పునరావృతం

1
10

[box type=’note’ fontsize=’16’] ఒకప్పుడు అల్లుడుగా అహంభావంతో ఉన్న మనిషి.. వయసు పైబడిన మామగా, ఓపిక తగ్గి.. పరిస్థితులకు భయపడుతున్న వైనాన్ని “పునరావృతం” కథలో వివరిస్తున్నారు పి.ఎల్.ఎన్. మంగారత్నం. [/box]

[dropcap]పె[/dropcap]ద్దవాడు రఘురాం మూడేళ్ళ నుంచి అమెరికాలోనే ఉంటున్నాడు. ప్రతి వేసవిలోనూ రమ్మని పిలుస్తూనే ఉన్నాడు “ఇక్కడ ఏమైనా చూడాలంటే వేసవికాలంలోనే చూడాలి. మిగిలిన రోజుల్లో అంతా మంచు కురుస్తుంది. తిరిగి ఏమీ చూడలేం. కాబట్టి, మేము ఇక్కడ ఉన్నందుకు మీరు ఒకసారి వస్తే బాగుంటుంది” అని.

నేనే ఎప్పుడూ శ్రద్ద చూపలేదు. కనీసం పాస్‌పోర్టు అయినా తీసుకోవాలని అనుకోలేదు. కారణం చేస్తున్న ఉద్యోగానికి శెలవు పెట్టాలి. ప్రమోషనుకు ముందు పెట్టుకుని శెలవు పెట్టాలని అనిపించలేదు. ఇప్పుడో.. అప్పుడో అన్నటు అప్పుడే రెండేళ్లుగా ఎదురు చూపులైపోయాయి.

ముప్పై ఏళ్ళుగా సర్వీసు చేస్తున్నా ఇంకా ఆర్థికంగా నిలదొక్కుకోలేదనే అనుకుంటుంటాను. మా భార్యాభర్తలు ఇద్దరం బయలుదేరినా లక్షలు కావాలి. అదొక కారణం నా అనాసక్తతకి. అయితే రఘురాం అంతగా చెప్పడంతో పాస్‌పోర్టుకు అప్లై చేశాను. విదేశం చూడగలగడమూ అదృష్టమే. అది నా జీవితంలోనూ వస్తే సంతోషమే కదా!

పాస్‌పోర్టు అంటే, వైజాగ్ వెళ్ళాలి. వైజాగ్ లో చిన్న చెల్లెలు స్వప్న, తమ్ముడు ఉంటున్నారు. అమ్మ పోయిన తరువాత నాన్న గార్ని అనకాపల్లి నుంచి తీసుకోచ్చేసి, నలుగురు పిల్లల్లో ఎవరో ఒకళ్ళం దగ్గర ఉంచుకుంటున్నాం.

నేను, నా తరువాత చెల్లెలు కాంచనమాల కాకినాడలో ఉంటున్నాం. కాంచనమాల గవర్నమెంటు హైస్కూల్లో టీచరు. రోజూ రామచంద్రాపురం వెళ్ళివస్తుంది. తనకి ఇద్దరూ అమ్మాయిలే. పెద్దమ్మాయి హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తుంది. చిన్న పిల్లని పెట్టుకుని ఉంటుంది. మరిది ఒరిస్సాలో ఒక ఫెర్రోఎల్లాయిస్ కంపెనీలో పని చేస్తాడు. నెలకు ఓసారి వచ్చి వెళుతుంటాడు.

అయితే నాన్నగారు కాకినాడలో కన్నా వైద్య సదుపాయాలు వైజాగ్‌లోనే బాగుంటాయని.. స్వప్నా, తమ్ముడూ మంచి ఉద్యోగాల్లో ఉండడంతో, వాళ్ళ హోదాని బట్టి.. మంచి వైద్యం అందుతుందని అక్కడే ఉంటున్నారు.

చిన్న చెల్లెలు దగ్గర కొన్ని రోజులు, తమ్ముడి దగ్గర కొన్ని రోజులూ ఉంటున్నారు.

