ప్రాంతీయ సినిమా – 17: పంజాబీ పదనిసలు

0
7

[box type=’note’ fontsize=’16’] “బాలీవుడ్ ప్రభావంలోంచి బయటపడ్డా, పంజాబీ సినిమాలు గ్లోబలీకరణ ప్రభావానికి దూరంగా వుండలేకపోయాయి. గ్లోబలీకరణ అన్ని అస్తిత్వాలనీ చదును చేసేసి దాని వ్యాపార సంస్కృతి ఒక్కదాన్నే పెంచి పోషించుకుంటోంది” అంటూ పంజాబీ సినిమాలను విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

[dropcap]ఆ [/dropcap]మధ్య బాలీవుడ్‌లో పొరుగు దేశపు సినిమా కళాకారుల ట్రెండ్ నడిచింది. కొన్ని ఉద్రిక్తతల నడుమ ఆ కళాకారులు స్వదేశానికి తిరుగుముఖం పట్టారు. ఈ తాజా పరిణామాలకి ఇంకో రూపం 1947లో వుంది. అప్పట్లో ఇటు కళాకారులు అట్నుంచి ఇటు వచ్చేశారు. కానీ విఫలమైన ఈ తాజా ట్రెండ్‌తో ఆ చరిత్ర ఇంకో ప్రయత్నం చేయబోయింది, కుదరలేదు. దేశ విభజనతో బాటు సాంస్కృతిక విభజన కూడా జరిగిపోయిన దరిమిలా అప్పట్లో పంజాబీ సినిమా రెండు ముక్కలైంది. ఒక ముక్క లాహోర్‌లో వుండిపోయింది. రెండో ముక్క బొంబాయి వచ్చేసింది. బొంబాయి వచ్చేసిన కళాకారుల్లో మహ్మద్ రఫీ వున్నారు. ఆయన భార్య రావడం ఇష్టం లేక విడాకులిచ్చేశారు. మహ్మద్ రఫీ వచ్చి వుండకపోతే ఆయన మహ్మద్ రఫీ అయ్యేవారు కాదు. కేఎల్ సైగల్, నూర్జహా, శంషాద్ బేగం, పృథ్వీరాజ్ కపూర్, దిలీప్ కుమార్, దేవానంద్ వంటి హేమాహేమీలూ సహజంగానే బొంబాయి చేరుకున్నారు. హిందీ సినిమాల అభివృధికి పాటుపడ్డారు. మరి పంజాబీ సినిమా సంగతీ? పశ్చిమ పంజాబ్ పాకిస్తాన్ కెళ్ళిపోతే, తూర్పు పంజాబ్ ఇండియాకి దక్కింది. పంజాబీ సినిమాల మూలాలే పాకిస్తాన్‌లో భాగమైన పశ్చిమ పంజాబ్ లోని లాహోర్‌లో వున్నాయి. అక్కడే మొదటి పంజాబీ సినిమా పుట్టింది. మరి దేశవిభజన తర్వాత ఇండియాలో పంజాబీ సినిమా భవిష్యత్తేమిటి?

దేశ విభజనతో అటు బెంగాలీ సినిమాలకి రాని పరిస్థితి పంజాబీ సినిమాల కొచ్చింది. లాహోర్ వదిలేసి వచ్చిన హిందువులు, సిక్కులు అయిన నిర్మాతలు, కళాకారులు తిరిగి ఇటుక ఇటుక పేర్చడం మొదలెట్టారు. 1948లో రూప్ కే. షోరే అనే దర్శకుడు ‘చమన్’ (తోట) అనే మొదటి పంజాబీ సినిమా తీశాడు. 1949లో రవీంద్ర దావే ‘లచ్చి’ తీశాడు. అదే సంవత్సరం ‘ముంద్రి’, ‘ఫేరే’ అనే రెండు సినిమాలు తీశారు. తిరిగి పూర్వపు వైభవాన్ని కల్పించసాగారు.

మూలాల్లో కెళ్తే, బ్రిటిష్ పంజాబ్ ప్రావెన్షియల్ రాజధానిగా లాహోర్ వుండేది. అక్కడ మూకీల కాలంలోనే 1920లలో సినిమా నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

1924లో మొదటి పంజాబీ మూకీ ‘డాటర్స్ ఆఫ్ టుడే’ తీశారు. రైల్వే అధికారియైన దర్శకుడు, నిర్మాత జీకే మెహతా దీనిని రూపొందించారు. లాహోర్‌లో తొమ్మిది థియేటర్ లుండేవి. వాటిలో ప్రద్శర్శించి మన్నన లందుకున్నారు. కానీ ఆయన సినిమాలు వదిలేసి ఇతర వ్యాపారాల్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొందరు మూడు మూకీలు తీసినా, 1929లో అబ్దుర్ రషీద్ కర్దార్ ‘హుస్న్ కా డాకూ’ అనే టాకీ తీశాకే పంజాబీ సినిమాల నిర్మాణాలు ఊపందుకున్నాయి.

