పులకించిన మది

67
6

[dropcap]ప[/dropcap]దవ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణులైన అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి మామిడి తోటలో వంటలు చేసుకుంటూ అరుస్తూ, కేకలు పెడుతూ ఆడుకుంటున్నారు. త్వరలో కాలేజీలో అడుగు పెడతామనే సంతోషంతో వారి ఆటలకు పట్టపగ్గాలు లేకుండా వున్నాయి. టీనేజ్‌లో వున్న వారికి ప్రపంచమంతా రంగుల మయంగా కనపడుతూ ఊహల్లో ఊరిస్తూ వుంది.

వారందరికీ అనిల్ నాయకత్వం వహిస్తూ అత్యంత ఆనందంగా ఆటలలో మునిగి తేలుతున్నాడు.

“సుమ్మి, ఇంటర్‌లో ఏ సెక్షన్ తీసుకుంటావ్?” ఆటలు ఆపి, సుమతి వైపు చూసి, కిందకి వంగిన మామిడి కొమ్మ మీదెక్కి కూర్చుని అడిగాడు అనిల్.

“నువ్వేం తీసుకుంటావ్?” అంది అనిల్‌ను చూసి, అక్కడే నిలబడ్డ మున్ని.

“మ్యాథ్స్ ఎందులో ఉండవో చూసి అది తీసుకుంటా” అన్నాడు అనిల్.

అది విని పకపకా నవ్వి “లెక్కల్లో శుంఠ” అంది ఉమ.

ఉమ కేసి కోపంగా చూసి, పళ్ళు కొరుకుతూ, కొమ్మ మీద నుండీ చటుక్కున దూకి వేగంగా ఉమ వైపు అడుగులు వేసాడు అనిల్.. అది చూసి అరుస్తూ అనిల్ చేతికి అందకుండా వెంటనే పరుగు తీసింది ఉమ. ఉమ వెనకాలే పరుగు పెట్టాడు అనిల్. మిగిలిన స్నేహితులందరూ కేరింతలు కొడుతూ చూడసాగారు.

కొద్ది దూరంలో గట్టు మీద కాలు పట్టు తప్పి గడ్డిలో పడిపోయింది ఉమ. వెంటనే లేచి కూర్చుని “సారీ.. సారీ.. కొట్టకురా అనిల్” అంది కిల కిల నవ్వుతూ. పరుగెత్తుకుంటూ వచ్చిన అనిల్, రొప్పుతూ నిలబడి ఉమను కోపంగా చూసి “సరే ఇంకోసారి అన్నావంటే ఊరుకోను” అన్నాడు.

లేచి నిలబడి డ్రెస్‌కు అంటుకున్న గడ్డి, మట్టి దులుపుకుని “అదిగో అక్కడ ఉయ్యాలలు కట్టారు. పద వెళ్దాం.. రా త్వరగా” అంటూ పరుగెత్తింది. అటు చెట్ల వేపు చూసాడు అనిల్. అక్కడ వున్న పెద్ద పెద్ద మామిడి చెట్ల కొమ్మలకు లావాటి తాళ్లతో ఊయలలు కట్టి ఊగుతున్నారు. వాళ్ళను చెరో పక్క నిలబడ్డ ఇద్దరు ఊతమిచ్చి ఇంకా వేగంగా ఆ ఊయలను పైకి తోస్తున్నారు. అది చూసి తానూ ఉత్సాహంగా అటు వైపు పరిగెత్తాడు అనిల్. ఒక ఊయల ఎక్కి కూర్చొని తాళ్లు రెండు పక్కల గట్టిగ పట్టుకుని ఊయలను వేగంగా ముందుకు, వెనక్కు ఊపసాగింది. తననే చూస్తున్న అనిల్ ను చూసి “కాస్త చేతులతో ఊయల నెట్టు” అంది.

అనిల్ దగ్గరగా వచ్చి ఊయల వేగాన్ని తన చేతులతో త్రొస్తూ పెంచసాగాడు. దాంతో ఊయల చాలా పైకి వెళ్ళసాగింది. ఆనందంతో ఉమ అరుపులు వింటూ సంతోషంగా చూస్తూ నిలబడి పోయాడు., ఎప్పుడూ లేనట్టుగా మొదటి సారి ఉమ అతని కళ్ళకు చాలా అందంగా కనపడింది. కొద్దిసేపటికి ఊయల దిగి ఆ ఊపులో అనిల్‌ను చేతులతో పట్టుకొని, కింద పడకుండా నిలబడి సంతోషంతో అనిల్‌ను పట్టుకుని “వెరీ గుడ్, భలే మజా వచ్చింది అనిల్. నువ్వూ ట్రై చెయ్” అంది.

సమాధానం చెప్పకుండా ఉమ కాటుక కళ్ళను చూడసాగాడు “అనిల్, వెళ్ళూ” అంది గట్టిగా తోస్తూ. ఏమీ మాట్లాడకుండా తనను పట్టుకున్న ఉమ చేతులు విడవకుండా నిలబడ్డాడు. రెండు సెకన్లు అనిల్ కళ్ళలోకి తన చూపు నిలిపింది ఉమ. “కొత్తగా చూస్తున్నావేంటి? వెళ్ళు” అంది ఊయల వేపు నెడుతూ.

ఏం జరుగుతుందో అర్థం కానీ మానసిక స్థితిలో ముందుకు కదిలాడు అనిల్.

మరుసటి వారం సుజాత ఇంట్లో, ఉమ,అనిల్, వినోద్ కలిసి ఇంటి పెరడులో ఒక మూల నున్న బావి దగ్గర కూర్చున్నారు. రెండు బక్కెట్లలో వున్న ఒక్కొక్క చీర తీసి ఉతుకుతూ వుంది సుజాత.

“ఇవి ఉతకటం అయిపోగానే వచ్చేస్తా” అంది సుజాత మరి కొన్ని బట్టలు వాషింగ్ మెషిన్‌లో వేస్తూ..

బావి గట్టు ఎక్కి కూర్చున్నాడు అనిల్. బావి గట్టుకి ఆనుకుని నుంచున్న ఉమ కూడా మెల్లిగా గట్టు ఎక్కి కూర్చుంది.

ఈ మధ్య చూసిన సినిమా గురించి చెప్తూ వున్నాడు వినోద్. అది వింటూ బట్టలు జాడిస్తోంది సుజాత.

పక్కన కూర్చున్న ఉమ కేసి చూసాడు అనిల్. ఉమను చూస్తూ, చెవికి ఊగుతున్న జూకాలను, చెవి పక్క నుండీ జాలువారి, మెడ మీద మెరుస్తున్న సన్నని అందమైన బంగారు చైన్‍ను చూస్తూ మైమర్చిపోయాడు అనిల్.

అతనికి, ఎప్పుడూ లేనంత అందంగా కనిపించింది ఉమ.

సుజాత ఏదో అంటోంది. కానీ అనిల్ కేమీ వినిపించటం లేదు. ఉమ ముంజేతుల వైపు చూసాడు. అర చేయి మొత్తంగా గోరింటాకు ఎరుపు రంగుతో మెరుస్తూ వుంది. వేలి కొనలు కూడా గోరింటాకు పూతతో లేతగా మెరుస్తున్నాయి.

మెల్లిగా ఉమ చేయి తీసుకుని వేళ్ళను ముట్టుకున్నాడు

“ఏమైంది?” అంది ఉమ తన వేళ్ళను చూసుకుని.

“ఏమీ లేదు.. గోరింటాకు బాగా పట్టింది” కంగారు పడుతూ అన్నాడు చేయి వదిలేసి.

అతని కంగారు గమనించిన ఉమ ఒక్క క్షణం అనిల్ కళ్ళ లోకి చూసి అతని భావాలను చదవటానికి ప్రయత్నించి, ఆలోచనలో పడింది. అక్కడ కూర్చున్నంత సేపూ ఉమ మనసంతా అదోలాగా వుంది.

***

ఉమా, అనిల్, సుజాత పొలం గట్టు మీద మౌనంగా కూర్చున్నారు. అందరి మనసులు బాధతో బరువెక్కి వున్నాయి.

ముందుగా సుజాత “సెలవులకు వస్తూ ఉంటాం కదా..” అంది ఓదార్పుగా.

ఒకసారి సుజాత వైపు చూసి “అంతే.. నెలో రెండు నెలెలకొకసారి అనుకో” దిగులుగా అన్నాడు అనిల్.

“మరి మన ఊళ్ళో కాలేజీ లేదుగా? తప్పదు. చదువుకోవాలంటే” అంది ఉమ.

“సరే మేము పక్క ఊరిలోనే.. నువ్వెందుకు అంత దూరం వెళ్తున్నావ్?” అడిగింది ఉమ పక్కనున్న అనిల్‌ను ఉద్దేశించి.

“మా అన్నయ్య అక్కడే ఉద్యోగం, అక్కడ కాలేజీ బావుందని పంపిస్తున్నారు.” చిరాకుగా అన్నాడు అనిల్.

ప్రతి నెలా సెలవులు ఒక్క రోజు వచ్చిన సరే, అందరూ తిరిగి వచ్చి అక్కడే కలుసుకోవాలని గట్టిగా నిర్ణయించుకుని బరువైన మనసుతో లేచి నిలబడి నాలుగు అడుగులు వేశారు.

వున్నట్టుండి ఆగిపోయి “ఉమా!” అంటూ పిలిచాడు అనిల్.

“ఏమైంది?” అని నిలబడి వెనుక ఆగి వున్న అనిల్ దగ్గరకు రెండు అడుగులు వేసి అతని కేసి చూసింది ఉమ.

ఏమీ మాట్లాడకుండా అలాగే ఉమను కళ్ళార్పకుండా చూసాడు అనిల్. అతని కళ్ళలో నుండీ అతని మనసులోని భావాలను చదవడానికి యత్నించసాగింది ఉమ. అవి అర్థం అవుతున్నట్లనిపించి మనసంతా ఝల్లుమంది ఉమకి. మదిలో వీణలు మ్రోగినట్లనిపించింది అనిల్‌కు. మెల్లిగా ఉమ అరచేతినందుకుని తన రెండవ చేతితో మృదువుగా పట్టుకుని “నన్ను మరవవు కదా?” అన్నాడు. అతని గొంతులో ఏదో అడ్డం పడ్డట్టు అనిపించి ఆగిపోయాడు.

అతని కళ్ళలో కళ్ళు పెట్టి “ఛ.. అవేం మాటలు.. పిచ్చబ్బాయి.. పద ఇంటికి, చీకటి పడుతోంది” అంది ఉమ. ఆకాశం వైపు చూసాడు అనిల్. ఆకాశంలో చీకట్లు ముసురుకుంటున్నాయి. పక్షులు గుంపులుగా గూళ్లకు చేరుకుంటున్నాయి. దూరంగా రాములవారి గుడి మైక్ నుండి భజనలు మొదలయ్యాయి. ముగ్గురూ ఇంటి దారి పట్టారు.

ఆ రోజు రాత్రి చాప మీద కూర్చుని అన్నం తింటూ “అమ్మా.. ఇక్కడే ఉండి చదువుకుంటానే” అన్నాడు.