నాన్న గారు ఉద్యోగంలో ఉండి, పిల్లలు అందర్నీ చదివించడంతో మేము అందరం ఉద్యోగాల్లో ఉన్నాం. ఒక్క కోడలే ఇంట్లో ఉండే గృహిణి. నాన్నగారు తమ్ముడింట్లో ఉన్నారంటే నాకు కాస్త ఊరట. కష్టం సుఖం అన్ని వాడు చూస్తాడని.

అయితే వాళ్ళుండే అపార్టుమెంటుకి లిఫ్ట్ లేదు. మూడవ అంతస్తుకి మెట్లు ఎక్కాలి. అది ఇబ్బంది, చేతి కర్ర ఆసరాతో నడుస్తున్న.. ఎనభై ఏళ్ల నాన్న గారికి. అందుకే లిఫ్ట్ ఉన్న చిన్న చెల్లెలు స్వప్న ఇంటికే ఎక్కువ ప్రిఫరెన్సు ఇచ్చేవారు.

అదీ కాక చిన్న అల్లుడిది కాస్త మంచి మనసు. చక్కగా ‘మామయ్యా’ అని పిలుస్తాడు. పెద్దలంటే గౌరవం, మన్ననతో.. అవసరానికి కనిపెట్టి ఉండేవాడు. బయటికి వెళ్ళేటప్పుడు “మందులేమైనా కావాలా” అని అడిగేవాడు. చిన్నల్లుడి మంచితనానికి లోలోపల సంతోషపడుతుంటాను నేను.

ఉదయం ఆరున్నరకల్లా ‘ముఖం కడుక్కున్నారా, కాఫీ ఇచ్చేయ్యమంటారా’ అని అడిగి మరీ మామగారికి కాఫీ ఇస్తాడు. స్వప్న అప్పటికి నిద్ర లేవదు. స్వప్న ఓ మండలానికి అగ్రికల్చర్ ఆఫీసరు. అందుకని క్షణం తీరిక లేనట్లు ఉంటుంది పని. పగలంతా ఇంట్లో ఉండేలా పనిమనిషిని పెట్టుకుంది. ఆమే నాన్నగారికి టైముకి ఏం కావాలో చూస్తుంది. అందుకు మేము.. నిశ్చింతగానే ఉండేవాళ్ళం.

ఆ క్రమంలో నాన్నగారితో ఓ రోజు ఉన్నట్లు ఉంటుంది అన్నట్లు, సోమవారం రోజున పాస్‌పోర్టు పని చూసుకునేలా, ఆదివారం సాయంత్రం స్వప్న ఇంటికి చేరుకున్నాం.

***

మరునాడు త్వరగా భోజనాలు చేసి, పన్నెండు గంటల కల్లా పాస్‌పోర్టు ఆఫీసుకి వెళ్లి, అటునుంచి అలా ఇంటికి.. కాకినాడ వచ్చేయ్యాలన్నది నా ఆలోచన. అప్పటి వరకూ ఉంటే.. నాన్నగారు ఇంకాస్త సంతోషపడతారు.. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు అని అనుకోకుండా ఉంటారని అలా ప్లాన్ చేశాను.

అందుకు స్వప్న గబగబా వంట చెయ్యడం మొదలెట్టింది. మేమున్న కారణంగా తన మండలానికి కాస్త ‘లేటు’గా వెళతానంది.

వాళ్ళ చిన్నమ్మయి పావనిని, మరిది శ్రీకాంత్ ఉదయం ఆరు గంటల కల్లా ట్యూషన్‌కి తీసుకువెళ్ళి, ఎనిమిదయ్యేసరికి తీసుకు వచ్చాడు. మళ్ళీ తయారయ్యి తొమ్మిదింటి కల్లా స్కూల్ కి వెళ్ళాలి. స్వప్న కూర్చోబెట్టి ఆ పిల్లకి జడలు వేస్తుంది.

