కాజాల్లాంటి బాజాలు-105: పురస్కారం

1
8

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]కు[/dropcap]సుమ నాకు మంచి ఫ్రెండ్. తను పొద్దున్నే పేపర్లో ఆమె దూరబ్బంధువు రంజనికి మహిళా దినోత్సవం సందర్భంగా పురస్కారం ఇచ్చేరన్న వార్త చూసి తెగ ఆనందపడిపోయింది. ఆ రంజని కుసుమ వయసుదే. చిన్నప్పట్నించీ తెలుసు. అన్నింట్లోనూ కుసుమ వెనకే ఉండేది. అలాంటిది.. ఇప్పుడు కుసుమకి రాని పురస్కారం రంజనికి వచ్చింది. అలా ఎలా వచ్చిందీ! కుసుమ పైకి ఎంత సంతోషంగా అభినందించినా లోలోపల సన్నగా తనకు రానిది రంజనికెలా వచ్చిందన్న ఊహ ఆమెని నిలబడనీయలేదు. అందుకని రంజనికి పురస్కారం ఎందుకొచ్చిందంటూ నన్నడిగింది.

సమాధానం వాడిగానే ఇచ్చేను.

“రంజని నీలా ఏవైనా ఇంట్లో కూర్చుంటోందనుకుంటున్నావా! పిల్లల బాధ్యత తీరేక చాలా సాంస్కృతిక సంఘాల్లో చేరింది. అన్నింట్లోనూ కలిసిపోయి తిరుగుతూ అందరితోనూ మంచి కాంటాక్టులు పెట్టుకుంది. కాలాన్ని చక్కగా సద్వినియోగ పరుచుకుంది. కావలసిన చోట సేవ చేసింది. అవసరమైన వాళ్లని సమయానికి ఆదుకుంది. అందరికీ తలలో నాలుకయింది. ఉట్టినే ఇంట్లో కూర్చుంటే ఇస్తారా పురస్కారాలు! ఈ పదేళ్ళనించీ రంజని లేని సభని సిటీలో ఒక్కటైనా చూపించు!” అంటూ ఎదురు ప్రశ్నించేను.

“అంటే అలా బైట తిరుగుతుంటేనే ఇస్తారా పురస్కారాలు!”

“బైట ఉత్తినే తిరిగితే ఇవ్వరు. నలుగురికీ పనికొచ్చే పనేదైనా చేస్తే ఇస్తారు.”

అసలే కుసుమకి బైటకి వెళ్లాలంటే ప్రాణం పోయినంత పనౌతుంది.

అందుకే “బైట తిరక్కుండా ఇంట్లో ఉండి ఏదైనా పనికొచ్చే పని చేస్తే ఇవ్వరా!” అనడిగింది.

“పనికొచ్చే పని చేస్తే ఎందుకివ్వరూ! అందరి దృష్టిలోనూ పడేలా గొప్ప విషయమేదైనా రాయొచ్చు. లేకపోతే, అద్భుతమైన చిత్రాలు వేసి గుర్తింపు తెచ్చుకోవచ్చు. అదీ కాకపోతే పనికిరాని దేన్నైనా పనికొచ్చే వస్తువుగా చెయ్యొచ్చు..” అంటూ నేను ఇంకా ఏదో చెప్పబోతుంటే తనకి కావల్సినదేదో తెల్సిపోయిందన్న ఆనందంతో “సరి సర్లే.. ఇంక ఉంటాను.” అంటూ నా మాటలని మధ్యలోనే ఆపేసి ఫోన్ పెట్టేసింది కుసుమ.

ఆ తర్వాత కలిసినప్పుడు ఎప్పుడో తర్వాతేం జరిగిందో కుసుమ నాకు ఇలా చెప్పింది.

***

నా మాటలు విని బాగా ఆలోచించుకుంది కుసుమ. తనిప్పుడు రచనలూ చెయ్యలేదు, బొమ్మలూ వెయ్యలేదు. తను ఏవైనా చెయ్యగలదంటే పనికిరాని వస్తువుని పనికొచ్చేదిగా చెయ్యడం. అదే చేసి, నలుగురిలో గుర్తింపు తెచ్చుకుని వచ్చే ఏడాదికి ఎలాగైనా పురస్కారం సంపాదించెయ్యాలి అనే స్థిరనిర్ణయానికి వచ్చేసింది.