“ఎలా కుదురుతుందిరా.. మీ నాన్న పోయినప్పటి నుండీ ఇక్కడ పూట గడవటమే కష్టంగా ఉందిగా. అయినా నువ్వేళ్తోంది అన్నయ్య ఇంటికే కదా.. దిగులెందుకు?” అంది భారతి కొడుకు తల మీద చెయ్యి వేసి నిమురుతూ.

జీవిత ప్రయాణంలో అతి ముఖ్యమైన మలుపు తిరిగే మజిలీ వేపు, రెండు రోజుల తర్వాత ఎర్ర బస్సెక్కి అన్నయ్య ఇంటికి చేరుకున్నాడు అనిల్. రెండు సూట్‌కేసులు మోసుకుంటూ ఆటో దిగి ఇంట్లోకి అడుగు పెడుతుండగా వంటింట్లో నుండి బయటకు వచ్చిన రంగనాయకమ్మను చూసి “నమస్కారం వదినా” అన్నాడు అనిల్.

అనిల్‍ను చూడగానే మొహం మాడ్చుకుని “ఊఁ” అని తిరిగి లోపలికి వెళ్ళిపోయింది.

చివుక్కుమన్న మనసుని గట్టి చేసుకుని సూట్‌కేసులు రెండూ పక్క గదిలో పెట్టి మంచం మీద కూర్చున్నాడు.

అమ్మ చెప్పిన విషయాలు మరొక్క సారి మననం చేసుకుని వంటింట్లోకి అడుగు పెట్టి “వదినా.. కూరగాయలు కోసివ్వనా?” అని అడిగాడు, మొహంలో నవ్వు నింపుకుంటూ.

“అదిగో ఉల్లిపాయలు తరిగివ్వు.. వస్తుందా నీకు” అంది సంతోషంగా.

“వంటలన్నీ వస్తాయి వదినా.. అమ్మకు సహాయం చేస్తుంటాను కదా” అన్నాడు నవ్వుతూ.

“ఇంకా పిల్లలకు స్నానం చేయించ లేదు, తర్వాత కాస్త చేయించు” అంది. వెంటనే అనిల్ కళ్ళలో అమ్మ కదలాడింది. పనికి సహాయానికి వెళితే ‘ఆడుకో వెళ్ళరా’ అని లేదా ‘చదువుకో వెళ్లి ‘ అని అనడం గుర్తొచ్చి మనసంతా దిగులుగా అయిపోయింది. ఆ ఆలోచనలను దూరంగా నెట్టి, వదినకు సహాయం చేయటం మొదలు పెట్టాడు.

సాయంత్రం చీకటి పడగానే ఆరు బయట మంచాలు వేయటం, పరుపులు వేసి దుప్పట్లు సర్దటం లాంటి పనులు అనిల్‍కు అప్పచెప్పారు.

ఆ రాత్రి అన్నయ్య రాగానే వెళ్లి సర్టిఫికెట్లు ముందు పెట్టాడు. “రేపు ఉదయం పదకొండు గంటలకు కాలేజీకి వచ్చేయి, నేనూ అక్కడికి వస్తాను” అన్నాడు రఘు, తమ్ముడు అనిల్ వంక చూసి.

రాత్రి ఆరు బయట నవారు మంచం మీద పడుకుని ఆకాశంలో చుక్కల్ని చూడసాగాడు అనిల్. అతని కళ్ళ ముందు ఉమ కదలాడింది. ‘సెలవు రాగానే ఊరికెళ్ళాలి’ అనుకుని నిద్రలోకి జారుకున్నాడు.

ఉదయం లేచి పనులన్నీ ముగించుకుని వంటింట్లోకి వెళ్ళాడు అనిల్. అందరూ ఉదయాన్నే కాఫీలు తీసుకున్నారు. చాలా సేపు ఎదురు చూసాడు కానీ వదిన కాఫీ ఇవ్వలేదు.

పది గంటల వరకూ వదినకు వంటింట్లో సహాయం చేసి కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయ్యి “వదినా.. కాలేజీ సమయం అవుతుంది, వెళ్ళొస్తాను” అన్నాడు.

“సరే” అంది.

టిఫిన్ పెడుతుందేమో అని కాసేపు నిలబడ్డాడు. అది చూసి “ఈ రోజు టిఫిన్ మిగల లేదు.. మధ్యాహ్నం త్వరగా భోజనం చేద్దువు గానీ” అని లోపలి వెళ్ళిపోయింది.

అనిల్ కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. టేబుల్ మీద ఉన్న నీళ్లు మొత్తం తాగేసి కాలేజీకి బయలు దేరాడు.

ఆ రోజు కాలేజీ ముందు నిలబడి చుట్టూ చూసి మరో రెండు సంవత్సరాలు ఊరి నుంచి, ఉమ నుండీ దూరంగా ఇక్కడ గడపాలి అని నిట్టూర్చాడు.

కాలేజీలో అడ్మిషన్స్ కై కొత్త విద్యార్థులందరూ ఆఫీస్ రూమ్ ముందు గుమి గూడి ఉండటం చూసి అటు వైపు నడిచాడు అనిల్. కౌంటర్ లో ఫీజు కడుతూ రసీదులు తీసుకుంటున్నారు అమ్మాయిలు, అబ్బాయిలు.

అమ్మాయిలకు వేరే కౌంటర్ ఏర్పాటు చేశారు. అక్కడ సంతోషంగా, ఉత్సాహంగా మాట్లాడుకుంటున్న అబ్బాయిలను గమనించసాగాడు అనిల్.

కాలేజీ వాతావరణం చాలా కోలాహలంగా ఉండి, కళకళ లాడుతోంది. తనకు తెలిసిన ఊరి వారెవరైనా కనపడతారేమోనని గమనించసాగాడు.

తన ముందు నుంచి గలగలా నవ్వుతూ వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలను చూసాడు. అందులో ఒకమ్మాయిని చూస్తుంటే చిత్రమైన భావం కలిగి ఆ అమ్మాయిని గమనించసాగాడు. తల నిండుగా నూనె దట్టించి, పొడవాటి జడ వేసుకుని, ప్రపంచం లోని ఆనందం అంతా తన మనసులో నింపుకున్నట్లుగా నవ్వుతూ కబుర్లు చెప్తూ వెళ్తున్న అమ్మాయిని చూసి కాసేపు అన్నీ మర్చిపోయాడు అనిల్.

ఫీజు కట్టి అనిల్ దగ్గరకు వచ్చాడు. “ఇదిగో ఈ పేపర్ తీసుకుని క్లాస్ కెళ్ళి అక్కడ చూపించు.” అని కొన్ని పేపర్ అనిల్ చేతిలో పెట్టి “జాగ్రత్త” అని చెప్పి కాలేజీ బయటకు వెళ్ళిపోయాడు రఘు.

అవి చేతిలో పెట్టుకుని తన క్లాస్ రూమ్ వెతుక్కుంటూ వెళ్లి అక్కడ నిలబడి చూసాడు. ఇంకా లెక్చరర్ ఎవరూ రాలేదు. చాలావరకు ముందు వరస సీట్లలో అప్పటికే కూర్చుని ఉండటంతో వెనక్కి వెళ్లి నాల్గవ వరసలో కూర్చున్నాడు అనిల్.

ముందు వరసలో కొందరు వెనక్కి తిరిగి అనిల్ వేపు చూసి పలకరింపుగా నవ్వారు. తరగతిలో సగం వేపు అబ్బాయిలు, ఇంకో వైపు అమ్మాయిలు కూర్చున్నారు.

అందరిని పరికించి చూసాడు. అందరూ మంచి బట్టలు వేసుకుని ఉత్సాహంగా కనిపించారు. అమ్మాయిలయితే వారి లోకంలో వారు గలగలా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ వున్నారు. ‘నేనూ నా వూరి కాలేజీలో ఉంటే ఇలాగే హాయిగా ఎంజాయ్ చేసే వాడిని’ అనుకున్నాడు.

మొదటి రోజు కావడంతో లెక్చరర్ వచ్చి ప్రతి విద్యార్థి వూరు, పేరు చెప్పించుకున్నారు. అదిగో అప్పుడు చూసాడు ఆ గలగల నవ్విన అమ్మాయిని. ఆ అమ్మాయి చెప్పిన వివరాలు, పేరు శ్రద్దగా విన్నాడు. ‘ఓహో పేరు కళ్యాణి, ఇదే ఊరన్నమాట’ అనుకున్నాడు. వివరాలు చెప్పి అందరికీ చేయి ఊపి నవ్వుతూ కూర్చున్న ఆ అమ్మాయిని గమనించ సాగాడు.

అనిల్ చూస్తున్న విషయం తెలిసిన కళ్యాణి జడను ముందుకు సర్దుకుని అరచేయి చెంపకు ఆనించి లెక్చరర్ చెప్పేది వింటూ వుంది.

కొద్దీ సేపు కళ్యాణిని చూసి, తిరిగి మిగిలిన అబ్బాయిలను, అమ్మాయిలను చూసాడు అనిల్. ఎవరూ అందంగా కనిపించలేదు.

మళ్ళీ చూసాడు కళ్యాణి వేపు. తానింత వరకు ఎరిగిన స్నేహితులతో ఎవరూ కూడా ఇంత బాగా కనిపించలేదు, ‘ఏంటి? అసలీ అమ్మాయిలో వున్న ఆకర్షణ!’ అనుకున్నాడు. పక్కనున్న అబ్బాయిని అడిగాడు “కళ్యాణి వాళ్ళది ఇదే ఊరా?” అని.

అనిల్ వైపు ప్రశ్నార్థకంగా చూసి “అవును, కాలేజీ ముందున్న వీధి లోనే వుంటారు. తండ్రి తహసీల్దార్” అని మెల్లిగా చెవిలో చెప్పాడు.

హిందీ క్లాస్ కొరకు అన్ని సెక్షన్ విద్యార్థులు కలిసి ప్రత్యేకంగా ఇంకో గదిలో కూర్చునేవారు. అదిగో అక్కడ కళ్యాణికి దగ్గరగా కూర్చొని వీలు కలిగేది అనిల్‌కి. ఎందుకంటే ఆ హిందీకి చాలా తక్కువ విద్యార్థులు వచ్చేవారు. చాలావరకు తెలుగు క్లాస్‍కు వెళ్లేవారు.

అప్పుడు వీలైనంత ఎక్కువ సమయం కళ్యాణిని చూస్తూ వున్నాడు అనిల్. అలా అనిర్వచనీయమైన ఆనందానికి గురయ్యేవాడు. అప్పుడప్పుడు అనుకునేవాడు ఇన్ని కష్టాల్లో ఉండీ, అమ్మాయిని చూడటమేమిటి.. ముందుగా జీవితంలో పైకి రావాలి అని. కానీ కళ్యాణి ని కనపడగానే అన్నీ మర్చిపోయేవాడు.

కాలేజీ మొదలయి నెల కావొస్తున్నా పుస్తకాలు కొనివ్వలేదు. అన్నయ్యను అడగాలంటే భయమేసి ఒక రోజు వదినకు చెప్పాడు అనిల్. కానీ అనిల్ చెప్పింది విని పట్టించుకోలేదు రంగనాయకమ్మ.