పెద్దమ్మాయి శ్రావణిని, అంతకు ముందే ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగుకు పంపించారు. మాకున్నది కాస్త టైమే కాబట్టి, ఉన్నంతలో కబుర్లు చెప్పుకుంటున్నాం.

ఇంతలో నాన్ గారు స్నానానికని బట్టలు తీసుకుని, బాత్రూములోకి వెళ్లారు.

మరో రెండు నిముషాలకి స్నానం చేస్తున్నట్లు నిశ్చయానికి వచ్చిన, స్వప్న.. బాత్రూము వైపుకు చూస్తూ, నాన్నగారిని ఉద్దేశించి “అన్నయ్య ఇంటికి చుట్టాలు వచ్చారని, వచ్చేసి.. హాయిగా, ఇక్కడ కూర్చున్నారు. నాకేమో చూసుకోవడానికి అవడం లేదు.”

“పనిమనిషి ‘రత్నం’ మానేసింది కూతురు డెలివరీకి వచ్చిందని. అంట్లు తోమే పనిమనిషి ఉంది. నేను ఒక్కోరోజు అక్కడే.. ‘మాడుగుల’ లోనే ఉండిపోతున్నాను. అంతా శ్రీకాంతే చూసుకోవడంతో విసుక్కుంటున్నారు” అంది బాధగా.

ఇంటి పట్టున ఉండే పనిమనిషి మానేస్తే కష్టమే మరి. ఆమైనా నాన్న గారిని చూస్తుందని. సంతోషంలో ఉన్నాం ఇప్పటివరకూ.

మళ్ళీ నా వైపు తిరిగి “ఈ టైముకి మీ అందరి పిల్లలూ చక్కగా చదివేసుకున్నారు. మా పిల్లల దగ్గరకి వచ్చే సరికే వచ్చింది ఇబ్బంది” ఓ పిసరు విసుగూ.. నిష్ఠూరం ధ్వనించాయి గొంతులో..

జడ వేస్తుంటే పిల్ల కదలడంతో జుట్టును వెనక్కి లాగి, నొక్కిపట్టి విసుగంతా పిల్ల మీద చూపించింది. ‘అబ్బా’ అంటూ ముల్గిందా పిల్ల.

మా పిల్లలు చక్కగా చదివేసుకోవడం ఏమిటి? వాళ్ళు అనుకున్నారు.. చదువుకున్నారు. ఆ సమయంలో నేను ఒక విధంగా కష్టమే పడ్డాను. పెద్దవాడు రఘురాం ఇంజనీరింగు, చదువుకే .. ఉన్న నెక్లెసు అమ్మేయ్యాల్సి ఉంటుందేమో అనుకున్నాను. అలా జరగలేదు సరికదా! కాంపస్ సెలక్షను తెచ్చుకుని, ఈ రోజు అమెరికాలో ఉన్నాడు భార్యతో సహా. నేను ఒక్క రూపాయి ఖర్చు చెయ్యలేదు అందుకోసం. చిన్నవాడు జయచంద్ర మెడిసిను. మెడిసిన్ ‘బి’ కేటగిరిలో సీటు రావడంతో .. బ్యాంకు లోను తీసుకోవడమయ్యింది. ఇప్పుడు పీ.జి చదువుతున్నాడు హైదరాబాదులో. ఆ విషయంలో తన నిష్ఠూరం  ఏమిటో నాకు అర్ధం కాక.. ఏం మాట్లాడాలో తెలియక ఆశ్చర్యంగా దాని వైపే చూస్తూ ఉండిపోయాను.