అప్పటినించీ అసలు పనికిరాని వస్తువులంటే ఏవిటా అని తెగ ఆలోచించేసింది.. తిన్నగా బట్టల బీరువా దగ్గర కెళ్ళింది. పట్టుచీరెల దొంతర తిరగేసింది. అదేవిటో అన్నీ ప్రత్యేకమైన సందర్భాల్లో కొనుక్కున్నవే. అవేమీ పనికిరానివిగా కనిపించలేదు. కాటన్ చీరల దొంతర తీసింది. అందులో తను మనసుపడి కొనుక్కున్నవి కాకుండా బైటవాళ్ళు పెట్టినవి, ఒకసారి వాళ్లకోసం కట్టి మూల పడేసినవి ఏవున్నాయా అని వెదికి వెదికి ఓ నాలుగు చీరలు తీసుకుని హాల్లోకి వచ్చి, వాటిని ముందేసుకుంది. తను ఇంక కట్టుకోదలచనప్పుడు ఇవి పనికిరానివే కదా అనుకుని వాటిని ఏం చెయ్యాలా అని ఆలోచించింది.

ఒక్కొక్క చీరనీ ఒక పరికిణీ, ఓణీగా కుట్టి మనవరాలికి ఇద్దామా అనుకుంది. కానీ మనవరాలు ఈ పరికిణీలు ఎందుక్కడుతుందీ.. స్కర్టులూ, జీన్సూ తప్పితే అనుకుని ఆ ఆలోచన విరమించుకుంది. .

వీటిని కత్తిరించి కర్టెన్లుగా చేద్దామా అనుకుంది. కానీ, అన్ని కిటికీలకీ, గుమ్మాలకీ ఒక చీర సరిపోదు. నాలుగురకాల చీరలు కడితే బాగుండదు. అందుకని కర్టెన్ల ఆలోచన పక్కకి పెట్టేసింది.

పోనీ నైటీలుగా కుడితేనో అనిపించింది. ఇప్పుడు ఈ చీరలు అంత కష్టపడి కత్తిరించి నైటీలు కుట్టుకోవడం అవసరమా… నాలుగొందలు పడేస్తే నైటీ వచ్చేస్తుంది అని అది కూడా మానుకుంది.

సరే పోనీ వీటిని ముక్కలుగా కత్తిరిఛి టవల్స్‌గా, నేప్ కిన్స్‌గా చేద్దామనుకుంది. కానీ ఇంట్లో వాటి నెవరూ వాడరు కదా అనుకుంటూ ఆ ఆలోచన కూడా పక్కకి పెట్టేసింది. ఇంకేం చెయ్యాలో తెలీక ఆ చీరలు అలా ముందేసుక్కూర్చున్న కుసుమని చూసి ఆమె భర్త నరహరికి అనుమానం వచ్చి అడిగేడు సంగతేమిటని. విషయమంతా వివరించింది కుసుమ నరహరికి. ఫక్కున నవ్వేడు నరహరి.

“ఎందుకంత కష్టపడడం.. ఆ నాలుగు చీరలు అవసరం ఉన్న వాళ్లకియ్యి. చక్కగా కట్టుకుంటారు.” అన్నాడు తేలిగ్గా తేల్చేస్తూ. హమ్మయ్య. తనకి కష్టపడే పనీ తప్పింది, చీరలు దానం చేసానన్న పేరూ వస్తుంది అనుకుని అంత గొప్ప సలహా ఇచ్చినందుకు నరహరిని మురిపెంగా చూసింది. కానీ ఎవరికివ్వడం! ఎవరికి అవసరమో ఎలా తెలుస్తుంది.. తనకి ఇంట్లో సాయం చేసే మనిషికి ఇద్దామంటే ఆమె పోలియస్టర్ చీరలు తప్పితే కాటన్ కట్టదు.. సరే, ఎవరైనా అడిగినప్పుడు ఇవ్వచ్చని వాటిని మళ్ళీ లోపల పెట్టేసింది.

అక్కడికీ నరహరి కుసుమకి నచ్చచెప్పేడు.. పనికిరాని వస్తువులతో పనికొచ్చే పెట్రోల్ లాంటివి తీస్తే ఎవరైనా గుర్తిస్తారు కానీ ఇలా గౌనులూ, నైటీలూ కుడితే ఎవరూ గుర్తించి, పురస్కారాలు ఇవ్వరని. ఉడుక్కున్నట్టు చూసింది భర్తని.

హూ…! కళాహృదయం లేనివారికి కోకిలగానం విన్నా కాకిగోల లాగే అనిపిస్తుందని భర్తని ఆ కళాహృదయం లేని వాడిగా తేల్చేసి తనకి తాను సృజనాత్మకత ఉన్నదానిగా నమ్మేసి మళ్ళీ కార్యోన్ముఖురాలైంది.