సాయంకాలం ఇంటికి వెళ్ళగానే ఎన్నో పనులు ఎదురు చూస్తుండేవి. బజారుకు వెళ్లి రోజు వారీ సరుకులు, కూరగాయలు తేవటం, పిల్లలకు అన్నం తినిపించడం, చిన్నవాడు నిద్ర పోయే వరకూ ఊయల ఊపటం, మంచాలు వేసి పరుపులు వేయడం లాంటి అన్ని పనులు చేసే సరికి రాత్రి పది గంటలు దాటేది. ఆఖరున గిన్నెలో మిగిలిన అన్నం కూరలు తిని పడుకునేవాడు అనిల్.

రాత్రి పడుకోగానే నిద్ర పోయేవాడు. ఆ సమయంలో అతనికి ఊరు, ఆడుకున్న ఆటలు, పొలాలు, స్నేహితులు గుర్తుకొచ్చేవారు. ఒక రాత్రి మంచం మీద పడుకుని, ఆకాశంలో చంద్రుని చూస్తూ, ఉమను గుర్తు చేసుకున్నాడు. ఒకసారి ఊరెళ్ళి కలవాలని అనుకుని, ఉమ ఈ పాటికి మర్చిపోయిందేమో అనుకున్నాడు.

చదువు కోవడానికి పుస్తకాలు ఏ ఒక్కటి లేకపోవడంతో పరీక్షల్లో ఏ పేపర్ కూడా సరిగ్గా రాయలేక పోయాడు. పరీక్ష సమయంలో ఆన్సర్ పేపర్ ముందేసుకుని ఏం రాయాలో తెలీక, జీవితంలో మొదటి సారిగా నిస్సహాయంగా వుండిపోయాడు అనిల్.

తోటి విద్యార్థులందరూ తలలు వంచుకొని రాస్తూ వున్నారు. అందరినీ చూస్తూ వున్న లెక్చరర్, ఏమీ రాయకుండా కూర్చున్న అనిల్‌ను గమనించి దగ్గరకు వచ్చి నిలబడి ఆన్సర్ పేపర్ పేపర్ చేతిలోకి తీసుకుని చూసి, అనిల్ వైపు చిరాకుగా చూసి వెళ్లిపోయాడు. పదవ తరగతి జిల్లా మొత్తంగా మొదటి ర్యాంకులో వుండే అనిల్ కాలేజీ త్రైమాసిక పరీక్ష లన్నింటిలో ఫెయిల్ అయిపోయాడు.

వారం తర్వాత పరీక్ష ఫలితాలు విడివిడిగా క్లాస్‌లో చెప్పసాగారు. ఆ రోజు ప్రతి క్లాస్‌లో అందరి ప్రశ్న జవాబు పత్రాలు చేతుల్లో తీసుకుంటూ ప్రతి ఒక్కరి మార్కులు చదవ సాగారు జూవాలజీ అధ్యాపకులు జగ్గారావు మాస్టారు గారు. వచ్చిన మార్కులు విని విద్యార్థులందరూ ఒకరినొకరు ఆనందంగా చూసుకో సాగారు.

ఆఖరున అనిల్ రాసిన జవాబు పత్రం చేతులో తీసుకుని “అనిల్” అంటూ పిలిచారు జగ్గారావు మాస్టారు.

లేచి నిలబడ్డాడు అనిల్. అతన్ని నిలువెల్లా చూసి “మూడు మార్కులు మాత్రమే వచ్చాయి” అన్నారు జగ్గారావు మాస్టారు.

అది విని విద్యార్థులందరూ అనిల్ వైపు ఛీత్కారంగా చూసారు. వారి చూపులు తట్టుకోలేక తలవంచుకుని నిలబడ్డాడు అనిల్. అతని కళ్ళలో తడి.

తిరిగి అన్నారు జగ్గారావు మాస్టారు “నీకు సైన్సు మీద ఆసక్తి లేకుంటే ఇక్కడ బలవంతంగా కూర్చోవద్దు. కామర్స్ లేదా ఆర్ట్స్ లోకి మార్చుకో. నేనే నిన్ను తీసుకెళ్లి అందులో మార్పిస్తాను,” అని చెప్పి అనిల్‌ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించారు.

తల వంచుకుని అలాగే నించున్నాడు అనిల్. పదవ తరగతిలో అన్నింటి కంటే సైన్స్ లోనే ఎక్కువ మార్కులు వచ్చాయనే విషయం గుర్తుకొచ్చింది అనిల్ మనసుకి.

“టెక్స్ట్ బుక్స్ ఇంకా కొనలేదు సార్” అన్నాడు మెల్లిగా తన అసహాయతను వెలిబుచ్చుతూ.

అది విని ఏమీ మాట్లాడలేక “సరే కూర్చో బాబు. వచ్చే పరీక్షల వరకు కొనుక్కో” అన్నారు.

కూర్చుని తనని వింతగా చూస్తున్న వారి వైపు చూడలేక తల కిందకు వేసుకున్నాడు అనిల్.

ఆ రోజు ఇంటికెళ్లగానే వదినకు వంటింట్లో సహాయం చేస్తూ మెల్లిగా అన్నాడు “వదినా.. పుస్తకాలు కొనలేదు, పరీక్షల్లో మార్కులు తక్కువొచ్చాయి.”

త్వరలో వస్తున్న పెళ్లి రోజుకు నెక్లెస్ కొనివ్వడం కుదరదని అప్పుడే చెప్పి వెళ్లిన భర్త మీద రగిలి పోతున్న రంగనాయకమ్మకు అనిల్ మాట వినే సరికి కోపం నషాళానికి అంటింది.

“మీ అమ్మకు ఫోన్ చేసి తెప్పించుకో, మా ఖర్చులు మాకే సరిపోవడం లేదు. మీ అన్నయ్యకు పెద్దరికాలు ఎక్కువయ్యి నీ చదువు బరువు ఒప్పుకున్నాడు” అని రుసరుసలాడుతూ అంది.

మనసులో దుఃఖం ఉప్పొంగుతుండగా దాన్ని కనపడనీయకుండా, మొహంలో ఎటువంటి భావాన్ని కనపడనీయకుండా ఇంటి వెనక పెరటి వేపు నడిచాడు. అక్కడున్న వేప చెట్టు పక్కలో వెళ్లి నిలబడి భోరున ఏడవటం మొదలెట్టాడు. కాస్త దూరంలో కృష్ణా నది వంతెన మీదుగా వెళ్తున్న ట్రైన్ కూతలో, ఆ వంతెన చప్పుడులో అనిల్ రోదన కలిసి పోయి, ఎవరికీ వినపడలేదు. చాలా సేపటి తర్వాత మొహమంతా కడుక్కుని, దుఃఖాన్ని తుడుచుకుని ఇంట్లోకి వెళ్లి మంచాలు, పరుపులు తీసుకొచ్చి బయట సర్దసాగాడు.

***

కాలేజీ ప్రాంగణమంతా నిశ్శబ్దంగా వుంది. పాఠాలు చెబుతున్న అధ్యాపకుల కంఠ స్వరాలూ మాత్రమే ప్రతిధ్వనిస్తున్నాయి.

కడుపులో ఏదోలాగా అనిపించేటప్పటికీ క్లాస్ మధ్యలో బయటకు వెళ్లి కడుపు నిండా నీళ్లు త్రాగి వచ్చాడు అనిల్. ప్రొద్దున తిన్న కొద్దిపాటి ఉప్మా అరిగిపోయి ఆకలి మొదలయ్యింది. లంచ్ బెల్ కావడానికి ఇంకా గంట ఆగాలి అనుకున్నాడు.

లంచ్ రూమ్‌లో పెట్టిన స్టీల్ డబ్బా, అందులో వుండే సాంబార్ అన్నం గుర్తుకొచ్చింది. అలా గుర్తుకు రాగానే వెంటనే ఇంకా ఆకలి ఎక్కువయ్యింది. అక్కడకు వెళ్లి పోయి అన్నం తినేద్దాం అనుకున్నాడు. కానీ అప్పుడే తినేస్తే మళ్ళీ మధ్యాహ్నం తర్వాత ఆకలేస్తే ఎలా అనే ఆలోచన వచ్చి తినాలనే కోరిక మానుకున్నాడు. వేరే విద్యార్థుల డబ్బా తీసి ఎవరూ చూడకుండా దొంగతనంగా తినేస్తే ఆకలి తీరుతుంది కదా అనుకున్నాడు. ఛీ ఛీ దొంగతనం చేయటమా అని అనుకున్నాడు.

“బాబు అనిల్.. ఏంటి పరధ్యానం లో వున్నావ్? నీకు ఇంట్రెస్ట్ లేకుంటే బయటకు వెళ్ళు” అన్నారు బోటనీ మేడం జానకి.

ఆ మాట తో ఉలిక్కి పడి లేచి నుంచుని “లేదు మేడం.. వింటున్నాను” అన్నాడు.

వెనక్కి తిరిగి అనిల్‍ను తేరిపార చూసింది కళ్యాణి. చూడటానికి తెలివైనవాడుగా కనిపిస్తున్నాడు మరైతే చదువు మీద ఆ ఆసక్తి ఎందుకు లేదో అనుకుంది. అందరితో పాటు తననే చూస్తున్న కళ్యాణి కళ్ళల్లోకి చూసి ఎక్కువసేపు చూడలేక కళ్ళు దించుకున్నాడు అనిల్.

ఆ రోజు లంచ్ బెల్ కాగానే అందరికంటే ముందు వెళ్లి డబ్బా తీసుకుని తిన్నాడు అనిల్. సోమవారం నుంచి కాలేజీకు మూడు రోజుల సెలవులు ప్రకటించారని తెలిసి అతని మనసు ఊరట చెంది ఆ రాత్రి అమ్మను గుర్తు చేసుకుంటూ నిద్రపోయాడు.

ఉదయం లేచి ఊరికి బయలుదేరాడు అనిల్. బస్సు ఊరికి దగ్గరవుతుండగా అతని మనసు గంతులు వేయడం మొదలెట్టింది. బస్సు దిగి ఇంటికి వెళ్లకుండా, చుట్టూ తిరిగి ఉమ ఇంటి ముందు ఆగి లోకి చూసాడు. ఉమ కనపడ లేదు. గడప దాటి లోనికి అడుగు వేసి చూశాడు.

కుర్చీలో కూర్చొని మొబైల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని సంతోషంగా నవ్వుతూ, గలగలా మాట్లాడుతూ వుంది.

కాసేపు నిలబడి ఉమను చూస్తూ ఉండిపోయాడు అనిల్. అప్పుడు అనిల్‍ను చూసింది ఉమ.

కూర్చో అన్నట్లుగా ఎదురుగా వున్న మరో కుర్చీ వేపు సైగ చేసింది. చాలా సేపు మొబైల్‍లో మాట్లాడి ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టి “ఎలా వున్నావ్ అనిల్?” అంది తెచ్చి పెట్టుకున్న నవ్వుతో..

