సంధ్యా వారి వారి నామినేషన్స్ వెయ్యడం ద్వారా ప్రైమ్ మినిస్టర్ కోడలు అయ్యే పోటీలో నిలబడుతున్నట్లుగా ప్రకటిస్తున్నాను” అని అత్తగారు కుటుంబ సభ్యులందరికి చెప్పింది.

మీనా, సంధ్యా మొహాలు వెలిగిపోతున్నాయి.

“ఇప్పుడు మీరు ప్రైమ్ మినిస్టర్ కోడలు అవుతే కుటుంబానికి ఏం ఏం చేస్తారు అన్నది చెప్పాల్సిందిగా కోరుతున్నాను.”

“నన్ను గనక ప్రైమ్ మినిస్టర్‌గా నియమిస్తే, వంటకి వంట మనిషిని, మిగతా అన్నీ పనులకు పని మనుషులను పెట్టుకునే విధంగా ఏర్పాటు చేస్తాను. అసలు ఇంక ఎవ్వరు పని చేయ్యనఖర్లేదు, మీనాతో సహా. అందరూ వారికి నచ్చిన పనులు చేసుకోవచ్చు” అని సంధ్య మొదలుపెట్టింది.

“నోటికి ఎంత వస్తే అంత చెప్పేయడమేనా? ఇన్ని రోజులు చెయ్యలేని దానివి ఇప్పుడు ఎలా చేస్తావు? డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? నేను గనుక ప్రైమ్ మినిస్టర్ అవుతే ఇంట్లో అందరికీ సమానంగా పనులు వారు చేయగలిగే విధంగా అప్పజెప్తాను. దీనితో ఒక్కరికే ఎక్కువ పని చేయాల్సిన అవసరం ఉండదు. మనకి అదనంగా ఖర్చు కూడా ఉండదు.” అని మీనా చెప్పింది.

“ఈ రోజుకి మీ ప్రసంగానికి సమయం ఇంతే. ఈ వారం చివరన ఎలక్షన్స్ ఉంటాయి. ఈ లోపల మళ్లీ ప్రసంగానికి నేను అవకాశాన్ని కల్పిస్తాను. అప్పటివరకు యథాతథంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడమే” అని అత్తగారు సెలవిచ్చింది.

ఆ రోజు సాయంత్రం పిల్లల చేత హోంవర్క్ చేయిస్తూ, “ఎలా మాట్లాడాను పొద్దున్నే? బాగా చెప్పాను కదా? చూసారా, మీ అమ్మ గనుక ప్రైమ్ మినిస్టర్ అవుతే మీ అందరికీ కూడా ఎంత సౌకర్యంగా ఉంటుందో? ఆ రాము, సిద్ధార్థ కూడా నాకే ఓటేసేలా మీరే వాళ్ళతో మాట్లాడాలి. అర్థమైందా?”

“ఏం మాట్లాడడం అమ్మా? పెద్దమ్మ అయితే చక్కగా ఎవరికీ పనులు చెప్పకుండా అన్నింటికీ పని మనుషులను పెడతాను అంది. నువ్వేమో అందరి చేత పని చేయిస్తాను అంటున్నావ్. నేనూ చిన్నీ  కూడా పెద్దమ్మకి ఓటు వేద్దామని అనుకుంటున్నాం.”

“ఎలా పెడుతుంది రా పనిమనుషుల్ని? ఇన్ని రోజుల బట్టిలేని పని మనుషులు ఎక్కడి నుంచి వస్తారు? అయినా, మీ అమ్మకి మీరు వెయ్యక పోతే ఎవరు వేస్తారా?”

“నేను, చిన్ని, నాన్నగారు నీకు, పెదనాన్న, రాము, సిద్ధు పెద్దమ్మకి, ఇలా ఓటేస్తే ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఎలా తేలేది? కాబట్టి మీరు చెప్పే దాన్ని బట్టే ఓటెయ్యాలి, అని డిసైడ్ అయిపోయాం”

“ఒక్కటిచ్చానంటేనా! అమ్మకి కూడా ఓటు వెయ్యరారా?”

“ఒక్కటిస్తే మాత్రం ఖచ్చితంగా వేయను.”

“తెలివి మీరిపోయారు రా మీరు! ఎలక్షన్స్ అయ్యాక చెప్తాలే మీ పని.”

“అయినా సంధ్య అలా ఎలా చేస్తుంది? ఏమో గాని నేను ఏదోక మంచి స్కీం ప్లాన్ చెయ్యకపోతే గెలవటం కష్టంగానే ఉంది” అని అనుకుంటూ బుర్ర గోక్కుంది.

