పునరుత్థానం

1
7

[dropcap]రా[/dropcap]త్రి తొమ్మిది గంటలు దాటుతోంది.  పొద్దున్న నుంచీ టూర్‍లు బుకింగ్ చేస్తూ అలసిపోయి వున్నారు వాళ్ళిద్దరు. విష్ణు కౌండిన్య, శివ చైతన్య.

సంగీతపు ధ్వనులు చేస్తూ బయట డోర్ బెల్ మోగింది.

“ఓ! నో! ఇప్పుడా! ఇప్పుడు కాదు! తలుపు తెరవకు!” అన్నాడు విష్ణు. అతని ఎదురుగా వున్న కంప్యూటర్ తెరలు ఇంకా రంగులలో మెరుస్తున్నాయి.

కానీ ఇప్పటికే అతని టేబిల్ మీద ఆంధ్రకస్ గ్రహపు అత్యంత ప్రియమైన మద్యపానీయం ‘మదిరా’ బాటిల్ తెరిచివుంది.

ఇక శివ టేబుల్ నిండా ఉదయం నుంచి చేసిన పని తాలూకు సమాచారం నిండిన మైక్రోచిప్స్ కంప్యూటర్ కీబోర్డ్‌లు, కొన్ని ‘పేపిరస్’ ఫైల్సు నిండి వున్నాయి. అతను ఇప్పుడే ఓపెన్ చేసిన డిన్నర్ ప్యాకెట్‍లో వేడి వేడి పీజా లాంటి ఆహారపదార్థాలు పొగలు కక్కుతున్నాయి.

ఆల్ఫాసెంటారీ నక్షత్ర మండలంలో ఆల్ఫా 1B గ్రహానికి ఆంధ్రకస్ అని పేరు పెట్టుకున్న గ్రహం వారిది, ఆ గ్రహంలోని రెండవ పెద్ద నగరం ఐరావతిలో ఒక ప్రధానమార్గంలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో ‘అంతర్ గ్రహ టూరిస్ట్ సర్వీసెస్’ అన్న ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు నడుపుతున్నారు. దాంట్లో ఉద్యోగస్తులు వాళ్ళిద్దరు.

అది కాలంలో ఏ సంవత్సరమో చెప్పడం కష్టం. ఎందుకంటే కాలం సాపేక్షం కనుక.

అది ఒక అధునాతనమైన మానవ కాలనీ. ఎప్పట్నించి వుందో తెలియదు. కనీసం ఎనిమిది వందల సంవత్సరాల నుంచి కావచ్చు. ఆల్ఫా సెంటారీ ప్రాక్సిమా సెంటారీ అనే జంట నక్షత్రాల చుట్టూ వున్న గ్రహ సముదాయంలో ఇది ఆల్ఫా సెంటారీ చుట్టూ తిరిగే ఒక గ్రహం. శతాబ్దాల క్రితం ఇక్కడ మానవులు వలస వచ్చి స్థిరపడ్డారు. ఆంధ్రకస్ అనే పేరున్న ఈ గ్రహంలో దేశాలు లేవు. అన్నీ కాలనీలే.

శివ, విష్ణులకి చరిత్ర గురించి అంత అవగాహన లేదు.

ఈ గ్రహం నుంచి మరొక గ్రహానికి, అక్కడి నుంచి ఇక్కడికీ టూరిస్ట్ సర్వీసులు నడుపుతూ వుంటారు.

వాళ్ళకి స్పేస్‍షిప్‍లు నాలుగు వున్నాయి అవి ఆల్ఫా సూర్యుడిశక్తి తోనూ, అణువిద్యుత్ శక్తి తోనూ నడిపించే టెక్నాలజీతో పనిచేస్తాయి. అవి కాంతివేగానికి కొంచెం తక్కువ వేగంతో కూడా ప్రయాణించగలవు. వీటిలో ఆ చుట్టుపక్కల గ్రహాలకి పర్యాటకులని, యాత్రికులని తీసుకుని వెళ్తుంటారు. ఆయా గ్రహాల వింతలు, వినోదాలు చూపిస్తూ అంతర్గ్రహ పర్యటనలో డబ్బు సంపాదిస్తుంటారు. అయితే ఆ ఆదాయంలో మూడు వంతులు పైగా వారి యజమానికే పోతుంది. వాళ్ళు జీతాలకే పనిచేస్తుంటారు. శివకి ముఫ్పై ఏళ్ళుంటాయి. పొడుగ్గా తెల్లగా గిరిజాల జుత్తుతో బలిష్టంగా వుంటాడు. అతని గర్ల్ ఫ్రెండ్ జాస్మిన్ వీడియో ఫోనులో అప్పుడే కనబడి మాట్లాడుతోంది.

“ఇంత లేటా? ఎప్పుడు వస్తావ్? త్వరగా రా! వెయిటింగ్.”

