శ్రీ పురాణం శ్రీనివాస శాస్త్రి గారితో నా పరిచయం

0
9

[box type=’note’ fontsize=’16’] ఇటీవల పరమపదించిన శ్రీ పురాణం శ్రీనివాస శాస్త్రి గారికి నివాళి అర్పిస్తున్నారు శ్రీ నూతక్కి రాఘవేంద్ర రావు. [/box]

ఆయనతో పరిచయమై గత ఏడెనిమిదేండ్లలో సాన్నిహిత్యం కొనసాగినా తొలుత ఆయన ఔన్నత్యం తెలిసింది చాలా తక్కువ. కథకునిగా, కవిగా లఘురూప కవితావేదిక కార్యవర్గ సభ్యునిగా, పాత్రికేయునిగా, వ్యాసకర్తగా కోకిలం సాహితీ సాంస్కృతిక సంస్థ రథసారధిగాను, సాహిత్యానికి వారు చేసిన సేవ ఎనలేనిదన్నది తరువాతి కాలాలు తెలియజేశాయి.

ఆయన గొప్ప సాహితీవేత్త అయినా శ్రీ పురాణం సుభ్రమణ్య శర్మగారి కుమారుడైనా, తనకు తానుగా సాహితీవేత్తగా ఎదిగాడే తప్ప తండ్రి పేరును ఎప్పుడూ ఎక్కడా వినియోగించుకోలేదు. గొప్ప పాత్రికేయునిగా, గొప్ప కథకునిగా తన్ను తాను నిరూపించుకున్ననూ, చూసేవారికి ఏమీ ఎరుగని సామాన్యుడిలా మెలగడం ఆయన నిరాడంబరతకు తార్కాణం.

ఎదుటివారిలో సాహిత్యంలో ఏ కొంచం ప్రవేశం ఉందని భావించినా వారిని ప్రోత్సహించడం ఆయన నైజం.

కోకిలమ్ సాహిత్యవేదికకు నన్ను పరిచయం చేసిందీ, కార్యవర్గసభ్యునిగా నామినేట్ చేసి ఆహ్వానించినదీ పురాణం శ్రీనివాసశాస్త్రి గారే.

కవిగా, రచయితగా ఆయన యోచనాకోణం వైవిధ్యంగా ఉండి సమాజ వైకల్యాలను ఎండగట్టడంలో ఆయన అక్షరానికి ఒక ప్రత్యేక శైలి ఉంది.

వారు ప్రత్యేకంగా నా ఆహ్వానం మేరకు ఆత్మీయతతో నా వద్దకు వచ్చి 16000 కు పైగా ఉన్న నా ఆముద్రిత నానో సంపుటాలను పరిశీలించి మిక్కిలి సంతుష్టులై వారి అమూల్య అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా యిచ్చి, “మీరు పుస్తకం అచ్చువేసేటప్పుడు వినియోగించుకొండి” అని తమ ఔదార్యం ప్రదర్శించారు.

తెలుగు భాషపై పట్టు, అక్షర వినియోగంపై సంపూర్ణ అవగాహన కలిగిన దార్శనికుడు, ఆధునిక సాహిత్య పోకడవల్ల భాషకు జరిగే మంచిని, లఘురూప కవిత్వ ఆవశ్యకతను గుర్తించి, రెక్కల సృష్టికర్త శ్రీ సుగం బాబు గారి పిలుపు మేరకు లఘురూప కవిత్వరీతులలో ముఖ్యంగా రెక్కల ప్రక్రియలో లఘురూప కవిత్వం వ్రాసిన కవి.

భేషజాలు కానీ, అరమరికలు కానీ, కోపం, అహంకారం, అభిజాత్యం ఎరుగని సాదా సీదా కవి శ్రీ పురాణం శ్రీశా (అంటే అతిశయోక్తి కాదు)…. పురాణం శ్రీనివాస శాస్త్రి గారు.  వారు లేనితనం మేము పూడ్చుకోలేనిది.

లఘురూప కవితావేదికకు, కోకిలమ్ సాహిత్య వేదికకు, అంతర్జాలంలో తనకుతానుగా సృష్టించి నిర్వహిస్తున్న కోకిలమ్ వెబ్నైర్ సమూహ సాహితీ కార్యక్రమాలకు, ఈ మధ్య అనేక పత్రికలలో నిర్వహిస్తున్న ధారావాహికలకు తీరని అవాంతరమే.

వారి హఠాన్మరణం సాహిత్యలోకానికి ఎనలేని లోటు.

వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తూ, వారి ఆత్మశాంతికై భగవంతుని ప్రార్థిస్తూ వారి ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని కోరుకుంటూ హృదయా నివాళులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here