***

“ప్రసంగానికి ఇవాళ్ల మళ్లీ సమయం వచ్చింది. ఇక మొదలుపెట్టండి.” అంది అత్తగారు.

“ఇంతకు ముందరసారి కూడా చూసినట్లుగానే మీనా అయితే మిమ్మల్ని అందరిని కష్టపెట్టాలనుకుంటోంది. నేనైతే ఎవరికీ ఏ కష్టం లేకుండా చూసుకోవాలని అనుకుంటున్నాను.  ఇక మీరే ఆలోచించుకోండి ఎవరికి మీ ఓటో!” అంది సంధ్య.

“చెప్పింది చాల్లే!”

“క్షుణ్ణంగా పరిస్థితులను పరిశీలించిన మీదట, నేను కూడా అన్ని పనులకు పని మనుషులని పెట్టాలని నిర్ణయించుకున్నాను. అదనంగా పిల్లలందరికీ వారానికి రెండుసార్లు వాళ్లకి నచ్చిన చాక్లెట్లు కొనివ్వడం జరుగుతుంది”, అంది మీనా.

ఆ మాట విన్న చిన్ని, చిన్ని వాళ్ళ అన్నయ్య ఒకటే చప్పట్లు కొట్టారు. దీనికి రాము సిద్ధార్థ కూడా వారి మొహంలో చిరునవ్వు ద్వారా అంగీకారాన్ని తెలిపారు.

“చాక్లెట్లు తింటే పళ్ళు పాడవుతాయి! అయినా ఏమిటమ్మా మీ వాగ్దానాలు?” అంటూ మీనా బావగారు మధ్యలో దూరారు.

“అక్కయ్య పనిమనిషిని పెడతానంటే రాని అభ్యంతరం ఇప్పుడు నేను చాక్లెట్లు ఇస్తానంటే ఎందుకు వస్తోంది? పిల్లలను సంతోషంగా చూసే బాధ్యత లేదా నాకు?” అంటూ పిల్లల వైపు చూస్తూ కళ్ళు ఎగరేసింది.

పిల్లల మోహంలో భర్త మాట పట్ల అభ్యంతరం గమనించిన సంధ్య వెంటనే, “నిజమేగా పళ్ళు పాడయితే స్కూల్లో మిగతా పిల్లలందరూ చూసి నవ్వుతారు.  పైగా, వారానికి రెండు సార్లే పిల్లలకు ఏదైనా ఇష్టంగా తినాలి అనిపిస్తుందా? నేనైతే వంట మనిషి చేత రోజు నూడుల్స్ అని పకోడీ అని ఏదో ఒకటి చేయిస్తూనే ఉంటాను.”

‘అమ్మో బానే కొట్టింది దెబ్బ’,  అని మనసులో అనుకుంటూ, “నేను మాత్రం చేయించనా ఏంటి? వంట మనిషి ఉన్న తర్వాత అన్నీ చేయిస్తాను. అది కాక అదనంగా చాక్లెట్స్ అని నా ఉద్దేశం.  మంచి ఎలక్ట్రిక్ బ్రష్షులు, డెంటిస్ట్ దగ్గరికి మూడు నెలలకు ఒకసారి చెకప్ అని, అన్నీ చేయిస్తానుగా! పళ్ళు పడతాయి అనుకుంటూ ఇంక తినకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు? అయినా నేను ఇందాక చెప్పడం పూర్తి చేయలేదు. బావగారు కూడా పాత స్కూటర్ మీద రోజు ఆఫీస్‌కి వెళ్లి వెళ్లి అలసిపోతున్నారు. కాబట్టి నేనైతే మంచి కార్ కొనిస్తాను, ఇంట్లో అందరికీ సౌకర్యం.  ముఖ్యంగా బావగారికి.”

***

కొద్ది సేపటి తర్వాత ఇలా పోటా పోటీగా నడిచిన ప్రసంగాలు ముగిసాయి.

ఇలా వారం అంతా ప్రసంగాలు పూర్తి అయిన తర్వాత ఒకవైపు, పని మనుషులు, వారానికి రెండు సార్లు చాక్లెట్లు, కొత్త కారు, పిల్లలకు సైకిళ్లు, స్మార్ట్ ఫోన్లు ఇస్తామన్న ప్రకటన.

ఇంకోవైపు, పని మనుషులు, వారానికి రెండు సార్లు చాక్లెట్లు, 3 కొత్త కార్లు, పిల్లలకు సైకిళ్లు, స్మార్ట్ ఫోన్లు, ఊగడానికి ఉయ్యాల ఇస్తామన్న ప్రకటన.

ఇంతలో ఎలక్షన్స్ రానే వచ్చాయి.