కనపడగానే మీద పడి మాట్లాడుతుందనుకున్న ఉమ అలా అనాసక్తిగా పలకరించేసరికి అతను నిరాశతో ఊపిరి గట్టిగా పీల్చి లేచి నిలబడి “బావున్నాను ఉమ, మళ్ళీ కలుస్తాను” అని బయటకు అడుగులు వేసాడు.

“సరే అనిల్” అని చెప్పి వెంటనే మొబైల్ తీసుకుని నెంబర్ కలిపి “హలో రాజు చెప్పు,. మా ఊరి అబ్బాయి వచ్చాడు, కొద్దిగా అమాయకుడులే.. సారీ.. అందుకే కట్ చేశాను” అని నవ్వుతూ గలగలా మాట్లాడసాగింది.

ఉమ ఇంట్లోనుండి బయటకు వెళ్లి తనింటి వైపు నిరాశగా అడుగులు వేసాడు అనిల్. ట్రాక్టర్‍లో గడ్డి వేసుకుని వెళ్తున్న వెంకన్న అనిల్‍ను చూసి ట్రాక్టర్ పైనుండే చేయి ఊపి “ఏరా అనిల్ ఎప్పుడు రావటం.. కాలేజీ బాగుందా?”అడిగాడు చిరునవ్వుతో.

“బావుంది బాబాయి” అని బలవంతంగా మొహాన నవ్వు పులుముకుంటూ అన్నాడు.

ఇంట్లోకి అడుగుపెట్టగానే తల్లి కనపడలేదు. వంటింట్లోకి వెళ్లి చూస్తే పొయ్యి మీద నుండీ గిన్నె దింపుతూ కనిపించింది.

“అమ్మా..” అంటూ సంతోషంతో పిలిచాడు అనిల్.

గిన్నె చటుక్కున కింద పెట్టి “ఒరేయ్ కన్నా.. ఎలా ఉన్నావురా?” అని కొడుకుని కౌగిలించుకుంది భారతి.

తల్లి చేతుల్లో చిన్న పిల్లాడిలా ఒదిగి పోయి వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టాడు అనిల్. అతని మనసులో నిండి పోయిన బాధ అంతా ఒక్కసారిగా బయటకు పెల్లుబికింది.

బిత్తర పోయిన భారతి కొడుకుని గట్టిగా అలముకుంటూ “ఏమిటయ్యిందిరా” అంది కంగారుపడుతూ.

“నే ఇక వెళ్ళను, ఇక్కడే ఉంటా.. అక్కడ కష్టంగా వుందే” అన్నాడు ఏడుపునాపుకుంటూ. అంతకంటే ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియడం లేదు అతనికి.

“అలాగంటే ఎలారా? నువ్ చదువుకుని పైకి రావాలి. మనకు వేరే దారి లేదు. వాడు స్వంత అన్నయ్య కానప్పటికీ నిన్ను చదివిస్తున్నాడు. కొద్ది రోజులు భరించాలి” అంది కొడుకు వీపు నిమురుతూ. అలా చాలా సేపు ఏడుస్తూ వుండిపోయాడు అనిల్.

సెలవులు అయిపోగానే మొదటి రోజు కాలేజీ మెట్లు ఎక్కి ఆకస్మికంగా వెనక్కి తిరిగి చూసాడు అనిల్. దూరంగా వున్న ప్రహరీ గేటు దాటుకుని కళ్యాణి రావడం చూసి అలాగే నిలబడి పోయాడు. ఆమెను చూస్తుంటే అతని మదిలో ఏవో తెలియని భావాలు ఉప్పొంగ సాగాయి. దగ్గరగా వస్తున్న కొలదీ గమనించసాగాడు. రింగులు తిరిగిన జడ, నుదుట చిన్న బొట్టు, ప్రశాంతంగా వుండే కళ్ళు,చెరగని నవ్వు, పైగా కంటి పక్కలో వుండే చిన్న పుట్టు మచ్చ కళ్యాణిలో అందాన్ని రెట్టింపు చేశాయి. అక్కడే మెట్ల పైన నుంచున్న అనిల్ పక్క నుండీ నడుస్తూ వెళ్లి పోయింది కళ్యాణి.

తననే చూస్తున్న అనిల్‍ను గమనించి పక్క నుండీ వెళ్తూ అతడిని తలెత్తి ఒక మారు చూసింది కళ్యాణి. అనిల్ కళ్ళు తిప్పుకోకుండా అలాగే చూసాడు. అతని కళ్ళలో అనిర్వచనీయమైన మెరుపులు చూసింది కళ్యాణి.

తల దించుకుని ‘మూడు మార్కుల అబ్బాయి’ అని నవ్వుకుంది. కళ్యాణి వెళ్లిపోయిన తర్వాత చాలాసేపు పరిసరాలన్నీ మరచిపోయి అలాగే నిలబడ్డాడు అనిల్.

ఒక రోజు ఆఖరి గంటలో జరిగే హాబీస్ డ్రాయింగ్ క్లాస్‍లో అడుగుపెట్టాడు అనిల్. అప్పుడు పెన్సిల్ మర్చిపోయిన సంగతి గుర్తుకొచ్చింది. పెన్సిల్ కొరకు పక్కన వుండే చేనేత తరగతి వేపు వెళ్ళాడు. అక్కడ తరగతి గదిలో సరిగ్గా తలుపు ఎదురుగా చేనేత పరికరం ముందు కూర్చుని నేర్చుకుంటూ వుంది కళ్యాణి. తనను చూడగానే అతని గుండె వేగం హెచ్చింది. అలాగే చూస్తూ తలుపు ముందు నిలబడ్డాడు.

ఎవరో తన ముందు నుంచున్నట్లుగా అనిపించి అనిల్ వేపు చూసింది కళ్యాణి.

కొద్ది సేపు మీ పెన్సిల్ ఇస్తారా అన్నట్టు సైగ చేసి చెప్పాడు అనిల్.

అతనేం చెబుతున్నాడో అర్థం కాక తదేకంగా కళ్ళార్పకుండా చూడసాగింది. ఆ సొగసైన కాటుక కళ్ళను చూసి అనిల్ మనసు మనసులో లేకుండా పోయింది.

‘ఏమిటో ఈ అబ్బాయి! చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తూ, తెలివైన వాడిలా ఉండి, చదువు మీద మాత్రం ఆసక్తి లేకుండా వున్నాడు’ అనుకుంది కళ్యాణి.

వాళ్లిద్దరూ అలా అర్థం కాని స్థితిలో చూసుకుంటూ వున్న ఆ క్షణంలో, అటు వేపు పక్కనున్న సుబ్బారావు అనిల్‌ను “ఏంటి అనిల్?” అన్నాడు.

“పెన్సిల్ మర్చిపోయాను. డ్రాయింగ్ క్లాస్‌లో వున్నాను, నీ దగ్గరుంటే ఇవ్వు” అని అడిగాడు.

తన జేబులోనుండీ ఒక పెన్సిల్ తీసి ఇచ్చాడు సుబ్బారావు. అది తీసుకుని ఒకడుగు బయటకు వేసి, వెనక్కి చూసి ఆ పెన్సిల్‍ను కళ్యాణి కి చూపించి ఇది అడిగా నిన్ను అన్నట్లుగా సైగ చేసి వెళ్ళిపోయాడు అనిల్. అమ్మయ్య ఏదో ఒక రకంగా మాట కలిసింది అని సంతోషంతో గంతులేసింది అతని హృదయం.

‘చాలా విచిత్రంగా ఉన్నాడే!!’ అనుకుంది కళ్యాణి.

తరగతి గదిలో వున్నంత సేపు అనిల్ తనను చూస్తున్నాడని గమనించింది కళ్యాణి. అక్కడున్న వాళ్ళందరూ డాక్టర్ అవ్వాలనే పట్టుదలతో చదువుతున్నారని అర్థం అయ్యింది అనిల్ కి.. నేనేం చేయాలి.? అసలు నన్ను ఎవరు చదివిస్తారు అని ప్రశ్నించుకున్నాడు. తన భవిష్యత్తు అగమ్య గోచరంగా అనిపించసాగింది.

త్వరలో మాస పరీక్షలు దగ్గరవుతున్నాయని వాటి తేదీల గురించి అందరూ మాట్లాడుకుంటుంటే విని అనిల్ మనసులో భయం, దిగులు మొదలయ్యాయి. పుస్తకాలు ఇంకా కొనలేదు, ఇంట్లో అన్నయ్య పటించుకోవడం లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. అంతలో జగ్గారావు మాస్టర్, అతని వార్నింగ్ గుర్తుకొచ్చాయి. ఏది లేకున్నా సరే ముందు జువాలజీ పరీక్ష గట్టెక్కితే చాలు, ఈ జగ్గారావు మాస్టర్ బెడద తప్పినట్లే అనుకున్నాడు.

అంతలో ఇంటర్వెల్ గంట మ్రోగింది. అందరూ బిలబిలమంటూ బయటకు వెళ్లారు. బయటకు వస్తూ అక్కడున్న అందరి పుస్తకాల వైపు చూసాడు. ఒక బెంచీ మీద జూవాలోజి పుస్తకం కనపడింది. అది ఎవరూ గమనించకుండా పట్టుకెళ్లి పోవడం బెటర్ అని నిశ్చయానికి వచ్చాడు. కానీ దొంగతనం చేయటానికి అతని అంతరాత్మ అస్సలు ఒప్పుకోలేదు. అంతలో మళ్ళీ జగ్గారావు మాస్టారు, అతనన్న మాటలు గింగురుమన్నాయి. తల విదిల్చుకొని లేచి మెల్లిగా ఆ టేబుల్ దగ్గరకొచ్చి చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని అక్కడున్న జువాలజీ పుస్తకం చటుక్కున లాగి తన పుస్తకాల దొంతరలో పెట్టుకున్నాడు. ఆ రోజు కాలేజీ అయిపోయి ఇంటికెళ్లే వరకూ అతడిని దొంగతనం చేసిన భయం చుట్టేసింది.

ఆ రాత్రి పనులన్నీ అయిపోయాక ఆ పుస్తకం తీసి పేజీలు తిప్పాడు. అది ఎక్కడా మడతలు పడకుండా అందంగా ఉంది.

తృప్తిగా నిట్టూర్చి రెండవ పేజీ చూసాడు. అక్కడ అందమైన అక్షరాలతో ‘కళ్యాణి’ అని వుంది. అది చూసి నీరస పడిపోయాడు. తనకిష్టమైన అమ్మాయి బుక్ కొట్టేయటం తన దురదృష్టం అనుకున్నాడు. ఇంత మందిలో తన పుస్తకం చేతికందడటమేంటి? అని తల పట్టుకుని కూర్చున్నాడు.

అయితే విధి చాలా విచిత్రమైనది. భవిష్యత్తులో ఆ పుస్తకం విలువకు ఎన్నో రెట్లు తాను కళ్యాణి కి తిరిగి ఇవ్వవలసి వస్తుందని తెలీదు.