మళ్ళీ కాలింగ్‍ బెల్ మోగింది.

వాళ్ళిద్దరికీ సహాయంగా వున్న స్త్రీ రోబట్ ‘అనూహ్య X’ అందమైన యువతి ఆకారంలో వుంటుంది.

“తలుపు తీయమంటారా మాస్టర్స్!”

విష్ణుకి కూడా ఓ నలభై ఏళ్ళ వయస్సుండవచ్చు. అతను చాలా లావుగా ఉండి. ఎర్రటిగడ్డం మీసాలతో, బంగారు రంగు గిరజాల జుట్టుతోనూ తీక్షణంగా చూసే నీలికళ్ళతోనూ, గంభీరంగా వుంటాడు.

“నో! నో! టైం అయిపోయింది” అంటూ తన టేబిల్‍మీదున్న ఒక బటన్ నొక్కాడు. ద్వారం బయటవున్న వాళ్ళు మానిటర్‍లో కనిపించసాగారు.

చాలా వయసున్నట్లు ఎన్నో ముడతలు పడిన ముఖం, నెరిసిన బంగారు రంగు వుంగరాల జుట్టు, తెల్లని పొడుగాటి గడ్డం, అంతకంటే స్వచ్చమైన ధవళవస్త్రాలలో, చక్రాల కుర్చీలో కూర్చుని వున్న వృద్ధుడు. ఆయనకి ప్లాటినం కళ్ళ అద్దాలు మెరుస్తున్నాయి.

ఆయన కూర్చున్న ఎలక్ట్రానిక్ చక్రాలకుర్చీ వెనకాల దాన్ని తోస్తూ నిలబడ్డ ఆరడుగుల పొడుగున్న బలిష్టమైన రోబట్- లోహంతో తయారుచేసిన శరీరం, హెల్మెట్ లాంటి తల మధ్యగా నీలంరంగుతో మెరిసే కళ్ళు, లోహపు ఛాతీ మీద, వెండిరంగు తెర, బటన్స్, బలిష్టంగా కనిపిస్తున్న యాంత్రికపాదాలూ, చేతులతో శక్తివంతంగానే కాకుండా, విజ్ఞానవంతంగా కనిపిస్తోంది.

కాలింగ్ బెల్ మళ్ళీ మోగింది. ఈసారి రోబట్ యాంత్రిక స్వరం.

“తలుపు తెరవండి! అర్జంట్! ఇది మా మాస్టర్ ఆజ్ఞ. మీకు కావాలంటే ఎక్స్‌ట్రా ఫీజు ఏదయినా వుంటే కూడా ఇస్తాం. ఇది అత్యవరసమైన పని” అంటుండగానే రోబట్ కళ్ళు నీలంగా మెరిసి ఎర్రరంగులోకి మారాయి. అది దాని కోపానికి సంకేతం కావచ్చు.

శివకి కోపంగా, విసుగ్గా వుంది.

అతని గర్ల్ ఫ్రెండ్ జాస్మిన్ వీడియో ఫోన్‍లో కోపంగా సతాయిస్తోంది. “ఎన్నాళ్ళు చేస్తావ్ ఆ పిచ్చి ఉద్యోగం. జీతమూ సరిపోదు. టైంకీ రాలేవు. ఈ రోజుకూడా మళ్ళీ అలానేనా! ఇంకేం వస్తావ్ రెస్టారెంట్ డిన్నర్‍కి!”

విష్ణు అన్నాడు “పోనీ, ఎవరో చూద్దాం. తలుపు తెరుద్దాం!”

“నో! నో! ఇప్పుడు వెళ్ళకపోతే జాస్మిన్ బ్రేకప్ కూడా చెప్పేస్తుంది. తలుపు తెరవకు!” లేచి బ్యాగ్ పట్టుకుని నిల్చున్నాడు శివ బయలుదేరడానికి సిద్దంగా.

‘ధన్’మన్న చప్పుడుతో ఆఫీస్ ముఖద్వారపు గాజు తలుపులు బద్దలయ్యాయి. రోబట్ నేత్రాల నుంచి ఎర్రటి లేజర్ కిరణాలు ప్రసరించి తలుపు బద్దలయి ఒక యాంత్రిక హస్తం లోపలి గడియని తీయడం, తలుపు తోసుకుని వీల్ ఛైయిర్‍ని తీసుకుంటూ లోపలికి ఆ వృద్ధ వ్యక్తిని తీసుకురావడం క్షణాల్లో జరిగిపోయింది.