నా నుంచి స్పందన ఏమి రాకపోయేసరికి, మళ్ళీ తనే అంది. “మా వాళ్ళకిదే క్రూసియల్ పిరియడ్, ఇది టెన్తే, అది ఎంసెట్. నాన్నగారు వీళ్ళని అస్సలు చదువుకోనివ్వడం లేదు. అస్తమానం ‘సన్నీ, మిన్నీ’ అని పిలుస్తూ ఏదో మాట్లాడుతుంటారు. అలా పిలుస్తుంటే వాళ్ళేం చదువుకుంటారు”

మా అందరివి రెండు బెడ్రూంల అపార్టుమెంట్లే. మరో మనిషి వచ్చి ఉండడం అంటే ఎవరికైనా ఇబ్బందే. అలా అని నాన్న గారు ఏమీ తెలియని పల్లెటూరి మనీషా, పిల్లల్ని చదువుకోనివ్వకుండా చెయ్యడానికి. ఆ వయసులో టీ.వి. అంతగా చూడరు.. పేపరూ చదవలేరు. కాబట్టి, ఏదో మాట్లాడుతూ ఉండవచ్చు. ఆయాసం కోసం వాడే మందులతో, రోజులో ఎక్కువ భాగం నిద్రలోనే గడుస్తుంది. అంత మాత్రానికే బాధపడితే ఎలా?

“మీ పిల్లలు టి.వి ముందేగా చదువుకునేది. టీ.వి పెట్టుకోకుండా ఎప్పుడైనా పుస్తకం ముట్టారా? అది మాత్రం డిస్ట్రబెంసు కదా! అయినా ఇంట్లో మనిషి అంటూ ఉంటే ఏం మాట్లాడకుండానే ఉంటారా” అన్నా, నాన్న గారు అవసరానికి మాట్లాడితే తప్పేమిటి? అన్నట్లు.

“అదే వీళ్ళ చదువుని పాడుచేస్తుంది. అయినా చిన్నక్క ఒక్కతి పిల్లని పెట్టుకుని ఉంది కదా! నాన్నగారి తీసుకువెళితే ఏమయ్యింది? తోడుంటారు కదా”

ఆ పిల్లని స్కూల్ కి పంపి, రోజూ కాకినాడ నుంచి.. రామచంద్రాపురం వెళ్లి వచ్చే సరికే దాని పని అయిపోతుంది. ఇక నాన్న గారిని ఏం చూస్తుంది? అందరూ బయటికి వెళ్ళిపోతే, ఒంటరిగా ఉన్న నాన్నగారికి మంచినీళ్ళు అయినా ఇచ్చేది ఎవరు? తనకు మాత్రం ఈ సంగతి తెలీదా …

ఎదురుగా ఉన్న నన్ను అనలేక.. దగ్గరలేని కాంచనని ఎత్తి చూపించింది. అది పూర్తిగా నన్ను అన్నట్లే. కాంచనని నేను మాత్రం.. ఏం విమర్శించను. ఏం మాట్లాడలేక మౌనం వహించాను.

“అయినా, ఎప్పుడూ, ఇక్కడేనా… కాకినాడ మీరెవరూ తీసుకెళ్ళరా” ఈసారి డైరెక్టుగా విషయానికి వచ్చింది. అది అంతలా ముఖం పట్టుకుని అడుగుతున్నప్పుడైనా మాట్లాడకుండా ఏం ఉండను.

“నా సంగతి నీకు తెలుసు కదే. నా చెయ్యి ఎంత బాధ పెడుతుంది. రోజు రోజుకి ఏ పనీ చెయ్యలేకుండా ఉన్నాను. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉద్యోగానికి వెళ్ళివస్తున్నాను. ఈ బాధ కారణంగానే కదా ప్రమోషనుకి కూడా దూరం అయ్యాను. పనిమనిషి రోజు వస్తుంటే .. మీ బావ వంట చేస్తుంటే, నాకు రోజు గడుస్తుంది. నాన్నగారిని తీసుకెళ్ళి .. నేను చూడలేను” అంటూ నా అశక్తతను వ్యక్తం చేసాను.

ఇరవై ఏళ్లుగా బాధ పడుతున్న విషయం ఇంట్లో అందరికీ తెలిసిందే.