అలా కాలేజీలో కళ్యాణికి మానసికంగా సాన్నిహిత్యం అనుభవిస్తూ ఇంట్లో అవమానాలు బాధలు భరిస్తూ మొదటి సంవత్సరం పూర్తి చేసి తన ఊరికెళ్ళి పోయాడు అనిల్.

“అమ్మా ఈ రెండవ సంవత్సరం ఇక్కడే ఉండి పక్కూరి కాలేజీ లో చదువుకుంటానే ఎలాగోలా” అన్నాడు అనిల్.

విషయమంతా అర్థం చేసుకున్న భారతి “సరేరా అంతా దేవుడి మీద భారం వేస్తాను. అలాగే చెయ్యి” అంది చేతులెత్తి దేవుడి పటానికి మొక్కుతూ.

వేసవి సెలవులు గడుస్తున్న కొద్దీ కళ్యాణి ఆలోచనలు ఎక్కువ కాసాగాయి. ఫోన్ చేద్దాం అని అనుకున్నాడు. కానీ నెంబర్ తెలియదు ఎలా అని చాలా సేపు ఆలోచించి అన్నింటికంటే ఉత్తమం, ఉత్తరం రాయడం అనుకున్నాడు.

వారం పాటు ఆలోచించి తనకు తోచిన అడ్రస్‍కి ఉత్తరం రాయాలని ఒక నిశ్చయానికి వచ్చాడు అనిల్. పేపర్ తీసుకుని మొదలు పెట్టాడు.

కళ్యాణి గారికి,

మీరు కుశలమా? నేను బాగున్నాను. మిమ్మల్ని చూసి చాలా రోజులయ్యింది. మన పరీక్ష ఫలితాలు ఎప్పుడు వస్తాయి. ఇంతకంటే ఎక్కువ రాయటానికి భయంగా వుంది. మీ జవాబు కొరకు ఎదురు చూస్తున్నాను.

మీ కుటుంబ` సభ్యులందరికీ నా నమస్కారములు.

ఇట్లు

మీ

అనిల్

అని రాసి ముగించాడు.

అడ్రస్ ఎలా అని ఆలోచించి కళ్యాణి d /o రాజారావు. తహసీల్దార్, అశోక్ నగర్ కాలనీ.. అని మిగతా చిరునామా రాసి పోస్ట్ ఆఫీస్ డబ్బాలో వేసి వచ్చాడు.

***

“అక్కా.. జువాలజీ పుస్తకం మన ఊరి షాపుల్లో లేదు. హైదరాబాద్ నుండీ తెప్పించవే” అంది కళ్యాణి.

తల వెంట్రుకలు చిక్కు తీసుకుంటున్న రజని చెల్లెలు వేపు కోపంగా చూసి “జాగ్రత్తగా పెట్టుకోవటం తెలీదు? అలా అజాగ్రత్తగా ఉంటే ఎలా?, ఇంకా చిన్న పిల్లవు కావు. అయినా కాలేజీలో నీ టేబిల్ మీద నుండీ ఎలా మాయం అయ్యింది?”అంది.

“ఎలా పోయిందో తెలీదే అయినా నేను ఇంట్లో మన నలుగురిలో అందరికంటే చిన్నదాన్నేకదా?” అని సమాధానం చెప్పింది.

ఇంతలో గేట్ బయటనుండి ‘పోస్ట్’ అన్న కేక వినబడి అందరూ బయటకు పరుగెత్తారు.

“కళ్యాణికి ఉత్తరం” అని కవర్ రజని చేతిలో పెట్టి మోపెడ్ స్టార్ట్ చేశాడు పోస్ట్‌మ్యాన్.

“నీకు ఉత్తరం ఏంటి. అసలీ రోజుల్లో ఉత్తరాలెవరు రాస్తున్నారు.” అని ఆశ్చర్యంగా కళ్యాణి వేపు చూసి కవర్ విప్పుతూ ఇంట్లోకి అడుగులు వేసింది రజని.

ముందు వరండాలో తూగుటుయ్యాల మీద కూర్చొని ఉత్తరం చదవసాగింది రజని. వెనక నిలబడి తాను కూడా చదవసాగింది కళ్యాణి.

వెనక్కి తిరిగి చెల్లెల్ని చూసి “ఎవరీ అబ్బాయి, అడ్రస్ ఎందుకిచ్చావు?” అంది రజని.

“నా క్లాస్‌మేట్ అతను.. నేనివ్వ లేదు అడ్రస్” విస్తుపోయి అంది కళ్యాణి. చెల్లెలి మొహం వంక చూసింది రజని.

“సరే నువ్వివేమీ పట్టించుకోవద్దు. ముందు డాక్టర్ అవ్వాలి నువ్వు. అది మరవకు” అని లేచి ఇంట్లోకి వెళ్ళింది రజని.

ఆవిడ మస్తిష్కం నిండా ఏవేవో ఆలోచనలు. మొబైల్ తీసి స్నేహితురాలు కుసుమను వెంటనే రమ్మని చెప్పింది.

కొద్దీ సేపటిలో ఇంటికొచ్చిన కుసుమను గదిలో కూర్చోబెట్టి. అనిల్ ఉత్తరాన్ని చేతికిచ్చింది. అది చదివి కళ్లద్దాలు తీసి పట్టుకుని “ఇందులో ఏముంది అంతలా కంగారు పడే విషయం?”అంది కుసుమ.

“అబ్బాయికి ఏమీ లేనిది ఈ లేత వయసులో ఉత్తరం రాయడు కదా” అంది రజని.

“యెంత వయసీ అబ్బాయికి?” అనుమానంగా అడిగింది కుసుమ

“ఎంతేమిటి, కళ్యాణి క్లాస్‍మేట్, అదే పదహారో, పదిహేడో ఉంటాయి.” చాలాసేపు ఆలోచించి అంది రజని.

“ఓస్ అంతేనా.. లైట్ తీసుకో, ఏమీ జరగదు. అయినా కళ్యాణి ఏమంటోంది?” అడిగింది కుసుమ.

“దానికసలు ఏ ఐడియా లేదు. అసలా అబ్బాయితో ఎక్కువగా మాట్లాడింది కూడా లేదట”

“మరింకే వదిలేయి. నే వస్తా” అని లేచి బయటకు నడిచింది కుసుమ.

అనిల్ ఉత్తరాన్ని మళ్ళీ చదివింది. ఈ అబ్బాయితో ముందు ముందు కళ్యాణికి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేసి, జాగ్రత్తగా హేండిల్ చేయాలని నిర్ధారించుకుని, తెల్ల కాగితం తీసుకుని రాయటం మొదలెట్టింది రజని. అదొక కవర్‌లో పెట్టి పోస్ట్ ఆఫీస్ కెళ్ళి డబ్బాలో వేసి హాయిగా నిట్టూర్చింది.

ఇందులో చెల్లెలి పాత్ర లేక పోయినప్పటికీ ఆ ఉత్తరం తాను జాగ్రత్తగా చూసుకుంటున్న చెల్లెలి జీవితంలో పెద్ద మలుపుకి కారణమౌతుందని రజని ఊహించ లేకపోయింది.

స్నేహితులతో కలిసి ఊరి చెరువులో మనసు తీరా ఈదులాడి ఇంట్లోకి వెళ్లి బల్లపీట మీద ఒరిగాడు అనిల్.

“ఇదుగో ఇప్పుడే పోస్ట్ మ్యాన్ మామయ్య నీకేదో ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు “అని చేతికిచ్చింది భారతి.

ఉత్తరం అందుకుని లేచి కూర్చుని తెరచి చూసాడు.

చిరంజీవి అనిల్

నీవు మా చెల్లెలికి రాసిన ఉత్తరం అందింది. మేమంతా క్షేమమే. నలుగురం ఆడపిల్లలం మేము. నేను పెద్ద అక్కయ్యను. మా నాన్న గారు ఈ మధ్యే కాలం చేసారు.

ఇలా ఉత్తరాలు వేరే వారి చేతిలో పడితే మాకు క్షేమం కాదు. ఇలా ఉత్తరాలు రాయవద్దు. నీకు వీలున్నప్పుడు మా ఇంటికి రావచ్చు. ఇక మీదట ఉత్తరాలు రాయవద్దు. అర్థం చేసుకోగలవు. కళ్యాణి ఇంకా అమాయకురాలు. మీ పెద్ద వారికి నా నమస్కారాలు.

ఇట్లు

రజని

అది చదివి సంతోషంగా నవ్వుకున్నాడు అనిల్. అమ్మయ్య అక్షంతలు పడలేదు, ఇంతకీ కళ్యాణి ఏమనుకుందో అది చదివి? అనుకున్నాడు. ఆ ఉత్తరం కళ్యాణి చూసింది అది చాలు. దాన్లో ప్రేమాయణం లేకున్నప్పటికీ నా మనసు కొద్దో గొప్పో అర్థం అయ్యివుండొచ్చు కదా అని ఆలోచించ సాగాడు.

“అమ్మ.. రేపు వెళ్లి కాలేజీ నుండీ టీసి తెచ్చుకుంటా.. అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పవే” అన్నాడు అనిల్.

“నేనప్పుడే చెప్పానురా.. బాగా బాధ పడ్డాడు.. వాడికిక్కడేం కష్టం? అన్నాడు కూడా” అంది భారతి.

మరుసటి రోజు అన్నయ్య ఇంట్లో వెళ్ళగానే వదిన నవ్వుతూ ఎదురు రావటం చూసి ఆశ్చర్య పోయాడు అనిల్.

“ఎందుకు వెళ్ళిపోతున్నావు. నువ్వుంటే బావుండేది” అంది నొచ్చుకుంటూ.

ఏమీ మాట్లాడకుండా నవ్వుతున్న అనిల్‍ను చూసి మనసంతా కలచివేసినట్లయ్యింది రంగనాయకికి.

“ఏమీ లేదు వదిన.. అమ్మకు అక్కడ ఇబ్బందిగా వుంది” అన్నాడు అనిల్.

అనిల్ కేసి తేరిపారా చూసింది రంగనాయకి. నిష్కల్మషంగా నవ్వుతున్న అనిల్‍ను చూసి బాధగా అనిపించి, ఏమీ మాట్లాడలేక వంటింట్లోకి వెళ్తూ “కాళ్ళు చేతులు కడుక్కుని రా, వడ్డిస్తాను, మా అందరిదీ ఇప్పుడే అయ్యింది”  అంది.

భోజనం చేసి కళ్యాణి ఇంటి వేపు నడక మొదలు పెట్టాడు. అతని మనసంతా ఉద్విగ్నంగా వుంది. తన మనసులో భావం అర్థం చేసుకున్న తర్వాత కళ్యాణి ఇప్పుడు నన్ను చూసి ఎలా ఫీల్ అవుతుందో అనుకున్నాడు. ఎన్నడూ లేనట్లుగా హృదయం గాలిలో తేలిపోతూ వుంది. ఇంట్లో కొర్చోబెట్టి చీవాట్లు పెడతారేమో? అందుకే ఇంటికి పిలిచారేమో! అని ఒక క్షణం అనుమానంతో కళ్యాణి ఇంటికి కాస్త దూరంలో ఆగాడు. ఏమయితే అది కానీ ఇక్కడిదాకా వచ్చి ఇంకా భయపడటం ఎందుకు అని గుండె ధైర్యం తెచ్చుకుని ముందుకు కదిలాడు.