అందులో ఊగడానికి ఉయ్యాల అన్న స్కీం వల్లో ఏమో కానీ మీనానే గెలిచింది.

ప్రైమ్ మినిస్టర్ కోడలుగా, వెలిగిపోతున్న మొహంతో, సంధ్య నుంచి లెక్కల పుస్తకం తీసుకొని ఇంక లెక్కలు వెయ్యడం మొదలుపెట్టింది, లెక్కలు వేసినట్లల్లా తన మొహంలోని సూర్యుడు అస్తమించడం మొదలుపెట్టాడు.

‘చెప్పేటప్పుడు, ఏదో పోటీలో చెప్పేసాను కానీ, వీటిల్లో ఒక్క పని చేసేంత డబ్బులు కూడా లేవుగా మన దగ్గర. సర్లే, ఇంట్లో వాళ్లే కదా ఏదో సరదాగా జరిగిన పోటీ విషయంలో వాళ్ళు ఏమంటారు నన్ను?’ అని మనసులో అనుకుంటూ బయటకి మాత్రం, “ఇంకా లెక్కలు వెయ్యడానికి కొన్ని రోజులు పడుతుంది, అప్పటివరకు కాస్త అందరూ తలో చెయ్యి వేసి పనులు చేసేస్తే, నేను త్వరలో అన్ని విషయాల గురించి చెప్తాను” అని అంది.

అందరూ కాస్త దిగాలుగా చూసినప్పటికీ, సర్లే ఎప్పుడో అప్పడికి చెయ్యకపోదా అని అనుకుని, ఎవరి పనులల్లో వారు మునిగిపోయారు.

ఎవరు ఏది అడిగినా, “ఇంకా లెక్కలు అవ్వలేదు” అంటూ కొంత కాలం గడిపేసింది.

ఇంతలో ఒకరోజు పిల్లలు హాల్లో కూర్చుని ధర్నా మొదలుపెట్టారు. “ప్రజాస్వామ్యంలో ధర్నా చెయ్యడం మా హక్కు! మీరు ఏ పనులు చెయ్యకపోయినా ఆరా తీయ్యడం మా హక్కు!” అంటూ అరవడం మొదలు పెట్టారు. భర్తా బావగారి సాయంతో వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసినా కూడా అది ఏమి పని చెయ్యలేదు.

అలా స్కూల్‌కి వెళ్లకుండా మూడు రోజులు అయ్యేసరికి, ‘వీళ్ళతో చాలా కష్టంగా ఉంది. పోనీ నిజం చెప్పేస్తే అయిపోతుంది. వీళ్ళ పోరు మాత్రం భరించలేకపోతున్నాను. అయినా వాళ్లకి కూడా తెలియాలిగా బాధ్యత. ఆ సంధ్యా కూడా వీళ్ళతో కలిసి తిష్ట వేసుకుని కూర్చుంది, దీన్ని ఇంక ఆపాల్సిందే.’ అని అనుకుంటుండంగా, ఇంతలో వాళ్ళ ఆయన మొబైల్ రింగ్ అవ్వడం మొదలయ్యింది.

“ఏమండి! ఏమండి!” అని పిలిచినా ఉలూకు, పలుకూ లేదు. అసలు ఎవరో చూద్దాం, అంటూ ఫోన్ లేపేసరికి, “సార్, నేను బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాను. మీకు ఏమైనా పర్సనల్ లోన్ కావాలా? మీరు ఇప్పుడే చెప్తే, అతి తక్కువ ఇంటరెస్ట్ రేట్‌కి మీరు లోన్ తీసుకోగలరు. అప్టూ 5 లాక్స్ మీ బ్యాంకు అకౌంట్‌లో వెంటనే వేసేస్తాం.”

అది విన్న మీనా కళ్ళలో ఒక మెరుపు మెరిసింది. దేవుడే తనకి ఒక దారి చూపించాడు అనే ఆనందంలో రూంలోని వెంకటేశ్వర స్వామి ఫోటో వైపు చూసి దండం పెట్టుకుంటూ “ఆ కావాలమ్మా! ఇప్పుడు నేను ఏం చెయ్యాలి?” అని ఉత్సాహంగా అడిగింది.

“ఏం లేదు మేడం. ఇప్పుడు నేను మీకు ఒక లింక్ పంపిస్తాను. ఆ లింక్‌లో అన్ని వివరాలు నింపి, సబ్మిట్ అని కొడితే, మీకు ఒక ఓటీపీ వొస్తుంది, దాన్ని కూడా ఫిల్ చేసి, రిసీవ్ లోన్ అని కొట్టారంటే చాలు. లింక్ పంపించమంటారా?”