ఆ మాటకు కాస్త మెత్తబడి “పోనీ వేరే పనిమనిషిని పెట్టుకుందాం, అన్నా పగలంతా ఉండాలి అంటే.. ‘పదివేలు’ అడుగుతున్నారు. అంత ఇచ్చి చేయించుకునే పని లేదు ఇంట్లో”

అందులో అయిదు వేలు ‘నేను ఇస్తానే’ అందామనిపించింది. ‘ అంటే ఎప్పటికీ నాన్నగారిని నా దగ్గరే ఉంచేయ్యాలనుకుంటున్నావా’ అంటే ఏం మాట్లాడగలను. నాన్నగారు స్నానం ముగించి బయటికి రావడంతో మా సంభాషణలు రంగు మార్చుకున్నాయి.

***

పదినిమిషాల తరువాత .. షాపింగు నుంచి వచ్చారు ఆయనా, జయచంద్ర.

జయచంద్ర నాతో “అమ్మా! పన్నెండింటి వరకూ ఇక్కడెందుకు? భోజనం అంత అవసరమా! ఇప్పుడేగా టిఫిన్ తిన్నాం. మనం ముందుగా బయలుదేరితే.. నష్టం ఏమిటి?” అడిగాడు.

వాడు సరిగా తిండి తినకపోతే, నాలుగు గంటలు కారు నడపలేడని, మద్యలో తినడానికి ఏం దొరకదని.. ఇలా అన్ని కలిసోచ్చేలా ప్రోగ్రాం చేసాను.

అయితే, నాకూ ఇప్పుడు ఇక్కడ ఉండాలని లేదు. భోజనం మీద అసలే మనసు లేదు. “అయితే వెళ్ళిపోదాం అంటావా” అన్నా సాలోచనంగా ఏదైనా వాడి ఇష్టమే అన్నట్లు.

“కదులు.. కదులు.. ఊరుకుంటే, వచ్చిన పని మర్చిపోయి సాయంత్రం వరకూ ఇక్కడే ఉండేలా ఉన్నావ్” అన్నారాయన నన్ను తొందరపెడుతూ.

మా సంభాషణలు అన్నీ వింటున్న స్వప్న వంటగది లోంచి వస్తూ “అదేమిటి? జ్యోతక్కా .. మీ కోసం వంటలు చేస్తుంటేను. తినకుండా వెళ్ళిపోతారా! వండిన కూరలు నేనేం చేసుకోను” అంది ఆదుర్దాగా.

“ఏం చెయ్యను. వాళ్లు వెళ్ళిపోదాం అంటున్నారు కదా” అంటూ జాలిగా ముఖం పెట్టాను.

“అంతేనమ్మ. నెట్టేయ్యి.. ఎవరి మీదకో ఒకళ్ళ మీదకు నెట్టేయ్యి. నీదేం తప్పుండదు” అంటూ చిన్నవాడు నన్ను ఎద్దేవా చేసాడు. వాడి మాటలు నన్నేం ఇబ్బంది పెట్టలేదు. ఇంకా ఆగితే, పట్టుసడలొచ్చు.

“సరే వెళ్ళిపోతాం లేవే. అక్కడ పని చూసుకుని, సాయంత్రానికల్లా ఇంటికి చేరుకోకపోతే, మళ్ళీ — రేపు ఆఫీసుకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. కూరలుండిపోతే పనమ్మాయికి ఇచ్చేయ్” అన్నా ఉదాత్తంగా… లేవడానికి ఉద్యుక్తురాలినవుతూ

“లేదు. నేనివ్వను” గట్టిగా చెప్పింది మేము భోంచేసే వెళ్ళాలన్నట్లు పట్టుదలగా. చివరికి గట్టి పట్టు మీద కూరలు బాక్సుల్లో పెట్టి ఇచ్చేందుకు అంగీకరించింది.

***

స్వప్న మాటలు నన్ను చాలా రోజులు వెంటాడాయి.