కళ్యాణి ఇంటి ముందు ఆగి చూసాడు. ఇంటి ముందు విశాలమైన స్థలం నిండా పూల చెట్లు, ఇరు వైపులా వేప చెట్లు, ఇంట్లోకి వెళ్ళటానికి పెద్ద మెట్లు కనపడ్డాయి. ఒక సారి గుండెల నిండా ఊపిరి తీసుకుని, దడ దడ లాడుతున్న గుండె చప్పుడు వింటూ ఇంటి మెట్లెక్కి కాలింగ్ బెల్ కొట్టాడు. అతని మనసులో తీయని పాల సముద్రాలు ఉప్పొంగుతున్నాయి.

కాలింగ్ బెల్ చప్పుడు విని కుర్చీలో కూర్చొని నవల చదువుతున్న రజని లేచి వెళ్లి తలుపుకు అడ్డంగా వున్న కర్టెన్ తీసి చూసింది. మెట్ల మీద నిల్చున్న నూనూగు మీసాల కుఱ్ఱవాడెవరో అర్థం కాలేదు.

అతని కళ్ళలో మెరుపు, అమాయకమైన మొహంలో తేజస్సును చూసింది. వెంటనే ఆమె నోటినుండీ “నువ్వు.. అనిల్ కదూ!!” అంది విస్మయంగా.

“అవునండి” అన్నాడు అనిల్ వినమ్రంగా చిరునవ్వుతో.

ఎంత మనస్ఫూర్తిగా నవ్వుతున్నాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయితో ఇబ్బంది లేదు అని మనసు తేలిక పడి, “రా రా లోపలికి. కూర్చో, నాకు తెలుసు నువ్వొస్తావనీ” చిరునవ్వుతో అని, లోపలికి వెళ్ళింది రజని.

ఎలా కనిపెట్టింది నేనొస్తానని, అసలు నన్ను చూసి షాక్ తినాలిగా అనుకుని ఆశ్చర్యపోతూ అక్కడున్న ఒక కుర్చీలో కూర్చుని గది అంత కలయ చూసాడు అనిల్.

గోడ మీద కుటుంబ సభ్యులతో కూడిన పెద్ద ఫోటో తగిలించి వుంది. ఒక వేపు టేబిల్, దాని మీద అందమైన పూల కుండీ, అక్కయ్యలతో కలిసి కూర్చున్న కళ్యాణి ఫోటో ఫ్రేమ్ పెట్టి ఉంచారు.

లోపలికెళ్ళి కళ్యాణిని పిలిచి “అదుగో అనిల్ వచ్చాడు. నువ్ అతడిని స్నేహ పూర్వకంగా మాట్లాడి, తర్వాత కాలేజీలో నీకెటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునేట్లుగా ప్రవర్తించి పంపించు. అబ్బాయి మంచివాడిలాగే వున్నాడు.” అంది.

“అబ్బా.. ఏం మాట్లాడాలి?” ఇబ్బందిగా మొహం పెట్టి అంది కళ్యాణి.

“ఏదో ఒకటి మాట్లాడు కళ్యాణి” అంది అనునయంగా.

కళ్యాణి ఊపిరి వేగం హెచ్చింది. కాస్త భయంతో బయటి గదిలోకి అడుగు పెట్టి “హలో అనిల్. గుడ్ మార్నింగ్” అంది బలవంతంగా నవ్వుతూ.

తలుపుకున్న కర్టెన్ తీసి పలకరించిన కళ్యాణి ని చూడగానే చుట్టూ వున్న లోకాన్ని మర్చిపోయాడు అనిల్.

“హలో.. కళ్యాణి” అయోమయ స్థితిలో బదులిచ్చాడు. అతని శరీరం అంతా వేడెక్కింది. గుండె చప్పుడు గట్టిగా వినపడుతోంది. గొంతులో ఏదో అడ్డం పడ్డట్లుగా అనిపించింది.నొట్లొనుండి మాట రావటం కష్టంగా వుంది. కళ్యాణి వచ్చి అతని ముందు కూర్చుంది. అది చూసి కలో నిజమో అర్థం కావటం లేదు అనిల్‍కు.

“ఎప్పుడొచ్చారు. మార్కులు చూసుకున్నారా?” అంది.

కళ్యాణి చాలా స్థిమితంగా వుండి హాయిగా మాట్లాడుతూ ఉంటే మరి నాకెందుకిలా అవుతోంది అనుకున్నాడు అనిల్.

“లేదండి.. ఇంకా కాలేజీకి వెళ్ళ లేదు. టీసి తీసుకుని మా ఊర్లో రెండవ సంవత్సరం చదువుతాను” అన్నాడు.

“ఎందుకని? ఇక్కడ చదవరా? వెళ్ళిపోతారా?” అంది కళ్యాణి తన మనసులో నిరాశ బయటకు తెలీకుండా వుండే ప్రయత్నం చేస్తూ.

“ఏమీ లేదు. అక్కడ అమ్మ ఒక్కదానికి కష్టం అవుతోంది.”అన్నాడు.

“మన క్లాస్ లో నేనే ఫస్ట్ “అంది కళ్యాణి. ఆమె కళ్ళలో మెరుపులు.

“అబ్బో. కంగ్రాచ్యులేషన్స్ కళ్యాణి “అన్నాడు. తన మార్కుల గురించి ఆలోచన రాగానే మనసులో కాస్త దిగులు మొదలయ్యింది.

“మళ్ళీ ఎప్పుడొస్తారు ఇక్కడికి?” యథాలాపంగా అడిగింది.

“ఎప్పుడైనా వస్తాను.” అని కళ్యాణి కళ్ళ లోకి చూసి ఆగాడు.

“ఎంబిబిఎస్ చదువుతారా మరి” ఉత్సాహంగా అడిగింది.

“అనుకుంటున్నాను” అన్నాడు నవ్వి తన నిస్సహాయతను కనపడనీయకుండా జాగ్రత్త పడుతూ.

“మన క్లాస్‍లో చాలావరకూ ఎంట్రన్స్ గురించే చదువుతున్నారు” అంది వుత్సాహంగా. అది విని అతని మనసు క్రుంగి పోయింది. కాసేపటిలో ఇద్దరూ కాలేజీ విషయాలు చర్చించుకుంటూ సమయాన్ని మర్చిపోయారు.  భోజనం చేసి మళ్ళీ అన్నీ మర్చిపోయి సంతోషంగా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. లోపలినుండి వీరు మాట్లాడుకునే మాటలన్నీ విన్న రజని, ‘అమ్మయ్య ఈ అబ్బాయితో ప్రమాదం లేదు’ అని మళ్ళీ అనుకుంది.

మధ్య మధ్యలో రజని వచ్చి మాట్లాడుతూ కూర్చుంది.

“నేనలా కాస్త మార్కెట్‍కి వెళ్ళొస్తా నువ్ కూర్చో” అంది రజని, అనిల్‍ను ఉద్దేశించి.

“నేనూ వస్తానండి మీతో” అని లేచి రజని చేతిలో వున్న బ్యాగ్ అందుకున్నాడు అనిల్.

ఇద్దరూ వెళ్లి బయటున్న జీప్ ఎక్కి కూర్చున్నారు. జీపులో కూర్చుని తన ఊరి గురించి అక్కడి విశేషాలు చెపుతుంటే ఆసక్తిగా వినసాగింది రజని.

సాయంత్రం కాఫీ త్రాగి కళ్యాణి ఇంటి నుండీ బయటకొచ్చాడు అనిల్. ఇంటి వేపు నడుస్తున్నాడన్న మాటే కానీ సంతోషంతో అతని అడుగులు గాలిలో పడుతున్నాయి.

మరుసటి రోజు కాలేజీ కి వెళ్లి టీసి తీసుకుని కళ్యాణి ఇంటికెళ్ళాడు అనిల్. బయట వరండాలో కూర్చున్న కళ్యాణి కనిపించింది. తల స్నానం చేసి కురులారేసుకుని కూర్చొనుంది.

“రండి అనిల్.. అదే మీ గురించే చూస్తున్నా.. ఆలస్యమైందేమిటి?” అంది.

కళ్యాణి కళ్ళలో ఏదో చెప్పలేని అందం కదలాడింది. అది చూసి అనిల్ మనసు ఉత్తుంగ తరంగమై ఎగసి పడింది. ‘అసలీ అమ్మాయిని చూస్తే తనకేమౌతుంది. ఎందుకిలా ఏదో తెలీని ఆకర్షణ’ అని అనుకున్నాడు.

“ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు? నే చెప్పేది వినటం లేదు” అంది నిండుగా నవ్వుతూ. తెల్లని సల్వార్ కమీజ్ వేసుకుని మల్లె పూవులాగా వుంది.

“అబ్బే ఏమీ లేదు. టీసీ తీసుకుని వస్తున్నాను.” కళ్యాణి అందాన్ని చూస్తున్న అనిల్ తడబడుతూ..

“కాఫీ తెస్తాను.. కూర్చోండి” అని వెళ్తున్న కళ్యాణిని చూసాడు. ఈ రోజేమిటో ఇంకా ఇంతందంగా వుంది. జీవితంలో పెళ్లంటూ చేసుకుంటే తననే చేసుకోవాలి అని మొదటి సారిగా అనుకున్నాడు. కానీ ఇంత కలవారి అమ్మాయి గురించి కలలు కనటం తప్పనిపించింది. తాను అత్యాశతో ఆశిస్తున్నాడేమో అనిపించి మనసును అదుపులో పెట్టుకున్నాడు.

తన ఆర్థిక పరిస్థితి, తన ఇల్లు గుర్తుకొచ్చి నిరాశకు గురయ్యాడు. తానున్న పరిస్థితిలో కళ్యాణి గురించి ఆలోచించటం ఆకాశానికి నిచ్చెనే కదా అనుకున్నాడు.

అంతలో కళ్యాణి అక్కయ్యలు ముగ్గురూ వచ్చి అనిల్ ముందు కూర్చున్నారు. అందరూ కలిసి కుటుంబ విషయాలు మరి కొన్ని సినిమా విషయాలు మాట్లాడుకున్నారు. ఏ విషయం పైనైనా సరే పూర్తి అవగాహనతో అనిల్ మాట్లాడటం అక్కడందరికీ ఆశ్ఛర్యం కలిగించింది.

కొద్దిసేపటికి అక్కడందరికీ అనిల్ అంటే గౌరవం పెరిగింది. అతను చెప్పే విషయాలలో కుటుంబ విలువలు, ప్రేమలు,ఆప్యాయతలు అధికంగా చోటు చేసుకోవటం గమనించారు.

“డబ్బు లేని వారిని, కష్టాల్లో వున్న వారిని చులకనగా చూసే వారు దుర్మార్గులు, అది తప్పు” అంది రజని మాటల మధ్యలో.