“విష్ణు కౌండిన్య, శివ చైతన్య! మీరిద్దరు శ్రద్దగా వినండి. నా మాస్టర్ వృద్ధుడు. కనీసం మూడువందల సంవత్సరాల వయసున్న పెద్దమనిషి. మీ తలుపులు ధ్వంసం చేసినందుకు మా క్షమాపణలు. ఆ రిపేర్ ఖర్చులు అన్నీ ఆయన భరిస్తాడు. ఆయన ఆల్ఫాసెంటారీ సిస్టంలో ఆంధ్రకస్ గ్రహంలోని సుదూర ప్రాంతం నుంచి మీ కోసమే వచ్చాడు. ఇది అత్యవసరమైన ట్రిప్ మాకు. ప్లీజ్ కోఅపరేట్. నేను ఆయనకి సహాయంగా వున్న ‘ఆమ్నీ పొటెంట్ 9999 రోబట్ ఆఫ్ 2 సిరీస్ విత్ కంబాట్ ఎబిలిటీస్’! అంటే యుద్ధం చేసి కూడా మీతో ఒప్పించగలను” రోబట్ రెండో చేతిలో ఒక నల్లటి రివాల్వర్ ప్రత్యక్షం అయింది.

విష్ణు, శివ ఇద్దరూ ఒకేసారి అరిచారు షాక్‍తో. “ఓ… నో! మేం గ్రహాంతర పోలీస్‍ని పిలుస్తాం” ఇపుడు వీల్ ఛైయిర్ లోని వృద్ధుడు గంభీరంగా అన్నాడు. “నా పేరు పరబ్రహ్మ. నా వయస్సు రెండువందల తొంభై సంవత్సరాలు దాటుతోంది. నాకు అవసాన దశ వచ్చేసింది. నేను చెప్పిన పని మీరు చేసి, నా ప్రయాణం చేయించగలిగితే, మీకు వంద మిలియన్ కరెన్సీ యూనిట్లు, నా ఆస్తిలో సగం రాసి ఇచ్చేస్తాను. ఆలోచించుకోండి!”

’ఏమైయినా సరే కుదరదు…’ అందామనుకుని ఆగిపోయాడు శివ. కళ్ళముందు జాస్మిన్ మెదిలింది. ఇంత డబ్బా! ఈయనెవరో చాలా ధనవంతుడులా వున్నాడు. ఈ గ్రహంలో వ్యక్తులకి మూడువందల ఏళ్ళు ఆయుష్షు వున్నది కాని ఇంత ధనవంతులు అరుదు. పైగా వింత మనిషిలా ఉన్నాడు. ఇంత డబ్బు ఎందుకు ఇస్తున్నాడో… ఏదో అనబోతున్న స్నేహితుడు విష్ణుని వారించి “డబ్బు అంతా మా బ్యాంక్ అకౌంట్‍లో ముందే జమ చేయాలి. ఏం పని చేయాలో సెలవీయండి. మాకు కుదురుతుందేమో ఆలోచిస్తాం!”

“ఈ అనంత విశ్వంలో ఏ గమ్యానికైనా అతి తక్కువ ఖర్చులో ప్రయాణం… అని రాసి వుంది కదా మీ బోర్డ్ పైన?” రోబట్ గర్జించింది.

“అవును! కానీ మీ గమ్యం, తిరిగిరాక, ఎన్ని రోజుల ప్రయాణం, ఇవన్నీ చెప్పాలి కదా, మా ధర చెప్పడానికి అది అవసరం”

వీల్ ఛైయిర్‍లోని పరబ్రహ్మ ఇబ్బందిగా కదిలాడు. “నువ్వూరుకో ఆమ్నీ! నన్ను మాట్లాడనీ! మిష్టర్ విష్ణూ అండ్ మిష్టర్ శివా బహుశా మీ పేర్ల ప్రాముఖ్యత కూడా మీకు తెలియదు అనుకుంటాను. నన్ను ‘భూమి’కి తీసుకువెళ్ళాలి. అది సూర్యుడు అనే ఒక నక్షత్రపు సౌర కుటుంబంలోని ఒక గ్రహం. సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహం అట! మా పూర్వీకులు అక్కడి నుంచే వచ్చారట. నాకు మా ఇంట్లోని దస్తావేజులలో కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లలో మా ముత్తాతలు రాసిన వివరాలు దొరికాయి”

“భూమి… భూమి… సూర్యుడు… సౌరకుటుంబం” విష్ణు శివ తలగోక్కున్నారు.

శివ తన టేబుల్ మీది కంప్యూటర్లోని విజ్ఞాన అన్వేషణలో సౌరకుటుంబం, భూమి అని టైప్ చేశాడు. ఓ నిమిషానికి తెరమీద వివరాలు కనిపించసాగాయి. అతనికి మతి పోయినట్లయింది.