అలా అని తననీ తప్పు పట్టలేము. ఫిజియోథెరఫీకి వెళుతున్నా.. కుడి చెయ్యి స్వాధీనంలోకి రావడం లేదు. ఆఫీసులో పని కూడా ఎక్కువై నరాల బాధ ఎక్కువ అవుతుంది. స్వప్న నాకన్నా పదేళ్ళు చిన్నది. దానికే లేని ఓపిక .. దీర్ఘ కాల బాధితురాలిని, నాకు ఉంటుందా!

దసరా పండుగ వచ్చింది.

మద్యలో ఒక్క రోజు శెలవు పెడితే .. అయిదురోజులు కలిసి వస్తాయని, స్వప్న వాళ్ళు, తమ్ముడి కుటుంబం, ఇంటి దగ్గర మరో రెండు కుటుంబాల వాళ్ళు కలిసి ‘శ్రీశైలం’ వెళ్ళే ప్రోగ్రాం వేసుకున్నారు.

నాన్నగారు ప్రయాణాలు చెయ్యలేరు.. అక్కడ ఒంటరిగా ఉండలేరు కాబట్టి, కాంచన నాన్న గారిని కాకినాడ రమ్మనడంతో.. తమ్ముడు కారులో పంపించాడు.

కాంచన టీచరు కావడంతో, తనకీ శెలవులే. వారం తరువాత తన శెలవులూ పూర్తి అవడంతో.. మా ఆయన రిటైరు అయ్యి, ఇంట్లోనే ఉండడంతో.. పగలు చూస్తూ ఉంటారని నాన్నగారిని మా ఇంటికి తీసుకొచ్చాను.

చిన్నల్లుడులా మా ఆయన.. కలిసే మనిషేం కాదు. ఆయన ప్రొద్దస్తమానం హాలులో టీ,వి ముందుంటే, నాన్నగారు తన గదిలోనే .. కాళ్ళ కట్టేసినట్లు అక్కడే పుస్తకం చదువుకుంటూ ఉండిపోయేవారు. సాయంత్రం ఇంటి కొచ్చిన నాకు ఎవరి ప్రపంచంలో వాళ్ళు కనిపించేవాళ్ళు.

నాన్నగారు అల్లుడితో మాట్లాడాలని ప్రయత్నించినా సంభాషణ పొడిగేది కాదు. ఆయన ‘ఊ’ ‘ఆ’ అని సమాధానాల్ని తుంచేసేవారు. గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్లగలమే గాని, త్రాగించడం ఎవరితరం.

నాన్నగారు ఉన్నన్నాళ్ళూ ఆయన నిప్పు మింగినట్లు… నా మీద కోపం, కోపంగానే ఉంటారు. ఇంట్లో గొడవ జరగకూడదని, అన్నిటిని భరించుకుంటూ ఉంటాను.

ఓ రోజు నాన్నగారితో “అస్తమానం అలా ఆ గదిలో ఉండిపోకపోతే.. కాస్త ముందు రూంలోకి వచ్చి టీ.వీ చూడవచ్చు కదా” అన్నా, అలా తనను తాను బంధించుకునిపోతుంటే కష్టం అనిపించి.

“చూద్దాం అనే అనుకున్నాను. ఆ కుర్చీ నిండుగా పుస్తకాలు ఉన్నాయి. అందుకే వచ్చేసా” అన్నారు.

“ఆ కుర్చీలో పుస్తకాలు ఉంటే ఏమిటి, ప్రక్కనే సోఫా ఉంది కదా! దానిలో కూర్చోవచ్చు కదా” కోపం తెచ్చుకున్నాను. పిల్లలు దగ్గర లేకపోవడంతో ఇల్లంతా ఖాళీ.. ఓ కుర్చీలో చదివేసిన పుస్తకాలు పడేస్తుంటాం.

రెండు నిముషాలు ఆలోచించి “సోఫాలో ఏం కూర్చుంటాం! అవుటర్‌లా” అని మాత్రం అన్నారు. అప్పుడు అవగతమైంది నాన్న గారు మనసు.

మా ఆయన ఎప్పుడూ తన పడక్కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారట. అందుకే ఈ అల్లుడికి ముందు కుర్చీలో.. కూర్చోవాలని అనుకోరు.