కానీ, కుసుమకి మటుకు ఇంట్లో పనికిరాని వస్తువు ఏదీ అన్న ప్రశ్న అలాగే ఉంది.

వాళ్ళెవరో కాగితాలు నానబెట్టి, రుబ్బి, దానిలో ఏదో కలిపి గిన్నెలూ, పళ్ళాలూ చేసినట్టు యూ ట్యూబ్‌లో చూసిన షార్ట్ ఫిల్మ్ గుర్తొచ్చింది. అలా చేద్దామని పేపర్ కొంటే వచ్చే కాగితాలు వాడదామంటే ఈమధ్య నరహరి పేపర్ తెప్పించడం మానేసి అన్నీ ఆన్‌లైన్ లోనే చదివేస్తున్నాడు కనక ఇంట్లోకి పేపర్ రావటం లేదు. అలమార్లో ఉన్న పుస్తకాల మీద పడింది ఆమె దృష్టి. కుసుమ ఎటు చూస్తోందో గమనించిన నరహరి తనెంతో ఇష్టపడి కొనుక్కున్న పుస్తకాల అలమారకి తాళం పెట్టేసుకుని, ఆ తాళంచెవి కుసుమకి కనపడకుండా దాచేసుకున్నాడు.

వంటింట్లో కెళ్ళి అక్కడ పనికిరానివి ఏమున్నాయా అని పరిశీలనగా చూసింది. ఈమధ్య కూతురు వచ్చినప్పుడు పాతగా అయిపోయిన నాన్‌స్టిక్ గిన్నెలన్నీ బయటపడేసి, కొత్తవి కొని పెట్టింది. కొత్తవి పనికిరానివెందుకవుతాయీ! పనికిరాదంటూ గిన్నెలు బయట పడేసిన కూతురిమీద ఖోపం వచ్చేసింది కుసుమకి. అవి కనక ఉంటే ఈపాటికి వాటితో ఏవైనా పనికొచ్చేవి చేసేసి, పురస్కారం తెచ్చేసుకునేదిగా అనుకుంటూ ఆ మాటే ఆపుకోలేక కూతురికి ఫోన్ చేసి నిష్ఠూరంగా అంది. ఫక్కున నవ్వింది కుసుమ కూతురు శాంత.

“ఆ మాడిపోయిన బొచ్చెలతోనూ, పెనాలతోనూ పనికొచ్చేవి ఏం చేస్తావమ్మా..” అంటూ.

“ఏం.. ఏదైనా చేస్తాను. ఆ బొచ్చెకి కింద కన్నాలు పెట్టి, అందులో ఏదైనా మొక్క పెడతాను. ఆ పెనం మీద కాసిని నీళ్ళు పోసి, దాని మీద పడవబొమ్మ పెడతాను. చెత్తలోంచి డెకరేటివ్ పీస్‌లు చెయ్యడమంటే అదే. అసలు సృజనాత్మకత అనేది మనిషిలో ఉండాలి. అది నీలోనూ, మీ నాన్నలోనూ లేవు. అందుకే నా మాట మీకు అర్థం కాదు.”

గింజుకుంది కుసుమ.

తల్లితో వాదించి లాభంలేదని “సరే.. అవెలాగూ బయటకి పోయేయిగా.. ఇంకా ఇంట్లో ఏవున్నాయో చూడు. నీ సృజనాత్మకతని నేనెందుకు కాదనాలి!” అంటూ ఫోన్ పెట్టేసింది శాంత.

అప్పటికే కుసుమ ప్రయత్నాలు గమనిస్తున్న నరసింహం తన వస్తువులన్నింటినీ జాగ్రత్తగా లోపల పెట్టుకుని, వాటికి తాళం వేసుకుని, ఒకటికి పదిసార్లు ఆ తాళం లాగి చూసుకుని మరీ వెడుతున్నాడు ఆఫీసుకి.

ఇల్లంతా చుడుతూ మళ్ళీ ముందుగదిలోకి వచ్చింది కుసుమ. ఎప్పటెప్పటివో చెప్పులన్నీ ఒక పెద్ద అట్టపెట్టెలో పడేసి కనిపించాయి. మామూలుగా రోజూ వాడుకునేవి ఇవతలే ఉన్నాయి. మరింక ఆ ఆట్టపెట్టె, చెప్పులూ పనికిరానివేగా అనుకుంటూ ఆనందంగా వాటి ముందు కూర్చుంది కుసుమ.