“అయ్యా పరబ్రహ్మం గారూ! ఇది మన ఆల్ఫా సెంటర్‍కి నాలుగున్నర కాంతి సంవత్సరాల  దూరం. మా దగ్గరున్న హైపర్ స్పేస్ కాంతి వేగపు స్పేస్ షిప్ లోనే వెళ్ళగలం. మామూలు అంతరిక్ష నౌకలో అయితే వంద మానవ సంవత్సరాలు పడుతుంది. కాంతివేగంతో విశ్వంలో ఎవరూ ప్రయాణించలేరు కాబట్టి దానికి కొంచెం తక్కువ వేగంతో పయనించగలం. ఆల్ఫా కాలమానంలో అయితే ఒక సంవత్సరం పడుతుంది. కాలం సాపేక్షం. దీనికి ఒక కొలతలేదు విశ్వంలో. ఇది మామూలు ప్రయాణానికి నాలుగింతలు ఖర్చు. పైగా దారిలో గ్రహశకలాలు అయస్కాంత తుఫానులు లాంటి అపాయాలెన్నో వుంటాయి”

విష్ణు కూడా ఆ సమాచారం చదివాడు. “కొన్ని వందల సంవత్సరాల క్రితం సూర్యుడిలో ఏదో జరిగింది. భూమిలో ఏదో ఉత్పాతం జరిగింది. ఆ ఉత్పాతానికి అక్కడి ప్రజలందరూ వేరే దూరగ్రహాలకి వలసపోయారు. అక్కడే మిగిలిన వారు నశించిపోయారు”

“నేను భూమికే వెళ్ళాలి. నా ప్రయాణం అక్కడికే. నేను జీవించి ఉండగా భూమిని చూడాల్సిందే. నా అస్తిలో సగం కాదు 90శాతం ఇచ్చేస్తాను. తీసుకెళ్ళండి ప్లీజ్!” పరబ్రహ్మ ప్రాధేయపూర్వకంగా అన్నాడు.

శివ అనుకున్నాడు. ‘నా సమస్య తీరింది. ఇక మరెక్కడా పనిచేయకుండా జీవితానికి సరిపడా ధనం సంపాదించవచ్చు. జాస్మిన్ సంతోషిస్తుంది.’

విష్ణు వారించబోయాడు “మనకు ప్రమాదం. తిరిగి రావడానికి ఇంధనం ఖర్చు… దారిలో ఎదురయ్యే సమస్యలు… ఎందుకు ఇదంతా? పైగా మన యజమాని ఒప్పుకోడు కదా!”

“యజమానికి చెప్పం. డబ్బంతా మన ఇద్దరమే పంచుకుందాం. హైపర్ స్పేస్ షిప్ నంబర్ 001లో రేపే పయనం అంతే! కొంత సాహసం చేయనిదే జీవితంలో బాగుపడం! ఓ.కే సర్! మీరు లోపల విశ్రాంతి తీసుకోండి. మా డబ్బులు ముందే ఇవ్వాలి. రేపే ప్రయాణం.”

పరబ్రహ్మ రోబట్ ఆమ్నీ ఛాతిమీద బటన్‍లు నొక్కి అన్నాడు. “మీ అకౌంట్ నంబర్ చెప్పండి. సగం మాత్రం ఇప్పుడు. మిగతా సగం భూమిని చేరగానే మీకు చేరుతుంది!”

వాళ్ళు నో అనలేకపోయారు.

రోబట్ ఆమ్నీ ఛాతిమీద తెరలో మనీ టాన్స్‌ఫర్డ్ అన్న ఎర్రని అక్షరాలు మెరుస్తూ సాగిపోయాయి. మళ్ళీ దాని చేతుల్లో 3D ప్రింటర్‍తో చేసిన రివాల్వర్ ప్రత్యక్షం అయింది.

“ఓ.కే?”

“ఓ.కే! డన్!” అన్నారు ఇద్దరూ. సగమే ఇచ్చి నా గత్యంతరం లేదు.

***

ఆంధ్రకస్ గ్రహం, ఆల్ఫా సెంటారీ నక్షత్ర వ్యవస్థలో అంతరిక్ష విమానాశ్రయంలో నిలబడ్డ పెద్ద గ్రహాంతర నౌక హైపర్ స్పేస్ ప్రయాణానికి అనువుగా నిలబడి వుంది. యజమానికి చెప్పకుండానే బయలుదేరారు. భూమికి నాలుగున్నర కాంతి సంవత్సరాల దూరం ప్రయాణించాలంటే నౌక హైపర్ స్పేస్‍లోకి పోయి వార్ప్ వేగంతో ప్రయాణించాలి.

ఆ నౌకలో డ్రాయింగ్ రూం, రెండు బెడ్‍రూంలు, ఇంజన్ రూం, డాకింగ్ పోర్ట్ అంటే బయటికి ద్వారం ఉన్నాయి. పర్యాటకులు, గ్రహ ప్రయాణ దృశ్యాలు తిలకించేందుకు పెద్ద పెద్ద గాజు అద్దాల కిటికీలు, ఎలక్ట్రానిక్ మానిటర్‍లు వున్నాయి.

