పురాణ పురుషుడు ‘ఇంద్రద్యుమ్నుడు’

0
6

[dropcap]ఇం[/dropcap]ద్రద్యుమ్నుని ప్రస్తావన మహా భారతములో మార్కండేయ మహర్షి ద్వారా ధర్మరాజు ఆయన సోదరులకు వారు అరణ్యవాసంలో కష్ట కాలం గడుపుతున్నప్పుడు వారిలో నైతిక బలం వృద్ధి చెందటానికి చెప్పగా తెలుస్తుంది. ఈయన అవంతీ ప్రాంతాన్ని పాలించిన మాళవ రాజు. ఇతను భరత, సునందుల పుత్రుడు. ఈ పేరుతొ ఎంతోమంది ఉన్నప్పటికీ వారిలోఈయన ప్రముఖుడు. పూరిలో జగన్నాథుని మందిర స్థాపనలో ఈయన ముఖ్య పాత్ర వహించాడు. పురాణాకాలములోని రాజులలో ధర్మ స్వభావంలో ఈయనతో పోల్చతగ్గ వారు ఎవరు లేరు. అయన చేసిన మంచి పనులు దయాదాక్షిణ్య గుణముల వలన భౌతిక శరీరాన్ని విడిచి స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గంలో చాలా కాలము సుఖ సంతోషాలను అనుభవించాడు. ఒకనాడు ఇంద్ర సభలో ఇంద్రుడు, “ఓ రాజా నీవు నీ జీవితకాలంలో అనేక పుణ్యకార్యాలను చేసావు అందుచేతనే నీవు స్వర్గానికి రాగలిగావు, చాలా కాలము ఉండగలిగావు. ఇక భూలోకములో నీ పేరు ప్రఖ్యాతులు నశించాయి. ఇది పాప పుణ్యాల చక్రము కాబట్టి నీవు మరలా భూలోకానికి వెళ్లి పుణ్యము సంపాదించు కొని స్వర్గానికి రమ్ము” అని అంటాడు. దేవదూతలు అదే చెపుతారు

ఇది విన్న ఇంద్రద్యుమ్నుడు ఆశ్చర్యపోయాడు. కానీ ఇంద్రుడు ఒక వాగ్దానము చేసాడు అది ఏమిటి అంటే “భూలోకములో ఏ ఒక్కరైనా ఇంద్రద్యుమ్నుడు చేసిన మంచిపనులు గుర్తుచేసుకుంటే నిన్ను స్వర్గములో ఉండటానికి అనుమతి ఇస్తాను” అని అన్నాడు కాబట్టి భూలోకములో మన పేరు ప్రతిష్ఠలు పుణ్య ఫలితము ఎంత కాలము ఉంటాయో అంతవరకే స్వర్గలోకప్రాప్తి అన్న విషయము ఆయనకు అర్ధమయియింది. ఆ విధముగా దేవతలచే కాదనబడ్డ ఇంద్రద్యుమ్నుడు భూలోకానికి వచ్చి చిరంజీవిగా పేరున్న మార్కండేయ మహర్షి తన పేరు తన పుణ్యకార్యాలను విని ఉండవచ్చు అని భావించి ఆయనను దర్శించుకున్నాడు.”మహాత్మా నన్ను ఇంద్రద్యుమ్నుడు అంటారు. నేను అనేక క్రతువులు నిర్వహించాను, నేను మీకు గుర్తు ఉన్నానా? నా పేరును మీరు విని ఉన్నారా?”అని ప్రశ్నించాడు. కానీ ఎంతసేపు ఆలోచించిన మార్కండేయ మహర్షికి ఇంద్రద్యుముని పేరు లేదా అయన చేసిన మంచి పనులు గుర్తుకు రాలేదు. ఆయన ఇంద్రద్యుమ్నునితో “మహారాజా హిమవత్పర్వత శిఖరంపై ప్రావార కర్ణుడు అనే పేరుగల గుడ్లగూబల రాజు ఉన్నాడు. అతను నాకన్నాపెద్దవాడు అతనిని కలసి అడిగి చూడుము” అని సలహా ఇచ్చాడు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు తనకు దారి చూపమని అడుగుతాడు. ప్రస్తుతము తానూ రాలేనిని చెప్పగా రాజు అశ్వమై హిమవత్పర్వతానికి మార్కండేయ మహర్షితో చేరాడు.