“వాళ్ళదేమీ తప్పు లేదండి, వాళ్ళు దుర్మార్గులు అసలే కారు. మన సమయం బాగా లేకుంటే వాళ్ళలా ప్రవర్తిస్తారు. చూడండి మన పరిస్థితి బాగవ్వగానే మరి అదే వ్యక్తులు ప్రేమగా వ్యవహరిస్తారు. సో.. దాన్ని బట్టి అర్థం అయ్యేదేమిటంటే అన్నింటికీ కారణం పరిస్థితులే కానీ, వారు కాదు” అన్నాడు అనిల్.

అది విని అందరూ మౌనంగా ఉండిపోయారు.

“మరి నువ్ ఎంబిబింఎస్ ఎంట్రన్స్ రాస్తావా?” అంది రజని మాట మారుస్తూ.

“మన దేశంలో ప్రతి 850 మందికి ఒక డాక్టర్ వున్నాడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ వారి సూచన ప్రకారం ప్రతీ 1000 మందికి ఒకరు కావాలి. అంటే మన దేశంలో అవసరానికి మించి డాక్టర్స్ వున్నారు. కాకపోతే అందరూ కట్టకట్టుకుని పట్టణాలలో వుండి, సంపాదనకై పాకులాడుతున్నారు. పల్లెల్లో మాత్రం ప్రతీ 30,000 మందికి ఒకరే డాక్టర్ వున్నారు. ఇక పోతే మన దేశం లోని అన్ని కాలేజీ ల్లో కలిపి.. ప్రతీ ఏటా కొత్తగా ఒక లక్ష యాభై వేల డాక్టర్లు ఉత్తీర్ణులవుతున్నారు.”

అది విని “అవన్నీ మనకెందుకు, డాక్టర్లు అందరూ హ్యాప్పీగా ఉన్నారుగా” అంది కళ్యాణి నవ్వుతూ.

“అది తప్పు ఈ మధ్య జరిపిన సర్వేలో తేలిందేమిటంటే ఆరు శాతం డాక్టర్లు మాత్రమే సంతోషంగా వున్నారు. 61% డాక్టర్లు తమ సంతానాన్ని డాక్టర్లుగా మారటం ఇష్టం లేక వేరే చదువులకు పంపిస్తున్నారు.” సాలోచనగా అన్నాడు అనిల్.

అందరూ విస్తుపోయారు ఆ మాట విని. మొత్తానికి బాగా తెలివైనవాడు అనుకుని “నీ హాబీ ఏంటి ?”అంది కళ్యాణి రెండో అక్క దుర్గ.

“ఉత్తరాలు రాయడం” అంది మూడో అక్క రాణి.

ఆ మాటతో భళ్ళున నవ్వారందరూ. చాలా సేపు అలా నవ్వుతూ ఉండిపోయారు.

యెర్ర బారిన మొహంతో ఓడిపోయినట్లుగా చేతులు లేపి చిరునవ్వు నవ్వాడు అనిల్.

కళ్యాణి లేచి వెళ్లి కాఫీ పట్టుకొని వచ్చి కూర్చుని మరో చేతిలో వున్న ఆల్బమ్ అనిల్ చేతికిచ్చింది. ఆల్బం చూస్తూ ఉండగా అక్కయ్యలు లేచి వెళ్లిపోయారు.

అతను చూస్తూ ఉండగా లేచి తన కుర్చీని అతని పక్కకు జరుపుకుని కూర్చొని, ఆల్బమ్ లోని వ్యక్తుల గురించి పరిచయం చేయసాగింది.

కళ్యాణి తన పక్కకు రాగానే అనిల్ గుండె ఒక క్షణం కొట్టుకోవడం మానేసింది. ‘భగవంతుడా థాంక్యూ’ అనుకున్నాడు.

“అందరికంటే మీరే అందంగా వున్నారు” అన్నాడు ఏకాగ్రత్తతో ఆల్బంలో ఫోటోల మీద దృష్టి నిలిపి.

ఆ మాట విని సంతోషంగా అనిల్‍ను చూసింది కానీ అతను ఆల్బం నుండీ దృష్టి మరల్చ లేదు.

మనసులో కలుగుతున్న సంతోషాన్ని మొహంలో కనపడనీయకుండా అదుపు చేసుకుని “అందరు అక్కయ్యలు కూడా నాకంటే బావున్నారు” అంది.

“ఏమో నాకైతే మీరే అందంగా వున్నారు” అన్నాడు అనిల్.

ఆ మాట వినగానే, కళ్యాణి గుండె ఆనందంతో నిండి పోయింది.. మనసంతా సంతోషం చోటు చేసుకుంది. అనిల్ పక్కనుండే చటుక్కున లేచి లోపలికి వెళ్ళిపోయి గ్లాస్ మంచినీళ్లు త్రాగింది.

“ఏమయ్యింది” అడిగింది రజని.

“ఏమీ లేదు” అని కంగారుగా సమాధానం చెప్పి తిరిగి అనిల్ దగ్గరకు వెళ్ళింది కళ్యాణి.

వెళ్లిపోతున్న చెల్లెలిని అలాగే కాసేపు చూసి ఆలోచనలో పడింది రజని. మంచం మీద కూర్చుని మొబైల్ తీసుకుని కుసుమకు కాల్ చేసి విషయమంతా చెప్పి కుసుమ చెప్పిన సలహాలు విని సరేనంటూ ఫోన్ కట్ చేసింది రజని.

ఆ రోజు సాయంకాలం కాఫీ తాగి లేచి నిలబడ్డాడు అనిల్.

“ఏంటి లేచారు” అంది కళ్యాణి నిరుత్సాహంగా.

“వెళ్ళొస్తాను. రేపుదయం మా ఊరికెళ్ళాలి” అన్నాడు.

అది విని చివుక్కుమంది కళ్యాణికి.

అంతలో వరండా లోకి వచ్చి అనిల్‍ను చూసి నవ్వింది రజని.

“మనం ఇద్దరం కాసేపు బయటకు వెళ్దామా అనిల్” అంది చిరునవ్వుతో.

“సరే పదండి” అని చెప్పి కళ్యాణి అక్కయ్యలను చూసి నమస్కారం చేసి “వెళ్లొస్తానండి. రేపు మా వదిన, మా నానమ్మను తీసుకుని వస్తాను.” అని చెప్పి కళ్యాణికి చేయి ఊపి బయటకు నడిచాడు

“అలా నడుస్తూ వెళ్లి అదుగో అక్కడ కనపడుతున్న గుడిలో కూర్చుందాం” అని గుడి వేపు దారి తీసింది రజని.

ఇద్దరూ కలిసి గుడి మెట్ల మీద కూర్చున్నారు. గుడిలో ఇంకా ఎవరూ రాలేదు.

ఒక సారి అనిల్ ను చూసి “ఎప్పుడెళ్తున్నావు బాబు?” అంది.

“రేపు లేదా ఆ మర్నాడు” అన్నాడు.

అతని గొంతులో నీరసం గమనించింది రజని. కాసేపాగి అనిల్ మొహంలో కనిపించే భావాలను గమనిస్తూ “డాక్టర్ చదువుతావా?” అంది.

ఆ మాట విని నిరాశగా ఆకాశం వేపు చూసి “లేదు వదిన.. మా కుటుంబ పరిస్థితి బాగా లేదు” అన్నాడు. అతని కళ్ళలో బాధ కొట్టొచ్చినట్లు కనపడుతోంది.

తనను వదిన అని సంబోధించటం విని షాక్ తిన్నట్లయి అనిల్ చేయి పట్టుకుని “బాబు.. నీకు మంచి భవిష్యత్తు వుంది. దేనికీ తొందర పడొద్దు. ఇంతకూ కళ్యాణితో సంతోషంగా మాట్లాడావా?”అంది.

ఆ మాటతో కాస్త ఉత్సాహంగా మొహం పెట్టి “అవునండీ” అన్నాడు.

“దానికేమీ తెలీదు. ఇంకా చిన్నతనం పోలేదు. నువ్వు కూడా చాలా చిన్న వాడివి. ఇంకా ఎన్నో సాదించాలి. ముందు నువ్వు మీ ఊరెళ్ళి బాగా చదువుకో. మంచి ఉద్యోగం సంపాదించు. జీవితంలో పైకి రావాలి. అప్పుడు నీవు కోరుకున్నవన్నీ దొరుకుతాయి.” అంది ప్రేమగా.

తలెత్తి రజని చెప్తున్న విషయాన్ని విని “అవునండి.. నేను ఎట్టి పరిస్థితుల్లో నైనా అన్నీ సాదిస్తాను. కార్లు కొంటాను, విమానాలలో తిరుగుతాను. పెద్ద బంగాళా కట్టిస్తాను. మమ్మల్ని చిన్న చూపు చూసిన వాళ్ళు తల దించుకునేలా చేస్తాను. మా అమ్మ గర్వంతో తలెత్తుకునేలా చేస్తాను.” అన్నాడు దృఢ చిత్తంతో.

“అవును అదీ ముందుగా నువ్ చేయాల్సిన పని” అంది. రజనికి అతని కళ్ళలో కనిపించే పట్టుదల చూసి కాస్త భయం వేసింది.

ఒక్క క్షణం మౌనంగా వున్నాడు అనిల్. అతనిలో జరుగుతున్న అంతర్మథనం చూసి ఏదో చెప్పబోయింది రజని.

అంతలో “నాకు కళ్యాణి అంటే చాలా ఇష్టం.” అన్నాడు తల వంచుకుని.

“నాకది ఎప్పుడో తెలుసు.” అంది నింపాదిగా.

చటుక్కున కళ్ళెత్తి రజని వేపు అపనమ్మకంగా చూసాడు. “అదెలా? నేనెక్కడా చెప్పలేదే!!” అన్నాడు

నవ్వింది రజని. “నీకంటే పెద్ద దాన్ని కదా, నా కన్నీ అర్థం అవుతాయి.” అంది.

“నేను తననే వివాహం చేసుకుంటాను, మీ అందరి సమ్మతంతో” అన్నాడు.

చిన్నగా నవ్వింది రజని “ఇప్పుడు నువ్వింకా చిన్నవాడివి. ప్రస్తుతం నీవు చేయాల్సిన పని, చదువు! నువ్ను కాలేజీ ఫస్ట్ రావాలి.. బాగా పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించాలి. అప్పటికి నీ పెళ్లి వయసు కూడా వస్తుంది. అప్పుడు చెప్పాలి ఈ విషయం” అంది భరోసా నిస్తూ అనిల్ చేయి గట్టిగా పట్టుకుని.

“మరి ఆ లోగా కళ్యాణి పెళ్లి అయిపోతే?” అన్నాడు.

అమాయకమైన అతని మొహం చూసి “అలా జరగదు.. తనకంటే పెద్ద వాళ్ళం ముగ్గురం వున్నాం మా అందరి పెళ్లిళ్లు కావాలి. ఆ తర్వాత దాని పెళ్లి. అప్పటికి చాలా సమయం వుంది. నువ్వేం దిగులు పెట్టుకోవద్దు. హాయిగా వెళ్లి దృఢ నిశ్చయంతో పరీక్షలను ఎదిరించి విజయాన్ని సాధించు. కళ్యాణి ఎటూ వెళ్ళదు. మంచి ఉద్యోగం తెచ్చుకో. అప్పుడు నా దగ్గరకు రా” అంది.