అతి వృద్ధుడైన ప్రయాణికుడు పరబ్రహ్మం తన ఆహారం, వైద్యం, నిద్ర, రక్షణ, సమాచారం లాంటి అన్ని విషయాలకీ తన రోబట్ మీదనే ఆధారపడేవాడు. ఆయన మాట్లాడేవాడు కానీ వృద్ధాప్యం వల్ల వచ్చిన చెముడు, దృష్టిలోపం, కీళ్ళనొప్పులు, ఆయాసం అన్నీ వున్నాయి. విష్ణు, శివ పరబ్రహ్మని రోజూ భోజనాల సమయంలోనే కలిసేవారు.

“మీ భూగ్రహం గురించి చెప్పండి సార్” అని అడిగేవారు. “అసలు అంతదూరం వెళ్దామని ఎందుకు అనుకున్నారు?”

ఆయన మెల్లగా చెప్పేవారు. “మనమంతా భూమినుంచి వచ్చినవారమే నాయనా! మా తాత ముత్తాలకి ఆల్ఫా సెంటారీ గ్రహాలలో వున్న అపారమైన ఆస్తి అంతటికీ నేను వారసుడిని. నా వాళ్ళందరు ఇప్పుడు మరణించారు. మా పూర్వీకులు కంప్యూటర్లలో నిక్షిప్తమైన భూమి చరిత్ర, హోమోసాపియిన్స్ అనబడే మానవజాతి గురించి చదివేవాడిని. మా ముత్తాతలు వ్రాసిన విషయాలు, ఫోటోలు, వీడియోలు ఎప్పుడూ చూస్తుండేవాడిని.”

అలా మాట్లాడుతూ “ఆమ్నీ” అని భావగర్భితంగా చూసేవాడు తన రోబట్ వంక.

రోబట్ తన మెమరీలో నిక్షితమైన భూమి చరిత్రనంతా చూపించేది. ఆ దృశ్యాలు నౌకలోని ఎలాక్ట్రానిక్ మానిటర్ తెరలపై 3D ఎఫెక్ట్ లతో కదలిపోయాయి.

భూమి ఒక నిప్పు గోళంలా ఆవిర్భావం అవడం, చల్లబడటం వాతావరణం ఏర్పడి, పర్వతాలు, సముద్రాలు చెట్లు ఏర్పడటం. సముద్ర జంతువులు, ఆ తర్వాత భూమి మీద ఏర్పడిన సరీసృపాలు, డైనోసార్లూ, మామత్‍లు అనబడే పెద్ద ఏనుగులు, పెద్ద పెద్ద వింతైన చెట్లూ, లక్షల సంవత్సరాలు విలసిల్లిన వాటి ఉనికీ… ఆ తర్వాత గ్రహశకలం పడి నశించిన డైనోసార్లు వాటిలో అవే కలహించుకుని పూర్తిగా అదృశ్యమైపోవడం, వివిధ రకాల జంతువులు, చింపాంజీ, గొరిల్లాలూ, ఆదిమ మానవుడు ఏర్పడటం, పాత రాతియుగం, కొత్త రాతియుగం, మానవులలోని వివిధ రకాల స్పీషీస్ హోమో ఎరక్టస్, నియాండ్రథాల్ మనుషులు వారందరిని క్రమంగా జయించి నిలబడిన హోమోసాపియన్స్ అనబడే చివరి మానవ జాతీ, ఇలా మానవ జాతి చరిత్ర అంతా దృశ్య మాలికలా కనిపించింది. ఆ తర్వాత ఆ జాతి కొన్నివేల సంవత్సరాల తర్వాత, వేటాడి ఆహారం సంపాదించుకునే (హంటర్ గేదరర్) దశ నుంచి వ్యవసాయం చేసుకుని గ్రామాలలో నివశించే జాతిగా మారడం – హోమోసాపియన్స్‌గా మారి నిప్పును తయారుచేయడం, చక్రాన్ని కనుగొనడం, నాగరికత వర్ధిల్లడం, విజ్ఞానం సంపాదించడం.

మూడోరోజు పరబ్రహ్మ మళ్ళీ భూమి చరిత్ర చెబుతుండగా, శివ, విష్ణు అన్నారు. “ఇంక కొద్ది గంటలలో మనం హైపర్ స్పేస్ ప్రవేశిస్తాం సార్. కొద్ది నెలలు విపరీత వేగంతో ప్రయాణించాలి. సౌరకుటుంబం అంచున ఉన్న క్యూపియర్ బెల్టు, ప్లూటో, నెప్ట్యూన్ చేరుకుంటాం. ఇక విశ్రాంతి తీసుకోవాలి. చరిత్ర చూడలేం”

“విష్ణు, శివా మీ పేర్లని బట్టి మీరు కూడా భూమిలో నా ప్రాంతం వారే అనిపిస్తుంది. ఈ చరిత్ర చూడండి. నాకు మా తండ్రికి వచ్చే అదే కలని చూడండి”

