ప్రోత్సాహ బలం

2
13

[శ్రీ నీలం కృష్ణ మూర్తి రచించిన ‘ప్రోత్సాహ బలం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. ఇది ఈ యువ రచయిత తొలి కథ.]

[dropcap]సు[/dropcap]రేష్‌ది ఆస్తిపరుల కుటుంబం. అన్ని ఉన్నా అతనిలో ఏదో దిగులు. బాగానే చదువుకుంటాడు. కానీ ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు భయంగా ఆందోళనగా ఉంటాడు.

చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఎవరితోనూ కలవకపోవడం వల్ల అతనిలో ఒంటరితనం ఎక్కువ. స్నేహితులు కూడా తక్కువే. ఎప్పుడయినా అమ్మతోనే కాస్త తన మనసులో మాటల్ని చెప్పుకుంటాడు. కొడుకు స్వభావాన్ని గ్రహించిన ఆమె కొన్ని పుస్తకాలు కొనిచ్చి వాటిని చదవమని, లైబ్రరీకి వెళ్ళి ఇంకొన్ని పుస్తకాలు చదవమని, చదివిన దాని గురించి రాయమని చెప్తుంది. మెల్లిగా స్నేహితులతో కలవమని, వాళ్ళతో మాట్లాడుతూండమని ప్రోత్సహిస్తుంది.

అమ్మ చెప్పినప్పుడు అలాగే చేయాలనుకుంటాడు, కానీ మళ్ళీ ఏదో భయం అతన్ని వెనక్కి లాగుతూంటుంది.

అమ్మ చెప్పిన కొన్ని పుస్తకాలు చదివాడు. కాస్త మార్పు వచ్చింది. అయినా ఎక్కువ సేపు తన గదిలోనే ఉంటున్నాడు. కొద్దిరోజులుగా సురేష్ నాన్న కూడా కొడుకుని గమనిస్తున్నాడు.

ఒకరోజు ఆయన బయటకు వెళ్తూ.. కొడుకు గదిలోకి చూశాడు. తన భార్యని పిలిచి, “ఏంటి వీడు ఇలా ఉన్నాడు? ఎప్పుడు ఎవరితో మాట్లాడకుండా ఉంటాడు? ఏంటి? ఎవరికైనా మానసిక నిపుణులకి చూపిద్దామా?” అని అన్నాడు.

దానికి ఆమె, అవసరం లేదని, కొద్దిగా బిడయస్థుడు కావడం వల్ల, చొరవ లేకపోవడం వల్ల అలా ఉన్నాడనీ, తనతో బానే మాట్లాడుతాడని చెప్తుంది.

అయినా, ఎంతైనా అమ్మ కదా! “వీడి భయం ఏమిటో అడిగినా చెప్పడం లేదు. మనమే తెలుసుకొందాం” అని కొడుకుని ఏదో పని చెప్పి బయటకి పంపించింది. తర్వాత సురేష్ రూమ్‌కి వెళ్ళింది.

‘చెక్ చేద్దాం’ అనుకుంటూ సురేష్ గది పరిశీలనగా చూసింది.

కొడుకు ఎక్కువ సేపు కూర్చుని ఉండే టేబుల్ దగ్గరకు వెళ్లింది. అక్కడ తనిచ్చిన పుస్తకాలే కాకుండా, గొప్ప గొప్ప రచయితలైన శ్రీశ్రీ, రవీంద్రనాథ్ ఠాగూర్, షేక్స్‌ఫియర్ ఫొటోలు అంటించి ఉన్న పుస్తకం ఒకటి కనిపించింది. పక్కనే చెత్తబుట్టపై ఆమె దృష్టి పడింది. రాసి నలిపి పడేసిన కాగితాలు బుట్ట నిండా ఉన్నాయి. ఏమిటా అని తీసి చూస్తే అవన్ని కథలు. చివరలో స్వీయ రచన అనీ హామీ ఇస్తూ సురేష్ పేరు చూసింది. ఆమెకు ఏదో స్ఫురించింది.

ఇంతలో సురేష్ రావడంతో ఆ గదిని శుభ్రం చేస్తునట్టు చేస్తూ.. “రా నాన్నా” అని గది తుడిచి వెళ్లిపోయింది.