అక్కడ ఉన్న ఉలూక రాజును కలిసి తనను తానూ పరిచయము చేసుకొని, “నేను అనేక యజ్ఞయాగాదులు చేసాను. నా పేరు ఇంద్రద్యుమ్నుడు. మార్కండేయ మహర్షి తనకన్నా పెద్దవారైనా మిమ్మల్ని అడిగితే ఫలితము ఉంటుంది అని చెప్పారు. మీరు నా పేరును, నా పుణ్య కార్యాల గురించి గాని విన్నారా? “అని అడుగుతాడు. దానికి సమాధానంగా ఉలూకరాజు కొంచము సేపు ఆలోచించి, “నాకైతే ఆ పేరు విన్న జ్ఞాపకము రావటము లేదు, ఇంకా కొంచము దూరములోఅంటే రెండు యోజనాల దూరములో ఇంద్రద్యుమ్న అనే సరస్సు ఉంది. అక్కడ నాళిక జంఘుడనే కొంగల రాజు ఉన్నాడు. అతను నాకన్నా పెద్దవాడు. అతనికి తెలుసేమో” అని అంటే రాజు వారిద్దరిని వీపున ఎక్కించుకొని నాళిక జంఘుని దగ్గరకు వెళ్లి అడుగగా, “నాకు తెలియదు ఆ సరస్సులో ఆకుపారుడనే తాబేలు ఉన్నాడు వాడిని అడిగితే ఏమైనా తెలుస్తుందేమో” అని వారందరు సరస్సు దగ్గరకు చేరగా, “నీ కోసము పెద్దలు సంశయాత్ములై వచ్చారు, ఒక్కసారి నీ దర్శనము ఇవ్వు”అని గొంతెత్తి పిలుస్తాడు నాళిక జంఘుడు.

సరస్సును నుండి బయటకు వచ్చిన కచ్ఛపాన్ని (తాబేలును) రాజు తనను పరిచయము చేసుకొని అందరిని అడిగినట్లుగానే, “చిరంజీవి, నీవు ఇంద్రద్యుమ్నుని పేరు అయన చేసిన పుణ్యకార్యల గురించి విన్నావా?” అని అడుగుతాడు.

ఆ పేరు వినగానే ఆ తాబేలు గద్గద స్వరముతో, “ఆ మహనీయుని పేరునే ఈ సరస్సు వెలసింది. ఆ మహనీయుడు అనేక యజ్ఞాలు చేసిన వ్యక్తి. ఆ యజ్ఞ యాగాదులలో దానాలు స్వీకరించిన వారు ఆ సంబరాలను తీసుకు వెళ్లినప్పుడు గుఱ్ఱపు గిట్టల తాకిడితో ఏర్పడినదే ఈ సరస్సు. చాలా కాలము తర్వాత నీ దర్శన భాగ్యము కలిగినది. నీవు అనేక వేల యజ్ఞాలు చేసి అసంఖ్యాకమైన గోవులను విప్రులకు దానము ఇచ్చిన వాడివి, అటువంటి మహనీయుడిని మరువటము సాధ్యము కాదు” అని కృతజ్ఞతలు అర్పిస్తాడు. ఈ మాటలను తాబేలు పూర్తి చేసిన వెంటనే బంగారు విమానంతో వచ్చిన దేవదూతలు వచ్చి,”నిత్య శాశ్వత కీర్తి సంపాదించిన మీరు అమర లోకానికి దయ చేయండి” అని ప్రార్థించి తీసుకొని వెళ్తారు. ఆ విధముగా దేవతలు ఇంద్రద్యుమ్నుని ఊర్ధ్వలోకాలకు తీసుకొని వెళ్లారు. శ్రీ మహావిష్ణువు ఇంద్రద్యుమ్నునికి స్వర్గము ఊర్ధ్వలోకాలకు మించిన కైవల్యము గురించి తెలియజేశాడు తరువాతి జన్మలో గజేంద్రునిగా జన్మించాక శ్రీ మహావిష్ణువు గజేంద్రుడు తన అహమును వీడినాక మోక్షాన్ని ప్రసాదిస్తానని చెపుతాడు.