“ఆ పంపించు బాబు, నేను వెంటనే సబ్మిట్ చేసేస్తాను.” అంటూ ఫోన్ పెట్టేసింది.

వెంటనే లింకు రావడం, అందులో అన్ని వివరాలు నింపడం, ఆ తర్వాత అకౌంట్లో 5 లక్షలు రావడం, అన్నీ టకటకా జరిగిపోయాయి.

తనకి ఇంక తిరుగే లేదన్న ఆనందంతో మీనా హాల్లోకి వెళ్లి, “ఇంక ఆపండి మీ ధర్నాలు! లెక్కలేయడానికి టైం పడుతుంది అని చెప్పాను కదా.. ఇప్పటికి, లెక్కలు పూర్తయాయి. రేపటి నుంచి నేను చెప్పిన విషయాలన్నీ అమలులోకి వస్తాయి.”, అంటూ సెలవిచ్చింది.

వెంటనే అన్ని పనులకు పని మనుషులని వెతకడం మొదలుపెట్టింది.

పక్కనున్న కిరాణ కొట్టుకు వెళ్లి ఒక డబ్బాడు చాక్లెట్లు కొనింది.

“కార్ షాప్‌కి ఎప్పుడు వెళ్దాం?” అంటూ వాళ్ళ ఆయన వైపు, బావగారి వైపు చూసింది.

ఇలా తను చెప్పిన అన్ని విషయాలను ఒక దాని తర్వాత ఒకటి పూర్తి చేయడం మొదలుపెట్టింది.

సంధ్యా కూడా దెబ్బకాశ్చర్యపోయి, “ఎలా చేయగలుగుతుంది ఇవన్నీ?” అని అనుకుంది.

నెలాఖరి వచ్చేసరికి ఈ.ఎం.ఐ. కట్  అవ్వడం మొదలయింది. రెండో నెల గడిచేసరికే ఈ.ఎం.ఐ. కి కూడా ఖాతాలో డబ్బులు లేవు. బ్యాంకు వారి కాల్ రాకుండా ఉండే విధంగా ఆ నెంబర్‌ను బ్లాక్ చేసింది. కొన్ని రోజులు గడిచేసరికి బ్యాంక్ వాడు ఇంటి దగ్గరికీ వచ్చాడు.

“కట్టేస్తాం లేవయ్యా! మేమేమైనా పారిపోతామా?”, అంటూ, అక్కడ కూడా వాడిని బయట నిలబెట్టి దబాయించే ప్రయత్నం చేసింది.

“ఇంకో వారంలో మాత్రం డబ్బులు కట్టలేదో అంతే సంగతులు!” అని వాడు కూడా బెదిరించి వెళ్ళాడు.

తనకు వీలైనంత కాలం అలాగే బ్యాంకు వాడిని దబాయిస్తూ, వేరే వాళ్ళ దగ్గర కూడా అప్పులు చేస్తూ, గడిపేసింది. కానీ ఒకరోజు బ్యాంకు వాడు రికవరీ ఏజెంట్లను పంపించి ఇల్లంతా గుల్ల చేశాడు. పిల్లలు ఏడవటం మొదలు పెట్టారు. భర్తా, బావగారు కూడా అరవడం మొదలుపెట్టారు. సంధ్యా కూడా “నేను అనుకుంటూనే ఉన్నాను, ఇలాంటిది ఏదో జరుగుతుంది అని!” అంటూ దెప్పడం మొదలుపెట్టింది.

ఎప్పుడూ మాట్లాడని రమ్య కూడా, “మేమేమో కష్టపడి సంపాదిస్తుంటే, మీరు ఇలా లోన్లు తీసుకుని అందరినీ రోడ్ మీద పడేస్తారా? ఏం మాట్లాడారేంటి అండీ?” అని అప్పడిదాకా మాట్లాడని ఏకాకి చిన్న బావగారిని కూడా రెచ్చకొట్టింది.

“ఆపండి!” అని గట్టిగా అరిచింది మీనా.

***

“మీనా! మీనా! ఎటో చూస్తున్నావ్ ఏంటి? నీ దారి నీదే కదా, నేను చెప్పిన ఒక్క మాటయినా విన్నావా?”

“అ! ఆ! వింటున్నాను అండి. సర్లేండి, ఇప్పడికే చాలా లేట్ అయిపోయింది. పడుకుందాం.”

“అమ్మో ఊహకే ఇంత భయంకరంగా ఉందంటే, అదే నిజమయితే? ఆ సంధ్యతో కావాలంటే సంధి చేసుకోవచ్చు కానీ ఈ ఎలక్షన్స్ రొచ్చు మాత్రం వొద్దు బాబోయి!” అని మనసులో అనుకుని పడుకునేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here