“వివిధ మానవ నాగరికతలు, మెసపటోమియన్, గ్రీక్, రోమన్, ఈజిప్షియన్ నాగరికతలు వాటి ఉత్థాన పతనాలూ, రినైసాన్స్ అనే విజ్ఞాన పునరుజ్జీవనం, ప్రపంచ యుద్ధాలు ఆ తర్వాత నాగరికతలు ఉజ్జ్వలంగా ప్రభవిల్లి విమానాలు, అంతరిక్షయానాలు, ఇంటర్నెట్, గ్రహాంతర యానం చేసే అభివృద్ది సాధించడం అన్నీ చూపించిన తర్వాత…

ఒక ప్రశాంతమైన గ్రామం. దానిచుట్టూ పచ్చని వరి పొలాలు, ఎర్రటి పెంకుల కప్పులతో చిన్న చిన్న ఇళ్ళూ కొన్ని భవనాలూ, ఆ వూరిమధ్యన ఒక నీలి తటాకం పక్షుల కూజితాలూ… దూరాన పొలంలో మెత్తని చప్పుడుతో సహా తిరిగే ట్రాక్టర్….

“చూశావా! అదే నా గ్రామం. భూమిలోని దక్షిణ అర్థగోళంలో 160.26 దక్షిణ అక్షాంశ 800.99 తూర్పు రేఖాంశంలో వుంటుంది. ఆ పొలంలోనే నా ఆఖరి శ్వాస తీసుకోవాలని నా కోరిక. అదే నా కల. మా తండ్రి కోరిక కూడా అదే. కాని ఏవో కారణాల వల్ల తీర్చుకోలేకపోయారు. అందుకే నా ప్రయాణం!” పరబ్రహ్మ ఆయాసంగా కళ్ళు మూసుకున్నాడు.

రోబట్ ఆమ్నీ యాంత్రిక స్వరంతో “మాస్టర్! మీ గుండె వేగం తగ్గుతోంది. ఆయాసపడుతున్నారు. ఎక్కువ మాట్లాడకండి! ప్రమాదం!” లోపలినుంచి ఒక ట్రేలో మందులు, మంచినీళ్ళ గ్లాసు తీసుకుని వచ్చి ఇచ్చింది.

“విష్ణు, శివా! మా మాస్టర్‍ని హరితస్థలి అనే ఆ గ్రామానికి తీసుకు వెళ్ళకపోయారో జాగ్రత్త. మోసం చేశారో మీ ప్రాణాలుండవ్!”

పరబ్రహ్మ వారించాడు. “వూరుకో ఆమ్నీ! వారు నా వారే! నమ్మకస్తులే!”

మరికొన్ని గంటలలో వారి అంతరిక్ష నౌక హైపర్ స్పేస్‍లోకి పోయి వార్ప్ వేగంతో ప్రయాణించసాగింది.

***

నీలిరంగు విస్పోటనం. కాంతివేగం కంటే కొంత తక్కువతో ప్రయాణం. సౌరకుటుంబంలో అంచు నెప్ట్యూన్, ప్లూటో, క్యూపియర్ బెల్ట్ వైపుగా.

ఈ సమయంలో ప్రయాణీకులకు కొంత ఆరోగ్యసమస్యలు, తల తిప్పడం స్పృహ తప్పడం, వికారం లాంటివి రావచ్చు. పరబ్రహ్మకి అందుకనే నిద్రమాత్రలు ఇచ్చి సౌకర్యంగా పడుకోబెట్టింది ఆమ్నీ.

విష్ణు, శివలకు ఇలాంటి ప్రయాణం కొంత అలవాటే. వారి గదిలో బంకర్‍లలో పడుకుని భూగ్రహచరిత్ర మళ్ళీ చూడసాగారు.

చాలా శతాబ్దాలు భూనాగరికత అధ్బుతంగా విలసిల్లింది. వారి విజ్ఞానం సంగీత సాహిత్యాలు శిల్పం లాంటి కళలే కాక అత్యాధునిక సమాచార విజ్ఞానం, అణ్వాయుధాలు, పరిశ్రమలు కూడా వున్నాయి. అయితే పరిశ్రమలన్నీ వాతావరణాన్ని కలుషితం చేసేవే.

వాళ్ళకి ఆ వీడియో దృశ్యాలు ప్రపంచపు ఏడు వింతలు, పారిస్‍లోని ఈఫిల్ టవర్, రోమ్‍లోని కలోజియం, ఇండియాలోని తాజ్‍మహల్ లాంటివి అనేక వింతలు అచ్చెరువొందించాయి.

“ఇలాంటి నాగరికత ఎలా నాశనమయిందో! ఈ ప్రజలు మన వలెనే ఉన్నారు. మన భాషనే మాట్లాడుతున్నారు. వారు మనకు కూడా పూర్వీకులేనేమో”

“అణుయుద్ధంలో ఒకరినొకరు సర్వనాశనం చేసుకున్నారేమో!” అన్నాడు శివ.