ముందుగా అందులోంచి నరహరి ఇదివరకు వాకింగ్‌కి వాడే బూట్లు కనిపించేయి. మొహం చాటంత అయింది కుసుమకి. ఆ బూట్లని ఏం చేస్తే బాగుంటుందా అని వాటిని ముందెట్టుకుని ఆలోచించసాగింది. పైన సీలింగ్ నుంచి ఒక తాడు వేలాడదీసి దానికి కింద ఒక బూట్‌నీ, మధ్యలో మరో బూట్‌నీ ముడేసి నిలువునా కట్టి, ఆ రెండు బూట్‌ల లోనూ రెండు చిన్న బేబీబొమ్మలని పెడితే ఎలా ఉంటుందీ అనుకుంది.. ఆహా.. ఎంత మంచి ఊహ.. చిన్న చిన్న పాపలు ఉయ్యాల ఎక్కి ఊగుతున్నట్టుండదూ! చూస్తుంటే మనసు ఆనందంతో నిండిపోదూ! అంత చక్కటి ఊహ వచ్చినందుకు తనలోని సృజనాత్మతకు తనని తనే మెచ్చేసుకుంది. వెంటనే ఆలస్యం చెయ్యకుండా ఆ బూట్లని శుభ్రం చేసింది. బాగా దుమ్ము పట్టేసి ఉన్న ఆ బూట్లు దులుపుతుంటే కుసుమకి ఆ దుమ్మంతా గొంతు లోపలికి వెళ్ళి దగ్గు రావడం మొదలైంది. హూ.. ఇలాంటి చిన్న చిన్న అడ్దంకులకి వెనకాడితే పురస్కారం ఎలా వస్తుందీ అనుకుంటూ అలా దగ్గుతూనే వాటిని ఓ తాడుకి కట్టి, హాల్లో పైనుంచి వేలాడుతున్న ఒక హుక్‌కి తగిలించింది. ఆ తాడంతా బోసిగా ఉందని ఎప్పుడో గిఫ్ట్ పేకింగ్ కోసం ఇంట్లో తెచ్చిపెట్టిన రంగుకాగితాలు ఆ తాడు చుట్టూ చుట్టింది. నరహరి ఇంట్లోకి రాగానే ఈ బుల్లి బుల్లి బేబీలని చూసి ఎంత ఆనందపడిపోతాడో అనుకుంటూ మళ్ళీ అట్టపెట్టె దగ్గరికి వెళ్ళింది. మిగిలిన చెప్పుల సంగతి మర్నాడు ఆలోచించ వచ్చనుకుంటూ ఆ చెప్పులన్నీ అక్కడే కుప్పగా పోసేసి, అట్టపెట్టె మటుకు పట్టుకుని పక్కసందులోకి వెళ్ళి శుభ్రంగా తుడిచి, ఒక చిన్న చాకు, కత్తెర తెచ్చుకుని, ఓ స్టూల్ వేసుకుని, దానిమీద స్థిమితంగా కూర్చుని, ఆ అట్టపెట్టెని ఒక ఇల్లులా చేద్దామనే ఉద్దేశంతో దానికి కిటికీలూ, గుమ్మాలూ కత్తిరించడం మొదలెట్టింది.

సాయంత్రం నరహరి ఇంటికి వచ్చేటప్పటికి వీధి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. అడుగు వెయ్యడానికి వీల్లేకుండా కాలికడ్డుగా చెప్పులకుప్ప కనిపించింది. నెమ్మదిగా పక్కనించి తప్పించుకుని హాల్లోకి వచ్చేటప్పటికి టప్పుమని తలకి ఏదో కొట్టుకుంది. ఏవిటా అని పైకి చూస్తే పాత బూట్ అతి సుతారంగా నరహరి తలని ముద్దెట్టుకుంది. మతిపోయింది నరహరికి. “కుసుమా..” అని గట్టిగా పిలుస్తూ లోపలికి వచ్చేటప్పటికి పక్క సందులో దగ్గుతూ, తుమ్ముతూ, అట్టపెట్టెని కత్తిరిస్తున్న కుసుమ కనిపించింది.

అప్పుడేం జరిగిందంటారా! అబ్బే.. భార్యాభర్తల మధ్య అలాంటివి తొంభై విషయాలుంటాయి. మధ్యలో మనం దూరిపోకూడదు. మనం కుసుమ పురస్కారం అందుకునే టైమ్‌కి మళ్ళీ వద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here