***

ఓ పత్రికలో శ్రీశ్రీ కళావేదిక వారి కథల పోటీ ప్రకటన కనబడింది సురేష్‌కి. ఒక్క క్షణం అతడి కళ్ళల్లో మెరుపు! ఏదో ఆలోచన తట్టి, కాగితం కలం తీసుకుని రాయడం మొదలుపెట్టాడు. కాసేపటికి ఓ చిన్న కథ తయారైంది.

దాన్ని మరోసారి చదువుకున్నాడు. బానే ఉందనిపించింది. కానీ మళ్ళీ ఏదో అనుమానం. ఎందరో గొప్ప గొప్ప రచయితలు పాల్గొనే ఈ పోటీలో తాను పాల్గొనడం, కథ పంపడం వ్యర్థం అని భావించాడు. ఒకవేళ పంపినా ‘ఇది అసలు కథేనా’ అని నవ్వుతారేమో అనుకున్నాడు. తనని తాను తక్కువ చేసుకుంటూ ఆ కథ కాగితాల్ని నలిపి బుట్టలో పడేశాడు.

***

ఆ రోజు నుంచి అమ్మ సురేష్‍తో మరింత సమయం గడపసాగింది. కొడుకుని ఒంటరిగా ఉండనీయడం లేదు. భర్తని కూడా వీలైనంత సేపు సురేష్‍తో గడిపేలా చేసింది. తన జీవితంలో అనుభవాలను షేర్ చేయడం మొదలు పెట్టింది. తనకి ఏదో ఒక ఆలంబన దొరికేలా చేసింది. మెల్లగా సురేష్ తన ఒంటరితనం నుండి బయటపడి అందరితో కలవటం అలవాటు చేసుకొన్నాడు. ఆలస్యం అయినా అతనిలో మార్పు వచ్చింది.

***

ఒకరోజు శ్రీశ్రీ కళావేదిక వారి నుండి ఫోన్ వచ్చింది. సురేష్ అమ్మ మాట్లాడింది. వారు నిర్వహించిన కథల పోటీలో సురేష్‌కు ప్రోత్సాహక బహుమతి వచ్చిందని చెప్పారు. త్వరలో జరగబోయే సభలో బహుమతిని అందజేస్తామని, సభ వివరాలు తెలియజేస్తామని అన్నారు. ఈ విషయం వినగానే అమ్మ ఆనందానికి అవధులు లేవు. ఎంతో సంతోషంతో ఈ విషయాన్ని సురేష్‌కి చెప్పి సర్‌ప్రైజ్ చేసింది.

సురేష్ ఆశ్చర్యపోయాడు. “నేను కథ పంపలేదమ్మా” అన్నాడు.

“నువ్వు రాసి చెత్తబుట్టలో పారేయడం చూశాను. నేను కొంత మెరుగుపరిచి, నీ పేరు మీద పోటీకి పంపాను” చెప్పింది.

సురేష్ ఆనందంతో అలా నిలబడిపోయాడు.

“ఫలితం గురించి ఆలోచించక చక్కగా కర్మ చేయడం మాత్రమే మన వంతు” అని చెప్పి, “అలా చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఇతరులతో పోల్చుకుని మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు” అని సురేష్‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది అమ్మ.

సురేష్ ఏ పెద్ద రచయితలను తలచుకుని తనని తాను తక్కువగా అంచనా వేసుకున్నాడో, అందులో ఒక రచయిత చేతుల మీదుగా బహుమతి అందుకుని సెభాష్ అనిపించుకున్నాడు. ఆ రచయితకి ఎందుకో సురేష్ మీద అభిమానం కలిగింది. తర్వాత కాసేపు మాట్లాడి, కొన్ని మెళకువలు తెలిపి, మరింత కృషి చేయమని, నీలో రాణించే సత్తా ఉందని చెప్పారు.

క్రమంగా సురేష్ తనపై తాను విశ్వాసం కలిగించుకుని, విస్తృతంగా చదువుతూ, అధ్యయనం చేస్తూ, అప్పుడప్పుడూ రాస్తూ సాహిత్య రంగంలో వర్ధమాన రచయితగా రాణించాడు.

***

మనలో కొంత టాలెంట్ ఉన్నా, దానికి ప్రోత్సాహమనే నీళ్ళు పోస్తూ అడుగులు వేస్తూ ఉంటే విజయం అనే చెట్టు ఫలం పొందవచ్చు అని తెలుసుకున్న సురేష్ తన విజయానికి కారణం అయిన అమ్మలా ప్రోత్సాహించే వాళ్లు ప్రతీ రచయితకి దొరకాలి అని భగవంతుడిని ప్రార్థించాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here