“కాదు! మాస్టర్! చూడండి!” ఆమ్నీ యాంత్రిక స్వరం గంభీరంగా అంది.

“దృశ్యాలు వీడియోలలో కనిపించసాగాయి. క్రమంగా నల్లబడిపోతున్న ఆకుపచ్చటి పొలాలు, ఆకాశంలో నల్లటి విషవాయువులు నిండిన కాలుష్య మేఘాలు ‘కాలుష్యం’ పెరిగిపోయింది వారికి.

క్రమంగా దృశ్యాలు… కాలుష్యం గురించి, వార్తలు, వార్తాపత్రికలలో, టీవిలలో, ప్రజల సమావేశాలు, ఐక్యరాజ్యసమితి తీర్మానాలు, భూమి వేడెక్కడం ఆపాలని ఉపన్యాసాలు… కొన్ని దేశాలలో వరదలు, కొన్నిచోట్ల అగ్నిపర్వతాల పేలుళ్ళు, గుట్టలుగా చనిపోతున్న పక్షులు, జంతువుల కళేబరాలు.

ఇంతలో మానవులకు వచ్చిన మహమ్మారి. ఏదో తెలియని వింత సూక్ష్మజీవి వల్ల, చర్మం నల్లబడి ఒళ్ళంతా పుళ్ళతో వ్యాధిగ్రస్తులై గుంపులు గుంపులుగా రోడ్లమీద తిరుగుతూ గుట్టలుగా కూలిపోయి మరణించడం. ‘పాండెమిక్’ విశ్వమంతా వ్యాపించిన మహమ్మారి. ‘కాలుష్యం’ అదే వారిని అంతం చేసింది” అంది రోబట్.

“అదే సమయంలో మానవులు కొంతమంది అమెరికాలోని ఫ్లారిడాలోంచి గ్రహాంతర నౌకలలో అంతరిక్ష కేంద్రం నుంచి ఆకాశంలోకి ఎగిరిపోవడం కనిపించింది. వారితోబాటు వారి రోబట్లు కూడా. ఇంతలో వారి నౌకలోని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కంఠస్వరం మోగింది.

“కెప్టెన్స్! హైపర్ స్పేస్ ప్రయాణం ముగిసింది. సౌరకుటుంబం చేరుకున్నాం. ఇక మామూలు వేగంతో ప్రయాణం  కొనసాగుతుంది!”

***

పరబ్రహ్మ బాగా తేరుకున్నాడు. రోబట్ ఆమ్నీ తనని తాను ఛార్జ్ చేసుకుంది. దృశ్యాలు కిటికీల బయట కదిలిపోతున్నాయి. పరబ్రహ్మ ఆయాసపడుతూనే అన్నీ గుర్తుపట్టసాగాడు.

“అదిగో శనిగ్రహం. దాని రింగ్‍లు కొన్ని అదృశ్యం అయిపోయాయి. అదిగో గురుగ్రహం దాని రంగులు మారాయి. అది ఏస్టరాయిడ్ బెల్ట్. అయ్యో శుక్రగ్రహం నల్లబడింది. కుజగ్రహం ఎర్రగా వుండాల్సినది తెల్లగా అయింది! ఇదంతా సూర్య నక్షత్రంలోని అయస్కాంత తుఫానుల వల్ల కావచ్చా?”

ఎట్టకేలకు భూమి కనిపించింది. దూరాన అది ఒక నల్లటి రంగులోని గోళంలా దగ్గరికి వస్తోంది. “అయ్యో నీలి ఆకుపచ్చరంగులో మెరిసిపోవాల్సిన నా భూమి. ఇలా అయిపోయిందే” పరబ్రహ్మ విలపించసాగాడు.

ఆమ్నీ అంది. “ఊరుకో మాస్టర్! భూమి అంతా కాలుష్య విషవాయువుతో నిండివుంది. జరిగిన చరిత్ర చూడండి. పాండెమిక్ కాలుష్యంతో కలిసి చివరికి భూమిని అంతం చేసింది!”

నిర్మానుష్యం అయిన నగరాలు. వలసపోతున్న మానవులు.

“అయ్యో! ఇది నేను చూడనేలేదు. సుమారు ఎనిమిదివందల సంవత్సరాల క్రితం మా ముత్తాత అందుకనే ఆల్ఫాసెంటారీకి వలస వచ్చి వుంటాడు” అన్నాడు పరబ్రహ్మ.

“నన్ను త్వరగా నా వూరిలో దింపండి!”

“ఒద్దు సార్! ప్రమాదం. ఆక్సిజన్ ప్రమాణాలు తక్కువగా వున్నాయి అక్కడ!”