రజని చెప్పిన మాటలు అనిల్‍కు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. కళ్యాణి ఇక తనదే అనే నమ్మకం కలిగింది.

‘సరే వదిన.. అలాగే చేస్తాను. కళ్యాణికి చెప్పండి, వస్తాను. అన్నీ సాధించుకుని వస్తాను” అని చెప్పి లేచి గర్భగుడి వేపు తిరిగి దేవుడికి దండం పెట్టి, మెట్లు దిగి వెళ్ళిపోయాడు.

అతని మొహంలో కనిపించే దృఢ నిశ్చయాన్ని చూసి ఆశ్చర్య పోయింది. ఈ అబ్బాయికున్న గుండె ధైర్యం ఏంటి. ఇంత చిన్న వయసులో ఎన్ని ఆలోచనలు అనుకుని వెనక్కి తిరిగి చూడకుండా తల పైకెత్తుకుని ఆత్మనిబ్బరంతో వెళ్తున్న అనిల్‍ను చూసి లేచి నుంచుని ఇంటి వేపు అడుగులు వేసింది.

“అక్కా.. ఏం చెప్పావు? ఏమన్నాడు?” అడిగింది ఆతృతగా కళ్యాణి.

“ఏదో సర్ది చెప్పి పంపించాను. నువ్విక ఆ విషయం మర్చిపోయి చదువు మీద దృష్టి పెట్టు.” అని లోపలి వెళ్లి మొబైల్ అందుకుంది రజని.

కుసుమ నెంబర్ కలిపి “హలో కుసుమ! వెళ్ళిపోయాడు.. నువ్వు చెప్పిన సలహా ప్రకారమే చెప్పాను. అది బాగా పని చేసింది.” అంది.

“గుడ్, ఏమీ ప్రాబ్లెమ్ కాలేదుగా.. ఈ ప్రేమ పిచ్చి అబ్బాయిలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ మధ్య చూస్తున్నాంగా, ప్రేమను కాదంటే ఆసిడ్ దాడులు, కత్తి పొట్లూ వగైరా” అంది కుసుమ అట్నుంచీ.

“అదేం కాదులే అబ్బాయి మంచివాడే,కానీ.. ఒక వేళా నిజంగా మళ్ళీ వస్తే?” అనుమానం వెలిబుచ్చింది రజని

“ఇప్పుడా అబ్బాయి జస్ట్ పదిహేడు వయసు, అవునా.. చదువు పూర్తి చేసి, ఉద్యోగం సంపాదించే సరికి తెల్లవారుతుంది. అన్ని సంవత్సరాలు గడిచే సరికి ఎన్నో మార్పులు వస్తాయి. అప్పటికి ఎంతోమంది అమ్మాయిలు కలుస్తారు. ఎవరితోనో వివాహం నిశ్చయమవుతుంది. అంతే.! ప్రస్తుతం కౌమార దశలో వున్నాడు ఆ అబ్బాయి. తెలిసి తెలియని ఈ సమయంలో వారిలో ఇవన్నీ మామూలే. ఇక వదిలేయి. నువ్వు,అసలు ఇంటి వరకూ రానివ్వటమే తప్పు.”

“అవునేమో?” అంది రజని అనుమానంగా.

“వుంటా మరి రేపు కలుస్తాను” అని ఫోన్ పెట్టేసింది కుసుమ.

వీరిద్దరి మాటలు విన్న కళ్యాణికి మనసంతా బాధతో కలిచి వేసింది. వరండాలో కూర్చొని అనిల్ మాటలు, నవ్వులు గుర్తు చేసుకుని కళ్ళు మూసుకుంది.

మరుసటి రోజు ఉదయం చీకట్లో ఎర్ర బస్సు ఎక్కి కూర్చున్నాడు అనిల్. అది వేగంగా పొలిమేరల్ని దాటి అతడిని కళ్యాణి నుండీ దూరంగా అతని గమ్యం కి దగ్గరగా తీసుకెళ్ళ సాగింది.

సీట్లో కూర్చొని, కోటి ఆశలతో భవిష్యత్ మీద నమ్మకంతో తూర్పున ఉదయిస్తున్న వెలుగు రేఖల్ని చూడసాగాడు అనిల్.

ఇవేవి తెలియని కళ్యాణి చేతిలో ఫిజిక్స్ పుస్తకం పట్టుకుని ఏకాగ్రతతో చదువుకో సాగింది..

***

కాలం ఎవరికోసం ఆగదు. కాల గమనంలో గిర్రున తొమ్మిది సంవత్సరాలు తిరిగి పోయాయి.

రజని వివాహం జరిగి హైదరాబాద్‍కు మారి పోయింది. భర్త బ్యాంకు మేనేజర్. సంసారం సముద్రంలో మునిగి పోయింది.

జూబిలీ హిల్స్ లోని పెద్ద బంగాళా ముందు కార్ ఆపాడు డ్రైవర్. కార్ దిగి “కార్ లోపల పెట్టు” అని చెప్పి లోనికి అడుగులు వేసాడు అనిల్. చుట్టూ క్రోటన్స్ మొక్కలతో, కుండీలలో పూల మొక్కలతో ఇల్లు అందంగా వుంది. మెట్ల మీద నిలబడి ఒక సారి అంతటా కలయ చూసి తృప్తిగా నిట్టూర్చాడు. మెట్లెక్కి తలుపు దగ్గర ఆగి ఆలోచించసాగాడు.

***

ఆ రోజు శివ రాత్రి పండగ. ఉదయం పిల్లల అల్లరితో సతమతమౌతూ వుంది రజని.

“ఏమండీ అలా పొద్దున్నే టీవీ చూసుకుంటూ కూర్చోక పోతే, చిన్న దానికి డ్రెస్ వేయచ్చు కదా” అని అరిచింది.

“నా వల్ల కాదు అవన్నీ. ఇంకో పనమ్మాయిని పెట్టుకో. అంతేగానీ నన్ను సతాయించమాకు” అని నింపాదిగా చెప్పి టీవీలో న్యూస్ చూడసాగాడు భర్త రాజేంద్ర.

“ఎక్కడ దొరుకుతున్నారీ పనివాళ్ళు. వాళ్ళకీ ప్రభుత్వం పోటాపోటీగా కావాల్సిన వన్నీ ఉచితాలుగా పనిచేస్తుంటే పనెందుకు చేస్తారు” అని విసుక్కుని చిన్న కూతురికి తల దువ్వసాగింది.

ఇంతలో బయట బెల్ మ్రోగసాగింది.

“బయట ఎవరో వచ్చారు చూడండి” అంది రజని.

టీవీలో మునిగిపోయిన అతను పట్టించుకోలేదు. విసుక్కుంటూ బయట గది వేపు అడుగులు వేసింది రజని.

తలుపు కెదురుగా స్ఫురద్రూపంతో, ఎత్తుగా దృడంగా, కోర మీసంతో, నిలబడి నవ్వుతున్న నవయువకుడిని చూసింది. అతడిని తేరిపారా చూసింది రజని. వెనక్కి దువ్విన తలకట్టు, టక్ చేసుకుని బంగారు రంగులో మెరిసి పోతున్న అతడిని చూసి “ఎవరు మీరు?” అంది.

“కళ్యాణి ని కలుద్దామని వచ్చానండి “అన్నాడు నవ్వుతూ. అతని నవ్వు సమ్మోహనంగా వుంది.

“అరెరే మీరా? రండి రండి.. మీ నాన్నగారు చెప్పారు మీరొస్తారని. కూర్చోండి” అంది కంగారు పడుతూ.

“కళ్యాణి..” అని అనుమానంగా అన్నాడు అతను.

“మీరొస్తున్నట్లు తెలీదు, రేపు వస్తారని చెప్పారు. తాను ఆఫీస్‍కి వెళ్ళింది. ఫోన్ చేస్తాను వచ్చేస్తుంది. కూర్చోండి” అంది తలుపు బయటే నిలబడ్డ అతడిని చూసి.

లోనికి అడుగు వేసి సోఫాలో కూర్చున్నాడు.

“ఏవండీ ఒక సారి రండి” అని భర్తను పిలిచి, అతని వేపు తిరిగి “ఏం తీసుకుంటారు.. కాఫీనా, టీనా?” అంది.

దానికి సమాధానంగా చిరునవ్వుతో రజని కళ్ళలోకి సూటిగా చూసి “వదినా.. నేను అనిల్” అన్నాడు.

ఆ మాటతో బిత్తరపోయి మాట రాకుండా సంతోషంగా అతడినే చూడసాగింది రజని.

“మీరన్నట్లుగానే.. వచ్చాను. ఇంతకీ కళ్యాణి ఎక్కడా?” అన్నాడు.

“అనిల్ నువ్వా.. ఎంత మారి పోయావు. నేనసలు గుర్తు పట్ట లేదు సుమా. ఇన్నాళ్లు ఏమయిపోయావు. కనీసం ఒక్కసారి కూడా కలవలేదు.” అంది. ఆమె గుండెల్లో చెప్పలేనంత ఆనందం.

“చెప్పారుగా.. సాధించుకుని రమ్మని.. వచ్చాను. గ్రూప్ టూ పాస్ అయ్యి ఉద్యోగం చేస్తున్నాను. త్వరలో పెద్ద వాళ్ళను పంపిస్తాను. ఇంతకీ కళ్యాణి..?” అన్నాడు చెరగని నవ్వుతో, నిండైన ఆత్మ విశ్వాసంతో.

“ఒక్క నిముషం వుండు” అని లోనికి వెళ్లి భర్తను చూసి “హాల్‍లో అనిల్ వున్నారు. మాట్లాడుతూ వుండండి నేనిప్పుడే వస్తాను” అని చెప్పి మొబైల్ తీసుకుని నెంబర్ కలిపింది.

అటువైపు నుండీ కళ్యాణి “హలో.. అక్కా చెప్పు” అంది.

“అనిల్ వచ్చాడు” అంది ఉద్వేగంతో.

“ఏదీ కాలేజీ అబ్బాయి అనిలేనా?” అంది కళ్యాణి ఆదుర్ధాగా. ఆమెలో ఆనందం ఆకాశాన్ని అంటింది.

“అవును. వస్తావా?” అడిగింది.

“వస్తున్నా.. మరో విషయం, రేపు వస్తానన్న పెళ్లి సంబంధం వారిని రావొద్దని ఇప్పుడే చెప్పెయి. ఇక నాకావసరం లేదు” అని చెప్పి ఫోన్ కట్ చేసి ఆఫీస్ బయటకు వేగంగా అడుగులు వేసింది. కార్ డాష్ బోర్డు మీదున్న వినాయకుడి విగ్రహానికి నమస్కారం చేసి “దేవుడా థాంక్ యు” అని కార్ స్టార్ట్ చేసింది కళ్యాణి. కార్ ఆఘమేఘాల మీద పరుగెడుతోంది అనిల్ దగ్గరకు చేరుకోవడానికి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here