అయితే నిర్మాణాలు బొంబాయి, కలకత్తాలతో బాటు అప్పుడప్పుడు హాలీవుడ్‌లోనూ, లండన్‌లోనూ జరిగేవి. లాహోర్‌లో భటీ గేట్ వున్న ప్రాంతం సినిమా అడ్డాగా మారింది. 1939లో బేబీ నూర్జహా తో తీసిన ‘గుల్ బకావళి’ లాహోర్‌లోనూ, అమృత్‌సర్‌లోనూ పెద్దహిట్టయ్యింది. 1940లో ప్రాణ్ తో తీసిన ‘యమ్లా జాట్’ కూడా హిట్టయ్యింది. ఇందులో పంజాబీ సంస్కృతీ సాంప్రదాయాలకి పెద్ద పీట వేశారు.

అప్పటినుంచి దేశవిభజన జరిగే వరకూ తీసిన పంజాబీ సినిమాలు హిందీ సినిమాలకి దీటుగా నిలబడ్డాయి. దేశ విభజన తర్వాత 1950-60 లలో విరివిగా నిర్మాణాలు చేపట్టి పంజాబీ సినిమా పరిశ్రమని సుస్థిరం చేశారు. అయితే సినిమాల్లో లాహోర్ సంసృతినే ప్రతిబింబింప జేసేవారు. 1964లో బాలరాజ్ సహానీతో ‘సట్లెజ్ దే కందే’ అని భారీ బడ్జెట్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ తీశారు. దీని ఘన విజయంతో, అప్పట్నుంచీ  హిందీ సినిమాల సరళిలో కమర్షియల్ సినిమాలు తీసే ట్రెండ్ ప్రారంభమైంది. ఇప్పటికే అటు లాహోర్‌లో పాకిస్తానీ సినిమాలు తీస్తూ లాలీవుడ్‌గా పేరు మార్చుకుంటే, ఇటు పంజాబీ పరిశ్రమకి పాలీవుడ్‌గా నామకరణం చేసుకున్నారు. అయితే బాలీవుడ్ కమర్షియల్ విలువల్ని సంకరం చేసి పంజాబీ సినిమాలు తీయడం ప్రారంభించడంతో పంజాబీ ముద్ర చెరిగిపోసాగింది.

ఈ సంకర సినిమాలకి త్వరలోనే ప్రేక్షకులు ఎవగించుకోవడం మొదలెట్టారు. 1979 నాటికల్లా వీటిని తిరస్కరించడం మొదలెట్టారు. దీంతో తిరిగి పంజాబీ కల్చర్‌తో తీయడం మొదలెట్టారు. అలా 1979లో తీసిన ‘చన్ పరదేశీ’, 1981 లో తీసిన ‘లాంగ్ దా లిష్కారా’ పెద్ద హిట్టవడంతో ఇక చండీఘర్ చుట్టూ పంజాబీ కల్చర్‌కి పట్టం గట్టే  లోకల్ సినిమా నిర్మాణాలతో కొత్త పాలీవుడ్ అవతరించసాగింది. లోబడ్జెట్ పంజాబీ మూవీలుగా ఇవి ఎన్నారైలని కూడా ఆకర్షించసాగాయి. అమెరికా, కెనెడా, బ్రిటన్, ఇటలీ, ఆస్ట్రేలియా,న్యూ జీలాండ్,  గల్ఫ్ దేశాల్లో మార్కెట్‌ని విస్తరించుకున్నాయి. గిప్పీ గ్రేవాల్, బిన్నూ ధిల్లాన్, జస్విందర్ భల్లా, నీరూ బాజ్వా, గుల్బీర్ సింగ్ గ్రేవాల్ వంటి ఎందరో కొత్త తరం నటీనటులు ఎస్టాబ్లిష్ అయ్యారు.

అయితే బాలీవుడ్ ప్రభావంలోంచి బయటపడ్డా, పంజాబీ సినిమాలు గ్లోబలీకరణ ప్రభావానికి దూరంగా వుండలేకపోయాయి. గత దశాబ్దంన్నర కాలంగా కొత్త తరం మల్టీప్లెక్స్ ప్రేక్షకులే మిగలడంతో, వాళ్ళ అభిరుచులకి తగ్గట్టుగా లవ్, యాక్షన్, కామెడీ కాలక్షేప బఠానీలు తీయక తప్పడం లేదు. 2007లో నాల్గు మల్టీప్లెక్సు లుండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 135కి పెరిగింది. 500 కోట్ల వ్యాపారం జరుగుతోంది.

 

గత రెండేళ్లుగా విడుదలైన 24 బ్లాక్ బస్టర్స్ పద్నాలుగు కోట్ల నుంచి 70 కోట్ల వరాకూ వసూలు చేసినవే.

గ్లోబలీకరణ అన్ని అస్తిత్వాలనీ చదును చేసేసి దాని వ్యాపార సంస్కృతి ఒక్కదాన్నే పెంచి పోషించుకుంటోంది. తద్వారా ఆర్ధికాభివృద్ధికి తోడ్పడుతోంది. సినిమా రంగంలోనే కొత్తకొత్త ఉపాధి మార్గాలని, మూత బడిపోయి

న థియేటర్లని మల్టీప్లెక్సుగా మార్చుకుని, ఎన్నో అనుబంధ వ్యాపారాల్నీ అందిస్తోంది. ప్రాంతీయ సినిమాలు ఆర్ట్ సినిమాలుగా చెలామణి అయినంత కాలం వాటి ఆర్ధిక మనుగడకే వెతుక్కోవాల్సి వచ్చేది. కమర్షియల్‌గా పరిణామం చెందాకే కాసుల గలగలలు విన్పిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here