ఈ విషయం ఆయనతో చెబితే.. ప్రయోజనం ఉండకపోగా.. పంతం ఎక్కువ అయి, ఇంట్లో గొడవలూ అవుతాయి. అందుకే మా ఇంట్లో బందికానా బ్రతుకే నాన్నగారిది.

నాన్నగారి అతి అభిమానానికి ఎప్పుడో… మా చిన్నతనంలో జరిగిన విషయం గుర్తుకొచ్చింది.

నాన్నగారు మంచి వయసులో ఉన్నప్పుడు.. తండ్రంటే తిట్టాలి, తిడితేనే పిల్లలు చదువుతారు. పెళ్ళాం అంటే కసురుకుంటూ, విసుక్కుంటూ ఉంటేనే ఉండాలి.. అలా అయితేనే మాట వింటుంది అన్నట్లు ఉండేవారు. ఎప్పుడూ కోపమే.

ఉద్యోగంలో ఉన్నానన్న అహంకారం. అటు తన తరుఫునా, ఇటు అమ్మ తరుపునా ఎవరూ చదువుకున్న వాళ్ళు కాకపోయినా, అమ్మ తరుపు బంధువులంటే, వెంట్రుకముక్కతో సమానం. ఇంటికి వచ్చిన వాళ్ళు ఎప్పుడు పోతారా! అన్నట్లు, చిర్రుబుర్రులాడుతూ ఉండేవారు.

ఉద్యోగంలో ఉండి.. ఇంగ్లిష్ మాట్లాడే నాన్నగారు అంటే .. అమ్మ వాళ్ళ బంధువులకి చాలా గౌరవం .. అంతే భయం. ఏ పిల్లలకైనా అమ్మ తరుఫు బంధువుల మీదే ఆపేక్ష ఉంటుందట. మాకూ అలా ఉన్నందుకూ కోపమే నాన్నగారికి.

అదే తన తరుపు వాళ్ళు వస్తే, విందులు, సినిమాలు.

అందుకే అమ్మ బాధపడేది.

ఓ సారి తలవని తలంపుగా.. అమ్మమ్మగారి ఊరు నుంచి అమ్మకి.. ‘వరుస’కి అన్నయ్య అయిన వ్యక్తి అనకాపల్లి వచ్చి ఓ రాత్రి మా ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఆ మామయ్య అమ్మమ్మగారి ఊరిలో మాకూ తెలుసు. పట్నం నుంచి వచ్చామని, కొబ్బరి చెట్టెక్కి.. బొండాలు తీసి ఇచ్చేవాడు, తాటి ముంజలు కొట్టిచ్చేవాడు. అతన్ని వాడపల్లి మామయ్య అని పిలిచేవాళ్ళం.

ఆ రాత్రంతా ఇంట్లో అసహనం నెలకొంది.

తెల్లవారేసరికి మామయ్య మాకన్నా ముందే నిద్ర లేచి, స్నానాధికాలు ముగించి .. అమ్మ ‘కాఫీ’ ఇవ్వగానే.. “ఇక బయలుదేరుతానమ్మా” అన్నాడు.

“అదేమిటి. అన్నయ్యా రాత్రి పొద్దుపోయిన తరువాత వచ్చావు. ఏమి తిన్నావు కాదు. ఈ పూట అయినా భోజనం చేసి వెళ్ళు” అంది.

“లేటైపోతుందమ్మా. పనులుంటాయి కదా” తెచ్చుకున్న చేతి సంచి అందుకుంటూ.

“ అయినా సరే! నువ్వు మా ఇంట్లో ఒక్క పూటైనా.. భోజనం చెయ్యకపోతే రేపు నేను పుట్టింటికి వచ్చి ఎలా తల ఎత్తుకు తిరిగేది. ఇంటికి వెళినందుకు, ‘కృష్ణ’ ఒక్క పూటైనా భోజనం పెట్టలేకపోయిందా! అని నలుగురూ అనుకుంటే నాకు బ్రతుకెందుకు?” అనడంతో “సరే” అన్నాడు.