ఒకసారి ఇంద్రద్యుమ్నుడు ధ్యానములో నిమగ్నుడై ఉండగా అగస్త్య మహాముని వచ్చాడు ఆయనను ఇంద్ర్ఢ్యమ్నుడు గమనించకపోవటం వల్ల అవమానంగా భావించిన అగస్త్యుడు ఏనుగుగా పుట్టమని శపిస్తాడు. ఆ శాప ప్రభావము వలన ఇంద్రద్యుమ్నుడు గజేంద్రునిగా జన్మిస్తాడు. అగస్త్యుడు గజేంద్రునికి విష్ణుమూర్తి సుదర్శన చక్రము వల్ల మోక్షము లభిస్తుంది అని శాప విమోచనము చెపుతాడు. అలా గజేంద్రుడి రూపములో ఉన్న ఇంద్రద్యుమ్నుడు ఒకసారి త్రికూట పర్వత శ్రేణిలో ఉన్న ఒక సరస్సులో నీరు త్రాగటానికి వెళతాడు. ఆ సరస్సులో దేవల మహర్షి శాపము వల్ల మొసలిగా ఉన్న హుహు అనే గంధర్వుడు గజేంద్రుని కాలును పట్టుకుంటాడు. ఆ కాలును విడిపించు కోవటానికి గజేంద్రుడు మొసలితో కొన్ని వేల సంవత్సరాలు పోరాడుతాడు. కానీ ఫలితము ఉండదు. చివరకు తన శక్తి సామర్థ్యాల మీద పూర్తిగా నమ్మకము సన్నగిలి తన తొండముతో సరస్సులోని కలువపూలతో శ్రీమహావిష్ణువును పూజిస్తూ విష్ణువును స్తుతిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై తన సుదర్శన చక్రముతో మొసలిని సంహరించి గజేంద్రునికి విముక్తి కలిగిస్తాడు. ఆ విధముగా హుహు గంధర్వుడు, గజేంద్రుని రూపములో ఉన్న ఇంద్రద్యుమ్నుడు ఒకేసారి శాప విముక్తి పొంది మోక్షాన్ని పొందుతారు.

ఇంద్రద్యుమున్ని కథలో దయ, దానము వంటి మంచి లక్షణాల గొప్పతనాన్ని తెలియజేసారు. డబ్బు అధికారము ఉన్నవాళ్లను కాకుండా మంచి పనులు చేసిన వారిని మాత్రమే ప్రజలు గుర్తుంచుకుంటారు. అటువంటి కీర్తియే మన జీవితకాలం తరువాత సంపాదించుకున్న ఆస్తి అవుతుంది. ఇంద్రద్యుమ్నుడు చేసిన కొన్ని స్వల్పమైన బుద్ధి దోషాల వలన గజేంద్రునిగా జన్మించి మోహమును వీడి భగవంతుని ప్రార్థించి మోక్షాన్ని పొందాడు. ఇంద్రద్యుమ్నుని పేరుతో ఉన్న సరస్సు ప్రస్తుతము పూరి జగన్నాథుని ఆలయానికి 2.7 కిమీల దూరములో ఉన్న గుండిచా ఆలయము ఆవరణలో ఉన్నది. పూరికి దగ్గరలో ఉన్న గహిర్మత బీచ్ లోని తాబేళ్లు ఆకుపారుని వారసులుగా అక్కడి ప్రజలు భావిస్తారు. ఈ బీచ్ ప్రపంచములోని ఆలివ్ రీడిలి సముద్రపు తాబేళ్లకు కేంద్రముగా ప్రసిద్ధి. ఫిబ్రవరి మార్చి మాసాలలో బ్రాహ్మణి నది సముద్రములో కలిసే చోటులో అక్కడ చేరి గ్రుడ్లు పెడతాయి. శ్రీ మహావిష్ణువు కూర్మావతారుడిగా శ్రీ కూర్మములో వెలిసాడు. ఈ పుణ్యక్షేత్రము కూడా పూరికి దగ్గరలోనే ఉన్నది. కాబట్టి తాబేలు పౌరాణికముగా కూడా ప్రసిద్ధి. పూరిలోని జగన్నాథుని ఆలయ నిర్మాణములో ఇంద్రద్యుమ్నుని పాత్ర ఉన్నట్టు మహాభారతములో చెప్పబడింది.

సంసారము అనే సరస్సులో పాపాలు మొసలి రూపములో మనిషిని పట్టి పీడిస్తున్నప్పుడు మనిషి పూర్తిగా భగవంతునికి దాసోహము అన్నప్పుడు శ్రీ మహావిష్ణువు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని భాగవతోత్తములు ఈ కథ ద్వారా భక్తులకు తెలియజేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here