“లేదు. నేను నా హరిత స్థలి గ్రామంలో దిగాలి. అదే నా అంతిమయాత్ర”

రోబట్ ఆమ్నీ చేతిలో మళ్ళీ 3Dప్రింటర్‍తో చేసిన గన్. “శివ చైతన్య, విష్ణుకౌండిన్య! మా మాస్టర్ చెప్పినట్లు చెయ్యకపోతే మీకిద్దరికీ మరణం తప్పదు. జాగ్రత్త!”

ఇద్దరు చేతులెత్తి భయంగా అన్నారు “సరే! మేము భూమి మీద దిగలేము. మీరే దిగండి! మా రోబట్ అనుహ్యకి యుద్ధం తెలియదు. మాకు కూడా శాంతి కావాలి. వెళ్ళిపోతాం”

ఎట్టకేలకు భూగ్రహపు దక్షిణార్థగోళంలో 160.26 దక్షిణ అక్షాంశం 800.99 తూర్పు రేఖాంశం దగ్గర వారి అంతరిక్ష నౌక దింపారు. దూరాన ఒక కుగ్రామం. ఎప్పటివో శిధిలమైన భవంతులు. నల్లటి నీటితో నిండిన కాలువలు. ఒక చెరువు. పడిపోయిన దేవాలయం దగ్గర ఒంగిన ధ్వజస్తంభాలు.

నౌక తలుపులు తెరుచుకున్నాయి. ఏటవాలుగా దించిన ‘రాంప్’ మీదుగా చక్రాలకుర్చీ దిగసాగింది. దానిలో వృద్ధుడైన పరబ్రహ్మ ఆయాసపడుతూ కూర్చునీ, దానిని తోసుకుంటూ అతనికి విధేయుడైన ఆమ్నీ రోబట్. రోబట్ ఆయన తలకి ఆక్సిజన్ మాస్క్ బిగించింది.

విష్ణు, శివ ఆయనకి నమస్కరిస్తూ నౌక ద్వారం దగ్గర నిలబడ్డారు. ఆశ్చర్యకరంగా, దూరంగా గ్రామం పొలిమేరలో, ఒక నల్లటి నీళ్ళ చెరువు పక్కనే ఇంకా పచ్చదనంపోని వరిపొలం సూర్యకాంతిలో తళుక్కున మెరిసింది. ఆ పొలం చిన్నదే అయినా జీవకళ వుంది.

చక్రాల కుర్చీలోని పరబ్రహ్మ మెల్లగా తన ఆక్సిజన్ మాస్క్ తీసేశాడు. దూరాన తలపాగాలు చుట్టుకుని, శుష్కించిన దేహాలతో కొందరు మానవ రైతుల ఆకారాలు కనిపించసాగాయి. వారు అక్కడ ఏ మాస్క్‌లు లేకుండానే నిలబడి ఉన్నారు. అలానే చూస్తూ నిలబడిపోయిన విష్ణు అన్నాడు. “ఇంకా జీవరాశులు ఈ భూమిలో మిగిలే వున్నాయి. ప్రళయం తర్వాత, పాండెమిక్ తర్వాత కూడా, ఇంకా కొంత ప్రాణవాయువు, జలరాశులు మిగిలే వున్నాయి. మనం మాత్రం వెళ్ళిపోదాం పద! ఆ రోబట్ ఆయనని చూసుకుంటుందేమో. మనం మాత్రం నౌక దిగితే బతకలేం!”

మెల్లగా అంతరిక్ష నౌక తలుపులు మూసుకున్నాయి. ఒక పెద్ద చప్పుడుతో ఆకాశంలోకి నిప్పులు వెదజల్లుకుంటూ లేచి అంతర్థానమైపోయింది. తన జీవనకాలపు స్వప్నం నెరవేరిన పరబ్రహ్మ, ఇంకా జీవం మిగిలివున్న, ఆ పంటపొలం గట్టున తన విధేయుడైన రోబట్ తన వెనుక నిల్చుని వుండగా, అస్తమిస్తున్న ఎర్రటి సూర్యబింబం కేసి చూస్తూ, ఆఖరిరోజులు గడపడానికి ఉపక్రమించాడు.

రోబట్ ఆమ్నీ ఒక క్షణం ఎగిరిపోయిన అంతరిక్ష నౌక వైపు చూసి మళ్ళీ తన మాస్టర్ సంరక్షణ బాధ్యతలో మునిగిపోయింది. దానికి ఆక్సిజన్ అవసరం లేదు. సూర్యకాంతి చాలు. కాలుష్య ప్రళయం, పాండెమిక్‍లతో చాలావరకు నశించినా ఇంకా కొద్దిగా పచ్చదనం, ప్రాణవాయువు మిగిలిన ఆ గ్రామంపై  సూర్యాస్తమయం అయి, చీకటిరాత్రి వాలసాగింది. ఎంత ప్రళయం సంభవించినా పునరుత్థానం కూడా వుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here