ఇంట్లో తొందరగానే వంట అయిపోతుంది. తొమ్మిదయ్యేసరికి నాన్నగారికి, మామయ్యకి వడ్డించింది అమ్మ. ఆ మామయ్య .. నాన్నగారు ప్రక్కన చాప మీద కూర్చుని భోజనం చెయ్యడానికి మొహమాట పడ్డాడు.

ఇంటికొచ్చిన అన్నయ్యకి ఓ పూట భోజనం పెట్టి పంపించానని అమ్మ సంతోషపడుతుంటే .. సాయంత్రం మాత్రం గాలి దుమారం రేగింది.

“నా ప్రక్కన కల్లు గీసుకునేవాడిని కూర్చోబెట్టి, అన్నం పెడతావే.. ఒళ్ళు పొగరెక్కి, కొవ్వెక్కిపోయి ఉన్నావు. నీకు మొగుడంటే లెక్కలేదు. గౌరవం లేదు” అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు.

“అన్నయ్య తొందరగా వెళ్ళిపోతానంటే .. మీతో కలిపి పెట్టాను. మీరు వెళ్ళిన తరువాత పెడితే, వేరుగా పెట్టానని .. అన్నయ్య బాధపడొచ్చు” అంటూ అమ్మ సంజాయిషీ ఇచ్చినా.. మాటా మాటా పెరిగి.. పరిస్థితి చెయ్యి చేసుకునేంత వరకూ వచ్చింది. ఆ ఏడ్పులకి .. గొడవకు ఇరుగుపొరుగు వారు పిట్ట గోడల దగ్గర నిలబడి పోవడం చూసాం.

ఆ సిగ్గుతో.. మరునాడు పిల్లలం ఎవ్వరం కాలేజీకి వెళ్ళలేదు. జీవితం అంతా కత్తి మీద సామే. అలాంటి సంఘటనలు ఎన్నెన్నో.

అమ్మ పోయిన తరువాతే.. నాన్నగారి మీద జాలి కలిగింది.

ఆ జాలే ఆరేళ్ళుగా కొనసాగుతుంది.

ఓ ఉదయం ‘గోధుమ జావ’ అందిస్తుంటే నాకు మాత్రమే వినబడేలా అన్నారు “అలా మాట్లాడతాడేమిటి? వెంకటరావు.. బొత్తిగా… మాటల్లో సౌమ్యత లేదేమిటి? ఎప్పుడూ అసహనంగానే ఉంటున్నాడు” అని.

ఏం చెప్పాలి? అత్తవారి తరుపు వాళ్ళంటే, మీలాగే… మీ అల్లుడికీ తక్కువ భావమే అని చెప్పాలా?.. అమ్మ లాంటి ‘చెరే’ నాదని చెప్పాలా?

“అవేం పట్టించుకోకండి. ఆయన అంతే”.. అని కొట్టి పారేసాను మనసు మండుతూ ఉన్నా పైకి మాములుగా,

“అందుకే.. భయం.. ఇక్కడ.. ఉండాలంటే” అన్నారు మరింత నెమ్మదిగా. ఒకప్పుడు అల్లుడుగా అహంభావంతో ఉన్న మనిషి.. వయసు పైబడిన మామగా, ఓపిక తగ్గి .. పరిస్థితులకు భయపడుతున్నారు. ఓడలు బండ్లయినాయి.

చేసుకున్న వాడ్ని బట్టి, ఆడవాళ్ళ జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఇరుకు మనసుల మగవాళ్ళ మద్య నలిగిపోయేది ఆడవాళ్ళు.

స్వప్నకి ఇలాంటి విషయాలు ఏం తెలుసు.

గడిచిన కాలం తిరిగిరాదు. నిన్నటి రోజు ఎలా గడిచినా.. రేపటి రోజు సంతోషంగా గడవాలనుకోవడం మనిషి నైజం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here